Ramayanam | మా చిన్నప్పటి ఇల్లు చాలా పాతది కావడంతో.. నాన్న కొత్తది కట్టించాడు. పాత ఇల్లు ఎకరం స్థలంలో చాలా పెద్దగా ఉండేది. కొత్త ఇల్లు కూడా అలాగే కట్టాలని నాన్న కోరిక. కానీ, హడావుడిగా కట్టేసి.. గృహప్రవేశం చేశారు. డాబా ఇల్లు అయినా.. పాత దానితో పోలిస్తే చిన్నగా అనిపించేది.
ఎందుకో ఏమో.. ఈ కొత్త ఇంటిని మేము అంతతొందరగా సొంతం చేసుకోలేకపోయాం. మాటిమాటికీ నా ప్రాణమంతా నేను చిన్ననాడు ఆడుకొని పెరిగిన ఆ పాత ఇంటి మీదే లాగేది. నేనైతే మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాసేపు నడుంవాల్చిన టైంలో పాత ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయి.. అక్కడే ఆ చెట్లు, గోడలు, మేము ఆడుకున్న, చదువుకున్న, తిరుగాడిన పరిసరాల మధ్య చాలాసేపు గడిపేదాన్ని. ఒక రోజైతే నిద్రొచ్చి పాత ఇంట్లో మట్టి నేలమీద ఒక చాప వేసుకుని పడుకొని.. అట్లాగే సోయి లేకుండా నిద్రపోయాను. సాయంత్రం నా కొరకు నాన్న పంపిన ఓ మనిషి వెతుక్కుంటూ వచ్చాడు.
“ఏంది బిడ్డా! ఊరికే గక్కడికి పోతున్నవ్! ఈ ఇల్లు బాగలేదా?” అన్నాడు నాన్న. ఏమీ చెప్పలేకపోయాను. “ఎమ్మో! నాక్కూడ గా పాతిల్లే మంచిగుండె అనిపిస్తున్నది” అన్నది నానమ్మ. పాత ఇంట్లో మా అమ్మ ఎంతో శ్రమతో, ప్రేమతో పెంచిన చెట్లను వదులుకోలేక చిన్నచిన్న పూల మొక్కలు, దానిమ్మ, నిమ్మ లాంటి తీసుకు రాగలిగినన్ని చిన్నచెట్లు పెకిలించి తీసుకొచ్చాం. కొన్నిటిని నేనే మోసుకొచ్చి నాటాను కూడా. పెద్దపెద్ద పండ్ల చెట్లన్నిటినీ అలానే వదిలేసి రావాల్సి వచ్చింది. ‘మాకు నీళ్లెవరు పోస్తారు? మమ్మల్ని ఎవరికి అప్పజెప్పి పోతున్నారు’ అని ఆ చెట్లు బాధగా అడుగుతున్నట్టు అనిపించింది. ఆ ఇంటికి సంబంధించిన బోలెడు కర్రసామాను గానీ, అక్కడక్కడా అడ్డుగోడలుగా పేర్చిన పెద్ద బండరాళ్లు గానీ నాన్న తీసుకొని రాలేదు. గావులు, గుమ్ములు, విసుర్రాళ్లు, రుబ్బురోళ్లు.. అలా చాలా సామాను ఆ ఇంట్లోనే వదిలేశాడు.
కొన్నాళ్ల తర్వాత పాతిల్లు అలా మాన్యుమెంట్ లాగానైనా ఉంచుకుందామని అనుకున్నప్పుడు నాన్న చెప్పాడు.. “అది మనకు లేదు! కురుమోళ్లు ఉంటమంటే ఇచ్చిన! ఒద్దంటుంటే వెయ్యి రూపాయలు తెచ్చిచ్చిన్రు. వాండ్లు కొనుక్కున్నట్టే! ఇగ మనదెట్లయితది?” అని. కొన్నాళ్లకి మా ఇంటి ప్రహరీని ఆనుకుని ఉన్న బురుజును కూడా గ్రామపంచాయతీకి ఇచ్చాడు నాన్న. దాన్ని కూలగొట్టేసి.. ఆ రాయినే వాడి, ఆ స్థలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కట్టారు. దాని ముందు పెద్ద ఊరిబావి ఉండేది. దాన్ని పూడ్చేసి ఆటస్థలంగా మార్చేశారు. ఇప్పటికీ బతుకమ్మ ఆడటానికి ఊరి చెరువు దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా.. మా పాత ఇంటి ముందు నుంచి వెళుతుంటే ఆ జ్ఞాపకాలన్నీ చుట్టుముట్టి ఎందుకో తెలియని బాధ కలుగుతుంది.
కొత్త ఇంటికి వచ్చిన మొదటి రోజుల్లో మా ఇంట్లో బావి కూడా లేదు. నీళ్లకు బాగా ఇబ్బంది అయ్యేది. అమ్మ ఎదురింట్లో మా అత్తయ్య వాళ్ల ఇంటికి గానీ, కొంచెం దూరంలో ఉన్న మా బమ్మెర చిన్నాన్న వాళ్లింటికి కానీ వెళ్లి.. భుజం మీద బిందె పెట్టుకొని మంచినీళ్లు మోసుకొచ్చేది. చాలా రోజులు అలా ఇబ్బంది పడ్డాక.. నాన్న ఓ మండు వేసవిలో చాలా లోతైన బావి తవ్వించాడు. మధ్యలో రాయి వస్తే తూటాలతో పేల్చి మరీ తవ్వారు. ఆ బావి ఇప్పటివరకూ ఎప్పుడూ ఎండిపోలేదు. బాగా కరువు ఏర్పడ్డ రోజుల్లో కూడా నీళ్లు అడుక్కు వెళ్లి.. మట్టి వచ్చాక ఓ రెండు గంటలాగితే మళ్లీ నీరు ఊరేది. గత పదేళ్లుగానైతే.. బావి నిండా ముంచుకునేలా నీళ్లు ఉంటున్నాయి.
కొత్తింటికి వెళ్లిన కొత్తలో ఓ సంఘటన జరిగింది. చెట్లు అప్పుడప్పుడే చిన్నచిన్న చిగుళ్లు వేస్తూ ఉన్న సందర్భాల్లో.. ప్రహరీ కూడా లేకపోవడం వల్ల గొర్రెలు, మేకలు వచ్చి వాటిని మేస్తూ ఉండేవి. తొలి చిగురును గనుక ఒకసారి మేక కొరికితే ఆ చెట్టు ఇంక బతకదు అంటారు. అందుకని ఆ మేకలను, గొర్రెలను కొట్టలేక మేం అలసిపోతూ ఉండేవాళ్లం. ఓసారి ఇలాగే పెద్ద గొర్రెమేకల మంద రావడం రావడమే.. ఓ మల్లె చెట్టు మొత్తం నేను చూసేసరికే ఆకులతో సహా తినేసింది. దాంతో నాకు బాగా కోపం వచ్చి అక్కడే ఉన్న ఓ
సల్ప (సన్నటి పలుచటి రాతి ముక్క) తీసుకొని మేకలపైకి విసిరాను. అది కాస్తా వెళ్లి ఆ మేకల్ని కాస్తున్న అమ్మాయి కణతకు తగిలింది.
వెంటనే ఆమెకు గాయమై రక్తం కారింది. ఆ పిల్ల వంగి తను కట్టుకున్న లంగాను కొంచెం లేపి గాయానికి అడ్డుపెట్టుకుంది. ఇంతలో అమ్మ చూసి.. “ఎంత పని చేసినవు? ఎనుక ముందు చూసుకోవా!” అని నన్ను కోప్పడింది. నా గుండెలు గుబగుబలాడినాయి. అమ్మ ఆ పిల్లని పిలిచి.. వంటింట్లోంచి పసుపు తెచ్చి ఆమె నుదురుకు అద్ది, తడి బట్ట తెచ్చి చుట్టింది. కాసేపు కూర్చోబెట్టి మంచినీళ్లు, తినటానికి ఏదో ఇచ్చి.. కొంచెం తగ్గినాక, ఎవర్నో తోడిచ్చి వాళ్లింటికి పంపించాడు నాన్న.
ఆ పిల్ల ఎవరో కాదు.. అక్క క్లాస్మేట్ నర్సయ్య చెల్లెలు ఎల్లమ్మ. ఆ అమ్మాయి వెళ్లిపోయాక.. “ఏదైనా చూసుకోవాలి. అంత తొందరపాటు ఎందుకు? అట్లా రాయి విసిరితే ఆయంపట్టున తలిగి ఆ పిల్ల ప్రాణం పోతే ఎట్ల? ఏం జరిగేది ఇప్పుడు?” అని కోప్పడ్డాడు నాన్న. నాకు నిజంగా తెలియదు.. ఒక చిన్న రాతిముక్క అంత షార్ప్ గాయం చేస్తుందని! ఆ తర్వాత గొర్రెలు, మేకలు, పశువులు ఏవి వచ్చినా.. చిన్న కర్రముక్క పట్టుకొని అదిలించడమే తప్ప రాళ్లు విసరడం ఆపేసాను.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి