కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పణ్ మూడోదశ సర్వేలో తెలంగాణలోని వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలు ప్రథమ ర్యాంకు సాధించాయి. ఇతర రాష్ర్టాలకు చెందిన ద్వారక (గుజరాత్), రేనాడీ (హర్యానా) జిల్లాలకూ జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు లభించింది. దేశంలోని ఎనిమిది జిల్లాలు వందకు 100 మార్కులు పొందగా, అందులో రాష్ట్రంలోని ఆరు జిల్లాలు స్థానం సంపాదించాయి.
ఆర్థిక ప్రయోజనం
అపరిశుభ్ర పరిసరాల కారణంగా అనారోగ్యంబారిన పడివారు ఉపాధికి వెళ్లలేకపోవడం, ఆరోగ్య సంరక్షణకు అధనంగా ఖర్చు చేయాల్సి రావడం వంటివి భారంగా మారుతాయి. ఇదే విషయమై తాగునీటి, పారిశుధ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ స్వచ్ఛ భారత్ వల్ల ఆర్థిక ప్రయోజనాలపై ఒక అధ్యయనం చేసింది. దీనిప్రకారం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాల్లోని ప్రజలు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, పరిసరాల పరిశుభ్రత కారణంగా అనారోగ్యం బారినపడకుండా ఉండటం, ఇంట్లోనే టాయిలెట్ అందుబాటులో ఉండటంతో సమయం ఆదావంటి వాటి కారణంగా ప్రతి ఇల్లు ఏడాదికి సుమారు రూ. 50,000 వరకు ఆదా చేయగలిగిందని అంచనావేసింది.
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ
స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సేవలు వినియోగించారు. గూగుల్ టాయిలెట్ లొకేటర్ యాప్ ద్వారా దగ్గర్లోని టాయిలెట్‌ను గుర్తించడం, స్వచ్ఛ భారత్ మిషన్‌కు సంబంధించి హెల్ప్‌లైన్ ఏర్పాటు, చెత్త డబ్బాలు నిండినప్పుడు వాటిని ఎస్ఎంఎస్ ద్వారా సంబంధించిణ సిబ్బందికి తెలిసేలా ఏర్పాటు చేయడం వంటివన్నీ ఈ పథకం విజయవంతం కావడానికి ఉపయోగపడ్డాయి. టాయిలెట్ నిర్మాణానికి సంబంధించి రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటయ్యింది. మొబైల్ ఫోన్లు, యాప్‌లు, ట్యాబ్‌లు ఐపాడ్ల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వల్ల టాయిలెట్ల నిర్మాణానికి, పనుల పురోగతికి సంబంధించిన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది.
పరిసరాల పరిశుభ్రతను కాపాడటమన్నది మహాత్ముడి మహోన్నత సందేశం, ఐదేండ్ల వ్యవధిలో దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం సామాన్య విషయం కాదు. ఈ దిశగా దేశంలోని బాల బాలికల నుంచి వయోధికుల వరకు కార్మిక, కర్షక వర్గాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ వర్గాలు, ఎన్జీవోలు ఇలా ప్రతి ఒక్కరు కృషిచేశారు.