“రహీం భయ్యాను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు అబ్బాజాన్?”.. అడిగాడు సులేమాన్.ఏం చెప్పాలో అర్థం కాలేదు తండ్రి రంతుల్లాకు. “మీ అన్న ఏదో వార్త తప్పుగా రాశాడట!” చెప్పాడు రంతుల్లా.. అప్పటికి తోచింది. అన్నదమ్ములిద్దరికీ పదేళ్లు ఎడం ఉంది. ఆయేషా పోయాక చాన్నాళ్లు రంతుల్లా ‘నిఖా’ చేసుకోలేదు. మేనమామ ఖాశీం.. ‘గుండెలపై నుంచి ఒక బిడ్డ భారం దిగినా మంచిదే కదా!?’ అని కూతురు రజియాను ఇచ్చి చేశాడు. రంతుల్లా దర్జీగా చేస్తుంటాడు. తాను షాపుకెళ్తే.. రహీం మాత్రం బడి ఎగ్గొట్టి, సావాసగాళ్లతో తిరుగుతూ కాలక్షేపం చేస్తుండేవాడు. రజియా ఎప్పుడూ రహీంను సవతి తల్లిలా చూడలేదు.
తన తల్లి ఆయేషా స్థానాన్ని రజియా ఆక్రమించిందన్న కోపం.. ఎందుకో ఉండేది రహీంకు. తనకు బిడ్డ పుడితే రహీంపై ప్రేమ తగ్గిపోతుందని బిడ్డను కనేందుకు ముందు ఇష్టపడలేదు రజియా. తల్లి రెహానా నచ్చచెప్పడంతో అంగీకరించింది. అప్పుడు కడుపున పడ్డాడు సులేమాన్. కారణం తెలియదు కానీ.. సులేమాన్ అంటే చాలా ప్రేమగా ఉండేవాడు రహీం. అన్న అంటే కూడా సులేమాన్‌కు చాలా ఇష్టం. తన కొడుకుతో రహీం మాలిమి చూసి సంబురపడేది రజియా. భర్త రంతుల్లాకు చెప్పకుండా డబ్బులు కూడా ఇస్తూ ఉండేది. అతనికి ఇష్టమని మటన్ షాప్‌లో ఖాతా కూడా పెట్టింది.
“అప్పులు చేసి మటన్ తెచ్చుడెందుకు? చికెన్తెస్తే సరిపోయేది కదా!” అనేవాడు రంతుల్లా. “ఎదిగొచ్చే బిడ్డ కదా? చికెన్‌లో ఏం సత్తువ ఉంటది. పోనివ్వండి..” అనేది రజియా. “వాణ్ని నువ్వు ఎలా పెంచుతున్నావో తెలుసా? పొట్టేల్లా సాదుతున్నావ్!” అనేవాడు రంతుల్లా. “ఎందుకట్ల దిష్టి పెడతారు పిల్లాడికి!” అనేది రజియా మురిపెంగా.అంతటితో ఆగకుండా దిష్టికూడా తీసేది. “అమ్మీజాన్.. నీకు నాకంటే రహీం భయ్యా అంటేనే ఇష్టం కదూ!” అనేవాడు సులేమాన్. “వాడు నీ భయ్యారా” అనేది రజియా. “నాకూ రహీం భయ్యా అంటే ఇష్టమేలే..” నవ్వుతూ అనేవాడు సులేమాన్. వ్యాయామశాలకు రెగ్యులర్‌గా వెళ్లేవాడు రహీం. పిల్లాడికి కండపుష్టి పెరగాలని రోజుకు అరడజను కోడిగుడ్లు కూడా ఉడకేసి పెట్టేది. రహీం పహిల్వాన్లా తయారయ్యాడు. రోజూ నమాజ్‌కు కూడా వెళ్లేవాడు. అక్కడ మదర్సాలలో చెప్పేదాని కన్నా ఇంకా లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాడు.
సడన్‌గా ఒకరోజు..
“ఎందుకు అబ్బాజాన్ మనపట్ల అనుక్షణం వివక్ష ప్రదర్శిస్తుంది ప్రభుత్వం?” అడిగాడు రహీం.
“ఏమైంది బేటా..?” అడిగాడు రంతుల్లా.
“మన పూర్వీకులు ఇక్కడివాళ్లేనని రుజువు చేసుకోవాలట.. ఇదెక్కడి ఘోరం”.
“మత ప్రాతిపదిక పైన మనదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయి.. ఇస్లాం దేశంగా ప్రకటితమైంది. మనం ఇక్కడే నిలిచిపోయాం. మనకిక్కడ మన రాజ్యాంగం అన్ని హక్కులూ ఇచ్చింది బేటా.. భయం ఎందుకూ?”.
“రాజ్యాంగం అన్ని హక్కులూ ఇస్తే.. మనల్ని ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారు?”.
ఒక నిమిషం కొడుకు కళ్లలోకి చూస్తూ..
“ఎవరు చూస్తున్నార్రా నిన్నూ? చదువుకోవద్దని చెప్పారా? రైళ్లు ఎక్కనీయడం లేదా? బస్సులోంచి దించేశారా? రోడ్లపైన పోనివ్వడం లేదా?”
అడిగాడు రంతుల్లా.
ఒక నిమిషం అబ్బాజాన్ను అలాగే చూస్తూ..
“అలా కూడా చేస్తారా?” అడిగాడు రహీం.
“అలా.. ఇక్కడే పుట్టి ఇక్కడే బతికే దళితుల్ని చూశారు. వాళ్లను చెరువుల్లో నీళ్లు తాగకుండా.. బస్సుల్లో ఎక్కనీయకుండా ఊరికి దూరంగా ఇళ్లు కట్టించి అవమానించారు. వాళ్ల సమాన హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం వల్లనే కదా రిజర్వేషన్లు వచ్చాయి. ‘అన్‌టచబుల్స్’ పేరుతో ఒక సంచిలో వేసినట్టు వాళ్లను ఒక షెడ్యూల్లో పెట్టారు. వాళ్లకంటే మన పరిస్థితి బెటరే కదా..” అన్నాడు రంతుల్లా.
“నీకు పేపర్ నాలెడ్జ్ బాగనే ఉంది అబ్బాజాన్. ఆ పేపర్లోనే రాస్తున్నారు చూడూ.. మనం మన జాతీయత రుజువు చేసుకోకపోతే దేశం నుంచి వెళ్లగొడతారట. రకరకాల చట్టాలు తేవడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయ్” చెప్పాడు రహీం.
“మనదేశంలో ఎవరూ అలా చేయలేరు”.
అబ్బాజాన్ వైపు అదోలా చూశాడు రహీం.
అప్పుడే అక్కడికి రంతుల్లా చిన్నప్పటి స్నేహితులు జియావుద్దీన్ వచ్చి..
“అస్సలామ్ లేకుమ్”.. అని చెప్పాడు.
“వాలేకుమ్ అస్సలామ్ లేకుమ్”
చెప్పాడు రంతుల్లా.
తండ్రీకొడుకుల మాటలు విన్నాడు జియావుద్దీన్. అతను ఓ పత్రికలో కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు.
“బేటా.. నీ మనసులో ఉన్న ఆలోచనలతో నువ్వు పెద్దవిగా భావిస్తున్న సమస్యలతో ఒక ఆర్టికల్ రాసి మన పేపర్‌కు ఇవ్వు” చెప్పాడు జియావుద్దీన్.
కాసేపు పిచ్చాపాటి తర్వాత రహీం భుజం తడుతూ.. “ఖూదాఫీస్’.. అని చెప్పి వెళ్లాడు.
రెగ్యులర్‌గా తాను చదివే పత్రికలో ‘జనవాక్యం (అవామీ ఖత్)’ కింద ఉన్న కాలమ్‌లో ఉత్తరం రాశాడు రహీం. అందులో తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పత్రికలో పనిచేసే సబ్ఎడిటర్ ఫరూక్.. రహీంకు ఫోన్ చేసి.. “ప్రభుత్వం తేవాలి అనుకుంటున్న చట్టాల మీద పదిమంది అభిప్రాయాల్ని నువ్వుండే జాగాలో జమచేసి పంపు భాయ్!” అని చెప్పాడు.
ఆ తర్వాత ఆ పత్రికలో స్టింగర్గా మారాడు రహీం. అప్పుడప్పుడూ పత్రిక క్యాంపులంటూ ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లేవాడు. నెలకు పదిహేను రోజులు బయటే ఉండేవాడు రహీం. ఒకవేళ హైద్రాబాద్‌లో ఉన్నా.. ఒక్కోసారి రాత్రి పన్నెండు తర్వాతే ఇంటికి వచ్చేవాడు. రహీంను గమనిస్తున్నా.. పెద్దగా ప్రశ్నించేవాడు కాదు రంతుల్లా.
మరొక రోజు..
“మనం పాకిస్తాన్‌కు వెళ్లిపోదాం అబ్బాజాన్..” అన్నాడు రహీం.
“ఎందుకు బేటా..?” అడిగాడు రంతుల్లా.
“ఇక్కడే ఉంటే ఏమైపోతానో అర్థం కావడంలేదు అబ్బాజాన్” అన్నాడు రెస్ట్‌లెస్‌గా..
“ఏమవుతావ్ బిడ్డా..?”.
“ఇక్కడ ఉంటే.. పరాయి దేశంలో ఉన్నట్టుంది అబ్బాజాన్ ” అన్నాడు. “అలా ఎందుకు అన్పిస్తుంది బేటా!? ఇది మన జన్మస్థలం. నిజాం ప్రభువు ముసల్మాన్ అయినా.. వాళ్లతో మీ ముత్తాత పోరాటం చేశాడు. రజాకార్లకు వ్యతిరేకంగా నడిచిన ఉద్యమంలో ఆయనది ఫస్ట్ ప్లేసే! నిజాం నవాబు మీ ముత్తాతను చంపేశాక.. మా అబ్బాజాన్ నన్ను తీసుకొని నిజాంబాద్ నుంచి హైద్రాబాద్ వచ్చేశాడు. దేశానికి స్వతంత్రం వచ్చింది. హైద్రాబాద్ భారత్‌లో విలీనమైంది. అప్పుడు మా అబ్బాజాన్ ఒకటే చెప్పాడు.. ‘భూగోళం అంతా అల్లాదే. ఏదో ఒక ప్రాంతం మనదని అనుకోకూడదు. ఇప్పుడు మనముండే మన ప్రాంతమే మన మాతృభూమి. దాని రుణం తీర్చుకోవడానికే మనం బతకాలి.. అవసరమైతే ప్రాణం ఇవ్వాలి!’ అన్నాడు. నేను కూడా నీకు అదే చెబుతున్నా..” అని చెప్పాడు.
“మనకొక దేశం ఏర్పడింది కదా!. మరి ఎందుకు ఇక్కడుండాలి అబ్బాజాన్?” అన్నాడు రహీం.
“భారతదేశంలో ఉండే ముస్లింలు అందరూ పాకిస్తాన్‌కు వెళ్లిపోతే.. అక్కడ తాగేందుకు మంచినీళ్లు కూడా సరిపోవు. రొట్టె సంగతి తర్వాత. అయినా మనిషి ఎక్కడికెళ్లినా రొట్టెలు తినే బతకాలి. ఇక్కడ మనకేం తక్కువ? నా దగ్గరకొచ్చి బట్టలు కుట్టించుకొనే వాళ్లలో అన్ని మతాల వాళ్లూ ఉంటారు. ఎవరు ఇచ్చినా.. అదే రూపాయి ఇవ్వాలి. ఎవరమైనా కష్టం చేసుకొనే బతకాలి కదా బేటా..” చెప్పాడు.
రహీం చెవికి తండ్రి మాటలు పూర్తిగా తలకెక్కలేదు.
ఇంకో రోజు..
“కాశ్మీర్.. పాక్ భూభాగమే కదా అబ్బాజాన్!?” అన్నాడు రహీం.
“అలా ఎందుకు అనుకుంటావు బేటా!? అది గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉంది. దాన్ని కాపాడుకోవడం మన భాద్యత. అక్కణ్నుంచి వచ్చే ఆదాయం దేశంలోని అన్ని ప్రాంతాల వారికీ చెందుతుంది కదా?!” చెప్పాడు రంతుల్లా.
“ఇప్పుడు ప్రభుత్వం అక్కడున్న మన ముస్లింలను అణిచిపెట్టడానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది తెలుసా? పాక్‌కు వదిలేస్తే నష్టం ఏముంది?” అన్నాడు రహీం.
రంతుల్లా కాసేపు మాట్లాడలేదు. రహీంను రెక్క పుచ్చుకొని బయటికి తీసుకువచ్చి..
“ఆ ఖాళీ జాగా మనకేం ఉపయోగపడటం లేదుకదా! పక్కింటి సిరాజ్ మామకు ఇచ్చేద్దామా!?” అని అడిగాడు.
“ఎందుకిస్తాం. అది మన తాతల కాలం నుంచి మన ఆధీనంలోనే ఉంది కదా”.. అన్నాడు.
“ఇది కూడా అంతే! కాశ్మీర్ మనదేశంలో అంతర్భాగం. అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి దేశంలో ప్రజలందరి డబ్బుల్ని ప్రభుత్వం అక్కడ వెచ్చిస్తున్నది. మనదేశాన్ని అస్థిర పరచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది” చెప్పాడు రంతుల్లా.
రజియా.. తండ్రీకొడుకుల సంభాషణను గమనిస్తూ..
“రహీం.. ఆ మధ్య గోగుల్ ఛాట్‌లో బాంబు పేలినప్పుడు మన బంధువు అఫ్సర్ మామ కొడుకు కళ్లు పోగొట్టుకున్నాడు తెలుసా?” అని అడిగింది.
“అది పవిత్రయుద్ధం అమ్మీజాన్..” అన్నాడు రహీం.
“ఏది పవిత్ర యుద్ధం బేటా!? అభం శుభం తెలియని పసివాళ్లను బలి తీసుకోవడం పవిత్ర యుద్ధమా! బింబినీ పార్కులో
లేజర్ షోకు వెళ్దామని ఆరోజు నీ భయ్యా సులేమాన్ అల్లరి చేశాడు. ఎలాగో ఆ ప్రమాదం తప్పింది. వెళ్లి ఉంటే.. నీ భయ్యా కూడా తుకడాల్.. తుకడాల్ అయ్యుండే వాడు. నీకు ఎంతో ఇష్టమైన నీ తమ్ముడు నీకు ఉండేవాడు కాదు తెలుసా?” అన్నది.
“నీకు అబ్బాజాన్ మాటలు తప్ప.. నా మాటలేవీ చెవికి ఎక్కవు అమ్మీ”.. అన్నాడు రహీం నిర్లక్ష్యంగా.
“చెవికి ఏమీ ఎక్కనక్కర లేదురా.. నీ మామ సిద్ధికీ కూతురు జమీలాకు నువ్వంటే ఇష్టం. ‘నిఖా’ చేసుకొని నీకు నచ్చిన దేశానికి వెళ్లి బతికేయ్. మా ఊపిరి ఈ గడ్డ మీదే పోతుంది” అన్నది రజియా కృతనిశ్చయంతో..
ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. గత రాత్రి పోలీసులు వచ్చి రహీంను తీసుకెళ్లారు. భార్యా భర్తలిద్దరికీ కాళ్లూ చేతులు ఆడలేదు.
“నువ్వు పోయి రహీంను విడిపించుకుని తీసుకురాయ్యా!” అన్నది రజియా ఏడుస్తూ..
“అదే ఆలోచిస్తున్నా.. నువ్వేం ఫికర్ పడకు”ధైర్యం చెప్పాడు రంతుల్లా.
షాపు దగ్గరికి వెళ్లకుండా.. దగ్గరి బంధువు, పోలీస్ కానిస్టేబుల్ అయిన హనీఫ్ ఇంటికి వెళ్లాడు. హనీఫ్ ఎక్కడికో ఫోన్‌చేసి..
“మీవాణ్ని తీసుకెళ్లింది మా వాళ్లు కాదు బావా! ఎన్ఐఏ వాళ్లు లిఫ్ట్ చేశారు” చెప్పాడు హనీఫ్.
దిగాలుగా చూశాడు రంతుల్లా.
“నువ్వేం దిగులు పడకు. మా ఎస్సై సురేంద్ర మోహన్ ఫ్రెండ్ ఎన్ఐఏలో పని చేస్తున్నాడు. వెళ్లి కలుద్దాం” అన్నాడు.
కాసేపటి తర్వాత సురేంద్ర మోహన్ దగ్గర ఉన్నారు వాళ్లిద్దరూ…
“ఎవిడెన్స్ లేకుండా ఎన్ఐఏ వాళ్లు లిఫ్ట్ చేయరు భాయ్..” అన్నాడు సురేంద్రమోహన్.. రంతుల్లాను చూస్తూ!
“వాడు ఎవరికీ ఏ హానీ చేసేవాడు కాదు సాబ్!” అన్నాడు రంతుల్లా.
“అవును సర్.. రహీం చిన్నప్పటినుంచీ నాకు తెలుసు. వాడు తప్పుచేసే మనిషి కాదు..”అన్నాడు హనీఫ్.
“చేశాడని నేనూ ఆనడం లేదు కదా!?” అని రంతుల్లా వైపు తిరిగి..
“రేపు రండి. డీటెయిల్స్ కనుక్కుంటా..” అని చెప్పాడు ఎస్సై.
దిగాలుగా ఇంటికి చేరిన భర్తను చూస్తూ..
“ఏడీ? మన బేటా.. ఏడీ?” అని అడిగింది రజియా.
చెప్పడానికి అతను తటపటాయిస్తుంటే..
“అసలు మన బిడ్డను ఎందుకు తీసుకెళ్లారు?” మళ్లీ అడిగింది.
“ఎందుకు తీసుకెళ్లిందీ రేపు చెబుతారట..” చెప్పాడు రంతుల్లా.
“అంటే.. మన బేటాను ఈ రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారా..” అన్నది ఏడుస్తూ.
“ఎక్కడో పెట్టి విచారిస్తున్నారట..” చెప్పాడు.
“ఎక్కడున్నది కూడా తెల్వదా!?” అడిగింది.
“ఎవరు చెబుతారు?” అన్నాడు.
తెల్లారి ఎన్ఐఏ ఆఫీస్‌కు వెళ్లాడు రంతుల్లా.
సురేంద్ర మోహన్ ముందుగానే మాట్లాడటంతో..
“మీ వాణ్నుంచి రాబట్టాల్సిన సమాచారం ఇంకా చాలా ఉంది భాయ్. అదంతా వచ్చాక కోర్టుకు పెడతాం” చెప్పాడు ఎన్ఐఏ ఆఫీసర్ సాబ్జాన్.
రంతుల్లా కళ్లలో నీళ్లు తిరిగాయ్.
“సర్! మావాడు అమాయకుడు సర్..” అన్నాడు.
“ప్రతి అబ్బాజాన్కూ వాళ్ల బేటా అమాయకుడుగానే కనపడతాడు భయ్యా” అన్నాడు.
“ఖూదాఫీస్” అని చెప్పి బయటపడ్డాడు రంతుల్లా.
పదిహేను రోజులు గడిచాయ్. రహీం ఆచూకీ లేదు. దాంతో మీడియాకు ఎక్కాడు రంతుల్లా.
‘మేం లిఫ్ట్ చేయలేదు!’ అంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది ఎన్ఐఏ. హెబియస్ కార్పస్ రిట్ వేశాక.. కోర్టుకు పెట్టింది ఎన్ఐఏ.
రజియా కుంగిపోయింది. కడుపున పుట్టకపోయినా.. కళ్లలో పెట్టుకొని చూసుకుంది తాను.
“రహీం భయ్యా ఎప్పుడు వస్తాడు అబ్బాజాన్ ” అని రోజూ అడుగుతున్నాడు సులేమాన్.
ఒకరోజు రాత్రి హనీఫ్ వచ్చాడు.
“అస్సలామ్ లేకుమ్”.. అని చెప్పి, “ఏంటి హనీఫ్ భాయ్. ఈ సమయంలో వచ్చారు?” అడిగాడు రంతుల్లా.
“గుండె దిటవు చేసుకో భయ్యా! బింబిని పార్క్, గోగుల్ ఛాట్‌లో బాంబులు పెట్టినవాళ్లకు మీవాడు షెల్టర్ ఇచ్చాడట. ఈ ఏరియా సీసీ కెమెరాల్లో రికార్డు ఎవిడెన్స్ దొరికింది” చెప్పాడు హనీఫ్.
ఉలిక్కిపడ్డాడు రంతుల్లా.
బాంబు పేలుళ్ల ఘటనకు కొద్దిరోజుల ముందు.. ఇద్దరు కుర్రాళ్లను ఇంటికి తీసుకొచ్చాడు రహీం.
“కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంటారు అబ్బాజాన్..” చెప్పాడు.. వాళ్లను పరిచయం చేస్తూ.
“మనకు ఉన్నదేదో మనం తింటున్నాం. వాళ్లకు మన తిండి సరిపోతుందా?” అడిగాడు.. కొడుకును ముందు గదిలోకి తీసుకొచ్చి.
“వాళ్ల గురించి నువ్వు ఫికర్ పడాల్సిన పనిలేదు అబ్బాజాన్. వాళ్ల ఖర్చులు ముందే ఇచ్చారు..” అని చెప్పి, పదివేలు రంతుల్లా చేతిలో పెట్టాడు.
“అయ్యో! పైసలు తీసుకొని భోజనం పెట్టడం ఏం బాగుంటుందిరా.. ఇచ్చెయ్!” అన్నాడు.
“ఫర్వాలేదు ఉంచు అబ్బాజాన్” అంటూ బలవంతంగా డబ్బులను తండ్రి చేతిలో పెట్టాడు రహీం.
ఒకరోజు తెల్లవారుజామున.. “పని ఉందని వాళ్లు వెళ్లిపోయారు అబ్బాజాన్!”.. అని చెప్పాడు రహీం.
రహీంను కోర్టుకు పెట్టారు.
సమాచారం తెలిసివెళ్లారు రంతుల్లా దంపతులు.
రహీం కళ్లు గుంటలు పడిపోయి ఉన్నాయ్. దీనంగా అబ్బాజాన్ వంకా, అమ్మీ రజియా వంక చూశాడు రహీం. గుండెలు అవిసిపోయాయి వాళ్లకు.
తీవ్రవాదులకు షెల్టర్ ఇచ్చాడన్న నేరంపై రిమాండ్ విధించాడు జడ్జి. పదిరోజుల తర్వాత ఒంటరిగానే ములాఖత్‌కు వెళ్లాడు రంతుల్లా.
“నేను మోసపోయాను అబ్బాజాన్!”.. అన్నాడు రహీం తలదించుకొని.
కాసేపు మౌనం నడిచింది ఇద్దరి మధ్యా..
“నువ్వు చాలా పెద్దతప్పు చేశావు భేటా! పోలీసులకు నువ్వు చెప్పని సమాచారం కూడా నా దగ్గర ఉంది” చెప్పాడు రంతుల్లా.
ఉలిక్కిపడ్డాడు రహీం.
“గోగుల్ చాట్, బింబినీ పార్కులో వాళ్లు బాంబులు పెట్టే విషయం నీకు ముందే తెలుసు”..
రహీం మొఖంలో రంగులు మారాయ్.
“బింబినీ పార్కుకువెళ్లి లేజర్ షో చూడాలని నీ తమ్ముడు సులేమాన్ వాళ్ల అమ్మీజాన్ వెంట పడుతుంటే.. నువ్వే ఏదో చెప్పి ఆపావ్!”.
రహీం మొఖంలో నెత్తురు చుక్క లేదు.
కాసేపటి తర్వాత తేరుకొని..
“ఈ గడ్డ మీద పుట్టి.. ఈ గడ్డమీద పెరుగుతున్న మనల్ని ఎవరైనా ఈ దేశ పౌరులుగా చూస్తున్నారా అబ్బాజాన్? మనకన్నా మీరు చెప్పే అంటరాని వాళ్లే బెటర్. వాళ్లకు ఇంత అవమానం జరగడంలేదు. మనం ఎక్కడకి వెళ్లినా అవమానం మన వెంటే ఉంటుంది. ఎక్కడా సరైన పనులు దొరక్కపోవడంతో మన పిల్లలు సైకిల్ షాపుల్లోనూ, మోటారు మెకానిక్‌లు గానూ కాస్తో.. కూస్తో చదువుకున్నా నీలా ‘దర్జీ’గానో బతికేస్తున్నారు. ప్రభుత్వానికి మన ఉనికి తెలియడం కోసమే ఈ ‘జీహాదీ’కి ఒప్పుకొన్నా అబ్బాజాన్. వాళ్ల దగ్గర అనుమానాలు తప్ప.. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి, ఇవాళో రేపో బయటికి వస్తాను అబ్బాజాన్! అప్పుడు నా తడాఖా ఏంటో హిందూస్తాన్ ప్రభుత్వానికి చూపిస్తాను”.. రహీం కళ్లలో ఆక్రోశం.
ఒక నిమిషం రహీం కళ్లలోకి చూసి..
“ఏది ఏమైనా.. నువ్వు తప్పు చేశావు రహీం! నువ్వు నా కడుపున పుట్టాల్సిన వాడివికాదు!” అని చెప్పి, విసురుగా బయటికి వచ్చేశాడు రంతుల్లా.
కాలం గిర్రున తిరిగింది.
సులేమాన్ సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించాడు. అతని విజయం చూడటానికి రంతుల్లా లోకంలో లేడు.
అమ్మీజాన్ కాళ్లకు నమస్కారం చేసి.. “అబ్బాజాన్ కోరిక నెరవేర్చాను అమ్మీజాన్!” అన్నాడు సులేమాన్.
రజియా కళ్లనిండా నీళ్లు. రహీం యావజ్జీవ శిక్షను ఉరిశిక్షగా మార్చింది న్యాయస్థానం. కొడుకు ‘ఉరితీత’ తర్వాత రంతుల్లా మానసికంగా కుంగిపోయి మంచాన పడ్డాడు. ఒకరోజు సులేమాన్‌ను దగ్గరికి పిలిచాడు. అప్పుడు పదో తరగతి చదువుతున్నాడు సులేమాన్.
“ఇది మనదేశం బిడ్డా. ఎవరు వెళ్లమన్నా ఇక్కణ్నుంచి వెళ్లం. మన ఊపిరి పోవాల్సింది ఈ గడ్డమీదే. మనకు మరో దేశంలేదు. హిందూస్థానే మనదేశం. మనమంతా భారతీయులమే. మనం సెల్యూట్ చేయాల్సింది మనదేశ పతాకం.. మూడు రంగుల జెండాకే. మా అబ్బాజాన్ వాళ్ల అబ్బాజాన్ కూడా ఇక్కడి మట్టిలోనే కలిసిపోయారు. మీ అన్న దారి తప్పాడు. నువ్వు అలా ఎప్పటికీ కాకూడదు. చదువుకొని పైకెదిగే వాళ్లకు ఆకాశమే హద్దు. పెద్దాయన అబ్దుల్ కలాం ఒక ముసల్మాన్. కానీ, ఆయనెప్పుడూ ఒక ముసల్మాన్ అని ‘గిరి’ గీసుకొని బతకలేదు. దేశ రక్షణ తన బాధ్యత అనుకొని సైన్యం కోసం ఎన్నో అస్ర్తాలను కనుగొన్నాడు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందు భారత్ తలెత్తుకొని నిలిచేలా దేశాన్ని తీర్చిదిద్దాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.. దేశంలో అమలైనంత వరకూ మనల్ని ఎవరూ కదలించలేరు బిడ్డా! ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే నువ్వు బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలి.. పెద్ద పోలీస్ ఆఫీసర్‌వు కావాలి”.. రంతుల్లా తల వాలిపోయింది.
ఇదంతా గుర్తొచ్చింది సులేమాన్‌కు. రజియాలో జ్ఞాపకాలు కదిలాయ్.
“మీరిలా చేయాల్సింది కాదు!” అన్నది రజియా.
“అలా చేయకపోతే రేపు వీడు బయటికి వస్తే.. ‘జీహాది’ పేరుతో ఇంకెంత మారణహోమానికి కారణమవుతాడో నువ్వు ఊహించగలవా? ఆరోజు వాడికి తెలుసు కాబట్టే.. బింబినీ పార్కుకు సులేమాన్ వెళ్లకుండా ఆపాడు. వాడి తమ్ముడిలాంటి ప్రాణాలే కదా.. అక్కడ కూడా పోయింది. అందరికీ నీలాంటి కడుపు తీపి ఉంటుంది కదా రజియా. అందుకే వాడు మాట్లాడేప్పుడు ఫోన్లో రికార్డు చేసిన ఆడియోను పోలీసు అధికారులకు ఇచ్చాను. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. వాడసలు నా కడుపున పుట్టలేదనే అనుకుంటాను” అన్నాడు రంతుల్లా.
అలా అన్నాడే కానీ.. అతని కళ్లనిండా నీళ్లు.
‘అక్కడికి వెళ్లనీకుండా చేసి.. నా తమ్ముడు సులేమాన్‌ను కాపాడుకున్నాను’ అని ఉర్దూలో రహీం రాసిన డైరీ కాగితం రజియా చేతిలో పెట్టాడు.
టెలివిజన్ చానళ్లు రంతుల్లా రికార్డు చేసిన రహీం ఆడియో టేపుల్ని పదేపదే ప్రచారం చేశాయ్. అంతటితో ఆగకుండా రహీంకు ‘బాంబే’ పేలుళ్లతో నేరుగా సంబంధం ఉందన్న వార్తలు కూడా ప్రసారం చేశాయ్.
“అబ్బాజాన్ కరెక్ట్‌గానే చేశాడు అమ్మీ..” అన్నాడు సులేమాన్.. అమ్మ కన్నీళ్లను తుడుపుతూ ఆరోజు.
ఇది మనదేశం బిడ్డా.
ఎవరు వెళ్లమన్నా ఇక్కణ్నుంచి వెళ్లం. మన ఊపిరి పోవాల్సింది ఈ గడ్డమీదే. మనకు మరో దేశంలేదు. హిందూస్థానే మనదేశం. మనమంతా భారతీయులమే. మనం సెల్యూట్ చేయాల్సింది మనదేశ పతాకం.. మూడు రంగుల జెండాకే.
మానవ సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ఆకాంక్షతో సాహితీ సేద్యం సాగిస్తున్నారు శరత్ చంద్ర. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. ప్రస్తుత నివాసం హైదరాబాద్. సమకాలీన సమాజానికి అద్దం పట్టేలా రచనలు చేయడాన్ని ఇష్టపడతారు శరత్ చంద్ర. ఇప్పటివరకూ 300కు పైగా కథలు, 20 నవలలు రాశారు. ఇందులో 60కి పైగా కథలు బహుమతులు పొందాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, ఈనాడు, సాక్షి, జాగృతి, విశాలాక్షి, సహరి, సాహో వంటి పత్రికలు బహుమతులిచ్చి ఆదరించాయి. ‘సమాహారం’, ‘కమ్లి’ పేర్లతో కథా సంకలనాలను వెలువరించారు. సాహితీ సేవలో భాగంగా తానా సాహితీ వేదికలోనూ, ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. ‘వసుమతి మాధవ సాహితీ’ పురస్కారం అందుకున్నారు. అనేక సన్మానాలు పొందారు. ప్రస్తుతం ‘ఉషా’ పక్ష పత్రిక సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
-శరత్ చంద్ర