ఏసంగి కాలం ఎండలు మండుతున్నయి. బండమీద కోడిగుడ్డు పగిలితే అట్టయితున్నది. గంత ఎండలో తువ్వాళ నెత్తికి గట్టింది. మోకాళ్ల దాకా గోశి పెట్టింది. కొంగును నడుముకు గుంజి కట్టింది. వరి కొయ్యకాళ్లల్ల శెమటలు గక్కంగ.. గిర్రగిర్రా గానుగోలే తిరుగుతూ తిరుగుతూ అలసిపోయింది, దమ్ము కచ్చింది.. తెనుగోళ్ల సీతక్క. ఓ శెట్టు నీడకు సేద తీరుదామంటే కీక పెట్టు దూరంలో ఒక్క శెట్టన్న లేదు.
‘ఇంగ పానం పోతదా ఏంది!’ అని మనసుల దలుచుకుంట గావరగావరై..“ఓ ముత్తక్క! ఓ ముత్తక్కా!” నాలుక ఎండుకపోంగ దమ్ముకొచ్చేదాకా పిలిచింది. దూపకు నీళ్లకోసం తండ్లాడుతున్నది సీతక్క. కల్లంల చీపురు మర్రేసి లేకి ఊడుస్తున్నది ముత్తక్క. ఆ సప్పుడుకు సీతక్క పిలుపు ఆమె శెవుల దూరలేదు. సొల్గుకుంటనే కల్లం కాడికి శేరుకుంది సీతక్క.“నీ గడ్డి గుడిసె నీడకు జరసేపు కూకుంటా! సూరీడు అగ్గోలే మండుతుండు. శమ పాడుగాను” అని దీనంగ అడిగింది. “గదేం భాగ్యం సీతక్కా! కూకుండు. మబ్బులు ఇడిశిన ఎండ బెదిరిబెదిరి కొడుతున్నది. ఎవ్వలదైనా పాణమే! ఏం గట్టుకపోతం? ఏం ఎత్తుకపోతం? నీ నాలిక తడిపిల్లు గొంటున్నది. మా నీళ్లు తాగుతావా?” అంటూనే.. నీళ్ల ఆణిగెపు బుర్ర శేతికిచ్చింది ముత్తక్క.“గదేందక్కా! ఓ దిక్కు పానం పొంగ గీ కట్టుబాట్లళ్ల మన్నువడ!” అంటూ తీసుకొని, రెండు బుక్కలు గుట్టగుట్ట తాగింది సీతక్క.
“సీతక్కా.. నువ్వేం అనుకోనంటే మోత్కాకు దొప్పల ఇంత సల్లగట్క పోషిత్త! నువ్వు పొద్దుగూట్లో పడేదాక పరిగె ఏరుతనే ఉంటవు” అంటూ దొప్పడంత పోసిచ్చింది ముత్తక్క.
“సిరిసిల్ల ఓటల్ల దింటలేమా! తాగుత లేమా! ఎవలున్నారో! అని సూస్తమా? అయినా ఈ కులాల కుంపట్లళ్ల మన్నువడ! ఎవలు పెట్టిండ్రో! అందరం సత్తె అగ్గిల, గాలిల, మట్టిల గలుస్తం. పీల్చే గాలికి, తాగే నీళ్లకు తేడా ఉందా అక్కా!” అంటూ మల్ల నీళ్లు తాగింది సీతక్క.సొమ్మసిల్లినట్లు నిద్రలోకి జారుకుంది. అర్ధగంటలో మేల్కొని.. “ముత్తక్కా! ఇయ్యాల కూలి వడ్డదా?” అనిఅడిగింది. “శూడు! సీతక్క! నిన్న ఇయ్యల్లా కొయ్యకాళ్లన్నీ గోశి ఊడ్సుకత్తే గట్టితర్రలు ఓ కుంచెడు, ఓ కుంచెడు వడ్లు ఎల్లుతయి. కూలి పడతది. ఓ వారం గాసం సాలదా! నశీబుల ఎంత ఉంటే గంత అంటుతది!” అని తేలికగా తీసుకుంది ముత్తక్క.“అవుగనీ నువ్వెంత పరిగె ఏరినవు సీతక్క?” అని అడిగింది. “శేతనైనప్పుడు ఇరుసయ్యేదాకా ఇంటికి పోకపోదుంటి. గీ ఎన్బై ఏండ్ల వయస్సుల పరిగె ఏం ఎదుగుతది?” దీనంగ అన్నది సీతక్క.“నుదుట రాత ఎంతుంటే గంతక్కా!” ముత్తక్క అన్నది నిమ్మలంగ.
“నీ కడుపు సల్లగుండ! పోయిన పానం తిరిగి అచ్చినట్లయ్యింది. పెయ్యంత అల్కగయింది. మూడు కట్టెలు ఒకదిక్కు కట్టి సాపి, సందెడంత గడ్డి ఏసినవ్! గిదో గుడిసైంది. ఇగురం ఉండాలక్కా! యాష్టకచ్చినప్పుడు ఈడ కొద్దిసేపు సేద తీరుతవు గంతేనాక్క” అన్నది సీతక్క.“ఏ ఇగురమైనా పైవాడు సాత్ ఇయ్యాలక్కా! కూటికి ఇబ్బంది లేకుండ బతుకు ఎల్లదీస్తున్నం. నా కొడుకు గుండెకు తూటువడ్డదట! ఆపరేషనుకు లచ్చలు కావాలని డాక్టర్లు శెప్పిండ్రు. ఏ బొందలకెళ్లి దెత్తం బాంచన్! నీ కాళ్లు మొక్కుత” అంటూ.. పత్తి కాయోలే పగిలి కన్నీరు పెట్టింది ముత్తక్క. “అయ్యో! దేవుడా! గంత బాధ కడుపుల పెట్టుకొని అందరితో కలిగెం బులిగెం ఉంటున్నవ్. జర ఏడవకు! శూడు.. నువ్వు ఆత్మగల్ల దానివి. ఆ దేవుని గుల్లె మన్నువొయ్యా! నీ కొడుక్కి గిట్ల కావాల్నా” అని ఓదార్చింది సీతక్క.“ఓ సీతక్క! ఎంటికలున్న కొప్పు ఎటు వెట్టిన సింగారమే.. సంచిల సస్కాన్లు లేనప్పుడు ఏం జేస్తం! దేవునికి దండం పెడతం. ఆయుసు ఉన్నన్ని రోజులు ఉంటం. ఆకు జింపిన్నాడు పోతం! మాకు లక్షల అప్పులు. ఎవరన్నా నమ్ముతరా! ఎట్ల తీరుస్తరని అడుగుతుండ్రు. అందని ద్రాక్ష పండ్లకు నక్క ఆశపడినట్లే.. మా బతుకు” అంటున్న ముత్తక్క కన్నీళ్లు కాలువలైనయి.
“ఏ పుట్టల ఏ పాముందో! దేవుని మీద భారమేయి. దేవునికి మాల్యం కాకపోతదా!” అంటూ, కన్నీళ్లు తుడిచి ముత్తక్కను గుండెకు హత్తుకుంది సీతక్క.
“సీతక్కా! నువ్వు ఎన్బై ఏళ్ల ఈడుకు పరిగె ఏరవడితివి! బుక్కడంత తిని ఓ మూలకు కూకుండేదానికి ఏం కష్టం నీకు” అని వాపోయింది ముత్తక్క. “రోలు పోయి రోకలికి శెప్పుకొన్నట్లున్నది మనిద్దరి కథ. నువ్వేమో కొడుకు బాగలేక ఏడుస్తున్నవ్. నేను కొడుకు అమెరికాలో ఉండి ఏడుస్తున్న. నా కొడుకు మత్తుగ సంపాదిస్తున్నడట. ఏమి లాభం? నా శేతుల కొత్త లేదు. ఎవలను బద్నం జెయ్యాలె!” అంటూ గుండె పగిలింది సీతక్క.“అయ్యో! నీ కథ తెలువక అన్న. నీకు దండం పెడత ఏమి అనుకోకు” అంటూ ఓదార్చింది ముత్తక్క.
“గీ ఈడుకు జానెడు పొట్ట కోసం పరిగేరుడెందుకు? మా ఆయన రాములయ్య చింత గింజోలె ఉండే! ఈపులకు బొచ్చెలకు నొస్తుందని అన్నడు. నరారి డాక్టర్ అయ్యగారిని తోలుకచ్చేవరకు చిటిక్కుమన్నడు. నా బతుకు కుక్కలు జింపిన ఇస్తరి అయ్యింది. అగ్గి వెడుతడనుకున్న కొడుకు అమెరికా నుంచి రాకపాయె! నేనే అగ్గిపెడితి. నా ఏడుపు అడవిగాసిన ఎన్నెలైంది. తెగిన పతంగైన” అంటూ, మల్ల ఎక్కిఎక్కి ఏడ్చింది సీతక్క.“అయ్యో! ఊకుండు! నీ కొడుక్కు లగ్గమైందా?” అని అడిగింది ముత్తక్క.“వానికి నచ్చిన పిల్లని జేసినం. ఇద్దరు పిల్లలట! ఆళ్ల మొఖాలు ఎట్లుంటయో తెలువది. అందరూ.. ‘సీతక్క కొడుకు అమెరికా పోయిండు. ఆమెకేంది రోగం?’ అంటరు. బుక్కెడు బువ్వో, గంజో పోసే దిక్కులేదంటే! ఏమి కొడుకు ఏం కథ! కడుపు చింపుకొంటే కాళ్ల మీద పడతది” అన్నది విసుగ్గా సీతక్క. “సదువులకు గంతరొక్కం ఏడికెళ్లి దెత్తిరి” అని
అడిగింది ముత్తక్క.
“అయ్యో! రామా! నా కొడుకును కలెక్టర్‌ను జేత్తనని.. ఉన్న పదెకరాల పొలం గడికింత అమ్మి, గుండుసున్న జేసిండు నా మొగుడు. నా పేరున ఓ గుంట భూమి, యాభై వేలన్న ఉంచలేదు. నా కొడుకును జూడక ఆరేండ్లాయే! పిల్లల ముఖం చూడక పోతి. ఓపారి సంటి పిల్లలని.. ఓపారి పరమనేంటని.. ఓపారి గీన్కార్డ్ అని.. గిట్ల వాయిదాలు వేస్తుంటే తల్లి గుండె విలవిల తండ్లాడదా! నా తలరాత గింతే ఉందనుకుంటున్న! శేతనైనప్పుడు జంగల్కి పోయి.. శిప్పల పండ్లు, సిటమొట పండ్లు, పరికి పండ్లు, తునికి పండ్లు, జీడి గింజలు ఏరు
కచ్చి అమ్మిన. గిప్పుడు గాపని శేతనైతదా? కైకిలికే ఎవ్వలు పిలువరు. గందుకే పరిగేరుకొని బతుకు ఎల్లదీస్తున్న. నా ఎత కథ శెప్పుకొంటే తెల్లారుతది. పొద్దు గూట్లె పడుతున్నది ఇంగ పోయత్త ముత్తక్క” అంటూ, కండ్లు తుడుసుకుంట ఇంటిదారి పట్టింది సీతక్క.
ఒగనాడు పాకల పొయ్యిల పిడకల కున్నేలేసి గొట్టంతో ఊదుతూ.. గట్క పోద్దామని మంట రాజేస్తున్నది సీతక్క. గంతలోనే.. ‘సీతక్కా!’ అన్న పిలుపు శెవుల దూరింది.“ఎవలయ్యా! వత్తున్నా! వత్తున్నా!” అంటూ భవంతిలకు అడుగులేసింది. భవంతిల ఎదురుంగ రాములయ్య ఫొటోకు దండ శూసి.. జనపాల నర్సయ్యకు గుండెల రాయేసినట్టు గుబేలుమన్నది. కన్నీళ్లు కట్టలు దెంచుకున్నయి. “తమ్మీ! మీ బావతోని మాట్లాడుదామని వచ్చినావురా! ఇద్దరూ కల్లు దాక్కుంట ముచ్చట్లు పెడతరా తమ్మీ! మీ బావ నన్ను ఒంటరిని జేసిండు తమ్మి! కొడుకు సదువు కోసం ఇల్లు గుల్లశేసిండు తమ్మి! నా బతుకు ఆగమైంది తమ్మి! ” అంటూ, నరసయ్య మీదవడి ఏడుస్తూనే.. “అబ్బో..! తమ్మీ! ఇంగ నేను బతుక! నాకు ఈపులకు బొచ్చెలకు నొస్తున్నది. దమ్ము దీయత్తలేదు తమ్మీ” అంటూ తల్లడిల్లింది సీతక్క. “అక్కా! నీకేం కాదు. ధైర్యంగుండు” అంటూ, ఆటో దీసుకత్తని సరసర వాడలోకి పోయి, కులపోళ్లకు సంగతి శెప్పిండు. ఆటో తీసుకొని వచ్చిండు.
“అక్కా! ఆటోలో కూకుందువు లెవ్వు” అన్నడు నరసయ్య.“తమ్మీ! ముంత గూట్లె యాబైవేలు ప్లాస్టిక్ కవర్ల మడత జుట్టి పెట్టిన! ఇగో.. నా బొడ్ల సంచిల పదివేలున్నయి. నాకాడ మిగిలినవి గివ్వే! నేనెట్లా బతుక! తమ్మీ! గీ పైసలతోని నా సావు కరుసులు ఎల్లదీయి. నన్ను సందం మంచిగ జేయి తమ్మీ! నువ్వు దేవుడిచ్చిన తమ్మునివి. పెద్దకర్మలన్నీ ఉన్నంతలా శెయ్యి” అని అంటుంటే.. అక్కడ గుమికూడినోళ్ల గుండెలు అవిసి కంటతడి పెట్టనోల్లే లేరు.నరసయ్య దుఃఖం ఆపుకోలేక ఒక్కసారి బోరున మీదపడి గుండెలు అవిసెటట్లు ఏడ్చిండు. తనది తానే.. ‘ఏంది నేను గిట్ల డీలా పడిపోతున్న! అయ్యో రామ! సీతక్కని బతికించుకోవాలి’ అని తేరుకొన్నడు. శూసేటోళ్లలందరూ ముక్కున వేలేసుకుని.. ‘ఏ చుట్టరికం లేని పరాయి మనిషి మానవత్వంతో ఎనలేని సేవలు చేస్తుంటే.. మనం కులపోల్లం ఏం చేస్తున్నట్టు?’ అని వాడకట్టులో కొందరు అనుకుంటుండ్రు.
నరసయ్య ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండ.. “అక్కా! నువ్వు ఏమి బుగులు పడకు. నిన్ను బతికించుకుంటాం. సిరిసిల్ల కేర్ హాస్పిటల్‌కు పోదం” అంటూనే.. సంటి పిల్లను ఎత్తుకున్నట్టు ఎత్తుకొచ్చి, ఆటోలో కూర్చోబెట్టిండు. గప్పుడు సూసేటోళ్ల మనసులు చెరువులైనయి. ఆటో బయలు దేరింది.
“కొడుకా రాజు! నేను ఆవునూరు సీతక్కను కేర్ హాస్పిటల్‌కు తీసుకొస్తున్న. గుండె నొప్పి లేచింది. నువ్వు గాలయ్య సేటుకాడ వడ్ల పైసలు 2 లక్షలు ఈయల్ల ఇస్తనన్నడు. పరిస్థితి శెప్పి పైసలు తీసుకొని హాస్పిటల్ కాడికి రా!” అని సెప్పి.. మళ్లీ గాలయ్య సేట్‌కు ఫోన్ జేసిండు.“నా కొడుకును పంపిస్తున్నా! వడ్ల పైసలు ఇయ్యి!” అని శెప్పిండు.“తమ్మీ! నాకోసం ఇంతగనం శమ పడుతున్నావ్. నాకు భూమి మీద నూకలు ఉంటే బతుకుత! లేకుంటే నా బొంద మీద గడ్డి మొలుస్తది. ఎట్లయినా గోదానమే! నువ్వు రంది పెట్టుకోకు! ఏ నొప్పి లేకుండ పాణం పోదు కదా! ఏ జన్మల ఏం పాపం శేసిన్నో తమ్మి!” అంటూ ములుగుతూ అంటున్నంతలోనే.. నొప్పి తన్నుకొచ్చి అటుఇటు తల్లడిల్లింది. మాట ఆగింది. నరసయ్యకు గుండె దడ పెరిగింది. ఏమి తోయడం లేదు. టీవీలో సంఘటన యాదికొచ్చింది.
“సీతక్కా!” అని.. ఆమె శెయ్యి తీసి గుండె మీద వెట్టి కడుపుల కిందికి మీదికి ఒత్తిండు. కడుపు ఉబ్బింది. నరసయ్య కాళ్లు చేతులు గజగజ వణుకుతున్నయి. అయినా గుండె ధైర్యం తెచ్చుకొని దేవుని మీద భారం వేసి.. నోట్లో నోరు పెట్టి లోపలికి బయటికి గట్టిగా ఊదిండు. టక్కన గురుక్కుమని క్యాలికి వచ్చింది సీతక్క.“అక్కా! నీకేం కాదు! అవ్వ తోడు.. ఇమానంగ!” అంటుండగనే దవాఖాన వచ్చింది. ఎమర్జెన్సీ వార్డులకు తీసుకుపోయినంక.. డాక్టర్ చైతన్య శూసిండు. నరసయ్యను తన చాంబర్లోకి రమ్మని.. “పేషెంట్ సీరియస్‌గా ఉంది. ఆపరేషన్ చేయాలె! ఈడ పరికరాలు ఇంకా రాలేదు. మా అంబులెన్స్‌లోనే కరీంనగర్ హార్ట్‌కేర్ హాస్పిటల్‌కు రాస్తున్న. ఈ గోలి నాల్క కింద పెట్టు. ఆక్సిజన్ పెడుతరు. వెంటనే బయలు దేరండి” అంటూ జాగ్రత్తలు శెప్పి పంపించిండు. అంబులెన్స్ బయలు దేరింది. అమెరికాలో ఉన్న సీతక్క కొడుకు రాకేష్‌కు ఫోన్ శేసిండు నరసయ్య.
“చెప్పు మామయ్య! ఏం సంగతి” అన్నడు రాకేష్.“బిడ్డా రాకేష్! అమ్మకు గుండెపోటు వచ్చింది. నాకు ఒళ్లంతా బుగులు బుగులు ఐతుంది. నువ్వు జల్ది రా బిడ్డ!” అని శెప్పిండు నరసయ్య. “మామా! ఇప్పుడు రావడం కుదరదు. లీవ్ పెట్టడం, ప్లేన్ టికెట్ బుక్ చేయడం.. ఇదంతా ఉంటుంది. ఖర్చులకు డబ్బులు పంపిస్త. శూయించు. ఆయుష్ ఉంటే బతుకుతది. సరేనా! మామ!.. తర్వాత మాట్లాడుదం!” అని ఫోన్ పెట్టేసిండు రాకేష్.అంబులెన్స్ కరీంనగర్ హాస్పిటల్‌కు చేరంగనే.. పేషెంట్‌ను ఆగమేగాల మీద లోపలికి తీసుకెళ్లిండ్రు. రెండు లక్షలు అడ్వాన్స్ కట్టండి అని అనగానే..“కొడుకా రాజు! పైసలు కట్టుపో” అన్నడు నరసయ్య.“పేషెంట్‌ను సమయానికి తెచ్చినవ్. కొంచెం ఆలస్యమైతే మా చేతుల్లో ఉండేది కాదు” అన్నడు డాక్టర్.ఆ మాట వినగానే నరసయ్య కుటుంబానికి గుండె ధైర్యం అనిపించింది.“రేపటికి అన్ని పరీక్షలు అందుతయి. ఓ పాజిటివ్ నెత్తురు అవసరం ఉంటుంది. ఇచ్చేవాళ్లను వెంబడి ఉంచుకోండి! రేపు 11 వరకు ఐదు లక్షలు డిపాజిట్ చేయండి. ఆపరేషన్ తప్పదు” అన్నడు డాక్టర్ శ్యామ్.“రాజు! నీది ఓ పాజిటివ్ నెత్తురే కదా! ఇంకా ఏం డోకా లేదు” అన్నడు నరసయ్య.సీతక్క కోసం తన పేరున రాములయ్య కొన్న నాలుగు గుంటల ప్లాటు మెడికల్ కాలేజీ పక్కనే ఉన్నది.
అది కావాలని అంతకుముందే గాలయ్య సేటు 40 లక్షలకు అడిగిండు. అది అమ్మేత్తమని గాలయ్య సేటుకు ఫోన్ శేసి.. “గాలయ్య సేటూ! మెడికల్ కాలేజీ పక్కపొంటి ప్లాటును 40 లక్షలకు అడిగిండ్రు కదా! తీసుకోండి” అన్నడు నరసయ్య.“నరసయ్యా! అప్పుడు ఇస్తానన్న గానీ.. ఇప్పుడు ధరలు తగ్గినై కదా! 35 లక్షలిస్తా.. ఇష్టమైతే రేపు వచ్చి 5 లక్షలు బయాన తీసుకొని కాగితం రాసియ్యి సరేనా!” అని అన్నడు గాలయ్య సేటు. చేసేదేమీ లేక.. “గట్లనే సేటూ.. 35 లక్షలకు ఖాయం జేసుకోండి. రేపు అంబటాళ్ల వరకు మీ ఇంటికి వచ్చి రాసిత్త! 5 లక్షలు చేసి పెట్టండి” అని కొండంత ధైర్యంతో నిట్టూర్చాడు నరసయ్య. అంతలోనే డాక్టర్ పిలిపిస్తే వెళ్లిండు. “నరసయ్యా! అన్ని రిపోర్టులు అందినయి. రేపు మధ్యాహ్నం ఆపరేషన్ చేస్తా! ఐదు లక్షలు డిపాజిట్ కట్టేసేయ్” అని చెప్పిండు డాక్టర్ శ్యామ్. “అయ్యా! తప్పక కట్టేస్తా! ఆపరేషన్ జర మంచిగా శేయండి దండం పెడతా” అంటూ బతిమాలిండు నరసయ్య. అన్న ప్రకారం డిపాజిట్ కట్టిండు. ఆపరేషన్ మొదలు పెట్టిండ్రు.
నాలుగు గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్లనుంచి డాక్టర్ శ్యామ్ బయటికి వచ్చి.. “ఆపరేషన్ సక్సెస్ అయింది. పేషెంట్ ఐసీయూలో ఉంది. దూరంకెళ్లి చూడొచ్చు” అని చెప్పిండు. అప్పటిసంది రోజూ నరసయ్యతోపాటు ఆయినె భార్య లచ్చవ్వ, కొడుకు రాజు.. ముగ్గురు కలిసి సీతక్కకు పాణమోలె సేవలందించిండ్రు. డిశ్చార్జ్ కాగానే ఇంటికి తెచ్చుకున్నరు. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా సూసుకుంటున్నరు. ఒకరోజు సీతక్క వాళ్లను పిలిచి..“తమ్మీ! అవ్వతోడు, ఆ దేవుడు నన్ను నీతోడ ఎందుకు పుట్టనియ్య లేదు! రాజు.. నీ అసొంటి కొడుకు నాకెందుకు పుట్టకపాయె! ఏ పేగు బంధం లేకున్నా నాకు పుట్టెడు సేవలు సేత్తిరి. మీ రుణం ఎట్ల తీర్చుకోవాలి. కడుపున పుట్టినోడు కానరాని దేశంలో ఉండే. ఒక్కసారన్న ఫోన్లో నాతో మాట్లాడకపోయే! నా కడుపు గంత సెడ్డది. నాకన్న పేగు గంత శెడ్డది అయ్యింది!” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నది.
“అదేందక్కా! నేను నీ తోడబుట్టినోన్నే అనుకో! రాజు నీ కొడుకు అసోంటోడు అనుకో!” అన్నడు నిండు మనసుతో నరసయ్య.“తమ్మీ! మీ బావ నా శేతుల ఏం ఉంచకపాయే. మరి మీరు లక్షల కొద్ది ఖర్చు పెడుతుండ్రు. మీ రుణం ఎట్లా తీర్చుకోవాలి?” “అక్కా! మేము నీకు సేవ శేసినం గంతే! ఈ పైసలు బావ నీకోసం నా పేరు మీద నాలుగు గుంటల ప్లాటు కొనిపెట్టిండు. నీకెప్పుడైనా అవసరమైనప్పుడు అమ్ముమన్నడు. గంతే! అమ్మిన. కర్సుపెట్టిన. మిగిలినవి లెక్క శెప్పుత” అన్నడు నరసయ్య.“తమ్మీ! సూశినవా! నా కొడుకు మంచోడు కాడని మీ బావ ముందుగానే పసిగట్టిండు. గందికే భూమి నీ శేతుల పెట్టిండు. నేను ఇన్ని రోజులు పొరపాటుపడ్డ! నా దేవుణ్ని తప్పుగ అర్థం శేసుకున్న” అని చెంపలేసుకుని.. “ఎన్ని వచ్చినయి తమ్మీ” అన్నది.
“అక్కా! 35 లక్షలకు మాట్లాడిన. బయానా 5 లక్షలు ఇచ్చిండు. ఇయాల మొత్తం ఇత్తనన్నడు. అన్ని నీకు లెక్క శెప్పుత! ఐదు లక్షలు హాస్పిటల్ ఖర్చు అయినయి. చిల్లర ఖర్చులు 50 వేలు అయినయి. నీకింక 29 లక్షల 50 వేలు వస్తయి అక్క! వాటిని జాగ్రత్తగ దాచుకుంటవా?! బ్యాంకులో పెట్టుకుంటవా! నీ ఇష్టం అక్క”. “తమ్మీ! గింత నిజాయితీగా ఇచ్చేటోళ్లు లోకంలో ఎవరన్నా ఉన్నారా? నేను శెప్పేది విను. 10 లక్షలు నా అల్లుడు రాజు పేరు మీద బ్యాంకుల ఫిక్స్ శెయ్యి. ఒక పది లక్షలు ఆవునూరి ముత్తక్కకు ఇద్దాం పా! 9 లక్షలు మల్లుగారి నరసయ్య వృద్ధాశ్రమానికి ఇస్త. నేను సచ్చేదాకా అక్కణ్నే ఉంటా! ఇంగ ఆవునూరి ఇల్లు నా కొడుక్కు ఉండని. ఇంగో తమ్మీ! నా ఇష్టం గిట్ల ఉన్నది” అన్నది సీతక్క.
“అక్కా! ఆడిబిడ్డ సొమ్ము మాకెందుకు?!” అన్నడు నరసయ్య.
“గది నా అల్లునికి కట్నం. నువ్వు వద్దంటే నేను సచ్చినంత ఒట్టే! అవ్వతోడు!” అని, మల్ల మాట్లాడకుండ నరసయ్య నోటికి తాళం వేసింది సీతక్క. పైసలు రాంగనే నరసయ్యను వెంబడి పెట్టుకొని ముత్తక్క ఇంటికి పోయింది.“ముత్తక్కా.. ఉన్నవా! గింత సల్లగటుక పోస్తావా!” అన్నది సీతక్క. గతాన్ని గుర్తుకుతెచ్చుకొని. “గదేం భాగ్యం అక్కా! పోస్తా.. గిప్పుడు నీ పాణం ఎట్లుంది? మంచిగైందా?!” అంటూ, నరసయ్యను, సీతక్కను ఆప్యాయంగ చెరో పీటవేసి కూకోబెట్టి అడిగింది ముత్తక్క.“ఇంగో ముత్తక్కా! నాకు దేవుడిచ్చిన తమ్ముడు ఉండబట్టి నన్ను ఆదుకొని రాయోలే శేసిండు నరసయ్య” అని గంట పతంగ శెప్పింది సీతక్క.“ముత్తక్కా! నీ కొడుకు పానం ఎట్లుంది? నాకు మొదలు గజ్జెప్పు” అడిగింది సీతక్క.
“ఉన్నడు అంటే ఉన్నడన్నట్టు తింటుండు తిరుగుతుండు. బరువు పనులు శెయ్యనిత్తలేం! ఆని ఆయుష్షు భగవంతుని శేతుల ఉంది. ఎప్పుడు మాల్యమైతదో తెలువదు!” అని కంటతడి పెట్టింది ముత్తక్క!“ఇంగ ఏడవకు. ఆ దేవుడు మాల్యమైండు. ఇంగో నీ కొడుక్కు ఆపరేషన్ శేయించు. పది లక్షలు దేవుడు ఇస్తున్నడు. సుఖంగ ఉండుండ్రి” అన్నది సీతక్క.“అక్కా! మల్ల ఎన్ని రోజులకు గీ అప్పు తీర్చుమంటవు” అని నెమ్మదిగ అడిగింది ముత్తక్క.“ఒగనాడు పరిగేరేటప్పుడు ఎండల నా ప్రాణం పోతుందా?! అనుకున్న. గప్పుడు నన్ను కాపాడినవ్. నీకేమన్నా ఇచ్చిన్నా! ఇప్పుడు నేను సుత గంతే! నీ కొడుకు పానాన్ని కాపాడుతున్న. నాకు ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. వింటున్నవా!” అని శెప్పి ఓదార్చింది సీతక్క!గా మాటలిని ముత్తక్క, ఆమె భర్త నోటమాట రాకుండా బీరిపోయి తేరుకొని.. సీతక్క కాళ్ల మీదపడి బోరున ఏడ్చిన్రు.
“అక్కా! ఇంగ నేను గంభీరావుపేట వృద్ధాశ్రమంలో ఉంటా! నీ కొడుకు బాగా అయినంక ఒకసారి కబురంపు” అంటూ, ముత్తక్కను బగ్గ కౌగిలించుకొని నరసయ్యతో బయలు దేరింది సీతక్క.గంభీరావుపేట వృద్ధాశ్రమానికి శేరుకొని నరసయ్యతో మాట్లాడి.. తొమ్మిది లక్షల డబ్బు చెందా రూపంలో అందించింది. “సచ్చేదాకా నేను ఈడనే ఉంటా!” అని వేడుకున్నది సీతక్క.“గౌరవంగా ఉండు తల్లీ! నీకు అన్ని వసతులు ఉంటాయ్. నీకు ఏ లోటయినా శెప్పు” అని అభయమిచ్చిండు నరసయ్య.ఎక్కడి పైసలు అక్కడ ఇచ్చేసింది. “తమ్మీ! నువ్వు ఏమనుకోవద్దు. నేను ఎవ్వలకు భారం కావొద్దు. ఇక నేను ఈ ఆశ్రమంలోనే ఉంట!” అని సీతక్క అంటుండగానే.. అమెరికాలో ఉన్న కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. కానీ సీతక్క ఎత్తలే!“అక్కా! అల్లుని ఫోన్ వచ్చింది కదా! ఎందుకు ఎత్తలేదు?” అని అడిగిండు నరసయ్య.
“తమ్మీ! ఇంత కష్టంలో మీరు ఆదుకున్నరు. ఇంతకుముందు ఒక్కసారైనా ఫోన్ శేసిండా? ఇప్పుడెందుకు శేస్తుండు. పైసల వాసన పసిగట్టి నట్లుండు. పైసలు అచ్చినయని నువ్వుగిట్ల శెప్పినవా తమ్మీ?” అని అడిగింది. “అవునక్కా! నిన్న ఫోన్ శేసి శెప్పిన! మాట రావద్దని” నెమ్మదిగా అన్నడు నరసయ్య.“సరే తమ్మీ! శెప్తే శెప్పినవు కానీ.. ఇకముందు నా కొడుకు ఫోను ఎత్తినా దాపరికం లేకుండా శెప్పు తమ్మీ! నాకు మళ్లీ జన్మనిచ్చినవ్ నువ్వు. ఇంకా నా కొడుకు ఫోను నేనెత్తి సమాధానం శెప్త! నువ్వు రంది పడకు తమ్మీ! కృష్ణారామా అనుకుంట శేషజీవితం ఎళ్లదీస్త తమ్మీ! అందరు బాగుండుండ్రి!” అని దండం పెట్టింది సీతక్క. “నా మనసు కొట్టుకున్నప్పుడు వస్తలే తమ్మీ!” అన్నది నెమ్మదిగ దండం పెడుతూ..నరసయ్య గుండె నిండా బాధను నింపుకొనిసిరిసిల్ల దారి పట్టిండు.
డాక్టర్ జనపాల శంకరయ్య
దేశానికి పట్టుగొమ్మలైన పల్లెజీవితాలను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు డాక్టర్ జనపాల శంకరయ్య. ఈయన సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు. ఏడో తరగతిలోనే చదువు కొండెక్కింది. అయినా వృత్తి, వ్యవసాయం చేస్తూనే.. పెళ్లయిన తర్వాత పట్టువదలని విక్రమార్కుడిలా ప్రైవేటుగా ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా 33 ఏళ్లు సేవలందించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. పద్యం, వ్యాసం, నాటిక, వచన కవిత, ఏకపాత్ర, ఒగ్గు కథ, బుర్రకథ, కథ ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. కరీంనగర్ జిల్లా లంబాడాల ఆచార వ్యవహారాలు, తెలుగు లంబాడాల గేయ సాహిత్యం, ఆచార్యదేవోభవ శతకం, మా అవ్వ పాడిన సద్దుల బతుకమ్మ ఉయ్యాల పాటలు, మచ్చలేని మహనీయులు మొదలైన పుస్తకాలను వెలువరించారు. సినారె 64 వసంతాల అంతర్రాష్ట్ర ఇందిరాగాంధీ, కళాలయ విశిష్ఠ సాహిత్య, సిరివెలుగులు, పురిటిగడ్డ, విశేష భాషా ప్రతిభ పురస్కారాలు అందుకున్నారు. నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీల్లో.. నాలుగు సార్లు బహుమతులు గెలుచుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
-డాక్టర్ జనపాల శంకరయ్య
80747 27108