Ramayanam | నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా సంక్రాంతి ముందు ఎప్పటిలాగే అక్క హైదరాబాద్‌కు వచ్చింది. మేము అంతకుముందు కూడా దాదాపుగా ప్రతి జనవరిలో హైదరాబాద్ రావడం, అక్కడున్న రోజుల్లో ఓ రోజు నుమాయిష్ చూడటం జరిగేది.
ఈసారి కూడా అక్క వచ్చాక నారాయణగూడలో రెండు రోజులుంది. ఎవరు వచ్చినా అమ్మ బోలెడన్ని అప్పాలు, వడియాలు, వరుగులు, చల్ల మిరపకాయలు.. ఇంకా మాకు పొలంలో ఏవి పండినా పంపిస్తూ ఉండేది. అప్పుడప్పుడూ నాయనమ్మ మాతో చైనీస్ చెక్కర్స్ ఆడేది. మొదటిసారిగా బోర్డును అక్కడే చూశాను. ఆ ఆట ఆడేటప్పుడు నాయనమ్మ ఎప్పటిలా సీరియస్‌గా కాక.. బాగా ఉల్లాసంగా కనిపించేది. ఆమె బాల్ (గుండ్రటి చిన్న గోలీ) వెళుతున్న దారిలో మా గోలీ అడ్డు వచ్చిందంటే చాలు.. “లండుదానా! నాకు అడ్డమొస్తవానే? నేనెటు పోవాలె?” అని విసుక్కునేది. మొదట్లో నాకు భయమేసి “తీస్త లెండి నాయనమ్మా!” అంటే.. “ఎహె! తియ్యమని కాదే! ఎవ్వరి ఆట వాండ్లు ఆడాలె గద!” అని నవ్వేది. నా మనసు తేలిక పడేది. తొందరగానే ఆ ఆటలో ఛాంపియన్లమై పోయాం.. నేనూ, అక్కా.
వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో గౌలీగూడలోని లక్ష్మి వాళ్లింటికి వెళ్లాం. అక్కడికెళితే హైమక్క, లక్ష్మి వాళ్లతో ఒకటే ముచ్చట్లు, సరదాలు, నవ్వులు, షికార్లు! బాల్కనీలో నిలబడి కింద రోడ్డు మీద వచ్చేపోయే జనాన్ని చూస్తూ ఎవరైనా మరీ ఓవర్ స్టయిలిష్గానో, అతిగా అలంకరించుకునో, వేషధారణ కొంచెం విచిత్రంగా అనిపిస్తేనో ఏవో జోకులేసుకుని నవ్వుకునేవాళ్లం. ఎవరైనా పైకీ కిందికీ ఒకే రంగు డ్రెస్ వేసుకుంటే.. “అటు చూడండే ‘అగ్నిపరీక్ష’లో కృష్ణ డ్రెస్ ఏసిండు” అనేది లక్ష్మి. ఎదురుగా ఉన్న సెలూన్లోంచి ఎవరైనా చక్కగా షేవ్ చేసుకుని బయటికి వెళుతుంటే..
“ఇక్కడ చూడు. నున్నగ కొరిగిండు, తెల్లగ పూసిండు” అనీ, ఒకామె పట్టుచీర కట్టుకుని నిండా నగలేసుకుని నడిచి వెళుతుంటే.. “చూడవే, రాజారమేష్లో వాణిశ్రీని అనుకుంటుంది” అని పకపకా నవ్వేది. “ఎహె! ఎందుకు చెల్లె అందర్ని అట్ల అనుడు మంచిది కాదు. మనను గూడ వేరేటోళ్లు అట్లనే అంటే బాధ గాదా?” అని మందలించేది హైమక్క. “ఏదో జోక్ కోసం కొందర్ని అంటం. అందర్ని అంటమా? అయినా మనం అనేది వాండ్లు వింటున్నరా? కదానే!?” అని లక్ష్మి మమ్మల్ని అడిగేది. మేము ఎటూ చెప్పలేక పోయేవాళ్లం. అయితే, ఎక్కువసార్లు ఆ జోక్స్‌ని మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్లం కనుక లక్ష్మి వైపు ఉండేవాళ్లం.
ఎదురుగా గీతా టైప్ ఇనిస్టిట్యూట్ ఉండేది. వీళ్లింట్లో అప్పుడప్పుడూ వంట చేసిపెట్టే పెరుమాళ్లు అనే అయ్యగారు డిగ్రీ చదువుతూ గీతా టైప్ ఇనిస్టిట్యూట్‌లో టైపు నేర్చుకునేవాడు. ఆయన తలొంచుకుని పని చేసుకునేవాడు. అయితే రోజూ సాయంత్రం నాలుగ్గంటలకు ఆ ఇన్స్టిట్యూట్లోంచి ఒక యువతి, ఓ యువకుడు అయిదు నిమిషాల తేడాలో బయటికి వచ్చేవారు. కొంచెం పక్కగా నిలబడి గంటలు గంటలు మాట్లాడుకునేవారు. “వీళ్లు ప్రేమించుకుంటున్నరే! చూడండి” అనేది లక్ష్మి పెద్ద గూఢచారిలా. “ఎహె! ఎందుకట్ల అంటవ్! వాళ్లిద్దరు అన్నచెల్లెండ్లయి ఉండొచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు” అంటూ హైమక్క అభ్యంతరపెట్టేది. “కాదు. మనం ఆనందన్న తోటి, దేవన్నతోటి గంత క్లోజ్‌గ ఉంటమా? వాండ్లు కచ్చితంగా లవర్సే! అగో..
ఇరానీ హోటల్‌కు పొయ్యి కూచుంటున్నరు చూడు. అయ్యో! ఇక్కడ ఒక మంచి హోటలన్న లేదాయె! కామత్‌కు పోనుండిరి” అని లక్ష్మి అంటే.. “పొయ్యి చెప్పి రాపో మరి!” అని హైమక్క అనేది. “అయినా కూడా ఒక ఆడపిల్ల, మొగపిల్లగాడు క్లోజ్‌గ కనబడితే లవర్సే అనుకోవద్దు. కావొచ్చు, కాకపోవచ్చు” అని మా అక్క అన్నది. “అబ్బ.. నువ్వు నిజంగ ఉత్తమ పురుషురాలివే సంధ్యా! అన్ని దిక్కుల ఆలోచిస్తవు” అన్నది హైమక్క. అందులో ఆలోచించేది ఏముందో నాకర్థం కాలేదు గానీ, ‘పురుషురాలివే!’ అన్న మాటకు అందరం పడిపడి నవ్వాం. అయితే, వాళ్లిద్దరూ నిజంగానే లవర్స్ అనీ, ఆ తరువాత పెళ్లి చేసుకున్నారనీ పెరుమాళ్లు అయ్యగారు చెప్పాడు. “నేను చెప్పలే!” అన్నది లక్ష్మి.
ఆ మర్నాడు ఊరి నుంచి ఉష, వాళ్ల నాన్నతో కలిసి వచ్చింది. ఉషది మా వయసే! వాళ్లది బమ్మెరకు దగ్గరగా ఉన్న విస్నూరు పక్కన రావులగడ్డ అనే చిన్న పల్లెటూరు. ఆయన బమ్మెరకు పట్వారీగా ఉండటం వల్ల అందరూ ‘పట్వారన్న’ అని పిలిచేవారు. ఆయనకు నలుగురు అమ్మాయిలు. ఉషను ‘దండెమ్మ’ అని పిలిచేవారు. ఆమెకు ముగ్గురు చెల్లెళ్లు. వాళ్ల అసలు పేర్లేమో గానీ, ఎందుకో మరి వాళ్లను కూడా బతుకమ్మ, బక్కమ్మ, ముసలమ్మ అనేవారు. ఇంతకూ ఉష వచ్చి.. “మాయా బజార్ అనే పాతసిన్మా శాన బాగుంటదట, చూద్దామా? నవరంగ్‌లో మార్నింగ్ షో ఉన్నదట” అనడిగింది. “సరే! అమ్మనడిగి పోదాం!” అని చిన్నమ్మను అడిగితే.. “మంచి సిన్మానే! పోండి గానీ, ఆ పిల్లతోని ఏం ఖర్చు పెట్టిచ్చకండి. బాగుండదు” అని చెప్పింది.
తొందరగా కిచిడీ చేయించుకుని తిని, అయిదుగురం రెండు రిక్షాల్లో వెళ్లాం. మాయాబజార్ సినిమా మాకు ఎంత నచ్చిందో చెప్పలేను. ఆ పాటలు, సన్నివేశాలు, సావిత్రి, ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, సూర్యకాంతం, గుమ్మడి, సీఎస్సార్.. ఒక్కళ్లనేమిటి? అందరూ గొప్పగా నటించారు. ఆ సినిమా మొదటిసారి చూసినప్పుడు ఎంత బావుందో ఇప్పటికీ ఎప్పుడు చూసినా అదే సంతోషం, అదే సంతృప్తి కలుగుతాయి. అందులో సావిత్రి డైలాగ్స్, ఆహ నా పెళ్లియంట పాట ఇంటికొచ్చాక నేను ఇమిటేట్ చేస్తుండేదాన్ని. శకుని డైలాగ్.. ‘చక్కగా! సిగ్గు లేకుండా! చనువుగా ఉన్నావు’ అనే మాటల్ని మేము తరచు అన్నిటికీ వాడేవాళ్లం. ఆ ఊపులో ఉష గౌరవార్థం ‘షోలే’ కూడా చూశాం. ‘అరే ఓ సాంబా! బహుత్ యారానా లగ్తా హై!’ వంటి గబ్బర్ సింగ్ డైలాగ్స్ కూడా నేను ఇంటికొచ్చాక చెప్పి అందర్నీ నవ్వించేదాన్ని.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి