‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
తలకు ఇంతెత్తు రుమాలు. మీదికి మలిచికట్టిన కుప్పన పంచు ధోతీ.. రుమాట్లో మొక్కి చుట్ట.. భుజంమీద గొంగడి తప్ప అంగీ లేక సాగబారిన శరీరం.. కుడిచేతికి బోలు కడియం.. నడుముకు తోలు సంచి.. అందులో చెకుముకి రాయి, దూది.. బుర్రమీసాలు.. బైరి గడ్డం.. చేతిలో కట్టె! వాకిట్ల నిల్సున్నడు ఓ నడి వయసాయన. అరుగుమీద నులుక మంచంల కూసున్న గంగయ్య నుద్దేశించి.. “శనార్తులు బావా!” అన్నడు.
గంగయ్య నొసలు ముడేసి..
“శనార్తులే కని నువ్వెవ్వలు? ఎప్పుడు చూసినట్టు లేదు..” అన్నడు.
ఇంతల్నే సాయమాన్లకెల్లి లచ్చవ్వ అచ్చింది.
“అక్కా దండాలు. నీ తమ్మున్ని..” అన్నాడాయన.
“నాకు అన్నలు తమ్ముల్లు లేరు. మా అవ్వకు ముగ్గురు బిడ్డలే!” అన్నది లచ్చవ్వ.
“మీకు నేను తెలువకపోవచ్చుకని నాకు మీరిద్దరెరుకే. పార్వతీ పరమేశ్వరులసోంటోల్లు మా అక్కాబావలు. అగో నా అల్లుడు గూడత్తండు గద.. అల్లుని పేరేంది?”.
“నా కొడుకు గాలయ్య. గిప్పుడు నాలగో తరగతి సదువుతండు! వరుసలు బాగానే కలుపుతున్నవు గని నువ్వెవ్వలో చెప్పకపోతివి!”.
“బావా! నాపేరు గట్టయ్య. నాది నుచ్చులాపూర్. నాకు నా అనెటోళ్లు ఎవ్వలు లేరు. మన కులపోళ్లు బాగున్న ఊరు గిది. ఇక్కడ బతుకుదామనచ్చిన. నువ్వు పెద్దగొల్లవైతివి. ఎవ్వలనడిగినా నీపేరే సెప్పిండ్రు!”.
“గంతదూరం నుంచి వచ్చినవా!? సరెగని.. బువ్వదిన్నవా లేదా? ఈడ్సుకపెయిన మొకం జూత్తె తిన్నట్టనిపిస్తలేదు! లచ్చమ్మా.. ముందుగాల మీ తమ్మునికన్నం బెట్టు. కడుపు సల్లవడ్డంక మాట్లాడుకుందాం!”.
గా మాటతోని లేచి.. లచ్చమ్మ ఎనుకనే
సాయమాన్లకు పేయిండు గట్టయ్య.
కంచు తలెల రెండు గడుకబోట్లు.. గింతంత పప్పేసి, పచ్చిపులుసు పోసింది లచ్చమ్మ. బగ్గ ఆకలున్నట్టుంది.. వాటిని కలుపుకొని దవ్వదవ్వ బుక్కలు పెట్టుకున్నడు.
“అక్కా! మనం గొల్లోళ్లం. కృష్ణుడు మన కులదైవం. మీకు గొర్రెమ్యాకలు లేనట్టున్నయి. గదేం మంచిగనిపిస్తలేదు..” అన్నడు గట్టయ్య.
“గట్టయ్యా! ఇగజెప్పు. మీ అక్కతోనేమో అన్నవట. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకచ్చినవు? నాతోని నీకేం పనో జెప్పు!?” అన్నడు గంగయ్య.. పక్కన కూసున్న గట్టయ్య భుజం మీద చెయ్యేసి.
“బావా! నాకు సదువురాదుగని గీ మాటెక్కన్నో విన్న. ‘విలువిద్యలెన్ని నేర్చిన కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా’ అని. నీకు ఎవుసముంది. పెద్ద గొల్లతనముంది. కుల పంచాయితులు తెంపుతవు. మందెచ్చులోళ్లు, ఒగ్గోళ్లు, గంగిరెద్దులోళ్లు, కొమ్మోళ్లు.. అందరూ మీ ఇంటిముంగటనే ఆటలాడ్తరు. కతలు జెప్పుతరు. బొమ్మలు నిలవెడ్తరు. నువ్వే త్యాగాలు దెంపుతవు. ఊళ్లె గొల్లలిండ్లల్ల పట్నాలేసుకుంటే నువ్వే ముందట గూసుంటవు. కుడుక, కర్పూరం నీకే పంపుతరు. మందమీద పస్కపిల్లను కోసుకుంటె సప్కమాంసం నీకే పంపుతరు. కానీ, నీకు ‘కులకస్పి’ లేదు. కులపెద్దకే కులకస్పి లేకుంటెట్ల బావ?”..
గా మాటలిని బొలబొలా నవ్విండు గంగయ్య.
‘కులకస్పి’ అనే మాట గాలయ్యకెంతో సంబురమనిపిచ్చింది. ఆహ్లాదకరంగా అనిపించింది. ఈ మాటను ఎన్నోసార్లు విన్నడు.
“గట్టయ్యా! నా తమ్ములిద్దరు గొర్ల కాసుకుంటనే బతుకుతండ్రు. మా కుటుంబానికి కులకస్పి ఉన్నట్టేకద! మళ్ల నన్నుగూడ గొర్లుగాయమంటవా ఏంది? ”.
“మీ తమ్ముళ్లకుంటె మీకున్నట్టు ఎట్లయితది బావా? పెద్దమనిషివి అయినంత మాత్రాన కులకస్పి ఉండద్దంటవా? మనకు గొర్లు మ్యాకలుంటె అదో గౌరవం. గొర్లుమ్యాకలున్న ఇండ్లు జూడు.. పాలు, పెరుగు, కవ్వం, ఉట్లు, పాలు కాగవెట్టే ధాతి, ఇండ్లల్ల చిన్న గొర్రెబొక్కుల ‘మేమే’ అని ఒర్రుల్లు.. ఎంతమంచి గుంటది”.
“గా మాట నిజమేనే నాయిన్న. నాగ్గూడ గొర్రెబొక్కులంటె మస్తిష్టం. మనగ్గూడ గొర్లుంటె మంచిగుంటదే!”..
గాలయ్య మాటలను లచ్చమ్మకూడ సమర్థించింది.
“ఓర్నీయవ్వ! గంటకింద తమ్మున్నని అచ్చిన గట్టయ్య.. అక్క, అల్లుడు అందరు ఒక్కటైనట్టున్నరు గద! నేనేమో గాలయ్యను సదివించుకుంట తెలివికి తేవన్నంటె.. మీరేమో గొర్లనవడ్తిరి. పొల్లగాన్ని సదువు బందుజేసి గొర్లకు పెట్టన్నా ఏంది?” అన్నడు గంగయ్య.
“కులకస్పిని ఉంచుకున్నంత మాత్రాన అల్లున్ని సదివియ్యద్దని ఎవ్వలన్నరు? సదువు సదువే. నువ్వు, నీ కొడుకు గొర్లగాయవల్సిన పన్లేదు. కానీ, మీకు గొర్లుండాలె! ఆ గొర్లను నేనుగాత్త!”.
“గట్టన్న సెప్పేది నిజమే. మనకు గొర్లుండాలె!”.
“నాయిన్నా! గొర్లు కొనే.. నేను మంచిగ సదువుకుంట. మామతోని గొర్లకాడికి గూడ పోత!”.
“అటెవుసం, ఇటు గొర్లు.. మనకు ఊళ్లె గౌరవం ఇంకా పెరుగుతది”.
“అందరికి గొర్లమీదికి మనుసు పోయిందేంది?”.
“కులపోళ్లింటికి పండుగ, పబ్బాలకు పెయినప్పుడు అందరడుగుతండ్రు.. ‘పెద్దగొల్ల గదా.. మీ ఆయినెకు గొర్లెందుకు లెవ్వు?’ అని. గట్టన్న దేవునోలచ్చిండు. గొర్లు కొనుడే!” అన్నది లచ్చవ్వ.
“బావా! నాతోని నువ్వురా చుట్టుపక్కల ఊర్లల్ల మందమందకు తిరిగి మంచి సనుగులను ఏరుకత్త. గొర్ల మర్మం నాకెరికే. నాకెవ్వలు దిక్కులేరు. మీ ఇంట్లనే ఉంట. గొర్లగాత్త. బట్టపొట్టకు పోంగ ఏమిత్తవో ఇయ్యి. అవ్విగూడ నీ దగ్గర్నే ఉంచుకో.. నేను సచ్చెదాక నీతోనే ఉంట!”.
“అన్నా! ఎవ్వల కులకస్పి ఆల్లకుండాలె.. నువ్వే మాలోసించకు..” అన్నడు గొర్లకాన్నుంచి వచ్చిన తమ్ముడు రాజయ్య.
“గంగునాయిన్నా! గొర్ల కొను. బోయుడుగూడ దొరికె. ఒక్కగొర్రె గూడలేని నువ్వేం పెద్దగొల్లవురా?”.. అక్కడికి వచ్చుకుంటనే అన్నడు మెండె రాజయ్య.
“నా పెద్దకొడుకువు నువ్వేగాదుర రాజన్న. నువ్వుగూడ మీ అవ్వ, తమ్ముడన్న మాటే అనవడ్తవి. నన్ను పెద్దమనిషితనం ఇడిసిపెట్టి గొల్లబోయున్ని సెయ్యన్నని అనుకుంటున్నర? మరి నా కొడుకును గా పనిసెయ్యమనా మీ మాటలు…? మంచోల్లే ఉన్నరు!”.
“గంగునాయిన్నా! మనిద్దరం ఒక్క వయిసోల్లమేనైతిమి? ఊళ్లె పెద్దమనిషితనం నువ్వే సేత్తున్నవుగని.. నేం జేత్తలేనా? నాకు గొర్లు లెవ్వా! నా కొడుకును సదివిస్తలేనా? నీ కొడుకు సదువుకు, నీ పెద్దమనిషితనానికి గొర్లేం అడ్డమత్తయని? కులకస్పి లేనోనికి పెద్దగొల్లతనం ఎందుకురా!?ఇంకేమాలోసించకు!”.
మెండె రాజన్న మాటలిని తలకాయూపిండు గంగయ్య.
అంబటాల్లయింది. ఊరిజనం బువ్వదిని చేనుపనికి పోవుటానికి తయారైతండ్రు. ఎడ్లను తోలుకొని మక్కపెరండ్లల్ల కలుపుమొక్కలు దున్నటానికి రైతులు చేండ్లల్లకు పోతున్నరు. చిప్ప మల్లయ్య మగ్గం గుంటల కాల్లువెట్టి కదురు టక్టక్ మనుకుంట అటూ ఇటు తిరుగుతుంటె మగ్గం నేస్తున్నడు. కమ్మరి బక్కయ్య కొలిమంటబెట్టి కర్రులు సాగదీస్తున్నడు. వడ్ల లసుమయ్య బాడిసెతోని నాగలిదుంపను చెక్కుతున్నడు. అవుసుల బ్రహ్మయ్య సవునంతోని బంగారం ఏరి నగలు చేస్తున్నడు. తెనుగోళ్లు, బెస్తోళ్లు గాలాలు, తోపెలలు పట్టుకోని చేపలు పట్టుటానికి వాగు, చెరువు దిక్కు నడుస్తున్నరు. చిలుక రాజయ్య ఇంటిముంగట ఎండబెట్టిన ఎద్దుతోలు, చెప్పులు కుట్టే సామాన్లు సిద్ధంగున్నయి.
ఊరంత ఎవ్వరి పనులల్ల వాళ్లు లీనమవుటానికి సిద్ధమైతున్నరు. గొల్లవాడ రేపల్లె వాడోలె ఎలిగిపోతంది. అందరి ముఖాలల్ల సంబురం కనవడుతంది. అందరి ఇండ్లల్ల కవ్వంతో చల్లచిలికే సప్పుడు వినబడుతంది. గంగయ్య ఇంటిముంగటున్న పందిరి కింద నిల్చుంది రామక్క.
“లచ్చవ్వా..! ఓ లచ్చవ్వా!!” అని పిలిచింది.
రొండుసార్లు పిలిచినా చడీచప్పుడు లేదు.
“లచ్చవ్వా! ఓ లచ్చవ్వా!! ఏం జేత్తున్నవు? ఎంత పిల్సినా రావేంది?” అని గట్టిగ పిలిచింది.
లచ్చవ్వ రాలేదుకని దేవునర్రలకెల్లి బైటికచ్చిండు గాలయ్య. గా పిలగాని చేతులల్ల గొర్రె పిల్లుంది.
“ఎనిమిదో తరుగతి సదివే పిల్లగానివి గొర్రెపిల్లలతోని ఆడుకుంటున్నవా బిడ్డ! మీ నాయిన్న గొర్ల కొన్నప్పట్నుంచి బాగ సంబుర పడ్తున్నట్టున్నవు గద. కులకస్పుందని సదువు బందుజేత్తవా ఏంది? గొర్ల బొక్కులంటె మస్తు ప్రేమ నీకు!”.
“గవ్వేం మాటలే రామక్క! నా కొడుకెందుకు సదువు బంజేత్తడు? ఇటు మంచిగ సదువుకుంటండు. అటు కులవృత్తి పనులు నేర్సుకుంటండు. నాలుగేండ్లాయె గద మేంగొర్లు కొని.. అప్పుడు కొన్న గొర్లు నలుపై. గిప్పుడు మా మంద వందకు పెరిగింది” అన్నది లచ్చమ్మ.. సాయమాన్లకెల్లి అచ్చుకుంట.
“అత్తా! నువ్వు గిసోంటి మాటలు మల్లనేవు! నాకు సదువన్న.. మా కులకస్పి పనులన్న పానమే..” అన్నడు గాలయ్య.
“సరెగని రామక్కా.. ఎందుకో వత్తివి!” అన్నది లచ్చమ్మ.
ఎనుకకు వెట్టుకున్న సెయ్యి ముందుకన్నది రామక్క. ఆమె చేతిల చెంబున్నది.
“సల్లకచ్చి ముంత దాసుడంటె గిదే.. సల్ల కచ్చిన్నని సెప్పలేవు! సాయమాన్ల సల్లజేత్తున్న. నువ్వు పిల్సినా వినలేదు” అని సాయమాన్లోకి పోయింది లచ్చమ్మ.
చెంబుల సల్లదెచ్చి రామక్క చెంబుల పోసింది.
“రేపు ఆదివారం. మల్లన్న పండుగ దినం కదా! పాలు పిండం. గొర్రెబొక్కులకే ఇడిసిపెడతాం. రేపు రాకు!” అన్నది.
“సరే!” అంటూ వెళ్లిపోయింది రామక్క.
గొర్రెపిల్లలతోని అరుగుమీద ఆడుకుంటున్నడు గాలయ్య. తమకు గొర్లమంద వచ్చినప్పట్నుంచి పెద్దగొల్లరికం మరింత పెరిగింది. గౌరవం పెరిగింది. అటు కొంత భూమితోపాటు గొర్లమంద ఉండటం వల్ల సామాజిక గౌరవం పెరిగింది.
ఓ దిక్కు చదువుకుంటూనే.. గాలయ్య గూడ గొర్లవెంట, పొలాల వెంట తిరుగుతూ పెరుగుతున్నడు. గట్టయ్య మామంటే తనకెంతో ఇష్టం. తమ కుటుంబంకోసం మామ రాత్రనక, పగలనక పనిజేస్తున్నడు. పెద్దమందలో తమ గొర్లను ఎట్ల ఏర్పాటు చేసుకునుడో నేర్చుకున్నడు.
చెవులకున్న పెనుక (చెవికత్తిరింపు)ను బట్టి ఎవరి గొర్లను వాళ్లు ఎట్ల పాపుకుంటరో తెలుసుకున్నడు. పొలిమేరలున్న ఊరు గొర్లమందలో తమ గొర్లు కలిసినా.. వాటిని గుర్తుపడతడు. గొర్లతో కాలుకు బట్టకుండా చెట్టనక, పుట్టనక, రాయనక రప్పనక తిరుగుతున్న తనవాళ్లను చూసిండు. తోడేళ్లు, దొంగల బారినుంచి గొర్లను కాపాడుకోవడానికి వాళ్లు పడుతున్న కష్టాలను చూస్తున్నడు. చిటుకురోగమచ్చి బొంతపురుగులోలె గొర్రెలు చస్తే.. తన వాళ్లు పడుతున్న వేదన తాను అనుభవిస్తున్నడు. తను చదువుకుంటున్నా.. తనవాళ్లతోనే మమేకమై బతుకుతున్నడు. అపారమైన సాంస్కృతిక, సాంప్రదాయ సంపదను తనవి చేసుకుంటూ పెరుగుతున్నడు. కులకస్పిని, చదువును సమానంగా ప్రేమిస్తున్నడు. మూలాలు – కులకస్పి…
ఈ పదాల గురించే నిత్యం ఆలోచిస్తున్నడు.
ఇరవై ఐదేండ్లు కాలగర్భంల కలిసిపోయినయి. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవ ప్రభావంతో వచ్చిన యంత్రాల ఉపయోగం, వాటి ప్రభావం తెలంగాణలోనూ ప్రారంభమైంది. శారీరక శ్రమతో వృత్తిపనులు చేసుకునేవారి ఆదాయమార్గాలకు గండిపడటం మొదలైంది. గంగయ్యకు గొర్లుకొనిచ్చి తానే గొర్లకాపరిగా చేసి మందను పెంచిన గట్టయ్య చనిపోయిండు. ఏ దిక్కూ లేని గట్టయ్యకు గంగయ్యనే అన్నీ అయి అంత్యక్రియలు చేసిండు. గాలయ్య విద్యార్థిదశలో ఉన్నప్పటోలె కాకుండా.. గ్రామాల్లో మార్పులు శరవేగాన్ని మించి విమానవేగాన్ని అందుకున్నయి. ఊరికి కరెంటొచ్చింది. బస్సు పడింది. ఊరూరికీ బళ్లొచ్చినయి. వృత్తిపనులు ధ్వంసమవుతూ.. చాలామంది వ్యవసాయ కూలీలుగా మారారు.
వ్యవసాయంలోనూ వచ్చిన సంక్షోభంతోని వలసలు పెరిగినయి. ఊరు ఇడిసిపోయేటోళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతంది. అన్ని గ్రామాల్లాగే ఆ ఊరుకూడా ప్రాకృతిక స్వభావాన్ని కోల్పోయి.. కృత్రిమత్వాన్ని అలుముకునే స్థితికొస్తున్నది.
ఈ పాతికేళ్ల కాలంల గాలయ్య ఎం.ఏ సోషియాలజీ, పీహెచ్డీ పూర్తి చేసిండు. ప్రొఫెసర్ స్థాయికెదిగిండు. కానీ, ఊరిని.. కుటుంబాన్ని.. తన మూలాలను మరిచి ఉండలేదు. హైదరాబాద్లో ఉంటున్నా కరీంనగర్ జిల్లాలున్న తన ఊరితోని సజీవ సంబంధాలు పెట్టుకొనే ఉన్నడు. గ్రామాల్లో వస్తున్న మార్పులను గమనిస్తున్నడు. కులకస్పి ఉండాలని తండ్రితో గొర్లు కొనిపించిన గట్టయ్యను, తండ్రి పెద్దగొల్లరికాన్ని మరిచిపోలేక పోతున్నడు. ఏ స్థితిలో ఉన్నా అవే ఆలోచనలు.
తెలంగాణ గ్రామాలల్ల భూపోరాట ఉద్యమాలు బాగా జరుగుతున్న కాలం. ప్రపంచీకరణ ప్రభావం అప్పుడప్పుడే గ్రామాలకూ విస్తరిస్తున్న సందర్భం. తండ్రి సంవత్సరీకానికి ఊళ్లోకొచ్చిన గాలయ్య మిత్రుడు రమణయ్యతో కలిసి ఊరంతా తిరిగి చూస్తున్నడు. ఊరుమ్మడి స్థలంగా ఉండే కమ్మరి కొలిమి దగ్గర జనం లేరు. కుమ్మరిసారె తిరగడం లేదు. చాకలి బాలయ్య పెళ్లి పల్లకి విరిగిపోయింది. అవుసులోళ్ల కుంపటి నుంచి అగ్గి రాజుకుంటలేదు. సాలెల మగ్గం మూలకు పడింది. కత్తెర్లోళ్ల పశువుల మంద జాడ కనిపిస్తలేదు. వడ్లధాతి బోసిపోయింది. గొల్లలిండ్లలో కవ్వం చప్పుళ్లు లేవు. చాలా వ్యవసాయాలు మూలకుపడ్డయి. వృత్తి పనులన్నీ సంక్షోభంల పడ్డయి. ఊళ్లెకు జానపద యాచక కులాలోళ్లు రావడం తగ్గినట్టుంది.
ఊరంతా తిరిగొచ్చి మంచంల కూర్చున్నడు గాలయ్య. అతని కండ్లవెంట నీళ్లు కారుతున్నయి.
“ఏంది బిడ్డా ఏడుస్తున్నవు! నాయిన్న యాదికచ్చిండా!?” అన్నది లచ్చవ్వ.. కొడుకు భుజంమీద చెయ్యేసి.
“అవునే అవ్వా! నాయిన్న యాదికచ్చిండు. మనింట్లనే బతికి మనకోసమే బతికి చనిపోయిన గట్టయ్యమామ యాదికత్తుండు. నాతోని చదువుకున్నోళ్లంత యాదికత్తండ్రు. వాళ్లెవ్వలు కనవడ్తలేరే! చాలా ఇండ్లకు తాళాలు కనవడ్తున్నయే అవ్వ! కొన్ని ఇండ్ల ముంగట కొడుకుల కోసురం ఎదిరిచూస్తున్న నీ అసోంటి తల్లులు గలుమలకాడ కూసుండి కనవడ్తున్నరు. ఎవుసాలు మూలకు వడ్తున్నయి. కులకస్పి పనులన్ని మూలకు పడ్డట్టనిపిస్తందే అవ్వ..” అని ఏడ్వబట్టిండు గాలయ్య.
తెల్లవారి భారమైన మనసుతో హైదరాబాద్ ఎల్లిపోయిండు.
