మహిళలు అన్ని రంగాలలోనూ ప్రావీణ్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. సంపాదనలోనే కాదు అన్ని విషయాలలోనూ మగవారితో సమానంగా దూసుకెళ్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు ఇలా ప్రతి రంగంలోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆ జాబితాలో చేరుతారు ప్రముఖ తబలా కళాకారిణి అనురాధా పాల్. ముంబయిలో పుట్టిన అనురాధా పాల్.. భారతదేశంలోనే తొలి తబలా కళాకారిణిగా నిలిచారు. తబలా కళాకారుల్లో లెజెండ్స్ అయిన ఉస్తాద్ అల్లారఖా, జాకీర్ హుస్సేన్ వద్ద దాదాపు ఇరవై సంవత్సరాలు శిక్షణ పొందారు. దానిపై ఎన్నో పాటలు వాయించారు.
మరెన్నో ప్రయోగాలు కూడా చేశారు. తబలా వాయిస్తూ పాటలు మాత్రమే కాదు, కథలు కూడా చెప్పవచ్చని అనురాధ నిరూపించారు. ఎంతో సాధన చేసి తబలాపై రామాయణ గాథను వినిపించి రికార్డు సృష్టించారు. ఉపన్యాసాలు, పాటలు విని విసిగిపోయిన ప్రజలు సంప్రదాయ సంగీతాన్ని ఆలకించడానికి ఆసక్తి చూపించడం లేదని కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలుసుకున్నారు. అదే కార్యక్రమంలో తబలాపై కథ చెప్పారు. దానికి వన్స్‌మోర్ అంటూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పది సంవత్సరాలు కష్టపడి తబలాపై రామాయణాన్ని సృష్టించి అరుదైన రికార్డును నెలకొల్పారు అనురాధా పాల్.