‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
“ఆల్ఫా బీటా గామా డెల్టా..
ఈ జగమంతా ఉల్టా పల్టా” పాడుకుంటూ దేనికోసమో వెతుక్కుంటుందో.. అవ్వ. ఆ పాట స్క్వేర్‌లెగ్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్న చిన్నా మనసుని ఆకర్షించింది. అందుకే ఆవిడ దగ్గరికి వెళ్లి.. “ఉల్టాపల్టా అంటే ఏంటవ్వా?” అని అడిగాడు. చిన్నావైపు చిరునవ్వుతో చూసిందవ్వ. అతని జేబులోంచి పెన్ను తీసుకుంది. దాన్ని తలకిందులుగా పట్టుకుని..“ఇదే ఉల్టా పల్టా” అంది. చిన్నా నవ్వేస్తూ.. “ఓ! అప్ సైడ్ డౌనా?” అన్నాడు.
అంతలోనే బాలొచ్చింది. దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు. బాల్ విసిరేసి మళ్లీ వచ్చి పొజిషన్లో నిలబడ్డాడు. వెనకాల అవ్వ తుప్పల్లో ఏదో వెతుక్కుంటూనే ఉంది. అందుకే ఓవర్ పూర్తవ్వగానే ఆవిడ దగ్గరకెళ్లి..
“ఏం పోయిందవ్వా?” అని అడిగాడు.
“ఏం పోలేదు” “మరి ఏం వెతుకుతున్నావ్?” “పోగొట్టుకోకూడనిది ఏమైనా దొరుకుతుందేమో అని” పోగొట్టుకున్నదాన్ని వెతుక్కోవడం మామూలే. కానీ, ఇలా పోగొట్టుకోకూడని దానికోసం వెతుక్కోవడం గురించి ఎక్కడా వినలేదు. అందుకే అవ్వగారివైపు విచిత్రంగా చూస్తూ తన పొజిషన్లోకి వెళ్లిపోయాడు చిన్నా.ఈసారి బ్యాటర్ కొట్టిన బాల్ నేరుగా తుప్పల్లోకి లేచింది. ఆకాశంలో బంతిని గమనిస్తూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంటే.. కాలికింద గొప్పు తగులుకుని వెల్లకిలా పడ్డాడు చిన్నా. అయినాసరే క్యాచ్ మాత్రం వదల్లేదు. అంత క్రిటికల్ క్యాచ్ పట్టిన ఉత్సాహంలో ఒక్కసారిగా పైకిలేచి “ఔట్!” అంటూ బంతిని బౌలర్ వేపు విసిరాడు. తను కూడా ముందుకు పరిగెత్తబోతుంటే వెనక్కి లాగింది అవ్వ. క్యాచ్ పట్టిన ఆనందంలో చిన్నా గుర్తించలేదుగానీ, తల వెనుకవైపు దెబ్బ తగిలి రక్తం కారుతోంది. దాన్ని అవ్వ గమనించింది. అందుకే తనని ఆపింది. బ్యాగులోంచి కర్చీఫ్ తీసి రక్తం తుడిచింది. పౌడర్ అద్దింది. “చిన్నదెబ్బే! ఏం కాదు” అంటూ ధైర్యం చెప్పింది. ఆ తరువాత నవ్వుతూ.. “బాల్ మిస్సైనా బ్యాలెన్స్ మిస్సవ్వకూడదు” అంది.వెంటనే తను పోగొట్టుకోకూడనిది ఏమిటో అర్థమైనట్లుగా అనిపించింది. అందుకే అవ్వని అబ్బురంగా చూశాడు చిన్నా.
“ఒరేయ్ నన్ను లేపి నిలబెట్టరా”
“ఛానెల్ మారిస్తే పోయేదానికి లేచి నిలబడ్డం ఎందుకు?”
“నేను లేవలేని స్థితిలో ఉన్నానని దాని గౌరవం తగ్గదు కదా?” అంటూ మంచంమీదే చేతులు కూడదీసుకుని అతికష్టం మీద లేచి కూర్చున్నాడు విశ్వం. ఇంక ఆయన వదిలిపెట్టడని కిరణ్‌కి అర్థమైపోయింది. అందుకే మంచం దగ్గరికి వెళ్లాడు. తన చేతుల్ని ఆయన చంకల కిందుగా గుండెలమీదకి పోనిచ్చి, ఆయన భారాన్ని తన గుండెలమీద వేసుకుని పైకిలేపి నిలబెట్టాడు. ఆయన మడమల్ని తన పాదాలమీద మోస్తూ ఒక్కొక్క అడుగే వెనక్కి జారుస్తూ.. అతి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, గోడదాకా వెళ్లి దానికి ఆనుకుని నిలబడ్డాడు కిరణ్.
“చిన్నప్పుడు నేను కూడా నిన్నిలాగే నడిపించేవాణ్ని”
“నీ బరువుకీ, నా చిన్నప్పటి బరువుకీ తేడా లేదా?”
“నేనేం లేదన్నానా?” అంటూ అలాగే నిలబడి టీవీకి శాల్యూట్ చేశాడు విశ్వం.
అందులో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఆటగాళ్లు జాతీయగీతాన్ని ఆలపిస్తున్నారు. అది పూర్తికాగానే విశ్వాన్ని తీసుకెళ్లి మంచమ్మీద కూర్చోబెట్టాడు.
విశ్వం క్రికెట్లో లీనమైపోయాడు. కిరణ్ తనగదిలోకి వెళ్లిపోయాడు.
గదిలో ఏదో మీటింగ్‌కి సంబంధించిన డిస్కషన్లో ఉంది భార్గవి. అందుకే తనేదో చెప్పబోతూంటే మాట్లాడవద్దన్నట్లు చూసింది. దాంతో తను కూడా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని సగంలో ఆపేసిన పని మళ్లీ మొదలుపెట్టాడు.
పవర్ ప్లే పూర్తి కావస్తూండగా తలుపు చప్పుడైంది.
‘వెళ్లి చూడు’ అన్నట్లు సైగచేసింది భార్గవి.
ల్యాప్‌టాప్ పక్కనపెట్టి, వెళ్లి తలుపు తీశాడు కిరణ్. ఎదురుగా చిన్నా కనిపించాడు.
“వీణ్ని ఇంట్లో డ్రాప్ చేసి రమ్మన్నారు” అంటూ చింటూ కోసం చూస్తే, వాడు తన పక్కన కనిపించలేదు. కంగారుగా వెనక్కి తిరిగితే గోడచాటున దాక్కుని బిక్కుబిక్కుమంటూ లోపలికి తొంగి చూస్తున్నాడు.
చింటూ వాలకం చూడగానే విషయం అర్థమైపోయింది. అందుకే..
“అసలేమైందిరా నీకు?” అంటూ తన చెయ్యి పట్టుకుని బరబరా ఈడ్చుకు వచ్చాడు కిరణ్.
తరువాత చిన్నాని పంపించేశాడు. ఆ తరువాత చింటూ భుజానికున్న పుస్తకాల సంచిని తీసి టేబుల్ మీదికి విసిరేశాడు. వాడిని లోపలికి లాక్కువెళ్లి భార్గవి ముందు కుదేశాడు.
“నీకు పిల్లల్ని ఎలా డీల్ చెయ్యాలో తెలీదు” అంటూ చింటూని ప్రేమగా దగ్గరికి తీసుకుంది భార్గవి.
“ఏమైంది నాన్నా! స్కూల్లోంచి మళ్లీ ఎందుకు పంపించేశారు?”
చింటూ సమాధానం చెప్పలేదు. ముఖం ముడుచుకుని బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు.
“ఓపని చేద్దాం. వెళ్లి మొహం కడుక్కొద్దాం. ఫ్రెష్‌గా ఉంటుంది” అంటూ రెస్ట్ రూమ్‌లోకి తీసికెళ్లి, ముఖం కడిగింది భార్గవి. తరువాత ముఖం తుడుస్తూ..
“ఐస్ క్రీం తిందాం పద” అంటూ ఫ్రిజ్ దగ్గరకి తీసికెళ్లింది.
చింటూకి ఇష్టమైన చాకోబార్ ఇచ్చింది. ఫ్రిజ్డోర్ వేయబోతూండగా.. ఐస్ఫ్రూట్ని మళ్లీ ఫ్రిజ్లోనే పెట్టేశాడు చింటూ. తనెంతో ప్రేమగా ఇచ్చినదాన్ని అలా ఫ్రిజ్‌లో పెట్టెయ్యడంతో భార్గవికి కోపం వచ్చింది. అయినా తమాయించుకుంది.
“పెద్దవాళ్లని ఇలా ఇన్సల్ట్ చెయ్యకూడదు” అంటూ చింటూని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెట్టింది.
కాసేపు తనకిష్టమైన క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చుంటే వాడిలో చిరాకు తగ్గుతుందనేది భార్గవి ఉద్దేశం. అంతలోనే ఆమె సెల్‌ఫోన్ రింగైంది. దాంతో వెళ్లి వర్క్‌లో పడి చింటూ విషయం మరచిపోయింది.
ఉన్నట్లుండి విశ్వం గట్టిగా అరిచాడు..
“అబ్బాయ్ నన్ను తీసికెళ్లరా”
లోపలినించే విసురుగా సమాధానమిచ్చాడు కిరణ్..
“అప్పుడేనా? ఇంకా అరగంట కూడా కాలేదు”
మరింత విసురుగా ప్రశ్నించాడు విశ్వం..
“అదేం అలారమా! కీ ఇచ్చిన టైముకే
మోగడానికి?”
“సర్లే! ఇంపార్టెంట్ మెసేజుంది. పెట్టేసొస్తాను”
“అప్పటిదాకా ఆగితే కదరా?” అంటూ లేవడానికి ప్రయత్నిస్తుంటే.. చింటూ వెళ్లి సాయం చేశాడు.
మంచం చివరిదాకా దేకిన విశ్వానికి చెయ్యి పట్టు తప్పింది. ఆయన కింద పడబోతుంటే చింటూ తన బలమంతా ప్రయోగించి ఆయన్ని వెనక్కి తోశాడు.
“మా బంగారు తండ్రే! నువ్వు లేకపోతే కిందపడి చచ్చేవాణ్ని” అంటూండగా, టైపు చేస్తున్న మెసేజ్ పక్కన పడేసి పరిగెత్తుకొచ్చాడు కిరణ్. విశ్వాన్ని పైకి లేపుతూ గట్టిగా అరిచాడు..
“నీ చాదస్తం నీదేగానీ ఎవరు చెప్పినా వినవా?”
“ఊరికే అరవకు. నా పరిస్థితే నీకొస్తే అప్పుడర్థమౌతుంది”
“నేన్నీలాగా గోటితో పోయేదానికి గొడ్డలిదాకా లాగను” అంటూ విశ్వాన్ని లాక్కుపోయాడు.
ఇదంతా మామూలే అన్నట్లుగా టీవీ ఆపేసి తిన్నగా వెళ్లి పుస్తకం తీసుకుని.. ఎవరికీ కనిపించకుండా బీరువా వెనకాల కూర్చున్నాడు చింటూ. పెద్దవాళ్ల ఆరాలూ ఆరాటాలూ ఆర్భాటాలూ హితబోధలపోరు పడలేకే పుస్తకం పట్టుకున్నాడుగానీ.. అతని దృష్టి తనమీద లేదని ఆ పుస్తకానికి బాగా తెలుసు.
అంతలోనే విశ్వాన్ని తీసుకొచ్చి మళ్లీ మంచం మీద కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి, గదిలోకొచ్చాడు కిరణ్.
తాతగారిని కిందపడకుండా కాపాడినందుకు అభినందించాలో.. ఆయనకిష్టమైన మ్యాచ్‌ని ఆపేసినందుకు గదమాయించాలో.. తనకి ఏమైందో.. ఎందుకంత డల్‌గా తయారయ్యాడో.. ఎంతడిగినా చెప్పనందుకు చెంపలు పగలగొట్టాలో అర్థం కాలేదు. అందుకే చింటూ కోసం ఓసారి చుట్టూ కలియజూశాడు కిరణ్. తనెక్కడా కనిపించలేదు. దాంతో ధైర్యం చేసి లోగొంతుకలో అన్నాడు..
“వీడినోసారి సైకాలజిస్టుకి చూపిస్తే బెటరేమో!”
కొడుకుని అంత మాటనగానే భార్గవికి చిర్రెత్తుకొచ్చింది. అందుకే..
“చూపించాల్సింది నా కొడుకుని కాదు. మీ నాన్నగారిని” అంటూ తను కూడా లోగొంతుకలోనే సమాధానమిచ్చింది.
అంతలోనే బీరువా వెనకనించీ వినిపించింది చింటూ గొంతు..
“చూపించాల్సింది మమ్మల్ని కాదు.. మిమ్మల్ని”
అవ్వ వెతుక్కుంటూనే ఉంది. అందుకే కుతూహలం కొద్దీ అడిగాడు చిన్నా..
“ఏం అవ్వా! ఏమైనా దొరికిందా?”
“దొరికింది” అంటూ తుప్పల్లో ముడుచుకుపోయిన మొక్కని చూపిస్తూ చెప్పింది.
“ఇది అంజనాకు మొక్క. ఇప్పుడు ముడుచుకుపోయింది గానీ, రాత్రిపూట పసుపురంగులో దీపంలా మెరుస్తుంది. పౌర్ణమిరోజున దీని ఆకుల్ని కోసి ఎండబెట్టి పొడుంకొట్టి.. దాన్ని ఆముదంలో రంగరించి రాస్తే గాయాలూ, పుండ్లూ, చర్మరోగాలూ అన్నీ తగ్గిపోతాయి. ఒకప్పుడు ఇది అన్నిచోట్లా పెరిగేది. కానీ దీని విలువ తెలియక కలుపు మొక్కలనుకుని పీకి పారేసేవాళ్లు. అందుకే అంతరించి పోయాయి. అద్భుతమైన ఔషధ విలువలున్న అంజనాకు మొక్క ఇక్కడికి ఎలా వచ్చిందో చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఇంకైనా మనం ఇలాంటివాటిని పోగొట్టుకోకూడదు”
“వావ్.. మీరు వెతికేది దీనికోసమేనా?”
“ఇదిక్కడ దొరుకుతుందని నాకేం తెలుసు? మన పని వెతకడం వరకే”
“ఇదొక్కటేనా? ఇంకేమైనా దొరికిందా?”
“దొరికింది. కానీ, అదేమిటో చెప్పను. రేపు మీ స్కూలుకి తెస్తాను” అంటూ అతని తలవెనుక
తడిమింది. గాయం మానలేదు. వదిలేస్తే పెద్ద పుండైపోయేలా ఉంది. చిన్నా భుజం తడుతూ
అడిగింది..
“దెబ్బ తగిలిన విషయం మీ ఇంట్లో చెప్పలేదా?”
“లేదు. చెబితే ఆడుకోవడానికి పంపరు”
అవ్వ నవ్వింది. తరువాత అంజనాకుని బండమీద మెత్తగా నూరింది. చిన్నా జుట్టుని విడదీసి గాయం మీద పట్టులా వేసింది.
ముందురోజు చెప్పినట్లే ఇంటర్వెల్ టైముకి స్కూలు దగ్గరకొచ్చింది అవ్వ. తన దగ్గరున్న పాత కార్క్బాల్ చూపించి, దాన్ని పోగొట్టుకున్న కుర్రాణ్ని పిలవమంది. వెంటనే వెళ్లి చింటూని పిలుచుకొచ్చాడు చిన్నా. కార్క్బాల్ చూపించింది అవ్వ. దాన్ని చూడగానే చింటూ కళ్లు మిలమిలా మెరిశాయి. అంతవరకూ నిస్తేజంగా ఉన్న ఆ కళ్లలోకి ఒక్కసారిగా చైతన్యం ప్రవేశించింది. అవ్వచేతిలోంచి బంతిని లాగేసుకున్నాడు. దాన్నే సంభ్రమంగా చూస్తూ ఎంతో భక్తిగా కళ్లకద్దుకున్నాడు. మరెంతో ఆర్తిగా ముద్దు పెట్టుకున్నాడు.
“థాంక్స్ అవ్వా థాంక్స్! దిసీజ్ మై గ్రానీ.. దిసీజ్ మై హార్ట్..” అంటూ ఆత్మీయంగా బంతిని తడుముకుంటున్నాడు. పోయిన ప్రాణాలన్నీ ఆ బంతిలోంచీ తనలోకి ప్రవహిస్తున్నట్లు చింటూ ముఖం క్రమంగా తేజోవంతమౌతోంది. ఆ తేజాన్ని చూస్తున్న చిన్నాకి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అందుకే అవ్వవైపు సంభ్రమంగా చూస్తూ అడిగాడు..
“నీకు వాడి గురించీ, వాళ్ల గ్రానీ గురించీ ముందే తెలుసా?”
అవ్వ మురిపెంగా అతని జుట్టులోకి వేళ్లు జొనిపి ప్రేమగా తడుముతూ చెప్పడం ఆరంభించింది.
“తెలీదు. కానీ ఆ బంతి తుప్పల్లో పడినప్పుడు వాడు పడిన బాధనిచూసి అర్థం చేసుకున్నాను. వాడు పోగొట్టుకోకూడనిదేదో ఆ బంతిలో ఉంది. అందుకే మీరు వెళ్లిపోయినా తను చాలాసేపు తుప్పల్లో వెతికాడు. కానీ దొరకలేదు. దాంతో నిరాశగా ఏడుస్తూ వెళ్లిపోయాడు. అప్పట్నించి ఆ బాల్ కోసం వెతకడం మొదలుపెట్టాను. చివరికి బురదగుంటలో దొరికింది”..
అవ్వ చెప్పడం పూర్తికాగానే ఆవిడ చెయ్యి పట్టుకుని..
“మీ అంజనాకు దెబ్బకి నా దెబ్బ ఎప్పుడో మాయమైపోయింది” అంటూంటే అవ్వ నవ్వేసింది.
“నువ్వు చెప్పినట్లు చింటు గాడినోసారి సైకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లడమే బెటరనిపిస్తోంది”
“ఓ వారం పదిరోజులు చూద్దాం. అప్పటికీ బెటర్మెంట్ లేకపోతే ఆపనే చేద్దాం” అంటూ ల్యాప్‌టాప్‌లోకి తలదూర్చాడు కిరణ్.
అంతలోనే బయటి నుండి తండ్రి పిలుపు వినిపించింది..
“అబ్బాయ్! నన్నోసారి తీసికెళ్లరా”
ఆ వెంటనే.. “ఎస్సార్” అంటూ అటెండెంట్ సమాధానం వినిపించింది.
భార్గవి నవ్వుతూ..
“ట్రైన్డ్ పర్సన్స్ చేసినట్లు చెయ్యడం మనవల్ల కాదు. అందుకే తను అడిగినప్పుడల్లా సెలవులివ్వకు. ఇస్తే నీకే కష్టం” అంటూ కిరణ్ వైపు చూసి నవ్వింది. అతను కూడా నవ్వుతూ తలూపుతూండగానే ఇంట్లోకి పరిగెత్తుకొచ్చాడు చింటూ.
చాలాకాలం తర్వాత అంత ఉత్సాహంగా పరిగెత్తుకొస్తున్న మనవణ్ని చూసి ఎంతో సంతోషపడ్డాడు విశ్వం. చింటూ వచ్చీరాగానే మంచం ఎక్కి ప్రోగ్రెస్ రిపోర్టు చూపించాడు. ఆ రిపోర్టుని పక్కన పడేసి తన బుగ్గని చూపిస్తూ..
“నాక్కావలసింది రిపోర్టు కాదు” అన్నాడు విశ్వం. వెంటనే ఆయన బుగ్గపై ముద్దు పెట్టి..
“దీనికంటే ఇంపార్టెంట్ ఏంటో చెప్పుకో చూద్దాం” అన్నాడు చింటూ.
ఏ తాతకైనా మనవడి ముద్దుకంటే ఇంపార్టెంట్ ఏమై ఉంటుందబ్బా!? అనే ఆలోచనలో పడిపోయాడు విశ్వం.
మామూలుగా అయితే తాతయ్యని మరింతగా ఊరించేవాడే. కానీ, బాలోత్సాహాన్ని అదుపు చేసుకోలేక, అవ్వగారిచ్చిన బాల్ తీసి విశ్వం చేతిలో పెట్టాడు. దాంతో ఆయన చింటూ బుగ్గమీద ముద్దుపెట్టుకోవడం మానేసి బంతిని తనివితీరా ముద్దాడాక మెల్లగా చెప్పడం మొదలు పెట్టాడు.
“నేను పెద్ద క్రికెటర్ అవ్వాలనేది మీ బామ్మ కల. కానీ, తీరలేదు. ఇంక మీ నాన్నేమో క్రికెట్లో గోల్డెన్ డక్. అయినా మీ బామ్మ ఆశ అలాగే మిగిలిపోయింది. ఇది వాడికోసం కొన్న బాలే! తర్వాత నీకిచ్చి వెళ్లిపోయింది. ఆ బంతి పోయినప్పటినించే నువ్విలా తయారయ్యావు. ఆ విషయం మీ అమ్మా నాన్నలకి అర్థమైతే కదా?”
చివరి మాట చెవినపడగానే లోపలినించే గట్టిగా సమాధానమిచ్చాడు కిరణ్..
“అర్థం కాకుండానే ఆస్ట్రేలియానించీ అంత కాస్ట్లీ స్మార్ట్ బాల్ తెప్పిస్తానా?”
సరిగ్గా అదే సమయంలో అవ్వని తీసుకుని లోపలకి వచ్చాడు చిన్నా.
వచ్చీరాగానే కిరణ్ మాటలు అవ్వ చెవిలో పడ్డాయి. వెంటనే సమాధానమిచ్చింది..
“కరెక్ట్! మనం కాస్ట్లీ స్మార్ట్ బాల్స్ కొనివ్వగలం. కానీ కార్క్బాల్లోని బామ్మ ఆత్మీయతని కొనివ్వలేం. మనం కొనలేనివాటిని మనలోనే పెంచుకోవాలి. లేకపోతే ఇతరుల్లోని ప్రేమాభిమానాలను గుర్తించే ఆత్మని పోగొట్టుకుంటాం”
అప్పటికే బయటికి వచ్చిన భార్గవి తన భర్త కార్నర్ అవుతూండటాన్ని గ్రహించింది. అందుకే అడక్కపోయినా సమాధానమిచ్చింది.
“ఆత్మీయతల్నీ, ప్రేమాభిమానాల్నీ పెంచుకోవడానికి పరిస్థితులు అనుకూలించాలి కదా? అటు ఉద్యోగాలు చేసుకోలేకా, ఇటు చాదస్తాల్ని భరించలేకా మేమెంత నలిగిపోతున్నామో మీకెలా తెలుస్తుంది?”
కోడలు మాట్లాడుతున్నది తన గురించే అని విశ్వానికి అర్థమైంది. అందుకే..
“మా క్రమశిక్షణా, శుచీ శుభ్రతలు మీకు చాదస్తాల్లాగే కనిపిస్తాయి” అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలో అడ్డుతగిలాడు కిరణ్.
“అబ్బా! ఇప్పుడవన్నీ అవసరమా?” అని భార్గవిని మందలించి అవ్వ వైపు తిరిగాడు.
“మేడమ్! మా అమ్మానాన్నా పార్వతీ పరమేశ్వరుల్లా ఉండేవారు. అమ్మకి హఠాత్తుగా హార్ట్ ఎటాకొచ్చి వెళ్లిపోయింది. ఆ షాక్‌తో నాన్నగారికి కాళ్లూ చేతులూ పట్టుతప్పాయి. అమ్మకి క్లీన్లీనెస్ అంటే ప్రాణం. నాన్నకి అమ్మంటే ప్రాణం. అందుకే అన్నీ క్లీన్‌గా ఉండాలంటారు. డాక్టర్లు డైపర్ వేసుకోమని చెప్పినా వినరు. పదేపదే రెస్ట్ రూముకి తీసికెళ్లమంటారు. మీ మాట కూడా నిజమే! మా గొడవల్లో పడి చింటూ మీద తగినంత శ్రద్ధ చూపించ లేకపోతున్నాం”
చివరికి అంతా తనమీదికి వచ్చేసరికి గట్టిగా అరిచాడు విశ్వం.
“సెన్సేషన్ ఉంటుంది గానీ రాదు. అందుకు నన్నేం చెయ్యమంటావ్?”
ఆయన అంత గట్టిగా అరవడంతో ఏం మాట్లాడాలో ఎవరికీ పాలుపోలేదు.
హఠాత్తుగా ఆ గదిని నిశ్శబ్దం.. దాని చుట్టూ ఒక విధమైన గుబులూ అలుముకున్నాయి.
చివరికి అవ్వే ముందుగా తేరుకుంది. సూటిగా విశ్వం కళ్లలోకి చూసింది. ఆ చూపుల్ని తట్టుకోలేక తప్పుచేసిన వాడిలా తల దించుకున్నాడు విశ్వం.
అవ్వ మంద్రస్వరంతో అనునయిస్తున్నట్లుగా చెప్పడం ఆరంభించింది.
“మీకు సెన్సేషనుంది. అంతకంటే ఎక్కువగా పక్క తడుస్తుందేమో అనే భయం ఉంది. నాకు కనీసం ఆ సెన్సేషన్ కూడా ఉండదు. నాకు తెలియకుండానే పక్క తడిసిపోతుంది. అలాగని నేను లైఫ్‌లాంగ్ ఆ రెస్ట్ రూంలోనే అరెస్టయి ఉండలేను కదా. అందుకే డైపర్ అలవాటు చేసుకున్నాను” అంటూ తన బ్యాగులోంచి స్పేర్ డైపర్ తీసింది. అటెండెంట్ సహాయంతో విశ్వానికి వేసింది. తర్వాత చిరునవ్వుతో జనాంతికంగా అంది.
“మనం పోగొట్టుకోకూడనిది ప్రేమ. దాన్ని ఉన్నవాళ్లలోనే వెతుక్కోవాలి-లేనివాళ్లలో కాదు” అంటుంటే అక్కడున్న అందరికీ ఆవిడ మాటలు అమృత వాక్కుల్లా వినిపించాయి. ఎంతో అద్భుతమైన జీవిత సత్యాన్ని అంత అలవోకగా ఆవిష్కరించిన అవ్వగారివైపు అబ్బురంగా చూస్తూ..
“మీరెవరోగానీ సమయానికి దేవతలా వచ్చారు. కొండంత సమస్యని గోటితో గిల్లిపారేశారు. ఇంతకీ మీ పేరేంటి అవ్వగారూ?” అత్మీయంగా అడిగింది భార్గవి
అవ్వకంటే ముందే ఆనందాతిశయాలతో కాలరెగరేస్తూ చెప్పాడు చిన్నా..
“అంజనవ్వ”
ఆ అడ్డపేరు వినగానే అందరి ముఖాల్లో సంభ్రమం చిరునవ్వులై వెల్లివిరిసింది.
మనం పోగొట్టుకోకూడనిది ప్రేమ. దాన్ని ఉన్నవాళ్లలోనే వెతుక్కోవాలి-లేనివాళ్లలో కాదు” అని అవ్వ అంటుంటే.. అక్కడున్న అందరికీ ఆవిడ మాటలు అమృత వాక్కుల్లా వినిపించాయి. ఎంతో అద్భుతమైన జీవిత సత్యాన్ని అంత అలవోకగాఆవిష్కరించిన అవ్వగారివైపు అబ్బురంగా చూశారు.
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
మనిషి ఎన్నటికీ పోగొట్టుకోకూడనిది.. ప్రేమ. దాన్ని ఉన్నవాళ్లలోనే వెతుక్కోవాలి.. లేనివాళ్లలో కాదని చెబుతుంది ‘అంజనాకు’ కథ. రచయిత జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి. ఈయన స్వస్థలం భీమవరం. హిందీ, కన్నడ భాషల నుంచి టీవీ సీరియళ్లను తెలుగులోకి అందిస్తుంటారు. ఇప్పటివరకూ వందకుపైగా కథలు రాశారు. ‘అంతర్యామి’, ‘సాక్షాత్కారం’ నవలలు; ‘ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్’, ‘ఈ కథకి శిల్పం లేదు’, ‘నూటొకటో మార్కు’, ‘తెలకోవెల’ కథాసంపుటాలను వెలువరించారు. విశ్వర్షి వాసిలి వసంతకుమార్ యౌగిక కావ్యం ‘నేను’, బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా ‘విజ్ఞానజ్యోతి’ మొదలైన గ్రంథాలను కన్నడ భాషలోకి అనువదించారు. కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం పొందిన నవలని ‘భలేతాత మన బాపూజీ’ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తొలి నవలల పోటీలో ‘వలసదేవర’ నవలకి మొదటి బహుమతి పొందారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ భాషాసాంస్కృతిక శాఖ నిర్వహించిన నవలల పోటీలో.. ‘జంగమదేవర’కు బహుమతి అందుకున్నారు. అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్, తెల్సా, నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం, కౌముది, రచన, ఆంధ్రప్రభ, స్వాతి, మొదలైన పత్రికలు, సంస్థల నుంచి వివిధ సందర్భాలలో బహుమతులు పొందారు.
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
99488 96984