కంచి పట్టు కట్టుకుంటే, పట్టుపురుగు జన్మ ధన్యం అవుతుంది. పోచంపల్లి చుడితే నూలుపోగుకు ప్రాణం లేచొస్తుంది. చందేరీలో అయితే చంద్రబింబమే. ఉప్పాడ కట్టుబడికి కుర్రకారు గుండెదడ పెరగడం ఖాయం. షిఫాన్లో ముస్తాబైతే నచ్చినవాడి ఎదలో పెను తుఫానే.కాకపోతే, ఆ అలంకరణ ఏ పెండ్లికో, పండగకో పరిమితం అవుతున్నది. కొత్తతరం అమ్మాయిలు.. ప్రత్యేక సందర్భాల్లోనూ చీరను దూరం పెడుతున్నారు. ఈ ధోరణి మృణాళిని శాస్త్రిని బాధపెట్టింది. ఆమె స్థాపించిన ‘6 యార్డ్స్ ప్లస్’.. చీరకట్టును యువతులకు దగ్గర చేస్తున్నది.
నార చీర నుంచి పట్టు చీర వరకు దేని అందం దానిదే. ఎన్ని మాడ్రన్ డ్రెస్సులు వచ్చినా చీరకట్టుకు మించిన సోయగం లేదని తేలిపోయింది. కాకపోతే, చీరను సంప్రదాయ వేడుకలకే పరిమితం చేస్తున్నది నేటి తరం. దీంతో ఆ వైభవం మసకబారుతున్నది. చీర పట్ల ఉన్న అపోహలను, చీరకట్టు విషయంలో ఉన్న భయాలను పోగొట్టి.. గత వైభవం తీసుకురావాలన్నది ‘6 యార్డ్స్ ప్లస్’ ఫౌండర్ మృణాళిని శాస్త్రి లక్ష్యం. వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చీరలను పరిచయం చేస్తూనే.. ఆరు గజాల చీరల సంస్కృతిని ఒక ఫ్యాషన్‌గా ప్రచారం చేస్తున్నారామె. మరోపక్క ‘శారీ రివైవల్’ ప్రణాళికతో పాతతరం చీరలకు కొత్త సొబగులు అద్ది భవిష్యత్ తరాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. మృణాళిని ఎంబీఏ చేశారు. కొంతకాలం ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోల తరఫున పని చేశారు. కానీ ఎక్కడో అసంతృప్తి. తన కల వేరు, చేస్తున్న కొలువు వేరు అనిపించింది. దీంతో తన అభిరుచినే కెరీర్‌గా ఎంచుకున్నారు. ఫ్యాబ్రిక్ రంగం వైపు అడుగులు వేశారు.
చిన్నతనంలో వేడుక ఏదైనా సరే, అమ్మ తనకు చీర చుట్టేసేది. దీంతో చీరతో పరిచయం, స్నేహం, బంధం.. అన్నీ కుదిరేశాయి. పెద్దయ్యాక కూడా ఆ ప్రేమ తగ్గలేదు. ఆఫీసుకు వెళ్లినప్పుడూ చీరలే కట్టేవారామె. ఆ మక్కువ కొద్దీ ఐదేండ్ల క్రితం.. ‘6 యార్డ్స్ ప్లస్’ ప్రారంభించారు. పండుగ పబ్బాల వరకూ ఫర్వాలేదనిపించినా.. మిగతా సమయాల్లో చీరలు కాళ్లకు అడ్డుతగులుతాయని యువతుల భయం. కానీ అలవాటైతే చీరకట్టును మించిన సౌకర్యం లేదని భరోసా ఇస్తున్నారు మృణాళిని. ‘కెరీర్ మహిళను హుందాగా చూపడంలో చీరల తర్వాతే.. ఏ దుస్తులైనా’ అంటారామె.
వైవిధ్యమైన చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంటారు మృణాళిని. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన చీరకట్టు ఉంటుంది. ఎవరి సంస్కృతికి తగినట్టు వారు చీరలు కట్టుకుంటారు. పొలం పనులకు వెళ్లేటప్పుడు ఒకలా, పూజల సమయంలో ఒకలా ధరిస్తారు. ఇవే కాదు, ఇంకా చాలా కట్టుబడులు ఉన్నాయి. వాటన్నిటిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మృణాళిని. కుచ్చిళ్లు పెట్టుకోవడం తెలియని వారికి ప్రాథమిక పాఠాలు బోధిస్తారామె. క్షణాల్లో ముస్తాబు కావడానికి రెడీమేడ్ చీరలనూ రూపొందిస్తారు.
చీర ఓ మధుర జ్ఞాపకం. బీరువాలో కొలువైన ఒక్కో చీరతో ఓ అనుభూతి ముడిపడి ఉంటుంది. దాని వెనుక ఏదో ఓ కథ ఉంటుంది. అవన్నీ భవిష్యత్ తరాలకు తెలిసేలా ‘శారీ రివైవల్’ ప్రోగ్రామ్ ప్రారంభించారు. పాత చీరల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు మృణాళిని. బంజారాహిల్స్ కమలాపురి కాలనీలోని ‘6 యార్డ్స్ ప్లస్’ ఆవరణలో పాత చీరలను కొత్త డిజైన్లతో తీర్చిదిద్దుతున్నారు. అంతెందుకు.. గోవా ‘కుందీ’ చీరలు, సిద్ది పేట ‘ముత్యంగడి’ చీరలు పైకి నిరాడంబరంగా కనిపించినా రాజసాన్ని ప్రదర్శిస్తాయి. మార్కెట్లో అరుదుగా దొరికే ఈ చీరలకు కొత్త హంగులు అద్ది అందిస్తారామె. కాబట్టే ఆ చీరలు విదేశాలకూ వెళ్తున్నాయి. వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు. ‘చీరకు ప్రాణంపోయడంలో ఎంతో మంది కళాకారుల శ్రమ దాగి ఉంటుంది. ఆ గొప్పతనం పిల్లలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనదే. అప్పుడే వాళ్లు చీరతో అనుబంధాన్ని పెంచుకోగలరు’ అంటారు మృణాళిని. ఆమె ఆంత్రప్రెన్యూర్‌షిప్ కలలకు ‘వీ హబ్’ మద్దతు పలికింది. నెట్ వర్కింగ్ అందించింది. మార్కెటింగ్ మెళకువలు నేర్పింది. వ్యాపార విస్తరణకు దోహదపడింది. విజయానికి సాయపడింది.
…? గంజి ప్రదీప్ కుమార్