– మాజీ జడ్పీటీసీ శీలం కవిత
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 08 : మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలపై చేయి చేసుకునే స్థాయికి దిగజారడం అత్యంత సిగ్గుచేటని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మాజీ జడ్పీటీసీ శీలం కవిత అన్నారు. సోమవారం అసెంబ్లీలో మహిళా శాసనసభ్యులకు జరిగిన అవమానం గురించి ఆమె మాట్లాడుతూ.. ఇది కేవలం మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి మాత్రమే కాదని ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ఓటు హక్కు, రాజ్యాంగ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసినంత మాత్రాన ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టలేరని. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామం అన్నారు.
మహిళా శాసనసభ్యులపై దాడికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాలి తప్ప.. బలప్రయోగంతో అణచి వేయాలని చూడడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. మహిళల గౌరవం, ప్రజాస్వామ్య హక్కులు, ప్రజాప్రతినిధుల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెబుతారన్నారు. అవసరమైతే మహిళలందరం ఐక్యంగా నిలబడి తమ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.