ఈ ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు, గొప్పవాళ్లు, మామూలు వాళ్లు.. అమ్మ ప్రేమ గురించి, ఆమె త్యాగం గురించి, చాకిరీ గురించి రకరకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు. ‘అమ్మ’ నిజంగా గొప్పది. అందులో సందేహం లేదు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే! కానీ, నాన్న ప్రేమ, వాత్సల్యం, పిల్లల పట్ల బాధ్యత, ఆయన శ్రమ.. ఇవన్నీ కూడా ఎంతో గొప్పవి.
మా నాన్న గురించి ఎప్పుడు తలుచుకున్నా కళ్లు నీటితో నిండిపోతాయి. ఆయన గురించి చెప్పడానికి మాటలు పోటీ పడతాయి. ఎన్నో అద్భుత లక్షణాలున్నా, అతి సామాన్యుడిలా గడిపి.. ‘మంచివాడు’ అనే బిరుదు తప్ప మరేమీ మిగుల్చుకోని అన్సంగ్ హీరో మా నాన్న. ‘అదిగో! నాన్న వస్తున్నారు’ అనగానే, గప్చుప్న నోర్లు మూసుకోవడం.. ‘నీ సంగతి నాన్నతో చెబుతాను. నీ పని పడతారు!’ అని అనగానే, చేస్తున్న కోతి పని ఆపేయడం.. ‘నాన్న వస్తున్నారు’ అంటే, చాటున దాక్కోవడం.. నాన్నతో మాట్లాడాలన్నా, ఏదైనా అడగాలన్నా పదిసార్లు వణికి చెమటలు పట్టడం.. ఇలాంటివేవీ మా అనుభవంలోకి రానీయని మంచి తండ్రి మా నాన్న.
పల్లెటూర్లో , పెద్ద ఉమ్మడి కుటుంబంలో, అందరికన్నా మొదట పుట్టినవాడు మా నాన్న. ఇలాంటి వాళ్లకు చిన్నప్పటి గారాబం కొన్నాళ్లే ఉంటుంది. ఆ తరువాత నుంచీ వయసుకు మించిన పెద్దరికం, తమ్ముళ్లు, చెల్లెళ్ల కోసం, కుటుంబం కోసం త్యాగాల భారాలు మోయడం, మొహమాటానికి పోయి అన్ని బరువులూ ఎత్తుకోవడం, తన సరదాలూ, సంతోషాలను ఎప్పటికప్పుడు ఇతరుల కోసం వదులుకోవడం ఉంటాయి. ఇవన్నీ అక్షరాలా మా నాన్నకు కూడా ఉన్నాయి.
అమ్మా నాన్నలకు మేము చాలా ఆలస్యంగా పుట్టాం. మా చిన్నాన్నల, మేనత్తల పిల్లల్లో ఎక్కువమంది మా కంటే పెద్దవాళ్లు. వాళ్లందరి పురుళ్లూ, బాలసారెలూ, ఇతర వేడుకలూ మా ఇంట్లోనే జరగడం వల్ల మేనల్లుళ్లనూ, మేనకోడళ్లనూ బాగా గారాబం చేసేవాడట మా నాన్న. అయితే.. తల్లిదండ్రుల ముందు తమ సంతానాన్ని కూడా ఎత్తుకోని రోజులవి. ‘అబ్బ! అంత ముద్దొస్తున్నదా? ఎత్తుకొని దించుతలేవు!’ అనేవాళ్లున్న పరిస్థితి. అందులోనూ మగపిల్లలను మాత్రమే విపరీతంగా గారాబం చేసే కాలమది. అప్పుడు కూడా నాన్న మమ్మల్ని ప్రేమగా చూసేవాడు. మా అక్కయితే ఏ చిన్న బాధ కలిగినా, సంతోషం వచ్చినా.. “నానా!” అంటూ నాన్న దగ్గరికే పరిగెత్తేదట.
మేమిద్దరమూ ఆడపిల్లలమే అని నాన్న ఎప్పుడూ బాధపడలేదు. ఎవరితోనూ అన్నది కూడా లేదు. ఆడపిల్లలతో తండ్రికి అంత చనువులేని ఆ రోజుల్లో కూడా.. స్నేహితుడిలానే ఉండేవాడు. మా పుస్తకాలకు అట్టలు వేయడం, బతుకమ్మను పేరుస్తుంటే పువ్వులు అందించడం, మాకు పుస్తకాల అలమారాలు, మా ఆటలకు వామనగుంటల పీట, చిర్రగోని, క్రికెట్ స్టంపులు వడ్రంగితో చేయించడం, గచ్చకాయలు, గురివింద గింజలు తెప్పించడం, మట్టి గురుగులు చేయించడం.. ఇవన్నీ ఇచ్చాక మా కళ్లల్లో ఆనందం చూడ్డం.. నాన్నకిష్టం.
నాన్న ఏ విషయమూ మా మీద రుద్దలేదు. అలా అని ఆయన చెప్పాల్సిన విషయాన్ని సున్నితంగా చెప్పేవాడు. లేదా చేసి చూపించేవాడు. ఓసారి మా ఇంట్లో ఆడ కూలీలు పల్లికాయ కొట్టడానికి వచ్చారు. మధ్యాహ్నం అయ్యాక అమ్మా, నానమ్మా అన్నం తినడానికి వంటింట్లోకి వెళ్తూ ఉండగా.. “వాండ్లు పల్లికాయ కొట్టుకుంట తింటరు. కొంచెం తినకుండ చూస్తూండు!” అని నాకు చెప్పి వెళ్లింది నానమ్మ. నేను పేద్ద ‘డిటెక్టివ్ ఆఫ్ ఇండియా’లా ఫీలైపోయి.. కన్నార్పకుండా చూస్తుంటే, ఒకామె సతాయిస్తున్న వాళ్ల నాలుగేళ్ల కొడుక్కు గుప్పెడు పల్లి గింజలు నోట్లో పోసింది. ఇంకేం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానన్న ఆనందంతో.. “ఏయ్! మా నానమ్మకు ఇప్పుడే చెప్తా!” అంటూ ఒక్క గెంతులో వంటింట్లోకి వెళ్లబోయాను.
ఇదంతా నాన్న కుర్చీలో కూర్చుని చూస్తూనే ఉన్నాడు. నన్ను వెంటనే పక్కకు పిలిచి.. “ఏం జెప్తవ్.. ఊరుకో! ఎక్కడికి పోతున్నవ్?!” అన్నాడు. నేను నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్లా జరిగింది చెప్పబోయాను. “నేను జూడలేదా?! నేను నానమ్మకు చెప్తున్ననా?! ఏదో చిన్న పిలగాడు ఏడుస్తుంటె నాలుగు గింజలు నోట్ల పోసిందేమో! ఇప్పుడు నానమ్మ ఒచ్చి తిడితె ఆ పిల్లగాడ్ని ఎక్కడికి పంపుతదామె?! పని ఒదిలిపెట్టి పోతది. గా చిన్న పిలగాడు ఎన్ని తింటడు?! నీకు తినాలనిపిస్తె నువ్వు తినవా?!” అంటూ నాకు ఒక క్లాసు పీకాడు. ‘తిండి దొంగ.. దొంగే కాదు’ అన్న గొప్ప సిద్ధాంతాన్ని అలా నాన్న దగ్గరే నేర్చుకున్నాను.
నాన్న ప్రేమలో ప్రదర్శన ఉండేది కాదు. మాకు జ్వరం వస్తే అమ్మ ఏదైనా పండు వలిచి ఇవ్వడమో, పాలు తాగించడమో చేసి లోపలికి వెళ్లి వంటింట్లో పని చూసుకుంటుంటే.. నాన్న మెల్లగా, చప్పుడు కాకుండా వచ్చి మృదువుగా వెన్ను నిమురుతూ ఎంతసేపైనా కూచునేవాడు. తలనొప్పిగా ఉందనుకునే వాడేమో.. కణతలు నొక్కేవాడు. ఆ స్పర్శ ఎంతో ఇష్టంగా, ఓదార్పుగా ఉండి.. జ్వరం తగ్గిపోయినట్లు అనిపించేది.
మా కాలేజీ రోజుల్లో కూడా ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు.. “పోయొస్తా నానా!” అని చెప్పగానే నాన్న కళ్లనిండా గిర్రున నీళ్లు తిరిగేవి. మేము చూడకుండా పైన వేసుకున్న తువ్వాలుతో కళ్లు తుడుచుకునేవాడు. నేను హైదరాబాద్ రెడ్డి విమెన్స్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లే ప్రతిసారీ.. “నువ్వు కూడా పోతున్నవా బుజ్జీస్!” అనేవాడు దిగులుగా. నేను దుబారా ఖర్చు పెడతానని తెలుసు గనుక, చేతిలో మూడు వందలు పెట్టి.. “ఫుజూల్ ఖర్చులు పెట్టకు. జాగ్రత్తగా వాడుకో!” అనేవాడు. అందుకోసం ఏ బర్రెనో, కోడె దూడనో అమ్మి ఉంటాడని తెలుసు. మా పరిస్థితులు బాగా దిగజారిన రోజులవి. ఒక్కో రూపాయి ఖర్చు పెడుతుంటే.. అందులో నాన్న ముఖమే కనిపించేది.
మా పెళ్లయిన తర్వాత కూడా ఏ రోజైనా నలతగా ఉండి నేను పడుకుంటే.. ఆ గది ముందుకొచ్చి నెమ్మదిగా తొంగి చూసి, నిద్రపోతున్నానా లేదా అని నిర్ధారణ చేసుకుని.. “లోపలికి రా నానా!” అంటే కూడా ఇబ్బంది పడి.. “ఎట్లున్నది బిడ్డా?!” అని బయటి నుంచే అడిగే మొహమాటి నాన్న. మా పిల్లలను కూడా అంతే ప్రేమగా, ఇష్టంగా చూసుకునేవాడు.
ఇవాళ నాన్న ఇచ్చిన ఆస్తిపాస్తులే కాదు, ఆయన గౌరవ మర్యాదల్ని కూడా మేము అనుభవిస్తున్నాం. ఊరిలో ఇప్పటికీ బయటికి వెళ్తేచాలు.. పక్కకు జరిగి నమస్కారం పెట్టేవాళ్లెందరో! ‘మీ నాయిన పేరు నిలబెట్టాలె’ అనో, ‘దొర ధర్మరాజు’ అనో అప్పటివాళ్లు అంటుంటే.. ఆయన గొప్పతనం ఒక్కొక్కటిగా అర్థమవుతున్నది. ఎవరికైనా సహాయం చేసినపుడు.. పైనుండి నాన్న చూసి మెచ్చుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు అనిపిస్తుంది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి