‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
ఇంటికి వస్తూనే అరుగుమీద కూర్చున్న పెద్ద కొడుకును చూసి..
“ఎప్పుడొచ్చినవ్ కొడుకా? వొస్తున్ననని చెప్పకపోతివి?” అన్నది సుగుణ.. వీరేష్‌తో!
“మా ఫ్రెండ్గాన్ని కలువనీకి పొద్దున ఆలేర్ వొచ్చిన. గప్పుడు నువ్వెట్లయిన బాయికాడ ఉంటవు గద! పొద్దుమూకి కలుస్తనని రిటన్‌ల
ఇటొచ్చిన” అన్నాడు వీరేష్.
“కోడలు, పిల్లలు గిట్ల మంచిగున్నరా? ” అంటూ ఇంటి తాళం తీసింది సుగుణ.
చిన్న సంచీలో పెట్టుకున్న స్టీల్ డబ్బా, నీళ్ల బాటిల్ తీసి, ఇంకో దర్వాజా నుంచి పెరట్లోకి వెళ్లి.. గోలెం దగ్గర వేసింది.
గోలెంలోని నీళ్లతో కాళ్లూ, చేతులు కడుక్కొని లోపలికి వచ్చింది. ఇంటినానుకొని చుట్టూ తడికెలతో, పైన తాటాకుల కమ్మలతో కప్పిన దడిలో పొయ్యి వెలిగించి, ఎసరుకు నీళ్లు పడేసింది. ఓ మూల రేకు డబ్బాలోంచి కొన్ని బియ్యం చాట్‌లో పోసుకొని, చెరిగి పక్కన పెట్టింది.
రెండే గదుల గుడిసెలాంటి పెంకుటిల్లు అది. ఒక గది మరీ చిన్నది. దాన్నానుకొని ఉన్నది కొంచెం పెద్దది, ఉండటానికి కాస్త అనుకూలంగా ఉన్నది. ఓ నులక మంచం, ఓ చెక్క బల్ల వేసి ఉన్నాయి. గూట్లో ఎక్క దీపం, అగ్గిపెట్టె ఉన్నాయి. ఎనుగర్రకు కిందున్న దూలానికి బట్టల మూట వేలాడగట్టి ఉంది. అందులో కూరగాయల విత్తనాలు ఉంటాయని వీరేష్కి తెలుసు.
“ఇప్పుడే వొస్త కొడుకా!” అంటూనే బయటికి వెళ్లి, వెంటనే వచ్చింది.. చేతిలో రెండు కోడిగుడ్లతో! అప్పటిదాకా వీరేష్ అలాగే కూర్చొని ఉన్నాడు. గదిలో లైట్ వేయగానే ఇల్లంతా కొద్దిపాటి వెలుతురు పరుచుకుంది.
“కాల్జేతులు కడుక్కోరాదు బిడ్డా! తిందాం. ఎప్పుడనంగ తిన్నవో ఏందో!” అంటూ వంట కాగానే కొడుకును పిలిచింది.
“ఏం అర్జెంటులే! తిందాం తియ్యి. మా ఇంట్ల పొద్దుపోయినంకనే తింటం!” అన్నాడు వీరేష్.
“మీ బస్తీలోళ్లు గట్లనే ఉంటరు. పగలు నాత్రి లెక్క.. నాత్రి పగలు లెక్క. గీడ మీమైతే దిగూట్లె దీపం – కడుపుల మెతుకు అన్నట్టె పొద్దుమూకె యాల్లకే తినాలె.. పండాలె! మల్ల ఎగిలిబారంగనే లేవాలె!” అన్నది సుగుణ.
వీరేష్ ఏమీ మాట్లాడకుండా లేచాడు. అప్పుడే బయట కూడా చీకటి చిక్కపడుతున్నది. బజారు లైట్ పడుతున్నంత మేరా.. ఇంటివెనుక కొద్దిపాటి స్థలంలో వెలుగు నిండింది. దొండ, చిక్కుడు, ఆనప లాంటి ఐదారు పాదులున్నాయి. తీగలు పాకడానికి కర్రలతో పందిళ్లు వేసి ఉన్నాయి. కాళ్లు కడుక్కొని లోపలికి వచ్చాడు వీరేష్.
“పొద్దున రాజమ్మత్త తెచ్చుకున్నదట. నాకింతిస్తె వొండిన. నేను తెచ్చుకున్నప్పుడు గామెకు ఇస్త” అంటూ కోడి కూర వడ్డించింది.
“నువ్వు కోడి కూర మస్తు చేస్తవ్!” అంటూ తల్లిని మెచ్చుకున్నాడు వీరేష్. ఆ తరువాత పొడిపొడిగా మాట్లాడుతూ తల్లీకొడుకులిద్దరూ భోజనం ముగించారు.
“ఈ ఇంట్ల గింత తిప్పలబడుకుంట ఎన్ని దినాలుంటవ్ అమ్మా?”.. నిద్రలోకి జారుకుంటుండగా, వీరేష్ ప్రశ్నకు కళ్లు విప్పిన సుగుణకు ముందు అర్థంకాలేదు. అర్థమయ్యాక అన్నది..
“నేను పట్నం వొచ్చి ఏం జేస్త కొడుకా? నీ ఇల్లు గూడ శిన్నదే గద! నేనేడ ఉందు?”.
“గట్ల గాదమ్మ, గీ ఇల్లు పడగొట్టి స్లాబ్ బోసి ఇల్లు గడదాం! మేమొచ్చినా, నీ మనుమలు, మనుమరాండ్లొచ్చినా తిప్పలుండది”.
“ఇల్లు శిన్నదనేనార.. వాళ్లు గీడికొస్తలేరు!”.
“ఏ.. గట్లగాదు గని, నువ్వు మటుకు ఎన్ని దినాలు తిప్పలబడ్తవ్? కట్టుకుంటె మంచిగుంటదని!”.
“ఏమన్న పైసలు కూడబెట్టుకుంటె మీరు బస్తిల ఒగ ఇల్లు వొనరు జేసుకోండి. గీడ నాకు కొత్తిల్లు ఎందుకురా? గీ ఇల్లు నాకు నడువదా బిడ్డా!”.
తడబడ్డాడు వీరేష్. “గట్ల గాదమ్మా! నాకాడ గన్ని పైసలేడున్నయ్? మన శెల్క అమ్ముదామని!” అన్నాడు మెల్లగా.
ఆ మాటకు సుగుణ నిద్ర ఎగిరిపోయింది.
“ఏందిరా.. శెల్క అమ్ముతావ్? అమ్మి ఇల్లు గడ్తవా? ఇల్లు కాలబెట్టి పేలాలు ఏంచినట్టు ఉన్నది నీ కత! గీ బుద్ధి నీకే పుట్టిందా? ఎవలన్న జెప్పిన్లా?” అన్నది కోపంగా.
“గట్ల గాదమ్మా! మా దోస్తుగాడు జెప్పిండు. వాళ్లకు ఎరుకున్నోళ్లు బాగ పైసలిచ్చి కొంటమన్నరట! గంత రేటు మల్ల కావాల్నంటె వొస్తదా? ఒగ చిన్న ఇల్లు ఏసుకోవచ్చు. కడుమ పైసలు నేను పనిజేసే చిట్‌ఫండ్ కంపెనీల పెట్టుకుంటె మస్తు వడ్డీ ఇస్తరు. నీకీ కష్టం లేకుండ ఇంట్ల ఉండొచ్చు”. నచ్చజెప్ప చూశాడు వీరేష్.
“వడ్డీ ఇచ్చుడేమో గాని, వాడు అసలుకే ముంచుతె ఏం జేస్తవ్‌రా?” సూటిగా కొడుకును అడిగింది సుగుణ.
ఏమీ చెప్పలేకపోయాడు వీరేష్..
“గట్లుండదమ్మా! ఎందుకు ముంచుతరు?” అన్నాడు చివరికి.
సుగుణకు కోపం, బాధ, ఉక్రోషం ఒకేసారి తన్నుకొచ్చాయి.
“మీ నాయిన తాగితాగి వాళ్ల అమ్మ – నాయిన ఇచ్చిన రెండెకరాలు అప్పులకింద అమ్మినంక రోగానబడితె.. ఉన్న గాయిన్ని పైసలు, నేను కూలినాలి జేసి కూడబెట్టిన పైసలు, నా గంటెపుస్తెలు కతం అయినయి. నేనెంత కష్టపడ్డనో, ఏం పని చేసిన్నో, తినీతినక బతికి మీ పెండ్లిల్లు జేసిన. కోడండ్లకు గంతో గింతో బంగారం పెట్టిన. నా బతుకు నేను బతుకుతున్న. గా ఎకురం శెల్క మీ నాయినది గాదు. మా అవ్వగారోల్లు ఇచ్చింది. నేను పోయేటప్పుడు కొంచపోతనా? నా మనుమరాండ్లకు ఇస్త! గిప్పుడు
అమ్మేటిదే లేదు”.. అన్నది నిక్కచ్చిగా.
“గదే పైసలు భూమి అమ్మి నీ మనుమరాండ్లకే ఇయ్యరాదు! నాకో బిడ్డ, తమ్మునికో బిడ్డ ఉండిరి. భూమిల ఏమొస్తున్నది.. దుక్కమే గద!” అన్నాడు వీరేష్.
సుగుణ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నది.. తల్లి మెత్తబడుతున్నదని మళ్లీ అన్నాడు వీరేష్..
“ఎకరానికి లక్షగూడ పల్కని కాడ నలభై లక్షలిస్తరట! మనం ఇంకింత గుంజితే యాభై పడొచ్చు.. ఏమంటవమ్మా?”.
సుగుణ నుంచి జవాబు లేదు. అప్పటికే నిద్రలోకి జారుకుంది.
మర్నాడు తెల్లారగానే తల్లి ఇచ్చిన చాయ్ తాగి బయల్దేరుతూ..
“ఎప్పుడు తీసుకరాను వాళ్లను?” అనడిగాడు వీరేష్.
“ఎవల్లను?” అన్నది మళ్లీ కొత్తగా సుగుణ.
“ఇంకెవల్లను? భూమి కొనేటోల్లను!” అన్నాడు వీరేష్ అసహనం అణచుకొని.
“అయితే మొదలే వాళ్లను కనుక్కొని ఇటొచ్చినవా? అయినా తమ్మున్ని సుత అడుగాలె గద!” అన్నది సుగుణ.
“మరి నిన్న మా దోస్తు దగ్గరికి ఎందుకు పోయిన అనుకున్నవ్? వాడే నడిమిట్ల బ్రోకర్ అన్నట్టు! మనకు మంచి రేట్ ఇప్పిస్తడు. తమ్ముడు మటుకు వొద్దంటడా? ఈ తాప వాన్ని తీసుకొనే వొస్త!” అన్నాడు వీరేష్.
“ఇప్పుడే ఏం జెప్పకు! ఎందుకో భూమి అమ్మెటందుకు నా మనసుకొస్తలేదు!” అన్నది సుగుణ.
“సరే తియ్యి. ఫోన్ జేసి వొస్త!” అంటూ వెళ్లిపోయాడు వీరేష్. సుగుణ పత్తి చేనులో కూలీకి బయల్దేరింది.
మూడ్రోజుల తరువాత..
పొద్దంతా పత్తి ఏరి కుప్పపోసి జోకించుకొని కూలి తీసుకొని బయల్దేరారు సుగుణ, పద్మ. పొలాల నుంచి ఇంటి బాట పట్టంగానే దారిలోనే
బైక్ మీద ఎదురయ్యాడు మల్లేష్.
“ఎక్కు.. ఇంటికి బోదాం!” అన్నాడు.
“ఎప్పుడొచ్చినవ్ రా! గీడికెట్ల వొచ్చినవ్?” అన్నది సుగుణ చిన్న కొడుకుతో.
“ఇంటికి పోతే తాళం బెట్టి ఉన్నది. వాళ్లను, వీళ్లను అడుక్కుంట వొచ్చిన!” అన్నాడు మల్లేష్.
“నువ్వు పా! మేం నడుసుకుంట ఎంతెల్లం వొస్తం. గీ చిన్నమ్మ ఉన్నది గద!” అన్నది సుగుణ.
“నువ్వు పో అక్కా ! నీ కొడుకు పిలుస్తున్నడు. నేను నడిశి వొస్తలే!” అన్నది పద్మ.
“ఏ.. గట్లుంటదా! ఏం గాదు. ఇద్దరం కల్సే పోదాం. నువ్వు పోరా!” అన్నది సుగుణ.
ఇంటికి పోగానే తొందరగా వంట చేసి పెట్టింది సుగుణ. ఇద్దరూ కింద కూర్చుని తింటున్నారు.
“మన శెల్కల ఏం పండుతున్నదే! ఎంతొస్తున్నది?” అడిగాడు మల్లేష్ సడన్‌గా.
సుగుణ ఈసారి కంగారు పడలేదు.
“గిన్ని దినాలకు ‘శెల్కల ఏం పండుతున్నది? ఏమొస్తున్నది?’ అని అడుగుతున్నావురా?” అన్నది నవ్వుతూ.
“ఎహె.. చెప్పరాదు!” అన్నాడు మల్లేష్.
“ఉన్న ఒక్క ఎకురంల ఏమేస్త? మక్కజొన్న, కందులు, పల్లికాయ, పత్తి.. గివే ఏస్త!”.
“ఎంతొస్తది ఏడాదికి?”.
“ఏమొస్తదిరా? ఖర్చులన్నీ పోను.. పదిహేను – ఇరువై వేలొస్తయి. ఒక్కొక్కసారి గవ్వి గూడ రావు”.
“మరెందుకా ఎవుసం చేసుడు? పెట్టుబడి దండుగ. పని దండుగ!”.
“గదొక్క దానిమీన బతుకుతనా? అన్నొద్దులు ఆడనే కూసుంటనా? మన శెల్కల పనిలేనప్పుడు బయటోళ్లకు కూలికి పోతగాదుర!”.
“గిట్ల తిప్పలబడే కన్న గా శెల్క అమ్మరాదే! పైసలొస్తే కాలు మీన కాలేసుకొని సుకంగ ఉండొచ్చు”.
“పని చేయకుండ సుకంగ ఎట్లుంటం కొడుకా? లేని రోగాలస్తయి. అట్లుండే పైసలు ఎన్ని దినాలుంటయి? అయిన సుత ఒగ సర్వ ఉంటె అండ్ల ఒండుక తినాలె గని.. గా సర్వ అమ్ముకొని సౌదలు తెచ్చుక తింటె తెల్లారి ఎండ్ల తింటం? భూమి ఉంటెనే ఊర్లె గింత విలువుంటది. భూమి లేకుంటె ఎవడు దేకుతడురా? గడికి శెల్క అమ్ముతనంటరేంది?” అన్నది సుగుణ విసుగ్గా.
“మన శెల్క పక్కన పెద్ద హోటల్ కడ్తాన్రు. ఉండేటందుకు రూములు, తినేటందుకు అన్ని తీర్ల పెద్ద పెద్ద హాళ్లు, బాగ పైసలు పెట్టేటోల్ల గురించి! వాండ్లే మన భూమి కొంటరంట. అటుదిక్కు ఇద్దరి ముగ్గురివి కొన్నరట. ఇగ మనదే ఉన్నదంట! వాండ్ల కంటె ఎక్వ ఇస్తమంటున్రు. నువ్వు ఒప్పుకొంటే మాట్లాడుదం” అన్నాడు మల్లేష్.
“యాదగిరి గుట్టకు పొయ్యే.. గదేందో ఔటర్ రోడ్డు వొస్తుందట గద! మన శెల్క రోడ్డుకు తాక్కుంట ముంగటికి ఉన్నది. వాండ్లు కొన్న భూమి జర ఎన్కకు ఉన్నది. మనది కొంటెనే వాండ్లకు రోడ్డు మొకాన తొవ్వ అయితది. గందుకే మన ఎన్క పడ్తున్రు” నెమ్మదిగా చెప్పింది సుగుణ.
“ఇంకేంది? నీకన్నీ ఎరికే! ఎవలు చెప్పిన్లు?” అన్నాడు ఉక్రోషంగా మల్లేష్.
“ఎవలు జెప్తె ఏంది? నేనైతె భూమి అమ్మ!” నిక్కచ్చిగా చెప్పింది.
“నీకు దండం పెడ్తనే! నాకు శాన తిప్పలున్నది. బగ్గ అప్పులైనయ్. ఇజ్జత్ పోయెటట్టు ఉన్నది. ఒక్క పది లక్షలు గావాల్నే.. పానం మీదికి వొచ్చేటట్టు ఉన్నది..” ఏడుపొక్కటే తక్కువన్నట్టు ఉన్నాడు మల్లేష్.
“అప్పులెందుకు అయినయ్? నీ కొడుకు పుట్టిన్రోజుకు అప్పు జేయాల్నా? నీ బిడ్డ పెద్ద మనిషి ఐతే అప్పు జేసి, గంత పెద్ద ఓటల్ల ఫంక్షన్ జేయాల్నా? నీ ఆమ్దానికి అప్పు జేసి.. కారు కొనాల్నా? కప్పు ఎంతో కాలు గంతే సాపుకోవాలె.. లేకుంటే అప్పులు ఎక్వయి కుతికె మీదికి ఒస్తది!”.
“టాక్సీ నడుపుతనని కారు కొన్న గాదె!”.
“గండ్ల నువ్వు, నీ పెండ్లం, పిల్లలు తిరుగుడే ఎక్వ ఆయె! గీ వయిసుల అప్పులయినయని భూమి అమ్మితే గా పైసలుంటాయిర? రేపు గింతకన్న పెద్ద తిప్పలొస్తె ఏం జేస్తవ్? బతుకు కొసదానుక ఎల్లొద్దా?”.
“అమ్మా! నువ్ తిట్టినా పడ్తగని, భూమి అమ్మకుంటే దిక్కు లేదే! నేను ఉరి బెట్టుకోవాలె, లేకుంటె బండికింద తలకాయ బెట్టాలె!”.
“నన్ను బెదిరిస్తున్నావుర? నీకు గంత తిప్పలుంటె మా గ్రూపుల లోను ఎత్తి రెండు లక్షలిస్త! నేనే ఏదో కష్టం చేసుకొని కిస్తు కట్టుకుంట. ఇగ గా ముచ్చట తియ్యకు”.
రెండు నిమిషాల్లో నిద్రపోయింది సుగుణ.
హైవే మీద పది కిలోమీటర్ల దూరం నుంచే.. ‘హోటల్ సంతోషం’ వాళ్ల వెల్కమ్ బోర్డులు చూస్తూ వస్తున్నారు వీరేష్, మల్లేష్.
పెట్రోల్ బంక్‌లూ, ఫ్రూట్ జ్యూస్ పాయింట్లూ, పండ్ల బండ్లూ దారికి ఇరుపక్కలా వెలిశాయి. సడన్‌గా వాళ్ల దృష్టి రోడ్ పక్కగా ఉన్న టిఫిన్ సెంటర్ పైన పడింది. కారును ఆపి దిగారు వాళ్లు.
అందమైన చిన్న గుడిసె. ఎర్రమట్టి గోడలపై తెల్లని ముగ్గులు వేసి ఉన్నాయి. బయట పొడుగ్గా పందిరి వేసి ఉంది. దాని కింద పొడుగాటి చెక్క బెంచీలు, టేబుల్స్, కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు వేసి ఉన్నాయి. వాటిలో కొందరు మనుషులు కూర్చుని ఉన్నారు. వెనకాలే మక్కజొన్న చేను ఏపుగా పెరిగి కంకి తొడిగి ఉంది. కొందరు అక్కడ ఫొటోలు దిగుతున్నారు. ఒకరిద్దరు ఆ పక్కనే పంపులోంచి చేనుకు నీళ్లు వెళ్తుంటే అక్కడ కాళ్లూ, చేతులూ కడుక్కుంటూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న చెట్ల నీడకు రెండు కార్లు, నాలుగైదు బైకులు ఆగి ఉన్నాయి.
రెండు పొయ్యిలు పక్కపక్కనే వెలిగించి ఉన్నాయి. ఒకదాని మీద పెనంపై జొన్నరొట్టెలు కాల్చి వేడిగా ప్లేట్లలో వేస్తున్నది పద్మ. ఇంకో పొయ్యిమీద టీనీళ్లు మరుగుతున్నట్టు ఉన్నాయి. దాని పక్కనే అరుగు మీద కూర్చుని కుంపట్లో మక్కజొన్న కంకులు కాలుస్తున్నది సుగుణ.
సుమారు ఇరవై ఏళ్లున్న ఓ యువకుడు ప్లేట్లలో అందరికీ అడిగినవి తెచ్చి ఇస్తున్నాడు.
కొడుకులనూ, వాళ్ల వెంట కొత్త వ్యక్తినీ చూసిన సుగుణ..
“కూసోండి బిడ్డా! గిప్పుడే వొస్తాన్రా!” అన్నది కంకిని నిప్పుల్లో తిప్పుతూనే.
ఏమీ మాట్లాడకుండా బెంచీ మీద కూర్చున్నారు వాళ్లు.
“మంచి నీళ్లు ఉత్తయా సర్! బాటిల్ ఇయ్యమంటారా?” వినయంగా అడిగాడు ఆ యువకుడు.
“అరేయ్ రవీ! వాళ్లు నా కొడుకులేరా!” అన్నది సుగుణ నవ్వుతూ.
“అయ్యో పెద్దమ్మా! నాకు తెల్వదు.. సారీ అన్నా! ఏం తింటరు?” అడిగాడు రవి.
“ఏమున్నయ్?” అన్నాడు వీరేష్.
“మిర్చి బజ్జి, జొన్నరొట్టె, మక్క గారెలు, సర్వపిండి, చికెన్ కర్రీ, పప్పు.. లేకుంటే మక్క కంకులు, చాయ్.. ఇంక కూల్ డ్రింక్స్ కావాల్నంటె కూడ ఉన్నయి” అన్నాడు రవి గబగబా.
“మేం జర సేపు వెయిట్ చేస్తంలే! నీ గిరాకీ చూసుకో!” అన్నాడు మల్లేష్.
“మీ అమ్మను ఒప్పిస్తామన్నారు. ఆవిడేమో ఇక్కడ ఓ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది!” అన్నాడు వెంట వచ్చిన దోస్తు.
కొద్దిగా రద్దీ తగ్గగానే, తల్లి దగ్గరికి చేరారు కొడుకులిద్దరూ.
“అన్నం కాంగనే తిందాం. కాళ్లూజేతులు కడుక్కొమ్మను మీ దోస్తును!” అన్నది సుగుణ.
అక్కడే అన్నం తింటూ.. “గింత జల్దిన.. గిదంత ఎట్ల జేసినవమ్మా!” అన్నాడు ఆశ్చర్యంగా వీరేష్.
“ఎంత మిగుల్తాంది రోజుకు? ఇంక గూడ డెవలప్ జెయ్యొచ్చు” అన్నాడు చిన్న కొడుకు.
“ఊర్లె ఉండే దానికన్న ఈడ్నే గుడిసె ఏస్కోని ఉంటె మంచిగుంది. గుట్టమీద దేవుని కాడికి రోజు వొచ్చేటోల్లు, పొయ్యేటోల్లు శానమంది ఉంటరు. వాళ్లు ఆకలి మీన ఉన్నప్పుడు మన కాడ ఉండేటిది మనం జేసి అమ్మితె మంచిగుంటది గదా అనుకున్న. పద్మ మొగడు గూడ తాగితాగి సచ్చిపోయిండు. గామెకు ఒక్కడే కొడుకు. జర సదువుకున్నడు గానీ, ఊరు వొదిలిపెట్టి పోనంటండు. ‘నేను గూడ కలుస్త అక్కా!’ అన్నది. పెట్టుబడి, కష్టం ఇద్దరిది. గీ రవి ఎట్లయినా ఉంటడు. ఇప్పటికైతే మంచిగనే ఉన్నది” అన్నది సుగుణ.
“వంటలు బాగా రుచిగా ఉన్నాయి. మీ టిఫిన్ సెంటర్ బాగానే నడుస్తుంది. లొకేషన్ అడ్వాంటేజ్ మీకు” అన్నాడు దోస్తు.
“ఇప్పుడు మంచిగనే ఉండొచ్చు గని, ముందుముందు గా హోటల్ ఓపెన్ అయితే ఎట్లుంటదో?!” అన్నాడు మల్లేష్.
వీరేష్ అవుననలేదు.. కాదనలేదు.
సుగుణ వెంటనే జవాబిచ్చింది.. “గట్ల ఎందుకు అనుకోవాలె కొడుకా? ఎవల గిరాకీ వాళ్లది. అగ్వకు తినాలె, జల్ది తినాలె, గివ్వే తినాలె అనేటోల్లే గీడికి ఒస్తరు. వాళ్ల ముంగట్నే ఉడుకు ఉడుగ్గ జేసి పెడుతం. గట్లకావాల్ననేటోళ్లు కూడ ఉంటరు. అందరు పైసలు బగ్గ ఉన్నోళ్లే ఉంటరా? మీరు గిప్పుడు వొచ్చే తొవ్వల రోడ్డు మీన కార్లు, సైకిళ్లు, ఆటోలు, లారీలు, బస్సులు, సైకిల్ మోటర్లు, ట్రాలీబండ్లు.. ఎన్ని పోతలేవు? ఎవని జాగ వానిదే! ‘నువ్వు గిట్ల రావొద్దు’ అని ఒకడు ఇంకోన్ని అంటడా? టక్కర్ పెట్టకుండ నడుపుకుంటె బాయే. గిది గంతే!”..
సాయంత్రం అవుతున్న సూచనగా మెల్లమెల్లగా నీడలు పరుచుకుంటున్నాయి. మళ్లీ జనం రావడం మొదలయింది.
“ఇగ పోండ్రి బిడ్డా! పొద్దు గుంకుతున్నది. చీకటయితె తొవ్వ కనబడది. ఎదురుంగొచ్చే బండ్ల లైట్లు కండ్లల్లకొడ్తయ్.. సరిగ్గ నడుపరాదు. పయిలం!” అంటూ కొన్ని జొన్నరొట్టెలు, గారెలు, మిర్చీ బజ్జీలు పిల్లల కోసం పొట్లంకట్టి ఇచ్చింది. పద్మ మళ్లీ పొయ్యి వెలిగించింది.
‘ఊర్లె ఉండే దానికన్న ఈడ్నే గుడిసె ఏస్కోని ఉంటె మంచిగుంది. గుట్టమీద దేవుని కాడికి రోజు వొచ్చేటోల్లు, పొయ్యేటోల్లు శానమంది ఉంటరు. వాళ్లు ఆకలి మీన ఉన్నప్పుడు మన కాడ ఉండేటిది మనం జేసి అమ్మితె మంచిగుంటది గదా అనుకున్న. పద్మ మొగడు గూడ తాగితాగి సచ్చిపోయిండు. గామెకు ఒక్కడే కొడుకు. జర సదువుకున్నడు గానీ, ఊరు వొదిలిపెట్టి పోనంటండు. ‘నేను గూడ కలుస్త అక్కా!’ అన్నది.పెట్టుబడి, కష్టం ఇద్దరిది. గీ రవి ఎట్లయినా ఉంటడు. ఇప్పటికైతే మంచిగనే ఉన్నది” అన్నది సుగుణ.
రమాదేవి నెల్లుట్ల
రమాదేవి నెల్లుట్ల స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్. ఆంధ్రాబ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేసి విరమణ పొందారు. ఇప్పటివరకూ మనసు భాష (కవిత్వం), రమణీయం (కార్టూన్లు), మనసు మనసుకూ మధ్య (కథలు), చినుకులు (నానీలు), తల్లి వేరు (కథలు) పుస్తకాలను వెలువరించారు. 2004లో సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం, 2014లో అపురూప అవార్డు అందుకొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా స్థాయిలో ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని దక్కించుకొన్నారు.
– రమాదేవి నెల్లుట్ల, 94406 22781