చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ :
ద్వీప రాజ్యానికి బయల్దేరిన యువరాజు జాయప.. అనుకోకుండా తిరిగి అనుమకొండకే రావాల్సి వచ్చింది. అయితే, ఈ బిడారు అనుభవం జాయప
జీవితాన్ని మరోమెట్టు ఎక్కించింది. ఆలోచనల్లో దృఢత్వం, స్పష్టత వచ్చింది. తన అక్కలను కాపాడి, వారికి మంచి జీవితాన్ని అందించడమే తన తక్షణ కర్తవ్యంగా తోచింది. ఇప్పుడతను ఓ యువరాజు అని అందరికీ తెలిసిపోయింది. దాంతో మిత్రులతో దినచర్య మరింత ఉత్సాహవంతంగా సాగుతున్నది.
గతంలో ఓసారి యుద్ధ శిక్షణశాల నుంచి వస్తూ సుబుద్ధిని అడిగాడు జాయప..
“మామయ గారూ! అదిగో ఆ కనిపించేది.. ఎత్తుగా గోడలా ఉందే! అదేవిటి?” అని.
“అది కొత్తగా నిర్మిస్తున్న ఓరుగల్లు కోట గోడ. కొంత కాలంగా నిధులులేక ఆగిపోయింది. ఎప్పుడో ప్రోల మహా రాజులుగారు అనుమకొండ, ఓరుగల్లు గ్రామాలు కలుపుతూ.. మహానగరం నిర్మించాలని మహా మహా వాస్తు శాస్త్రవేత్తలను పిలిపించి, ప్రణాళికలు సిద్ధంచేశారు. అప్పుడే కట్టడం ప్రారంభించినా.. ఆయన యుద్ధంలో మరణించడం, తర్వాత ఆయన కొడుకులు రుద్రదేవుడు, మహా దేవుడు కూడా పరిపాలించిన కాలమంతా యుద్ధాల్లోనే నిమగ్నమై మరణించడం, యువరాజు గణపతిదేవుణ్ని బంధించి తీసుకుపోవడంతో అసలు రాజ్యం ఉనికే ప్రమాదంలో పడింది. ఇక కోటను పట్టించుకునే వారేరి?! తిరిగి గణపతిదేవుడు రాజయ్యాక కాకతీయ సామ్రాజ్యం కాస్త స్థిమితపడింది. వెలనాడు, ద్వీప యుద్ధ విజయాలతో ఇక కాకతీయ సామ్రాజ్యం స్థిరపడినట్లే. అందుకు గుర్తు.. ఈ కోట నిర్మాణం పునఃప్రారంభమే..” అని వివరించాడు.
వెలనాటి విజయం తెచ్చిన ఆత్మధైర్యంతో, మహా ధనరాసులతో కాకతీయ నిర్మాతలు ఎన్నెన్నో కొత్త నిర్మాణాలను ప్రారంభించారు. అందులో ప్రధానమైనది అత్యద్భుత రాజధాని ఓరుగల్లు నిర్మాణం. సభ్య భారతీయ రాజ్యాలే కాక ప్రపంచదేశాల సార్థవాహులు కూడా అబ్బురంగా వాళ్ల దేశాలలో చెప్పుకొనేలా రాజధానిని నిర్మించడమే గణపతిదేవుని దీక్ష. అది అతని తాత, తండ్రుల కల.
“నిజంగా అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నమాట మనం ఒప్పుకోవాల్సిందే” అన్నాడు త్రిపుర.
ఏడు కోటలనే ప్రాకారాలతో ప్రతి ప్రాకారానికీ నాలుగు ద్వారాలతో.. మహానగర నిర్మాణం ప్రారంభమయ్యింది.
రాజధానికి మధ్యస్థంగా స్వయంభూ దేవాలయాన్ని ఉంచి, చుట్టూ ఏడు ప్రాకారాలు ఉండేలా నిర్మాణ ప్రణాళిక సృష్టించారు. ఈ ప్రాకారాల నిర్మాణం చూసి జాయప బృందం నోరు వెళ్లబెట్టింది.
“అసలు కోట ప్రవేశద్వారం చూశావా.. లోపలికి వెళ్లే దారిచూడు. అది స్వస్తిక ఆకారంలో ఉంది గమనించావా.. ఎవరైనా సరాసరిగా నడచుకుంటూ వెళ్లడానికి లేదు. కుడివైపునకు తిరిగి లోపలికి వెళ్లాలి. యుద్ధతంత్రంతో కూడిన వాస్తు మహిమ. సమస్త దేశాలన్నీ గాలించి అత్యుత్తమ వాస్తు శాస్త్రవేత్తలను రప్పించి.. మన కాకతీయ శాస్త్రజ్ఞులతో చర్చించి మనవారి మాట ప్రకారమే తుదిరూపం ఇవ్వడం జరుగుతుంది” వివరించాడు నాగంభట్టు.
“అంతిమ నిర్ణయం మహారాజుది కాదు.
రామాణ్యుడిది..” అన్నాడు త్రిపుర మిత్రుడు అంకాలశెట్టి.
“ఆయన ఎవరు?” అడిగాడు నాగంభట్టు మిత్రుడు ఉమారిల భట్టు.
“ఈ రామాణ్యుడు ఓ రుషి పుంగవుడు. వాస్తు శాస్త్రంలో దిట్ట. ఇక్కడికి నాలుగు క్రోసుల దూరంలో హిడింబాశ్రమం ఉంది తెలుసుగా.. అక్కడుంటాడు. ఆసేతుశీతాచలం పర్యటిస్తూ గొప్పగొప్ప వాస్తు శాస్త్రవేత్తలతో చర్చలు చేస్తూ, వాస్తులో గట్టి పట్టు సంపాదించాడు. ఓరుగల్లు రాజధాని నిర్మాణ ప్రణాళిక ఆయనే రచించాడు. ఆయన ఎక్కడ బావి తవ్వమంటే అక్కడ.. ఎక్కడ గుడి పునాది వెయ్యమంటే అక్కడ. ఆయన అంటే రుద్రదేవుడికి అపారమైన నమ్మకమట” వివరించాడు అంకాలశెట్టి.
తన్మయులయ్యారు.. అ నిర్మాణ ప్రతిభ చూసి.
“ఓరుగల్లును ఏకశిలానగరం అంటున్నారేవిటి?”.. జాయప కుతూహలం.
“అదిగో ఆ కొండ కనిపిస్తున్నదా!? ఆ శిల పక్కనున్న నగరం కాబట్టి ఏకశిలానగరం!”.. నాగంభట్టు వివరణ.
“అనుమకొండలో కొండలేదు. ఓరుగల్లులో కొండ ఉంది. అందుకని పేరులోకూడా వచ్చేలా మరోపేరు పెట్టారు”.. త్రిపుర వ్యాఖ్య.
పేటలో పూటకూళ్ల ఇళ్లు చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు పన్నెండు వందలు ఉన్నాయని అంచనా. ఆ వీధిలో ఒక పాదచారిని అడిగారు..
“మంచి భోజనం దొరికే పూటకూళ్ల ఇల్లు చెప్పు మిత్రమా” అని.
ఆయన దూరంగా ఓ ఇంటిని చూపిస్తూ..
“అది లక్ష్మణ ఒజ్జ కూటి ఇల్లు. మంచి భోజనం దొరుకుతుంది..” చెప్పాడు.
అక్కడ ఒక్క రూకకు భోజనం. వడ్డించిన కప్పురభోగి రకం సన్నబియ్యపు అన్నం, ఘుమఘుమలాడుతున్న అప్పాలు, పెసరపప్పు, దానిలో బాగా కాచిన నెయ్యి, నాలుగైదు రకాల కూరలు, పక్కన వడ్డించిన మట్టి లప్పల్లో మీగడపెరుగు, చెట్టుకు పండిన అరటి
పండ్లతో పొట్ట బిర్రుగా తిని.. బ్రేవున త్రేంచి కర్పూర విడెము నోట పెట్టుకుని బయటపడ్డారు మిత్రులు. భుక్తాయాసం వల్ల మెల్లగా ఇంటికి చేరారు.
ఓరుగల్లు ఇప్పుడిప్పుడే సంపూర్ణ రూపురేఖలు సంతరించుకుంటున్న మహా సౌందర్యరాశి కౌమార రూపంలా తోచింది జాయపకు. ‘పూర్తిరూపం సంతరించుకుంటే ఈ ఓరుగల్లును వీక్షించడం, ఇక్కడ నివసించడం ఓ మహద్భాగ్యం అనడంలో సందేహం లేదు’ అనుకున్నాడు. రాజధాని అంతటా రోజురోజుకూ పెరుగుతున్న హడావుడి చూసి అడిగాడు..
“ఏమిటి.. దేవాలయాల దగ్గర, వీధుల్లోనూ ఆటలు, పాటలు పెరుగుతున్నాయి. ఏమిటీ హడావుడి ?” అని.
“సంక్రాంతి. కొత్త పంట ఇంటికి వచ్చే కాలం. ఎన్నో కొత్తలు తెచ్చే పండుగ ఇది. ఎటు చూసినా సందడే!” చెప్పారు మిత్రులు.
కాకతీయ రాజ్యమంతా పండుగ శోభతో అలరారుతున్నది. రాజధాని పట్టణాలైన అనుమకొండ, ఓరుగల్లు సంగతి చెప్పనక్కరలేదు. అన్ని భవనాలు, చక్రవర్తి రాజనగరు, మాండలికుల భవంతులు, కులీనుల నివాసాలు, వీధులు, అంగళ్లు.. కొత్త రంగులతో.. వింతవింత అలంకరణలతో వెలుగులీనుతున్నాయి.
అన్ని ఇళ్లూ.. అలంకారాలతో కళకళలాడుతున్నాయి.
వైదికం రానురానూ హోమాలు, క్రతువులు లాంటి కర్మకాండలు తగ్గించి.. దేవాలయాల్లో స్వయంగా సామాన్యులు పూజలుచేసి, పండుగ సంబురాలు ఎక్కువగా నిర్వహించుకునేలా ప్రోత్సహిస్తున్నది. అందువల్ల కేవలం కులీనులే దైవ కార్యకలాపాలు నిర్వహించాలనే దూరం తగ్గిపోయి సామాన్యులు కూడా దేవాలయ పూజల్లో అశేషంగా పాల్గొనడం ప్రారంభమయ్యింది.
పురవాసుల సాంఘిక స్థాయి, ఆర్థిక స్తోమత వారి కట్టు, బొట్టు, జుట్టు అలంకరణల్లో ప్రతిఫలిస్తున్నాయి. కొత్తకొత్త దుస్తులు.. కొత్తకొత్త ఆభరణాలు, కొత్తకొత్త చెప్పులు, ఇలా కొత్తకొత్త అలకరణలతో, తొణికిసలాడుతున్న ఉత్సాహ ఉద్వేగాలతో, పండుగ సంబురాలతో తిరుగాడుతుంటే.. వారిని చూస్తూ సామాజికానంద సంస్పందులై తిరుగుతున్నది మిత్రబృందం.
