“ప్రాకారముల బద్దలు చేసి, ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును.. చిందరవందర చేసేను మారుతి.. శ్రీహనుమాను గురుదేవులు నా యెద పలికిన సీతారామ కథ.. నే పలికెద సీతారామ కథ!”..
హనుమంతుడు లంకా దహనం ఎలా చేశాడో వర్ణిస్తూ.. సుందరకాండ ఆలపిస్తున్న ఎం.ఎస్. రామారావు గొంతు రాములవారి గుడి మైక్ లోనుంచి ఊరంతా వినిపిస్తోంది. రోజూ ఆ పాటలు వినపడగానే నిద్రలేవడం ఆ ఊరి జనానికి అలవాటైపోయింది. అందరిలాగే ఎంకన్న కూడా లేచి.. సగం నిద్ర మత్తులోనే నడుచుకుంటూ కొట్టంలో ఉన్న ఆవులకు మేతవేయడానికి పోతున్నాడు. ఇంతలోనే ఒక్కసారిగా ఆకాశంలో హఠాత్తుగా ఉరిమి, పిడుగు పడ్డట్టు.. ‘డమ డమ డమ’.. అంటూ వాళ్ల రేకుల ఇంటిపైన పెద్ద చప్పుడు. అంతకుముందే నిద్రలేచి ఇంటిపని చేసుకుంటున్న ఎంకన్న భార్య, ఇంకా నిద్రలేవని ఇద్దరు పిల్లలే కాదు, చుట్టుపక్కల జనం కూడా.. ఉలిక్కిపడ్డారు.
ఆ రేకుల ఇంటిపైనుంచి గుంపులు గుంపులుగా పోతున్న కోతులు. ‘కిచ కిచ కిచ.. కీర్ కీర్’.. అంటూ నలభై, యాభై కోతులు ఒక ఇంటిమీది నుంచి ఇంకో ఇంటిమీదికి దుంకుతున్నాయి. అలా దుంకుతున్నపుడు వీధి దీపం వెలుగులో.. పెద్దగా, పొడుగ్గా సాగినట్లు ఉన్న ఆ నీడలు.. కోతుల నీడలు భయంకరమైన దయ్యాల్లాగా కనిపించాయి.“తెల్లారక ముందే ఊరిమీద పడ్డాయిరా కోతుల మంద..” అని తిట్టుకుంటూ పెద్ద వెదురు కట్టె పట్టుకుని.. ‘హొయ్, హోయ్’.. అంటూ ఎంకన్న వాటిని తరమసాగాడు. చుట్టుపట్టు జనం కూడా పెద్దపెద్ద గిన్నెలు, రేకు డబ్బాలు కొడుతూ.. భయంకరమైన శబ్దం చేస్తూ.. తరుముతున్నారు. కోతులు ఏమాత్రం భయపడకుండా.. ఒక ఇంటి గాబు దగ్గర ఉన్న ఎంగిలి గిన్నెలు, రాత్రి మిగిలిన అన్నం కోసం వంటపాత్రలు.. ఏది దొరికితే అది అందుకుని ఉరుకుతున్నాయి. కేబుల్ టీవీ వైర్లమీద ఊగుతూ, ఎగురుతూ, దూకుతూ.. అల్లకల్లోలం చేసి ఇంకో బజారువైపు పారిపోయాయి. ఒక పెద్ద యుద్ధం ముగిసినట్టు ప్రశాంతంగా ఉంది అక్కడ.
ఎంకన్నకు నలభై ఏళ్లు ఉంటాయి. తండ్రి ఇచ్చిన మూడెకరాల భూమిని సేద్యం చేసుకుంటూ బతుకుతున్నాడు. పగలు, రాత్రి వ్యవసాయమే లోకంగా పచ్చని చెట్టులా బతుకుతున్నాడు. భార్య ఎల్లమ్మకు కూడా చేను తప్ప ఇంకో ముచ్చట తెలియదు. ఈ కోతుల గోల లేకముందు.. అంటే, ఐదేళ్ల కిందట.. ఎకరం వరి పొలం, ఇంకో ఎకరం పత్తి, మరో ఎకరం వేరుశనగ పంట సాగుచేసేవాళ్లు. ఈ కోతుల గోల మొదలై నాలుగేళ్లు అయింది. ఏ పంటను దక్కనిస్తలేవు. వేరుశనగ చేనులో.. పిందెలు పడకముందే ఒక్క రాత్రిలో చేను మొత్తం పీకిపారేస్తయి. పత్తి చెట్టు పిందెలను పీక్కతింటయి. ఆఖరికి వరిపొలాన్ని కూడా కొరికికొరికి తింటున్నాయి. వీటిని ఎట్ల వదిలించుకోవాల్నో అర్థం కావట్లేదు ఎంకన్నకు.
ఎంకన్న వాళ్ల ఊరి పక్కనే ఉన్న నది మీద.. పెద్ద డ్యాం కట్టడానికి పనులు చురుగ్గా జరుగుతున్నయి. పెద్ద కొండను బాంబులు పెట్టి పేలుస్తున్నరు. పొక్లెయినర్లతో కాలువలు తవ్వుతున్నరు. చీమల బారులా నిత్యం రోడ్లమీద భారీ లారీలు, ట్రిప్పర్లు. ప్రాజెక్టు పని అయిపోతే.. తమ ఊరితోపాటూ చుట్టుపక్కల ఊళ్లకు నీళ్లు వస్తాయని.. భూముల ధరలు పెరుగుతాయని సంబరపడుతున్నారు రైతులు. ఎంకన్నకు మాత్రం ప్రశాంతంగా అడవిలో బతికే కోతులు ఈ ప్రాజెక్టు వల్లనే.. ఊళ్ల మీదపడ్డాయని కోపంగా ఉంది.
ఎంకన్న చిన్నతనంలో కోతులు ఇంతగనం ఉండేవి కాదు. ఎప్పుడో ఒకసారి దారితప్పినట్టు కోతులు ఊళ్లోకి వచ్చేటియి. ఆ రోజుల్లో కోతి అంటే అదో ఇచ్చిత్రం. అట్లనే గారడీ చేసేటోళ్లు కూడా.. ఊళ్లో కోతిని ఆడించేటోళ్లు. కోతికి ఒక సద్దిమూట ఇచ్చి.. ‘నీ మొగనికి సద్ది తీసుకుని పో!’ అని చెప్తే.. అది ఊరి పెద్దమనిషి ఒకాయన్ని గట్టిగా పట్టుకునేది. దాన్ని చూసి పోరగాళ్లు చప్పట్లు కొడుతూ పకపకా నవ్వేటోళ్లు. కానీ ఇప్పుడు.. కోతుల్ని చూస్తే దయ్యాల్ని చూసినట్టే జనం భయపడుతున్నరు.
పంట చేల మీదనే కాదు.. ఊరి మీదకూడా దాడి చేస్తున్నయి. పండుగ పూట అప్పలు చేయడానికి డాబాల మీద ఆరబెట్టిన బియ్యం, శనగపప్పులు కానీ కోతుల కంట్లో పడితే.. ఇంక ఆశ వదులుకోవాల్సిందే. నిమిషంలో మాయం చేస్తయి. కావలి ఉన్న చిన్నపిల్లలను, ఆడోళ్లను కూడా భయపెడతయి. ఓపాలి ఇంటి ముందర బియ్యం చెరుగుతున్న.. సాకలోల్ల శాంతమ్మ మీదపడి శాటెడు బియ్యం ఎత్తుకొని పోయినయి. అంతెందుకు కుమ్మరోల్ల లక్ష్మమ్మ ఇంట్లె.. నానబెట్టిన బియ్యం గిన్నె కూడా ఎత్తుకొని పోయినయి. మంగలోళ్ల భాగ్యమ్మ.. ఇంటికి తాళం వేసుకుని చేను కాడికి పోతే.. కిటికీలు నెట్టి లోపలకి జొరబడి ఇల్లు మొత్తం అల్లడంతల్లడం చేసినయట. దొంగలు పడ్డరేమో అని భాగ్యమ్మ ఏడ్పులు పెడబొబ్బలు. ఇంక ఇంటి కప్పుమీద బెంగళూరు పెంక ఉన్న ఇండ్లోళ్ల పరిస్థితి మరీ అధ్వాన్నమైపోయింది. గొల్లోళ్ల లింగయ్య ఇంటి పెంకలు మొత్తం ఊడబీకినయట. ఇంగ ఎంకన్నది రేకుల ఇల్లు. ఆ రేకుల మీద ఎగిరిఎగిరి దూకుతయి. ఆ చప్పుడు వాటికి సంబంరంగా అనిపిస్తదో ఏమో. మల్లమల్ల అటూఇటూ దూకుతయి. ఇగ ఒంటరిగ ఆడోళ్లు, చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ల దగ్గర ఏమున్నా లాక్కొని పోతున్నయి. తాటిచెట్లు, ఈతచెట్ల మీదికెక్కి కల్లు మొత్తం తాగుతయి. లొట్లు పగలగొడుతున్నయి. ఇట్లయితే లాభం లేదని.. ఓపాలి ఊరంతా కలిసికట్టుగ పోయి సర్పంచి మల్లారెడ్డికి ఫిర్యాదు చేసినరు.
“నేను ఈ ఊరి సర్పంచిని నిజమే! ఐతే నన్ను ఏం చేయమంటరు. కోతులకు కావలి ఉండమంటరా? లేకపోతే కోతులను పట్టుకొమ్మంటరా ఎట్లా..” అని ఎగతాళిగ మాట్లాడిండు.ఇట్ల కాదని జనమే ఒక ఉపాయం చేసినరు. ‘హైదరాబాద్ దగ్గర కోతులను పట్టేటోళ్లు ఉంటరట’.. అని చెప్పి, ఇంటికి ఐదొందలు చొప్పున లక్ష రూపాల దాకా వసూలు చేసినరు. ఆటో కట్టుకుని పోయి ఇద్దరు మనుషులను తెచ్చినరు. వాళ్లు అటు ఉరికి ఇటు ఉరికి ఓ.. యాభై కోతులు పట్టినరు. ‘మీరు ఇచ్చిన యాభైవేలకు లెక్కసరిపోయింది!’ అని.. యాభై కోతులను పట్టుకుని పోయినరు.వసూలు చేసిన డబ్బులో యాభైవేలు కోతులు పట్టేటోళ్లకు, ఇంకో యాభై వేలు పెద్దమనుషుల తాగుడు పేరుతో మింగినరు.
“ఇట్ల కాదు.. మన పక్కూరు రామారంలో ఒక కొండంగిని తెచ్చినరట. కొండంగిని చూస్తే.. కోతులు జడుసుకుని ఆమడ దూరం పారిపోతయట!” అని దూదేకుల మస్తాన్ చెప్పిండు.మరి కొండంగి యాడ దొరుకుతది అని జాడ తీస్తే.. యాడనో కర్ణాటక దగ్గర కొడంగల్ అనే ఊళ్లే కొండంగులు ఉంటయట. అందుకనే ఆ ఊరుకు కొడంగల్ అనే పేరొచ్చిందట. అది సరెగానీ ఊళ్లెకి కోతులైతే.. ఫ్రీగా వచ్చినయి కానీ.. మరి కొండంగి రాదుగద. దాన్ని కొనాలంటే యాభై వేలు కావాలంట. ఇగ మళ్ల.. ఇంటికి ఇంత అని వసూలు చేసినరు. కొండంగిని బస్సులనో, రైళ్లనో తీసుకుని రావడం కుదరదు కాబట్టి.. ఒక కారు మాట్లాడుకుని దర్జాగా తెచ్చినరు.
ఇంగ అది ఊళ్లోకి వచ్చినపుడు చూడాలే సందడి. ఒక బ్యాండు మేళం, డప్పులు పెట్టి డాన్సులు ఏసుకుంటూ స్వాగతం పలికినరు కొండంగికి. మన ఊరికి ఏకంగా హనుమంతుడే దిగి వచ్చినడు అని ఊరి ఆడోళ్లు.. బిందెల కొద్ది నీళ్లు ఆరబోసి.. హారతిలు పట్టిండ్రు. ఆ కొండంగి మొఖం నల్లగ.. అచ్చం జీడిగింజ ఉన్నట్టే ఉంది. దాని తోక ముల్లుగర్ర అంత.. బారెడు ఉన్నది. దాన్ని చూడంగనే చిన్నపొలగాండ్లు జడుసుకుని ఇంటికి ఉరికినరు.
ఆ కొండంగితోనే.. ట్రైనింగ్ ఇయ్యడానికి ఒక మాస్టర్ కూడా వచ్చినడు. ఆ మాస్టర్‌కు నెలకు పదివేల జీతం.. మూడు పూటలా తిండి బాధ్యత కూడా ఊళ్లో వాళ్లదేనట. ఆయన కోతులను పట్టుడు ఏమో కానీ.. ఎప్పుడు చూడు.. ఫుల్లుగా నాటుసారా తాగి.. ఆ మాస్టరే ఒక కల్లు తాగిన కోతిలా చిందులేసేటోడు. రెండు రోజులు కొండంగిని చూసి కోతులు భయపడి ఇంకో బజారుకు పారిపోయినయి. కొండంగి ఒక వైపు ఉంటే.. కోతులు ఇంకో దిక్కు పోయేవి. ఆ తాగుబోతు మాస్టర్.. కొండంగికి కూడా సారా అలవాటు చేసిండు. మెల్లగ సారాయి మత్తుకు అలవాటు పడ్డ కొండంగి.. మాస్టర్ రెండుగ్లాసులు తాగితే అది నాలుగు గ్లాసులు తాగేది. ఆ సారా మత్తు ఎక్కడంతో పుల్లుగా నిద్రపోయేది. చివరికి ఓ రాత్రి పూట.. చైన్ ఊడబీక్కొని పారిపోయింది. మూడు రోజుల తర్వాత.. సారా మత్తు దిగిన ఆ మాస్టర్..
“మీ వల్లనే నా కొండంగి పోయింది.. లక్షరూపాయలు ఇయ్యాలె!” అని ఒకటే గోల.చివరకు మళ్లా ఊరి జనమే తలా ఇంత వేసుకుని పదివేలు చేతిల పెడితే.. వెళ్లిపోయిండు. పోతుపోతూ రెండు పావులు సారా తాగడం మాత్రం మర్చిపోలేదు. కొండంగి పోయింది కానీ.. కోతులు మాత్రం అట్నే ఉన్నయి. మళ్ల కథ మొదటికొచ్చింది.
అందరి సంగతి ఎట్ల ఉన్న.. ఎంకన్న పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అప్పుడే పత్తి చేనులో పిందెలు పడుతున్నయి. కోతులు చూసినయంటే పత్తి పిందెలన్నీ తెంపుతయి. అందుకనే పగటిపూట భార్య ఎల్లమ్మతో కలిసి కాపలా కాస్తున్నడు. రాత్రి పూట చేను చుట్టూ.. ఉన్న ఫెన్సింగ్ తీగకు కరెంటు వైరుతో కనెక్షన్ ఇచ్చిండు. ఆ రోజు అర్ధరాత్రి ఎందుకో ఎంకన్నకు మెలకువ వచ్చింది. నిద్ర పట్టలేదు. ఎక్కడినుంచో కోతులు అరుస్తున్న చప్పుడు వినిపించింది. కొంపదీసి పత్తిచేను దగ్గర గిట్ల ఉన్నయా? అన్న అనుమానం వచ్చి.. లేచి చేతికర్ర, టార్చిలైటు తీసుకుని చేనువైపు పోయిండు. పత్తిచేను దగ్గరకి వచ్చి టార్చిలైట్ వేసి చుట్టూ చూసిండు. దూరంగా ట్రాన్స్ఫార్మర్ చప్పుడు.. గుయ్యిమంటూ వినిపిస్తంది. అంటే కరెంట్ ఉందని అర్థం. కోతుల జాడ కనపడకపోయే సరికి.. ఇంటికి పోదాం అనుకున్నడు. అంతలోనే చిన్నగా కోతి పిల్లల కేకలు వినిపించాయి. చీకట్లో చేను చుట్టూ టార్చిలైట్ వేసి చూశాడు. దూరంగా ఎక్కడో కోతుల మంద. చీకట్లో టార్చిలైట్ కాంతికి.. వరుసగా మెరుస్తున్న తెల్లని కళ్లు. కోతుల మంద దగ్గరికి వస్తున్నది. ముందుగాల వాటికి నాయకుడిలా నడిపించిన కోతి.. దగ్గరగా వచ్చి ఫెన్సింగ్‌ను అనుమానంగా పట్టుకుంది. షాక్ కొట్టగానే వెనక్కు జరిగి మిగిలిన కోతులను.. ‘పోవద్దు!’ అన్నట్లు గట్టిగా అరుస్తున్నది.
కానీ, అంతలోనే రెండు పిల్ల కోతులు ఫెన్సింగ్ పైకి ఎక్కాయి. కరెంట్ షాక్ తగిలి గిలాగిలా కొట్టుకుంటున్నాయి. మిగిలిన కోతులు వాటిని లాగడానికి దగ్గరికి పోయి.. షాక్ తగిలి మొత్తుకుంటున్నాయి. నలభై యాభై కోతులు.. కిచ..కిచ.. అంటూ ఒకటే గోల! ఇంకొద్దిసేపు అలాగే ఉంటే.. ఆ రెండు పిల్లకోతులే కాదు. పదైనా పెద్ద కోతులు చనిపోతాయి. కానీ, మనసు ఒప్పుకోలేదు ఎంకన్నకు. గబగబ పరిగెత్తి.. కరెంటు కనెక్షన్ పీకేశాడు. భయంతో కోతులు అక్కడినుంచి పరిగెత్తాయి. మనసు ఎలాగో అనిపించి అక్కడే కూలబడ్డాడు. అడవి పందులు, జింకలు చివరకు పులిని ఐనా ఎదుర్కోవచ్చు కానీ.. ఈ కోతులను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. దూరంగా గుట్టల్లో బాంబు పేలిన శబ్దం. డ్యాం కట్టడం కోసం.. కొండను బాంబులు పెట్టి పేలుస్తున్నారు. ఆ ప్రాజెక్టు కట్టడం అయిపోతే.. తమ ఊరు పొలాలన్నింటికి నీళ్లు వస్తాయని.. తమ భూముల ధరలు పెరుగుతాయని జనాలు అనుకుంటున్నారు. భూముల ధర సంగతి ఏమో కానీ.. పంటలు ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు ఎంకన్నకు. అక్కడే చేను పక్కన ఉన్న బండమీద పడుకుని తెల్లవారు గట్ల ఇంటి బాటపట్టాడు. ఊరి రచ్చబండ దగ్గర రావి చెట్టు కింద కూచొని కోతుల గురించే మాట్లాడుకుంటున్నరు.
“ఒకప్పుడు ఊరు ఎట్ల ఉంటుండే! ఎటు చూసినా పచ్చని చెట్లు. ఎండకాలం మామిడి పండ్లు, సీమసింత పండ్లు, తునికి చెట్లు, వానకాలం వస్తే ఎటుచూసిన పచ్చని చిగుళ్లు, చింతచెట్ల వానగాయలు, నేరేడు చెట్లు, తాటిపండ్లు.. చలికాలం నారింజ పండ్లు, సీతాఫలం చెట్లు, సంక్రాంతి సమయానికి ఇరగకాసిన రేగుపండ్లు.. ఇంగ జామకాయలు మూడు కాలాలూ కాసేటియి. అడవి జీవరాసుల ఆకలి తీరుతుండె. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పేరుతోని భూమిని నాశనం చేస్తిరి. జీవరాసులు ఎట్ల బతకాలె. అడవిలే ఏం దొరుకుతుంది తినడానికి!”.. అని టీచర్‌గా పనిచేసి రిటైరైన ధర్మయ్య సార్ ఇవరం చెప్పబట్టే.
“మరి ఇప్పుడు కోతుల గోల వదిలించుకోవాలంటే ఎట్ల సారూ!” అని అడిగిండు ఎంకన్న. “వదిలించుకోవడం ఎట్ల కుదురుతది? ఈ భూమి మన ఒక్కరిదే కాదు కద. అన్ని జీవరాశులది కద! అట్లనే కోతులది కూడా. కాబట్టి వాటిని వదిలించుకోవడం కుదరదు. వాటితోని కలిసి బతకాల్సిందే”.. “కోతులు, మనుషులు ఎట్ల కలిసి బతుకుతరు”.. అర్థం కాలేదు ఎంకన్నకు.“ఎందుకు బతకలేము. మన తాతలు, ముత్తాతలు అట్లనే కద బతికింది. కుక్కలు, పిల్లులు, పందులు, పాములు, కోతులు అందరు కలిసి బతకలేదా! ఎవల బతుకు వాళ్లు బతికితే ఈ భూమి మీద ఎవరికి ఇబ్బంది లేదు”.
“ఇంతకూ ఇప్పుడు ఏం చేద్దాం అంటరు సారూ” అని అడిగిండు ఎంకన్న.“మన ఊరంతా తల ఇంత ఏసుకుని అరటిపండ్లు.. బత్తాయిలు.. ఇంట్ల ఏది చౌకగ దొరికితే అవి తెచ్చి.. ఊరిబయట ఒక తావుల పెట్టాలె. అట్ల ఒక వారం పాటు అలవాటైతే.. కోతులు రోజూ తిండికి అక్కడికే వస్తయి. అట్లనే తొందరగా పండ్లు వచ్చేటి.. సీతాఫలం చెట్లు, జామ చెట్లు ఊరిబయట బంజరు భూముల్ల.. రోడు పక్కన నాటించాలె. అట్ల వాటికి తిండి అడవిలనే దొరికితే ఊరి మీదికి రావు కద. అట్ల ఏ ఊరు కోతులు ఆ ఊళ్లోనే ఉంటే.. సమస్యే ఉండదు కద!”..’
ధర్మయ్య సార్ చెప్పింది ఏదో మంచిగనే ఉందనిపించిది ఎంకన్నకు. ఇంతలో మళ్లీ ప్రాజెక్టు బాంబు పేలుడు శబ్దం ఊరంతా ప్రతిధ్వనించింది. ఇంటి గోడలు, ఇంట్లో ఉన్న వంటపాత్రలు ఉలిక్కిపడ్డట్టుగా కదిలాయి. గుంజకు కట్టేసిన ఆవు.. భయంతో అటు ఇటూ తిరుగుతున్నది. బాంబు పేలుళ్లు.. పెద్దపెద్ద పొక్లెయినర్ల శబ్దాలు.. ఇరవై నాలుగ్గంటలూ రోడ్లమీద టిప్పర్లు.. వీటన్నిటిని చూస్తే.. ప్రాజెక్టు వచ్చాక భూముల ధరలు పెరగడం ఏమో కానీ.. ఊరంతా విధ్వంసం అవుతున్నదన్న భయం కలిగింది ఎంకన్నకు. పెద్దపెద్ద ప్రాజెక్టులతోని మనుషులు బతుకుతరేమో కానీ.. కోతులతోసహా అన్ని జీవరాశులు, కొండలు, గుట్టలూ అన్నీ విధ్వంసం అవుతున్నట్టు కళ్లముందు కనపడుతున్నది.
ఆరోజు పొద్దున్నే ధర్మయ్య సార్ పేపర్ పట్టుకుని అందరికీ చదివి వినిపిస్తున్నాడు. అది పిడుగు లాంటి వార్త అని జనానికి అర్థమైంది. తమ ఊరు దగ్గరలో కడుతున్న ప్రాజెక్టు ఎత్తు ఇంకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఎత్తు పెంచడం వలన నీళ్ల ముంపు ప్రాంతం ఎక్కువగా ఉంటుందని.. అందుకే తమ ఊరితోపాటు ఇంకా రెండు గ్రామాలను ఖాళీ చేసి.. తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించిందంట.
తరతరాలుగా ఉన్న ఊరు. పుట్టి పెరిగిన ఊరు. అన్నీ వదిలేసి ఇంకో తావుకు పోయి బతకాలె అంటే అయితదా!? గవుర్మెంటు డబ్బులు ఇవ్వొచ్చు. కానీ, డబ్బులు ఎంతకాలం ఉంటయి. ఎంకన్నలో కనపడని ఆందోళన మొదలైంది. ఆ రాత్రి మొత్తం నిద్రపట్టలేదు. తెల్లవారుజామున ఎప్పుడో చిన్న కునుకు.. ఇంతలో మళ్లీ ఒక్కసారిగా రేకుల మీద చప్పుడు.. కాకపోతే ఇప్పుడు కోతులు కాదు.. మనుషులు! తను, తన భార్య, పిల్లలు, తన ఊరివాళ్లు.. ఆ రేకుల మీద, ఇండ్ల మీద దూకుతూ పరిగెడుతున్నారు. ప్రశాంతంగా బతకడానికి ఇంత తావు కోసం.. ‘అమ్మా.. నాన్నా!” అంటూ పిల్లల ఆర్తనాదాలు.. పరిగెడుతున్నారు.. దూకుతున్నారు.“కోతులు.. గుంపులు.. మనుషులు.. తావులు.. విధ్వంసం.. కోతులు.. బిడ్డా.. జాగ్రత్త..” అంటూ గట్టిగట్టిగా అరుస్తూ, కేకలు పెడుతూ ఊరిలోని వీధుల్లో ఉరుకుతున్నాడు ఎంకన్న.
మళ్లీ ప్రాజెక్టు బాంబు పేలుడు శబ్దం ఊరంతా ప్రతిధ్వనించింది. ఇంటి గోడలు, ఇంట్లో ఉన్న వంటపాత్రలు ఉలిక్కిపడ్డట్టుగా కదిలాయి. గుంజకు కట్టేసిన ఆవు.. భయంతో అటు ఇటూ తిరుగుతున్నది. బాంబు పేలుళ్లు.. పెద్దపెద్ద పొక్లెయినర్ల శబ్దాలు.. ఇరవై నాలుగ్గంటలూ రోడ్లమీద టిప్పర్లు.. వీటన్నిటిని చూస్తే.. ప్రాజెక్టు వచ్చాక భూముల ధరలు పెరగడం ఏమో కానీ.. ఊరంతా విధ్వంసం అవుతున్నదన్న భయం కలిగింది ఎంకన్నకు. పెద్దపెద్ద ప్రాజెక్టులతోని మనుషులు బతుకుతరేమో కానీ.. కోతులతోసహా అన్ని జీవరాశులు, కొండలు, గుట్టలూ అన్నీ విధ్వంసం అవుతున్నట్టు కళ్లముందు కనపడుతున్నది.
చందు తులసి
చందు తులసి అసలుపేరు చంద్రశేఖర్. సూర్యాపేట సమీపంలోని బండమీద చందుపట్ల స్వగ్రామం. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జీవిత సహచరి తులసి పేరుతో కలిపి ‘చందు తులసి’ కలం పేరుతో కథలు రాస్తుంటారు. ఈయన రాసిన మొదటి కథ.. ‘ఊరవతల ఊడలమర్రి’ మంచి గుర్తింపు తెచ్చింది. నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో వచ్చిన ‘పాలపిట్టల పాట’ కథ.. నేషనల్ బుక్ ట్రస్ట్ కథా సంకలనానికి ఎంపిక కావడమే కాకుండా.. ఇతర భారతీయ భాషల్లోకీ అనువాదమైంది. తల్లిగారిల్లు, నీళ్లబిందె, బతుకమ్మ పుట్టింది లాంటి కథలు పలు గుర్తింపు పొందిన కథా సంకలనాలకు ఎంపికయ్యాయి. సినిమారంగంలోనూ రచయితగా పనిచేస్తున్నారు. గతంలో గడి, తక్కెడ, మోదుగు పువ్వు, కాటుక పూల బతుకమ్మ.. కథలకు నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీల్లో బహుమతులు అందుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల జీవితాలను ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకుని కథలు రాస్తుంటారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో విశిష్ట బహుమతి పొందిన కథ.
-చందు తులసి
99855 83022