‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
“నా తండ్రి శంకరుడా! యబ్బిస్స..
నీకు శతకోటి దండాలే! యబ్బిస్స..
నా తల్లి పార్వాతీ! యబ్బిస్స..
నీకు పదివేలా శరణే! యబ్బిస్స..
గంగరేగు చెట్టూ నాదీ! వుష్ష..
నాలుగ్గాళ్ల నందీ నాదీ! వుష్ష..
ఊరుగాసే ఊర పోషవ్వను రా..
వుష్ష వుష్ష వుష్ష యే..”
“ఏం గావాలె బాంచెను.. ఏం గావాలె! ఎటుజూసినా కోడిపిల్లలు, కొబ్బరికాయలు, బోనంకుండలు, యాటపోతులు, కల్లుసాకలు, జమిడికమోతలు, పొర్లుదండాలు, ఒడిబియ్యం, సీరెలు సారెలు.. కండ్ల పండుగోలె జాతర జేత్తాండ్రు. ఇంకేం తక్కువయింది బాంచెను!”
“అన్నీ ఎక్కువనే అయినయ్ రా. అన్నీ ఎక్కువనే అయినయ్! మొస మర్లుతలేదూ. వశమైతలేదూ. నేనే తినలేకపోతానరా..”
“తెలువకడుగుతానం బాంచెన్! కారెడ్డ
మెందుకు.. ఏం గావాల్నో తెలజెప్పుండ్రి”
“తాతలు బోయిండ్రూ. తరాలు మారినయ్. వాన గొడుతె వలవలా.. ఎండ గొడుతె గలగలా.. నా కచ్చీరు గిట్లనే ఉంటదార బాలా! కొత్త పాత చేసుల్లేదురా. మీరు నడిచే తొవ్వకంటె నా కొల్లారి కిందికైంది గాదుర. సకల అవతారమెత్తుకుంటనైనా మిమ్ముల కాపాడుకుంటత్తాన గాదుర బాలా..”
“నిజంగనే బాంచెను! ఇయ్యేడెట్లయినా గుడి మీదికి లేపే ఇగురం జేత్తం. ఎలక్షన్లత్తానయ్. నువ్వే ఎవల కడుపుల జొత్తవో సొచ్చి.. ముందటుండి నడిపియ్యాలె బాంచెను!” అని వడ్లోల్ల ఎంకటయ్య సగజెప్పుకత్తాండు.
“నా చెయ్యి నా నెత్తిల్నే పెడుతాండ్రు గదరా. అట్లనేరా బాలా! శానా సంతోషంరా బాలా! ఇగ నేను పోతున్నరా బాలా.. బేవ్ బేవ్ బేవ్..”
అనుకుంట శాంతించింది సమ్మవ్వ.
అంతా వింటూ గుడి దగ్గర్నే ఉన్న ఊరి జనం..
“యాట గిదేకత. అయ్యేది లేదు పొయ్యేది లేదు. ఇయ్యేడు కొత్తగత్తాందా సమ్మవ్వకు దేవుడు. మనం కొత్తగింటానమా” అని గుసగుసలాడుకుంట.. బోనం జూపెట్టి కోడిపిల్లను కోసుకొని ఎవరింటికి
వాళ్లు వెళ్లిపోతున్నరు.
జబ్బల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందని ఊరందరి మాటగా అనుకున్నరు అక్కన్నే ఉన్న కులపెద్దలు.
“అందరికీ శనార్తులు. ఇగో అందరు జెర మంచిగినుండ్రి. పోయిన ఎలక్షన్ల మన జబ్బల మల్లయ్య సర్పంచిగ నిలబడి, నాలుగోట్ల ఫరకు మీద ఓడిపోయిండు. అయినా నాకెందుకని ఊకోలే. ఊరి కోసం శాతనయిన కాడికి చేసుకచ్చిండు. గా సంగతి మనందరికి ఎరుకే. ఇంకో ఇరవై రోజుల్ల మల్ల సర్పంచి ఎలక్షన్లున్నయ్. ఊరికి ఎంతో కొంత మంచి చెయ్యాల్ననే గాయినె కాయిసు జూశి, కుల పెద్దలందరం మంచిగ ఆలోశన చేశి, ఈపారి ఎలక్షన్లు ఓట్లూ గీట్లూ ఏం లేకుంటనే మల్లన్నను ఏకగ్రీవంగ సర్పంచిగ నిలబెట్టాల్నని ఇసారిచ్చుకున్నం. ఎలక్షన్ల ఖర్సు తప్పుతాంది కాబట్టి.. అవే పైసలతోని ఊరికి గుడి, బడి ఫిరిగ కట్టిత్తనన్నడు మల్లన్న సంబురంతోని. ఇంతకంటె ఇంకేం గావాలె మనకు. కాబట్టి, మనందరం ఒక్కమాట మీదుండి జబ్బల మల్లన్నకు సపోటియ్యాలె. గీ ముచ్చట మీద ఇంకెవలన్న ఏదైనా అడుగాలె అనుకుంటె గిప్పుడే అడుగుండ్రి” అని ఆఫీసు కాడ రాలె చెట్టుకింద కూసున్న ఊరి జనం ముందట నిలబడి, అసలు ముచ్చట చెప్పిండు పెద్దమనిషి రాజయ్య బాపు. ఆయన వెనుక మల్లయ్య, ఇంకొంతమంది కులపెద్దలు కుర్చీలల్ల కూసొని వింటున్నరు.
రాజయ్య బాపు చెప్పిన ముచ్చట విన్నంక..
“మల్లన్నకు జై! మల్లన్నకు జై!” అనుకుంట గట్టిగ మొత్తుకుంటున్నరు ముందట కూసున్న జనమంతా. అది చూసి..
“ఆగుండ్రాగుండ్రి. జే కొట్టిన కాడికి సాలుగని జెరాగుండ్రి” అనుకుంట మందిలకెల్లి లేశి..
“అగో గట్లెట్లుంటది. ఎలక్షన్లన్నప్పుడు పోటీ లేకుంటె ఎట్లుంటది. మీకు మీరే అనుకుంటె అయిపోతదా! గీ ముచ్చట మీద మా కులపోల్లం ఎవ్వలం ఒప్పుకొనేది లేదు. ఊళ్లె మా ఇండ్లే ఎక్కువున్నయ్. ఎవలకో మేం సపోటిచ్చుడేంది? మాదాంట్లెనే ఎవన్నో ఒగన్ని నిలబెడుతం. ఎలక్షన్లు అయితెనే గదా.. ఎవని సత్తా ఎంతని తేలేది. కాబట్టి, మీకు మేము ఆవగింజంత గుడ ఆసరయ్యేది లేదు. ఆరు నూరైనా ఎలక్షన్లు జరుగుడు జరుగుడే!” అని కుండబద్దలు గొట్టినట్టే చెప్పిండు నర్సయ్య.
అంతకుముందే కులపోళ్లందర్ని కూకుండబెట్టి తన మాటల ఉచ్చులతోని అందరి కుత్కెలకు ఉర్లు బిగిచ్చిండు. గందుకే నర్సయ్య కులపోల్లు ఎవరూ నోరెత్తలేదు. నర్సయ్య గట్లనంగనే రాజయ్య బాపు దొరికిచ్చుకొని..
“గట్లగాదు నర్సయ్యా! పోశమ్మ గుడికాడ కుల పెద్దలందరం మాట్లాడుకున్నప్పుడు సరేనంటివి. మల్ల గిప్పుడేంది గిట్లంటానవ్!? మీకు మీకు ఏమన్నుంటె అటెంక జూసుకోవాలె. నువ్వూ కుల పెద్దవేనాయె. నీకు తెలువందేమున్నది. గిది ఊరందరికి చెందిన ముచ్చట. గిక్కడ కుల పంచాయిదులు ముందటేత్తవా? ఊరికి మేలు జరుగుతాంటె అడ్డుగాలేత్తవా చెప్పు.. గిది నాయం గాదు నీకు. ఎలక్షన్లంటె పోటిల నిలబడ్డోలిద్దరికి అడ్డగోలు కర్సత్తది. అట్టిగ వాళ్లను కర్సులపాలు చేసుడెందుకు. నువ్వొప్పుకొంటె.. గుడి, బడి నిలబడుతయ్. జెర పెద్ద మనసు చేసుకో” అని సముదాయించ చూసిండు.
నచ్చజెప్పుడేమో గని.. రాజయ్య బాపు చెప్పిన మాటలు అగ్గిమీద ఆజ్యం పోసినట్టే అయింది నర్సయ్యకు.
“ఎలక్షన్లంటెనే కర్సుతోని కూడుకున్నయ్. కర్సుకు బయపడెటోడు ఇవుతలికి రాకుంట ఇంట్లనే కూసోవాలె. పిల్ల పైలం ముల్లె పైలమంటె అయితదా!? పోయినసారి మా బంగారి పండ్లీరన్న గుడ సర్పంచిగ పోటీ జేసి ఓడిపోయిండు. ఈసారి మల్ల పోటీల నిలబెడుతానం. దమ్ముంటె ఆయన మీద గెలువుమను. అయినా గాయినేంది ఊరికి కర్సుబెట్టేది. ఓట్లయినంక గెలిసినోడే సూసుకుంటడు. ఏయ్.. పోదాం పాండ్రా. లేవుండ్రి ఈడికెల్లి” అనుకుంట, కులపోళ్లందర్ని ఎగేశిండు నర్సయ్య.
ఆయన మాట మీదికెళ్లి నర్సయ్య కులపోళ్లందరు ఇంటిమొకాన పోయెటందుకు లేచి నిలబడ్డరు. గప్పుడే..
“ఆగుండ్రి..” అన్న జబ్బల మల్లయ్య గొంతు గట్టిగ వినబడ్డది. అందరూ అటుదిక్కే చూశిండ్రు. మల్లయ్య కుర్చిలకెల్లి లేశి నిలబడి..
“ఈ ఊళ్లె ఎలక్షన్లు జరుగుతయ్. నేను కూడా పోటీ జేత్తాన. ఎంతమంది నిలబడుతరో నిలబడుండ్రి. మీరో మేమో తేల్చుకుందాం.
ఇగ పోండ్రి” అని అక్కడికెళ్లి ఆవేశంగా వెనుదిరిగిండు.
ఆయన వెనుకనే కుల పెద్దమనుషులూ, వాళ్లెనుక ఊరి జనం ఎటోల్లటు వెళ్లిపోయిండ్రు.
“కూరయితే మంచిగ కుదిరిందే. నీ చేతుల్నే ఏదో కనికట్టున్నదే సరూప” అని పొగుడుకుంట ఎలక్షన్ల గురించి ఊళ్లె ఆడోళ్లు ఏమనుకుంటాండ్రో తెల్సుకునెతందుకు అన్నం తినుకుంటనే మెల్లగ ఆరాదీశిండు నర్సయ్య.
నర్సయ్య మెచ్చుకునెటాళ్లకు మాయల పకీరు మంత్రించినట్టే అయింది సరూపకు. ఎక్కల్లేని సంబురంతోటి కూర వడ్డిచ్చుకుంట..
“ఏం లేదయ్యా! మల్లయ్యది చానా మంచి గుణం. ఊళ్లే ఎవలకు ఆపదచ్చినా శాతనయిన కాడికి సాయమైతడు. సావైనా బతుకైనా ముందుంటడు. మంది సొమ్ముకు ఆశపడెటోడు కాదు. మందిని ముంచెటోడు ఆయింత గాదు. ఇంతకంటె ఇంకేం గావాలె. గందుకే అమ్మలక్కలందరు మల్లన్నయితెనే మంచిగ పనులు జేత్తడని అనుకోబట్టిండ్రు చెల్కలపొంటి. మన కులపోళ్లు గుడ మల్లన్నకే ఓటేసి సర్పంచిగ గెలిపియ్యాల్నని ఇసారిచ్చుకుంటాండ్రు” అని చావు కబురు చల్లగ చెప్పింది.
సరూప మాటలకు గుగ్గిలం పొగ లేశినట్టే గుప్పుమన్నది నర్సయ్య కోపం.
“చెల్.. గట్లెట్లుంటదే! మాటంటె మాటే. మన కులపోళ్లందరం ఒక్క కట్టుమీదుండి బంగారి పండ్లీరన్నకే ఓట్లేశి గెలిపిచ్చుకోవాలె. గప్పుడే మన కులపోళ్ల ఇజ్జతు నిలబడుతది. మన సత్తా ఏందో తెలుస్తది వాళ్లకు” అనుకుంట గరమైండు.
నర్సయ్య మాటలిని మూతి ముప్పయారు వంకర్లు తిప్పుకొంట..