ఏ వీధిలో చూసినా కుటుంబ సహితంగా సామాన్యుల సరదాలు.. ఆటపాటలు! తెలతెల్లవారకుండా చలిమంటలు.. వాటిల్లో నీటి కుండలు! అక్కడే సరిగంగ స్నానాలు! ఇంటిముందు రంగవల్లులు.. వాటిల్లో గొబ్బిళ్లు! వాటికి పూజలు.. పళ్లు, పువ్వులు.. అలంకారాలు! వీధి వీధులన్నీ అందచందాలతో అలరారు
తుండగా ప్రత్యూషవేళ నుంచే హరిదాసులు, గంగి
రెద్దులు, జంగములు, బుడబుక్కల వాళ్లు.. కొత్తకొత్త
వేషాలతో.. ఏవేవో పాటలతో! వీధులన్నీ గృహాలన్నీ సందళ్లే! వీధి కూడళ్లలో మేష యుద్ధాల పోటీ.. కోడి పందేల పోటీ.. గంగిరెద్దుల ఆట..
ఒక యువగృహస్థు జడ దువ్వి.. దానిలో పువ్వులు ముడిచాడు. తలలో బంగారు నాగరం అలకరించాడు. పెద్ద కంచుకం, దానిమీద రంగురంగుల ఉత్తరీయం కప్పాడు. నడుముకు మూడురంగుల అంచు ఉన్న పంచె కట్టి కాసె పోశాడు. కాళ్లకు కిర్రుచెప్పులు తొడిగాడు. పక్కన భార్యామణి.. ముక్కున ముక్కెర, మెడలో వింత కంఠాభరణాలు.. పట్టుచీరె కొత్తగాకట్టి, తొడిగిన రవికెపై మిలమిలమెరిసే జలతారు తీగెలు చుట్టింది. కాళ్లకు కడియాలు, మెట్టెలు, ఎత్తు చెప్పులతో ఆమె నడుస్తుంటే.. సదరు భర్త తన భార్య అందచందాలకు మురిసిపోతున్నాడు. మరో ప్రౌఢజంట.. అదొక సంబురం. మరో వృద్ధ జంట.. అదొక అనుభవ మాధుర్యం.
సుబుద్ధి నివాసం, ఆ వీధి.. మొత్తం ఆ బలింజవాడ అంతా అందంగా తయారైంది. ప్రతి ఇల్లూ ఆవుపేడ కలిపిన పుట్టమన్నుతో అలికారు. ప్రతి ఇంటి మట్టి గోడలన్నీ పేడతో అలికి చిత్రకారులతో భారత, రామాయణ గాథల చిత్తరువులు రాయించారు.
రంగురంగుల పూలమాలలతో, మామిడి ఆకులు, వేప మండల తోరణాలతో.. పండ్లు, కూరగాయలు, చెరకుగడలు లాంటి పంట సంపదలన్నిటి అలంకరణలతో.. వీధులన్నీ ప్రకృతివనం కాగా, వీధి వీధంతా కల్లాపుచల్లి తెల్లనిసున్నంతో అందమైన ముగ్గులు వేసి.. ఆపై గొబ్బెమ్మలు పెట్టి, పువ్వులతో అలంకరించి.. ఆపై అగరు కడ్డీలు గుచ్చి.. వహ్వా! ఆ వాడ అంతా పండుగ సౌరభాలతో చూపరులను పరవశింపజేస్తున్నది.
సుబుద్ధి అక్క కాంతమ నిర్వహిస్తున్న వైద్యశాల పండుగ సందర్భంగా వారం రోజులుగా మూసివేశారు.
అయితే కాంతమ హడావుడిగానే ఉంది. ఆశ్చర్యపోతూ అడిగాడు జాయప..
“పండుగపూట కూడా వైద్యశాలలో ఉన్నారేమిటి పెద్దమ గారూ?”.
ఆమె నవ్వి.. జాయప బుగ్గలు పుణికింది.
“పండుగ మర్నాడునుంచి ఒళ్లంతా దెబ్బలతో.. కొక్కేలు గుచ్చుకున్న శరీరాలతో వచ్చే జనానికి వైద్యం చెయ్యాలిగా జాయపా! మందులు సిద్ధం చేసుకుంటున్నాను!” అని చెప్పింది.
ముక్కున ముక్కెర, మెడలో వింత కంఠాభరణాలు.. పట్టుచీరె కొత్తగాకట్టి, తొడిగిన రవికెపై మిలమిలమెరిసే జలతారు తీగెలు చుట్టింది. కాళ్లకు కడియాలు, మెట్టెలు, ఎత్తు చెప్పులతో ఆమె నడుస్తుంటే..
వాయుతైలాలు చిన్నచిన్న మట్టి మూకుడులలో పోసి సిద్ధం చేస్తున్నదామె. పెరటి చావిడిలో పెద్ద భాండంలో కట్టెల పొయ్యిపై వావిల చివుళ్లు, ఉమ్మెత్త, ఆముదపు చివుళ్లు, జిల్లేడాకులు కలిపిన తైలం ఉడుకుతున్నది. వృత్తిపట్ల ఆమె నిబద్ధతకు ముగ్ధుడయ్యాడు జాయప. ఆమె కూడా బీరపువ్వులా సింగారించుకుని కొత్త కోక కట్టి.. తలలో పెద్ద మందార పువ్వు తురుముకుని, తన వృత్తిలో నిమగ్నం కావడం అతనికి ముచ్చటేసింది.
ఎప్పుడూ ఇంటిపనితో ఎడ్డి మడ్డిగా ఉండే ఆ వాడకట్టు గృహిణులు కూడా ఇంటి అలంకరణలతో, పిండి వంటలతో హడావుడిగా ఉంటూనే.. చక్కగా అలంకరించుకుని వీధికే పండుగ సౌరభం తెచ్చారు. పట్టుచీరెలు, పట్టు రవికెలు ధరించారు. వింతవింత శిరోలంకరణలు, రకరకాల కంఠాభరణాలు, పచ్చల కడియాలు, హార భూషణాలు, మొలనూళ్లు, కడియాలు, మెట్టెలు, అందియలు, చేతులకు గోరింటాకు, గోళ్లకు, పెదవులకు లత్తుక రంగులు.. పండుగ పుణ్యాన అసలుసిసలైన అందగత్తెలుగా వాళ్లంతా జిగేలుమనిపిస్తున్నారు.
పుష్యమాసంలో హేమంత రుతువులో శీతగాలులు వీస్తూ.. మంచు కురిసి మురిపాలు పాలపొంగులా బుసబుస పొంగే వేళ ధనుర్మాసం ప్రారంభం అవుతున్నది.
ధనుర్మాసం ప్రారంభానికి చిహ్నంగా తెల్లజిల్లేడు కర్ర పాతి పండుగ మొదలుపెట్టారు.
అవి దక్షిణాయనం చివరి మాసపు రోజులు.. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించగానే వచ్చేదే సంక్రాంతి పర్వదినం. అప్పటినుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఆ మాసమంతా పర్వదినాలే. జాయప ఆ బలిజవాడ పిల్లలతో, పెద్దలతో.. ముసలి ముత్తయిదువులతో ఆడి పాడి మురిసిపోయాడు. అలసిపోయాడు. సంక్రాంతి పండుగతో పండుగ సౌరభాలు ముగుస్తాయి అనుకున్నాడు.
కానీ, సంక్రాంతి ముగిశాక కూడా ప్రజల్లో ఆనంద సందోహ విహారాలు.. కళకళలు, తళతళలు ఏమాత్రం తగ్గలేదు. ఎందువల్ల? అదే అడిగాడు మిత్రులతో.
“సంక్రాంతి ముగిసింది. శివరాత్రి వస్తున్నది కదా. ఈ కోలాహలం ఇప్పట్లో తగ్గదు. శివరాత్రి అంటే.. శైవులైన చక్రవర్తి కుటుంబం, బంధుజనం, కులీనులు శివుణ్ని మరీమరీ కొలిచే పర్వదినం. పూజలకు, సరదాలకు కొదవా!?” అన్నారు మిత్రులు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284