బాగా ఆరోగ్యంగా ఉన్న మీరు, నెలకు లక్ష సంపాదించే మీరు, కేవలం మూడు లక్షల కోసం మీ ఆరోగ్యమో, కన్నవాళ్ల ఆరోగ్యమో బాగాలేదని చెప్తానంటున్నారు. ఇక నిబద్ధత ఎక్కడిది? ప్రస్తుతం ఉన్నకంపెనీలో మీకంటూ ఓ స్థానం ఉండే ఉంటుంది. మీమీద నమ్మకం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ముచెయ్యడం తప్పు కాదా!
సాయంత్రం కాలేజీ నుంచి తొందరగానే వచ్చేసింది శ్రీవల్లి. చాలా సంతోషంగా ఉన్నది. అందుకు కారణం.. ఆరోజు కాలేజీలో ప్లేస్మెంట్ కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. పేరుమోసిన పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐటీకి డిమాండ్ తగ్గిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అలాంటిదేమీ లేదన్నట్టుగా కంపెనీలు పోటీపడి అభ్యర్థులను ఐటీ రంగంనుంచే ఎంపిక చేసుకున్నాయి.
ఇంజినీరింగ్ (సీఎస్ఈ) చివరి సంవత్సరం చదువుతున్న శ్రీవల్లి.. క్లాసు మొత్తంలో చురుకుగా ఉంటుంది. అందువల్ల ఆమె ఎంపిక ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు గానీ, ప్యాకేజీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సాధారణంగా అందరికీ మూడు నుంచి నాలుగు లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తారు. శ్రీవల్లికి మాత్రం ఏకంగా ఎనిమిది లక్షలు ఆఫర్ చేశారు.
పరీక్షలన్నీ ముగిశాక కాలేజీ చివరి రోజున ఫేర్వెల్ డే నిర్వహించినప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
“మై డియర్ స్టూడెంట్స్.. జీవితంలో ముఖ్యమైన ఘట్టం ముగిసింది. లాక్డౌన్ తర్వాత బైటికి వెళ్తున్న మొదటి బ్యాచ్ మీరే. అయినా గానీ ఈసారి క్యాంపస్ ఇంటర్వ్యూలలో అనుకున్నదానికన్నా ఎక్కువమంది విజయం సాధించి, జీవితానికి కావాల్సిన పునాదిని వేసుకున్నారు. అయితే, నేనొక్కటే చెప్పదల్చుకున్నాను. మీరు ఏ పనిచేసినా నిబద్ధతతో చెయ్యండి. అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. మీ నిబద్ధతే మీకు శ్రీరామరక్ష. అది మీ జీవితాలకు బంగారుబాట వేస్తుంది. మరో ముఖ్యమైన విషయం.. మీరు ఉద్యోగానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో అంతే ప్రాముఖ్యాన్ని కుటుంబానికి కూడా ఇవ్వాలి. దీన్నే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటారు. మీరు సంపాదించేది మీ కుటుంబం కోసమేనన్న విషయం మర్చిపోవద్దు. కాబట్టి, కేవలం సంపాదించే యంత్రాలుగా మిగిలిపోవద్దు. జీవితాన్ని ఆస్వాదించేందుకు అన్ని విధాలా ప్రయత్నించండి. మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో కేవలం మీ గురించి, మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించుకోండి. ఇంట్లో ప్రశాంతత ఉంటే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. దాంతో నిబద్ధత కూడా పెరుగుతుంది. కంపెనీకి విశ్వాసపాత్రులుగా, ఫ్యామిలీకి విధేయులుగా ఉండండి. ఆల్ ద బెస్ట్!” అంటూ ముగించాడు.
శ్రీవల్లి తల్లిదండ్రుల సంతోషానికి హద్దుల్లేవు. క్యాంపస్ ఇంటర్వ్యూలో శ్రీవల్లికి మాత్రమే అంతటి ప్యాకేజ్ లభించింది.
“అమ్మాయ్! నీకు మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. రేపే నిన్ను చూడ్డానికి పెళ్లివాళ్లొస్తున్నారు. భగవంతుడి దయవల్ల ఈ పెళ్లి కుదిరితే ఇంతకన్నా మరేమీ కోరను” అన్నాడు తండ్రి చక్రవర్తి.
“అదేంటి నాన్నా.. ఇప్పుడే కాలేజీ ముగిసింది. ఉద్యోగంలో కూడా చేరబోతున్నాను. ఇంత త్వరగా పెళ్లా?” అన్నది కొంచెం అసహనంగా శ్రీవల్లి.
“ఇవి కేవలం పెళ్లి చూపులేనమ్మా. పెళ్లంటే ఎలాగూ కనీసం మరో ఆర్నెల్లు.. ఏడాదైనా పడుతుందిలే! నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకో. తరువాతి సంగతి ఆలోచిద్దాం” అన్నాడు తండ్రి.అయిష్టంగానే మౌనం వహించింది శ్రీవల్లి.
మర్నాడు సాయంత్రం పెళ్లిచూపులు జరిగాయి. అబ్బాయి శ్రీధర్ కూడా ఐటీ రంగంలోనే పనిచేస్తున్నాడు. జాయినై నాలుగేళ్లయింది. అంటే ప్రస్తుతం అతనికి పాతికేళ్లు. ఏడాదికి పదిలక్షల జీతం. కంపెనీ కూడా పెద్దదే! అన్నీ ఓకే అయితే.. ముహూర్తాలు పెట్టుకోవచ్చన్న నిర్ణయం తీసుకున్నారు.
“నాన్నా.. నేనొక ఆరు నెలలపాటు ఉద్యోగం చేస్తాను. ఆ తరువాతే ముహూర్తాలు పెట్టుకుందాం” అన్నది శ్రీవల్లి.
“నాకేం అభ్యంతరం లేదు” అన్నాడు శ్రీధర్.
అతని తల్లిదండ్రులు కూడా సరేనన్నారు.
మరో నాలుగు నెలల తరువాత ఆఫర్ లెటర్‌తోపాటు ఉద్యోగంలో చేరాల్సిన తేదీ కూడా పంపించారు కంపెనీవాళ్లు. శ్రీవల్లి సంతోషానికి అవధుల్లేవు. తన చిన్నతనంలో సంపాదన లేక తండ్రిపడ్డ కష్టాలు తనకింకా గుర్తే. చిన్నతనంలో బడికి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిని చూసింది శ్రీవల్లి. ఆ పరిస్థితులన్నీ ఎదుర్కొని ఎన్నో కష్టాలకోర్చి తనను ఈ స్థితికి తీసుకొచ్చిన తండ్రి త్యాగం వెలకట్టలేనిది. ఆ రుణం తీర్చుకోలేనిది. అందువల్ల కనీసం ఈ ఆరు నెలలైనా తన సంపాదన మొత్తం తండ్రికే అంకితమివ్వాలన్న నిర్ణయానికి వచ్చింది శ్రీవల్లి.
ఉద్యోగంలో చేరిన మొదటిరోజు చాలా ఆహ్లాదకరంగా గడిచింది. కంపెనీలో తనతోపాటు మరో ఇద్దరు తన క్లాస్మేట్స్ కూడా చేరారు. కుర్చీలో కూర్చునే ముందు ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిబద్ధత, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అన్న పదాలు వల్లె వేసుకుంది.
అప్పుడే కంపెనీలో సీనియర్ మేనేజర్ వచ్చి తనను తాను పరిచయం చేసుకుని..
“ఏకాగ్రతతో.. నిబద్ధతతో పనిచెయ్యండి. ఎంత నిబద్ధతగా ఉంటారో అంత ప్రతిఫలం కూడా ఉంటుంది. యువర్ ప్యాకేజ్ అండ్ పెరక్స్ విల్ బీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ సిన్సియారిటీ!” అని విష్ చేసి వెళ్లిపోయాడు.
ఒక నెల తరువాత.. అప్పుడు గమనించింది శ్రీవల్లి. ఇంకా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలోనే పని చేస్తున్నారు. యాజమాన్యం ఇప్పటికే పలుమార్లు ఆఫీసుకు రావాలని చెప్పినా.. వచ్చేందుకు సుముఖంగా లేరు. ఏదో కారణం చెప్పి ఇంటినుంచే పని చేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది.. ‘హెల్త్ రీజన్!’ అంటూ ఇంట్లోనే ఉంటున్నారు.
శ్రీవల్లికి ఆ పరిస్థితి అర్థం చేసుకునేందుకు మరికొంత సమయం పట్టింది. అయినా ఎందుకో వాళ్ల పద్ధతి సరి అనిపించలేదు ఆమెకు. అదే విషయం తన సీనియర్ సుజాతను అడిగింది.
“ఏంటండీ.. ఎవరూ ఆఫీస్‌కు రావడం లేదు. లాక్‌డౌన్‌కు ముందు అంతా సక్రమంగానే వచ్చేవాళ్లు కదా. మరి ఇప్పుడెందుకు రారు?”.
సుజాత నవ్వేసి..
“నువ్వింకా కొత్త కదా. అలాగే ఉంటుంది. ఒక్క ఆరు నెలలు పనిచేస్తే.. ఈ సిన్సియారిటీ, డెడికేషన్ ఇవన్నీ గాలికి కొట్టుకుపోతాయి. ఇక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు పనిచేస్తున్నావని నిన్ను నెత్తిన పెట్టుకోరు. నీకు మరింతగా పని ఇస్తారంతే! మనం ఏం పని చేస్తున్నామో, ఎంత పని చేస్తున్నామో ఈ మేనేజర్లకు తెలుసనుకుంటున్నావా? అలా తెలిసినవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. మేనేజర్ అంటే ఫర్ మేనేజింగ్, నాట్ ఫర్ వర్కింగ్! ‘మై జాబ్ ఈజ్ టు మేక్ యూ వర్క్!’ అంటారు. మనకు తెలియని పని గురించి అడిగినా చాలామంది చెప్పలేరు. మనల్నే తెలుసుకుని చెయ్యమంటారు. ‘నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఐ వాంట్ ద వర్క్ టు బి కంప్లీటెడ్ టుడే’ అనే ఒక్కమాట మాత్రం తెలుసు వాళ్లకు” అంటూ ఒక పెద్ద లెక్చరిచ్చింది.
ఎందుకో ఆమె మాటలు నచ్చలేదు శ్రీవల్లికి. తానడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన జవాబుకు పొంతన కుదరలేదు.
‘లాక్‌డౌన్‌కు ముందు సక్రమంగా వచ్చేవాళ్లు ఇప్పుడెందుకు రావడం లేదని అడిగితే ఏదేదో మాట్లాడిందేమిటీ. మనం పని చేసేందుకే వచ్చాం. ఇక్కడున్న ఆ ఎనిమిది గంటలు మనస్సాక్షికి కట్టుబడి పనిచెయ్యాలి. అంతే!’ అని తనకు తానే సర్ది చెప్పుకొన్నది.
మొదటి నెల జీతం తీసుకున్న సంతోషం శ్రీవల్లికి మాటల్లో చెప్పలేనిది.
‘రుపీస్ సిక్ట్సీ థౌజెండ్ క్రెడిటెడ్ టు అకౌంట్ నం….’ అంటూ మెసేజ్ చూసుకోగానే సాయంత్రం ఎప్పుడెప్పుడు ఇంటికివెళ్లి ఆ డబ్బు మొత్తాన్ని తండ్రి అకౌంట్‌కు బదిలీ చేస్తానా!? అంటూ ఆతృతగా ఎదురు చూసింది. అంతకన్నా ముందుగానే తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పేసింది. ఇంటికి వెళ్లీ వెళ్లగానే తండ్రి అకౌంట్ నంబర్ తీసుకుని వెంటనే మొత్తం జీతాన్ని బదిలీ చేసేసింది.
“అదేంటమ్మా! మొత్తం పంపించేస్తే.. మరి నీ ఖర్చులకు?”.
“ఇప్పుడు నీకుగా నువ్వు ఎంత తోస్తే అంత నా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చెయ్ నాన్నా. ఉన్నదాంట్లోనే సర్దుకుంటాను”.
చక్రవర్తి కళ్లు ఆనందబాష్పాలు రాల్చాయి.
“నా బంగారు తల్లివమ్మా! ఉన్నదాంట్లో తృప్తిపడాలని నేను నిన్నెప్పుడూ దేనికీ నిర్బంధించ లేదే? ఎక్కడ నేర్చుకున్నావు?”.
“నువ్వు చెప్పలేదు కానీ.. నిన్ను చూసి నేర్చుకున్నాను నాన్నా.. అయామ్ హ్యాపీ నౌ!”.
మరొక నెల గడిచాక ఒకరోజు హఠాత్తుగా కంపెనీలో కలకలం బయల్దేరింది. కంపెనీలో పనిచేసే సుమారు పాతికమందిని తీసేశారు.
ఏమైందని ఆరా తీస్తే.. అదేదో ‘మూన్ లైటింగ్’ అని చెప్పారు. అంటే ఏంటో అర్థం కాలేదు. ఒక కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీకి కూడా పనిచేస్తే.. అంటే, ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చెయ్యడాన్ని ‘మూన్ లైటింగ్’ అంటారని చెప్పారు. ఆ విధంగా పని చేసేవాళ్లను పనిలోనుంచి తొలగించారన్నది సమాచారం.
‘నిజమే! నిబద్ధత లేనివాళ్లు కంపెనీకి ఎందుకు?’ తనను తాను ప్రశ్నించుకుంది శ్రీవల్లి. అప్పటికే వార్తా పత్రికలన్నీ ఈ విషయం మీద చర్చలు ప్రారంభించేశాయి. మూన్ లైటింగ్ విషయంలో కంపెనీలన్నీ రెండు వర్గాలుగా చీలిపోయాయట. కొన్ని కంపెనీలు సమర్థిస్తూంటే మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయట. మరికొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నాయట. సోషల్ మీడియా ప్రబలమయ్యాక ప్రతీది పబ్లిక్‌గా చర్చించడం, ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం పరిపాటి అయిపోయింది. అదేవిధంగా ఈ విషయంలోనూ జరిగింది. ఆరోజు సాయంత్రం ఇంటికి బయల్దేరేముందు సుజాతతో అన్నది శ్రీవల్లి..
“మీరే చెప్పండి.. ఈ మూన్ లైటింగ్ అనేది న్యాయమైనదేనా?”.
“ఎందుకు కాకూడదు? చాలీ చాలని జీతాలతో పనిచేసే వాళ్లు కాస్త అదనపు ఆదాయం కోసం అలా చెయ్యడం తప్పు కాదు కదా!?”.
“అదేంటి మేడం. ఐటీ రంగంలో జీతాలు తక్కువని ఎవరన్నారు? ఐటీ వల్లే.. ఇంతింత జీతాలు కూడా తీసుకోవచ్చా అని ఆశ్చర్యం కలిగింది. మనం తీసుకునే జీతాల్లో సగం కూడా దొరకడం లేదు చాలామందికి. డబ్బులున్నాయని, ఆడంబరాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసి, అది చాలక ఇంకా సంపాదించాలని అంగలార్చడం సరైన పనేనా?”.
సుజాత దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేదు.
“పైగా ఈ ఒక్క రంగంలో మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే అవకాశం ఉండేది. నాకు తెలిసి మిగతా ఏ రంగంలోనూ ఇలా చెయ్యలేం. ప్రొడక్షన్, సేల్స్ అంటూ ఏది తీసుకున్నా మనం నేరుగా అక్కడుండి పని చెయ్యాల్సిందే తప్ప.. వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం కాదు. అలాంటప్పుడు మనం చేసే పని నిబద్ధతతో చెయ్యకుండా ఒకటికి రెండు కంపెనీలకు పనిచెయ్యడం తప్పు కాదా!?”.
సుజాత శ్రోతగా మిగిలిపోవడం తప్ప మరేమీ చెయ్యలేకపోయింది. శ్రీవల్లికి ఎందుకో అనుమానం కలిగింది. ఒకవేళ సుజాత కూడా ఎవరికీ తెలియకుండా ఈ మూన్ లైటింగ్ పని చేస్తున్నదా? అదే అనుమానంతో ఆమెవంక అదోలా చూసింది.
అది గమనించిన సుజాత..
“నీ చూపులు నాకు అర్థమయ్యాయి. ఈ ఒక్క ఉద్యోగానికే టైమ్ లేక చస్తూంటే ఇంకో ఉద్యోగం ఎక్కడ చేసేది?” అన్నది.
అక్కడితో ఆ చర్చకు తెరపడింది.
సాయంత్రం ఇంటికి వెళ్లగానే తండ్రి చెప్పాడు..
“అమ్మాయ్.. ఈ వారంలో పెళ్లివాళ్లొస్తారట. తేదీని ఫిక్స్ చేసుకునేందుకు”.
శ్రీవల్లి ముభావంగా ఉండిపోయింది.
ఆదివారం ఉదయమే వచ్చాడు శ్రీధర్.. తల్లిదండ్రులతోసహా.
“మరో రెండు నెలల్లో ముహూర్తాలు పెట్టుకుందాం. ఏమంటారు?” అన్నాడు శ్రీధర్ తండ్రి.
“అలాగే కానివ్వండి” అంటూ సమ్మతిని తెలియజేశాడు చక్రవర్తి.
“ఐటీ ఇండస్ట్రీ అంతా ఈ మూన్ లైటింగ్ గొడవల్లో ఉంది. అయితే, ప్రస్తుతం మా అబ్బాయికి మాత్రం ఆ సమస్య లేదు. ఎందుకంటే వాళ్ల కంపెనీయే ఆ పద్ధతికి ఒప్పుకొన్నది. కాకపోతే వాళ్ల పర్మిషన్ ఉండాలట. అదేం పెద్ద సమస్య కాదు. వాళ్ల టైమింగ్స్ కాక మిగతా టైమ్‌లో మనమేం చేస్తామన్న విషయం వాళ్లకెందుకండీ?” అన్నాడు శ్రీధర్ తండ్రి గొప్పగా.
చివాలున శ్రీధర్ వంక చూసింది శ్రీవల్లి.
“అంటే.. మీరు కూడా ఆ విధంగా పని చేస్తున్నారా?” అన్నది.
“ఎస్.. ఆఫ్కోర్స్! అడిషనల్ ఇన్కమ్ అంటే ఎవరికి చేదు? వాళ్ల టైమింగ్ తరువాత నేనేం చేస్తానన్నది నా ఇష్టం కదా!” అన్నాడు దర్పంగా శ్రీధర్.
“అయితే అది మీరు పనిచేస్తున్న కంపెనీ పట్ల ఇన్సిన్సియారిటీ కదా?”.
“ఎలాగవుతుంది? ఇప్పుడు స్కూల్లో పనిచేసే టీచర్.. ఆ టైమ్ ముగిశాక ఇంట్లో ట్యూషన్లు చెప్పుకొని సంపాదించడం లేదా? ఇది కూడా అంతే!”.
“అదనంగా ఎంత సంపాదిస్తారు?”.
“మినిమమ్ మరో మూడు లక్షలైనా వస్తుంది ఏడాదికి”.
“ఇప్పుడు మీ ఆఫీస్ టైమింగ్స్ ఏమిటి?”.
“మామూలే.. నైన్ టు ఫైవ్”.
“ఆఫీసుకు పోను రాను ఎంత టైమ్ పడుతుంది?”.
“పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అప్లయ్ చేశానుగా.. ట్రావెలింగ్ టైమ్ మిగుల్తుంది”.
“అలా ఒప్పుకొంటారా?”.
“ఏముంది. ఏదో ఒక హెల్త్ రీజన్ చెప్పి, డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే సరి. లేకుంటే పేరెంట్స్ హెల్త్ రీజన్ కూడా చెప్పొచ్చు. అదేం పెద్ద సమస్య కాదు”.
“మీ ఆరోగ్యం బాగానే ఉందిగా” అంటూ అదోలా చూసింది.
ఉలికిపడ్డ శ్రీధర్..
“వాట్ డూ యూ మీన్?” అన్నాడు.
“ఐ మీన్.. వాట్ ఐ సే! బాగా ఆరోగ్యంగా ఉన్న మీరు, నెలకు లక్ష సంపాదించే మీరు, కేవలం మూడు లక్షల కోసం మీ ఆరోగ్యమో, కన్నవాళ్ల ఆరోగ్యమో బాగాలేదని చెప్తానంటున్నారు. ఇక నిబద్ధత ఎక్కడిది? ప్రస్తుతం ఉన్న కంపెనీలో మీకంటూ ఓ స్థానం ఉండే ఉంటుంది. మీమీద నమ్మకం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ముచెయ్యడం తప్పు కాదా!? పోనీ.. అదేం లేదు వాళ్లే పర్మిషన్ ఇచ్చారే అనుకుందాం. ఇప్పుడు మీమీదున్న నమ్మకం తరిగిపోదా!? అది కూడా ఫర్వాలేదనుకుందాం. ఇప్పటికే నెలకు లక్ష సంపాదించే మీరు అదనంగా మరో పాతికవేలు దేనికోసం సంపాదిస్తున్నారు?”.
“దేనికంటే.. లైఫ్ ఎంజాయ్ చేసేందుకే కదా! ఐ కెన్ హ్యావ్ మై ఓన్ బంగ్లా, కార్ ఎట్సెట్రా”.
“ఎంజాయ్ చేసేందుకు మీకు టైముంటుందా?”.
“వైనాట్.. కావాల్సినంత”.
“ఎలా ఉంటుంది? ఉదయం నుంచీ సాయంత్రం ఐదు గంటల వరకూ ఇప్పుడున్న కంపెనీ. ఆ తరువాత మరో రెండు మూడు గంటలు మరో కంపెనీ. అంటే రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది. ఆ లెక్కన.. వీకెండ్స్‌లో కూడా ఎక్స్ట్రా పని ఉంటుంది. ఇక అనుభవించేందుకు టైమెక్కడిది మీకు?”.
శ్రీధర్ అవాక్కయ్యాడు. అతనివద్ద జవాబు లేదు. శ్రీవల్లి ఇలా నిలదీస్తుందనుకోలేదు.
“ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం నిబద్ధత. లాయల్టీ! మీరు నన్నేమనుకున్నా సరే.. నేను చెప్పదల్చుకున్నది చెప్పి తీరాలి. లక్ష జీతం వచ్చినా, చాలదని మరో కంపెనీలో కూడా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. మీరు చేసే పనికీ, సంసార సుఖం చాల్లేదని ఒక ఇల్లాలు ఉండగానే మరో ఇల్లు చూసుకునేందుకు పెద్ద తేడాలేదు. నాన్నగారూ.. ఈ సంబంధం వద్దండీ. ప్లీజ్!” అన్నది.
చెళ్లున చెంపమీద చరిచినట్లయ్యింది. శ్రీధర్ తల్లిదండ్రులు కూడా అవాక్కయి ఉండిపోయారు.
“మరో ముఖ్యమైన విషయం. ప్రస్తుతం మీరు మనసు మార్చుకున్నా, ఇక ఈ సంబంధం కుదరదు. ఎందుకంటే ఈ సంఘటన మనసు మూలల్లో జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనిద్దరం ఒక్కటవడం సరైన పనికాదు. ఒకరికి ఒకరన్నది జీవన సూత్రం. అది ఉద్యోగమైనా.. సంసారమైనా! ధన్యవాదాలు”.. అంటూ లేచి నిలబడి చేతులు జోడించింది శ్రీవల్లి.
చక్రవర్తి దంపతులు ప్రేక్షకులయ్యారు.
శ్రీధర్ కుటుంబం మౌనంగా నిష్ర్కమించింది.
సింగీతం ఘటికాచల రావు
95004 31474 ‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.