“వాని పాడుజెయ్య. బండిరుగుతె ఎడ్లగాశే రకం వాడు. తాగుబోతు ముం.. కొడుకు. వాంది వాడే సూసుకుంటడు. కడుపులిసం బెల్లాల మాటలు. వాని ముచ్చట దీత్తె ఉప్పు గిట్ల పుట్టది. నా ఎరుకల వానికేం ఉండె. పచ్చగ పాకురు పండ్లు తప్ప. ఇంత పైస కూడినంక పాసు బండ్లోడంటే ఇకారముంటదని.. బంగారి పండ్లోడని శానిగ పిలువబట్టిండ్రిప్పుడు. సర్పంచిగ వాన్తోటి యాడైతది. అత్త మీది కోపాన బిడ్డెను కుంపట్లేసుకున్నట్టే ఉన్నది. గాడే దొరికినాడు మీకు” అని ఇర్గమర్గ అందుకున్నది సరూప.
“తిట్టిన కాడికి సాలుగనీ.. చెవుల్ల తేనెబోశినట్టు నాలుగు మంచి ముచ్చట్లు చెప్పంగనే జబ్బుల మల్లిగాడు మంచోడని మురిసిపోతాండ్రు మీరు. కానీ మన కులం పిల్లను వాని కులపోడు లేపుకపోయిండు. మనకెంత నాదాను. మన కులం తెరువుకత్తె ఎట్లుంటదో వానికి సూపెట్టాలె” అని చిటికెలేసుకుంట సవాలుకు దిగిండు నర్సయ్య.
“ఊరికి మంచి జరిగే కాడ కులం పంచాదులేందయ్యా! పోషవ్వ తల్లిని మీదికి లేపి కొత్త గుడి కట్టియ్యాల్నని ఎన్నట్నుంచో ఊరంత అనుకుంటున్న ముచ్చట్నేనాయె. గట్లనే ఎన్కటి బడి గూడా పర్రెవాశి ఎటు గోడలటే ఒర్గబట్టె. కొత్త బడి గట్టిత్తె పోరగాల్లు పొరుగూరికి నడుసుడు తప్పుతది గద. లచ్చిమి రాంగ తలుపేసుకున్నట్టే ఉన్నది మీ కత. తా శెడ్డ కోతి వనమంత చెరిశినట్టు మనం బతుకద్దు. ఇంకొగన్ని నిమ్మలంగ బతుకనియ్యద్దన్నట్టే ఉన్నదిపో మీ ఎవారం” అని తిట్టుకుంటనే నర్సయ్య పల్లెంల ఇంకింత బువ్వేసింది సరూప.
“ఓ పిచ్చిదానా! గుడికి ఎప్పుడో యాడాదికో దినం పోయి బోనం సూపెట్టత్తె పోశమ్మటు.. మనమిటు. ఇరుగింటి పొరుగింటి పాపపు ముచ్చట్లతోని పగలు గడువబట్టె, టీవీ సీరియల్లతోని రాత్రెల్లి పోవట్టె. ఎగబడెగబడి గుడికి పోయి మొక్కే తీరికెవలకున్నదే! అయినా, శేశిన పాపం గోశిలబెట్టుకొని కాశికిబోతె ఏమున్నత్తీయ్. ఇగ బడంటవా! సర్కారు బడికి ఈరోజుల్ల ఏవడుబోతాండు. అయ్యవ్వలు అరిగోసలు పడుకుంటనైనా పోరగాళ్లను ప్రవేటు బల్లల్ల సదివియ్యబట్టిరి. మారాజుగ జబ్బకు బడి సంచులేసుకొని వ్యాన్లల్ల కాలు కదులకుంట తిరుగుతాండ్రు పోరగాండ్లు. అడుగు కింద బెట్టేది లేదు. అరికాలుకు మట్టంటేది లేదు. ఇగ జెప్పు. ఊరికి గుడి-బడి ఎంత అవసరమో!?” అని గొప్ప ఇగురమేదో కనిపెట్టిన సంబురంతోటి చెప్పుకొచ్చిండు నర్సయ్య.
నర్సయ్య మాటలకు సర్రున అరికాలు నుంచి నెత్తికెక్కింది కోపం సరూపకు.
“ఓశి నీ పాపం పాడుగాను. గుడుంటె చెడిపోతదా? ఊళ్లే బడుంటె చెడిపోతదా? అమ్మవారు కిందికైన కాడికెల్లి ఊరికి అయ్యత్తలేదని బోనమెత్తినప్పుడల్ల శివసత్తులు శెప్పనేవట్టిరి. బడుంటె ఎవడన్న ప్యాదోడు నాలుగచ్చరాలు నేర్సుకుంటడు. పురంగ అన్యాలం మాట్లాడుతానవేందయా!? గా బంగారి పండ్లీరిగాడు గుడిని, గుళ్లె లింగాన్ని గుటుక్కున మింగే రకం. ‘ఎక్కడేం దొరుకుద్ది? ఎప్పుడు నోట్లేద్దామా?’ అనే సూత్తాంటడు. గాడు ఊరికేం జేత్తడు. జెట్టమ్మను పిలిశి పెద్దర్వాజ కాడ కూకోబెట్టిండ్రుపో. మీకెట్ల బుద్ది లేదు. వానికెట్ల సిగ్గులేదు” అన్నది సరూప.
నర్సయ్య ముసిముసిగ నవ్వుకుంట..
“గాయింత తెలివి తక్కువోల్లమేం గాదే సరూప. నీకేమెరుకనే మా మొగోళ్ల ఇకమతు. మొగోళ్ల చేత మొగులు ముడుతది. ఆడోళ్ల చేత అడుగు బడుతదట. మతలబంత గక్కన్నే ఉన్నది” అని బొమ్మలెగిరేసుకుంట చెప్పవట్టిండు.
“నీ ఇకమతు పాడుగాను. బువ్వకత్తదా కూరకత్తదా? మంచి కోరరా మొగడా అంటె నీ నోట్లె మన్నువడ అన్నడట ఎనుకటికెవడో నీ అసోంటోడే. మాపటికి ఇంట్ల చాట్లకు శారడిత్తుల్లేవు గని.. ఈ మొగోడు చేసుకత్తాంటె మొగులు ముడుతాందట. ఇల్లు ఇగురెక్కి పందిరి పచ్చబడుతాంది. కూసుండి తింటాంటె మా బొత్తలు కుండలోలె గావట్టె. ఈపాటి సుకం ఇగేడ దొరుకుద్ది? అనెతందుకు కొంచెమన్న చెత్తకు శెరముండాలె” అని ఇంకింతెక్కువనే ఒర్లబట్టింది సరూప.
“ఎహె.. నడుమ నీలొల్లేందే! ఉత్తుత్తగనే కోపానికత్తవేందే సరూప. చెప్పేదేందో పురాగ ఇనకముందే బుర్రకతల బుడ్డరికామోలె నడిమిట్లకు ఉరికత్తవేందే!” అని కసురుకున్నడు నర్సయ్య.
“నీ చెప్పుడు పాడుగాను. ఏందో ఆయింత జెప్పి కాలబడు” అన్నది కోపం కోడెనాగోలె బుసకొట్టంగ.
“ఎలక్షన్లంటెనే ఐదేండ్ల కోసారత్తయ్. గీ దినం కొరకు ఒక్కొక్కడు కొండకెదిరి సూశినట్టు సూత్తాంటరు. ఊరన్నంక అచ్చగాడు బిచ్చగాడు అరువై తీర్ల జనాలుంటరు. వాళ్లంత ఎట్ల బతుకాలె. గిసోంటప్పుడేనాయె. గందుకే దొరికినప్పుడే బరుకాలె. గాలచ్చినప్పుడే తూర్పాలబట్టాలె. ఆరుగాలం కష్టం జేశినా యాడాది పొడుగూతా సద్దిలకు తొక్కే గతుండది. ఇప్పుడన్న కమ్మగ తింటరు, తాగుతరు జనాలు. గందుకే గీ ఉపాయం జేసినం” అన్నడు చిన్నగ నవ్వుకుంట.. ఘనకార్యమేదో చేసినట్టుగ నర్సయ్య.
“ఏం ఉపాయం. ఎందుకు పనికిరాని ఉపాయం. సలి బెడ్తాందని మంటల దునికిండ్రట మీ అసొంటొళ్లే గావచ్చు. నాలుగొద్దుల కడుపు నిమ్మలానికి సూసుకుంటె ఎల్లకాలం బతుకులు నాశినం కావట్టే. ఇయ్యాల తిన్నది, తాగింది ఉంటదా. మనకోసం గాకున్నా మన పోరగాళ్ల బతుక్కోసమైనా ఆలోశన చెయ్యాలె. తినీ తాగీ పైసలు తీసుకొని ఓట్లేత్తే.. ఖర్సుల పాలైనోడు గెలిసినంక ఊకుంటడా. ఖర్సుబెట్టిన పైసలన్ని డబలుకు డబలు రాబట్టుకోవాల్ననే సూత్తడు. నాయంగ ఓటేత్తె నిలదీసి అడిగే దమ్ముంటది మనకు. తప్పంతా మన దగ్గర్నే ఉన్నది” అని ఏం తెల్వకున్నా చదువుకున్న దానోల్నే సక్కగ మాట్లాడింది సరూప.
సరూప మాటలిన్నంక..
“జనాలే కాదు, పోటిల నిలబడ్డోడు గుడ నిజాయితిగనే ఉండాలె. ఈ రోజుల్ల ఎవడుంటాండట్ల. గందుకే జనాలు గూడ అట్లనే తయారయితాండ్రు. దీంట్ల ఎవడు సొక్కంపూస కాదు” అని నర్సయ్య లోలోపలే అనుకుంట..
“నువ్వెన్నయినా చెప్పే సరూప. ఎట్ల జరిగేది అట్ల జరుగుతది. మేం చేసేది చేత్తనే ఉంటం. ఏదేమైనా మన కులపోళ్లందరం బంగారి పండ్లోనికే ఓటెయ్యాలె. గిండ్ల ఇంకో ముచ్చటే లేదు. జబ్బల మల్లిగాడు ఎట్లెట్ల సర్పంచయితడో సూత్తమిగ” అనుకుంట చెయ్యి కడుక్కొని ఆడికెల్లి లేచి వెళ్లిపోయిండు.
“ఏది ఎట్లయితదో జరుగుతుంటె చూడాలె” అనుకుంట తన పనిలో లీనమైంది సరూప.
ఎలక్షన్ల దెబ్బతోని ఊరంతా రెండు ముక్కలైంది. అటు మల్లయ్యా, ఇటు ఈరన్నా ఇద్దరూ ఒకరికంటె ఒకరు పోటీబడి ప్రచారం జేస్తున్నరు. ఒక్క ఓటు చీలిపోకుండా ఎవరి వ్యూహాలు వాళ్లు రచిస్తున్నరు.
“రాజకీయమంటెనే గిట్లుంటది గావచ్చు శెల్లె. పైసలన్ని ఏన్నుంచి పట్టుకత్తాండో ఏందో. ఏం తెలిసి పాడైతలేదు. మా కులపోళ్లందరం మల్లయ్యకే ఓటేత్తమని తెలిసినా నిన్న మాపటీలి బంగారి పండ్లీరన్న ఇల్లిల్లు తిరుక్కుంట మా ఇంటికచ్చి.. ‘ఎంత కావాల్నో అడుగుండ్రి. పైసలకు బయపడేది లేదు. మీ ఓట్లు నాకే ఎయ్యాలె’ అనుకుంట రొండు చేతుల దండంబెట్టి చెప్పవట్టిండు. నా మొగనికి ఏమనాల్నో తెల్వక బీరిపోయి సూత్తాండు. వద్దంటెనేమో.. ‘నేనీ ఊరోన్ని గాదా. నా పైసలెందుకు తీసుకోవు?’ అని నిలదీయవట్టిండు. ఒగడు అల్లం గాదు.. ఒగడు బెల్లం గాదు శెల్లె. ఇద్దరు మనూరోల్లేనాయె. ఎవడో ఒకడైతె గెల్తడు. మనం సపోటిచ్చినోడు ఓడిపోయి అవుతలోడు గెలిసిండనుకో.. ఏదన్న పనిబడి పోతే కిందికి మీదికి జూసి కంది గింజోలె జారుకోడు? గట్టిగడిగే ఆజాతుంటదా మనకు. గప్పుడు మన మొకం నాలె మొకమైతది. ఊళ్లె ఉన్నందుకు అందర్ని కలుపుకొని పోకపోతె.. అటెంక మనకే నష్టం. గందుకే నువ్వేసే దిక్కే ఏద్దువుగని ఎవడిచ్చినా తీసుకొమ్మని చెప్పిన మావోనికి. ఏం జేయాలె శెల్లె. ఇగ పైసలు తీసుకుంటే ఎయ్యక తప్పుతదా! అటెంక నోటికచ్చినట్టు తిడుతరు. మేమైతే ఇద్దరాలుమొగలం చెరొదిక్కు ఏద్దామనే ఇసారిచ్చుకున్నం. ఎవడే గంగల్నన్న పోనీ. రాముడటు రాకాశిటు” అని జరిగిన సంగతంతా చెప్పింది రామక్క.

రామక్క చెప్పిందంతా విని..
“గట్లంటానవేందే రామక్క. కాకులు సాపిత్తె బక్కెడ్లు సత్తయానె! సిత్రం జెయ్యబడితివి. ఊరందరికీ ఏ పనున్నా చేసిపెడుతనని మల్లయ్య చెప్పనేబట్టె. మనందరం చేన్లల్ల అనుకున్న ముచ్చటేంది? మల్ల నువ్వు జేసే పనేంది? ఈరిగాందంతా గీ నాలుగొద్దుల సంబురమే. గెలిచినంక మొఖం జూడడు. ఎవడైనా అక్కెరున్నంత సేపే అనిగిమనిగుంటడు. అటెంక జాడిచ్చి తంతె బురుద బుక్కుడైతది” అన్నది కోపంగా సరూప.
“ఏమో శెల్లె! నువ్వు ఏమన్ననుకోవె. నేనైతె గిట్లనే జేత్త. నేనే కాదు అందరు గిట్లనే అనుకుంటాండ్రు. ఇగ నీ ఇట్టం. నువ్వూ, నీమొగడు ఎవలకన్న ఏసుకోండ్రి. ఎవలతోని బద్నాం గావద్దు శెల్లె. ఇప్పుడు తలంత బలగమున్నట్టే కనబడ్తరు. అటెంక తల శిక్కులు పాపెటోడుండడు. మన చేతులు మన నెత్తిల్నే పెడుతడు ఎవడైనా. నా ఎరుకల ఎన్ని జూడలే ఎలక్షన్లు. మల్ల ఎప్పటి చిప్ప ఎనుగుల్నేనాయె. అయినా ఉత్త చేతులతోని ఊళ్లె తిరుగుతె.. మాటలకు ఓట్లు రాల్తయానె మల్లయ్యకు” అని ఎలక్షన్ల బాగోతమంతా సీన్మలెక్కనే జూపెట్టి అక్కన్నుంచి వెళ్లిపోయింది రామక్క.
రామక్క మాటలిన్నంక ఎవడు గెలుస్తడో ఏందోనని ఒకటే రంది బట్టుకున్నది సరూపకు. ఎంత లెక్కేసినా కులం పెద్దగుండుట్ల, పైసలు ఖర్చుబెట్టుట్ల ఈరన్ననే గెలిసే కత కనబడుతాంది. ఎవలెటు దునికినా తానైతే ఒకటే మాటమీదుంటనని గట్టిగ తల్సుకున్నది. ఊరికి మంచి జరుగాల్నని పోశవ్వ తల్లికి ఒక్కతీరుగ దండం బెట్టుకున్నది.
పోలింగ్ పూర్తయింది.
ఓట్లయినంక.. సరూపకు నిమ్మలంగ చెప్పవట్టిండు నర్సయ్య..
“గా బంగారి పండ్లీరిగాడు గంత దుర్మార్గుడని అనుకోలేదే సరూప. ఏదో పైస పిచ్చోడనుకున్న. కనీ అధికారం కోసం బిడ్డె జీవితం నాశనం జేసే కసాయోడనుకోలే. ఈసారి మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్నని పోశమ్మకాడ కులపెద్దలం అనుకున్న ముచ్చట వానికి నచ్చలేదు. ఎట్లయినా సర్పంచిగ గెలవాలనే ఆలోచనతోటి బిడ్డెను ఎరగా ఏశిండు. కావాలనే మల్లయ్య చిన్నాయిన కొడుకు వెంకటేషుతోని బిడ్డెకు సోపతి కలిపిచ్చి.. లేపుకొని పోయేదాకా వెనుకుండి నడిపిన సూత్రధారి నర్సిగాడేనట. కులం తక్కువోడు ఎక్కువ కులం పిల్లను లేపుకొని పోయిండని ప్రచారం చేసి, సానుభూతి ఓట్ల కోసం గింత కత నడిపిచ్చిండు. నేను కూడా నిజమేనని నమ్మి వాన్ని పోటీల నిలబెట్టిన. అటెంక వెంకటేషుతోని ఫోన్ల మాట్లాడినప్పుడు అసలు సంగతి తెలిసింది. గప్పుడే ముల్లును ముల్లుతోనే తియ్యాల్నని వాడు జనాలను ఎట్లా మోసం చేయాల్ననుకున్నడో అట్లనే వానికి బుద్ధి చెప్పాలనుకున్న. మా దోస్తుగాళ్లందరం కలిసి వానెంబడే తిరిగినట్టు నటించుకుంట రాత్రిపూట ఇల్లిల్లు తిరిగి ఈరిగాని అసలు సరూపం గురించి మన కులపోళ్లందరికి చెప్పినం. దాంతోటి ఈరిగాని ఓట్లన్నీ మల్లయ్యకు పడ్డయి. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోశమ్మ కొట్టిందట.
