హరప్పా ( సింధూ) నాగరికత, వేద నాగరికతల మధ్యగల వ్యత్యాసాలు, పోలికలు
ఈ రెండు నాగరికతలు భిన్న యుగాలకు, ప్రదేశాలకు చెందినవి కావడంతో భిన్న సంస్కృతులుగా స్పష్టమైన తేడాలతో అభివృద్ధి చెందాయి. సింధూ నాగరికత ఒక దశానుక్రమంగా అభివృద్ధి చెందినది కాగా, ఈ దశానుక్రమ పద్ధతి వేద నాగరికతలో కనబడదు. అంటే సింధూ నాగరికత రాగి యుగంతో ప్రారంభమై కంచు యుగంలో అత్యున్నత దశకు చేరుకోగా, వేద నాగరికత ఇనుప యుగంలో ఉన్నత స్థితికి చేరుకున్నది.
భౌగోళిక పరంగా హరప్పా నాగరికత ప్రపంచ నాగరికతల్లోనే అతి పెద్దది. సప్తసింధు ప్రాంతంలో వర్థిల్లింది. వేదనాగరికత గంగా, యమున అంతర్వేదిలో గణనీయంగా అభివృద్ధి చెందింది. సింధూ నాగరికతకు ప్రధానం పురావస్తు ఆధారాలు కాగా, వేద నాగరికతలకు గ్రంథపరమైన ఆధారాలు ప్రధానమైనవి. సింధూ నాగరికతకు లిపి ఉండి భాషా పరిపక్వత కనబడదు. వేద నాగరికతకు భాష, లిపి ఉన్నాయి.
ఇరు నాగరికతలకు చెందిన స్పష్టమైన తేడాలు సామాజిక, రాజకీయ, మత, సాంస్కృతిక వ్యవహారాల్లో కనబడతా యి. సామాజికపరంగా సింధూ నాగరికత మాతృస్వామ్యానికి చెందింది కాగా వేద నాగరికత పితృస్వామ్యానికి చెందినది. సింధూ నాగరికత సమాజంలో వర్గాలు ఏర్పడగా, వేద నాగరికత సమాజంలో వర్ణాలు, కులాలు ఏర్పడ్డాయి. స్వేచ్ఛా, సమానత్వాన్ని ఇచ్చిన సమాజం సింధూ నాగరికతది కాగా, వేదసమాజం వర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించినది.
సింధూ నాగరికత పట్టణ నాగరికత కాగా, వేద నాగరికత ప్రధానంగా గ్రామీణ సంస్కృతి. సింధూ నాగరికతలోని మురుగుకాలువల నిర్మాణం, ధాన్యాగారాలు వేద నాగరికతలో కనబడవు. అదే విధంగా విస్తృతమైన అలంకరణ పద్ధతులు, ఖనన పద్ధతులు వేద నాగరికతలో కనబడవు. అభిరుచుల పరంగాను సింధూనాగరికతలోని వైవిధ్యం వేదనాగరికతలో లేదు.
ఆర్థిక రంగంలో సింధూ నాగరికత వ్యవసాయానికి, వ్యాపారానికి ప్రాధాన్యం ఇవ్వగా వేదనాగరికత పశుపోషణకు ప్రాధాన్యం ఇచ్చింది. సింధూ నాగరికత ఖండాంతర వ్యాపారాన్ని నిర్వహించగా వేదనాగరికత పరిమితమైన వ్యాపారాన్నే నిర్వహించింది. సింధూనాగరికతలో స్పష్టమైన తూనికలు, కొలతలు కనబడతాయి. వేద నాగరికతలో ఇవేవి లేవు.
సింధూ నాగరికత పట్టణాలను ఐశ్వర్యవంతులైన వ్యాపారులు పరిపాలించగా, వేద నాగరికతలో వంశపారంపర్యం, రాజరికం ప్రధానంగా కనబడుతుంది. సింధూ నాగరికత ప్రజలు కొన్ని విశ్వాసాలను పాటించారు. వేదనాగరితలో మత స్వరూపం స్పష్టంగా కనబడుతుంది. సింధూ నాగరకతలో పశుపతి ఒకే ఒక పురుష దేవుడు కాగా, వేద మతంలో సరస్వతి అనే ఒక స్త్రీ దేవత ఉన్నది. సింధూ ప్రజలకు ఎద్దు పవిత్రం కాగా వేద నాగరికతలో ఆవు పవిత్రమైనది. అమ్మ దేవతల ఆరాధన సింధూ మతంలో ప్రధానాంశం కాగా వేద మతంలో ప్రకృతి శక్తుల ఆరాధన ప్రధానమైనది.
కళా స్వరూపాలలోనూ తేడాలు స్పష్టంగా కనబడుతాయి. సింధూ ప్రజలు అత్యంత నాణ్యమైన నల్లని కుండలు తయారు చేయగా వేదయుగం నాటి ఆర్యులు బూడిద రంగు కుండలు చేశారు. సింధూ నాగరికతలోని కళా స్వరూపాల్లో ఉన్న పరిపూర్ణత వేద నాగరికతలో కనబడదు. ముఖ్యంగా ముద్రికలు, విగ్రహాలు తయారుచేయడం, బంకమట్టి బొమ్మల వంటి వైవిధ్యమున్న కళాస్వరూపాలు వేదనాగరికతలో లేవు.
సింధూ ప్రజలు అస్ట్రలాయిడ్, ప్రోటో అస్ట్రలాయిడ్ జాతులు కాగా ఆర్యులు కాకసాయిడ్ వంటి ఐరోపా మధ్య ఆసియా తెగలకు చెందినవారు. భాషాపరంగా సింధుప్రజలు ద్రావిడ భాషా కుటుంబానికి చెంది ఉంటారని భావించబడ్డది. ఆర్యులు ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవారు. రెండు నాగరికతల మధ్యగల తేడాలు భారతదేశ చరిత్రలో ముఖ్యాంశమైన భిన్నత్వంలో ఏకత్వానికి తోడ్పడ్డాయి.