‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
చల్లని పిల్ల తుంపరలు వరండాను తడిపేస్తున్నాయి. వాలు కుర్చీలో కూర్చుని వర్షాన్ని చూస్తుంటే.. అదో హాయి! ఇంతలో.. ఒక చేతిలో వేడివేడి పకోడీల ప్లేటు, మరో చేతిలో గ్లాసెడు టీ తీసుకొచ్చింది మధురమ్మ. భర్త అలవాట్లు, అభిరుచులు ఆమెకు తెలియనివి కావుగా.
“ఇదిగోండి మాస్టారూ… నేలపై కూర్చుంటున్నాను. మాటిమాటికీ నన్ను పైకి లేపకండిక”..
‘అన్నీ అందించేశాను!’ అన్నట్టు కనుబొమలు ఎగరేస్తూ అన్నది మధురమ్మ.
“సర్లే అమ్మడు. ఇలా వాన పడటం.. అలా వేడివేడి నూనెలో పకోడీలు ఈదడం ఈనాటిదా!? మన పెళ్లయిన నాటినుంచి చూస్తున్నదేగా! అయినా ఇన్నిన్ని పకోడీలు చేస్తావు.. మొహమాటానికా అన్నట్టు ఒక్కటో రెండో తింటావు ఎందుకని? డైటింగా ఏమిటీ?” వేళాకోళంగా అన్నాడు కృష్ణలీలయ్య.
“డైటింగా! నా ముఖమా! ఏమిటోనండీ ఆ నూనెవాసన అంతసేపు పీల్చుకునేసరికి తినాలన్న ఆశపోతుంది. అందుకే తినలేను. అయినా మీరు ఆవురావురుమంటూ ఆరగిస్తుంటే నా కడుపు నిండిపోతుందిలెండి” అని సిగ్గుతో తలదించుకుంది.
“అబ్బో.. పడుచుపిల్ల వచ్చింది. కొత్త పెళ్లికూతురిలా ఎలా సిగ్గుపడుతున్నావో చూడు” అని భార్యను ఇంకాస్త ఏడిపించాడు కృష్ణలీలయ్య.
“చాల్లెండి .. పెళ్లయి ఇన్నేళ్లు కావస్తున్నా ఇంకా మీ చిలిపితనం పోలేదు” భర్తను సూటిగా చూడలేక నేలపై కాలి వేలితో రాస్తూ అంది మధురమ్మ.
“నా పేరే కృష్ణుడు కదా అమ్మడు” అని తియ్యగా నవ్వాడు కృష్ణలీలయ్య. అలా ఇద్దరూ వర్షాన్ని ఆస్వాదిస్తూ హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకొంటూనే ఉన్నారు. అలా ఎంతసేపు కూర్చున్నారో వారికే తెలియదు. వాన ఎప్పుడు ఆగిపోయిందో గమనించనే లేదు.
గోవర్ధనపురంలో నివసించే మధురమ్మ, కృష్ణలీలయ్య దంపతులకు ఐదుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందరూ చదువులని విదేశాలకు వెళ్లి, పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. రెండుమూడేళ్లకు ఓసారి వచ్చి నెలరోజులు అమ్మానాన్నలతో గడిపి వెళ్లిపోతుంటారు. వాళ్లు వచ్చివెళ్లినప్పుడు ఇల్లంతా సందడి. ఆ తర్వాత మామూలేగా. అయితే పిల్లల వైఖరి కృష్ణలీలయ్యకు అంతగా నచ్చేదికాదు. అమ్మతో అవీఇవీ చేయించుకోవడం, తినడం.. మళ్లీ ఏవేవో ప్యాకింగులూ గట్రా చేయించమనడం.. వెరసి అందరూ విమానాలు ఎక్కి వెళ్లిపోయాక.. మధురమ్మ అనారోగ్యంతో మంచం ఎక్కడం.. ఇలాగే ఉండేది.
‘ఇప్పటికే పిల్లల కోసం చేసింది చాలు! నీ గురించి కాస్త శ్రద్ధ తీసుకో!’ అంటూ అప్పుడప్పుడు భార్యను కూడా ఈ విషయంలో మందలిస్తూ ఉండేవాడు. కానీ, మధురమ్మ అమ్మ మనసు అవన్నీ పట్టించుకునేది కాదు. ఇలా ఉండగా ఓసారి కూతురి దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది.
“అమ్మా! నాకు ఏడో నెల. నీకు కావాల్సిన పాస్‌పోర్టు, వీసా అంతా సిద్ధం చేశాను. వచ్చేవారమే వచ్చేయ్. నాకు తోడుగా ఉందూగానీ” అని క్లుప్తంగా విషయం చెప్పింది.
“ఏడో నెలా!? ఈ శుభవార్త ఇప్పుడా చెప్పేది. కంగ్రాట్స్ తల్లీ! ఆరోగ్యం ఎలా ఉంది” అని ఎంతో ప్రేమగా అడిగింది మధురమ్మ.
“అంతా ఓకే గానీ.. నేను ఓ లిస్టు పంపుతాను. వచ్చేటప్పుడు ఆ సామాన్లన్నీ వెంట తీసుకుని వచ్చేయ్. సరే ఉంటా” అని ఫోన్ పెట్టేస్తుండగా..
“వస్తాను గానీ.. ఈ వయసులో నాన్నను ఒంటరిగా వదిలి రావాలంటే?” అని ఏదో చెప్పబోతుండగా కూతురు కయ్యిమంది.
“ఇప్పుడు నాన్న ఇక్కడికి వచ్చి చేసేదేముంది. నువ్వంటే పాపను చూసుకుంటావు. దండగ ఖర్చులు ఎందుకు చెప్పు” అంటూ ఫోన్ పెట్టేసింది.
ఇదంతా వార్తాపత్రిక చదువుతున్నట్టు నటిస్తున్న కృష్ణలీలయ్య హాల్లో కూర్చుని లీలగా వింటూనే ఉన్నాడు. భార్య బాధగా ముఖంపెట్టి బెడ్రూమ్ నుంచి బయటకు రావడం చూశాడు.
“ఆ.. ఎప్పుడు అమ్మడూ అమెరికా ప్రయాణం” అని వెక్కిరించాడు.
“అంటే.. అదీ” అని భార్య నాన్చడం చూసి సన్నగా నవ్వుకున్నాడు.
“ఏ మాటకామాట చెప్పుకోవాలోయ్. నేను మగాడిగా పుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదిగో నీలాగా ఆయా పని తప్పింది” అంటూ పగలబడి నవ్వాడు.
“ఛా ఊరుకోండి. మన పిల్లల సంతానానికి మనం కాకపోతే ఎవరు చేస్తారండీ” అని భర్తను పైకి మందలించినా.. తన బతుకు అలాగే మారినందుకు చిరాకేసింది మధురమ్మకు లోలోపల.
“అవునా.. అయితే నీ కూతురికి చెప్పి నీకు, నాకు ఇద్దరికీ టిక్కెట్లు బుక్ చేయమను. ఏమంటుందో చూద్దాం” అని తెల్సిన జవాబే అయినా ప్రశ్నించాడు.
“వాళ్లను మాత్రం ఏం అనగలమండీ. వాళ్ల ఖర్చులు వాళ్లకు ఉంటాయి” అని భర్తతో పైకి అన్నా కూడా.. మనసులో మాత్రం ఆ కోరిక ఆమెకు లేకపోలేదు.
“అంటే.. ఇప్పుడు వెళ్తానంటావు అంతేనా!? రెండేళ్ల క్రితం వెళ్లావు గుర్తుందా. తమరి వారసుడి తొలి సంతానానికి సేవ చేయడానికి. అక్కడి వాతావరణం, తిండి పడక ఎంతలా విలవిల్లాడిపోయావు. ఇక్కడికి రావాలని ఉన్నా బుడ్డోడికి సకల సేవలు చేయాల్సి రావడంతో అక్కడే ఉండిపోయావు. రాత్రనకా పగలనకా వాళ్లు షికార్లు, పార్టీలు చేసుకుంటుంటే.. నువ్వేమో బాబు మలమూత్రాలు కడుగుతూ గడిపావు. అవునా కాదా!? అసలు నిన్నో మనిషిలా చూశారా వాళ్లు. ఫ్రీగా వచ్చిన ఆయమ్మలా చూశారు తప్ప. అయినా మళ్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నావా!?” కృష్ణలీలయ్యకు భార్య పరిస్థితి చూసి జాలేసింది.
“మనం కాకపోతే ఇంకెవరు చేస్తారండీ వాళ్లకు.. పాపం!” భర్త చెప్పినదాంట్లో అణువణువూ నిజమే ఉన్నా.. కూతురికి ‘రాను!’ అని చెప్పలేని బలహీన స్థితిలో పడిపోయింది మధురమ్మ. తల్లి మనసు కదా. పిల్లలు ఏమన్నా.. ఏం చేసినా.. పడివుండేలా తయారైంది మరి.
“చూడు అమ్మడూ! ఇప్పటికే నువ్వు మన సంతానానికి చాలా సేవలు చేశావు. రాత్రనకా పగలనకా వాళ్లకు నానా చాకిరీ చేశావు. కనీసం నీతో అయినా వాళ్లు వారంవారం.. పోనీ నెలకోసారి ఫోన్లు చేసి మాట్లాడతారా! నువ్వు చేస్తే ఫోన్ ఎత్తుతారా? వాళ్లంతా బిజీ మరి. మనం మాత్రం ఖాళీగా దోమలు, ఈగలు తోలుకుంటూ ఉన్నాం. సరే అదంతా పక్కనబెట్టు.. నువ్వు వెళ్లడం నాకిష్టం లేదు. నీకు నేను కావాలో, పిల్లలు కావాలో తేల్చుకో!” అని తేల్చిచెప్పి బయటకు వెళ్లిపోయాడు కృష్ణలీలయ్య. మధురమ్మకు ఏం చేయాలో తోచలేదు. అలా గుమ్మం దగ్గర కూర్చుండిపోయింది. పరిసరాలను గమనిస్తూ గతానికి వెళ్లిపోయింది.
చిన్న వయసులోనే భర్తతోపాటు అడుగుపెట్టిన పచ్చగా సింగారించుకున్న గడప. దానికి ఇరువైపులా గజేంద్రుల ప్రతిరూపాలు. చిన్న పాత్రలో ఆరోజు తోటలో విచ్చుకున్న ఎర్రని గులాబీలు, తెల్లని జాజులు. ఇంటి ఎదుట కళ్లాపి చల్లి వేసిన పదహారు చుక్కల ఏడు వరసల అందాల ముగ్గు. ఒకవైపు ఏపుగా పెరిగిన జామ, మామిడి, సపోటా చెట్లు. మరోవైపు ఆకుకూరలు, కూరగాయల మొక్కలు. తాను ఎంతో ఇష్టంగా చేయించుకున్న తులసికోట. అందులో రాధాకృష్ణుల రాతి విగ్రహం.
కాస్త దూరంలో మల్లెపందిరి. దాని కిందే నులకమంచం, మట్టికుండలో నీళ్లు. ఆ మంచంపై కూర్చుని భర్త వార్తాపత్రిక చదువుతుంటే తాను వింటూ ఎన్ని మల్లెదండలు కట్టిందో తనకే తెలీదు. కొన్ని గుడికి పంపితే మరికొన్నిటిని ఇంట్లో పూజకు వాడేది. ఎన్నిసార్లు తలలో పెట్టుకోమని భర్త చెప్పినా.. పువ్వులన్నీ భగవంతుడికే చెందాలని తాను చెప్పేది. అయినా భర్త ఊరుకుంటేనా.. ఒకటో రెండో మల్లెలను తెంపి తన తలలో ప్రేమగా పెట్టేవాడు.
అత్తగారింట్లో గంపెడు సంతానం. పెద్ద ఇల్లు. ఒక్కొక్కరుగా అత్తామామ, మతిస్థిమితం లేని మరిది చనిపోవడంతో.. ఇంటి బాధ్యతంతా తనపై పడింది. చిన్నతనంలోనే పెద్దరికం వచ్చేసింది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా పిల్లలు పుట్టడంతో వారిని చూసుకోవడం కష్టంగా మారింది. భర్త ఉద్యోగరీత్యా పలు ఊళ్లలో ఉద్యోగాలు చేయాల్సి రావడంతో.. తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. పిల్లలను తానే పూర్తిగా చూసుకోవడం మొదలుపెట్టింది. నాన్న.. వాళ్లకో మనీ మెషీన్లా అనిపించసాగాడు. తాను పస్తులుండి పిల్లలను ఉన్నతస్థితికి తీసుకువచ్చాడు. తాహతుకు మించినా వాళ్లు కోరిన చదువులు చదివించి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేశాడు. కానీ, ఇప్పుడు రెక్కలు రాగానే వాళ్లు తల్లిదండ్రుల సేవలను మరచిపోయారు.
అవసరాలకు అమ్మను వాడుకుంటున్నారు. నాన్నతో ఇక పనేలేదు కాబట్టి ఆయనను ఒక్కసారి కూడా విదేశాలకు తీసుకువెళ్లింది లేదు. గతంలో ఇలాగే కాన్పు కోసం భర్తను వదిలి విదేశాలకు వెళ్లొచ్చేలోపు ఆయన సమయానికి సరైన తిండిలేక అనారోగ్యం పాలయ్యారు. ఈసారి అస్సలే వెళ్లకూడదని భర్త చెప్పనే చెప్పాడు. కానీ, తాను వెళ్లకపోతే పిల్లలు చంటిపిల్లలతో అన్ని పనులు ఎలా చేసుకోగలరు? వారికి కృతజ్ఞతాభావం లేదు కానీ.. పేగుబంధం తనను ఇక్కడ నిలవనివ్వగలదా! ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయింది.
అప్పుడే..
“అక్కా అక్కా! ఎలా ఉన్నావు?” అంటూ పలకరించేందుకు వచ్చింది పక్కింటి చెల్లెమ్మ వర్ణమ్మ.
“రా.. రా.. నేను బాగానే ఉన్నాను. నీ సంగతులు ఏంటి? అమెరికా నుంచి ఎప్పుడొచ్చావేమిటి?” అంటూనే కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది.
“వారం కిందే వచ్చానక్కా. వెళ్లేముందు ఆరు నెలలకు సరిపడా ఇక్కడంతా సిద్ధంచేసి వెళ్లాలా.. మళ్లీ అక్కడ చాకిరీ. అదిచేసి ఇక్కడికి వచ్చేసరికి ఇల్లంతా చెత్తా చెదారం. అంతా శుభ్రం చేసుకుని మళ్లీ ఓ స్థితికి తీసుకొచ్చేసరికి నా చావుకు వచ్చింది. అయినా మనకీ డ్యూటీలు ఏంటక్కా. పోనీ అక్కడ మనకేమన్నా రాజభోగాలు ఉన్నాయా అంటే.. ప్రతీదానికి ‘నీకు ఇది తెలీదు. అది తెలీదు’ అంటూ సూటిపోటి మాటలు. గొడ్డు చాకిరీ చేసినందుకు కనీసం కృతజ్ఞతలు చెప్పిన పాపానపోరు. అరే.. ‘ఇండియా తిరిగెళ్తున్నాం.
ఇరుగుపొరుగులు బంధువులు అడుగుతారు.. ఓ చాక్లెట్ ప్యాకెట్టు కొనివ్వవే!’ అంటే .. ‘ఎందుకూ దండగ!’ అంది నా ముద్దుల కూతురు. పైగా.. నా టిక్కెట్టుకే లక్షల్లో ఖర్చయ్యిందని ఈసడింపులు. నేనేమన్నా పంపమన్నానా.. లేక అమెరికా చూడాలని తహతహలాడానా. వాళ్ల అవసరం కాబట్టి వాళ్లు టికెట్టు తీసి పంపించారు. మనం సరదాగా వస్తామంటే రానిస్తారా ఏంటి” ఊపిరి తీసుకోకుండా గలగలా మాట్లాడేసి.. కాఫీ తాగేందుకు కాస్త బ్రేక్ ఇచ్చింది.
“ప్రస్తుతం నాదీ అదే పరిస్థితి చెల్లెమ్మా! నాకూ పిల్లల దగ్గరి నుంచి పిలుపువచ్చింది. మీ బావగారికైతే నేను వెళ్లడం అసలే ఇష్టం లేదు. ‘కనీసం ఈ వయసులో అయినా మనం కలిసి ఉండకపోతే ఎలా!?’ అంటూ నన్నే తిడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే నాక్కూడా వెళ్లేందుకు మనసు ఒప్పుకోవట్లేదు. అన్నన్ని నెలలు మీ బావగారిని ఒంటరిగా వదిలి అక్కడ నాలుగు గోడల మధ్య ఉండాలంటే బాధగా ఉంది. కానీ పిల్లలు అర్థం చేసుకోరుగా మన బాధ” మధురమ్మకు బెంగగా ఉంది.
“ఏం పిల్లలక్కా. అమెరికా నుంచి వాళ్లు ఇక్కడికి వచ్చినా మనకే పని. మనం అక్కడికి వెళ్లినా మనకే పని. ఏం.. మనకు మాత్రం పనుల నుంచి విరామం వద్దా. మనకేమన్నా రోబోలు ఉన్నాయా లేక మనమే మెషిన్లమా!?” అంటున్న వర్ణమ్మ మాటలు విన్నారు అప్పుడే లోపలికి వస్తున్న కృష్ణలీలయ్య.
“ఏమ్మా! అమెరికాకు వెళ్లొచ్చావు. ప్రెసిడెంటును కలిశావా లేదా? కనీసం ఒక చాక్లెట్ ముక్కయినా తెచ్చావా లేదా నాకు..” అని ఏడిపించారు.
“అయ్యో రామా! మనం తీసుకువెళ్లడమే కానీ మనతో ఏమన్నా పంపిస్తారా ఏంటీ!? అందుకే చెప్పేసి వచ్చాను.. నేనింకోసారి ఈ చాకిరీ కోసం రానని” నవ్వుతూ అంది వర్ణమ్మ.
“ఆ బుద్ధి ఈ జన్మలో మీ అక్కగారికి వచ్చేలా లేదమ్మా” అని భార్యను గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్లిపోయాడు.
“చూశావా! ఎంత కోపంగా ఉన్నారో. ఇప్పుడు పిల్లలకు నేను ఏం చెప్పాలి. నాన్నకు నన్ను పంపడం ఇష్టంలేదు అంటే ఆయనపై కోపం పెంచుకుంటారు. నాకు పిచ్చెక్కుతోంది అనుకో” అని వర్ణమ్మతో తన గోడు వెళ్లబోసుకుంది.
“ఈమధ్య ఇది ఇంటింటి రామాయణంగా మారింది. ఏదో ఒకటి నువ్వే ఆలోచించుకో” అంటూ వర్ణమ్మ వెళ్లిపోయింది.
“ఏమిటోయ్ ఇంకా అమెరికా ప్రయాణానికి సిద్ధం కావట్లేదేంటీ?” అని భార్యను ఉడికించాడు కృష్ణలీలయ్య.
“నాకన్నా మీకే తొందర ఎక్కువగా ఉన్నట్టుందిగా” అంది భర్తను ఓరకంట కనిపెడుతూ.
“అరే.. ఈ పాటికి నీ సంతానం ‘ఇవి గ్రైండు చేసుకుని తీసుకురా! అవి షాపింగు చేసి కొనుక్కురా! ఈ పచ్చళ్లు, ఆ పొడులు..’ అంటూ లిస్టు పంపుతారు కదా.. ఇంకా రాలేదా అని ఆత్రుత అంతే!” అని చటుక్కున నోటిపై వేలేసుకుని భార్య ఏమంటుందోనని చూశారు.
“మీరు ఊరుకోండి. అరే.. ‘మన అమ్మానాన్నే కదా!?’ అని అలా చెబుతారు. దానికే ఓ.. ఇదైపోతే ఎలా? అయినా వాళ్లు అడిగినా అడగకపోయినా తీసుకువెళ్లడం నా బాధ్యత. ఓపిక ఉన్నంతవరకూ చేస్తూనే ఉంటాను” అంటూ లోపలికి వెళ్లిపోయింది. భార్య మనసు అటు భర్త.. ఇటు పిల్లలమధ్య ఎంతలా కొట్టుకుంటుందో కృష్ణలీలయ్యకు అర్థమయ్యింది.వెంటనే పిల్లలకు ఒక ఆడియో మెసేజీ పంపించాడు.
