అదొక కుల సంఘంలోని విశాలమైన హాలు. రెండు వైపులా వేసిన కుర్చీలలో పెద్దలందరూ ఆసీనులై ఉన్నారు. వారికి ఎదురుగా ఎడమవైపు ఉన్న కుర్చీలలో అమ్మాయి వైదేహి, ఆమె తరఫు బంధువులు.. కుడివైపు అబ్బాయి మోహన్, అతని బంధువులు కూర్చుని ఉన్నారు. కలియుగంలో ఇంతవరకెన్నడూ కనీవినీ ఎరగని ఒక కొత్త ఘట్టానికి అక్కడ తెరలేవబోతున్నదని ఆ క్షణంలో అక్కడున్న ఎవ్వరికీ తెలియదు.
ఆ దంపతులు ఏదో కూలీనాలీ చేసుకునే దిగువ తరగతి జంట కాదు. ఇద్దరూ పీహెచ్డీ చేసి.. డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న విద్యావంతులు. పెద్ద మనిషి లేచి..
“అందరికీ నమస్కారం. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న ఈ దంపతుల సమస్యను ఎలాంటి పక్షపాతం లేకుండా, మనస్ఫూర్తిగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పంచాయితీలో న్యాయం చేస్తామని ఆ భగవంతుడి సాక్షిగా
మేమందరం హామీ ఇస్తున్నాం. మోహన్.. ముందుగా మీరు చెప్పండి!”.
“అభియోగం నాపైనే.. వైదేహి నుంచి వచ్చింది కాబట్టి ముందు ఆమెనే మాట్లాడమనండి” అన్నాడు మోహన్.
అతని సంస్కారానికి అందరికీ అతనిపై గౌరవభావం కలిగింది.
వైదేహి చెప్పడం మొదలుపెట్టింది.
“మేమిద్దరం ఇరువైపులా ఉన్న పెద్దవాళ్ల అంగీకారం మీదనే.. కాళ్ల దగ్గరికి వచ్చిన ఎన్నో మంచి సంబంధాలను కాలదన్ని.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లిరోజే ఊరేగింపులో వైభవంగా సాగనంపాలని ప్లాన్ వేసుకున్న మా తమ్ముణ్ని తిడుతూ.. నాతో..
‘ఇక్కణ్నుంచి పావుగంటలో వెళ్లిపోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు’ అంటూ వార్నింగ్‌తో మొదలుపెట్టాడు. ఇక తర్వాత ప్రతీ చిన్న పనిలోనూ తప్పులు తీయడమే!”.
“అంటే.. మిమ్మల్ని తిట్టేవాడా? కొట్టేవాడా?” పెద్దమనిషి ప్రశ్నించాడు.
“ఆయన చేసే టార్చర్ అంతకు మించింది. ఈయన చూపించిన నరకం అనేది పూర్తిగా చెప్పడానికి రాదు. అవి మనసును ముక్కలు చేసి ఎన్ని గాయాలు చేస్తుందో అనుభవించిన వారికే తెలుసు. పెళ్లయిన వారంలో మా అత్తగారింటి పక్కనే ఉన్న చిన్నత్తకు పెళ్లిలో తెచ్చిన బిందెను ఇవ్వడానికి వెళ్లా. వారు బలవంతంగా భోజనానికి కూర్చోబెట్టారు. వచ్చి ఆలస్యం అందుకే అయ్యిందని చెప్పాను. అంతే!
‘వారికీ మాకూ పడదంటే మా అనుమతి లేకుండా అక్కడ భోజనం ఎలా చేస్తావు?’ అంటూ సునామీలా విరుచుకుపడ్డారు అత్తా, మామ, భర్తా! ఏడుస్తున్న నన్ను, మరిది ఎదుటే ముక్కు నేలకు రాయించి, మరోసారి ఇలాంటి తప్పు చేయనని చెంపలు వేసుకునేంత వరకూ వదల్లేదు. ముల్లులా గుచ్చుకుంటూ తీరని వేదనకు గురిచేస్తున్న బాధతోనే ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌కి ఆయనతో వెళ్లిపోయాను.
లోకమంతా మంచివాడన్నా, నిజంగా.. మంచివాడా!? కాదా!? అన్నది భార్యను అడిగితేనే తెలుస్తుందని.. అందుకే అన్నారు. మహాసముద్రాన్ని మరచెంబులో పట్టలేనట్లు ఎలా చెప్పగలను? కష్టపడి సంపాదించిన పీహెచ్డీ పనిమీద, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఆలస్యమైతే..
‘ఇప్పటిదాకా ఎవరితో కులుకుతున్నావే? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయవు. ఎవడి..’ జీవితంలో ఎన్నడూ వినని అసభ్యకరమైన, పలకడానికి జుగుప్స కలిగించే అసహ్యకరమైన పదాలు విన్న నా మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది!”..
“చిత్రహింసలు పెడుతున్నాడని పెళ్లయిన పదమూడేళ్లకు చెబుతున్నారు. మరి ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదు?”..
పెద్దమనిషి మధ్యలో అడుగుతుంటే..
“అలా అడగండి! అన్నీ అబద్ధాలు, అందుకే..” అనబోతున్న మోహన్ని పెద్దమనుషులు వారించారు.
“దానికీ కారణం ఉంది. ఎందుకంటే మాకు పెళ్లయిన తొలిరాత్రి ఆయన నాతో ఒకమాట చెప్పారు.
అదేమిటంటే..
‘మనిద్దరి మధ్యన ఎటువంటి గొడవలు జరిగినా.. వాటికి సంబంధించింది ఏదైనా నువ్వు నాతోనే మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్లకూడదు. పొరపాటున మూడో వ్యక్తి దగ్గరికి విషయం వెళ్లిందని తెలిస్తే మాత్రం.. ఇక ఆ తర్వాత నేను నీతో ఏమాత్రం కలిసి ఉండను. ఒకవేళ నేను కోపంలో ఏమైనా అన్నా.. నువ్వు ప్రేమతో నన్ను మలుచుకో! అంతేకానీ, ఎవరికైనా తెలిస్తే మాత్రం విడాకులే!’ అన్నారు. దాంతో ఎన్నోసార్లు కోపంతో అరిచి, చేతిలోనివి ఎత్తేసి, అలిగి మాట్లాడకుండా ఉన్నా! తప్పు ఆయనదే అయినా.. నేనే సర్దుకుని ఏదో రకంగా ప్రసన్నం చేసుకునే దాన్ని. ఇంకా ముఖ్యమైన ఘోరమైన విషయం ఒకటి చెప్పాలి. అది మా బాబు పుట్టినప్పటిది..”
వంశాంకురం పుట్టాడని మా అత్తామామ అందరికీ స్వీట్స్ పంచుతుంటే.. అమ్మానాన్న సంతోషపడ్డారు. కానీ, పచ్చి బాలింతనని కూడా చూడకుండా ఈయన నాకు ప్రత్యక్ష నరకం చూపించాడు.
“నేనేమీ అనను.. ఒక్క విషయంలో నిజం చెప్పు. వీడు నిజంగా నాకు పుట్టిన వాడేనా? నీకు మా నాన్నకు పుట్టిన వాడా?” అన్నాడు.
నాకు గుండెల్లో అగ్నిపర్వతాలు పేలడమంటే, కన్నీరు కాల్వలు కట్టడమంటే ఏమిటో తెలిసిందప్పుడే. కళ్లు బైర్లు కమ్మాయి. ఒకవైపు విపరీతంగా బ్లీడింగ్. డెలివరీ అయి రెండు గంటలు కూడా కాలేదు.
“ఛీ! నువ్వసలు మనిషివేనా? మామయ్య నాకు తండ్రిలాంటి వాడు. ఆయనతో ఇలాంటి సంబంధం.. ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు? భగవంతుడా! ఈ పురిటిలోనే నన్ను చంపేయాల్సింది. ఎందుకు బతికించావు?”.. శారీరక బాధకన్నా, గుండెను గునపాలతో గుచ్చిన ఆ మాటలతో తట్టుకోలేక పైకి గుండెలవిసేలా పొగిలి పొగిలి ఏడ్చాను.
“నామీద ఒట్టేసి నిజం చెప్పు! నేనేమీ అనుకోను. మా నాన్న మంచివాడు కాదు. ఎప్పుడైనా ఏదో బలహీన క్షణంలో ఏమైనా కాలు జారారా!? అందరూ వాడు అచ్చం మా నాన్నలా ఉన్నాడంటున్నారు. వాడూ అచ్చం అలాగే ఉన్నాడు. నేనేమీ అనుకోను. ఏదైనా బలహీన క్షణంలో ఏమైనా జరిగిందా?” అంటూ.. గుండెలవిసేలా ఏడుస్తున్న నన్ను చూస్తూ, పదేపదే అడుగుతున్న ఆయన మాటలకు లేని బలం తెచ్చుకుని, కత్తికొక కండగా నరికేయాలనిపించింది. అవి మాటలా? కాదు ఈటెలు. పదునైన బాణాలు. పచ్చి బాలింతను ఎవరైనా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అప్పుడు ఏడవకూడదని అంటారు. ఎక్కువగా ఏ పనీ చేయకూడదని చెబుతారు. అలాంటిది.. నాకు తీరని శోకం పెట్టాడు.
కొన్నినెలల వరకు ఇద్దరినీ చూసుకుంటూ
నేను ఉద్యోగం చేయలేకపోయాను. అప్పుడే ఆ తీవ్ర మానసిక వేదనకి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే.. క్రాన్స్ వ్యాధి బయటపడింది.
“అది నివారణ లేని వ్యాధి. ఎట్టి పరిస్థితుల్లో మానసిక స్ట్రెస్ ఉండకూడదు. అది లేకుంటే.. ఇదికూడా త్వరగా తగ్గుముఖం పడుతుంది” అంటూ చెప్పి..
డాక్టర్ రాసిన మందులకి ప్రతినెలా ఎంతలేదన్నా కనీసం నాలుగువేల వరకు ఖర్చు అయ్యేవి. చాలా నెలల వరకు మా అమ్మవాళ్లే పెట్టుకున్నారు. కానీ, నాకే అలా ఇష్టంలేక ఆయన్ని అడిగితే..
“ఉద్యోగం చేస్తావో.. ఇంకేం చేస్తావో నాకు అనవసరం. కాలేజ్‌కు వెళ్లి.. ‘బాబూ.. ఉద్యోగం ధర్మం చేయండి. నాకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు’ అంటూ అడుక్కోపో!” అనేవాడు. ఆయన జీతం లకారానికి దగ్గరగా ఉన్నా, ఎప్పుడూ నాకు చెప్పేవాడు కాదు. నా పిల్లలకు నేను దక్కాలంటే ముందు ఆర్థికంగా నా కాళ్లపై నేను నిలబడాలని కాలేజీలో పార్ట్‌టైం లెక్చరర్‌గా మళ్లీ జాబ్ సంపాదించుకున్నాను.
పాపకి యూనిఫాం చినిగిపోవడం వల్ల స్కూల్లో నిలబెడుతున్నారని తెలిసి.. కొనుక్కొని వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటిపోయింది. చార్జింగ్ లేక నా ఫోన్ స్విచ్ఆఫ్ అయింది. ఇంటికి రాగానే చేయిని వెనక్కి వడితిప్పి..
“ఎవడితో కులుకుతున్నావే? ఇప్పటివరకూ ఏ రంకు మొగుడి దగ్గరికెళ్లి వస్తున్నావు?” అంటూ పిల్లల ముందే నానా దుర్భాషలాడాడు. కిందికి వంగోబెట్టి.. వీపు మీద దబాదబా బలంగా గుద్దాడు. ఆయనొక శాడిస్ట్. దానికితోడు నేను అందంగా ఉండటం కూడా.. నా పాలిట శాపమయ్యింది.
“హడావుడిలో మీకు స్నాక్స్ పెట్టడం మర్చిపోయాను”.
“ఎలా గుర్తుంటుంది? ఎవడెవడినో ‘ఆరోగ్యమెలా ఉంది!?’ అని అడగడానికి సమయం ఉంటుంది కానీ.. కట్టుకున్నోడెలా గుర్తుంటాడు? ఊరంతా రంకు మొగుళ్ల్లే! పెళ్లికానోడితో ఇకఇకలు పకపకలు, షేక్ హ్యాండ్ లేంటి? ఇదంతా ఫోన్ వరకేనా, వ్యవహారం బయట తిరగడం వరకూ వెళ్లిందా?”.
మా ఫ్యామిలీ ఫ్రెండ్ కార్డియాలజిస్ట్ అయిన డా. శ్రీనివాస్ గారికి ఆరోగ్యం బాలేదని అమ్మ చెబితే.. మెసేజ్ పెట్టాను. ఆయన.. ‘ఫైన్! థాంక్యూ ఫర్ యువర్ కన్సర్న్’ అంటూ నవ్వుతున్న బొమ్మ, షేక్ హ్యాండ్ ఎమోజీ పెట్టారు.
“అంటే.. దొంగతనంగా నా ఫోన్ చూస్తున్నారా? ఛీ! ఆయన మా బాబాయి వయసువారు. మొన్న మా కొలీగ్‌తో నవ్వుతూ మాట్లాడుతుంటే ఇలాగే అన్నారు. అలా కనిపించిన వారందరితో సంబంధం అంటగట్టడానికి సిగ్గుగా లేదూ!”.. అలా మాటామాటా పెరిగి నన్ను తలపట్టి గట్టిగా నెట్టేశాడు. దాంతో నా తల గోడకు తగిలి.. దిమ్ముగా అయి కింద కూలబడ్డాను. అయినా ఆగకుండా, నా గొంతు నొక్కుతూ..
“ఏంటే.. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావ్?” అంటుంటే గిలగిలలాడి పోయాను. నోట్లోంచి మాట రావడం లేదు. ఇంతలో ఏదో ఫోన్ రావడంతో నా గొంతుపై చెయ్యి తీసేశాడు.
ఎవరి ముందైనా నన్ను రాక్షసిగా చిత్రీకరిస్తూ.. ‘మోహన్ మంచి బాలుడు’గా ఆస్కార్ లెవెల్లో నటించేవాడు. ఆ గొడవలతో అమ్మావాళ్లు తీసుకెళ్తే డిప్రెషన్లోకి వెళ్లి, జ్వరంతో ఫిట్స్ వచ్చి డేంజర్ జోన్లోకి వెళ్లిపోయాను. కొన్ని నెలలు అక్కడే ఉండిపోయాను. అలాంటి నన్ను, పిల్లలను కంటిరెప్పలా కాపాడింది అమ్మ. అంతకుముందు కూడా ఇలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు, డాక్టర్ దగ్గర చూపించి మందులు ఆయన కొనడని.. అమ్మకు ఫోన్ చేస్తే కారు పంపేది. పిల్లలతో అక్కడికి వెళ్లి డాక్టర్ ఫీజులు, మందులు అమ్మ డబ్బులతోనే చెల్లించి తెచ్చుకునేదాన్ని. రానూపోనూ కార్ని డ్రైవర్నీ ఇచ్చి అమ్మే పంపేది. దానికి కూడా బంధువులతో..
“అక్కడ దానికెవడో ఉన్నాడు. అందుకే వెళ్తుంది”..
“ఆమెకు సంసారానికి పనికిరాని వ్యాధి వచ్చింది. అందుకే అక్కడ ఉంది!” అనీ చెప్పుకొచ్చాడు.
“మహాసముద్రాన్ని మరచెంబులో పట్టించలేనట్లు.. ఆయన దారుణాలెన్నో ఈ వ్యవధిలో చెప్పలేను. నాకేం న్యాయం చేస్తారు?”.. ఏడుస్తూ వైదేహి చెబుతుంటే..
“ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే! ఆమెలాగా కథలల్లి నేను చెప్పలేను. పెళ్లికి ముందే మేం ప్రేమించుకున్నాం. నేను భద్రకాళి అమ్మవారి పాదాల మీద ఒట్టేసి చెప్తున్నాను.. జాగ్రత్తగా వినండి. పెళ్లికి ముందే మాకు అన్నీ అయిపోయాయి.. ‘అన్నీ’ అంటే పెళ్లయ్యాక కావాల్సినవన్నీ కూడా అప్పుడే అయిపోయాయి. అలాంటి దాన్ని నేను చేసుకున్నాను అంటే అర్థం చేసుకోండి..” మోహన్ ఆ మాటలంటుంటే, వైదేహి ఊగిపోతూ..
“అరేయ్! నీకు బుద్ధి ఉందా? నువ్వసలు మనిషివేనా? పవిత్రమైన అమ్మవారి పాదాలమీద ఒట్టేసి ఇలాంటి ఘోరానికి ఒడిగడతావా? అందరి ముందూ నా శీలాన్ని శంకిస్తావా? పెళ్లికి ముందే నీతో అన్నీ చేసుకునే బరితెగించిన ఆడదానిగా నన్ను చిత్రీకరిస్తావా? నిన్ను అస్సలు వదలనురా..” అంటూ అరిచి, మోహన్ని కొట్టడానికి వెళ్లబోతుంటే పెద్ద మనుషులు ఆపారు.
అబ్బాయి తరఫు వారుకూడా లేచి..
“అలాంటి ప్రమాణం చేసి, ఏమీ లేకుండా ఎందుకు నింద వేస్తాడు?” అంటూ సమర్థించుకోవడం, ఇరువైపుల వారు లేచి అరచుకోవడం చూసి.. ఓ పెద్ద మనిషి..
“అమ్మా! మీరందరూ కూర్చోండి. మీరంతా మా మాట వినాల్సి ఉంటుంది. లేదంటే మేమెందుకు?”
అనడంతో అందరూ నిశ్శబ్దమైపోయారు.
“ఆయన అమ్మవారి పాదాల మీద అన్నప్పుడు నమ్మాల్సి ఉంటుంది కదా! అయినా అదిప్పుడు అప్రస్తుతం” అన్నాడు పెద్దమనిషి.
“నేనీ నింద ఎలా భరిస్తాను? మోజు తీరగానే భార్య నడుం మీద కూర్చుని గుండు గీసి.. బజార్లో చెయ్యి పట్టి పశువును లాక్కెళ్తున్నట్టుగా వీధుల్లో లాక్కెళ్లినవాడు ఒకడు. తన సొత్తు కాదనుకొని అమానుషంగా అనుభవించి, కిరాతకంగా పేగుల్ని బయటికి తీసేవాడు ఒకడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా మర్మాంగాల్లో సూదులు గుచ్చేవాడు ఒకడు. బయటికి కనిపించకుండా లోపలే అంతం చేసి ముక్కలుగా కోసి పారేసేవాడు ఒకడు. తండ్రిలాంటి మామయ్యతో సంబంధాన్ని అంటగట్టి, ఫోన్లో కనీసం పలకరింపులకు కూడా విపరీతార్థాన్ని తీసి చిత్రహింసకు గురి చేసేవాడు వీడు. ఇలాంటి వాడు ఎంతకైనా తెగిస్తాడు. దీన్ని నేను నిరూపించుకోలేనన్న ధైర్యం ఆయనది! ఎందుకంటే ఇది ద్వాపరయుగం కాదు.. ద్రౌపది మానాన్ని చీరలిచ్చి కాపాడటానికి. త్రేతాయుగం కాదు.. సీతమ్మ వారిలా అగ్నిలో పడితే మళ్లీ అగ్నిదేవుడు వచ్చి ‘సీతమ్మ తల్లి పునీత’ అంటూ అప్పజెప్పడానికి. కానలకు పంపిన సీతమ్మ తల్లిని భూదేవి వచ్చి తన ఒడిలోకి తీసుకుపోవడానికి వీల్లేకుండా.. ఇది కలియుగం అయిపోయింది. నిరూపించుకోవడానికి ఏ శక్తీ లేదనుకుంటున్నాడు. కానీ, నాకా అమ్మవారి అండ ఉంది. నేను చెప్పినవన్నీ ఒప్పుకొంటే నేనిది తప్పని నిరూపిస్తాను” వైదేహి అన్నది స్థిరంగా.
ఆ మాటలకు పెద్ద మనుషులకే కాదు.. అక్కడున్న వారందరి మతులూ పోయాయి.
‘ఏంటిది? పెళ్లికి ముందు శీలం పోయిందనే విషయాన్ని.. పోలేదని ఇప్పుడెలా నిరూపిస్తుంది?’..
అందరిలోనూ విపరీతమైన ఆశ్చర్యం! వింటున్న మోహన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి!? ఇదెలా నిరూపిస్తుంది? అమ్మవారి పాదాల మీద అంటూ సెంటిమెంట్ కూడా ఉపయోగించి అందరి దృష్టినీ మళ్లించాడు. ఎందుకంటే అక్కడ తనకు వాయిస్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో నిరూపించే ఛాన్స్‌లేదు కాబట్టి ఒప్పుకొంటున్నట్లు తలూపాడు. వైదేహి లేచి ఎవరికో ఫోన్ చేసింది.
అందరి కళ్లూ ఆమె మీదనే ఉన్నాయి. అంత పెద్ద హాల్లో దాదాపు 50 మంది ఉన్న ఆ సమావేశ మందిరంలో.. సూది పడినా వినిపించేంత నిశ్శబ్దం ఆవహించింది. అటువైపు నుంచి..
“హలో!” అని ఫోన్ ఎత్తగానే.. స్పీకర్ ఆన్ చేసి..
“పిన్నీ! బాగున్నారా?” అన్నది వైదేహి.
“ఆ! బాగున్నామమ్మా! మీరెలా ఉన్నారు? మోహన్, పిల్లలు అందరూ బాగున్నారా? నేను రెండేళ్ల నుంచి మా అబ్బాయి దగ్గరికి బెంగళూరుకి రావడం వల్ల ఏ విషయాలూ తెలియడం లేదు”.
“ఆ బాగున్నారు పిన్నీ! మిమ్మల్ని అప్పుడు.. మా మొదటి రాత్రప్పుడు ఒక ప్రశ్న అడిగాను గుర్తుందా?”.
“ఎందుకు లేదూ? మొదటి రాత్రిలో మీరు సక్సెస్ కాలేదనీ, ఇద్దరం బాధపడుతున్నామనీ అడిగావు కదా! ఇప్పుడు ఆ విషయం ఎందుకు?”.
“ఆ! ఏం లేదు పిన్ని.. ఇంతకీ మీరప్పుడు
ఏం చెప్పారు?”.
“ఏమన్నాను.. ‘ప్రతి మొదటి రాత్రి ఎవరికీ అంతగా సక్సెస్ అవదు. అప్పుడు అమ్మాయి బిడియంతో బిగుసుకుపోయి ముడుచుకుపోతుంది. ఇద్దరి మధ్యలో అంతా మొదట కొత్త కాబట్టి.. అలాగే ఉంటుంది. తర్వాత అదే సక్సెస్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేదమ్మా!’ అన్నాను. పైగా నువ్వే.. ‘ఆయన కూడా ఈ విషయంలో బాగా బాధపడుతున్నారు. ఎవరినైనా అడుగు’ అన్నారని.. సిగ్గనిపించి నాతో నీకున్న అభిమానంతో నన్ను అడుగుతున్నావని కూడా అన్నావు కదా!?”.
“అవును పిన్నీ! నేను మళ్లీ మాట్లాడతాను” అంటూ ఫోన్ పెట్టేసి.. అందరూ నిశ్చేష్టులై చూస్తుండగా, వెళ్లి మోహన్ చెంపలు ఎడాపెడా వాయించింది. ఈసారి ఎవరూ వారించలేదు.
“ఇంతటి ఘోరమైన పరాభవం, అవమానం ఎటువంటి ఆడపిల్లకూ, ఎప్పుడూ రాకూడదు. పట్టపగలు బయటికి పోయినా వయసుతో సంబంధం లేకుండా పాలుగారే పసిపాపలో, పండు ముదుసలిలో కూడా ఆడతనాన్ని మాత్రమే చూసే కామాంధులే ఎక్కువగా ఉన్నారిప్పుడు! ముక్కు పచ్చలారని పసిబిడ్డ రక్తం కారుతుంటే.. ఇంటింటికీ తిరిగి సహాయం అర్థించినా ముఖం మీదే తలుపులు వేసిన లోకమిది! సభ్య సమాజం తలవంచుకునే ఘటనలు జరిగినంతకాలం.. ఎన్ని తరాలు మారినా తరుణి తలరాత మాత్రం మారదు. 21వ శతాబ్దంలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక/లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థే తెలిపింది. అందులో జీవిత భాగస్వాములతోనే ఎక్కువ ముప్పని కూడా చెప్పింది.
ఒకవేళ నేను ఆరోజు అలా అడిగి ఉండకపోతే.. కనీసం నేను చెప్పిన మాట నిజమని ఎవరైనా నమ్మేవారా? నిరూపించ గలిగేదాన్నా? ఇలాంటి నీచుడికి బిడ్డలుగా నా పిల్లలను ఎందుకు పుట్టించావు దేవుడా! వీడికే శిక్ష వేయాలి? నా పిల్లలకేం న్యాయం జరగాలి?”..
ఉగ్రరూపంతో నిప్పులు కురిపిస్తున్న ఆమె కళ్లు అగ్నిగోళాల్ని తలపిస్తుంటే.. ఆమెను చూడటానికి భయపడి, అలాంటి పరిస్థితులలో ఉన్నందుకు సిగ్గుపడి, కొందరు.. చరిత్రలో కనీవినీ ఎరుగని దృశ్యాన్ని చూస్తున్న గగుర్పాటుతో మరికొందరు చూస్తుంటే.. ఆమె చెప్పే నిర్ణయాన్ని వినడానికి చెవులు రిక్కించి ఒక్కక్షణం గాలి కూడా స్తంభించిపోయింది. గుడిలో అమ్మవారి సాక్షిగా, నిజం నిప్పులా ఎప్పటికైనా, ఎంత క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకొని మేలిమి బంగారంలా బయటకొస్తుందని నిరూపిస్తూ.. గుడి గంటలు గణగణ మోగాయి.
నామని సుజనాదేవి
మగవాడిలో మార్పు రానంతవరకూ.. ఎన్ని తరాలు మారినా తరుణి తలరాత మాత్రం మారదని చెబుతున్న కథ.. ‘సమాధానం లేని ప్రశ్న’. రచయిత్రి నామని సుజనాదేవి. వీరి స్వస్థలం హన్మకొండ. భారతీయ జీవితబీమా సంస్థలో లీగల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 250 పైగా కథలు రాశారు. ఆరు కథా సంపుటాలతోపాటు 2 కవితా సంపుటాలు, ఒక నవలను వెలువరించారు. వీరి మొదటి కథ ‘ప్రేమ తపన’. 1991లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. సాహిత్య సేవలో భాగంగా వందకు పైగా పురస్కారాలు, బహుమతులు, సన్మానాలు అందుకున్నారు. వివిధ పోటీల్లో 50కిపైగా కథలు, కవితలకు బహుమతులు గెలుచుకున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఆన్లైన్ ద్వారా దేశంలోని అన్ని జిల్లాల వారీగా ప్రధానమంత్రి నిర్వహించిన ‘లోరీ పోటీ’లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నుంచి ప్రథమ బహుమతి దక్కించుకున్నారు. ఇటీవలే స్వాతి ‘అనిల్ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ కథా రచయిత్రి పురస్కారం అందుకున్నారు. వీరి కథలు కొన్ని కన్నడంలో, ఆంగ్లంలో అనువాదయ్యాయి.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో విశిష్ట బహుమతి పొందిన కథ.
-నామని సుజనాదేవి
77993 05575