కాలమిప్పుడు జెట్ స్పీడుతో పరుగెడుతంది. యాంత్రీకరణ ప్రభావంతో చరమదశకు వచ్చిన కులవృత్తులు.. ఇప్పుడు మరీ దెబ్బతిన్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత గాలయ్య కుటుంబానికున్న మందను చూసుకునే దిక్కులేక.. గొర్రెలను అమ్మేయాల్సి వచ్చింది. భూములు, ఇల్లు కూడా ఊళ్లో ఉండే గాలయ్య చెల్లెకే దక్కినయి. పట్నంలో ఉన్న గాలయ్య.. తల్లిని చూసుకునే స్థితిలో లేడు కాబట్టి.. ఉన్నభూములు, ఇల్లు తీసుకొని తల్లిని చూసుకోవాలని ఊరి పెద్దమనుషులిచ్చిన తీర్పును గాలయ్య శిరసావహించిండు. కొన్నేండ్లలో గాలయ్య తల్లికూడా ఈ లోకాన్ని వదిలింది. దాంతో.. ఊరితో సంబంధాలు తగ్గుముఖం పట్టినయి.
ఇపుడు సెల్ఫోన్ యుగం… కాలం మనోవేగంతో పరుగులు తీస్తంది. 21వ శతాబ్ది రెండవ దశాబ్దం నడుస్తంది. గాలయ్య పదవీవిరమణ పొందిండు. అతని పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడిండ్రు. హైదరాబాద్లో వాళ్లకు సొంత ఇండ్లున్నయి. కానీ, ఊరిని – కులకస్పిని ప్రేమించిన గాలయ్యకు ఊళ్లో ఇంచుభూమి కూడా లేదు. నిలువనీడ లేదు. ఊరిపై ప్రేమ, ఊళ్లో స్థిరపడాలన్న బలమైన కోర్కె మాత్రముంది. చాలా ఏండ్ల తర్వాత చిన్నప్పటి సోపతి డాక్టర్ రాఘవరెడ్డితో కలిసి ఊరెళ్లిండు గాలయ్య. రాఘవరెడ్డి, గాలయ్య వచ్చిండ్రని తెలిసి చాలామంది వచ్చి కలిసిపోతున్నరు.
“గాలన్నా! నీ పిల్లలు హైదరాబాద్లున్నా, వాళ్లకిండ్లున్నా.. నీకైతె ఊళ్లె ఓ ఇల్లుండాలె! రెండెకురాలన్న పొలముండాలె! భూమి కొనుక్కో. శేషజీవితం ఇక్కణ్నే గడుపు!”.. చాలామంది ఇదే మాటన్నరు.
చిన్నప్పుడు గట్టుమామ మాటలు యాదికచ్చినయి..
“నాకూ అదే ఆలోచనుంది. చాలా కాలమైంది గదా! చూసిపోదామని వచ్చిన. రేపు పొద్దున ఊరంత తిరుగుత!” అన్నడు గాలయ్య.
ఉదయం రాఘవరెడ్డితో కలిసి ఊళ్లో తిరుగుతున్న గాలయ్య ముఖంలో ఏదో తెలియని ఆనందం.
ఎవ్వలు ఎదురచ్చినా..
“గాలన్నా.. నమస్తే!”..
“గాలన్నా.. శనార్తులు! మంచిగున్నారె..
ఊర్ను మరిసిపోతివి!”..
“ఊళ్లె భూమి కొనుక్కోయే!”..
“ఊళ్లె ఇల్లు గట్టుకో గాలన్నా!”..
ఇవే మాటలు. బిగ్గీత కౌగిలింతలు.. ప్రేమలు!
నగర జీవితంతో ముఖం వాచున్న గాలయ్యకు తన ఊరివారి ఆప్యాయ పలుకరింపులు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తున్నాయి.
ఇద్దరూ మెండె రాజన్న కొడుకు పోచన్న ఇంటికెళ్లిండ్రు. టీ తాగి మాటల్లో పడ్డరు.
“బాపూ! నేను బీఏ చేసినా కులకస్పిల్నే ఉన్న. ఇపుడు నాకు నాలుగువందల గొర్లమందుంది. ముప్పై ఎకరాల భూముంది. నా పిల్లలందర్నీ చదివించిన. నౌకర్లయినయి. నువ్వు పట్నంల ఏం సంపాదించినవో తెలువది కానీ.. పుట్టినూర్లనైతె ఏం లేకుంటయింది. చదువుకొని ఉద్యోగం చేయడం తప్పంటలేను. కానీ.. ఊర్ల భూమిని, ఇంటిని పోగొట్టుకునుడే మంచిగనిపిస్తలేదు. హైదరాబాద్ల నువ్వు శ్రీరామకోతులల్ల బోడకోతి అసోంటినివి. ఇక్కడ భూమున్నా, ఏ కస్పి ఉన్నా గౌరవమే కదా!”..
పోచన్న మాటలు వింటున్న గాలయ్యకు దుఃఖం ఆగడంలేదు. కళ్లవెంట పటపటా నీళ్లు కారుతున్నయి.
“బాపూ! నిన్ను నేనేమన్న బాధపెట్టిన్నా! ప్రొఫెసర్గ, సామాజిక కార్యకర్తగ నీకెంతో పేరుంది. ఊరుమీద మస్తు పాయిరముంది. మీ నాయిన్న, మా నాయిన్న కాలంల ఉన్నట్టు ఇప్పుడు ఏ కులం వాళ్లు ఆపనే చేసుకుంట బతుకుత లేరు. అందరు చదువుకుంటున్నరు. మునుపు భూములు లేనోళ్లు ఇప్పుడు భూములు కొనుక్కున్నరు. ఉన్నోళ్లు పోగొట్టుకున్నరు. బట్టల ముల్లె నెత్తిమీద పెట్టుకొని ఇండ్లపొంటి తిరుగుకుంట అమ్మిన రామయ్య కొడుకు ఇప్పుడు బిల్డరయిండు. ఇరవై ఎకరాల భూములు కొన్నడు. జడ్పీటీసీ అయిండు. రేపు ఎమ్మెల్యే కావచ్చు..” అన్నడు పోచన్న.. గాలయ్యను ఓదార్చుకుంట.
“పోచన్నా! పీజీలు, పీహెచ్డీ చేసిన నాకు లేని అవగాహన నీకున్నది. మరి నేను కులకస్పిని వదిలి చదువుకునుడు తప్పంటవా? ఎవుసాయాలు, వృత్తిపనుల సంగతేంటి?” అన్నడు గాలయ్య.
“బాపూ! మెడకాయమీద తలుకాయ ఉన్నోడెవ్వడు గట్లనడు. ఊళ్లల్ల వ్యవసాయాలు సంక్షోభంల పడ్డంక చదువుకున్నోళ్లంత భూమితోని, ఊళ్లతోని తెగదెంపులు జేసుకున్నమాట నిజమే! కానీ, భూమి గుండ్రంగ ఉన్నదంటరు చూడు.. గది నిజమని గిప్పటి పరిస్థితులను జూత్తె అర్థమైతంది. సమాజం ఒక వర్తులాన్ని పూర్తిచేసుకుంది. భూమ్మీద ప్రేమ పెరిగింది. ఊళ్లమీదా ప్రేమ పెరుగుతంది. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడ ఊళ్లకొచ్చి భూములు కొంటున్నరు. అమెరికాకు పోయచ్చినోళ్లు, ఇంజనీర్లు గూడ భూములు కొని ఎవుసం చేయాలనుకుంటున్నరు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా.. వస్తున్న మార్పుల కనుగుణంగ తనను తాను మార్చుకున్నోడే నిలిచి గెలుస్తడు. పట్నాలకు దూరంగ పల్లెల్ల ఫాంహౌస్లు కట్టుకుంటున్నోళ్లు కనడ్తలేరా బాపు!”.
పోచన్న మాటలకు నోరెళ్లబెట్టి చూస్తున్నడు గాలయ్య.
“పోచన్నా! నేను ఎంత చదివినా నా చదువు అనుభవాలు నీ గ్రామీణ, వ్యావసాయిక, కులకస్పిపర అనుభవాల ముందు దిగదుడుపే.. నాకిప్పటికీ ‘కులకస్పి’ అనే పదంపై స్పష్టమైన అవగాహన లేదు. చెప్పుతవా!” అన్నడు.
“కులకస్పి అంటె ఏదైనా వృత్తికి సంబంధించిన పని. అంటే.. ఏదైనా ఉత్పత్తికి సంబంధించిన పనిలో నైపుణ్యం సంపాదించాల్నని. ఈ వృత్తి, ఉత్పత్తికి సంబంధించిన పనులు అన్ని దేశాలల్ల ఉంటయి. వాటితోనే ఏ దేశంలనైన ఎక్కువమంది బతుకుతరు. ప్రభుత్వ ఉద్యోగాలతోని ఎంతమంది బతుకుతరు? ఎన్నేండ్లు బతుకుతరు? ఇరవై ఐదేండ్ల దాకా బాల్యం.. చదువేనాయె! అరవై ఏండ్లతర్వాత పదవి దిగి పోవుడేనాయె. మరి మిగతా జనం, మిగతా కాలం ఎట్ల బతుకాలె? ఏదో పని జేసుకుంట బతకాలె. గదే కులకస్పి. అంటే గీపని జేసెటోళ్లు, చేద్దామనుకునెటోళ్లు చదువుకోవద్దని కాదు.. వేరే దేశాలల్ల అందరు బాగ సదువుకొని ఏపనైన జేసుకుంటరు. కొద్దిమంది నౌకర్లు జేత్తరు. గక్కడ కస్పికి వృత్తిపనికి గౌరవముంటది.
గదాన్నే మీ అసోంటోళ్లు ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అంటరు. గా డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన దగ్గర లేకపోయేపటికెనె గిన్ని సమస్యలు. చదువుకున్నా, నౌకరి రాకుంటె ఏదైన వృత్తిపనిల నైపుణ్యముంటే సుఖంగ బతుకచ్చు గద! కులకస్పంటె ఏ కులపోళ్లు ఆ కుల వృత్తిమాత్రమే చేసితీరాలి. చదువుకోవద్దని కాదు.. గిప్పుడర్థమైందాయె!” అన్నడు పోచన్న.
“పోచన్నా! నేనిప్పుడు రిటైరయి ఉన్న! నా చిరకాల స్వప్నమైన ‘ఊళ్లో స్థిరపడటం’ అనే కోర్కెను తీర్చుకుంట. ఇక్కడే ఇల్లు కట్టుకుంట. ఊళ్లో ఎన్ని మార్పులచ్చినయని చెప్పుతున్నా.. పట్నాలల్ల వచ్చినట్టు కృత్రిమత్వం రాలేదు. పెదవులపై మాటలు రాలేదు. వరుసలు పెట్టుకొని పిలుచుకోవడాలు, అలాయిబలాయ్లు ఇంకా సజీవంగున్నయి. పట్నమోల్లోలె వ్యాపార మనస్తత్వం రాలేదు. మునుపటంత ప్రేమలు లేకున్నా పట్నాల్లోలా ప్రేమరాహిత్యం.. ఈ ఊళ్లల్ల లేదు. నేను ‘కులకస్పి’తో ఈ ఊళ్లనే శేషజీవితం గడుపుత. గొర్లు, భూమి కొని వాటిపై వచ్చే ఆదాయంతోని బతుకుత. నా పిల్లలు వాళ్ల పిల్లలతరం నాటికైనా నన్ను అనుసరిస్తరన్న ఆశ నాకుంది. అప్పటికి నేనుండకపోవచ్చు. మనదేశంల కులకస్పిని కులాలకు అతీతంగ అనుసరిస్తే ఇంకొన్నేండ్లకైన కులాలు పోతయేమొ?.. పోతయన్న ఆశ నాకుంది..” అన్నడు గాలయ్య.
కాలువ మల్లయ్య
కులవృత్తుల గొప్పదనాన్ని, పల్లెవాసుల స్వచ్ఛమైన మనస్తత్వాన్ని తెలిపే కథ.. కులకస్పి. గొల్లబోయెల జీవిత నేపథ్యంలో సాగే ఈ కథా రచయిత డా. కాలువ మల్లయ్య. దాదాపు 50 ఏండ్లకు పైగా సాగుతున్న సాహితీ ప్రయాణం వీరిది. ‘సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వృథా’ అని నమ్మే రచయిత. వీరి స్వస్థలం పెద్దపల్లి జిల్లా తేలుకుంట. ఎమ్మెస్సీ బీఈడీ, పీజీ డీపీఆర్, ఎంఏ, పీహెచ్డీ చేశారు. బాల్యం నుంచే సాహిత్యాభిలాష పెంచుకున్నారు. 1972లోనే కథా రచన మొదలుపెట్టారు. తనదైన యాసలో రచనలు సాగిస్తూ.. తెలంగాణ జీవద్భాషకు సాహిత్య గౌరవం తీసుకువస్తున్నారు.
1983లో రాసిన ‘వెలి’ కథ.. కాలువ మల్లయ్యను అభ్యుదయ రచయితగా సమాజానికి పరిచయం చేసింది. ఇప్పటివరకూ వెయ్యికిపైగా కథలు, 18 నవలలు, 6 కవితా సంపుటాలు, 800 వ్యాసాలు రాశారు. 70 పుస్తకాలు ప్రచురించగా, 100కుపైగా పుస్తకాలు ఇంకా ప్రచురించాల్సి ఉన్నది. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 30 మందికిపైగా విద్యార్థులు, వీరి సాహిత్యంపై పీహెచ్డీ, ఎంఫిల్ పట్టాలు తీసుకున్నారు. మరో పదిమందిదాకా పరిశోధనలు చేస్తున్నారు. ‘బతుకు పుస్తకం’ నవలకు ‘ఆటా అవార్డు’ దక్కించుకున్నారు. ఇప్పటిదాకా 90కిపైగా వివిధ పురస్కారాలు, అవార్డులు, అనేక సన్మానాలు అందుకున్నారు.
కాలువ మల్లయ్య
98493 77578