పిల్లలూ.. మీ నుంచి ఒకే ఒక్కటి ఆశిస్తున్నాను. ఇప్పుడైనా.. మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. మీ అవసరాల కోసం మా ఇద్దరినీ విడదీయకండి. మీకు కాన్పులు ఉంటే తప్పకుండా అమ్మగా ఆమె వచ్చి బాధ్యతను తీసుకుంటుంది. కానీ ఆమె మనసు మాత్రం నాపైనే ఉంటుంది. నేనేం తిన్నానో, మందులు గట్రా సరైన సమయానికి వేసుకున్నానో లేదోనని ఆరాటపడుతూనే ఉంటుంది. అందుకే ఒకే ఒక్క విన్నపం!
‘పిల్లలూ.. మీరంతా మీమీ దేశాల్లో బిజీ అని నాకు తెలుసు. మీకు వీలు ఉన్నప్పుడు ఈ ముసలాడి మెసేజీ వింటారని ఆశిస్తున్నాను. మాకు పెళ్లయినప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగరీత్యా మీ అమ్మా, నేను ఎన్నోఏళ్లు దూరంగా ఉన్నాం. దూరంగా ఉన్నా ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తూ.. సరిగ్గా తినీతినక అవస్థలు పడ్డాం. ఎన్ని పస్తులున్నామో.. ఎంత ఒంటరితనం అనుభవించామో మాకే తెలుసు. అందరు తల్లిదండ్రుల్లానే మేము కూడా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచించాం. వాటికి త్యాగాలు, సేవలు అన్న పెద్దపేరు పెట్టలేను కానీ.. మా జీవితాన్నంతా మీకోసమే ధారబోశాం. నేనంటే ఇప్పుడు రిటైరయ్యాను కానీ.. మీ అమ్మ మాత్రం ఇంకా మీ డెలివరీలు, పురుళ్లు అనుకుంటూ శ్రమిస్తూనే ఉంది. అది ఆమె బాధ్యత అంటూ మీరు హుకుం జారీ చేస్తున్నారు. పిల్లలుగా మాపై మీకా హక్కు ఉంది. కానీ, మాకూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయని మీకెందుకు అనిపించడం లేదు. మాకు ఈ వయసులో ఒకరికొకరి తోడు కావాలి. మా వృద్ధాప్యంలో మా కబుర్లను విని, సమయానికి మందులు వేసే ఒక మనిషి కావాలి.
అది.. అమ్మకు నేను. నాకు అమ్మ. పిల్లలూ.. మీ నుంచి ఒకే ఒక్కటి ఆశిస్తున్నాను. ఇప్పుడైనా.. మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. మీ అవసరాల కోసం మా ఇద్దరినీ విడదీయకండి. మీకు కాన్పులు ఉంటే తప్పకుండా అమ్మగా ఆమె వచ్చి బాధ్యతను తీసుకుంటుంది. కానీ ఆమె మనసు మాత్రం నాపైనే ఉంటుంది. నేనేం తిన్నానో, మందులు గట్రా సరైన సమయానికి వేసుకున్నానో లేదోనని ఆరాటపడుతూనే ఉంటుంది. అందుకే ఒకే ఒక్క విన్నపం! ఈ ముసలాడిని కూడా అమ్మతో రానివ్వండి.
మీ దగ్గర నాన్న టికెట్టుకు డబ్బులేకుంటే.. అప్పో సొప్పో చేసుకుని నేనే టికెట్టు కొనుక్కుంటాను. అక్కడ మీ ఇంట్లో నేను ఉన్నన్ని రోజులు మీకు ఎంత ఖర్చు అవుతుందో చెబితే.. అది కూడా ఇచ్చుకుంటాను. మీకు భారం కాను. కానీ, దయచేసి ఈ వయసులో మమ్మల్ని విడదీయకండి. ఇది తండ్రిగా నా ఆఖరి కోరిక అనుకోండి!’.. అని ముగించాడు. కానీ, ఈ విషయాన్ని భార్యకు చెప్పలేదు. పిల్లలు కచ్చితంగా మారతారని మాత్రం భావించాడు. పిల్లల నుంచి మెసేజీ కోసం ఎదురు చూడసాగాడు.
అతను ఊహించినట్టుగానే.. తండ్రి నుంచి వచ్చిన మెసేజీని చూసి పిల్లలు చలించిపోయారు. చిన్నప్పుడు అమ్మానాన్నలు తమకోసం పడ్డ కష్టాలు వారికి గుర్తొచ్చాయి. అమ్మానాన్న వయసులో ఉండగా.. ఎప్పుడూ సుఖపడ్డది లేదు. ఎప్పుడూ తమ కోసం, తమ చదువు కోసం తాపత్రయపడ్డారు. ఇప్పుడు తాము కేవలం కొంత డబ్బును మిగుల్చుకునేందుకు నాన్నకు టికెట్ తీయకుండా అమ్మకు మాత్రమే టికెట్ కొనడం ఎంత నీచపు చర్యో అర్థమై వారికి సిగ్గేసింది. అమ్మను కూడా ఎప్పుడూ డెలివరీల సమయంలో చాకిరీ చేయడానికే పిలిచారు తప్ప..
ఒక హాలీడే ట్రిప్‌లా ఎంజాయ్ చేయడానికి ఎప్పుడూ పిలవలేదని గుర్తొచ్చి గుండె మెలేసింది. తమ తప్పును తెలుసుకున్న పిల్లలు వెంటనే అమ్మానాన్నలిద్దరికీ టికెట్లు పంపించారు. తండ్రికి ఫోన్ చేసి క్షమాపణలు కోరారు. తాము తమ తప్పును తెలుసుకున్నామని మరోసారి ఈ విధంగా చేయమని చెప్పుకొచ్చారు. ఇద్దరికీ టికెట్లను పంపుతున్నామని.. ఇకపై ఎప్పుడూ విదేశాలకు వచ్చినా అమ్మానాన్నలు కలిసే వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇది విన్న కృష్ణలీలయ్య కళ్లు చెమర్చాయి.మరుసటి రోజు ఉదయం భార్య ఎంతో ఉత్సాహంగా ఉండటం గమనించాడు కృష్ణలీలయ్య.
“ఏమండీ ఏమండీ.. ఇదిగోండి ఇటు చూడండి. మీకూ, నాకు ఇద్దరికీ టికెట్లు పంపారండీ మన పిల్లలు. మీరేమో వెళ్లొద్దని నన్ను కట్టడి చేశారు. మన పిల్లలేమో మన గురించే ఆలోచించారు. మన పెంపకం అలాంటిది” అంటూ అసలు విషయం తెలియకపొంగిపోయింది.
“అవునా.. నాన్నకు కూడా టికెట్ పంపారా!?” అంటూ కృష్ణలీలయ్య చిరునవ్వు నవ్వుతూ టిక్కెట్లను ప్రేమగా తడిమి.. భార్య భుజంపై చేయి వేశాడు.
విదేశాల్లో అమ్మాయి డెలివరీ అనగానే.. అమ్మలను మాత్రమే తీసుకెళ్తారు. నాన్నలను ఎందుకు తీసుకెళ్లరు? అన్న ఆలోచనలోంచి ఈ కథను రాశారు రచయిత్రి మంజీత కుమార్. వీరి స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ (జర్నలిజం) చేశారు. ‘ఆడియో ఆప్స్ రైటర్’కు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వివిధ యూట్యూబ్ చానెల్స్‌కు కథలు, మాటలు అందించడంతోపాటు ఆకాశవాణి రేడియోకు నాటకాలు రాస్తుంటారు.
ఆకాశవాణి, ఎఫ్ఎం రేడియోల్లోనూ పనిచేశారు. మూడున్నరేళ్లుగా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో కథలు, కవితలు రాస్తున్నారు. కుక్కర్, క్షమయా ధరిత్రీ కథలు పాఠకుల మన్ననలు పొందాయి. ‘నాగ మంజీతం’ వీరి తొలి నవల. ‘తపస్వి మనోహరం’ సంస్థ తరఫున నిర్వహించిన నవలల పోటీల్లో ప్రథమ బహుమతితోపాటు రూ.5000 గెలుచుకున్నది. రెండుసార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించుకున్నారు. వంశీ గ్లోబల్ అవార్డ్‌తోపాటు గాథ సృజన సంయమి పురస్కారం, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సేవా పురస్కారంలాటి అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.
– మంజీత కుమార్ 98496 49594