‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
సరింగా పొద్దు తెల్లారలే ఇంకా.
వసంతరావు సచ్చిపోయిండనే ఇసయం ఊరంతా పాకింది. యాభై ఏండ్లు మీదికొచ్చినా.. గట్టిగ పయిల్మాన్ లెక్క ఉండే వసంతరావు గట్లెట్ల సచ్చిపోయిండని ఊరంతా ఇచ్చిత్రం అయితాండ్రు.
అయినా మనిషి సావుకు వయసుతోని, కాలంతోని పనేముంది. గా శివునాజ్ఞ లేకుండా శీమైనా కుట్టదంటరుగాని, సావును శివయ్య మాత్రం ఆపుతాడా!?
పొద్దు పొద్దుగాల ఊళ్లె చెట్టంత మనిషి పాణం పోతే.. ‘అయ్యో!’ అని కన్నీళ్లు కార్చేటోళ్లకంటే..
‘ఏమయ్యి.. ఎట్ల బోయిండు!?’ అని ఆరాలు గుంజెటోళ్లే ఎక్కువ అయ్యిండ్రు.
కొంతమందైతే..
‘ఆ బవురూపులదాని గోస పడలేక ఏమన్న జేసుకున్నడేమో!?’ అని వసంతరావు పెండ్లాం భద్రమ్మ మీద అక్కసు ఎల్లదీసుడు మొదలుబెట్టిండ్రు.
ముందురోజు రేత్రి తినమంటే ఛాతిల కొంచెం పట్టేసినట్లున్నదని తినకుండనే గిలాసడు సల్ల దాగి పండుకున్నడట. మల్ల లేవలే. నిద్రల్నే పోయింది పాణం.
ఇంటి ముందున్న కొట్టంల సాపేసి పీనుగను ఉంచిండ్రు.
“గింత చిన్నీడుల నిన్నెట్ల తీస్కపోబుద్దయింది గా దేవునికి తమ్మీ!” అని రాగాలు తీస్కుంట.. మధ్యమధ్యల ముక్కు చీదుకుంట ఏడ్తాంది వసంతరావు అక్క.
దగ్గరి సుట్టపోల్లయిన నలుగురైదుగురు ఆడోళ్లు శోకాలు ఆపకుండనే.. వచ్చి పోయేటోళ్లను సూసుకుంట, పక్కనోళ్లతోని ముచ్చట్లు పెడుతాండ్రు.
అరుగు మీద కట్టె పట్టుకొని కూసున్న ఆ వాడ ముసలోళ్లు.. వసంతరావు మంచితనం గురించి నెమరేసుకుంట సుట్టలు ఎలిగించుకున్నరు.
కొంచెం దూరంగ గడ్డివాము పక్కన చేరిన పెద్ద మనుషులు.. పట్నంల నుంచి బయల్దేరిన వసంతరావు ఒక్కగానొక్క కొడుకు ఏడిదాక వచ్చిండోనని వాకబు చేస్తాండ్రు. చింతచెట్టు కింద నిలబడ్డ సర్పంచి డప్పులోళ్లకు ఫోన్ జేసి.. జల్ది రమ్మని గరం అయితాండు.
పీనుగ తలాపున ఒక కాలు మడుచుకొని కూర్చొని.. మోచేతిని ఇంకో మోకాలు పైన పెట్టి.. అరచేతిని చెంపకు ఆనిచ్చుకొని.. వసంతరావు మొకాన్నే సూత్తాంది భద్రమ్మ. ఆమె కండ్ల నుంచి ఒక్క సుక్క కూడా కారుతలేదు. ఆమె ఏడ్పు సూద్దామని వచ్చిన అమ్మలక్కలకు నిరాశే ఎదురైంది.
“మొగుడు సచ్చినా ఏడుపొత్తలేదు దొంగబుడ్డికి” అని ఒకరు..
“వామ్మో! దీన్ది రాయి గుండెగాదు!” అని ఇంకొకరు.. చెవులు కొరుక్కుంటున్నారు.
ఎక్కువమంది వసంతరావు మంచితనం గురించి, భద్రమ్మ గడుసుతనం గురించి ముచ్చట్లు పెడుతాండ్రు.
సాకలి లచ్చమ్మ మాత్రం..
“ఇసొంటి మొగుడు ఉండేం సింగారం.. లేకుంటేం సింగారం! ఎన్నడన్నా సుఖపెట్టిండా భద్రమ్మను” అని అంటాంది.
భద్రమ్మ నిమ్మళంగా లేచి వెళ్లి, కట్టేసిన బర్రెగొడ్లను వదిలిపెట్టి..
“జర గా పెండ్లకాలు ఎత్తయ్యా!” అని అక్కడే నిలుచున్న ఓ పిల్లగానికి చెప్పి, మళ్లీ పీనుగ దగ్గర మునుపటిలాగనే కూసున్నది.
అది చూసిన ఒక ముసల్ది..
“హవ్వ! చాత్రానికైనా ఏడుత్తలేదు దీని సిగదరగ!” అని నోరు నొక్కుకుంది.
భద్రమ్మ మాత్రం ముఖంల ఏ భావం లేకుండా ఆలోచిస్తాంది. ఆమె యాదిల ఒకసారి గతమంతా కదలాడింది.
ముగ్గురు బిడ్డలు పుట్టినంక ఈసారైనా మగ నలుసు వస్తుందేమోనని ఎదురు చూసిన ఆ తండ్రి ఆశలు అడియాసలు చేస్తూ.. నాలుగో సంతానంగా పుట్టిన భద్రమ్మ అంటే ఆ ఇంట్ల అందరికీ లోకువే!
ఇంట్ల దరిద్రానికి కారణం ఆ పిల్లేనని తండ్రి నమ్మకం.
మొగుడి అశాంతికి కారణం అయ్యింది కనుక..
“నా గండాన దాపురించింది ఈ ముదనష్టపుది” అంటూ అయినదానికి, కానిదానికి భద్రమ్మను సాధించడం ఆ తల్లికి అలవాటైంది.
ముగ్గురు అక్కలు కూడా వాళ్లంతా ఒక్కటిగా.. భద్రమ్మను మాత్రం వేరుగా చూసేటోళ్లు. ముందుగా పుట్టిన అక్కల గొప్పతనం ఏంటో, చివరగా పుట్టిన తన నేరం ఏంటో తెలియని ఆ పసి హృదయం తల్లడిల్లేది. అక్కలకు అన్నంలో గుడ్డు పెట్టి, భద్రమ్మకు మాత్రం పచ్చడి మెతుకులే మిగిల్చేటోళ్లు.
ముగ్గురు అక్కలకు నెత్తికి నూనె పెట్టి, జడేసి పూలు పెట్టే తల్లి.. భద్రమ్మను మాత్రం చింపిరి జుట్టుతోనే వదిలేస్తే, ఆ చిన్నారి మనసు మౌనంగా రోదించేది. కొత్తబట్టలను ఎప్పుడూ ఎరగదు భద్రమ్మ. పండగ పూట కూడా అక్కల పాతగుడ్డలే ఆమెకు దిక్కు.
సౌంర్త పండుగ గూడ పెద్దోళ్లు ముగ్గురికే చేసిండ్రు. ఇవన్నీ చూసిచూసి ఎంత బాధ కలిగినా గుండెలోనే దాచుకోవడం అలా చిన్నప్పుడే అలవాటయ్యింది భద్రమ్మకు. ఉన్నదంతా అమ్మి మంచి సంబంధాలు చూసి అక్కల పెళ్లి చేసిన తండ్రికి..
‘ఇప్పుడు భద్రమ్మను ఒక అయ్య చేతిలో పెట్టి ఎలా వదిలించుకోవాలే!?’ అనే రంధి పట్టుకుంది.
అందుకే ఎనిమిదో క్లాసులనే బడికి పోవుడు బందు పెట్టించి భద్రమ్మ లగ్గం చెయ్యడానికి తయారయ్యిండు. ఇవ్వడానికి పొలం గట్రా ఏమీ లేకపోవడం, చేతిల చిల్లిగవ్వ లేకపోవడంతో ఒక్క సంబంధం కూడా రాలేదు. దాంతో ఇగ కుంటోడో గుడ్డోడో అయినా సరే ఇచ్చి చెయ్యాల్నని అనుకున్నడు మనసుల.
ఆ రేత్రి సొక్క నిద్రలో ఉన్న భద్రమ్మకు ఎందుకో మెలుకువ వచ్చింది. చిన్నగా గుసగుసగా అమ్మ, బాపు మాటలు ఇనబడుతున్నయి.
“ఒక్కడే కొడుకు, ఒక బిడ్డ. బిడ్డ పెండ్లి పోయినేడే అయిందట. లంకంత ఇల్లు, పెద్ద వాకిలి, ఇద్దరు జీతగాళ్లు. ఇంకేంది!?” అంటాండు బాపు.
“మంచిగనే ఉన్నదిగని పిలగాని ముచ్చట కొంచెం ఎటమటం చెప్పుకొంటాండ్రు” అన్నది అమ్మ.
“నీయవ్వ! నువు జర సైసు. కుంటోడు, గుడ్డోడు కన్నా నయం గాదా!? నేనెంత ఇకమతు జేసి ఈ సంబంధం పట్టిన్నో నీకేం ఎరుక. పైసలున్నయి, పొలాలున్నయి వాళ్లకు. ఈ దరిద్రపు మొఖం దానికి ఇసొంటి సంబంధం దొరుకుడే ఎక్కువ” అన్నడు.
“ఓపాలి మల్ల సోచాయించు. లగ్గమై దాని కడుపున ఓ కాయ కాస్తే చాలు. ఇంగ దాని నసీబు ఎట్లుంటే అట్లయితది” అన్నది అమ్మ.
వాళ్ల మాటల్లో.. తనకిగ లగ్గం జేత్తరని, పిలగానోళ్లు మంచిగ ఉన్నోళ్లే అని మాత్రం అర్థమైంది భద్రమ్మకు.
ఏదో ఒకటి.. ఈ కొంప నుంచి బయటపడితే చాలు అనుకున్నది. వారం తిరిగే సరికి భద్రమ్మ – వసంతరావు లగ్గం అయ్యింది.
వసంతరావు అందంగా ఆరడుగులు ఉంటడు. కండ పట్టిన ఒళ్లు. పెళ్లిల వసంతరావును మొదటిసారి చూసినప్పుడు భద్రమ్మకు పెయ్యంతా ఏదో తెలియని తియ్యని చక్కిలిగిలి అయ్యింది. అంతలోనే..
‘గింత అందగాడు నన్నెట్ల కాయిసుపడ్డడు!?’ అని కొంచెం గుబులు కూడా పుట్టింది.
అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఆమెలో ఎలాంటి బాధ, భయం కలగలేదు.
తల్లి మాత్రం ఆమెను దగ్గరికి తీసుకొని..
“బిడ్డా! జర పైలం. కష్టమైనా, సుఖమైనా గుండెల్లెనే దాచుకో బయటపడకు” అని చెప్పింది.
“అట్లాగే!?” అంటూ తలూపింది భద్రమ్మ.
కానీ, తన బతుకు పెనం మీద నుంచి పొయ్యిల పడబోతున్నదని భద్రమ్మ ఊహించలేదు ఆ క్షణం.
మొదటి రేత్రి ఏమీ మాట్లాడకుండా పక్కకు వొత్తిగిలి పడుకున్నడు వసంతరావు. ఎట్లనో ఎవలో ఎప్పుడో అనుకుంటాంటే విన్నదాని ప్రకారం.. తొలి రేయి పెనిమిటి ఏదో సేత్తడనీ, జర నొప్పి ఐతదని ఊహించిన భద్రమ్మ.. అట్లాంటిది ఏమీ లేకపోవడంతో తను కూడా సంబురంగా ఇంకో పక్కకు తిరిగి పండుకున్నది.
కోడి కుయ్యకముందే నిద్రలకెల్లి లేపింది అత్త. రెండు మూడు గుంటలంత వాకిలిని ఒక జీతగాడు ఊడుస్తాంటే, ఇంకో జీతగాడు బాయిలకెల్లి నీళ్లు తోడుకొచ్చి బకిట్ల పోసి పెండ కలుపుతాంటే.. పెళ్లి బట్టలు, నిద్ర మొఖంతోనే అలుకు సల్లుడు మొదలుపెట్టింది భద్రమ్మ. ఇంటి ముందున్న చిన్న గద్దెలను ఎర్రమన్నుతోని, కడపలు పసుపుతోని పుదిచ్చి, ఇంట్ల వాకిట్ల ముగ్గులు పెట్టి, గోలం కాడ గంపెడు అంట్లు ముందేసుకున్నది. అలవాటు లేని దంత్ మంజన్తోని పండ్లు తోముకొని, జీతగాండ్లతోని సమానంగా తనగ్గూడ అత్త పోసిన ఉడుకు చాయ తాగి.. మల్ల ఇంటిపనిల దిగింది.
జీతగాండ్లతోని కలిసి దొడ్డి ఊడ్చి, బర్ల పాలు పిండి, పశులకు మేత పెట్టినంక.. ఇంత బువ్వ తిని ఎడ్లను తోలుకొని శెల్కకు పొయ్యిండు వసంతరావు.
రాత్రి అన్నంల సగం.. బట్టలు తీసుకుపోడానికి వచ్చిన సాకలామె గుడ్డ మూటలో ఏసి, మిగిలిన సగం తను తిన్నది భద్రమ్మ.
“ఇప్పుడే లగ్గం అయింది గదా! ఓ మూడు రోజులు ఇంట్లనే ఉండు. తర్వాత నుంచి నువ్వు సుత బాయికాడికి పోవాలే!” అన్నది అత్త.
అత్త ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా తలకాయ ఊపుడు మొదలుపెట్టింది భద్రమ్మ.
మామకు పక్షవాతం. మంచంలకెల్లి లెవ్వడు.
ఆ రోజంతా పల్లికాయ కొట్టుడో, బియ్యం చెరుగుడో.. ఏదో ఒకపని, రికాం లేకుండా చేపించింది అత్త.
సాయంత్రం మల్ల వాకిలి ఊడ్చి, వంటపని చేసి.. అందరు తిన్నంక అన్ని సర్దిపెట్టి, పక్క మీద చేరేసరికి.. వసంతరావు గుర్రుపెట్టి పండుకున్నడు. ఒళ్లు అలిసిన భద్రమ్మకు కూడ వెంటనే కండ్లు మూతలువడ్డయి.
నాలుగు దినాలు గడిచినయి. పొద్దుగాల ఇంటిపని అయినంక గంపల సద్ది పెట్టుకొని శెల్క కాడికి పోవుడు మొదలువెట్టింది. ఎర్రటి ఎండల కలుపు తీసుడు, పత్తి ఏరుడు లాంటి పనులు చేస్తాంటే.. మొదట్ల చేతులు బొబ్బలు పెట్టినా నిమ్మలంగ అలవాటైంది.
నెల రోజులు గడిచాయి. ముద్దు – ముచ్చట లేదు. ఒక్కమాటు గూడ పెనిమిటి దగ్గరికి తీసుకోలేదు.
భద్రమ్మకు కూడా ఆ యావ లేదు.
ఈ మధ్య మంచంల ఉన్న మామ పనులు కూడా కోడలుతోనే చేపిస్తాంది అత్త. మారు మాటడకుండా చెయ్యసాగింది భద్రమ్మ. రాత్రి అయ్యేసరికి ఇంకా ఎక్కువ అలసిపోతాంది రోజురోజుకూ!
ఆ రోజు రాత్రి చెద్దరి కప్పుకున్నా చలి ఆగుతలేదు. భద్రమ్మకు మొగుని స్పర్శలోని వెచ్చదనం కావాలని అనిపించింది. వసంతరావు దగ్గరికి జరిగి భయపడుకుంటనే మీద చెయ్యి వేసింది. ఆ మనిషిలో చలనం లేదు. ఆమెకు ఏదో కావాలని అనిపించింది. మొగుడు గట్టిగా దగ్గరికి తీసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకో ప్రయత్నంగా ఒక కాలు తీసి అతని మీద వేసింది. చప్పున దూరం జరిగి భయంతో చూడసాగాడు ఆమె వైపు. ఆమెకు ఏడుపు వచ్చింది. అంతలోనే అతని పరిస్థితి చూసి జాలి కూడా పడింది. అతని
తనబ్బీలో తిలకం బొట్టు, కాటుక కాయ ఎందుకు కనపడ్డాయో చూచాయగా అర్థమైంది. తల్లిదండ్రులు విషయం తెలిసే తన గొంతు కోశారని తెలిసి..
విరక్తిగా నవ్వుకున్నది.
రోజూ ఇంట్లో చేసే చాకిరీ, బాయికాడి పనులు ఇంకా ఎక్కువైనయి. మొగుడు ఆమె కండ్లలోకి కూడ సరింగా సూత్తలేడు.
‘పోనీలే.. నన్నయితే ఇంక వేరే ఇబ్బంది ఏం పెడతలేడు గదా!’ అని సర్ది చెప్పుకొన్నది.
ఒకనాడు రాత్రి కళ్లు మూతలు వడుతుండగా.. తలుపు గొళ్లెం తీసిన సప్పుడైతే లేచింది భద్రమ్మ. వసంతరావు మెల్లగ సప్పుడు చెయ్యకుండ బయటికి పోతాండు.
‘బైలికి పోతాండేమోలే!’ అనుకున్న భద్రమ్మ.. ఎందుకో అనుమానంగా లేచి, అతను చూడకుండా వెనుక నుంచి అనుసరించింది.
చింతచెట్టు దగ్గర ఉన్న పెద్ద జీతగాడు, వసంతరావు కలిసి గడ్డివాము చాటుకు పొయ్యిండ్రు. సల్ల చెముటలు పుట్టినయి ఆమెకు. గుండెలు అదురుతాంటే వచ్చి పండుకున్నది.
మొగుడు దగ్గరికి రావడానికి భయపడతాండు అనుకున్నది గని గిసొంటోడని అనుకోలేదు.
కొద్దిసేపటికి వచ్చిన వసంతరావు కొంచెం హుషారుగా ఆమె మీద చెయ్యి వేసిండు. కట్టె లెక్క బిగుసుకుపోయిన ఆమె అతణ్ని కోపం, అసహ్యం కలగలిపి చూసింది. అదేమీ పట్టించుకోకుండా ఆదరబాదర పని కానిచ్చి అటు తిరిగి పండుకున్నడు. కుంటోడో, గుడ్డోడో అయినా బాగుండేది గదా అనుకొని ఆమె కండ్లంబడి నీళ్లు ధార కట్టినయి.
ఆ మరునాడు అత్త ఏదో పని చెప్పబోతే.. కండ్లతోనే గట్టిగ చూసింది. ఆమె మొఖంలోకి సూటిగా చూస్తూ..
“అత్తా! నా పెనిమిటి సంగతి నీకు ముందే తెలుసు గదా” అని కోపంగా అడిగింది.
అదే మొదటిసారి అత్తతోని ఆమె ఎదురుంగ గట్టిగ మాట్లాడుడు. తలొంచుకున్న ఆమెను చూస్తే కూడా జాలేసింది భద్రమ్మకు. ఇందులో ఆమె తప్పు మాత్రం ఏమున్నది అనుకున్నది. అప్పటినుంచి భద్రమ్మకు గట్టిగ ఏమన్న పని చెప్పాల్నంటే ఆలోచించేది అత్త.
ఆ తర్వాత వారానికి ఓ పాలి రాత్రి పూట గడ్డివాము దగ్గరకి పోయి వచ్చి భద్రమ్మను దగ్గరికి తీసుకొనేటోడు. ముభావంగా భరించేది.
ఓ రోజు శెల్క కాడ మిరపచేన్ల కలుపు తీసుకుంట ఆవలికి పోదామని బాయి చాటుకు పోయిన భద్రమ్మ.. అక్కడి దృశ్యం చూసి బీరిపోయింది.
సుతారోళ్ల శీను పైన, వసంత రావు కింద. కింద భూమి కదిలినట్లు అయ్యింది. వాళ్లు సూడకుండ జప్పున అక్కడినుంచి జారుకుంది. మొగునికి ఒక్కరి కంటె ఎక్కువ మందితోని సంబంధం ఉందని తెల్సి రోత అనిపించింది. అంతలోనే.. ఆ భగవంతుడు అట్ల పుట్టిస్తే ఆయన మాత్రం ఏం జేస్తడని పెద్ద మనసు చేసుకున్నది. పాపం! అని అనుకున్నది. కానీ, ఇంగ మొగుణ్ని దగ్గరికి కూడా రానీయొద్దు అని గట్టిగ నిర్ణయించుకుంది.
‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుని నోట్లో శని! అన్నట్లు ఉంది నా పరిస్థితి’ అనుకున్నది.
ఓ వారం తర్వాత భద్రమ్మ నెల తప్పింది. ఇంగ ఈ జీవితానికి ఈ వరం చాలు అనుకున్నది. వసంతరావు గూడ అట్లనే అనుకున్నడు. ఆ తర్వాతెప్పుడు గూడ రాత్రిపూట అతను భద్రమ్మ మీద చెయ్యి వెయ్యలేదు. భద్రమ్మ కూడా భర్త నుంచి ఏమీ కోరుకోలేదు.
తల్లిదండ్రులు వచ్చి చూసి పోతరేమో అని, సీమంతం చేస్తరేమో అని ఆశపడ్డది. కానీ అట్లా ఏం జరుగలేదు. కొడుకు పుట్టినంక మాత్రం తల్లి, అక్కలు వచ్చి చూసి పోయిండ్రు ఒక్కసారి. వాళ్లను జూస్తే గుండె నిండా దుఃఖం ముంచుకొచ్చింది గానీ.. ఎప్పటిలాగానే కండ్లల్ల నీళ్లు కనవడకుండా మౌనంగనే రోదించింది.
కొడుకు పుట్టిన సంవత్సరానికే మామ, ఇంకో సంవత్సరం అత్త కాలం చేసిండ్రు. వాళ్లు పోయినంక వసంతరావు పని తగ్గించి జల్సాలు మొదలుపెట్టిండు. భద్రమ్మ ఇంటి యవ్వారం మీద ఏసుకోవటంతో ఆమెకు బాధ్యతలు పెరిగాయి. పొలం కౌలుకు ఇచ్చింది. కూలోళ్లను పెట్టి చెల్క పని చేయించేది. చిన్న జీతగాణ్ని తీసేసింది. పెద్ద జీతగాణ్ని తీసేయబుద్ధి కాలేదు.
‘నాకు ఎట్లాగు సుఖం లేదు! మొగుని సుఖాన్ని దూరం చెయ్యడం ఎందుకులే!?’ అని అనుకున్నది.
ఇప్పుడు ఇంట్ల అన్ని లెక్కలు భద్రమ్మే చూసుకుంటాంది. పెచ్చులకు ఇచ్చిన ఒడ్లు, పెసర్లు, పల్లీలు మర్చిపోకుండా మళ్లీ తీసుకునేది. ఊరోళ్లకు మిత్తికి ఇచ్చిన పైసలు లెక్క పోకుండ వసూలు చేసేది. అందుకే ఇప్పుడు ఆమె అందరికీ కంటు అయ్యింది. నిండు మనసుతో కష్టాల్లో ఉన్నోళ్లకు పెద్ద చెయ్యితో సహాయం చేసేది. అది కూడా కొంతమంది ఓర్సుకొనేటోళ్లు కాదు. అమ్మలక్కలు అవసరానికి ఆమె ముందు మంచిగ మాట్లాడి, తరువాత ఆమె ఎనుక తలో మాట అనేటోళ్లు.
ఆమె మొగుని సంగతి తెలిసి ఎంతోమంది మొగోళ్లు ఆమె మీద మోజుపడి ఓ రాయి వేసి ప్రయత్నించారు.
మరిది వరస అయ్యే పాలోళ్ల మనిషి ఒకాయన, పక్క చేను దొర, వార్డ్ మెంబర్ రెడ్డి.. ఇట్ల ఎంతమంది దగ్గరికి రాబోయినా, గట్టిగ బుద్ధి చెప్పి నియ్యతిగ బతికింది. వాళ్లందరూ గూడ ద్వేషంతో జనంలో ఆమె గురించి ఏదో ఒకటి చెడుగా మాట్లాడేటోళ్లు. అయినా ఎవ్వరినీ లెక్క చేసేది కాదు భద్రమ్మ. ఎప్పుడో రాయిగ మారిన భద్రమ్మ గుండెను ఇప్పుడు ఇట్లాంటివి ఏమీ చెయ్యలేవు.
ఒకసారి వెకిలి చేష్టలు చెయ్యబోయిన ప్రైవేట్ పంతులును నడి బజార్ల చెప్పుతోని కొట్టింది.
ఆమెలా ఉండలేక అసూయతో కూడా కొందరు అమ్మలక్కలు ఆమెను రకరకాల పేర్లతోని సాటుంగ బనాయించుడు మొదలువెట్టిండ్రు.
పిలగాడు పెద్ద పెరుగుతాంటే మంచి సదువు కోసమని హాస్టల్లో ఏసింది. వాడొక్కడే ఆమె ఆశ.
పెద్ద పెరిగి కొడుకన్నా తనను మంచిగ సూసుకుంటడని ఆశవడ్డది. కానీ, ఇప్పుడు గూడ ఆమె ఆశలు అడియాసలే అయినయి.
సదువు అయిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాంగానే.. కొడుకు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని, ఇంక ఈ ఊరు అస్సలుకే రానని కరాఖండిగా తేల్చి చెప్పిండు.
ఇగో.. ఇప్పుడు అనుకోకుండా వసంతరావు గుండెపోటుతో పోయిండు.
గతమంతా తలుచుకుంటే భద్రమ్మకు గుండెల మెలిపెట్టినట్లు బాధ అయితాంది. కానీ, కండ్లల్ల నీళ్లు రావట్లేదు. నిస్తేజంగా మొగుని శవాన్ని చూస్తున్నది అంతే.
ఏనాడూ ఏ సుఖం తెల్వకపోయినా.. బతుకు పోరాటం సాగించి ఆమె గుండె మొద్దుబారింది. ఇప్పుడు కూడా ఆమె జీవన పోరాటం ఆపదు. ఎందుకోసమో, ఎవరికోసమో ఆమెకు కూడా తెల్వదు. పసితనం నుంచి ముదిమి వయసు వరకు ఎన్నో కష్టాలను భరిస్తూ ఎదిగిన ఆమె.. నిజంగా గిట్టనోళ్లు అనుకున్నట్లు ‘బవురూపులదే’.
మరిది వరస అయ్యే పాలోళ్ల మనిషి ఒకాయన, పక్క చేను దొర, వార్డ్ మెంబర్ రెడ్డి.. ఇట్ల ఎంతమంది దగ్గరికి రాబోయినా, గట్టిగ బుద్ధి చెప్పి నియ్యతిగ బతికింది. వాళ్లందరూ గూడ ద్వేషంతో జనంలో ఆమె గురించి ఏదో ఒకటి చెడుగా మాట్లాడేటోళ్లు. అయినా ఎవ్వరినీ లెక్క చేసేది కాదు భద్రమ్మ.
మొగిలి అనిల్ కుమార్ రెడ్డి
మనసును తట్టి, మదిలో ఆలోచనలు రేకెత్తిస్తూ.. సామాజిక చైతన్యం కలిగించేలా కథలు రాయాలన్నది మొగిలి అనిల్ కుమార్ రెడ్డి ఆశయం. వరంగల్ జిల్లా నర్సంపేట తన స్వస్థలం. కాకినాడ జేఎన్టీయూలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (సైకాలజీ)లో పట్టా అందుకున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా హనుమకొండలో విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి కథ.. ‘ఫార్మాలిటీ’తోపాటు ఎనిమిది కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వాటిలో ‘కిల్లర్’, ‘ప్రణయ ప్రయాణం’ కథలకు బహుమతులు దక్కాయి. ఇవి కాకుండా ‘నర్సంపేట కథలు’ పేరుతో 15 కథలను ఫేస్బుక్ వేదికగా రాశారు. వాటిని పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మాటీవీ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’
సీజన్-2లో రూ.12.5 లక్షల బహుమతి గెలుచుకున్నారు.
మొగిలి అనిల్ కుమార్ రెడ్డి
9059920159