06.02.2014. రాత్రి గం. 7.15 ని.‘దయచేసి వినండి. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లవలసిన ట్రెయిన్ నెంబర్ 12762 తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది..’ ప్రకటన పూర్తి కాకముందే.. ఒక్క కుదుపుతో ట్రైన్ కదిలింది.
బన్నూ.. కిటికీ పక్క సీట్లో కూర్చుంది. పక్కన డా.రావు. మిగిలిన సీట్ అంతా ఖాళీ. డా.రావు చిన్నమ్మాయి శర్వాణి. బన్నూ.. ఆమె ముద్దుపేరు. వాళ్ల ముందు సీట్లో వాళ్లకంటే ముందే ఒక కుటుంబం వచ్చి కూర్చున్నారు. ముప్ఫై ఏళ్లుండే వివాహిత. ఆమెకు ఒకపక్క మూడేళ్ల పాప. మరోపక్క బెర్త్ మీద పడుకోబెట్టిన చిన్న బిడ్డ. అటుపక్క సింగిల్ సీట్లో కాస్త వయసు మళ్లిన మగ మనిషి. అదీ ఆ కుటుంబం. డా.రావు ఆ నలుగుర్నీ ఒకసారి తేరిపార చూశాడు.
ఉన్న పాతచీరల్లో కాస్త పరవాలేదు అనదగ్గ చీర కట్టుకున్నట్టుగా ఉందామె. కట్టు, బొట్టు, మాట, చూపు.. ఒద్దికగా, హుందాగా ఉన్నాయి. బెర్త్‌పైన పడుకున్నది పాపో, బాబో తెలీదు. పాత లుంగీ కప్పి ఉంది. మూడేళ్ల పాప ఒంటిమీద దారపు పోగులు వేలాడుతూ, సాగిపోయిన పాత ఫ్రాక్. నడి వయసు వ్యక్తి పంచె, చొక్కా, భుజం మీద కండువా వేసుకున్నాడు. చొక్కా భుజాల కింద చిరిగింది. పంచెకు అక్కడక్కడా రంధ్రాలు. పాతబ్యాగులు, గోనెమూటలు. అందరినుంచీ ఒకలాంటి మాడిపోయిన నూనె వాసన. ఇవన్నీ ఆ కుటుంబం మధ్య తరగతి కంటే దిగువస్థాయిలో ఉందని చెప్పడానికి పోటీపడుతున్నాయి.
ఇటుపక్క విషయానికొస్తే.. బన్నూ కొత్త ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంది. డా.రావు ఒంటిమీద ఇస్త్రీ మడత నలగని మంచి ప్యాంట్, షర్ట్. టక్ చేసుకున్నాడు. వాళ్లు వాడిన ఫేస్‌వాష్‌లు, బాడీలోషన్స్, క్రీమ్స్, పౌడర్లు, స్ప్రేలు.. వాళ్ల ఉనికిని ఘుమఘుమలతో చాటుతున్నాయి. ఆ తండ్రీ కూతురు వచ్చి కూర్చోగానే.. వాళ్లేదో దారితప్పి వచ్చినట్టు అనుమానంగా చూసింది అవతలి కుటుంబం. చూడటమేకాదు.. నడి వయసు వ్యక్తి అడిగాడు కూడా.
“సారూ గిదెక్కిన్రు! గిది మామూలు డబ్బా.. జూసిన్రా?” అని.
డా.రావు చిన్నగా నవ్వాడు.
“ఆ.. చూశాను. మా జర్నీ జస్ట్ ఫైవ్ అవర్స్ ముందు ఫిక్స్ అయింది. తత్కాల్ టిక్కెట్స్‌కు కూడా చాన్స్ లేదు. జర్నీ కంపల్సరీ.. సో.. జనరల్ కంపార్ట్మెంట్”..
డా.రావు మాట్లాడిన పదాలు పెద్దాయనకు తెలీకపోయినా.. గత్యంతరం లేక, కావాలనే ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కారనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకున్నాడు. తన మాటలకు ఎదురుగా కూర్చున్న ఆమె కాస్త ఇబ్బందిగా కదలడం డా.రావు గమనించాడు.
డా.రావుకు ఆ కుటుంబం గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఎలా మొదలుపెట్టాలో తెలీక ఆలోచిస్తున్నాడు. మూడేళ్ల పాపను లక్ష్యంగా చేసుకుని..
“హాయ్!” అని పలకరించాడు.
ఆ పాప ఒకసారి అతనివైపు చూసి, అంతలోనే బిడియంగా తల దించేసుకుంది.
“స్కూల్‌కు వెళ్తున్నావా?”..
సమాధానం లేదు.
“ఏ ఊరికి వెళ్తున్నావ్?”..
మళ్లీ మౌనమే సమాధానం.
ఇంక లాభం లేదని డా.రావు పథకం మార్చాడు.
“మనం ఒక ఆట ఆడుకుందామా? నీకు ఇష్టమైన వాళ్ల పేర్లు నువ్ చెప్పాలంట. ఎన్ని పేర్లు చెప్తే అన్ని చాక్లెట్స్ ఇస్తానంట. రెడీనా మరి?”.
పాప ఒకసారి తలెత్తి చూసి.. మళ్లీ దించేసుకుంది.
‘ముందు చాక్లెట్స్ చూపించు’ అన్నట్టుగా ఉన్నాయి పాప చూపులు.
“ఏంటీ! నమ్మకం లేదా? అయితే చూడు..” అంటూ డా.రావు తన ప్యాంట్ పాకెట్లోంచి మూడు చాక్లెట్స్ బయటికి తీశాడు. చాక్లెట్స్‌ను చూడగానే పాప మౌనాన్ని వదిలేసింది. బన్నూ ఆసక్తిగా గమనిస్తున్నది.
“సిట్టి.. సుజాత.. పోష.. య!”.
మూడు చాక్లెట్స్ బయటికి తీసినందుకో ఏమో..
పాప సరిగ్గా మూడు పేర్లు చెప్పి ఆగిపోయింది.
“ఎవరు వీళ్లంతా? నీ ఫ్రెండ్సా?”.
పాప ఒకసారి తల అడ్డంగా ఊపి..
“నేను.. అమ్మ.. తాతయ్య!” అని చెప్పి, కొంత సమాచారం ఇచ్చింది.
మూడు పేర్లు తెలుసుకున్నాడు.
“వెరీ నైస్ చిట్టీ. మీ ముగ్గురి పేర్లు చెప్పావ్. మరి అమ్మ పక్కన..” అతని మాట పూర్తికాకముందే సుజాత కల్పించుకుంది.
“సిట్టీ.. గీ దుప్పటి తాతకియ్యవే! సలైతాంది. నువ్ ఆడ్నే కూసో. సీట్ పోతే పరేషాన్ అయితది”.
ఆమె మాటలు డా.రావుకు అసహజంగా అనిపించాయి. తాతయ్యకు నిజంగా దుప్పటి ఇవ్వడానికి కాకుండా.. సంభాషణను మరల్చడానికి అలా అన్నట్టుగా అనిపించింది.
ట్రైన్ పెద్దపల్లి స్టేషన్లో ఆగింది. డా.రావు క్యాంటీన్‌కు వెళ్లి, పది నిమిషాల్లో తిరిగొచ్చాడు. అతని చేతిలో ఐదు ఇడ్లీ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్స్ ఉన్నాయి.
“పోచయ్యా.. తీస్కో!” అంటూ పోచయ్యకూ, చిట్టికి, సుజాతకూ ఒక్కో ఇడ్లీ ప్యాకెట్ ఇచ్చాడు డా.రావు.
వాటితోపాటే రెండు వాటర్ బాటిల్స్, ఒక కూల్‌డ్రింక్ బాటిల్ కూడా ఇచ్చాడు. చిట్టీ, పోచయ్య మారుమాట్లాడకుండా తీసుకున్నారు. సుజాత మాత్రం ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అంతలోనే తేరుకొని..
“గిదేంది సార్? మీ కొరకు దెచ్చుకున్నవి మాకు ఇస్తున్రు? అద్దు సార్.. మీరే తీస్కోండ్రి. బండిల అమ్మేటోళ్లు అచ్చినంక మేం గూడ దీస్కుంటం!” అంటూ, తిరిగి ఇవ్వబోయింది.
“ఒక్క నిమిషం! ఈ రోజు మా బన్నూ బర్త్‌డే. ఇంట్లో ఉంటే అందరికీ చాక్లెట్స్, కేకులు, స్వీట్స్ పంచడం.. అన్నీ ఉంటాయ్. కానీ, అర్జెంట్ ప్రయాణమని చెప్పాను కదా. మా పాప సంతోషం కోసం కేకు, స్వీట్స్ బదులు ఇవి ఇస్తున్నాను. మీరు తీసుకోకపోతే మేం ఇద్దరం బాధపడతాం”.. నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు డా.రావు.
ట్రైన్ పెద్దపల్లి నుంచి బయల్దేరింది.
సుజాత ఇంకా తటపటాయిస్తూనే ఉంది.
“ఇక్కడ మీరు, మేం తప్ప ఇంకెవరూ లేరు కదమ్మా! ఇంకో విషయం చెప్పనా? ఇది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. పైగా రాత్రి. ఈ బండిలో అమ్మేవాళ్లు రారు. ఇంకేం ఆలోచించకు.. తీస్కో!” అన్నాడు డా.రావు.
అతని మాటలకు సుజాత సమాధాన పడింది. అన్యమనస్కంగానే అతనిచ్చినవి తీసుకుంది. బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పాలో చెప్పకూడదో.. ఎలా చెప్పాలో తెలీక, బన్నూవైపు ప్రేమగా నవ్వుతూ చూసింది సుజాత.
“నాన్నా.. ఇన్ని రోజులూ నా బర్త్‌డే జులై 9 అనుకున్నాను. సరే.. ఇంక ఇప్పటినుంచి ఫిబ్రవరి 6కే చేసుకుంటాలే!”.. రావు చెవిలో మెల్లగా అన్నది బన్ను. ఆమె సూక్ష్మం గ్రహించినందుకు చిన్నగా నవ్వుకున్నాడు.
డా.రావు, బన్నూ ఇడ్లీలు తిన్నారు. వారితోపాటే చిట్టి, పోచయ్య కూడా తిన్నారు. సుజాత గిల్టీగా ఫీలవుతున్నట్టు గ్రహించాడు రావు. ఆమె తినకుండా ప్యాకెట్‌ను తన పక్కన పెట్టుకుంది.
“మా అందరిదీ అయిపోయింది. చల్లగా అవ్వకముందే టిఫిన్ తింటే బాగుంటుంది కదా!”.. సుజాతతో అన్నాడు డా.రావు.
“అలాగే సార్.. తింటాను” అన్నది సుజాత.
“దర్శనానికి వెళ్తున్నారా తిరుపతికి?”.
“లేదు సార్. మా ఆయన దగ్గరికి పోతున్నం!”.
“అవునా! ఎక్కడ ఉంటాడు మీ ఆయన?”.
“సింతామనిలో సార్”.
“ఏం పనిచేస్తాడు అక్కడ?”.
“రాళ్లు కొట్టేడిది. గ్రానైట్‌లో సార్”.
“మదనపల్లి నుంచి బెంగుళూర్ వెళ్లే దారిలో వస్తుంది.. ఆ చింతామణేనా?”.
“అవును సార్.. గదే! మీకు దెల్సా సార్?”.
“మదనపల్లి మా అత్తగారి ఊరు. అలా తెలుసు. చూసి రావడానికి అందరూ కలిసి వెళ్తున్నారా?”.
“లేదు సార్.. ఆడ్నే ఉండేటందుకు పోతున్నం. ఆయన అచ్చిపోయేటందుకు తిప్పలైతాంది. మస్తు కిరాయిలైతున్నయ్. గిట్ల కాదని ఆడ్నే రూము జూసిండు”.
“అదే మంచిది. బయటి తిండి తినాలన్నా ఖర్చు ఎక్కువే అవుతుంది. దానికి తోడు ఆనారోగ్యం. ఇప్పుడైతే మంచైనా చెడైనా ఒకరికొకరు తోడుంటారు. ఉన్నదేదో కలిసి తింటారు!”.
“అవును సార్.. గందుకే పోతన్నం!”.
సుజాతలో ఏదో తెలీని ప్రత్యేకత కనిపిస్తున్నది డా.రావుకు. ముప్పై ఏళ్లలోపు వయసున్న పేద యువతి. చామనఛాయ. నుదుట కుంకుమ. కళ్లకు కాటుక. చేతులకు మట్టిగాజులు. కాళ్లకు పట్టీలు. మెడలో పసుపు తాడు. తలలో పూలు. కట్టింది పాత చీరే అయినా.. ఆ కట్టూబొట్టు ఎంతో హుందాగా, సంప్రదాయంగా ఉన్నాయి. నడకలో అణకువ. మాటలో ఒద్దిక. కళ్లల్లో ఆత్మవిశ్వాసం. ప్రతి కదలికలో ఆత్మీయత. ఆమె అణువణువులో ఆత్మాభిమానం. వెరసి సంపూర్ణమైన ఓ తెలుగు పల్లెపడుచు. నిండైన ఓ అమ్మ. అయిదోతనానికి అసలైన చిరునామా. డా.రావుకు చాలా ముచ్చటేసింది. సుజాతను చూస్తుంటే ఆమెపైన ఒక గొప్ప అభిమానం, గౌరవభావం ఏర్పడ్డాయి అతనిలో.
డా.రావు ఆమెను నిశితంగా పరిశీలించాడు. ఆమె తనమీద కానీ, కూతురు మీద కానీ, మామగారి మీద కానీ, లగేజీ మీద కానీ అంతగా దృష్టి పెట్టడం లేదు. ఆమె ధ్యాసంతా బెర్త్‌పైన పడుకోబెట్టిన చిన్నారి మీదనే ఉంది. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో స్పందిస్తున్నది. ఆ బిడ్డపై ఈగను కూడా వాలనివ్వడం లేదు. డా.రావు సుజాత గురించి తెలుసుకొనే మరో సంఘటన అప్పుడే మొదలయ్యింది. అది జనరల్ కంపార్ట్మెంట్ కావడంతో ఈగలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ మూకుమ్మడిగా కంకణం కట్టుకొని.. ఆ అమ్మ అమ్మతనాన్నే పరీక్షిస్తున్నట్టు ఆ బిడ్డపైన వాలడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. పాత న్యూస్ పేపర్‌తో గాలి వీస్తూ, చిన్నారి మీద ఈగలు వాలకుండా చూస్తున్నది సుజాత.
మందగమనంతో తిరుగుతున్న ఒక పంఖాలా, ఒక యంత్రంలా ఆమె చెయ్యి అలుపులేకుండా అలా పేపర్‌ను ఊపుతూనే ఉన్నది. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఆమె చేతిలోని పేపర్ కొన.. చిన్నారి మీద కప్పిన లుంగీకి తగిలింది. చిన్న శబ్దం. బిడ్డలో లిప్తపాటు చిన్న కదలిక. అంతే.. సుజాత ఉలిక్కిపడింది. ఆమె కళ్లలో ఆందోళన. తాను ఏదో తప్పు చేసినట్టు, తనను తాను నిందించుకుంటున్నట్టు ఆమె ముఖ కవళికలు చెప్పకనే చెప్తున్నాయి. తన ముద్దుల బిడ్డ ఉలిక్కిపడేలా చేసిన పేపర్‌ను క్షమించలేక.. అలా అని శిక్షిస్తే వచ్చే గరగర శబ్దంతో తన గారాల పట్టికి నిద్రాభంగం కలిగించలేక.. చేష్టలుడిగి చూస్తుండి పోయింది. పేపర్‌ను సీట్ కిందికి నెట్టేసింది.
సుజాత క్షణకాలం తత్తరపాటుకు లోనుకావటాన్ని ఈగలు అవకాశంగా తీసుకున్నాయి. తమ దాడికి అదునుగా మార్చుకుని.. విశ్వామిత్రుడి యజ్ఞాన్ని భగ్నం చేస్తున్న రాక్షసుల్లా, చిన్నారికి ఇబ్బంది కలిగించడానికి ఝుమ్మని రొదచేస్తూ, ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
దాంతో సుజాత తన చేతినే ఆయుధంగా చేసుకుంది. కుడి అరచేతిని విసనకర్రలా ఊపుతూ, ఈగలు వాలకుండా బిడ్డను కాపాడుతున్నది.
రాత్రి పది గంటలైంది. ట్రైన్ వరంగల్ దాటింది. డా.రావు కిటికీ దగ్గర కూర్చొని, మిగిలిన సీట్లో బన్నును పడుకోబెట్టాడు. ఎదురు సీట్ మీద పసిబిడ్డ, సుజాత. పోచయ్య సింగిల్ సీట్లో అలాగే నిద్రపోయాడు. అతని ఎదురు సీట్లో చిట్టి ముడుచుకొని పడుకున్నది.
“బిడ్డను అటువైపు జరిపి నువ్వు కూడా పడుకోవచ్చు కదమ్మా!”.. సుజాతకు సలహా ఇచ్చాడు డా.రావు.
“అయ్యో.. అద్దు సార్. జాగ సరిపోదు. బిడ్డ నలిగి పోతది. పోనీ కింద బట్టపరిసి పండ బెడుదామంటే.. అందరు నడిసిన్రు గదా. మంచిగ ఉండది. బీమార్ అయితది!” చెప్పింది సుజాత.
“పోనీ.. వేరే చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టవచ్చు కదా?” మరో సలహా ఇచ్చాడు అతను.
“అమ్మో.. గాలికి ఒక్కోసారి ఉయ్యాల చెక్కలకు గుద్దుకుంటాది సార్. గదింకా పరేషాన్!”.
డా.రావు ఇంక ఏమీ అనలేకపోయాడు.
సుజాత గురించే ఆలోచిస్తున్నాడు డా.రావు.
‘ఎంత మంచి అమ్మ! అసలు అమ్మ అంటేనే మంచిది. కానీ ఈమె మంచి అమ్మల్లోనే మరీ మరీ మంచి అమ్మలా ఉంది!’ అనుకున్నాడు.
సుజాత ప్రేమను ఇంతగా పొందుతున్న ఆ పసిబిడ్డ అదృష్టానికి ముచ్చటేసింది. ఆ చిన్నారి భాగ్యశాలిని, అదృష్టవంతుణ్ని ఒకసారి చూడాలనిపించింది అతనికి. ఇప్పుడు కాదు.. సుజాత ఈగలతో యుద్ధం చేసిన తీరు చూసినప్పుడే అతనికి ఆ ఆశ కలిగింది. కానీ, చూసే అవకాశం రాలేదు. అతణ్ని ఊరిస్తూ, వేచి ఉండమని చెప్తున్నట్టు.. వటపత్ర శాయిలా, అమ్మ సంరక్షణలో హాయిగా బజ్జున్నాడు ఆ బిడ్డ. ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు అతను.
ఉదయం ఆరు గంటలు. డా.రావుకు మెలకువ వచ్చింది. కళ్లు తెరవగానే, అరచేతులు చూసుకుంటూ..
“కరాగ్రే వసతే లక్ష్మీ..” శ్లోకం చదువుకొని, తర్వాత భూదేవికి క్షమాపణలు చెప్పుకొని, ఆ తర్వాత దేవుడి గదిలోని చిత్రపటాలకు నమస్కరించడం అతని రోజువారీ అలవాటు. ఈరోజు మాత్రం ముందుగా సుజాత ముఖాన్ని చూడాలనిపించింది అతనికి. మెల్లగా కళ్లు తెరిచి సుజాత ముఖాన్ని చూశాడు. తృప్తిగా, హాయిగా అనిపించింది అతనికి.
సుజాత కళ్లు ఎర్రగా ఉన్నాయి. ఆమెకు రాత్రంతా నిద్రలేదు. కంటిమీద కునుకు లేకుండా, బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటూ కూర్చుంది. డా.రావు నిన్న రాత్రి పడుకున్న తర్వాత మధ్యలో మూడుసార్లు లేచాడు. ఆ మూడుసార్లూ అతనికి కనిపించిన దృశ్యం ఒక్కటే!
అతను నిద్రపోయే ముందు, బిడ్డ పక్కన సీట్‌మీద కూర్చున్న సుజాత.. ఆ తర్వాత అక్కడ లేదు. రెండు సీట్లకు మధ్యలో న్యూస్‌పేపర్ పరుచుకొని, బిడ్డవైపు తిరిగి కూర్చుంది. ఒక చేతిని బిడ్డ తల దగ్గర, మరో చేతిని కాళ్ల దగ్గర పెట్టి.. బిడ్డనే చూస్తూ కనిపించింది రాత్రంతా. రైలు కుదుపులకు, నిద్ర వల్ల బిడ్డ జారి పడిపోకూడదని సుజాత ఆరాటం. ఆ చిన్నారి నిద్రా సామ్రాజ్యంలోకి ఏ శత్రువూ రాకుండా స్వయంగా కాపలా కాసింది. ఆమె తల్లి ప్రేమ పక్వానికొచ్చి, పండి, కళ్లల్లో రాలినట్టు సుజాత కళ్లు ఎరుపెక్కాయి.
ట్రైన్ గూడూరు సమీపంలో సిగ్నల్ కోసం ఆగింది. సుజాత మొహంలో ఆందోళన! తిరుపతిలో రైలు దిగిన తర్వాత బిడ్డకోసం పాలు తీసుకోవాలనుకుంది ఆమె. కానీ బండి గంటన్నర ఆలస్యంగా నడుస్తున్నది. పాలు తప్పనిసరి. ఒకసారి బయటికి చూసి వెంటనే కిందికి దిగిపోయింది. పోచయ్యతోపాటు డా.రావు కూడా ఆమె ఏం చెయ్యబోతున్నదా అని చూస్తున్నారు.
అవతలి వైపు ప్లాట్‌ఫామ్ మీద ఒక పుష్పుల్ ప్యాసింజర్ ఆగివుంది. ఆ బండికి తిరుపతి బండి ఆగిన ట్రాక్కూ మధ్యలో మరో ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ దాటుకొని వెళ్లి, పుష్పుల్ బండిలో టీ-కాఫీ అమ్ముకునే వాళ్ల దగ్గర పాలు తీసుకోవాలన్నది సుజాత ఆలోచన. మధ్యలో ఉన్న ట్రాక్‌ను దాటి ప్యాసింజర్‌లోని ఒక్కో బోగీలో టీ అమ్మేవాళ్లు ఉన్నారేమో చూసుకుంటూ నడుస్తున్నది. ప్యాసింజర్ చివరి బోగీ వరకూ వెళ్లిపోయింది. అక్కడ ఆమెకు పాలు దొరికాయి. అదంతా గమనిస్తున్న డా.రావుకు గుండె దడ పట్టుకుంది.
‘ఇప్పుడు బండి కదిలితే పరిస్థితి ఏంటి? మధ్యలో ఉన్న ఖాళీ ట్రాక్ మీద వేరే ట్రైన్ వస్తే?’ డా.రావుకు చెమటలు పట్టేశాయి. అతను భయపడ్డట్టే తిరుపతి బండికి రెడ్ సిగ్నల్ నుంచి ఎల్లో సిగ్నల్ వచ్చింది. చూస్తూ ఉండగానే ఎల్లో సిగ్నల్ గ్రీన్ అయ్యింది. అక్కడ సుజాత ఇంకా చిల్లర తీసుకుంటూ ఉన్నది. గార్డ్ విజిల్ ఊదాడు. ఇంజిన్ నుంచి హారన్.
డోర్ దగ్గర నిలబడి చూస్తున్న డా.రావు క్షణంలో ఒక ఆలోచనకొచ్చాడు. సుజాత తమ కోచ్ దగ్గరికి చేరుకోవడం జరిగేపని కాదు. ట్రైన్ కదిలేవరకు ఆగి.. కదలగానే చైన్ లాగి బండిని ఆపాలనీ, తర్వాత ఫైన్ తానే కట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. గార్డ్ మళ్లీ విజిల్ వేశాడు. ఇంజిన్ నుంచి మళ్లీ హారన్. డా.రావు కళ్లు మూసుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటున్నది. క్షణాలు గడుస్తున్నాయి. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు.
“సార్.. జర తొవ్వ ఇయ్యురి!”..
ఆ మాటలకు డా.రావు ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. ఎదురుగా పాల సీసాతో సుజాత. పక్కకు జరిగాడు. సుజాత లోపలికి ఎక్కిన మరుక్షణం బండి బయల్దేరింది.
“అంతదూరం వెళ్లిపోయావు. గార్డ్ విజిల్, బండి హారన్ ఏమీ పట్టించుకోలేదు నువ్వు. మధ్యలో వేరే బండి వచ్చి, మన బండి కదిలిపోతే ఏం చేసేదానివి? ఏంటీ ఆ మొండితనం? చూసుకోవాలి కదా?”.. కాస్త చనువు తీసుకొని సున్నితంగా మందలించాడు రావు.
అందులో మందలింపు కంటే ఆత్మీయత, అభిమానమే వినిపించాయి సుజాతకు.
“అవునా సార్! అయ్యో మాఫ్ జేయుండ్రి! మీరు మా గురించి ఇంతగా అర్సుకుంటరని అనుకోలే. నేను బండి గురించి, దేని గురించి ఆలోసించలే. బిడ్డకు పాలు ఎట్ల దేవాల్ననే ఆలోచన ఒక్కటే ఉండె!”.
‘మనిషి ఒక మంచి కోరికను మనస్ఫూర్తిగా, బలంగా కోరుకున్నప్పుడు దానిని నెరవేర్చడానికి, నిజం చేయడానికి ప్రకృతి తనలో సర్దుబాట్లు చేసుకుంటుంది. విశ్వం తనను తాను పునర్మించుకుంటుంది’.. యోగా సెషన్స్‌లో వరంగల్ కిట్స్ ప్రొఫెసర్ డా.నరేందర్ రెడ్డి పదేపదే చెప్పిన మాటలు గుర్తొచ్చాయి డా.రావుకు. ఆ మాటలు నిజమేననే నమ్మకం ఇప్పుడు కలిగింది.
‘సుజాత దూరంగా ఉంది. ట్రైన్ కదులుతున్నది. ఆమె ఎక్కలేదు.. చైన్ లాగాలి, ఫైన్ కట్టాలి!’ ఇలాంటి ప్రతికూల ఆలోచనలే చేశాడు రావు. కానీ సుజాత తన బిడ్డకు తప్పకుండా పాలు కావాలనే నిస్వార్థ కోరికను, పరిసరాలను కూడా మర్చిపోయేటంత బలంగా కోరుకుంది. ఆ తల్లి ప్రేమ ముందు, కోరిక ముందు ప్రకృతి పులకించి, విశ్వం ఆనందంగా తనను తాను పునర్నిర్మించుకుంది. ట్రైన్ కదలకపోడానికి కారణాన్ని తనలో తానే విశ్లేషించుకున్నాడు డా.రావు.
ట్రైన్ శ్రీకాళహస్తి దాటింది. తిరుపతి చేరుకోడానికి ఇంకో 45 నిమిషాలే ఉంది. ఈలోగా సుజాత గారాలపట్టిని మనసారా చూడాలనే కోరిక డా.రావులో క్షణక్షణానికీ బలపడుతున్నది. కొని తెచ్చిన పాలు పట్టించాలంటే.. ఇప్పుడు ముసుగు తొలగించాలి కదా. ఆ క్షణం కోసం కాచుకున్నాడు అతను.
“మామా.. బిడ్డకు పాలు తాపిస్తా. సిట్టి అటుయిటూ పోకుండా చూస్కో!”..
సుజాత మాటలు విన్న డా.రావుకు ఎగిరి గంతేసినట్టయ్యింది. కళ్లు పెద్దవి చేసుకొని పాతబట్ట కింద పవ్వళిస్తున్న చిన్నారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు అతను. సుజాత బయట ఉన్న చిన్నచిన్న వస్తువులను బ్యాగుల్లో సర్దుకుంటున్నది తప్ప.. పాలు పట్టించే ప్రక్రియ మొదలుపెట్టలేదు.
“ఇగో మామా.. ఇంటున్నవా? బిడ్డకు పాలు తాపిస్తా.. సిట్టి అటుయిటూ పోకుండా చూస్కో!”..
సుజాత మాటకు ఆలోచనలో పడ్డాడు డా.రావు. ఆ మాట రెండుసార్లు చెప్పడంతో.. అది పోచయ్యకు కాకుండా పరోక్షంగా తనకే చెబుతున్న భావన కలిగింది.
‘బహుశా ఇప్పుడు తెచ్చిన పాలు కాకుండా.. తల్లిపాలే పడుతుందేమో!? ఎదురుగా నేనుంటే.. ఆ అసౌకర్యాన్ని, ఇబ్బందిని ఆమె ఆ రకంగా తెలియచేస్తున్నట్టు ఉంది!’ అనుకున్నాడు డా.రావు. ఒకింత సిగ్గుపడ్డాడు. లేచి యథాలాపంగా వెళ్తున్నట్టు డోర్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. బన్నూ అతణ్ని అనుసరించింది.
పావుగంట గడిచింది. బన్నూని పంపి.. పాలు తాగించడం పూర్తయ్యిందో లేదు చూసి రమ్మన్నాడు డా.రావు. పూర్తి అయ్యిందని సైగ చేశాక వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. బిడ్డవైపు చూశాడు. పైన కప్పిన బట్ట మారింది. లోపల కదులుతున్న అలికిడి. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోవడంతో డా.రావు నిరాశపడ్డాడు. ఈసారి డా. నరేందర్ రెడ్డి మాటల్ని మళ్లీ గుర్తు చేసుకుంటూ.. బిడ్డను చూడాలనే కోరికను మరింత బలంగా కోరుకొని, విశ్వం ఇచ్చే సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
కానీ, విశ్వం అంత త్వరగా స్పందిస్తుందని అతను ఊహించలేదు. చిట్టి రూపంలో ప్రకృతి తన సమాధానాన్ని పంపింది. చాలా సేపట్నుంచి తాతయ్య ముందు కూర్చొని ఉన్న చిట్టి, మార్పుకోసం సుజాత సీట్ దగ్గరికి వచ్చింది. చిన్నారి పక్కన కూర్చొని, తల ఆనించి, కప్పి ఉన్న బట్ట పైనుంచే బిడ్డను ముద్దు చేస్తున్నది.
“ఏయ్ సిట్టీ. ఏం జేస్తున్నవే? నిద్ర లేపి పరేషాన్ జేయకు బిడ్డా! గిట్రా”.. పోచయ్య హుకుంతో చిట్టి వేగంగా తల ఎత్తి లేచి నిల్చుంది. చిట్టి తలలోని పాపిట పిన్ను బిడ్డ మీద కప్పిన పాత బట్ట చిరుగుల్లో ఎక్కడో ఇరికింది. చిట్టితోపాటే బట్ట మొత్తం పైకి లేచి వచ్చేసింది.
లోపల నగ్నంగా బిడ్డ. ఊహించని ఆ హఠాత్ సంఘటనకు సుజాత నివ్వెరపోయింది. బన్నూ.. భయంతో కళ్లు మూసుకుంది. డా.రావు బిగుసుకు పోయాడు. బ్రహ్మాండం బద్దలైనట్టు.. బ్రహ్మ రహస్యం బట్టబయలైనట్టు రావు చేష్టలుడిగి చూస్తుండిపోయాడు.
అక్కడ.. సీట్ మీద.. దాదాపు ఒక చిన్న సజీవ ఎముకల గూడు. ఏ మాత్రం కండలేని కాళ్లు చేతులు. వాటి ఎముకలకు బలవంతంగా చుట్టినట్టున్న చర్మం. పుర్రెకు చర్మం పూత పూసినట్టున్న తల. లోతైన కళ్లు. దాదాపు అరచేయి వెడల్పులో ఉన్న పొట్ట.. ఆడ శిశువు. డా.రావుకు కడుపులో తిప్పినట్టు అయ్యింది. ‘అలాంటి గొప్పతల్లికి దేవుడు ఇలాంటి బిడ్డనిచ్చాడా?’ అనుకున్నాడు. అతను తేరుకోడానికి చాలా సమయం పట్టింది.
“ఏంటమ్మా ఇది?”.. ఏం అడగాలో, ఎలా అడగాలో తెలీక ఆగిపోయాడు డా.రావు. సుజాత పాప మీద బట్ట కప్పుతూ మౌనంగా తలవంచుకుంది.
“ఎప్పట్నుంచి ఇలా?” మళ్లీ అతనే అడిగాడు.
“పుట్టిన రెండు నెలలసంది సార్!”.
“మరి డాక్టర్స్ ఏమన్నారు?”.
“మంచిగ తిండి పెట్టి అర్సుకుంటే.. కొంతకాలానికి మంచిగైతే కావచ్చు. లేకపోతే గిట్లే ఉండొచ్చన్నరు!”.
“మరి ఇప్పటికి ఎన్ని నెలలైంది?”.
సుజాత ఓసారి అతనివైపు చూసి తల దించుకుంది.
“చెప్పకూడదా?” రెట్టించాడు రావు.
“మూడున్నరేండ్లు”.
హతాశుడయ్యాడు రావు. తన చెవులను తానే నమ్మలేనట్టు.. మరోసారి కొయ్యబారిపోయాడు.
“మూడున్నర సంవత్సరాలా?” అతని మాట అతనికే వినిపించనంత చిన్న స్వరంతో అన్నాడు రావు.
అవునన్నట్టు తలూపింది సుజాత.
“మరి.. చిట్టి వయసెంత?” అడిగాడు రావు.
“మూడు సంవత్సరాలు”.
“అంటే..? ఈ పాప చిట్టి కంటే పెద్దదా?”.
మరోసారి అవునన్నట్టు తలూపింది సుజాత.
రావు అవాక్కయ్యాడు.
“మరి ఆహారం ఏం ఇస్తున్నావు సుజాతా?”.. సమాధానం తెలిసినా యథాలాపంగా అడిగేశాడు రావు.
“గరీబోల్లం. ఏమిస్తం సర్? మేం ఏం దింటే గదే!”.
“కాన్పు ఇంటి దగ్గరైందా? హాస్పిటల్లోనా?”.
“హాస్పిటల్లో”.
“ఆపరేషన్ చేశారా?”.
“హా.. జేసిన్రు”.
“ఆపరేషన్ అయ్యాక కళ్లు తెరిచి బిడ్డను చూడగానే నీకు ఏం అనిపించింది?”.
సుజాత మళ్లీ మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా బదులిచ్చింది..
“ఈ బిడ్డ నాకు పుట్టలేదు సార్”.
“మరి!!!?”.
“మేం సాక్కుంటున్న బిడ్డ!”.
రావుపైన పిడుగుల మీద పిడుగులు పడుతున్నాయి.
“మీరు సాదుకుంటున్న బిడ్డా!!!?”.
“అవును సార్”.
“ఏమీ అనుకోకపోతే కాస్త వివరంగా చెప్తావా?” అభ్యర్థించినట్లే అడిగాడు డా.రావు.
సుజాత చెప్పడం మొదలుపెట్టింది..
“మాకు చిన్న వయసులోనే లగ్గమైంది. మూడేళ్లయినా బిడ్డలు కాలే. ఎవ్వలనైనా సాక్కోవాలని అనుకున్నం. గరీబోల్లకు బిడ్డల్ను ఎవలిస్తరు సార్? మా అసుంటి గరీబోల్లనే అడిగినం. వాల్లకిది మూడో కాన్పు. ఆడబిడ్డని ఆల్లకు ముందే దెల్సు. మాకు సుతం సెప్పిన్రు.. మేం ఇట్టపడే బిడ్డను దీసుకున్నం!”.
“మరి ఈ బిడ్డ ఆరోగ్యం గురించి తెలిసిన తర్వాత.. బిడ్డనిచ్చిన తల్లితండ్రులకు అసలు విషయం చెప్పి, బిడ్డను తిరిగి ఇచ్చేసే ప్రయత్నం చేయలేదా?”.
“చెయ్యలే సార్! గీ బిడ్డకు గిట్లయితదని ఆల్లకు డాక్టర్లు ఆరో నెలలోనే జెప్పిండ్రంట. ఆల్లకు అన్నీ దెలిసి.. బిడ్డను ఒదిలించుకునేటందుకే మాకు ఇచ్చిన్రు కావొచ్చు. అసంటోల్లకు మల్ల బిడ్డను తిరిగిస్తే ఏం జేస్తరు సార్? బిడ్డను ఏమైనా జేస్తే? పాపం కదా సార్.. ఆల్లు అద్దనుకున్నరు. మేం గావాలె అనుకున్నం. బస్.. గియన్నీ కాదు సార్.. నేను ఒక్కటే అనుకున్నా. ఈ బిడ్డ నా కడుపునే పుట్టుంటే? వదులుకుంటనా? లేదుగదా. గిప్పుడూ అంతే. ఇది నా బిడ్డే!”..
రావు కళ్లు చెమ్మగిల్లి మసకబారాయి.
‘నిండా ముప్పై ఏళ్లు లేని ఈ అమ్మ ఇంత పెద్ద అమ్మ ఎలా అయ్యింది? ఈమెకు ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది?’ అని ఆశ్చర్యపోతున్నాడు డా.రావు.
“చిట్టి పుట్టిన తర్వాత ఈ పాపను ఏదైనా ప్రభుత్వ కేంద్రంలో అప్పగించాలన్న ఆలోచన రాలేదా?”.
“శానమంది పెద్దోల్లు, డాక్టర్లు గదే సలహా ఇచ్చిన్రు. కానీ మేం ఆ పనిజెయ్యలే!”.
“ఎందుకని?”.
“మేం ఇంకా బతికే ఉన్నం గదా సార్. మీరు జెప్పిన సెంటర్ల మంచి మందులు, వైద్యం ఇస్తరు కావొచ్చు. కానీ, అమ్మానాయినల్ని ఇయ్యలేరు గదా సార్. బిడ్డలకు ముందుగాల కావల్సింది అమ్మానాయినలు. ఆ తర్వాతే ఇంకేమైనా. గిది.. నా పెద్దబిడ్డ! సిట్టి నా సిన్నబిడ్డ. సిట్టి నాకు ఈ బిడ్డ తర్వాతనే. పెద్దబిడ్డ వైద్యం కోసం మా రెక్కలున్నంత వరకు పోరాడ్తం సార్. మా పుట్టింటోల్లు ఇచ్చిన భూమిని అమ్మినం. అత్తింటోల్ల ఇల్లు అమ్మినం. నా పుస్తెల తాడు సుత అమ్మిన. ఇంకా.. అమ్మను నేను బతికే ఉన్నా. పైన దేవుడున్నడు, మీలాంటి మంచోల్ల దీవెనలు ఉంటయ్. బతకడానికి ఇవి సరిపోవా సార్?”.
పదివేల మంది ముందు ప్రేమ గురించి మాట్లాడుతున్న మదర్ థెరిసాలా కనిపిస్తున్నది సుజాత.. డా.రావు కంటికి. పదివేల మంది హర్షాతిరేకంతో చేస్తున్న చప్పట్ల ధ్వని అతని చెవుల్లో మారుమోగుతున్నది.
డా.రావు కళ్లు జలపాతాల్లా వర్షిస్తున్నాయి. అతని అణువణువూ భావావేశంతో ప్రకంపిస్తున్నది. ప్రేమ పరిమళాలతో కంపార్ట్మెంట్ నిండిపోయినట్టు అనిపించింది డా.రావుకు. ఇప్పుడు అతనికి మాడిపోయిన నూనె వాసన రావడం లేదు ఆమె దగ్గర. అమ్మదనపు కమ్మని పరిమళాలు ఆస్వాదిస్తున్నాడు. అతను ఆమె కళ్లలోకి చూస్తూ ఉండిపోయాడు. అలా చూడటం సంస్కారం కాదని అతనికి తెలుసు. ఆమె అమ్మతనం ముందు, ఆమె మాతృసౌందర్యం ముందు.. అతని సంస్కారం ఓడిపోయింది. ఓడిపోయి గెలిచింది. ఎవరు పెట్టారోకానీ.. ఆమె నిజంగా సార్థక నామధేయురాలు.
ఆడపిల్ల అనే కారణంతో కడుపులోని శిశువును కడతేరుస్తున్న ఈ కలికాలంలో.. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ముళ్లకంచెల్లో, డ్రైనేజీల్లో పారేస్తున్న ఈ అనాగరిక సమాజంలో.. డబ్బులకోసం ఆడపిల్లలను తెగనమ్ముకుంటున్న ఈ పాపిష్టి రోజుల్లో.. పేగు తెంచుకుని సలక్షణంగా పుట్టిన బిడ్డ కళ్లముందు కనిపిస్తున్నా.. ఎవరికో పుట్టిన బిడ్డను.. ఆడబిడ్డను.. అంగవైకల్యంతో ఉన్న బిడ్డను.. కోలుకుంటుందో లేదో తెలీని బిడ్డను.. మూడున్నర ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న బిడ్డను.. అక్కున చేర్చుకొని, అమ్మ అయ్యి, సహనంలో భూమాత అయ్యి, సేవలు చేస్తూ.. కన్న కూతురికంటే ఎక్కువ ప్రేమను పంచుతూ, కంటికి రెప్పలా కాపాడుతున్న సు.. జాత. సుజాతను ప్రత్యక్షంగా చూస్తున్నందుకు, ఆమెతో మాట్లాడుతున్నందుకు ఎంతో గర్వంగా అనిపించింది డా.రావుకు. నమ్మలేని ఓ గొప్ప నిజం కళ్లముందు సాక్షాత్కరించినట్టు, ఓ పరమాద్భుతం ప్రత్యక్షమైనట్టు అలౌకిక ఆనందంతో స్థాణువులా ఉండిపోయాడు.
ట్రైన్ తిరుపతి స్టేషన్లో ఆగింది. ఎవరి లగేజీలతో వాళ్లు కిందికి దిగారు. ప్లాట్‌ఫామ్ పైన ఉన్న వాటర్ ట్యాప్ దగ్గర చిట్టి, పోచయ్య, సుజాత మొహాలు కడుక్కుంటున్నారు. డా.రావు పక్కనే ఉన్న స్టాల్లో రెండు వాటర్ బాటిల్స్, కొన్ని పళ్లు, బిస్కెట్స్ కొన్నాడు. బన్నూతో కలిసి సుజాత కుటుంబం ఫ్రెష్ అప్ అవుతున్న చోటుకు వచ్చాడు. అప్పటికే వాళ్లు స్టేషన్ బయటికి వెళ్లడానికి ప్లాట్‌ఫామ్ మీద నడుస్తున్నారు.
“ఒక్క నిమిషం సుజాత.. గారు!”.. యాదృచ్ఛికంగా డా.రావు పిలుపు మారిపోయింది.
ఆమె ఆగి వెనక్కి తిరిగింది. డా.రావు మోకాళ్ల మీద కూర్చొని, రెండు చేతులెత్తి ఆమెకు నమస్కరించాడు. అదంతా అతని అంతరంగంలో.. బాహ్య ప్రపంచంలో అతను నిలబడే ఉన్నాడు. డా.రావు తన షర్ట్ పాకెట్లో చెయ్యి పెట్టి.. రూ.1000 నోట్ పట్టుకున్నాడు. కానీ, పైకి తీసే ధైర్యం చేయలేకపోయాడు. తాను చేసే సహాయం దేనికో అతనికే ఒక స్పష్టత లేదు.
వ్యక్తిత్వంలో, మాతృత్వంలో, మానవత్వంలో ఎవరెస్ట్ శిఖరం పైన మరో వెయ్యి శిఖరాలను పేర్చి.. అక్కడ నిలబడి, ఇంకా పైకే చూస్తున్న ఆ మహాసాధ్వికి, ఆ మహోన్నత స్త్రీమూర్తికి, ఆ మహాతల్లికి, ఆ గొప్ప అమ్మకు వెయ్యి రూపాయలిచ్చి, ఆమె ఆత్మాభిమానాన్ని కించపరచే సాహసం చేయలేక.. అలా అని ఏమీ చెయ్యకుండా ఉండలేక తటపటాయిస్తున్నాడు డా.రావు.
“సార్! పిలిసిన్రు.. మల్లా సప్పుడు జెయ్యలే!”.. విషయమేంటో చెప్పమనే ధోరణిలో అన్నది సుజాత.
డా.రావు అప్రయత్నంగా జేబులోని వెయ్యి రూపాయల నోట్‌ను జేబులోనే వదిలేసి.. ఆ నోట్ పక్కనే ఉన్న విజిటింగ్ కార్డ్‌ను బయటికి తీశాడు.
“ఇది మీ దగ్గర ఉంచండి. నేను డాక్టర్ని. ఎప్పుడైనా, ఏదైనా అవసరమైతే.. ఒక అన్నయ్యగా అనుకొని నాకు ఫోన్ చేయవచ్చు” అన్నాడు.
సుజాత తన ఒడిలోని బిడ్డను, మామ చేతికిచ్చి..
కార్డ్ తీసుకుంది. రెండు చేతులతో మొక్కింది.
“మీరు మంచోల్లు సార్! మీరు సల్లగుండాలె!”.
“బస్‌లో పనికొస్తాయ్. ఇవి ఉంచండి!” అంటూ, వాటర్ బాటిల్స్, పళ్లు, బిస్కెట్స్ ఉన్న కవర్‌ను చిట్టి చేతికి అందించాడు రావు. సుజాత కృతజ్ఞతగా చూసింది.
పోచయ్య, చిట్టి, సుజాత ముగ్గురూ ప్లాట్‌ఫామ్ మీద నడుస్తూ ముందుకు కదిలారు. ఒక మహిళా మణిదీపం, మాతృత్వపు మేరు పర్వతాన్ని అధిరోహించి అలవోకగా అలా కదిలిపోతున్నట్టు సంభ్రమాశ్చర్యాలతో చేష్టలుడిగి చూస్తుండి పోయాడు డా.రావు.
దూరంగా గోవిందరాజస్వామి గుడి గోపురం నుంచి కాబోలు.. పోతనామాత్యుడి పద్యం గాలివాటానికి లీలగా వినిపిస్తున్నది.
అమ్మలగన్నయమ్మ..
ముగురమ్మల మూలపుటమ్మ చాలపెద్దమ్మ..
అనుకోకుండా అతని అంతరంగంలో ఆ పద్యంలోని ఒక పదం పదేపదే ప్రతిధ్వనించింది. చాల పెద్దమ్మ.. చాల పెద్దమ్మ.. చాల పెద్దమ్మ.
‘అవును.. సుజాత చాలా పెద్ద అమ్మ. అమ్మలందరికీ అమ్మ. అమ్మలందరికీ చిరునామా!’ అనుకున్నాడు.
ఆ సంఘటన జరిగి కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. ఇంతవరకూ డా.రావుకు సుజాత నుంచి ఫోన్ రాలేదు. రాదు కూడా.. ఎందుకంటే ఆమె అమ్మ. అమ్మకు ప్రేమను పంచడమే తెలుసు. తీసుకోవడం తెలియదు.
డా.ఎం. కోటేశ్వర రావు
ఒక పేద యువతి గొప్ప మనసును, మాతృత్వ మాధుర్యాన్ని కళ్లారా చూసి.. ఆ తల్లి గొప్ప గాథను లక్షల మందికి అందించాలనే ఆశయంతో ‘అమ్మ చిరునామా’ కథను రాశారు డా.ఎం. కోటేశ్వర రావు. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఉద్యోగరీత్యా కరీంనగర్లో ఉంటున్నారు. తిరుపతి పశువైద్య కళాశాల నుంచి పశువైద్య శాస్త్రంలో పట్టా అందుకొని, ప్రస్తుతం కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో వైద్యాధికారిగా, మాస్టర్ ట్రైనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 4వ తరగతి చదువుతున్నప్పుడే తొలి కథ రాశారు. సుమారు ఏడేళ్ల కిందటే ఈ కథ రాసుకొని.. తగిన సమయం కోసం ఎదురు చూశాననీ, ‘నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం’ కథల పోటీనే ఈ కథకు సరైన వేదికగా ఎంచుకొని, పోటీకి పంపినట్లు రచయిత తెలిపారు. అలాంటి కథకు మొదటి బహుమతి రావడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో ప్రథమ బహుమతి రూ.50 వేలు పొందిన కథ.
-డా.ఎం. కోటేశ్వర రావు
85558 81512