Kohinoor Diamond | మొన్న ఏప్రిల్ నెలలో ఇంగ్లండ్ రాజు చార్లెస్ న్యూయార్క్ వెళ్లారు. సెప్టెంబర్ 11 బాధితుల స్మారకం దగ్గర నివాళి అర్పించడం… తన పర్యటన ఉద్దేశం. రాజుగారిని కలుసుకునేందుకు న్యూయార్క్ ప్రముఖులూ వెళ్లారు. వాళ్లలో ఒకరు ఆ నగర మేయర్ జొహ్రాన్ మమ్దాని. ఈమధ్య కాలంలో తరచూ వినిపిస్తున్న పేరే ఇది. భారతీయ మూలాలున్న వ్యక్తి. తన అస్తిత్వాన్ని, అభిప్రాయాలను దాచుకోనివాడు. ‘రాజుగారితో ఏవన్నా మిగతా విషయాలు మాట్లాడాల్సి వస్తే మీరు ఏం అడుగుతారు?’ అని ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ మమ్దానిని అడిగారు. ఆయన తడుముకోకుండా… ‘భారతదేశానికి కోహినూర్‌ను తిరిగి ఇచ్చేయమని అడుగుతాను’ అన్నాడు. ఇదేమీ సరదాగానో, అప్పటికప్పుడు అన్నదో కాదు. ఆ ఒక్క వాక్యం వెనుకా వందల ఏళ్ల బాధ ఉంది. కాలం మాన్పని వలసపాలనల గాయం ఉంది. ఇది ఓ వజ్రం కథ మాత్రమే కాదు. అలా అయితే కొన్ని వేల కోట్లు ఇచ్చి బదులు తీర్చుకోవచ్చు. పోనీ ఏదన్నా నమ్మకాలతో ముడిపడిందా అంటే.. దాని చుట్టూ దొంగతనాలు, అశుభాలు, కుతంత్రాలు అల్లుకుని ఉన్నాయి. ఇది గౌరవంతో ముడిపడి ఉంది. మాది అనే అస్తిత్వంతో బలపడి ఉంది. అందుకే దేశం ఉన్నన్నాళ్లు, చరిత్ర చెరగనన్ని రోజులూ కోహినూర్ సమస్య రగులుతూనే ఉంటుంది.

వజ్రం భారతీయులకు కొత్తేమీ కాదు. భూగర్భంలో విపరీతమైన ఒత్తిడితో ఏర్పడే ఈ స్ఫటికాలు చాలా గట్టిగా ఉంటాయని గమనించారు. వజ్ర అంటే శక్తిమంతమైంది, అత్యంత బలమైంది అని అర్థం. అందుకే తొలినాటి దేవుడు ఇంద్రుడిది వజ్రాయుధమే. దాదాపు మూడు వేల ఏండ్ల నుంచే ఇక్కడ వజ్రాల సాగు కనిపిస్తుంది. కౌటిల్యుడి అర్థ శాస్త్రంలోనూ ఆ ప్రస్తావన కనిపిస్తుంది. దేశాన్ని పర్యటించిన విదేశీయులందరూ ఈ వజ్రాల గురించి అబ్బురపడుతూ రాసుకొచ్చారు. అసలు వీటికోసమే భారతీయ తీరాలకు వచ్చినవారూ ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా ఏళ్ల వరకూ లోకంలో వజ్రాలకు మనదేశానిదే ఏకఛత్రాధిపత్యం.

కోహినూర్ ఎక్కడ బయటపడింది అనేదాని మీద రకరకాల వాదనలు ఉన్నా.. గోల్కొండ సుల్తానుల ఆధీనంలో ఉన్న గోదావరి, కృష్ణ పరీవాహక ప్రాంతంలో బయటపడిందని చరిత్రకారుల నిశ్చిత అభిప్రాయం. పగలూరాత్రి వేలాదిమంది పనిచేసే ఈ గనుల్లో దొరికే వజ్రాలే లోకం మొత్తానికీ ఎగుమతి అయ్యేవి. ఇప్పటికీ సంక్లిష్టంగా తోచే వజ్రాల తవ్వకాన్ని మందుగుండు కూడా లేని రోజుల్లో సహజమైన పద్ధతుల్లోనే తవ్వి తీసేవారు. ఉదాహరణకు బండరాళ్లు అడ్డుపడితే దాని మీద నిప్పులు పరిచి వేడి చేసి, వెంటనే నీళ్లు చల్లి పగుళ్లు వచ్చేలా చేసేవారు. ఇంత కష్టపడినా వజ్రాల సాగులో ఉన్న కార్మికుల జీవితాలు మాత్రం కటిక దుర్భరంగానే ఉండేవి. వాటి మీద అజమాయిషీ ఉన్న వ్యాపారులు మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యేవారు.
గోల్కండ వజ్రాలు రాశిలోనే కాదు.. వాసిలోనూ ప్రత్యేకమే. పూర్తి కర్బనంతో తయారయ్యే ఇక్కడి వజ్రాల మెరుపు సంపన్నులను వెర్రెత్తించేది. అందులోనూ ఇక కోహినూర్ లాంటి అరుదైన వజ్రాలు దొరికితే, వాటిని రాజులకు కైంకర్యం చేయాల్సి వచ్చేవి. ఇక్కడి గనులను చూసేందుకు, వజ్రాలను కొనేందుకు
ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు వచ్చేవారు. వారి ద్వారా ఇక్కడ ఘనత విదేశాలకు చేరి కథలు కథలుగా వినిపించేది. ఉదాహరణకు సింద్బాద్ వజ్రాల లోయ కథ వెనకాల స్ఫూర్తి గోల్కొండ గనులే అని చెబుతారు.

కోహినూర్ అంటేనే వెలుగుల కొండ అని అర్థం. దాని చరిత్ర కూడా అంతే పెద్దది. ఓ నమ్మకం ప్రకారం కోహినూర్ చరిత్ర 14వ శతాబ్దంలోనే మొదలైంది. ఇక బాబర్ కాలంనాటికే అది ఉన్నది అనేందుకు బాబర్ నామా లాంటి పుస్తకాలలో దాని ప్రస్తావన వినిపిస్తుంది. అది ఎంత ఖరీదైంది అంటే ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తానికీ రెండున్నర రోజుల పాటు కడుపు నింపగలదు అన్న పేరుండేది. అంత ఖరీదైన వజ్రాన్ని కొనే తాహతు ఎవరికీ ఉండదు అని సాక్షాత్తు హుమాయున్ అన్నాడని చెబుతారు. దాన్ని ఓ బహుమతిగానో, బలవంతంగానో తీసుకోవాల్సిందే. కోహినూర్ చరిత్ర యావత్తూ అలాగే నడిచింది. బాబర్ అధీనంలో ఉన్న ఈ కోహినూర్ దొంగతనాల ద్వారానో, లూటీతోనో చేతులు మారుతూ మారుతూ మళ్లీ మొగలాయిల దగ్గరకే వచ్చింది. మీర్ జుమ్లా అనే గోల్కొండ అధికారి నుంచి కోహినూర్ షాజహాన్ దర్బారుకు చేరుకుంది. అక్కడ నెమలి సింహాసనం (పీకాక్ త్రోన్)లో దాన్ని అమర్చారు.
అలా నెమలి సింహాసనం కేవలం మొగలాయిల అధికారానికే కాకుండా, భారతీయ సిరిసంపదలకు కూడా ఆర్భాటమైన చిరునామాగా మారింది. మరి ఆక్రమణదారులు ఊరుకుంటారా! 18వ శతాబ్దంనాటికి బలహీనపడిపోతున్న మొగల్ సామ్రాజ్యం మీద నాదిర్ షా విరుచుకుపడ్డాడు. దిల్లీని ఊచకోత కోసి, లూటీ చేసి.. తనతో పాటు నెమలి సింహాసనాన్ని తీసుకువెళ్లిపోయాడు. కొన్నాళ్లకి నాదిర్ షా తిరుగుబాటుదారుల చేతిలో దారుణంగా హతమయ్యాడు ‘నా సర్వసంపదలూ ఇస్తానని’ వేడుకున్నా అందుకు బదులుగా ప్రాణభిక్ష దక్కలేదు. అతి ధనవంతుడైన, క్రూరుడైన నియంతగా పేరు తెచ్చుకున్నవాడి కథ దీనంగా ముగిసిపోయింది.

రాజుల మరణంతో పాటే సంపదలూ చేతులు మారతాయి. ఒకరకంగా వాటి విధి కూడా రాజులతోనే ముడిపడి ఉంటుంది. అలా నాదిర్ షా దగ్గర పని పూర్తి చేసుకున్న కోహినూర్.. దుర్రానీ సామ్రాజ్యం స్థాపకుడైన అహ్మద్ షా, సిక్కుమత తొలి చక్రవర్తి రంజిత్ సింగ్‌లను దాటుకుని చివరికి బ్రిటిష్ పాలకుల చేతికి వచ్చింది. సిక్కు సామ్రాజ్యాన్ని ఓడించిన బ్రిటిషర్లు ఆ రాజ్యానికి ఆఖరి వారసుడైన పదకొండేళ్ల దులీప్ సింగ్‌తో బలవంతంగా ‘Last Treaty of Lahore’ అనే ఒప్పందాన్ని రాయించుకున్నారు. తన సకల సంపదలను ఆంగ్లేయులకు ధారాదత్తం చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగానే కోహినూర్ ఇంగ్లండుకు బయల్దేరింది. దాన్ని తీసుకువెళ్లిన ఓడ కూడా కలరా నుంచి కాల్పుల వరకూ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొందని చెబుతారు.
ఇంగ్లండుకు చేరుకున్న కోహినూర్ గురించి వార్త గుప్పుమనగానే దాన్ని చూడాలని ఉబలాటపడుతున్న జనం కోసం The Great Exhibition ప్రదర్శనలో ఉంచారు. కానీ ఎందుకో అనుకున్నంతగా అది వెలుగులు చిమ్మడం లేదనే అసంతృప్తి కనిపించింది. అది వెలుతురు కొండ కాదు, చీకటి బండ అంటూ పత్రికలు ఎద్దేవా చేశాయి. దాంతో మరోసారి దాన్ని సానబట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికోసమే ప్రత్యేకమైన యంత్రాలు సిద్ధం చేసిన నిపుణులు అయిదువారాల పాటు శ్రమించి ఓ కొత్త రూపాన్నిచ్చి ఇంగ్లండ్ రాణి విక్టోరియాకు అప్పగించారు. ఈ చెక్కడంలో 38 గ్రాములు ఉన్న కోహినూర్ ఏకంగా 21 గ్రాములకు తగ్గిపోయింది. కాకపోతే అది ధగధగా మెరిసిపోసాగింది. మరోవైపు దాని చివరి హక్కుదారు అయిన దులీప్ సింగ్ కూడా ఓటమి, నైరాశ్యం, అణచివేతల మధ్య అసంతృప్తిగానే చనిపోయాడు. ఆఖరికి తన అంతిమసంస్కారాలు స్వదేశంలో జరపాలనే కోరిక కూడా నెరవేరలేదు.
సరికొత్త రూపంలోని ఉన్న కోహినూర్ మోహానికి గురిచేస్తున్నా కానీ, క్వీన్ విక్టోరియా దాన్ని ధరించేందుకు ఇష్టపడలేదు. ఆ వజ్రం తనకు పీడనని, దోపిడీని గుర్తుచేస్తుందని బాహాటంగానే వెల్లడించారు. విక్టోరియా చనిపోయాక దాన్ని రాజమకుటంలో (Crown of Queen) భాగంగా చేశారు. రాణులు దాన్ని ధరించే సింహాసనాన్ని అధిష్ఠించేవారు. యుద్ధ సమయంలో వాటిని తొలగించి రహస్యంగా దాచేవారు.

భారతదేశ సంపదకు, చరిత్రకు, పీడనకు ప్రతీక అయిన కోహినూర్‌ను తిరిగి ఇచ్చేయాలనే వాదన ఎన్నో ఏళ్ల నుంచీ ఉన్నదే. 1947లో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే కోహినూర్ తిరిగి ఇవ్వాలంటూ కొత్త ప్రభుత్వం చేసిన అభ్యర్థనను బ్రిటిషర్లు తోసిపుచ్చారు. ఓ ఆరేళ్ల తర్వాత మరోసారి చేసిన ప్రతిపాదనను కూడా ఆంగ్లేయులు తిరస్కరించారు.
భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న కొద్దీ తన ఘన వారసత్వమైన కోహినూర్ దక్కించుకోవాలనే పట్టుదల కూడా పెరిగింది. 2000 సంవత్సరంలో పార్టీలకు అతీతంగా కొందరు పార్లమెంట్ సభ్యులు కోహినూర్ తిరిగి ఇవ్వమంటూ ఇంగ్లండ్ ప్రభుత్వానికి ఉత్తరం రాశారు.

ఇరుదేశాల ప్రధానులు అటు ఇటు పర్యటించిన ప్రతిసారీ కోహినూర్ గురించి అడగాలనే డిమాండ్ గట్టిగా వినిపించడం మొదలైంది. ‘ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలించెను’ అన్న మాటను దాటి వలసవాదం చేసిన ఆర్థిక నష్టాన్నీ, సృష్టించిన పేదరికాన్నీ, శ్రమ దోపిడినీ, కరువుకాటకాలనీ మరోసారి అధ్యయనం చేయడం మొదలైంది. శశిథరూర్ లాంటి వాళ్లు ఈ మాటల్ని నేరుగా వారి గడ్డ మీదే చెప్పారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు మొదలయ్యాయి. డేవిడ్ కామెరూన్ లాంటి బ్రిటన్ ప్రధానులు వచ్చినప్పుడు విలేఖరులు నేరుగా కోహినూర్ గురించి ప్రశ్నలు సంధించారు.


వాస్తవం ఏమిటంటే.. కోహినూర్‌ని వదులుకోవడం బ్రిటన్‌కి ఇష్టం లేదు. దాని అసాధారణమైన విలువ ఒక కారణం అయితే, కోహినూర్‌ని ఇస్తే వలసకాలంలో లూటీ చేసిన ప్రతి వస్తువునీ తిరిగి ఇవ్వమనే డిమాండ్ మొదలవుతుందనే భయం మరో ముఖ్య కారణం. ‘వస్తువులను తిరిగి ఇవ్వడం మొదలుపెడితే బ్రిటిష్ మ్యూజియం రెప్పపాటులో ఖాళీ అయిపోతుంది’ అంటూ ఒకప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్పష్టంగా చెప్పేశారు.
ఇంతకీ న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానికి ప్రిన్స్ చార్లెస్‌తో విడిగా మాట్లాడే అవకాశం చిక్కిందా, అప్పుడు ఆయన కోహినూర్ గురించి ప్రస్తావించారా, అడిగితే ఏం జవాబు దక్కింది అన్న విషయాలు బయటికి రాలేదు. కానీ ఈ సందర్భం మాత్రం ఒక్క విషయాన్ని స్పష్టం చేసింది. భారతీయులు ఎన్నాళ్లయినా, ఎక్కడ ఉన్నా తమ దేశ గర్భంలో పుట్టిన కోహినూర్‌ని మర్చిపోరు. దాన్ని తిరిగి ఇవ్వాలని ఎప్పటికప్పుడు గట్టిగా అడుగుతూనే ఉంటారు.

కోహినూర్‌ది మాత్రమే కాదు!
గోల్కొండ డైమండ్స్‌కి ఉన్న
ఆకర్షణ, గిరాకీ వల్ల.. ఇక్కడ దొరికిన
ఎన్నో వజ్రాల
వెనుక పెద్దపెద్ద కథలే నడిచాయి.

కోహినూర్ వెలుగుల కొండ అయితే, దరియా ఇ నూర్.. వెలుగుల సంద్రం. మొగల్ రాజ్యం మీద దాడి చేసిన నాదిర్ షా, తనతో వెంట తీసుకువెళ్లిన అపార ఖజానాలో ఇదీ భాగమే. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అది ఇరాన్ సంపదలో భాగంగానే ఉంది. ఆ దేశ రాజధాని తెహ్రాన్ మీద క్షిపణుల వర్షం కురుస్తున్నా, భద్రంగా జాతీయ బ్యాంకులో ఉంది.
ఓ వజ్రం ఇరాన్ దగ్గరే ఆగిపోతే మరో గోల్కొండ వజ్రం, రష్యా తీరానికి చేరుకుంది. అదే గ్రేట్ మొగల్ డైమండ్గా పిల్చుకునే అర్లొవ్. ఓ ఫ్రెంచ్ సైనికుడు శ్రీరంగం ఆలయం నుంచి దీన్ని దొంగిలించాడని వినికిడి. దాన్ని చేజిక్కించుకున్న అర్లొవ్ అనే రాజు రాష్యా రాణి కేథరిన్ ద గ్రేట్‌కు కానుకగా ఇచ్చి ఆమె మనసును గెల్చుకునే ప్రయత్నం చేశాడట. ప్రస్తుతం అది మాస్కోలో ఉంది.
ప్రపంచంలోనే అందమైన వజ్రంగా పేరు పొందిన నీలి వజ్రం- Hope Diamond. వంద కోట్ల ఏళ్ల క్రితం భూగర్భంలో రూపొందిన అత్యంత అరుదైన వజ్రంగా దీన్ని గుర్తించారు. ఫ్రెంచ్ పాలకులలోనే అత్యంత శక్తిమంతుడిగా తనను తాను ప్రకటించుకున్న King Louis XIV, ఈ వజ్రం కోసం 150 కిలోల బంగారంతో సమానమైన సంపదను చెల్లించాడని కథనం. కోహినూర్లాగే ఇది కూడా రకరకాల చేతులు మారి లూటీలు, దొంగతనాలను దాటుకుని చివరికి వాషింగ్టన్ National Museum of Natural Historyలో కొలువైంది.

గోల్కొండ వజ్రాలు ఏఏ దేశాలు తిరిగాయో, ఎన్ని రాజుల్ని మోహింపచేశాయో, ఎలాంటి యుద్ధాలని దాటాయో లెక్కలేదు. అందుకు ఉదాహరణే ఫ్లోరెంటైన్ వజ్రం. ఓ కథనం ప్రకారం ఇది విజయనగర రాజుల నుంచి చేతులు మారుతూ ఇటలీ రాజుల చేతుల మీదుగా అస్ట్రియా చేరుకుంది. తొలి రెండు ప్రపంచయుద్ధాలలోనూ ఆస్ట్రియాది ప్రముఖ పాత్ర కదా. వీటి ప్రభావం తన చేతిలో ఉన్న ఫ్లోరెంటైన్ వజ్రం మీద ఎలా ఉంటుందో అని భయపడిపోయింది నాటి మహారాణి జిటా. అందుకే తనతో పాటు ఈ వజ్రాన్ని కెనడాకి తీసుకువెళ్లి, అక్కడ ఓ బ్యాంకులో దాచింది. వందేళ్ల పాటు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియకూడదనే షరతు విధించింది. ఈ గడువు పూర్తయ్యాక 2025లో వజ్రం గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పటిదాకా అది ఓ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది.
ఒకప్పుడు ఆలయాలు కూడా సిరిసంపదలతో ఉండేవి. సంపన్నుల నుంచి రాజుల వరకూ ఖరీదైన కానుకలు అందించేవారు. ఆక్రమణదారులు ఆలయాల మీద దాడి చేయడానికి సంపద కూడా ఓ ముఖ్య కారణమే. అందుకు సాక్ష్యం నాసక్ (నాసిక్) వజ్రం. నాసిక్ ఆలయానికి అర్పించిన ఈ గోల్కొండ వజ్రాన్ని, ఆ త్రయంబకేశ్వరుని మూడోకంటిలా అలంకరించేవారట. మొగల్-మరాఠాల మధ్య జరిగిన యుద్ధాలలో ఈ వజ్రాన్ని కాపాడుకోవడం కూడా ఓ ముఖ్య కర్తవ్యంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆంగ్లేయుల పైచేయి మొదలైందో, ఇక వల్ల కాలేదు. బ్రిటిష్ అధికారుల చేతిలోకి వజ్రం వెళ్లిపోయింది. అది ప్రస్తుతం లెబనాన్‌లోని ఓ ప్రైవేట్ మ్యూజియంలో ఉంది.

కోహినూర్‌కి దీటైన చరిత్ర రిగెంట్ వజ్రానిది. గనిలోంచి దీన్ని దొంగిలించిన బానిస, ఆ బానిసకు స్వేచ్ఛ కల్పిస్తానని ఆశ చూపించి తనను చంపి ఆ వజ్రాన్ని వశం చేసుకున్న నావికుడు, ఆ నావికుడికి నాణాలు కుమ్మరించి వజ్రాన్ని కొన్న వ్యాపారి, ఆ వ్యాపారిని మోసం చేసి వజ్రాన్ని అందుకున్న బ్రిటిష్ గవర్నర్.. ఇలా రకరకాల మలుపులు తిరిగిన ఈ రిగెంట్ వజ్రం ఫ్రెంచి రాజసంలో భాగమై Louis XIV నుంచి నెపోలియన్ వరకూ ఆ రాజులకు ఇష్టమైన సంపదగా మారింది. ఈ వజ్రం గురించి కథలు రాశారు, కవితలు అల్లారు, దీన్ని ధరించిన ఏ రాజూ సుఖంగా లేడంటూ శాపాలు పెట్టారు. ప్రస్తుతానికి ఇది ప్రపంచ ప్రఖ్యాత లూవ్ మ్యూజియంలో ఉంది.
ఇవే కాదు ఐడల్స్ ఐ, డ్రెస్డన్, అక్బర్ షా వజ్రం, నిజాం డైమండ్ లాంటి ఎన్నో అద్భుతమైన వజ్రాలు లోకం నలుమూలలకీ చేరుకున్నాయి. దురదృష్టవశాత్తు వీటిలో చాలా వజ్రాలు వ్యాపారంతో కాకుండా దౌర్జన్యంగా లాక్కున్నవే. అందుకే వాటిని తిరిగి ఇచ్చేయాలనే వాదన పెరుగుతున్నది. భారత సాంస్కృతిక శాఖ కూడా వీటి గురించి చురుగ్గా పనిచేస్తున్నది. India Pride Project లాంటి సంస్థలూ కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రకరకాల మలుపులు తిరిగి ఈ వజ్రాల కథలు ఇకపై ఏ తీరం చేరుకుంటాయో చూడాలి.