మేం గుడ గట్లనే చేశినం. నలుగురికి మంచి జరిగేకాడ కులం కాదు.. గుణం జూడాలని ఎరుకైంది. కొసకు మంచే గెలిచి తీరింది. గంత పైసున్నా దానం ధర్మమంటేందో తెల్వది ఈరిగానికి. పిల్లికి బిచ్చమెయ్యనోడు. పానం బోతాంటె కండ్లల్ల ఏలుబెట్టి సూశే రకం. వానికి పైసల బలుపు బాగున్నది. గందుకే వాని బలుపు వంచాల్ననే గీ ఇకమతు చేశినం. తొక్కుడు దొక్కుతే న్యాల కరిశిండు కొడుకు. మల్ల కోలుకొనేటాళ్లకు తాతలు కనబడాలె. పది మందికి మంచి జరిగేకాడ ఒక్కనికి చెడు జరిగినా తప్పేం లేదు. అది కూడా చెడ్డోనికి. మంచోళ్లను కాపాడెటందుకు చెడ్డోళ్లను శిక్షించెటందుకు భగవంతుడే ఎన్నో అవతారాలెత్తిండు. మేం మా వంతుగా ఉడుతా సాయం లెక్క గిట్ల జేసినం!” అని ఏనుగెక్కిన సంబురంతోటి మురుసుకుంట చెప్పవట్టిండు.
“ఆఖరికి గా పోశవ్వ తల్లే నా మొగని కడుపుల జొచ్చిందో ఏమో. పోరగాండ్ల అగడుబాశె పోశమ్మ మొక్కెల్లెనన్నట్టు మంచిగనే అయింది” అనుకుంట ఒకటే సంబురపడవట్టింది సరూప.
అట్లిట్ల యేడు తిరుగనే తిరిగింది. మొకం నిండా బంగారం వన్నెల పచ్చని పసుపు మెరువబట్టింది. నుదుటికి దిద్దిన కుంకుమ పొడిచే పొద్దోలె రగరగ కొట్టచ్చినట్టు కనబడ్తాంది. దీపాల వెలుతుర్ల రాళ్ల ముక్కెర చూశెటోళ్ల కండ్లల్ల చెమక్కుమని అటీటు కదలబట్టింది. పైడి రంగంచు పచ్చని పట్టుచీరెల పంట పొలం లెక్కనే కండ్ల పండుగోలె కనబడబట్టింది పోశవ్వ తల్లి. ఆ తల్లి రూపం చూసెటందుకు రెండు కండ్లు సాల్తలెవ్వు. మామూలు జనాలకే గట్లుంటే అందట్ల పెద్ద మనిషి.. ఒడిబియ్యం గట్టుకొని చేతుల యాపరిల్లలు పట్టుకొని ముందట నిలబడ్డది. ముందే శివసత్తి. జమిడికలు మోగుతాంటె సమ్మవ్వ కాలాగుతదా ఇగ. దూపమెయ్యంగనే పెయ్యి నిండా పోశవ్వ తల్లి అలుముకొని ఒక్కసారే ఒళ్లంత జడ్తిచ్చినట్టు ఊగి గట్టిగట్టిగ కేకలు బెట్టుకుంట మాగొప్ప సంబురంతోటి తూలబట్టింది.
పిల్లలంతా పూసే పువ్వులోలె నవ్వుకుంట సర్కారు బడికి సంబురంగ పోతున్నరు.
“గట్లంటానవేందే రామక్క.
కాకులు సాపిత్తె బక్కెడ్లు సత్తయానె! సిత్రం జెయ్యబడితివి. ఊరందరికీ ఏ పనున్నా చేసిపెడుతనని మల్లయ్య చెప్పనేబట్టె.
మనందరం చేన్లల్ల అనుకున్న ముచ్చటేంది? మల్ల నువ్వు జేసే పనేంది? ఈరిగాందంతా గీ నాలుగొద్దుల సంబురమే. గెలిచినంక మొఖం జూడడు. ఎవడైనా అక్కెరున్నంత సేపే అనిగిమనిగుంటడు. అటెంక జాడిచ్చి తంతె బురుద బుక్కుడైతది” అన్నది కోపంగా సరూప.
మచ్చ విజేందర్
99638 63751