రోజూ పొద్దున్నే.. చదువుకోవడానికి న్యూస్ పేపర్, కాఫీ పెట్టుకోవడానికి పాలు గడప దగ్గరికే వస్తాయి. దేవుడి పూజకు అవసరమైన పూలు మాత్రం మనమే మార్కెట్‌కు వెళ్లి తెచ్చుకోవాలి. కొన్నిసార్లు ఓపిక ఉండదు. కొన్నిసార్లు వర్షం. కొన్నిసార్లు బద్ధకం. పూలు లేని పూజ అసలు పూజలానే అనిపించదు. రోజంతా అన్యమనస్కంగానే ఉంటుంది. ఆ ఇబ్బందిని యశోద, రేయ సోదరీమణులు అర్థం చేసుకున్నారు. బెంగళూరు వాసుల పూజాదికాలకు పూలు సమకూర్చే బాధ్యత తాము తీసుకున్నారు.
‘హూవు’ అనే స్టార్టప్ ద్వారా పూల వ్యాపారంలోకి వచ్చారు. నెలకు సరిపడా డబ్బు చెల్లిస్తే చాలు.. పూల ప్యాకెట్ మన గడప దగ్గరికి వచ్చేస్తుంది. రూ. పది లక్షలతో మొదలైన వ్యాపారం.. ప్రస్తుతం పదికోట్ల పెట్టుబడులతో కళకళలాడుతున్నది. ‘పూలు మన సంప్రదాయంలో భాగం. దేవుడి పూజకే కాదు.. అలంకరణకూ ఉపయోగిస్తాం. జడలో తురుముకుంటాం. ప్రత్యేక సందర్భాల్లో గుమ్మాలకు వేలాడదీస్తాం. కార్లు, బైకులకు వేస్తాం. కానీ, మార్కెట్‌ను తాజా పూల సమస్య వేధిస్తున్నది. ఇంటికొచ్చే సరికి వాడిపోతున్నాయి.
ఆ ఇబ్బంది లేకుండా మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని చెబుతారు ఆ ఇద్దరూ. కర్ణాటక, కేరళ, తమిళనాడులోని పూల రైతులతో వీరికి ప్రత్యేక ఒప్పందాలు ఉన్నాయి. దీంతో దళారుల బాధ ఉండదు. రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది. కస్టమర్లకు నాణ్యమైన పూలు అందుతాయి. హైదరాబాద్‌లోనూ ‘హూవు’ సేవలు లభిస్తున్నాయి.