‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో ద్వితీయ బహుమతి రూ.25 వేలు పొందిన కథ.
‘మిలంతి’ మా ఊరి కోడలుపిల్ల. మోహనగాడు రెక్కపట్టి తెస్తే.. (రెక్కపట్టడం = ఎత్తుకువచ్చి పెళ్లాడటం, గాంధర్వ వివాహం) మా ఊరొచ్చిన ఇల్లాలు. వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆ పిల్ల అందరి తల్లో నాలుక అయిపోయింది. ఎలాగంటే.. పనంటే చాలు పరిగెడుతుంది. అది ‘మనదా, పక్కింటోళ్లదా!?’ అని చూడదు. బొరిగో.. కంకో (కంక = బొరిగి లాంటి ఒక పని ముట్టు) చేత బట్టుకుని బయల్దేరిపోతుంది. గొప్పు తవ్వడమో.. కొండ తువ్వడమో.. (రెండు పనులూ ఒకటే కానీ.. నేల చేస్తే ‘తవ్వడం’. అది బొరిగితో చేస్తారు. కొండపైన చేస్తే ‘తువ్వడం’. అది కంకతో చేస్తారు).. తుప్ప నరకడమో.. గాబు తియ్యడమో.. చింత బొట్టలేరడమో.. చీపుళ్లు కట్టడమో.. పనసకాయ చెట్టు దించడమో.. కందులు గింజ కొట్టడమో.. ఏదో ఒక పనిలోనే ఉంటుంది పొద్దల్లా. దాన్ని పలకరించాలంటే మనమూ ఆ పనిలో ఉండాలి.
ఓ రోజు.. ఆరికోల చింత బొట్టలు ఒలిచి ఎండలో ఆరేస్తున్నది.
“అది మన పని కాదు గదే?” అని అడిగితే..
“సెయ్యడానికి పని మనదే అవ్వాలేటి బావా?
ఆ పని సేసేస్తే ఆళ్లు మనోైల్లెపోరా?” అని తిరిగి ప్రశ్నించింది.
అందుకే.. అది అందమైన పిల్ల…
ఎంత అందగత్తె అంటే.. ఎప్పుడు చూడూ చెమటతోనే మెరుస్తుంటుంది. అది అందమైన పిల్ల… ఎంత అందగత్తె అంటే.. దాని చేతిలో ఏదో ఒక పనిముట్టు కదులుతూనే ఉంటుంది. అది అందమైన పిల్ల… ఎంత అందమైన పిల్ల అంటే.. పనితో మనుషుల్ని ముడేస్తూనే ఉంటుంది. అలాంటి అందగత్తె నీళ్లోసుకుంది. మోహనగాడికే కాదు.. మా ఊరోళ్లందరి కళ్లల్లో వనాలు మొలిచేయి. ఒక్కొక్కరూ ఒక్కోలా పలకరించేరు.
“ఏటే మనవరాలా! పుల్ల మామిడి బెల్లం కూర తేవాలేటే?” అని కురమ తాత దాని తలమీద చెయ్యేసి ప్రేమగా నిమిరేడు.
“ఓలె ఒదినే! జిలేబి పొట్లం తెప్పిస్తానైతే మీ యన్నకి సెప్పి?” అని పక్కింటి గయారి పలకరించింది.
మిలంతి మాత్రం నవ్వుతూనే సిగ్గుపడింది. లోలోపల బిడ్డను తలుచుకుంది. మోహనగాడి కౌగిలిని తలుచుకుని తన్మయత్వంతో గెడ్డలో స్నానానికి దిగింది.
ఆ గెడ్డ మా ఊరి దారికి కింద పారుతుంటుంది. ఆ దారి కింద ఊర్లతో మమ్మల్ని కలుపుతుంటుంది. మరో ఊరికి చేరాలంటే ఆ దారిలో గెడ్డ దాటాల్సిందే. ఆ గెడ్డ నిరంతరమూ పారుతుంటుంది. ఇంకడమెరగని ఇరుకు గెడ్డ. ఇరుకవడం వల్లే దానిని ‘దొంగ గెడ్డ’ అని కూడా అంటాం. ఎండాకాలంలో ఎంత మంచిదో.. వానాకాలంలో అంత ప్రమాదకరమైనది. ఎగువన ఏ కొండ మీద మేఘం కరిగినా దీని ప్రవాహం ఉధృతమవుతుంది. ఎప్పుడు ఎలా పారుతుందో మా ఊరోళ్లే కాదు.. ఆ గెడ్డ దాటిన ఏ ఊరోళ్లూ అంచనా వెయ్యలేరు. ఎగువున ఏ కొండ మీద వాన కురిసినా.. మా రాకపోకలు ఆగిపోతాయి.
మబ్బు చూసి గెడ్డ దాటాల. చినుకు పసిగట్టి దారి నడాల. తేడా వచ్చిందో ఊరితోనే కాదు.. ఈ లోకంతోనే సంబంధాలు తెగిపోతాయి. ఇది తెలియక గెడ్డ దాటుతున్న పశువులు ఎన్నో కిందికి కొట్టుకుపోయాయి. ఆ ప్రవాహ వేగానికి జారి కింద రాళ్లకు గుద్దుకుని ప్రాణాలొదిలేయి. అప్పుడెప్పుడో ఇద్దరు మనుషుల్ని కూడా కోల్పోయింది కొండ. అది గెడ్డ తప్పు కాదు. ఏ కొండల మీంచి పారిన నీరో.. ఇక్కడ ఇలా గెడ్డగా పారుతుంది. రెండు కొండలు కలిసే చోటు. దాని మీంచి మా ఊరి దారి.
అక్కడ ఒక సిమెంట్ చప్టా కట్టాలని ఎగువూర్లన్నీ డిమాండ్ చేసేయి. ఎగువూర్లేటి.. మా ఊరికి దారవుద్దంటే మీమూ కలిసేము ఆళ్లతోటి. సర్పంచ్ ఎన్నికల్లో ఆ సిమెంట్ చప్టా ఒక వాగ్దానమయింది. సర్పంచులు మారేరు గానీ అక్కడ సిమెంట్ చప్టా నిర్మాణం మాత్రం జరగలేదు. అక్కడికి సిమెంటు బస్తాలు మొయ్యడం సాధ్యం కాదని ఒకడూ.. సిమెంటు తెచ్చినా ఇసుక బస్తాలు నప్పడం అసాధ్యమని మరొకడూ.. అనీ అనీ వాళ్ల పదవీకాలాన్ని దాటించేసారు కానీ, ఆ దారికి ఒక సిమెంట్ నిర్మాణాన్ని ఇవ్వలేకపోయేరు.
అక్కడ ఖానా కట్టాలంటే ఆ గెడ్డకి ఇవతల దారి చదును చెయ్యాలని తీర్మానించేరు కొన్నాళ్లకి. కొండ మీద దారి ఖర్చుతో కూడుకున్నది. మేము ఓటర్లుగా తప్ప మరే లెక్కల్లోనూ దొరకని వాళ్లం. అందుకే ఆ దారి సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానంగానే మిగిలిపోయింది.
కానీ మాకు..!? ఆ దారి.. సంత దారి! ఈ ప్రపంచానికి మేమున్నామని తెలిపే మసక మసక చిరునామా! ఆ దారి.. కొండంత చీకటిలో కిరసనాయిలు బుడ్డీ. అదీ లేకపోతే మిట్ట మధ్యాహ్నమైనా చీకట్లో అడుగులేస్తున్నట్టు ఉంటుంది. అందుకే.. ఆ దారి మీద చప్టా కొన్నాళ్లు వాగ్దానంగా నడిచింది. నడిచి నడిచి అలిసిపోయిందేమో! మరి కొన్నాళ్లకి వానలో కొట్టుకుపోయింది. కొన్నాళ్లు అప్లికేషన్లలో అర్జీగా నడిచింది. గ్రీవెన్స్ హాల్లో అధికారుల ముందు దర్జాగా నిలబడి మా ఊరికి పేరుందని గుర్తుచేసి కలలకు అలవాటు చేసింది. మా
ఊరోళ్లందరి సగటు కలేమిటో తెలుసా? హాయిగా నడవడం. భుజాన బరువెంతున్నా.. కాళ్లు స్వేచ్ఛగా కదిపి హాయిగా నడవడం. అంతే! అంతకుమించి మా ఊరి వాళ్లెవరూ పెద్దగా ఏ కలా కనరు. మా ఊరు డెవలప్పైపోయిందని మా తుఫానుగాడు అన్నాడో రోజు! అందరూ కళ్లెర్రగించి ఆడివైపు చూస్తే అన్నాడూ..
“ఖానా కావాలన్నాము.. రోడ్డు వేస్తామన్నారు. ఒకప్పుడు మన ఊరి గురించి సర్పంచులే మాట్లాడేవోళ్లు. ఇప్పుడు.. ఎమ్మెల్యేలూ మాట్లాడుతున్నారు. సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల స్థాయికి ఎదగడం అభివృద్ధి కాదేటి?” అని ఎటకారంగా కళ్లెగరేసి సమాధానం ఇచ్చేడు. నీళ్లోసుకున్న మిలంతి అందరిలాంటి కలలే కన్నాది గానీ.. కొద్దిగా.. వేరుగా! చప్టా కట్టాల్సిన చోటునానుకునే ఆమె కన్నోరు పోడు కొండ ఉంది.
ఆ పోడు పనుల్లోనే మోహనని తొలిసారి చూసింది. అక్కడే వాడితో తొలి ముచ్చటలాడింది. ఊసులాడింది. పాటలు పాడింది, పదం కట్టింది. కంక పట్టి కొండ తువ్వింది. కందికాయల్ని గొడ్డలమ్మకు కట్టి మొక్కులు మొక్కుకుంది. అందుకే ఆ పోడు కొండంటే ముచ్చటపడింది. పోడు కిందినుంచి సాగుతున్న దారి మీద, దారి పక్కన కానుగుచెట్టు మీదా ఎక్కడ లేని మక్కువ పెంచుకుంది. ఆ దారి నడిచిన చుట్టుపక్కల ఊరివాళ్లు పలకరిస్తుంటే.. పలవరించింది. ఆ దారి దాటాల్సిన గెడ్డతో కూడా నిర్వచించలేని అనుబంధాన్ని ఏర్పర్చుకుంది. ఆ కానుగుచెట్టు నీడన ఎన్నిసార్లు సేదతీరిందో!
మిట్టమధ్యాన్నం.. కానుగు నీడన సల్దిగిన్నెలో గెంజన్నం తినడం ఆమెకున్న అపురూప దృశ్యాల్లో ఒకటి. కొండనానుకొని పారుతున్న గెడ్డకి చప్టా కడితే.. కానుగుచెట్టు నీడ దానిమీద పడతాది. ఆ నీడ కింద అంటే చప్టా గట్టు మీద కూర్చుని గెంజి మెతుకులు తినొచ్చు అనుకుంది. అప్పుడు గెడ్డ దాటుతున్నోళ్లందరూ అక్కడాగి పని చేసుకుంటున్న తనని పలకరించే దృశ్యం ఆమె కళ్లలో మెదలాడింది. అప్పుడెప్పుడో ఓ రోజు ఆ కానుగుచెట్టుకి వేలాడుతున్న ఉట్టి దించుతున్నప్పుడు మరో కల కనింది. ఆ కొమ్మకు ఉట్టికట్టినట్టే ఉయ్యాల కట్టాలని. ఉయ్యాట్లో బిడ్డకి జోలపాడాలని.
అప్పుడే..
కొండగాలి వీధుల్లోంచి.. గగన శిగల శిఖరాల మీంచి.. తేలియాడుతూ వస్తున్నదో పాట. వనగానం..!
వనమై.. పవనమై.. బృందగానమై!
గెడ్డ పక్కన ఒరకట్టిన పొలంలో పాటలు పాడుతున్నారు దిగువూరోల్లు. ఆ పాటలు కొండల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. కొండదేవతలెవరో ఈ కొండ కొసకీ, ఆ కొండ కొసకీ రాగాల తాళ్లు కట్టి, పాటల ఉయ్యాల ఊగుతున్నట్టు వినపడింది. ఆ పాటలేవో తన పూర్వీకుల జ్ఞాపకాలను మోసుకొస్తున్నట్టు.. తాత ముత్తాతల నెరవేరని ఆశలింకా సజీవంగా ఊగిసలాడుతున్నట్టు..
ఆ పాట ధ్వనిస్తున్నది… ఆ ధ్వని స్వప్నిస్తున్నది…
అదింకా మెలకువగానే ఉంది.
ఎప్పటిదో ఆ పాట! ఎన్ని తరాలు ధ్వనించిందో ఆ గానం! ఏ కలలు కని ఏ గొంతు తొలిసారి సవరించిందో! అనాదిగా వినపడుతూ.. అనంతమై.. కొనసాగుతూ!
“ఆకు పాడిందో పొద్దు.. ఆలకించిందో గెడ్డ నడిమద్దినున్నాము వొదినే.. పనికి పరిగెట్టమ్మ వొదినే” అని. ఈ పాట ఎన్నిసార్లు విన్నదో? ఎన్నిసార్లు దాని అర్థం ఆలోచించిందో? ఆకు పొద్దును పాడటమేటీ? గెడ్డ ఆలకించడమేటీ? నడిమద్దిన ఉన్నదెవరు? పనికి పరిగెట్టడమంటే?
గెడ్డొడ్డున.. సెలమలో నీరు తోడుతున్నపుడు తోయికి ముసిల్ది ఇలాంటివెన్నో పాడింది. పెళ్లికో? రోజుల తరబడి పాటలు పరిగెడతాయి. తను లేచిపోయి వచ్చేసింది గాబట్టి ఇవేవీ లేవు గానీ, సంప్రదాయంగా జరిగుంటే.. ఎన్ని పాటలో ఇరువైపుల నుంచి! అసలిలాంటి పాటలు ఎన్నున్నాయి? ఇవెవరు రాసేరు? ఎప్పుడు రాసేరు? ఈ పాటల ద్వారా ఏమి చెప్పాలనుకున్నారు? ఈ పాటలు ఎప్పటినుంచో పాడుతున్నామని తాత చెప్పేడు. తాతకి ముత్తాత కూడా అదే చెప్పాడట. అంటే.. ఒక తరం తర్వాతి తరంతో ఏదో మాట్లాడుతున్నది. ఏ సందేశమో అందిస్తున్నది.
ఏమిటది?
తెలుసుకోవాలి. ముందు తానందుకోవాలి ఆ పాటల్ని. తర్వాత తన పిల్లలకి అందించాలి. అదిగో ఆ దారిలోనే కలకన్నది.. కొండవాలు కానుగ కొమ్మకి ఉయ్యాల కట్టాలని. ఉయ్యాట్లో తన బిడ్డకు ఆ పాటలే జోల పాడాలని.
కాలీజీ రోజుల్లో హైస్కూల్ మాష్టారు ఎదురైతే.. చేతులు జోడించింది ఓ రోజు.
‘బాగున్నావా? ఏం చేస్తున్నావ్?’ అని అడగకుండా..
“పాటలు పాడుతున్నావా?” అని అడిగారు.
‘ఔ’ అన్నట్టు తలూపింది గానీ, లేదని తన మనసుకు తెలుసు. ఉరుకుల పరుగుల తొందర్లో ఆ పాటల్ని మర్చిపోయింది. పదో తరగతిలో ఉన్నప్పుడు తనని దగ్గరికి తీసుకుని దేశభక్తి గీతాలు రాసి పాడించేవారు మాష్టారు. బృందగానాలకి నాయకత్వం వహించేది తను. పాటని ఇట్టే పట్టేసేది. అమ్మ నేర్పిన పాటల్ని పాడి వినిపించేది.
“నీ గొంతులో అడవి పలుకుతుంది” అనేవారు. ఆ మాటకి అర్థం అప్పుడు తెలిసి రాలేదు. అప్పుడే మరో కల కన్నది.. ఆ పాటల మీద పరిశోధన చెయ్యాలని. బడి చదువుల కోసమే ఊరు దాటలేని తాను.. విశ్వవిద్యాలయమెలా చేరగలదు? తాను చేరలేని గమ్యమేదో తనవద్దకే వస్తే? ఆ విశ్వవిద్యాలయమేదో ఇక్కడికే.. ఈ కొండల్లోకే.. తన దరికే వస్తే? ఆగిపోని చదువులు ఎన్ని కొనసాగుతాయో! కొత్త చదువులు ఎన్నెన్ని కళ్ల చూస్తుందో కొండ!
వస్తుందా?
వస్తే.. ఇక్కడే.. ఈ పాటల మధ్యే పరిశోధన చేస్తే?
..మరో కల! నిజానికి అలాంటి కలలు ఎన్నో కన్నది. జీడి పిక్కలు తట్టలు తట్టలు తలమీద ఉంచి కొండ మీంచి కిందికి దించుతుంటే.. బరువు మొయ్యనవసరం లేకుండా.. మధ్యవర్తులు లేకుండా.. మార్కెట్ ఇక్కడికే తన వద్దకే వస్తే?
తను ఒలిచిన చింతబొట్టలు మోసం లేకుండా ఇక్కడే నేరుగా అమ్ముకోగలిగితే..?
ఏ జబ్బొచ్చినా టక్కున మాత్ర అందించగల ఆసుపత్రి ఇక్కడే ఉంటే?
తమవాళ్లు సేకరించిన ఇప్ప మొగ్గలకి అమెజాన్, ఫ్లిప్‌కార్టుల్లో మంచి గిరాకీ ఉండగల రోజులొస్తే?
కలల బరువుకి కనులు అలిసిపోయాయేమో! రాతిరి ఆమెకు నిదురపుచ్చింది.
ఆ తెల్లవారే.. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. ఉదయం పదిగంటలకి చేరుకోవాల్సి ఉంది. ఎప్పటిలాగే బయల్దేరింది. కానీ, ఆ రోజూ వర్షం కురిసి గెడ్డ పెద్దదయ్యింది. దాటడం అవలేదు. పరీక్ష సమయం మించిపోయింది. ఆ పోవడం పోవడం. మళ్లీ చదువు గడపెక్కలేదు. మొత్తంగా తన చదువు మధ్యలో ఆగిపోవడానికి కారణం ఆ గెడ్డే. కాదు కాదు.. అక్కడ చప్టా కట్టకపోవడమే.
ఓ రోజు సాయంత్రం..
ఊరోళ్లందరూ కిందకి దిగాలని కబురొచ్చింది.
“ఏమిదానికట?”.. అని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
“ఎమ్మెల్యమ్మ మీటింగెడతాదట. కింద ఊరి దాక బస్సేసినారట!”..
బస్సెక్కడమంటే సర్దా మా ఊరోళ్లకి. అదీ సీటు దొరికిన బస్సంటే ఇంకా సర్దా. ఎప్పుడు సూడు.. కొండ దిగడం.. నడ్డం! నడిసినా బరువుతో నడ్డం. నడిసినడిసి అలిసిపోతే.. ఆటోలకి ఏలబడ్డం. ఒక ఆటోకి ముప్పై మందిదాక ఏలబడుతూ సంతలకి వెళ్లడం. అలాంటి ప్రయాణాలు మాత్రమే తెలిసిన మా ఊరి జనానికి బస్సులో కిటికీ పక్కన సీటులో కూర్చుని ప్రయాణించడమంటే.. కుర్రాళ్లేటి ముసిలోళ్లూ సరదా పడిపోతారు. బస్సుల్లో కూర్చున్నోళ్లకి ఒక బిర్యానీ పేకెట్టు, తాగినోళ్లకి సారా సీసా ఇప్పించడమే సర్పంచి పని. అవి అందరికీ అందితే గొప్పోడు, మంచోడు. అంతే!
పరుగు పరుగున కొండ దిగుతున్న నాకు మిలంతి ఎదురయ్యింది. తలమీద ఆరితేగల కట్ట, చేతిలో కంక. ఒళ్లంతా మట్టి నిండిన బట్టతో.. మట్టి తవ్వకాల్లో దొరికిన అపురూప వనమూలికలా కనిపించింది. దిగుతున్న తూగుకి దారివ్వని మిలంతిని గుద్దుకున్నంత పనైంది.
“ఏట్రా గాబరా?” అని నిలదీసింది.
“మీటింగటే! బస్సెలిపోతాది..” అని వెళ్లబోయేను.
దారివ్వలేదు సరికదా..
“సిగ్గులేదురా నీకు?” అని అడ్డం నిలబడింది.
“సిగ్గా? నీనెందుకు సిగ్గు పడాల?” అని అసహనాన్ని ప్రకటించేను.. ఇదేదో అప్రస్తుతాన్ని మాట్లాడుతున్నదని.
“మీటింగంతే పారిపోతార్రా! ఆ మీటింగులో ఒక్కనాడైనా మనూరు రోడ్డు గురించి, ఈ ఖానా గురించి
అడిగినార్రా?”..
అది నా కళ్లలోకి సూటిగా చూస్తున్నది. దాని తలమీద తేగలకట్ట తూలడం లేదు. చేతిలో కంక నిశ్చలంగా ఉంది. అది నన్ను ప్రశ్నిస్తున్నదా? ఇంకెవరినైనా హెచ్చరిస్తున్నదా? ఒక్కక్షణం దాని కళ్లలో తీవ్రతకి నేరుగా చూడలేకపోయాను. వాటి గురించి చాలాసార్లు ఊర్లో మీటింగు పెట్టుకున్నాం. చాలా దరఖాస్తులూ రాసేం. అధికార్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగాం. ఆ సంగతి దానికీ తెలుసు. అయినా అడుగుతున్నది. అంటే…? ఇంకేదో చెప్తున్నది.
నిశ్శబ్దంగా.. మౌనాన్ని మోసుకుంటూ..
పక్కకు తప్పుకొని.. దారి పక్క రాయిమీద అడుగేసి కిందికి దిగిపోయేను. దారిపొడుగునా దాని కళ్లు నన్ను వెంటాడుతూనే ఉన్నాయారోజు. దారిలో నడుస్తుంటే అడ్డమొచ్చిన ప్రతి రాయీ దాని చూపుల్ని తలపించింది. ఎదురైన ప్రతి డొంకా ఆ చూపుల తీవ్రతని గుర్తుచేసింది. గెడ్డ దాటుతుంటే.. దాని కల ఏమిటో మెల్లమెల్లగా స్పష్టమవడం ఆరంభించింది.
దిగువూరు చేరేసరికి బస్సు జనాల్ని ఎక్కించుకుని దుమ్ము రేపుకొంటూ వెళ్లిపోవడం కనిపించింది. ఆకుపచ్చని కొండ మొదుల్లో బస్సు రేపిన దుమ్ము నా ముఖమ్మీదా పడింది. దులుపుకొంటూ.. కళ్లు నులుముకుంటూ.. వెనుతిరిగాను.
మిలంతితో మాట్లాడాలి. దాని కల గురించి మాట్లాడాలి. నిజానికి ఆ కల దానిది మాత్రమే కాదు. అది ఊరందరి కల. కొండ ఎక్కి ఇల్లు చేరేసరికి మిలంతికి నొప్పులు ఆరంభమయ్యేయి. ఏ కొండ మీదో మేఘం గర్జించింది. చీకటి పడింది. బిడ్డ అడ్డం తిరిగింది.
ఏ చీకటి లోకాల్లోంచో రాలింది ఒక్క చినుకు.. ‘టప్…!’ మని. ఊరు ఉలిక్కిపడింది. అందరి గుండెల్లో రాయిపడింది. పురుడు పోసే మండింగి ముసిలమ్మకి కబురు చేసేరు. ప్రయత్నమంతా చేసి చేతులెత్తేసింది ముసిల్దాయి. ఎలాగైనా మిలంతిని కిందకి దించాలని నిర్ణయించేం. అప్పుడు కనిపించింది మా ఊరోళ్లందరికీ దారి! నరకానికి నడుస్తున్నట్టుగా.. దెయ్యాలు భూతాలకీ జడవని ఊరి పెద్ద కూడా ఆ దారిని తలచుకొని నిలువెల్లా వణికిపోయేడు.
అప్పుడు కట్టేం డోలీ! వెదురు కర్రకి దుప్పటి కొసల్ని కట్టి సిద్ధం చేసేం డోలీ!
డోలీ దిగుతుంటే మిలంతి కాన్పు బాధ కన్నా ఊరోళ్ల ఏడుపులే కొండల్లో ప్రతిధ్వనించేయి. మా ఊర్లో డోలీ ఎత్తడమంటే.. శవయాత్ర చేస్తున్నట్టే! ఎందుకంటే డోలీలో కొండ దిగిన ఏ రోగీ తిరిగి రాలేదు.
నాకు దుఃఖమాగడం లేదు. గొంతు నుంచి ఒక్క మాటా పెగలడం లేదు. ఎందుకో మిలంతి చూపులు మళ్లీ కదలాడేయి. వాటి అర్థమేదో క్రమక్రమంగా స్ఫురిస్తున్నట్లు అవుతున్నది. డోలీలు మా బతుకులనొదలవా? డోలీల్లేని జీవితాలు మేము చూడలేమా?
ఒక్కసారైనా మా ఎమ్మెల్యేను జుట్టు పట్టుకునైనా మా ఊరు లాక్కు రావాలని. ఆ కుర్చీ మీద కూకుండబెట్టడానికి మేము కిందకి దిగి ఓట్లెయ్యాలా? మాకు కష్టమొస్తే ఆ కుర్చీ కొండెక్కదెందుకని ఒక్కసారైనా అడగాల. పిలక పట్టుకుని.. ‘మా ఊరుకి రోడ్డేస్తావా లేదా!?’ అని నిలదీయాలని ఉంది. నడుస్తున్న దారి సన్నగా రోదిస్తూ తనను తాను చీల్చుకుని మమ్మల్ని నడిపిస్తున్నది.
గుండెలు దిటవు చేసుకొని.. మొండిధైర్యంతో.. ఎలాగైనా మిలంతిని బతికించుకోవాలని డోలీ ఎత్తేం.
చీకట్లో.. చినుకులు రాలుతున్న దారిలో.. తరాల మా కల! ఎప్పటికప్పుడు కరిగిపోతూ! బయల్దేరేం.
వాన పెరిగింది. ఎక్కడో మొదలైన వాన మా మీదా కురిసింది. మిలంతి మీదా కురిసింది. మిలంతి కడుపులోని బిడ్డపైనా కురిసింది. మేము నడవాల్సిన దారిపైనా కురిసింది. వాన! మా పైనా! లోలోన!
ఇలాంటప్పుడే కొండ జారిపోతూ ఉంటుంది. రాళ్లు మెత్తబడిపోతాయి. దారి రోజూలా ఉండదు. అడుగు అడుగూ ఆచి తూచి వెయ్యాలి. తేడా వచ్చిందో.. నడకలో ఉన్నపుడే జారిపోతాం. మరి డోలీ మోస్తున్నపుడో! అదీ చీకట్లో? నడుస్తున్నాం. అంతే! కానీ సందేహం అందరిలో. ఏడు కిలోమీటర్ల కొండ దిగి, మూడు కిలోమీటర్ల నడక ప్రయాణం. ఈలోగ సిగ్నల్ దొరకపుచ్చుకోవాలి. అంబులెన్స్‌ని అందుకోవాలి. ఆసుపత్రి చేరాలి. మాలో ఎవరికీ నమ్మకం చాలడం లేదు. అయినా.. మొండిగా.. గుడ్డిగా.. చీకట్లో..
అక్కడికి చేరుకున్నాం. గెడ్డ హోరు దాని ప్రవాహ వేగాన్ని తెలుపుతున్నది. దాటడం అసాధ్యమని చెప్పకనే చెబుతున్నది. చీకట్లో గెడ్డ మాకు వినిపిస్తున్నది. చెవుల్తో గెడ్డని చూస్తున్నాం. చెట్టు కింద చినుకులు పడవని ఆశతో ఆగేం. గెడ్డకవతల.. మీటింగు నుంచి తిరిగొచ్చిన మా ఊరి జనం. చేతుల్లో పాలిథీన్ బేగుల్లో బిర్యానీ పొట్లాలూ, మందుసీసాలు!
పగలైతే ప్రవాహం ఎక్కువైనపుడు ఎప్పటిలాగే ఆ చెట్టుకిందే ఆగుతాం. ప్రవాహం తగ్గి గెడ్డ చల్లబడితే తల్లి కనికరిస్తే గెడ్డ దాటడం అలవాటు మాకు.
ఆగిపోయేం. అక్కడే. గెడ్డ దాటలేక.. వేరే దారిలేక. ఆగిపోయాం. గెడ్డకి ఇవతల! వాన తగ్గదు. గెడ్డ ఆగదు. చీకటి కరగదు. వెలుతురు కానరాదు. ఎదురు చూస్తూ ఆగిపోయాం అక్కడే. తరతరాలుగా ఆ చెట్టు కిందే.
మా ముందు ఎన్ని తరాలు ఆగాయో అక్కడ. మా ముందు ఎన్ని ఆర్తనాదాలు ఆ చీకట్లో ప్రతిధ్వనించాయో.. అక్కడ! ఎన్ని డోలీలు శవాలుగా మారేయో.. అక్కడ! ఎదురు చూస్తునే ఉన్నాం.. వాన ఆగుతుందనీ! వాగు తగ్గుతుందనీ.. దారి దొరుకుతుందనీ!
ఎదురు చూస్తునే ఉన్నాం.. తరతరాలుగా.. నిండు చూలాలి ఆర్తనాదాల్తో!
నిస్సహాయంగా.. అక్కడే నిలబడిపోయాం. ఎప్పుడో ఆగిపోయాం. నా చేతిలో సెల్‌ఫోన్‌కి సిగ్నల్ దొరికిందేమో.. వెలిగి ఆరింది. భారతదేశం చంద్రుడి దక్షిణ ధృవం మీదకి విజయవంతంగా అడుగుపెట్టిందట.. బ్రేకింగ్ న్యూస్! దేశం వెలిగిపోతున్నది. మేమింకా గెడ్డకివతల ఒడ్డునే ఎదురుచూస్తున్నాం దాటడానికి.. ప్రాణాలు డోలీల్లో పెట్టుకుని! డోలీలో.. మిలంతి కనుకొసల్లో ద్రవించిన కలలన్నీ నేలరాలిపోగా..
ఒకే ఒక్క బిందువు మాత్రం కన్ను జారడం లేదు.. పంటి కింది పెదవిపై భరిస్తున్న నొప్పిలా..
ఎలాగైనా గెడ్డ దాటాలన్న చిన్న కలలా..
– మల్లిపురం జగదీశ్ 94401 04737