సంఘ శ్రేయస్సు కోసమే కొన్ని కట్టుబాట్లు, నీతి నియమాలు పుట్టుకొచ్చాయి. అయితే ఇవేవీ స్థిరంగా ఉండవు. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ మార్పు పురోగమనమా? తిరోగమనమా? అనే వివేచన ప్రతి వ్యక్తికీ ఉండాలి. అలాంటి విచక్షణా చైతన్యం, విజ్ఞానాల్ని కళలే అందిస్తాయి.స్త్రీనికట్టుబాట్లలో బంధించిన ఈ సమాజం పురుషుడి విషయంలో అపరిమిత స్వేచ్ఛను ప్రసాదించింది. పురుషాధిక్య సమాజపు పోకడ యుగాలుగా ఇలాగే ఉంది. అయితే, పురుషుడిలాగే స్త్రీకీ అపరిమిత స్వేచ్ఛ ఉంటే.. అది స్త్రీవాదమవుతుందా? ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? విపరీతమైన స్వేచ్ఛ ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఉంటుంది. సరైన గమ్యమూ, గమనము దానికి ఉండదనే విషయాలను ‘స్వేచ్ఛ’ నాటిక రేఖామాత్రంగా చర్చిస్తుంది.
ఆధునిక సంపన్న కుటుంబ కథ ఇది. మహేశ్వరి ఇరవై ఏళ్ల క్రితమే భర్తతో తెగదెంపులు చేసుకుని అవినాశ్‌తో కలిసి జీవనం సాగిస్తున్నది. మహేశ్వరి కూతురు శ్వేత కూడా తల్లి దగ్గరే పెరుగుతుంటుంది. తల్లి ప్రవర్తన శ్వేతకు నచ్చదు. ఆమెకు దూరంగా, అమెరికా వెళ్లి చదువుకోవాలని అనుకుంటుంది. తల్లి అందుకు అంగీకరించదు. తల్లీ-కూతుళ్ల మధ్య ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. తన తండ్రి స్థానంలోకి వచ్చిన అవినాశ్‌ను దూరంగా ఉంచుతుంది శ్వేత. మహేశ్వరి కూడా మన మధ్య సంబంధం మనవరకే పరిమితమని, ఇతర ఏ వ్యక్తిగత విషయాల్లో కలుగ జేసుకోవద్దని అవినాశ్‌ను హెచ్చరిస్తుంది. కూతురు వరుసైన శ్వేతపై కాముక దృష్టి ఉన్న అవినాశ్ కన్నేస్తాడు.
ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే… మహేశ్వరి కంపెనీలో పనిచేస్తుంటుంది. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్‌గా పదోన్నతి పొందుతుంది. దీనిని పురస్కరించుకొని అవినాశ్ని ఇంటికి ఆహ్వానించి విందు ఇస్తుంది. ఆ సందర్భంలో మద్యం తాగుతూ ఇద్దరూ శ్రుతిమించుతారు. ఆధునిక యుగంలో ఇవన్నీ సర్వసాధారణమని వాళ్ల భావన. మహేశ్వరి వ్యవహార శైలి ఆమె భర్త అయిన మూర్తికి నచ్చదు. ఓసారి అవినాశ్‌పై చేయి చేసుకుంటాడు కూడా. మహేశ్వరి భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు ఆనంద్, కూతురు శ్వేత. ‘మగపిల్లవాడిని నీవు తీసుకెళ్లు, కూతుర్ని మాత్రం నా వద్దే ఉంచుకుంటాను’ అని పురుష ద్వేషంతో అంటుంది మహేశ్వరి. చేసేది లేక భార్యకు విడాకులు ఇచ్చేసి ఆనంద్ బాధ్యత తీసుకుంటాడు మూర్తి.
ఇరవై ఏళ్లు గడిచిపోతాయి. ఆనంద్ ఎదిగాడు. అచ్చం మూర్తిలానే ఉంటాడు. కొన్నాళ్లకు మూర్తి మరణిస్తాడు. అమ్మ లాలన కరువైనా.. ఆనంద్ ఎప్పుడూ తన తల్లిని, చెల్లిని ఓ కంట కనిపెడుతుంటాడు. శ్వేత అమెరికా చదువులకు తల్లి డబ్బు ఇవ్వనంటుంది. తల్లి నో చెప్పడంతో.. డబ్బు కోసం శ్వేత వేరే దారులు వెతుకుతుంది. ‘డబ్బున్న కుర్రాళ్లకు వయసును, అందాన్ని ఎరవేసి, వాళ్లకు కంపెనీ ఇస్తే చాలు వేలు, లక్షలు గుమ్మరిస్తారు. అందులో మనం కోల్పోయేది ఏమీ లేదు. మన హద్దుల్లో మనం ఉంటే వాళ్లేమీ చేయరు’ అని శ్వేతకు ఓ ఫ్రెండ్ సలహా ఇస్తుంది. రిస్క్ తీసుకోవడానికి శ్వేత సిద్దమవుతుంది. పరాయి వ్యక్తితో కంపెనీకి సిద్ధపడేలా స్నేహితురాలితో చెప్పించింది తన అన్న ఆనందే. ఆ విషయం శ్వేతకు తర్వాత తెలుస్తుంది!
అన్నాచెల్లెళ్లు తల్లికి బుద్ధి చెప్పాలని ఈ నాటకమాడుతారు. తల్లి ఇంట్లో ఉండగానే అవినాశ్ పట్ల శ్వేత ఇష్టం ప్రదర్శిస్తుంది. ఆ క్షణం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవినాశ్ బరితెగించడానికి సిద్ధపడతాడు. ఈ పరిణామం మహేశ్వరికి నచ్చదు. అభ్యంతరం చెబితే అవినాశ్ ఆమె మీద చేయి చేసుకుంటాడు. చివరికి ఆనంద్ వచ్చి అవినాశ్‌కు బుద్ధి చెబుతాడు. ‘ఇప్పుడు నేను చేసింది న్యాయమే అయితే గతంలో నాన్న చేసింది కూడా న్యాయమే కదా!’ అని తల్లిని ప్రశ్నిస్తాడు ఆనంద్. మహేశ్వరి కళ్లు తెరుచుకుంటాయి. పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సరిదిద్దాలి. ఇక్కడ తల్లి తప్పు చేస్తే పిల్లలు సరిదిద్దారు. తల్లి వేరుకు పిల్ల కొమ్మలు వైద్యం చేయడం ఎంత అపురూపం! ‘స్వేచ్ఛకు హద్దులు ఉంటేనే అందం. ఆనందం’ అంటుండగా తెరపడుతుంది.
నాటికలో దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రేక్షకుడు రెప్పవాల్చకుండా ఏకబిగువున చూసేలా దీనిని ప్రదర్శించారు కళాకారులు. లైట్స్ ఆఫ్, ఆన్ ఉన్నా… సీనులు, తెరలు మారుతున్నా, ఫ్లాష్ బ్యాక్ నడిచినా… అంతరాయం అన్న భావన కలగదు. ఇప్పటి ప్రేక్షకులు కోరుకుంటున్నది ఇదే. అందుకే ఈ నాటిక పలు అవార్డులు గెలుచుకున్నది.
నాటిక పేరు- స్వేచ్ఛ రచన: పరమాత్ముని శివరాం దర్శకత్వం: బి.ఎన్.రెడ్డి పాత్రధారులు: సురభి లలిత, వెంకట్ గోవాడ, కుసుమ శ్రీనివాస్ తదితరులు…?
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు