(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)
జరిగిన కథ
దొంగల దాడితో కుప్పకూలి పోతాడు పోటిసుడు. భర్త ఆలోచనలతో, మధుర స్మృతులతో కాలం గడుపుమని అక్కకు సలహా ఇస్తుంది సీహ. తర్వాత…
ప్రణాళునికి కొద్దికొద్దిగా స్వస్థత చేకూరుతున్నది. మాధవుని పరిచర్యలతో అతనిలో మానసిక పరివర్తన కూడా కలుగుతున్నది. కానీ, మనసు అంత మంచిది కాదు. ఎంత మధురమైన పదార్థాలను అందించినా.. మదిరకు అలవాటుపడ్డ జిహ్వలా తనకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే విషయాల్లోనే గడపాలనుకుంటుంది. అయినా తథాగతుని శిష్యులు సామాన్యులు కారు. పొగరుబోతు కోడె దూడను లొంగదీసుకునే ఒడుపును ఎరిగిన రైతుల్లాగా మనసును మచ్చిక చేసుకుని మంచి దారిలో పెట్టగలిగే నేర్పును నేర్చినవాళ్లు. అంత తేలికగా దాన్ని చెడిపోనిస్తారా!?పాడుబడిన నూతిలో నుండి కాపాడిన క్షణం నుంచి ప్రణాళుణ్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు మాధవుడు.
ఆడవాళ్లు స్నానాలు చేస్తున్నప్పుడు సిగ్గు విడిచి, గుడ్లప్పగించి చూస్తూ దొరికిపోయి.. చావు దెబ్బలు తిని, ఆపై రాజు గారి సభలో అవమానానికి, దేశ బహిష్కరణకూ గురయ్యాడు ప్రణాళుడు. ఇక జీవించడమే అనవసరమని మరణం శరణుజొచ్చిన వాడిని మాధవుడు కాపాడి, కొత్త జీవితాన్ని ఇవ్వడం కోసం శతధా ప్రయత్నిస్తున్నాడు. విచిత్రం ఏమంటే ఎవరి అందాలను చూస్తూ ఇంతటి తీవ్ర విపత్తును కొనితెచ్చుకున్నాడో.. ఆ రోహా సోదరీమణులే అతణ్ని బావిలో నుండి బయటకు తీసినారు. అతడు తనను చూసిన సంగతి రోహకు తెలియదు; ఆమె తనను కాపాడిందని ప్రణాళునికి తెలియదు. వానిది ములక రాజ్యమేనని, దేశ బహిష్కరణకు గురై.. తమ అత్తగారి రాజ్యమైన అశ్మకానికే అతను చేరుకున్నాడని ఆమెకు అస్సలు తెలియదు. ఈ విషయమేదీ మాధవునికి తెలియదు.
అతని లక్ష్యం… గాయపడి ఉన్న ప్రణాళుని మనసుకు, శరీరానికి మేలు చేసి అతణ్ని సవ్యమైన మార్గంలో నడిపించడం మాత్రమే!
పరగ దుమ్ములోన పంకమ్ము లోననుమలిన దేహ యైన మదగజమ్ము గడ్డి తినిన నేమి ఘనతను వీడదు మంచి వాని లోని మనసు పగిది. (దుమ్ములో స్నానం చేసినా, బురదలో దొర్లాడినా, గడ్డి తిన్నా సరే ఏనుగు గొప్పతనం తగ్గనట్లే.. మంచివాని మనసు కూడా ఉన్నతంగానే ఉంటుంది)ప్రణాళునికి ఈ విధంగా హితబోధ చేసినాడు మాధవుడు…
“ప్రణాళా! మనసును అదుపులో పెట్టుకోలేని వాళ్లు కోరికల నూలు దారాలతో ఆకాశానికి ఎగబాకే వెర్రి ప్రయత్నం చేస్తూ, నిరంతరం దుఃఖిస్తూ, సంసార జలధిలో కొట్టుమిట్టాడుతుంటారు. తాము చేసే తప్పులను దైవానికి అంటగట్టి, కర్మఫలమని, విధి లిఖితమని లేని దైవాన్ని నిందిస్తూ, తమను తాము సమర్థించుకుంటారు. ఉన్న లోకం లేదని భ్రమ పడుతూ, జగం మిథ్య! అహం మిథ్య! అంటూ వెర్రి వేదాంతాలను ఒలకబోస్తూ గడుపుతారు. అజ్ఞానాంధకారంలో విహరిస్తూ, లోకాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. గౌతమ బుద్ధుని బోధనలను కూడా వక్రీకరిస్తున్నారు కొందరు. అతణ్ని దేవుడని, విష్ణువు అవతారమనీ కట్టుకథలు
అల్లుతున్నారు…”
“అంటే… బుద్ధుడు దేవుడు కాదా? బుద్ధ భగవానుడు అంటారు కదా!” మాధవుణ్ని అడ్డుకుంటూ అడిగినాడు ప్రణాళుడు.
“అవును! ఆయన దేవుడు కాదు! తనను దేవుడని పిలవకూడదు అన్నాడు. మనో మాలిన్యాలను త్యజించి, కోరికలను క్రమశిక్షణలో ఉంచి, నిస్వార్థంతో, ప్రేమతో జీవించడమే మానవ జీవితం ఆనందమయం చేసుకోవడానికి మార్గమని ఉపదేశించిన మహనీయ మానవుడు ఆయన”ప్రణాళుడు ఆలోచనలో పడ్డాడు.
“మరి ఈ సృష్టి… భగవంతుడు…”
“మనిషిలోని భయం, ఆశ, ఊహ భగవంతుని కల్పనకు హేతువులు. తనకు అసాధ్యమైనవి ప్రకృతిలో తారసపడినప్పుడు వాటికి దేవుడని పేరు పెట్టుకున్నాడు. తన కల్పనా శక్తితో రూపాలను సృజించుకున్నాడు. తాను నమ్మిందే నిజమని పలువురిని నమ్మించడానికి సిద్ధాంతాలను, కథలను, పురాణాలను, వేదాలను తయారు చేసినాడు. తన ఆధిక్యతను నిలబెట్టుకునేందుకు బలవంతులను ఆశ్రయించి, బలహీనులను మరింత బలహీనపరిచి, నమ్మకాల భ్రమలో ముంచి, ఇష్టారాజ్యంగా బతుకుతున్నాడు.
యజ్ఞమని, యాగమని, జపతపాలని, పశుబలులను, నరబలులను చేయడానికీ వెనుకాడటం లేదు. తాను భ్రమలో జీవిస్తూ లోకాన్ని భ్రమలో ముంచి, నిజమైన ఆనందాన్ని సాధారణ మానవులకు దక్కకుండా చేస్తున్నాడు. కట్టుకథలు అల్లి, తానే
దైవాన్నని, దైవ స్వరూపుడనని, దైవానికి ప్రతినిధినని ప్రజలను తప్పుదారిలో నడిపిస్తూ, భయపెడుతూ ఆ భయాన్ని తొలగించే దివ్యశక్తులు తనకు ఉన్నాయంటూ నాటకాలు ఆడుతున్నాడు. మహాత్మా బుద్ధునిలా ఎవరైనా నిజం నిరూపించుమని అడిగినప్పుడు తమ నిజస్వరూపం బయటపడుతుందని రక్తపాతానికి సైతం తెగబడుతున్నాడు…”
ప్రణాళునికి అంతా అయోమయంగా ఉన్నది. మాధవుడు చెప్పే మాటలు పూర్తిగా నిజమనిపించడం లేదు. అట్లాగని కొట్టిపారేయడానికి వీలు లేనట్లు ఉన్నాయి.
“మరి రాముడు, కృష్ణుడు దైవాలు కాదా?”అని అడిగినాడు ఒక నిశ్చితాభిప్రాయం కలుగుతుందని.
“కాదు! తాము దైవాలమని, దైవ స్వరూపాలమని, అవతార పురుషులమని వాళ్లు ఎన్నడూ చెప్పుకోలేదు. మానవ మాత్రులై తమ బుద్ధిబలంతో, వీర్యంతో అసాధ్యాలను సుసాధ్యాలు చేసి చూపినారు. ఆ విషయాలను కథలుగా మలచి, వాళ్లను దైవాలుగా మలచిన వాళ్లు మానవులే. బుద్ధుడిని కూడా దైవమని, అవతారమని, భగవానుడని ప్రచారం చేస్తున్నారు. అధిక సంఖ్యాకులైన మూఢమతులను అల్పసంఖ్యాకులు నమ్మకాల నిచ్చెనలకు వేలాడదీసి కాలం గడుపుతున్నారు. ఈ అల్ప సంఖ్యాకులే ఉన్నత వర్గీయులు…”
“బుద్ధుడు కూడా ఉన్నత వర్గానికి చెందిన వాడే కదా! అతడు రాజు కదా!” మళ్లీ అడ్డుకున్నాడు
ప్రణాళుడు.
“అవును! చిప్పలో నుండి పుట్టిందని ముత్యాన్ని చిప్ప అనలేము కదా! క్షత్రియ వంశ సంజాతుడైన బుద్ధుడు మానవ జీవితంలోని దుఃఖాన్ని చూసి, చలించి, దాని నివారణోపాయాలను కనుగొని, మానవజాతికి అందించినాడు. దేశ విదేశాలను శాంతి
ఆయుధంతో జయించినాడు”
“మరి మనుషులందరూ బుద్ధుని బోధనలను ఎందుకు అనుసరించడం లేదు స్వామీ?” ఏదో అనుమానం మనసు మూలలో పీకుతుండగా ప్రశ్నించినాడు ప్రణాళుడు.
“జ్ఞానం రుచి లేనిది, స్వచ్ఛమైనది. కానీ, అంత తేలికగా లభించేది కాదు. అజ్ఞానం వివిధ ఆకారాలతో, ఆకర్షణలతో, వన్నె చిన్నెలతో, రుచులతో అలరించి లోబరుచుకొని ఆనందాన్నిస్తున్న భ్రమ కలిగిస్తుంది. దాని ఉచ్చులో నుండి బయటపడటం సామాన్యులకు అసాధ్యం! ఆ భ్రమనే నిజమైన జీవితంగా భావించి, కష్టాలను పరమేశ్వరునికి అనాయాసంగా అంటగట్టి, అశాశ్వతమైన సుఖాలలో మునిగితేలుతూ, దిక్కుతోచని పరిస్థితులను కల్పించుకొని, వాటిని నివారించే దిక్కు భగవంతుడని సంసార మొహాంబుధిలో కొట్టుకుంటున్నాడు. అదే ఆనందం అనుకొని, దేవుడు లేడనే ధైర్యం చేయలేక, భయాలతో, అపనమ్మకాలతో, పాపాలతో, తాపాలతో, కోపాలతో జీవితాన్ని అనుభవించడానికి అలవాటు పడ్డారు. బుద్ధుని జ్ఞానాన్ని, జ్ఞాన బోధను అర్థం చేసుకోవడానికి ఎంతో శ్రద్ధ, మరెంతో ఏకాగ్రత, అంతకుమించిన క్రమశిక్షణ అవసరం” దృఢంగా అన్నాడు మాధవుడు .
నెమ్మదిగా అపస్మారక స్థితిలోకి పోతున్న అతణ్ని మామూలు మనిషిని చేయడానికి వెంటనే నీళ్ల కోసం చూసినాడు. మిగతా ముగ్గురు వనితలు పరిసరాల్లో ఏదైనా కాలువ ఉందేమోనని వెతుకసాగినారు. అప్పుడు రాయహత్థికి ఒక ఆలోచన కలిగింది. ఒక మోదుగాకు తీసుకొని అందులో తన చనుబాలు పిండింది. రాయవగ్గు తన భార్యని ఆరాధనతో చూసినాడు.
“స్త్రీ పురుషుల మధ్య ప్రేమ…”
“అది ఆకర్షణ. మోహం. ఇతర పశుపక్ష్యాదుల్లోనూ అది ఉంటుంది. మనిషి ఏర్పరచుకున్న సమాజం, కట్టుబాట్లు, అసమానతల వల్ల స్వేచ్ఛగా కోరికలు తీర్చుకోలేకపోతున్నారు. నిర్బంధ జీవనం వల్ల కోరికల ఉధృతి పెరిగి, ఆశలు అవసరాలై, స్వార్థం తీరని దాహమై, మానవ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. దీనివల్లనే వర్గపోరు, ఆస్తుల ఆరాటం, కోరికల కోసం వెంపర్లాడటం విజృంభిస్తూ ఉన్నాయి…”
అట్లా బుద్ధుని మార్గాన్ని గురించి ప్రణాళునికి
సాధారణమైన మానవానుభవాల ఆధారంగా బోధిస్తున్నాడు మాధవుడు. అతని మాటలు ఆసక్తిజనకంగా ఉన్నాయి కానీ ఎన్నో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి ప్రణాళునిలో…
దొంగల్ని వెంటాడిన వీరుని పేరు రాయవగ్గు. అతని భార్య రాయహత్థి. దొంగల దాడిలో గాయపడిన పోటిసుని పరిస్థితి వాళ్లని తీవ్రంగా కలచివేసింది.
లేవలేకుండా పడి ఉన్న పోటిసుని వీపు నుండి ఒడుపుగా కత్తిని తీసి, తన తలపాగా చించి, కట్టు కట్టినాడు రాయవగ్గు.
నెమ్మదిగా అపస్మారక స్థితిలోకి పోతున్న అతణ్ని మామూలు మనిషిని చేయడానికి వెంటనే నీళ్ల కోసం చూసినాడు. మిగతా ముగ్గురు వనితలు పరిసరాల్లో ఏదైనా కాలువ ఉందేమోనని వెతుకసాగినారు. అప్పుడు రాయహత్థికి మెరుపు వంటి ఒక ఆలోచన కలిగింది. ఒక మోదుగాకు తీసుకొని అందులో తన చనుబాలు పిండింది. అది చూసి రాయవగ్గు ఆరాధనతో భార్యని చూసినాడు.
ఆమె పోటిసుని నోట్లో కొంచెం కొంచెంగా ఆ పాలు పోయసాగింది. అతనిలో నెమ్మదిగా కదలిక వచ్చింది. అంతలో మిగతా ముగ్గురు ఆడవాళ్లు దొప్పలలో నీళ్లు తీసుకొని వచ్చినారు.
మొఖం మీద నీళ్లు చల్లగానే మెల్లగా కళ్లు తెరిచినాడు పోటిసుడు. కానీ, మాట్లాడలేకపోతున్నాడు.
“తమ్ముడూ! లే! నీకేం కాలేదు. నీవు మహావీరుడవు. తగిలిన దెబ్బ సామాన్యమైనదే. రక్తం కూడా ఎక్కువగా పోలేదు, లే!” రాయవగ్గుని గొంతులో ఆర్ద్రత,
ఆత్మీయత కలగలిసినాయి.
రాయహత్థి మనసులో ఆ యువకుని పట్ల అంతకంతకూ అభిమానం పెరిగిపోసాగింది.
‘భర్త అయితే తనను కాపాడటానికి ప్రాణాలకు తెగించి దొంగలను వెంబడించినాడు సరే, మరి ఈ పిల్లగానికి మాకు ఏం సంబంధం? ఎందుకు మా కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు?’ అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచించ సాగింది.
“అమ్మా…..” బాధగా మూలిగినాడు పోటిసుడు.
అందరి ముఖాల్లోనూ కాంతి నిండింది.
“నాయనా! లే! మహావీరా! లే!” రాయవగ్గు ప్రేమ నిండిన గొంతుతో మందలించినాడు.
రాయహత్థి పోటిసుని అరికాళ్లు రుద్దసాగింది.
మిగతా ముగ్గురు వనితల్లో ఒకరైన చంద్రహత్థి కూడా రాయహత్థిని అనుసరిస్తూ అతని అరచేతిని తన చేతులతో రుద్దబోయి ఉలిక్కిపడింది.
చంద్రహత్థి పదిహేనేండ్ల పడుచు. వయసు వచ్చిన తర్వాత పరపురుష స్పర్శ అదే తొలిసారి. ఏదో విద్యుత్తు ఆమెలో ఒక్కసారిగా ప్రవహించినట్లు అయింది. మొదటి చూపులోనే అతని పట్ల ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ప్రతిక్షణం అతణ్ని చూస్తూ ఉండాలనిపిస్తున్నది. ఇప్పుడు ఈ స్పర్శ ఆమెను తెలియని లోకాల్లో విహరింపజేస్తున్నది.
కొంత ప్రయత్నం తర్వాత పోటిసుడు స్పృహలోకి వచ్చినాడు. కానీ, అతడు ఎవరో? ఎక్కడికి పోతున్నాడో చెప్పలేకపోతున్నాడు.
ఎక్కువసేపు అక్కడ ఉండటం మంచిది కాదని రాయవగ్గు పోటిసుణ్ని గుర్రం మీద ముందు పడుకోబెట్టి, తాను ఎక్కి, వెనుక భార్యను కూర్చోబెట్టుకున్నాడు. మిగతా ముగ్గురు మరో గుర్రం మీద అతణ్ని అనుసరించినారు.
ఇంటికి చేర్చిన పోటిసుణ్ని కాచుకొని కూర్చున్న రాయహత్థి ఒక్కసారిగా ఉలిక్కిపడింది…
(సశేషం)
దోరవేటి
89788 71961