మా ఇంట్లో డబ్బుల తరువాత పరిస్థితి మారిందో, మొదటినుంచే అలా ఉండి నేను ఆలస్యంగా తెలుసుకున్నానో, గానీ, ప్రతిదానికీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయదారులెవరికీ అప్పట్లో పెద్దగా ఆదాయం ఉండేది కాదు. మాలాంటి మధ్య తరగతి వాళ్లకు కూడా ఇంట్లో కొన్ని బియ్యం తప్ప ఇతర సరుకులేవీ స్టాక్‌లో ఉండేవి కావు. డబ్బు అయితే అస్సలు ఉండేది కాదు.
నాన్న ప్రతిసారీ బియ్యం మిల్లు సేటు దగ్గర పంట రాగానే వాళ్లకే అమ్మే షరతు మీద ముందే ఎరువులకు, విత్తనాలకు, జీతగాళ్లకు కొంత అడ్వాన్సు ఇవ్వడానికి డబ్బు తెప్పించేవాడు. తీరా ఆ పంట వచ్చాక వాళ్లు అడిగిన ధరకే ఇవ్వాల్సి వచ్చేది. వాళ్లిచ్చిన అప్పు వడ్డీ సహా వసూలు చేసుకున్నాకే మిగతా డబ్బులు చేతికొచ్చేవి. అందులో కొన్ని తిండిగింజలైనా ఉండాలని కొంత బియ్యం పట్టించి తెచ్చేవారు. దానివల్ల ఎక్కువ మొత్తం ఆ మిల్లువాడికే చెల్లించాల్సి వచ్చేది. కిరాణా షాపు, బట్టల షాపు బాకీలు తీర్చగా మిగిలే డబ్బు ఏ మూలకూ సరిపోయేది కాదు. ఒక్క పంట కోసం ఎన్ని అప్పులు నోరు తెరుచుకొని చూస్తూ ఉండేవో!
ఎప్పుడు చూసినా డబ్బు కొరతే. అనుకోకుండా ఏదైనా పెళ్లికో, ఎవరైనా దగ్గరివాళ్ల చావుకో వెళ్లాల్సి వస్తే డబ్బుకు కటకటే! ‘ఎట్ల? ఎట్ల? ఎక్కడ్నుంచి తేను?’ అని నాన్న ఒక్క అమ్మ ముందు మాత్రమే అనేవాడేమో! ఎట్లా భరించేవాడో కానీ, అస్సలు బయటపడేవాడు కాదు. ఎవరిదగ్గరి నుంచైనా అప్పు చేసి కాగితం రాసి డబ్బు తెప్పించేవాడు. చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే అమ్మ గుండెల్లో దడదడ మొదలయ్యేది. సామాను తెప్పించాలంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండేది కాదు. నాన్న వచ్చినవాళ్లతోనే మాట్లాడుతూ లోపలికి కూడా వచ్చేవాడు కాదు. అమ్మ ఎలాగో తిప్పలు పడి ఏ లోటూ లేకుండా వంట చేసి వడ్డించేది.
ఇతరత్రా ఎలాంటి ఆదాయం ఉండని వ్యవసాయదారుల కుటుంబాల్లో కష్టాలివి. ఈ నేపథ్యంలో 1978 ప్రాంతంలో అమ్మ తరచూ అనారోగ్యానికి గురవుతూ వుండేది. అమ్మ ఎప్పుడూ అనారోగ్యమని పడుకున్నది నేను చూడలేదు. ఒక్కోసారి జ్వరం వచ్చినా పనిచేస్తూ ఉండేది. బలహీనంగా అయిపోయి చేతకాకుండా కనబడుతున్నా తన బాధేదో, తన అనారోగ్యం ఏమిటో ఎవరికీ చెప్పేది కాదు. లేదా.. చెబితే నాన్న కొంచెం అశ్రద్ధ చేసేవాడు అనుకుంటా! మాకు జలుబు చేసినా తల్లడిల్లే నాన్న, ఆ తరువాత ఎప్పుడైనా మా పిల్లలకు సుస్తీ చేస్తే కిందామీదా అయిపోయే నాన్న.. అమ్మ అనారోగ్యం విషయంలో అంతగా పట్టించుకునేవాడు కాదేమో అనిపించేది. అమ్మకు గర్భసంచిలో ఏదో సమస్య ఉండి, ఆ మరుసటి ఏడే దాన్ని తొలగించాల్సి వచ్చింది. సరిగ్గా అప్పుడే మా అక్కకు కుదిరిన పెళ్లి సంబంధం వాళ్లు పదేపదే తొందరగా పెళ్లి చేయమని ఒత్తిడి తెస్తూ ఉండేవారు. వాళ్ల దగ్గర నుంచి ఉత్తరం వచ్చినప్పుడల్లా అమ్మానాన్న ఎంతో కంగారు పడుతుండేవాళ్లు. అవతలివాళ్లది కూడా తప్పు కాదు. మా బావ చెల్లెలి పెళ్లి కుదిరి అవతల వాళ్లు తొందరపెడుతున్నారు. వాళ్లు అమ్మానాన్నల మీద ఒత్తిడి తెచ్చారు. చేసేదేం లేక నాన్న చెరువు కింది పొలాన్ని బేరానికి పెట్టాడు.
ఈ నేపథ్యంలో నేను గనక మెడిసిన్ చదివితే నాన్న ఎక్కడినుంచి డబ్బులు తెస్తాడు, ఎలా కడతాడు, నన్ను ఎవరింట్లో ఉంచుతాడు అనే ఆలోచన నన్ను పట్టి కుదిపివేయసాగింది. పైగా మా అక్క ఇంటర్ చదువుకోవడానికి ఎవరింట్లోనైతే ఉందో, ఆ లచ్చక్క వాళ్ల ఇంట్లోనే నేను కూడా ఉండి చదువుకుందామంటే వాళ్లు హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యారు. ఆ సంవత్సరమే వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పడి అంతదాకా ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేసే ఇక్కడి కాలేజీలన్నీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయి.
అప్పుడు ప్రొఫెసర్లను ఇక్కడ ఉంటారా లేక ఉస్మానియా యూనివర్సిటీకి తిరిగి వెళ్తారా అని ఆప్షన్ ఇచ్చినప్పుడు మా బావగారు ఉస్మానియా యూనివర్సిటీకి తిరిగి వెళ్లారు. దీంతో బావగారు పనిచేసే యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో అయినా చేరి బీఎస్సీ చదువుదామనుకుంటే అదీ కుదరలేదు. ఇక హనుమకొండలో మాకు చాలా దగ్గరి బంధువుల అడ్డా కూడా లేకుండా పోయింది. అప్పటికే ఇంద్రాణి వాళ్ల అన్నయ్యతో కలిసి వడ్డేపల్లిలోని ఒక ఇంట్లో కిరాయికి ఉంటూ వడ్డేపల్లి విమెన్స్ కాలేజీలో డిగ్రీ చేస్తూ ఉండేది. వాళ్ల ఇంట్లో ఉంచాలంటే పరాయి అబ్బాయి.. వాళ్ల అన్నయ్య ఉన్నాడు కదాని మావాళ్లు అసలు ధైర్యం చేయలేదు. హాస్టల్లో ఒప్పుకోరు. మా ఊరికీ, హనుమకొండకూ మధ్య దూరం ఇరవై రెండు కిలోమీటర్లే అయినా, ఇప్పటి మాదిరి బస్సులు, రైళ్ల సౌకర్యం అంతగా లేవప్పుడు.
రోజూ కాలేజీకి వెళ్లి రావడం అనేది అప్పట్లో కుదరని పని. ఈ నేపథ్యంలో నేను ఎక్కడ ఉండాలి, ఎలా చదువుకోవాలి అనే విషయం చాలా పెద్ద సమస్యగా ముందుకొచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య డబ్బు. ఓసీ అవడంతో ఎలాంటి ఫీజు రాయితీలు ఉండవు కనుక ఆ ఫీజులు కట్టుకోవడానికి, పుస్తకాలకు, ఇతరత్రా నాన్న ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? ఒకపక్క చూస్తే అమ్మ ఆరోగ్యం బాగుండట్లేదు, అక్క పెళ్లి.. వీటన్నిటి మధ్య నేను మెడికల్ ఎంట్రెన్స్ రాశాక సీటు వచ్చి చదవలేకపోతే అప్పుడింకా బాధ పడాలి అనుకుని, ఎంతో ప్రిపేర్ అయి కూడా ఎంట్రన్స్ రాయలేదు.
అప్పటికే నాకు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోనూ, పింగిలి మహిళా కళాశాలలోనూ బీఎస్సీలో సీటు వచ్చినప్పటికీ నేను జాయిన్ అవ్వలేదు. అందరూ నన్ను ‘ఏమైంది? చదువు బంజేసినవా?’ అని అడిగేవారు. చాలామంది నేను ఇంటర్ ఫెయిల్ అయ్యానేమో, అందుకే ఇంటి దగ్గర ఉన్నానని అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అప్పుడు నాకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ప్రైవేటుగా చేయగలిగిన డిగ్రీ చేయడం. ఎంత ఆలోచించినా చదువు ఆపకుండా ఉండాలంటే అది తప్ప మరో మార్గం కనబడలేదు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి