నాన్నకు వ్యవసాయం అంటే పిచ్చిప్రేమ. కుటుంబ బాధ్యతలు, పరిస్థితుల వల్ల.. పద్నాలుగో ఏట నుంచే వ్యవసాయ భారాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడే కరణీకం కూడా నేర్చుకుని పదహారేళ్లకే ఆ వృత్తి చేపట్టినా.. వ్యవసాయం అంటేనే ఎక్కువ ఇష్టపడేవారు.
నాన్న పొద్దున్నే పొలానికి వెళ్లేవాడు. పన్నెండిటికి వచ్చి భోజనం చేసి.. మూడిటికే చాయ్ తాగి మళ్లీ వెళ్లేవాడు. ఇక నాట్లు, కలుపులు, కోతలప్పుడైతే అక్కడే ఉండేవాడు. అలాంటప్పుడు సెలవు రోజయితే మేము అన్నాలు తిని వెళ్తే.. నాన్న ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్లేవాడు. ఆ సమయంలో చేను గట్టున ఓ చెట్టు నీడలో ఎండుగడ్డి పరిస్తే దాని పైన కూర్చునేవాళ్లం. ఒక్కోసారి సాయంత్రం నాలుగు గంటల సమయంలో నాన్నకు ఒక ఫ్లాస్క్‌లో చాయ్ తీసుకుని వెళ్లేవాళ్లం.
వరి నాట్లు, కలుపు తీతలు, కోతలు, కళ్లాలు సిద్ధం చేయడం, మెద కట్టడం, తూర్పారబట్టడం.. ఇలా ఎన్నో పనులు చేసేటప్పుడు ఆడవాళ్లు పాటలు పాడుతూ ఉండేవాళ్లు. వాటి అర్థం తెలియకపోయినా ఆ పాటలు వింటుంటే ఎంతో బావుండేవి. “ముద్దెర పలుక పట్టూకోనీ.. చంద్రయ్య దొరా! ముద్దూ ముద్దుగ నడిసి ఒచ్చిండే.. చంద్రయ్య దొరా!” అంటూ మా నాన్నపైన కూడా పాటలు కట్టి పాడుతూ ఉండేవారు. కొన్నిసార్లు మగవాళ్లు కూడా మంచి గొంతుతో పాటలు పాడేవారు. మేము బడిలో నేర్చుకున్న “పొలము దున్నాలోయ్ రైతా.. పొలము దున్నాలోయ్! సద్ది తెచ్చానోయ్ మామా.. సద్ది తెచ్చానోయ్” అనే పాట పాడుకుంటూ వెళ్లేవాళ్లం.
వ్యవసాయం అంటేనే ఐకమత్యం. ఒక్కడే చేయలేడు. ఈ సత్యం నాన్నకు బాగా తెలుసు. చేను మీద ఉన్నంత పంట.. కోసి కుప్ప పెట్టాక ఉండేది కాదు. కుప్ప పెట్టి అక్కడక్కడా రేగడి మట్టి పోసి.. దాని పైన ముద్దెర పలకతో గుర్తు వేసేవారు కుప్ప కదిపితే తెలుస్తుందని. అయినా కూడా కుప్పలో కనపడ్డన్ని వడ్లు తీరా బస్తాల్లోకి ఎత్తేటప్పుడు ఉండేవి కావు. ఊర్లో ఆసాములు కొందరు నాన్నతో అనేవారు.. “అయ్యో! సూసుకో దొరా.. మీవోండ్లే మిమ్ములను ముంచుతాన్రు. మీ పంటల సగం పోతాంది” అని. నాన్న నవ్వి.. “పండిచ్చేదే వాండ్లు గద! తింటే తిన్నరు. మిగిలిందే మాకు ఆయె తియ్యండి. ఏం జేస్తం.. అయినా ఎవ్వని పాపం వానిదే! ఎవ్వని నియ్యతు వానిదే!” అనేవాడు. “పండిచ్చుడే రైతు పని గానీ.. ఎట్లయినా ఊరందరు గదే తింటరు గద!” అని కూడా అనేవాడు.
పెసరు కాయలు తెంపే సీజన్లో ఆడ కూలీలు కాయ తెంపుతూ ఉండగా మధ్యలో చిరుచిరు జల్లులు వచ్చేవి. వాళ్లు హడావుడిగా చెట్ల నీడకు పరిగెత్తేవాళ్లు. వాటిని పెసరుకాయ జల్లులు అనేవాళ్లు. ఒకరోజు మొత్తం మీద నాలుగైదు గంటలపాటు అలా జల్లులకే పోతే.. “సగం కూలే ఇద్దాం దొరా!” అనేవాడు సేర్దార్. “జల్లులకు వాండ్లేమి జేస్తరు?! ఇంటికి పోయినాంక వాండ్లు తెచ్చే కూలికి ఎదురు జూస్తుంటరు ఇంట్లోళ్లు. మొత్తం ఇద్దాం. అయినా వ్యవసాయదారులు ఎప్పుడు వానలొద్దు అనొద్దు.. పని ఆగినా సరె!” అనేవాడు నాన్న.
ఆరు నాగళ్ల వ్యవసాయం నాన్నది. పశువులు కాసేందుకు ఇద్దరు, జీతగాళ్లు ఆరుగురు ఉండేవారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక రైతులకు ఎన్నో సౌకర్యాలు కలిగి వాణిజ్య పంటలు పండిస్తున్నారు గానీ.. ఆ రోజుల్లోనే క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కూరగాయలు, ఉల్లిగడ్డలు, బన్సీ, శర్బతీ లాంటి గోధుమలు పండించేవాడు నాన్న. సజ్జలు, జొన్నలు, నువ్వులు, ఆముదాలు, పెసళ్లు, శనగలు, పల్లీలు, మక్కజొన్నలు.. ఇలా అన్ని పంటలు పండించగా చూశాం. ప్రతి పంట బండ్లకెత్తే ముందు ఆఖరి గింజలు తీయకుండా.. అవి ఎత్తిన వాళ్లకు ‘కోక ముడుపులు’ అంటూ ఇచ్చేవారు. ఇక కమ్మరి, కుమ్మరి, కంసాలి, చాకలి వాళ్లకు వడ్లు కొలిచి ఇచ్చేవారు.
తెలంగాణలో తీవ్రమైన కరువు నెలకొన్న డబ్భుల ఆఖర్లో దిగుబడి లేక.. పెట్టుబడికి, జీతాలకు సరిపోక ఒకేసారి ముగ్గురు జీతగాళ్లను మాన్పించేశాడు నాన్న. వాళ్లు ఇంటికొచ్చి ఒకటే ఏడుపు. “మాకు మీకాడ కాకపోతే పని యాడ దొరుకుతదయ్యా? మేము ఏం దిని బతుకాలె! పెండ్లం పోరలను ఎట్ల సాదాలె!” అని నాన్నను వదల్లేదు. ఏం చేయలేక.. “సరె సరె.. ఎక్కడనన్న దొరికేదాక ఉండండి. నేను తినేదే మీరు తిందురు” అని చెప్పాడు. అన్నాడే కానీ, ఆ టైంలో ఇల్లు గడవడానికి, భూమి శిస్తు, కరెంటు బిల్లులు, జీతగాళ్ల జీతాలు, వ్యవసాయానికి పెట్టుబడి, అందులో నష్టాలు, వాటికి మళ్లీ అప్పులు.. ఇలా నాన్న బాగా చితికి పోయాడు. ఆ సమయంలో కూడా భూమిని కుదువబెట్టి డబ్బు తెచ్చేవాడు తప్ప.. అమ్మడానికి ఇష్టపడేవాడు కాదు. ఆ అప్పుల్లోంచే జీతాలిచ్చేవాడు.
ఆ సమయంలో మా ఊర్లో రైస్ మిల్లులు బాగా ప్రారంభమయ్యాయి. వాటిలో హమాలీ పనికోసం వ్యవసాయం చేసుకునే చిన్న రైతులందరూ చేరారు. కొందరు యువకులు పట్నాలకు వెళ్లారు. ఇంకొందరు వేరే చిన్న వ్యాపారాలు మొదలుపెట్టారు. అందువల్ల వ్యవసాయం చేసేవాళ్లు బాగా తగ్గిపోయారు. రానురానూ నాన్న దగ్గర కూడా జీతగాళ్లు తగ్గిపోయారు. చివరి రోజుల్లో ఇద్దరితోనే నడిపించాడు తప్ప.. వ్యవసాయం మానలేదు. దొడ్డి నిండా ఆవులు, ఎద్దులు, బర్రెలు, లేగలు, దూడలు ఉన్నచోట.. మేతకు కరువై చచ్చిపోతుంటే ఒకటొకటిగా అన్నిటినీ అమ్మేశాడు. కొన్నిటిని ఎవరైనా సాదుకుంటామంటే ఇచ్చేశాడు.
ఎంత పంట పండించినా మొదటే తెచ్చిన అప్పులకే సరిపోయేది. ‘కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి’ అన్నట్టుండేది. ఒక్క రైతు పండించే పంటకు తప్ప అన్నిటికీ ధరలు పెరిగేవి. “ఇగ వ్యవసాయం చేసుడు కష్టమే!” అనేవాడు నాన్న. ఒకరోజు కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. ఎందుకో అటుగా వెళ్లి చూస్తే ఆయన కళ్ల నిండా నీళ్లు నిండి చెంపల మీదుగా జారుతున్నాయి. టీవీలో గోరటి వెంకన్నగారి.. ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ పాట వస్తున్నది. ఏమీ చూడనట్టు నిశ్శబ్దంగా వెనక్కి తిరిగాను.
చివరికి ఇప్పటి ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ప్రవేశించిన రోజుల్లో ఆనాటి జ్ఞాపకాలుగా సవారు కచ్చడం, నొగలు, గుంటుకలు, నాగళ్లు, కర్రులు, చొప్ప కోసే యంత్రం, ఎడ్ల మెడల్లో వేసే గజ్జెలు, అయిదారు పెద్ద గంటలుండే బొణగలు మిగిలాయి. కాలక్రమేణా అవి ఏమయ్యాయో కూడా తెలియదు. తన ఎనభై మూడో ఏట నాన్న చనిపోయినప్పుడు.. ఊరివాళ్లంతా ఆ మర్నాడు జరిగే సమ్మక్క జాతరకోసం బయల్దేరేవాళ్లల్లా ప్రయాణం ఆపుకొన్నారనీ, నాన్న దహన సంస్కారాలు చూశాకే వెళ్లారని తెలిసి.. నాన్న ఆ ఊరినీ, ఆ ఊరివాళ్లు నాన్ననీ ఎంతగా ప్రేమించారో అనిపించింది!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి