అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ
జరిగిన కథ : కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి 1930వ దశకంలో 12 భాగాలుగా రచించారు. అందులో అనేక ఉపకథలతో 8వ సంపుటి మొత్తం ఆక్రమించిన ‘సప్తమిత్ర చరిత్ర’ ఆసక్తిదాయకమైనది. భోజరాజు కథతో ముడిపెట్టి.. ఏడుగురు మిత్రుల కథ అనేక వింతలతో కూడుకుని ఉంటుంది.
కాశీనుంచి ఒక బ్రాహ్మణ కుమారుడు ధారానగరానికి వెళ్తూ.. మహారణ్యంలో చిక్కుకుపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. అడవిలో దొరికే పళ్లు, దుంపలు తింటూ.. రాత్రిపూట చెట్లపై పడుకుంటూ.. ఇరవై రోజులపాటు ప్రయాణం చేసినా, ఒక్క పల్లె కూడా కనిపించలేదు. తోటి మనిషి జాడ లేదు.
‘ఈ దారి ఎటుపోతుందో తెలియదు. చివరికి ధారానగరం చేరగలనో.. ఏ క్రూరమృగానికో ఆహారం అవుతానో తెలియదు కదా!’ అని మనసులో తలపోశాడు.
ఆ రాత్రి తల దాచుకునేందుకు చోటుకోసం వెతుకుతుండగా.. అల్లంత దూరాన ఏదో వెలుగు కనిపించింది. మరికొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడో భవంతి ఉన్నట్లుగా తోచింది.
‘ఎవరో మహారాజులు ఈ అడవిలో క్రీడాసౌధం కట్టించుకుని ఉంటారు’ అనుకుంటూ ముందడుగు వేశాడు. ఆ భవంతి ఒక కొండ కొమ్ముపై ఉంది. ముళ్లు గుచ్చుకుంటున్నా లక్ష్యపెట్టకుండా కొండనెక్కాడు. చివరికి ద్వారం వద్దకు చేరుకోగలిగాడు.
‘దైవం నన్ను రక్షించి, ఇక్కడికి చేర్చింది కానీ, లేకపోతే ఈ అడవిలో ఏమైపోయేవాడినో కదా!’ అని తలపోస్తూ లోనికి వెళ్లాడు. భవంతి ప్రాంగణంలో అపూర్వమైన పూల సువాసనలు గుబాళిస్తున్నాయి. గోడలపై ఉంచిన మణిదీపకాంతులు పట్టపగటిని తలపిస్తున్నాయి.
తలుపులు తెరిచి ఉండటంతో లోనికి వెళ్లాడు. భూలోకంలో చూడలేని దివ్య వస్తువులెన్నో ఆ గదుల్లో ఉన్నాయి. వాటిని చూస్తూ ఆశ్చర్యపోతూ ఒక్కొక్క గదినీ దాటుకుంటూ వెళ్లాడు. ఒకగది తలుపులు చేరవేసి ఉన్నాయి. అతను ఆ గది తలుపులు తీయకుండా.. సందులలో నుంచి లోపలికి తొంగి చూశాడు.
అక్కడ శయ్యపై ఒక జంట ఉంది. వాళ్లిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు.
“నాథా! మీ వియోగంలో ఏడాదికాలం గడిచిపోయింది. నా ప్రాణానికి ఈ ఏడాది కొన్ని యుగాలైనట్లయింది. అయినా ఆ కుబేరునికి ఏం అపరాధం చేశామని మనల్నిలా శపించాడు?”.
“ప్రియా! కుబేరుడు ఒక సౌర నారీమణిని వరించాడు. ఆమెను వెంటబెట్టుకుని రమ్మని నన్ను పురమాయించాడు. నేను ఇంటికి వచ్చి, నీ అధరామృతపానంలో పడి, ప్రభువు ఆజ్ఞ మరిచిపోయాను. దాంతో చిత్రకూట పర్వతంపై భార్యావియోగంతో ఏడాదిపాటు గడపమని నన్ను శపించాడు”.
“పోనివ్వండి. చివరికి ఎలాగో ఆపద గట్టెక్కింది. సరే కానీ మనం ఇల్లూ వాకిలీ విడిచి ఎన్నాళ్లీ అడవిలో ఉండాలి?”.
“నాకింక కుబేరుని సేవ చేయాలని లేదు. మనిద్దరం ఇటుపైన ఈ అడవిలోనే ఉందాం. నేను ప్రతిరోజూ వింతలు విశేషాలూ చూసివచ్చి నీకు చెబుతుంటాను. దాంతో హాయిగా మనకు కాలక్షేపం జరిగిపోతుంది. మనం సుఖించడానికి ఇదే తగిన నెలవు”.
“మనోహరా! విశేషాలంటే జ్ఞాపకం వచ్చింది. ఇందాక వచ్చేటప్పుడు ఏదో మూటకట్టుకుని వచ్చారు.. ఏముంది అందులో?!”.
“ఇదిగో.. ఇది కాళిదాస మహాకవి రచించిన మేఘసందేశం. ఇది మనిద్దరి కథే!”.
“మన కథా.. అదేమిటి?!”.
“అవును. కుబేరుని శాపం వల్ల నేను చిత్రకూట పర్వతంమీద ఉన్నప్పుడు నా విరహబాధను ఒక మేఘంతో చెప్పుకొన్నాను. ఆ మేఘాన్ని నీకు నా సందేశాన్ని వినిపించమని వేడుకున్నాను. మూడోకంటికి తెలియనివి, మనిద్దరికీ మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను నీకు వినిపించి.. నమ్మకం కలగచేయమని చెప్పాను. నేనే మన ఇంటి గురుతులు చెప్పి, పంపించాను”.
“నిజమే సుమండీ! నేను మీ సందేశాన్ని కూడా విన్నాను. కానీ, మన మధ్య జరిగిన సంగతులు ఆ కాళిదాసుకు ఎలా తెలిశాయి? అవన్నీ ఈ కావ్యంలో అతనెలా రాశాడు?! మీరు గానీ చెప్పారా?!”.
“నేను చెప్పలేదు. కానీ, కాళిదాసు మహర్షి తుల్యుడు. త్రికాలవేది అని కిన్నరులు పాడుతుంటే ఎప్పుడూ వినలేదా?!. ఈ కావ్యాన్ని చదివితే నువ్వు కూడా ఆ మాట నమ్మగలవు”.
“ఏదీ.. కొన్ని శ్లోకాలు వినిపించండి”.
“ఇప్పుడు పొద్దుపోయింది. రేపు వినిపిస్తాను. ఏదీ..”
.. అంటూ ఆ యక్షుడు తన భార్యను దగ్గరికి తీసుకున్నాడు. అనేక క్రీడలతో వాళ్లిద్దరూ వినోదించారు. కొద్దిసేపటి తరువాత యక్షిణి ముందుగా తలుపు తీసుకుని ఈవలకు వచ్చింది.
ఎదురుగా విప్రకుమారుడు కనిపించాడు. యక్షిణి భయ సంభ్రమాలతోనూ, లజ్జతోనూ దిగ్గున లోపలికి పోయింది. వెనువెంటనే యక్షుడు ఈవలికి వచ్చాడు.
“ఎవడవురా నువ్వు? ఇక్కడికెలా వచ్చావు?!” అని కళ్లెర్రజేశాడు.
బ్రాహ్మణ బాలుడు భయపడుతూ, అతనికి నమస్కరించి ఇలా చెప్పాడు.
“అయ్యా! నాపేరు దత్తకుడు అంటారు. పాటలీపుత్ర వాసిని. కొంతకాలం కాశీలో చదువుకున్నాను. నాతో చదువుకున్న నా సహాధ్యాయులు కొందరు ధారానగరంలో భోజరాజు ఆస్థానంలో ఉన్నారు. వాళ్ల సహాయంతో నేను కూడా అక్కడే ఏదైనా ఉద్యోగం సంపాదించుకునే ఉద్దేశంతో వెళ్తున్నాను. ఈ అడవిలో తలదాచుకోవడానికి మార్గం కనిపించక ఇక్కడికి వచ్చాను. తప్పయితే నన్ను మన్నించండి” అని కోరాడు.
కానీ, యక్షుడి కోపం ఇంకా చల్లారలేదు.
“చదువుకున్నవాడవై ఉండి కూడా.. ఆలుమగలు ఏకాంతంగా ఉన్నప్పుడు దొంగచాటుగా పొంచి ఉండి చూస్తావా? ఇది క్షమించరాని నేరం. ఇకమీదట నువ్వు మగతనం పోగొట్టుకుని, ఆడదానివై సంచరించు” అని తీవ్రంగా శపించాడు.
ఆ దెబ్బతో దత్తుడు హడలిపోయాడు.
“మహాత్మా! ఆపన్నుడనై నీ నీడకు వచ్చినవాణ్ని సంరక్షించకుండా శపించడం న్యాయమా?! యక్షులు దయాదాక్షిణ్యాలు కలిగినవారని మాలోకంలో చెప్పుకొంటారు. నాపై అనుగ్రహం చూపి, నీ శాపాన్ని వెనక్కు తీసుకో! ఈ భయంకరమైన శిక్షను నేను తట్టుకోలేను” అని పరిపరి విధాలుగా వేడుకున్నాడు.
దాంతో యక్షుని మనసు కరిగింది.
“బ్రాహ్మణుడా! నా శాపం అమోఘమైనది. ఫలించక తప్పదు. ఒక సంవత్సరంపాటు నువ్వు ఆడదానివై సంచరించక తప్పదు. ఆ తరువాత మళ్లీ మగవాడివి కాగలవు” అన్నాడు.
“సరే మహాత్మా! కానీ, ఆడదాన్నయిపోతే ఈ అడవి దాటడం కష్టమైపోతుంది. దయచేసి నేను ధారానగరం చేరేవరకు నీ శాపాన్ని వాయిదా వేయి” అని వేడుకున్నాడు దత్తకుడు.
“అలాగే. కానీ, ఒక విషయం గుర్తుపెట్టుకో. మేమున్న చోటు ఇతరులకు చెప్పరాదు. అలా చెబితే శాపవిముక్తి తరువాత కూడా మళ్లీ ఆడదానివై పోగలవు. జాగ్రత్త!” అన్నాడు.
దత్తకుడు తెలతెలవారుతుండగా ఆ కొండదిగి వచ్చేశాడు. ధారానగరం దిశగా నడక సాగిస్తున్నాడు.
‘ధారానగరం చేరకపోతే నేను ఆడదాన్ని కానక్కరలేదు. పోనీ అక్కడికి వెళ్లడం మానేస్తాను’ అని కొద్దిసేపు అనుకున్నాడు. అంతలోనే.. ‘అయ్యో! తన శాపం అమోఘమని యక్షుడు సెలవిచ్చాడు కదా! నేనెన్ని కుయుక్తులు పన్నినా తప్పించుకోలేక పోవచ్చు. శాపానికి జడిసి ధారానగరం వెళ్లకపోవడం కంటే, శాపాన్ని ఎదుర్కోవడమే మంచిది. అక్కడికి వెళ్తే చక్కని జీవనోపాధి దొరుకుతుంది. వస్తానని నా కాశీ మిత్రులకు మాటిచ్చాను కూడా. ఇప్పుడు వెళ్లడం మానేయడం ఎలా?’ అని చింతించాడు. వీలైనంత ఆలస్యంగా వెళ్లాలనే ఆలోచనతో నెమ్మదిగా ప్రయాణం సాగిస్తున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి.
ఒకరోజు దత్తకుడు ప్రయాణ బడలికతో ఒక చెట్టునీడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతలో ఎక్కణ్నుంచో ఒక జీను కట్టిన గుర్రం వచ్చి, ఆ చెట్టుకింద ఆగింది. ఉత్తమ లక్షణాలు కలిగిన ఆ అశ్వాన్ని దత్తకుడు తేరిపార చూశాడు.
‘ఇదెవరో మహారాజులది కాబోలు. దారితప్పి వచ్చినట్లుంది. ఈ ప్రాంతంలో ఏదో నగరం ఉండి ఉండవచ్చు’ అనుకుంటూ ఆ గుర్రాన్ని కళ్లెం పట్టుకుని, వీపు చరిచి మచ్చిక చేశాడు. అది బెదరకుండా సకిలించింది.
‘నాకీ అశ్వాన్ని సర్వేశ్వరుడే తెచ్చి ఇచ్చాడు’ అనుకుంటూ రికాబులో కాలుపెట్టి పైకెక్కాడు. కళ్లెం లాగి, మడమలతో కొద్దిగా తట్టగానే రెక్కల గుర్రంలాగా రివ్వున దూసుకుపోయింది. దాని వేగాన్ని తగ్గించాలని దత్తకుడు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
చూస్తుండగానే ఆ అశ్వం అతణ్ని భోజరాజు పాలించే ధారానగరానికి సమీపంలో ఉన్న ఉద్యానవనానికి తీసుకుపోయింది. కావలి కాస్తున్న భటులు ఆగమంటూ వెంటపడ్డారు. కానీ ఆగకుండా లోపలికి దూసుకుపోయింది గుర్రం. ఒక చెట్టుకింద ఆగింది.
అక్కడెవరో ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నారు. తమ ముందు ఆగిన గుర్రాన్ని, దానిపై ఎక్కి వచ్చిన దత్తకుణ్ని చూసి.. వారిద్దరిలో ఒక స్త్రీ ఇలా అన్నది.
“తరుణీ! ఎవ్వరివి నువ్వు? ఈ గుర్రమెక్కడ దొరికింది. ఇది మాకు ప్రాణతుల్యమైనది. కొద్దిసేపటి కిందట బెదిరి ఎక్కడికో పరుగెత్తింది. దీనిని తీసుకురావడానికి మా భటులు వెళ్లారు. ఇంతలో నువ్వే తీసుకువచ్చావు. నాకు ఇష్టమైన గుర్రాన్ని వెనక్కు తీసుకువచ్చావు కనుక, ఇకనుంచి నువ్వు నాకు ఇష్టసఖివి. గుర్రం దిగి రా!”.
ఆ స్త్రీ మాటలు విని దత్తకుడు బిత్తరపోయాడు. ఒకసారి తనను తాను పరికించి చూసుకునేసరికి అప్పటికే తాను స్త్రీగా మారిపోయి ఉన్నాడు. తన రూపం మారిపోయింది సరే.. దుస్తులు కూడా స్త్రీ దుస్తులుగా ఎలా మారిపోయాయో తెలియలేదు. అయోమయంగా తన ఎదురుగా ఉన్న స్త్రీలిద్దరినీ గమనిస్తుండగా.. రెండో స్త్రీ దత్తకుడితో ఇలా అన్నది.
“ఈమె మా యువరాణి రుక్మిణి. నువ్వు తీసుకువచ్చింది ఈవిడ గుర్రాన్నే. నువ్వెవరు? నీ పేరేమిటి?”.
దత్తకుడు కొద్దిగా తడబాటు పడుతూ..
“నా పేరు చారుమతి. నేనొక వేశ్యాపుత్రికను. కన్నవారు చిన్ననాడే గతించారు. కాశీపురంలో చదువుకున్నాను. దేశవిదేశాలను చూడాలనే అభిలాషతో ఇక్కడికి వస్తుండగా.. అడవిలో నాకీ గుర్రం కనిపించింది. ఉత్తమాశ్వమని గ్రహించి, ఎక్కేసరికి ఇక్కడికి తీసుకొచ్చింది” అని చెప్పాడు.
ఆ మాటలు విని యువరాణి చాలా సంతోషించింది.
“చారుమతీ! నీ మాటల చేతనే నీ పాండిత్యం తేటతెల్లంగా తెలుస్తున్నది. నాకు నీలాంటి ఆప్తురాలు దొరకడం దుర్లభం. ఇకనుంచి నువ్వు మా అంతఃపురంలోనే ఉండి, మాకు విద్యలు నేర్పు” అన్నది.
అప్పుడు స్త్రీరూపంలో ఉన్న దత్తకుడు..
“యువరాణీ! నేను వేశ్యజాతిలో పుట్టాను కానీ వేశ్యను కాను. మీవాళ్లెవరైనా నన్ను విటకత్తెగా భావిస్తారేమోనని భయంగా ఉంది. వారినుంచి కాపాడే బాధ్యత నువ్వే తీసుకోవాలి” అన్నాడు.
అందుకు రుక్మిణి నవ్వేసి..
“మా అంతఃపురంలో పరాయి మగవాళ్లు ప్రవేశించలేరు. మా భటులకు కూడా నేనున్న చోటికి రావడానికి అవకాశం ఉండదు. నువ్వు భయపడనక్కరలేదు” అన్నది.
అప్పుడే కొందరు పరిచారకులు అక్కడికి వచ్చారు.
“అమ్మా! ద్వారంవద్ద భటులు గోల చేస్తున్నారు. ఎవరో మగవాడు గుర్రమెక్కి లోపలికి వచ్చాడట. వాణ్ని బయటికి పంపేస్తే.. చిత్రసేనులవారికి అప్పగించి శిక్షింప చేస్తామంటున్నారు” అని చెప్పారు.
“వాళ్ల బొంద.. వచ్చింది మగవాడు కాదు. ఆ భటులకు ఆ మాత్రం తేడా తెలియకపోతే ఎలా? పోపోమ్మను” అంటూ రుక్మిణి అక్కణ్నుంచి కదిలింది.
ఆమె తన సఖులతో కలిసి ఆ ఉద్యానం నుంచి బయటికి వచ్చే సమయంలో భోజరాజు కొడుకు చిత్రసేనుడు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో భోజరాజు రాజధానిలో లేకపోవడం వల్ల యువరాజుగా రాజ్య పరిరక్షణ బాధ్యతలను చిత్రసేనుడే నిర్వహిస్తున్నాడు.
అతను వస్తూనే..
“చెల్లాయ్ రుక్మిణీ! నీ ఉద్యానంలోకి ఎవరో పురుషుడు వచ్చాడని భటులు చెబుతున్నారు. ఏడీ వాడు?” అని అడిగాడు.
“మగవాడు కాదు అన్నాయ్! ఇదిగో ఈ అమ్మాయే వచ్చింది. ఈమె పేరు చారుమతి. నా గుర్రం పొద్దున్నే బెదిరి ఎటో పారిపోతే.. ఈమే వెనక్కు తెచ్చిపెట్టింది” అని చెప్పింది రుక్మిణి.
చిత్రసేనుడు తన చెల్లెలు చూపించిన దిక్కుకేసి చూసి అప్రతిభుడయ్యాడు. లోకసమ్మోహనంగా ఉన్న స్త్రీరత్నాన్ని చూసిన మైమరపులో అతనికి మాటలు పెగలడం లేదు. ముచ్చెమటలు పోస్తున్నాయి. గుటకలు మింగుతున్నాడు.
చారుమతి వేషంలో ఉన్న దత్తకుడు.. యువరాజు కామవికారాలను క్రీగంట గమనిస్తూనే అక్కణ్నుంచి కదిలి, యువరాణితోపాటు అంతఃపురానికి వెళ్లాడు.
(వచ్చేవారం.. దాచలేని రహస్యం)