Ramayanam | పదో తరగతి పరీక్షలు కాగానే ఓ నెల రోజులు చక్రవర్తి సార్ ట్యూషన్స్‌లో పాఠాలు చెప్పాను. ఆ తరువాత జూన్‌లో అనుకుంటా.. మా మేనత్త కొడుకు పెళ్లి అయింది. బావే అయినా.. నాకంటే పది పన్నెండేళ్లు పెద్ద. ఏ మాత్రం జోకులేసే అవకాశం లేదు. పైగా మా అమ్మ డిసిప్లిన్ వల్ల మాకంటే పెద్దవాళ్లతో వినయంగా, మర్యాదగా ఉండేవాళ్లం.
పెళ్లికి కూడా మేము అయిదు రోజులు వెళ్లిన జ్ఞాపకం. రాయపర్తి ఊళ్లో మా అత్తయ్య వాళ్లది పెద్ద ఇల్లు. కింద మూడు విశాలమైన హాల్స్, మూడు పడక గదులు, మళ్లీ ఒక చిన్నపాటి ఇల్లులా మూడు పెద్ద గదుల వంటిల్లు, మిద్దె మీద కూడా హాలు, రెండు గదులతో ఉండేది. ఇంటి చుట్టూతా లెక్కలేనన్ని పండ్ల చెట్లు, పూల మొక్కలతో పచ్చగా కళకళలాడుతూ చల్లగా ఉండేది. ఇక మా ఈడు పిల్లలమంతా ఆటలే ఆటలు!
పెళ్లి వాళ్లది మల్లంపల్లి. వాళ్ల ఊరికి దగ్గర్లో ఉన్న చన్నూరు వెంకటేశ్వరస్వామి గుడిలో పెళ్లి చేశారు. గుట్ట మీద పెద్ద గుడి, సత్రాలు ఉన్నాయి. వాటిలోనే మాకు విడిది ఏర్పాటుచేశారు. ముందురోజు రాత్రి ఎదురుకోళ్లు, నిశ్చితార్థం లాంటివి జరిగాయి. అత్తయ్య పెళ్లి కూతురికి నగలు, చీరలు ఇచ్చాక అందరు ఆడవాళ్లూ వెళ్లి అమ్మాయి నోట్లో కొబ్బరి, పంచదార పోశారు. పాపం.. ఒక్కొక్కరూ కొంచెం కొంచెం పోసినా.. అన్నీ కలిసి ఆమె ఉక్కిరిబిక్కిరి అయింది. రెండు దవడల్లో ఎంత స్టోర్ చేసినా, దగ్గు వచ్చి కళ్లలో నీళ్లు వచ్చాయి. ఎవరో పెద్దవాళ్లు ‘ఇగ ఆపరాదండే, పిల్ల ఆగమయితున్నది. ఏదో వాలాయితకు ఒక్కళ్లిద్దరు నోట్ల పెట్టాలె గానీ, గంత గనం పెడితే సరం పడ్తది గాదు!’ అనడంతో మొత్తానికి పెళ్లికూతురు బయటపడింది. ఇలా పెళ్లి విశేషాలన్నీ చెప్పను గానీ, మరొక రెండు ప్రత్యేకంగా గుర్తుంచుకునే విషయాలు చెబుతాను.
తెల్లవారగానే కాఫీలు, టీలు అయ్యాక ఆడపెళ్లివాళ్లలో ఆడవాళ్లంతా విడిదికి వచ్చారు. అదేదో ‘వందనాలు’ అనే పేరుతో మగపిల్లవాడి తల్లినీ, ఆమె తోడికోడళ్లనీ, అక్కాచెల్లెళ్లనీ వరుసగా కూర్చోబెట్టారు. మొదట మసితో ముఖాన బొట్టుపెట్టారు. తరువాత విసుర్రాయి కర్రతో తలదువ్వారు. తలలో ఏవో గడ్డిపువ్వులు పెట్టారు. పిండి తెచ్చి ముఖాన పౌడర్ అద్దారు. కుంకుమలో రూపాయి బిళ్లంత వెండిబిళ్ల ముంచి దానంత సైజు బొట్టు పెట్టి ఆ వెండి బిళ్లను వాళ్లకే ఇచ్చేశారు. కొందరయితే బంగారు బిళ్లను చేయించి ఇస్తారని అక్కడ ఆడవాళ్లంతా చెప్పుకొంటే విన్నాను. చివరన మట్టి మూకుడు (పెంక) తెచ్చి దాన్ని చేతికిచ్చి ‘ఒదినగారూ, అద్దంల మొఖం చూసుకోండి’ అనడంతో మర్యాద పూర్తి అయినట్టు! ఇక చూసుకోండి, అందరూ ఒకటే నవ్వడం! ఇదంతా ఆడపెళ్లి వారికి మగపెళ్లివారంటే ఉన్న భయం పోగొట్టి, చనువు ఏర్పడటానికి సరసం అన్నమాట! ఒక విధంగా ఆడపెళ్లివారు చేసే ర్యాగింగ్ అన్నట్టే! అది అక్కడితోనే ఆగింది. మాయబజార్ సినిమాలాగా ‘గిల్పం, గింబళి’ దాకా పోలేదు. మా పిల్లల బ్యాచంతా అక్కడే ఉండి ఆ తతంగమంతా ఎంజాయ్ చేశాం. తరువాతి రోజుల్లో ఈ పద్ధతి మరెక్కడా కనబడలేదు.
పెళ్లిలో రకరకాల మనుషులు కనబడుతుంటారు. అలాగే ఆ పెళ్లిలో ఒక నడివయసావిడ ఇంగ్లీషు, తెలుగు కలిసిన విచిత్రమైన తెలుగులో మాట్లాడుతూ ఉంది. ఓ చేతి నిండా గాజులు, మరో చేతికి గోల్డ్ కలర్ రిస్ట్ వాచీ ఉండగా రెండు మూడు గాజులు వేసుకుంది. మెడలో కూడా రెండు మూడు గొలుసులు వేసుకుంది. తలలో ఓ పెద్ద పూలదండ, మళ్లీ సైడుకు ఓ గులాబీ పువ్వును పిన్నుతో పెట్టుకుంది. చెవుల పక్కకు వేలాడేలా వెంట్రుకలను స్ప్రింగుల్లాగా చుట్టి చెరో పక్కా వదిలేసింది. మాటిమాటికీ చీర కుచ్చిళ్లు, తలలో పువ్వులు, నుదుట పడే వెంట్రుకలు సవరించుకుంటూ ఉంది. పది నిముషాలకొకసారి గదిలోకెళ్లి ముఖానికి పౌడరు అద్దుకుని, ఒంటికి సెంటు పూసుకుని వచ్చేది. పెళ్లంతా అయ్యాక నాగవల్లి (నాకబలి) సదస్యం, స్థాలీపాకం లాంటి కార్యక్రమాలు అయ్యేదాకా ఆవిడ వధూవరుల పక్కనే కూర్చుని ఇక భోజనాలకు వెళతారనగా ‘ఇంకేంది, పెండ్లి కొడుకు ఇగ మా హ్యాండోవర్ అయినట్టే! మా పిల్ల ఎట్ల చెప్పితే అట్ల పిలగాడు ఇనాలే, స్టాండ్ అంటే స్టాండ్.. సిట్ అంటే సిట్’ అని పెద్ద జోకు వేసినట్టు ఒళ్లంతా కదిలిపోతూ నవ్వింది.
అప్పటిదాకా పురోహితుడు గానీ, పెద్దవాళ్లు గానీ.. ఏది చెబితే అది చేస్తూ వచ్చిన మా బావకు ఆ మాటతో సడన్‌గా కోపం, రోషం రెండూ వచ్చాయి. వెంటనే లేచి నిలబడి ‘ఎవరమ్మా నువ్వు? ఏం మాట్లాడుతున్నవ్? హ్యాండోవర్ ఏంది? స్టాండ్ సిట్ ఏంది? తెలిసే మాట్లాడుతున్నవా? నేనేం అంత తలకాయ లేని సన్నాసిననుకుంటున్నవా? ఎట్ల చెప్పితే అట్ల ఇనాల్నట, ఎందుకింటరు? మాట్లాడటం రాకపోతే మూసుకోని కూచోవాలే! ఏదో పెద్దోళ్లని ఊరుకుంటుంటే..’ అంటూండగానే అందరూ గుమిగూడి ఏమైంది, ఏమైందని అడగడం మొదలుపెట్టారు.
అమ్మాయి తండ్రి వచ్చి ‘గట్లెందుకు అన్నవమ్మా!’ అని ఆమెను మందలించి ‘ఏమనుకోకండి అల్లుడుగారూ!’ అంటూ బావను బతిమిలాడాడు. ‘నేనేమన్న? ఏదో పరాచికమాడిన, గంతే!’ అని ఆవిడ పాపం అక్కడినుంచి వెళ్లిపోయింది. అంతలోనే రాయపర్తి పెద్దమామయ్య అక్కడికి వచ్చి విషయమంతా తెలుసుకుని ‘ఏ.. ఏం గాలే! ఈ తతంగమంత శానసేపు అయ్యేవరకు మా ఓణికి ఆకలయింది. గంతే! అయినా నువ్వేందిరా! ఎవరో అనంగనే మాత్రం వాండ్లు ఎట్ల జెప్పితే అట్ల ఇంటవా? ముందు ముందు ఇంటే మాత్రం బయిటికిజెప్తవా? సరే మీరు తొందరగ భోజనం ఏర్పాట్లు చూడండి’ అని అందర్నీ సముదాయించి పంపించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి పెద్దమామయ్య జోక్స్‌తో మళ్లీ మామూలుగా మారింది వాతావరణం.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి