ప్రింట్ మీడియా ఇంటర్వ్యూ నిజాయతీకి దగ్గరగా ఉండేది. ఎలక్ట్రానిక్ మీడియా ముఖాముఖి అర్ధసత్యాలతో సాగినా ఆసక్తికరం అనిపించేది. సోషల్ మీడియా వచ్చాక ఇంటర్వ్యూ నిర్వచనం మారిపోయింది. ప్రశ్నల విలువ దిగజారిపోయింది. జవాబుల అర్థాలు దారితప్పుతున్నాయి. మొత్తంగా యాంకర్ల వికృత వైఖరి కారణంగా ప్రశ్నోత్తరాల పర్వం దిగజారిపోతున్నది. యూట్యూబ్‌లో స్వైర విహారం చేస్తున్న యాంకర్లు ‘బోల్డ్’అన్ని విషయాలపై ఫోకస్ చేస్తూ ‘హవ్వ!’ అనిపించుకుంటున్నారు. ఆ తరహాలోవే ఈ వంకరమ్మ ఇంటర్వ్యూలు..
‘హలో మేడమ్.. ఎలా ఉన్నారు?’అడిగింది యాంకరమ్మ.‘బాగున్నాను’ బదులిచ్చింది ఓ నటి! ‘సినిమాలకు కొంత దూరమయ్యాక.. బాగున్నట్టున్నారు?!’ అని వ్యంగ్యంగా ప్రశ్నించానని అనుకుంది యాంకర్.దశాబ్దాలపాటు వెండితెరపై పేరెన్నికగన్న పాత్రలు పోషించిన ఆ నటీమణికి ఆవిడగారి ప్రశ్న అప్పుడు తుచ్ఛం అనిపించలేదు. ఏం బదులు చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఈ ప్రయోక్త.. యుక్తాయుక్త విచక్షణ లేకుండా సంధించిన ప్రశ్న అని స్మెల్ చేసింది. బలవంతంగానే స్మైల్ ఇచ్చింది.
తాను చేసే ఇంటర్వ్యూలు టీఆర్పీ రేసులో దూసుకుపోవాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఆ యాంకర్ ‘హ్మ్మ్ఁ చెప్పండమ్మా! మీ రోజుల్లో వేధింపులు ఉండేవా?’ అని తనకు కావాల్సిన అసలు మ్యాటర్ ఇదేనని హింట్ ఇచ్చింది.
ఈస్ట్‌మన్ కలర్స్ రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చిన ఆ నటికి పాతరోజుల్లో మధురమైన జ్ఞాపకాలు కోకొల్లలు. మనసు పొరల్లోని ముచ్చటైన సందర్భాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులతో పంచుకుందామని ఆమె అభిలాష. కానీ, ఆ మధురమైన జ్ఞాపకాల్లో కేవలం
‘అనుభవాలు’ మాత్రమే యాంకరమ్మ ఆశిస్తుందని అప్పటికి గానీ ఆమెకు తెలిసిరాలేదు.
‘ఏదో సమాధానం చెప్పి తన అనుభవాలను దాటవేసే ప్రయత్నం చేసింది’
నటి వైఖరి యాంకర్‌కు నచ్చలేదు. ఆమె రెండున్నర దశాబ్దాలుగా మీడియా ఫీల్డులో ఉన్నది. ఎవరినుంచి ఎలాంటి సమాధానం రాబట్టాలో బాగా తెలిసిన వ్యక్తి. “ఆ సంగతులు’.. తర్వాత మాట్లాడదాం! మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు?’ అని ఇంటర్వ్యూకి
దారితీసింది.
నిన్నటి తరానికి ఆమె మహానటి. ఈ తరానికి సెలెబ్రిటీ. ఎందరో స్టార్లకు తల్లి పాత్ర పోషించి.. మాతృత్వానికి నిర్వచనం చెప్పింది. అమ్మ, వదిన, అమ్మమ్మ, మేనత్త ఇలా బాధ్యతాయుతమైన పాత్రల్లో అత్యద్భుతంగా నటించి మెప్పించింది. ఒకానొక సినిమాలో కాస్త నాసిరకం పాత్ర పోషించినందుకు అభిమానులు ఆ నటిపై కస్సుబుస్సయ్యారు కూడా! అలాంటి నటీమణిని ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తే.. ఆ కార్యక్రమం నేటి నటీనటులకు పాఠం కావాలి. కానీ, ఈ యాంకరమ్మ ప్రశ్నావళి… దశాబ్దాలుగా ఆమెలో తల్లిని చూసిన అభిమానులను కూడా ‘హవ్వ!’ అనుకునేలా చేసింది.
ఈ యాంకరమ్మ ఇంటర్వ్యూ చేస్తే అన్నీ వంకర మాటలే! ఎదురు సీట్లో కూర్చున్నది ముప్పయ్ ఏండ్ల హీరోయిన్ అయినా, ఏడుపదుల వెటరన్ నటి అయినా.. ఎవరైనా అవే ప్రశ్నలు. ‘మీ సినిమా రంగంలో అదంట కదా, ఇదంట కదా, మీ తలుపు ఎవరు కొట్టారు, తాగి కొట్టారా? తాగకుండానే వచ్చారా?’ ఇవే ప్రశ్నలు. ‘అలాంటిదేం లేదమ్మా! మనం మన పరిధిలో ఉంటే.. ఏ సమస్యా రాదు’ అని ఎవరైనా నటి నెత్తీనోరు బాదుకున్నా.. ఆ సమాధానాలు ఈ యాంకర్ చెవికెక్కించుకోదు. కిక్కిచ్చే సమాధానాలే ఆమెకు కావాలి. అలాంటి నటీమణులు తారసపడితే.. ఆమె ఆనందానికి అవధులు ఉండవు. గంటన్నర ఇంటర్వ్యూలో గంటపాటూ ఈ గోలే! మరో ఇంటర్వ్యూలో ఓ నటీమణి తన ఆవేదన చెబుతూ ‘నచ్చిన వ్యక్తితో ఓకే.. నచ్చనోడితోనే ఇబ్బంది’ అంటే ఆమె సమాధానానికి తన తెలివినంత ఉపయోగించి వీలైనంత వక్రభాష్యం చెప్పి ఆనందించింది. ఆనందిస్తూనే ‘ప్చ్.. అయ్యో! అవునా!!’ అని ఓదార్పు పలుకులు చిలుకుతుంటుంది. ఇంత సానుభూతి వ్యక్తం చేసిన ఆమె.. సదరు ఇంటర్వ్యూలకు పెట్టే థంబ్‌నెయిల్స్ నీచ నికృష్టంగా ఉంటాయి.
ఈ యాంకరమ్మ అమీబాకన్నా చిన్న‘జీవి’తో కలిసి చేసే ఇంటర్వ్యూలు బహుచిత్రం. ఇజాల పేరుతో నిజాలు మాత్రమే మాట్లాడుతున్నామని ఇద్దరూ భ్రమల్లో ఉంటారు. ఈవిడగారు అడిగేది అతనికి అర్థం కాదు. అతగాడు చెప్పే సమాధానం ఈమె ఆసాంతం వినదు. దేవుళ్లు, దయ్యాలు, దావూద్‌లు ఇలా కాదేదీ ‘రచ్చ’కు అనర్హం అని బలంగా ఇంటర్వ్యూ ‘ఫిక్సింగ్’ చేస్తారు. ఈ జీవితో చేసే ఇంటర్వ్యూల అర్థం కానీ, నటీమణులను పలకరించిన పరమార్థం గానీ ఏమిటో ఎవరికీ అంతుబట్టదు. వాటివల్ల సమాజానికి మేలు కలగకపోగా.. కీడు జరుగుతుందన్నది నిష్ఠుర సత్యం.
తానే ప్రముఖుణ్ని అని భావించే ఓ దమ్మున్న జర్నలిస్టు, మరో ప్రముఖ నటుణ్ని ఇంటర్వ్యూ చేస్తూ.. ‘మీ సినిమాల్లో అవి కామనే కదా!’ అని వెకిలిగా నవ్వుతూ ప్రశ్నించాడు. దానికా తలపండిన హీరో..‘మా ఇండస్ట్రీలో కన్నా మీ దగ్గరే ఎక్కువ సార్!’ అంటూ టపీమని నోరుమూయించాడు. ఈ యాంకరమ్మకు కూడా అటువంటి నటీమణిని త్వరలోనే ఇంటర్వ్యూ చేసే సౌభాగ్యం దొరకాలనీ, ఆమె చెప్పే సమాధానాలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ కావాలనీ ఆశిద్దాం. అప్పుడు కూడా తప్పు చేశానని ఆమె బాధపడకపోవచ్చు. ఈ ఇంటర్వ్యూ మరింత వైరల్ అవుతుందని లోలోపల సంబరపడుతుండొచ్చు.
-కోబ్రా