స్పర్శ హార్ట్ ఇన్స్టిట్యూట్. దేశంలోని అత్యాధునిక ఆసుపత్రులలో ఒకటి. ఆ ఇన్స్టిట్యూట్ భవంతి నాలుగో అంతస్తులో ఉంది రీసెర్చ్ ల్యాబ్. కృత్రిమ గుండెకు రూపకల్పన జరుగుతున్నదా ల్యాబ్‌లో. ఒక ప్రత్యేక నిపుణుల బృందం ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నది. డా.దీపిక కూడా ఆ బృందంలో ఉన్నది. ఆమె హృద్రోగ నిపుణురాలు. కార్డియోతొరాసిక్ శస్త్ర చికిత్సల్లో ‘రోబోటిక్’ నైపుణ్యం కూడా ఉన్నది. అక్కడ తయారవుతున్న ‘హృదయంత్రం’ అని పిలిచే ఆ ‘ఎల్వీఏడీ’ పరికరం వైపు నిశితంగా చూస్తున్నది డా.దీపిక. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది.
“ఒక ఎమర్జెన్సీ సర్జరీ దీపికా! ఓటీకి రాగలవా?”.. అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డా.స్వాతి చెప్పింది ఫోన్లో.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక యువకుణ్ని 108 వాహనం ఆ ఆసుపత్రికి తీసుకొచ్చింది.
“టిప్పర్ గుద్దేసింది. బతికే ఉన్నాడు. పల్స్ ఉంది” అంబులెన్స్ సిబ్బంది ఒకతను చెప్పాడు.. ముప్పై ఐదేళ్ల ఆ యువకుణ్ని స్ట్రెచర్ మీదికి మారుస్తూ, ఎమర్జెన్సీ రూమ్‌లో ఉన్న డా.స్వాతితో.
‘సీటీ’లో తెలిసింది.. అతనికి మల్టిపుల్ రిబ్ ఫ్రాక్చర్స్తోపాటు ఛాతీ ఎముక కూడా విరిగిపోయింది! ‘న్యుమోపెరికార్డియమ్’! వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకడు. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు వచ్చారు.“వాడు నా ఒక్కగానొక్క బిడ్డమ్మా! పేరు శరత్. కలలో కూడా ఎవ్వరికీ హాని తలపెట్టని సున్నిత హృదయం వాడిది. సొంత తెలివితేటలతో చిన్న వయసులోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి కాగలిగాడు. వాడినెలాగైనా బతికించమ్మా!”.. అతని తల్లి కన్నీళ్లతో డా.స్వాతికి చేతులు జోడించింది. వెంటనే దీపికకి ఫోన్ చేసింది స్వాతి.
ఆపరేషన్ థియేటర్లో డా.దీపికతోపాటు మరొక సర్జన్ కూడా ఉన్నారు. శరత్ అనే ఆ రోగి ముఖంలోకి చూసింది దీపిక. అతని తలకూ, ముఖానికీ ఏ గాయాలూ లేవు. అందరూ ‘సర్జరీ మోడ్’కి వచ్చేశారు. ‘యాంటెరోలేటరల్ తొరెక్టమీ’కి సిద్ధమయ్యారు. కుడివైపు పెరికార్డియం చిట్లిపోవడం గుర్తించింది దీపిక. పెరికార్డియల్ సేక్ నిండా రక్తం! ఆ రక్తాన్ని ‘తోడితే’ కనిపించింది.. కుడి వెంట్రికిల్ ముందుభాగంలో సెంటీమీటర్ మేర ఉన్న మయోకార్డియల్ ల్యాసిరేషన్! దాన్ని ‘మరమ్మతు’ చేయాలిప్పుడు. పెరికార్డియల్ ప్యాచ్‌తో 2/0 ప్రోపిలీన్ కుట్లువేశాక మరమ్మతు పూర్తయింది. అక్కడే ఉన్న స్వాతి చిరునవ్వుతో దీపికని చూసి..
“యూ సేవ్డ్ అనదర్ లైఫ్ దీపికా!” అన్నది అభినందనగా!
మర్నాడు మౌర్య అనే పోలీస్ అధికారి హాస్పిటల్‌కి వచ్చాడు. డా.దీపికకు మౌర్య తెలుసు.
“నిన్నటి యాక్సిడెంట్ కేస్ గురించి వచ్చాను డాక్టర్!” చెప్పాడు మౌర్య.
“తాగి నడుపుతున్నాడా.. ఆ ట్రక్ డ్రైవర్?”
అడిగింది డా.దీపిక.
“ట్రక్ డ్రైవర్ తప్పేమీ లేదు మేడం. ఈ శరత్ అనేవాడే కావాలని ట్రక్‌కి ఎదురెళ్లాడు!”.
“వ్వాట్?”.
“సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయింది!” అంటూ మొబైల్లో ఆ ఫుటేజ్‌ని ఆమెకు చూపించాడు.
ట్రక్ వేగంగా వస్తున్నది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్నాడు శరత్. ఉన్నట్టుండి హఠాత్తుగా రోడ్డు మధ్యకు నడచి.. ఆ
ట్రక్‌కి ఎదురెళ్లి పోతున్నాడు! డ్రైవర్ అరుస్తూ బ్రేక్‌వేసి స్టీరింగ్ పక్కకు తిప్పినా.. ట్రక్ శరత్‌ని గుద్దేసింది!
“హీ ట్రైడ్ టు కిల్ హిమ్సెల్ఫ్ డాక్టర్!”.. నిర్ఘాంతపోయి చూస్తున్న దీపికతో చెప్పాడు మౌర్య.
సాయంత్రం రౌండ్స్‌కి వెళ్లినప్పుడు ఐసీయూలో ఉన్న శరత్ బెడ్ దగ్గరికి వెళ్లింది డా.దీపిక.
“ఎలా ఉన్నారు?” అని అడిగింది.
అతను బదులేమీ ఇవ్వలేదు. ఆమెవైపు కన్నెత్తి చూడనుకూడా చూట్టం లేదు.
“బలవంతంగా మిమ్మల్ని మీరు చంపుకోవాలనుకునేంత కష్టం ఏమొచ్చింది శరత్?”..
ఆ ప్రశ్నకి తలెత్తాడు.
“మీ రక్తంలో ‘యాంటీయాన్డ్రోజెన్’ ఆనవాళ్లు ఉండటం నేను చూశాను!” అని దీపిక అనగానే.. అప్పుడు శరత్ నోరు విప్పాడు.
“ఆ భగవంతుడు నా మెదడులో రెండు పరస్పర వైరుధ్య భావాలను ఉంచి నన్నొక శాపగ్రస్తుణ్ని చేశాడు డాక్టర్! మాట ద్వారా, చూపు ద్వారా కూడా ఇతరులకు ఏ చిన్న ‘బాధ’ కలిగించినా.. అదీ హింసే అని నమ్మేవాణ్ని. అలాంటి నాకు ‘హింస’, ‘బాధ’లతో ముడిపడి ఉండే ఒక ప్రమాదకర ప్రవృత్తి (ప్రొపెన్సిటీ)ని ఇచ్చాడు ఆ భగవంతుడు! మై బ్రెయిన్ ఈజ్ నాట్ ‘వైర్డ్ కరెక్ట్‌లీ!’. నా సెక్సువల్ ఓరియంటేషన్లో ‘అపసవ్యత’ ఉంది. సాటి మనిషికేకాదు.. సృష్టిలో ఏ ప్రాణికీ హాని కలిగించకూడదని త్రికరణశుద్ధితో నమ్మే నన్ను.. ప్రీ-ప్యుబెర్టిక్ పిల్లల పట్ల ‘ఆకర్షణ’ కలిగి ఉండే పీడోఫిలిక్ డిజార్డర్‌తో పుట్టించిన ఆ దేవుణ్ని ఏం చేయగలను నేను!? నావల్ల ఏ చిట్టిపాపకూ హాని జరగకుండా ముందుజాగ్రత్త కోసమే యాంటీయాన్డ్రోజన్ మందులు తీసుకుంటున్నాను. ఇంతదాకా ఏ ‘తప్పూ’ జరగకుండా జాగ్రత్త పడగలిగాను. కానీ, ఎప్పుడు విస్ఫోటిస్తానో తెలీని భయంకరమైన పేలుడు పదార్థం లాంటివాణ్ని నేను. ఒక ‘అపసవ్యత’ కారణంగా ఏ చిన్నారి కంటి నుంచీ ఒక్క అశ్రుబిందువూ జారకూడదంటే, నాలాంటి వాడు బతికి ఉండకూడదు. సమాజం పట్ల నా బాధ్యత అది. ట్రక్‌కి ఎదురువెళ్లినా చావు రాలేదు. అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ ‘బాధ్యత’ని పూర్తిచేసే వీలు కల్పించండి డాక్టర్! నాకేదైనా విషమివ్వండి ప్లీజ్!”..
మానవత్వపు పరిమళంతో నిండిన అతనిలోని ఆ ఆర్ద్రతకు కదిలిపోయింది డా.దీపిక.
“శరత్! మీలోని ఆ ‘అపసవ్యత’ కారణంగా ఎక్కడో ఎవరికో కీడు జరుగుతుందేమో అన్న భయంతో ఆత్మాహుతికే సిద్ధమయ్యారంటే మీదెంత మంచి మనసో నాకు అర్థం అవుతున్నది. ఆ ‘మంచిమనసు’ బతకాలి. అయినా, ఎంతటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితాన్ని ‘చేజారి’ పోనీకూడదు. నేనెదుర్కొన్న కష్టం ఏంటో తెలిస్తే.. మీ ‘సమస్య’ చిన్నదిగా కనిపిస్తుందేమో! దాన్ని అధిగమించవచ్చనే నమ్మకమూ కలుగుతుందేమో వినండి!”.. అంటూ తన కథ చెప్పడం మొదలుపెట్టింది.
తండాలో సంచారజాతుల కుటుంబంలో నిరుపేద జన్మ నాది. పగటి బాగోతుల కులవృత్తిని నమ్ముకుని బతికేవాళ్లం! నన్నూ ఆ కులవృత్తిలోకే తేవాలనుకున్నాడు మా నాన్న. అమ్మకు మాత్రం నన్ను బాగా చదివించాలని ఉండేది. నాకూ చదువుపైనే ధ్యాస. ఐదో తరగతి తర్వాత నన్ను సంక్షేమ వసతిగృహంలో వేశారు. బాగా చదువుతానని నన్ను ఆప్యాయంగా చూసుకునేవాడు అక్కడి వార్డెన్ రామయ్య సార్. ఆంగ్లంలో ఆయనకు మంచి పట్టుంది. నేను పదో తరగతిలో ఉండగా ఓరోజు ఆంగ్ల వ్యాకరణం నేర్పించడానికి తనవద్దకు రప్పించుకుని నాపై అఘాయిత్యం చేశాడు! అమ్మానాన్నలకు ఆ విషయం చెబితే నమ్మలేదు. ‘రామయ్య సారు దేవుడులాటోరు’ అన్నారు. పైనున్న దేవుడికి తెలుసు కదా నిజమేంటో! అందుకే.. రెండో రోజునే రామయ్యను తన వద్దకు ‘తీసుకుపోయాడు’! స్కూటర్‌పై వెళ్తున్న రామయ్య బండి హఠాత్తుగా అదుపుతప్పింది. ట్రాక్టర్ని గుద్దేసింది. దాంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. అమ్మా నాన్నా నమ్మలేదు కానీ, నాపై జరిగిన పైశాచికత్వాన్ని ఒక వ్యక్తి నమ్మారు. ‘నమ్మడం’ కాదు. ఆ వ్యక్తికి ‘తెలుసు’ కూడా! ఆ వ్యక్తి.. సీతక్క. వార్డెన్ సార్ భార్య. తను డిగ్రీ చదివింది. ఉద్యోగాలకోసం చూడకుండా సేంద్రియ వ్యవసాయం చేసేది. భర్త వికృత లైంగికత్వం గురించి ఆవిడకు తెలుసు. వార్డెన్ ముసుగులో నాలాంటి చాలామంది పసిమొగ్గల్ని చిదిమేశాడు ఆ ‘రావణాసురుడు’! రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయినప్పుడు ఒక్క కన్నీటి చుక్కా ఆవిడ కళ్లనుంచి రాలేదు.
‘చదివి ఏమవ్వాలని అనుకుంటున్నావు?’ అనడిగింది సీతక్క నన్ను.
‘డాక్టర్ అవుతానమ్మా!’ అని చెప్పా! నన్ను గుండెకు హత్తుకుంది.
‘నువ్వు డాక్టర్వి అయ్యేందుకు నేను అండగా ఉంటాను’ అన్నది. అప్పటినుంచి సీతక్క నాకు ‘సీతమ్మ’ అయిపోయింది. ఆ ‘అమ్మ’ ఆసరాతో డాక్టర్‌ను అయిపోతా అనుకున్నాను. కానీ, విధి నాకోసం మరింత ‘కఠిన’ పరీక్షను సిద్ధం చేస్తున్నదని అప్పుడు తెలీలేదు!”..
నేను వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న రోజులవి. ఆనందంగానే ఉండేదాన్ని.. ఆ ‘చేదు జ్ఞాపకాల’ను మనసు పొరల్లో సమాధి
చేసుకుంటూ.
సంక్రాంతి పండగకు కాలేజీకి సెలవులు ఇచ్చారు. అమ్మానాన్న, సీతక్కను చూడటానికి మా ఊరు బయల్దేరాను రైల్లో. ఎస్-8 బోగీలో పైబెర్త్ మీద పడుకున్నాను. సమయం.. అర్ధరాత్రి పన్నెండు. చీకటిని చీల్చుకుంటూ 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నది ఆ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. కొన్ని క్షణాల ముందే ఒక చిన్న స్టేషన్‌ని దాటిందది. డ్రైవర్‌కి మెయిన్ లైన్లో ఆకుపచ్చ సిగ్నల్ కనిపిస్తున్నది. కానీ అనూహ్యంగా బండి లూప్‌లైన్‌కి మారిపోయింది. ఆ లూప్ లైన్లో ఇనుప ఖనిజం నిండి ఉన్న గూడ్స్ బండి ఆగిఉంది. అంతే.. మరుక్షణం జరిగిపోయింది ఆ ఘోరం! ఇంజిన్‌తోపాటు నాలుగు కోచ్‌లు ఆ గూడ్స్ బండి మీదికి ఎక్కేశాయి. పన్నెండు కోచ్‌లు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. నాకు మెలకువ వచ్చి చూశాను. చుట్టూ గాఢమైన చీకటి. రైలు పట్టాల పక్కన వెల్లకిలా పడిఉన్నానని తెలుస్తున్నది. చలిగాలి ముఖాన్ని తాకింది. ఎక్కడా నొప్పి తెలియడంలేదు.
‘నాకేం కాలేదు!’ అనుకుంటూ, అమ్మకి ఫోన్ చేయాలని కుడిచేతిని పైకి లేపాను. కానీ అది లేవలేదు. లేవలేకపోవడం కాదు.. అది అసలు లేదు! నా కుడి అరచేయీ, ముంజేయి అక్కడ లేవు. మోచేతి కింది వరకూ తెగిపోయి ఉంది! భయంతో కంపించిపోతూ పక్కకు చూశాను. ఎవరో గొడ్డలితో నరికినట్టు ఎడమ చేయి కూడా తెగిపోయి ఉంది. ఆ ‘మొండి’ చేతుల్లోంచి ధారాపాతంగా నెత్తురు కారిపోతున్నది. అప్పుడు తెలిసింది నొ..ప్పి! వేసుకున్న గులాబీ రంగు చుడీదార్ ఎర్రగా తడిసిపోతున్నది. వైద్య విద్యార్థినిగా నాకు తెలుస్తున్నది.. రక్తస్రావం ఎక్కువై పోతున్నదని. నా శరీరంలో రెండు ‘లింబ్స్’ తెగిపోయాయన్న షాక్! ఇరవై నిమిషాలకి అక్కడికి ఎమెర్జెన్సీ వైద్య బృందాలు చేరుకున్నాయి. ఒక మెడికల్ టెక్నీషియన్ నన్ను చూసి శవం అనుకుని ఆ ‘గుట్టల’ వైపు తరలించబోతుంటే..
‘నేను బతికే ఉన్నాను. బ్లీడింగ్ ఆగేలా ఏదైనా చేయండి ప్లీజ్!’ అన్నాను.
అతను ఆశ్చర్యపోయాడు నేను మాట్లాడటం చూసి. నాలో ఒక ఆశ.. ‘నేను బతుకుతాను’. ‘బ.త.కా.లి!’
‘సిగ్నలింగ్ వైఫల్యంతో ఘోర రైలు ప్రమాదం. వందల మంది దుర్మరణం’ అన్న వార్త చూసి ఉలిక్కిపడింది సీతక్క. ఒక ఆసుపత్రిలో నాకు చికిత్స చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌కి నన్ను తరలిస్తుంటే.. గౌన్ వేసుకున్న ఒక డాక్టర్ని అడిగా..‘నేను బతుకుతానా డాక్టర్?’ అని. ‘తప్పకుండా!’.. అన్నాడు ఆ డాక్టర్. ఒక నిశ్చింతతో ఇక అప్పుడు కళ్లు మూసుకున్నాను.
కాలం పరిగెడుతున్నది. హఠాత్తుగా రెండు చేతులూ పోవడంతో నా మెదడులో సర్క్యూట్లు ఇంకా ‘సర్దుబాటు’ చేసుకోలేక పోతున్నాయి. ఆ అవయవాలు ఇంకా ‘ఉన్నట్లే’ అనిపిస్తూ ఒక భ్రాంతి! అమ్మానాన్నల కంటే సీతక్కే నా పక్కన ఎక్కువగా ఉంటున్నది. సీతక్క అలా నా పక్కన ‘ఉండటమే’ ఒక ఓదార్పు, ఒక ధైర్యం నాకు. ప్రోస్తటిక్ నిపుణుల దగ్గర కృత్రిమ అవయవాల గురించి తెలుసుకుంటూ వాటితో దైనందిన జీవితంలో పనులెలా చేయాలో నేర్చుకుంటున్నాను. ఒకరోజు నాకు కృత్రిమ చేతుల్ని అమర్చారు. శిల్పి చేతుల్లో మలచబడ్డట్టున్న ఆ ప్లాస్టిక్కూ, లోహమే నాకా క్షణంలో ఏంతో అందమైనవిగా, అపురూపంగా అనిపించాయి. కుడిచేతికి అమర్చిన ప్రోస్తెసిస్తో మొదటిసారి కలం పట్టుకోగానే.. నాలో ఒక సంతోషం! నా కళ్లు నీటితో నిండిపోయాయి. పసిపిల్లాడు మొదటిసారి ఒక్కొక్కటీ నేర్చుకుంటూ అనుభవించే సంతోషంలాంటిది అది. ఎందుకో ప్రతి చిన్ని అనుభవమూ గొప్ప ఆనందాన్ని ఇస్తున్నది. క్రమంగా నాకు కృత్రిమ అవయవాల్ని ఉపయోగించే నైపుణ్యం వచ్చేసింది. ‘హుక్స్’తోనే పుస్తకాన్ని తెరవడం, టీ కప్పు పట్టుకోవడం ఆఖరికి నా దుస్తుల మీది తల వెంట్రుకని కూడా ‘చేత్తో’ పట్టుకో గలుగుతున్నాను. బైక్ కూడా నడిపేశాను ఒకరోజు. రైలు ప్రమాదం జరిగిన ఏడాది తర్వాత తిరిగి కళాశాలలో ప్రవేశించాను. అంతకు ముందుకంటే ఎక్కువ మార్కులు సాధిస్తూ, పట్టుదలతో డాక్టర్నయ్యాను. ఈ కృత్రిమ అవయవాలతో రోగి శరీరంలోని ట్యూమర్‌ని గుర్తించ గలుగుతున్నాను ఇప్పుడు! ఈ కృత్రిమ చేతులతోనే కృత్రిమ గుండె తయారీలో సేవలు అందివ్వ గలుగుతున్నాను. ఈ ‘చేతులతోనే’ మీకు శస్త్రచికిత్సా చేయగలిగాను!”.. అంటూ తన ‘రెండు చేతుల్నీ’ శరత్ ముందుకు చాపింది డా. దీపిక!
శరత్ దిగ్భ్రాంతితో ఆ ప్రోస్తటిక్ చేతుల్ని చూస్తూ అచేతనావస్థలో ఉండిపోయాడు.“శరత్.. మీకున్న ఆ ‘పీడోఫిలిక్ డిజార్డర్’ కంటే తీవ్రమైనది ‘సైకోపతిక్ కండిషన్’. అత్యంత ప్రమాదకరమైన యాంటీ సోషల్ పర్సనల్ డిజార్డర్ అది. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైకోపతిక్ కండిషన్‌ని కూడా నయం చేసే మార్గాలు ఉన్నాయి. అంతేకాదు ‘సైకోపాత్స్’ని ముందే కనిపెట్టి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆపగలగడం కూడా సాధ్యమే. అలాంటప్పుడు మీకున్న ‘పరిస్థితిని’ నయం చేయలేమా?! మీ సమస్యను తొలగించే ‘బాధ్యత’ నాది. కానీ, ఇంకెప్పుడూ ఆత్మహత్యాయత్న యోచన మాత్రం చేయనని నాకు మాటివ్వండి ప్లీజ్”..
డా.దీపిక చేతిలో చేయి వేశాడు శరత్. ఎందుకో.. అది అతనికి కృత్రిమ చేతిలా అనిపించలేదు. మానవత్వపు పరిమళాలతో కూడిన సజీవ స్పర్శలానే ఉంది!
“ఎందరో మృగాళ్లు ఎన్నో పసి జీవితాల్ని చిదిమేస్తున్నారు. నేనూ ఒక ‘ప్రిడేటర్’ చేతిలో బలైనదాన్నే! అయినా మిమ్మల్ని నేను కాపాడతాను. ఎందుకంటే.. మీలోని ఆ ‘ప్రమాదకర సెక్సువల్ ఓరియంటేషన్’ కారణంగా ఎవరికైనా కీడు జరగుతుందేమోనన్న సామజిక బాధ్యత ఉంది మీలో. ఆ మానవీయత మరణించకూడదు శరత్!”..
ఆ తర్వాత రెండు నెలల్లోనే డా.దీపిక ఒక అద్భుతమైన మెడికల్ మిరకిల్కి నాంది పలికింది. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్‌ల సాంకేతికత సాయంతో శరత్ మెదడులోని నాడీ వ్యవస్థను నియంత్రిచేలా ఒక ప్రత్యేకమైన ‘ఏర్పాటు’ చేసింది. అది ఏ చిప్ ద్వారానో ఒక పరికరం ద్వారానో కాదు. కేవలం ఒక టాటూ పూతతోనే!! ‘గ్రాఫీన్’ అనే ప్రత్యేకమైన పదార్థపు పొడి కలిపిన టాటూ! పూతరేకు పొరలో లక్షో వంతు మందం మాత్రమే ఉన్నా.. స్టీల్ కంటే రెండొందల రెట్లు గట్టిది – గ్రాఫీన్! ఒక మేజిక్ మెటీరియల్!
ఆ ప్రయోగం ఫలించింది. శరత్ మెదడులోని నరాలిప్పుడు ‘సరిగ్గా’ కలపబడి ఉన్నాయ్!
చికిత్స ముగిసి పూర్తిగా కోలుకున్న తర్వాత శరత్, డా. దీపికతో చెప్పాడు.
“మీ ‘చేయం’దుకునే అర్హత నాకుందో లేదో తెలీదు. కానీ చల్లని మీ చేతి ‘స్పర్శ’ జీవితాంతం నాకు కావాలనిపిస్తున్నది. విల్యూ మ్యారీ మీ డాక్టర్?” మోకాళ్ల మీద కూర్చుని అర్థించాడు శరత్! ఎన్నో ఏళ్లుగా స్తబ్ధతతో నిద్రాణమై ఉన్న, తనలోని స్త్రీత్వపు ముగ్ధత్వాన్నెవరో మేల్కొల్పుతున్నట్టు తుళ్లిపడింది దీపిక.
వివాహమైన కొన్ని నెలలకే, ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.. అగ్నిసాక్షిగా భార్యాభర్తలైన దీపికా, శరత్! భౌతిక, లైంగిక, మానసిక వేధింపులకు గురైన ఐదు – పన్నెండు సంవత్సరాల నిరుపేద, అనాథ, వీధి బాలలు, బాలికల పూర్తిస్థాయి పునరావాసం కోసం ఆ ఆశ్రమం! ప్రారంభోత్సవానికి సీతక్క వచ్చింది. అమ్మానాన్నల సమక్షంలో తన ‘సీతమ్మ’ చేతులమీదుగా ఆశ్రమ ప్రారంభోత్సవం చేయించింది డా.దీపిక. ఆ రాత్రి, దీపికతో ఒంటరిగా ఉన్నప్పుడు సీతక్క అన్నది..
“ఆనాడు నా భర్త చేసిన అమానుషానికి నేను ఇంకా అపరాధ భావనతో కుమిలిపోతూనే ఉన్నానమ్మా!”.. సీతక్కనే చూస్తున్నది దీపిక.
“కానీ, ఒక్క విషయంలో మాత్రం నాకు సంతృప్తిగా ఉందమ్మా! ఆ రాక్షసుడు చావడం!! ఆ రోజు వాడి స్కూటర్ బ్రేక్ వైర్లని తెంపేసేంత తెగువెలా వచ్చిందో.. నాకిప్పటికీ తెలీదు!”..
దిగ్భ్రాంతితో సీతక్కనే చూస్తున్నది దీపిక.
“నువ్వు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితాన్ని ఏ దశలోనూ చేజారిపోనీకూడదు! మానవత్వం మూర్తీభవించిన మంచి మనిషి నీ భర్త. తన ‘సమస్య’ కారణంగా ఏ చిన్నారికీ కీడు జరగకూడదని అంతగా పరితపించే సున్నితత్వం ఎవరికుంటుంది! నీ భర్తలాంటి మహోన్నతుణ్ని ‘రక్షించు’కోవడం ఎంత అవసరమో.. నా భర్తలాంటి రాక్షసుణ్ని ‘శిక్షించడమూ’ అంతే అవసరం తల్లీ!”..
దీపిక చేతిని మృదువుగా పట్టుకుని, స్థిరంగా చెప్పింది సీతక్క.గుమ్మడి రవీంద్రనాథ్ ఎంతటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితాన్ని ‘చేజారి’ పోనీయకూడదనీ చెప్పే కథ.. ‘చేజారిపోనీకు’. రచయిత గుమ్మడి రవీంద్రనాథ్. ఈయన స్వస్థలం గుడివాడ. ఎమ్మెస్సీ చేశారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్, హైదరాబాద్ రీజినల్ చీఫ్‌గా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ఈయన తొలికథ ‘కొసవిరుపు’. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది. ఇప్పటివరకూ 160కి పైగా కథలు, తొమ్మిది నవలలు.. అన్ని ప్రముఖ వార, మాస, దిన, పక్ష పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీ – 2021లో ‘ఆకాశం’ కథకు విశిష్ట బహుమతి అందుకున్నారు. 2024 అగస్టు నెలలోనే స్వాతి వారపత్రికలో ఒక్కో కథకూ రూ.10,000 చొప్పున రెండు కథలకు వరుసగా బహుమతులు దక్కించుకున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
గుమ్మడి రవీంద్రనాథ్
82973 56766