Kasi Majili Kathalu Episode 64 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితులు.. 1930వ దశకానికి ముందు పన్నెండు సంపుటాలుగా రచించారు. మణిసిద్ధుడనే యతి కాశీయాత్ర చేస్తూ.. మధ్యలో కనిపించిన అనేక విశేషాలను కథలుగా గోపాలకునితో చెప్పడమే కాశీమజిలీ కథలు. ప్రస్తుతం మీరు చదువుతున్న కథ ‘కాశీమజిలీ కథలు’ ఏడో సంపుటంలోనిది.
కుంభకోణంలో రత్నాకరుడనే వర్తకుడు ఉండేవాడు. అతనికి సరైన వయసులో సంతానం కలగలేదు. ఎన్ని సంపదలున్నా వారసులు లేని కొరత రత్నాకరుడు – సులక్షణ దంపతులను బాధిస్తూ ఉండేది. పిల్లల కోసం నిరంతరం తపించిపోయే సులక్షణ.. ఎవరు కనిపించినా, వాళ్ల సంతానం గురించి ప్రశ్నలు వేయడం అలవాటు చేసుకుంది. అలాగే ఒకనాడు తమ ఇంటికి యాయవరపు భిక్షకోసం వచ్చిన బ్రాహ్మణున్నీ ప్రశ్నించింది. అందుకు ఆ బ్రాహ్మణుడు కన్నీరు పెట్టుకుంటూ.. “తల్లీ! నాకిప్పటివరకూ సంతానం కలగలేదు. లేమికంటే బిడ్డల లేమి నన్ను, నా భార్యను ఎక్కువ బాధపెడుతున్నది. యాత్రలు చేస్తే సంతానం కలుగుతుందేమో అనుకుంటే, మాకంత స్తోమత లేక ఊరుకుంటున్నాం” అన్నాడు.
అందుకు సులక్షణ..
“మహాశయా! మీ యాత్రలకు కావాల్సిన డబ్బు నేనిస్తాను. మీరు వచ్చేవరకూ మీ భార్యను నేను పోషిస్తాను. మీరు దేశాలు, తీర్థాలు తిరిగి సంతానం కలిగే మంత్రతంత్రాలేవైనా తెలుసుకుని రండి. మీరు సాధించుకున్న విద్యతో మీతోపాటు, మాకు కూడా సంతానం కలిగేలా చేయండి. అలా చేయగలిగితే మిమ్మల్ని సంపన్నుడిగా చేస్తాను” అన్నది.అందుకు ఆ బ్రాహ్మణుడు సమ్మతించి, తన భార్యను వారి సంరక్షణలో ఉంచి, ఉత్తరదేశ యాత్రలకు వెళ్లాడు. బదరీనాథంలో ఒక అవధూతను ఆశ్రయించి, మూడు సిద్ధౌషధాలను సంపాదించుకుని తిరిగి వచ్చాడు. ఆ ఔషధాల పుణ్యమా అని తొందరలోనే సులక్షణతోపాటు బ్రాహ్మణుని భార్య కూడా గర్భవతి అయింది. శుభలగ్నాలలో ఇద్దరూ పుత్రులను కన్నారు. వైశ్యుని కుమారునికి గురుదత్తుడని, బ్రాహ్మణుని కుమారునికి గదాధరుడని పేరు పెట్టారు. ఇద్దరినీ సహవిద్యార్థులుగా చేసి, చక్కని చదువులు చెప్పించారు. ఇద్దరూ పోటీపడి చదువుకున్నారు. గాఢస్నేహం పెంచుకున్నారు. పదిహేడేళ్ల వయసు వచ్చేసరికి ఇద్దరూ చక్కని పండితులయ్యారు. తన కొడుకు తెచ్చుకున్న పేరు చూసి, రత్నాకరుడు ఆనందించడానికి బదులుగా కొంత బాధపడ్డాడు.
“ఇకనైనా వర్తకం నేర్చుకో నాయనా! చదువుల వల్ల మనకేం ప్రయోజనం?” అనేవాడు కొడుకుతో. “అసలీ చదువుల వల్లే నువ్వు చాలా చెడిపోయావు. లక్షలకొద్దీ కట్నాలిస్తామని ఎన్ని సంబంధాలు వచ్చినా ఇప్పటివరకూ ఒక్కదానికీ అంగీకరించకుండా మమ్మల్ని ఏడిపిస్తున్నావు” అని నిష్టూరమాడేవాడు. గురుదత్తుడు తండ్రి మాటలకు సమాధానమేమీ చెప్పేవాడు కాదు. ఇది పని కాదనుకుని ఒకనాడు గదాధరుని పిలిచి..
“ఏమోయ్! నీ మిత్రుడు పెళ్లాడదలుచుకో లేదా?” అని ప్రశ్నించాడు రత్నాకరుడు.
అందుకు గదాధరుడు నవ్వి.. “వాడు పద్మినీ జాతి స్త్రీని తప్ప పెళ్లాడడట” అని చెప్పాడు.“పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యొద్దని చెప్పు. వేరే జాతివాళ్లను చేసుకుంటే నన్ను మా కులంలో నుంచి వెలేస్తారు” అన్నాడు రత్నాకరుడు గాభరా పడుతూ.అప్పుడు గదాధరుడు మరోసారి నవ్వి.. “పద్మినీ జాతి అంటే.. కావ్యాల్లో వర్ణించినట్లుగా చాలా అందంగా ఉండే ఉత్తమకన్యలని అర్థం బాబాయిగారూ!” అని చెప్పాడు.
“ఎవరెక్కువ కట్నమిస్తే వాళ్లే ఉత్తములు. అయినా సంసారం చేసుకునే స్త్రీలకు అందమెందుకు! మీ కులంలో అలాంటివారు దొరుకుతారేమో.. నువ్వే ఎంచుకుని పెళ్లాడు” అన్నాడు రత్నాకరుడు అమాయకంగా. గదాధరుడు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఊరుకున్నాడు. చివరికి రత్నాకరుడే..
“మీకు డబ్బిస్తాను. మీకు నచ్చిన కన్యలను ఎంచుకుని పెళ్లాడి తీసుకురండి” అని చెప్పాడు.గురుదత్తునికి, గదాధరునికి చాలాకాలం నుంచి అదే ఆలోచన ఉండటంతో వెంటనే అంగీకరించారు. కొంతకాలంపాటు పద్మినీ జాతి స్త్రీలను వెతుకుతూ దేశాటన చేశారు. చివరికి వారి మజిలీ దుర్గానగరానికి చేరుకుంది. ఆ దేశానికి ఆ నగరమే రాజధాని కూడా. అక్కడ ఒక సత్రంలో విడిది చేసి ఉండగా.. కొందరు వర్తకులు, రాజుగారి కొలువులో షరాబుగా పనిచేసే కుముదాంగదుడు అనేవాని కూతురి గురించి మాట్లాడుకోవడం గురుదత్తుని చెవినపడింది.“ఆ పద్మిని ప్రాయానికి మించిన విద్యగలది. అందమైన రూపం, అణకువ కలిగినది. ఆమెకు ఎన్నో కలిగిన సంబంధాలు వస్తున్నాయి. కానీ, విద్యలేనివాణ్ని వరించనని భీష్మించుకుని కూచుంది. సంబంధం కోసం వచ్చిన వారందరినీ వాదనలోకి దింపి, ఓడించి పంపుతున్నది” అని చెప్పుకొంటున్నారు వారు.
“తమ్ముడా! చూడబోతే నీ కోరిక నెరవేరేలా ఉంది. పద వెళ్దాం” అన్నాడు గదాధరుడు. కోమటి బజారులో కుముదాంగదునిది ఏడంతస్తుల మేడ. ఆ ఇంటి దాసీని పిలిచి.. “షరాబుగారు ఉన్నారా?”.. అడిగాడు గదాధరుడు. “కోటకు వెళ్లారు. ఆరు గంటలకు వస్తారు. దయచేసి లోపలికి రండి” అంటూ దాసి వారికి కాళ్లు కడుక్కోవడానికి నీరిచ్చి, చావడిలో కూర్చోబెట్టింది.ఆ సమయానికి తల్లి ఇంట్లో లేనందువల్ల పద్మిని వారికి ఉపచారాలు చేయడానికి పూనుకుంది. పరిచారిక చేత దాహానికి మజ్జిగ పంపింది.
‘అయ్యా! తమరెవరు? ఏం పనిమీద వచ్చారు?!’ అని ఆమె చేత అడిగించింది.“మాది కుంభకోణం. నా మిత్రుడు గురుదత్తుడు వైశ్యుడు. ఇతని తండ్రి కోటీశ్వరుడు. నేను బ్రాహ్మణుడను. మేమిద్దరం దేశాటన చేస్తూ కుముదాంగదుని పేరు ప్రఖ్యాతులు విని, కుల పరిపాటి చొప్పున ఓసారి దర్శనం చేద్దామని వచ్చాం. అంతకంటే వేరేమీ పని లేదు” అని చెప్పాడు గదాధరుడు.అతడు చెప్పిన వివరాలు వినగానే పద్మినికి ఆసక్తి కలిగింది. తలుపు చాటునే నిలబడి వారి మాటలు ఆలకించడం మొదలుపెట్టింది.ఆ చావడిలో అనేక చిత్రఫలకాలు వేలాడగట్టి ఉన్నాయి. వాటిలో శాకుంతలం మొదలైన అనేక ప్రాచీన కావ్యాల ఘట్టాలున్నాయి. ఆ చిత్రాలను చూస్తూ, మిత్రులిద్దరూ ఆయా కావ్యాలలోని విశేషాలను స్మరించసాగారు. కవుల వర్ణనకు, ఆ చిత్రాలు వన్నె తెచ్చాయో.. చెడగొట్టాయో వాళ్లలో వాళ్లు తర్కించుకోసాగారు. వారి మాటలు పద్మినికి ఆనందాన్ని కలగచేస్తున్నాయి. కొంతసేపటికి మరో పరిచారిక ఫలహారాలు తీసుకువెళ్లింది. “అమ్మాయీ! మీ యజమాని కుమార్తె పద్మిని చాలా చదువుకున్నదట కదా! ఆమెతో వాదించాలని ముచ్చటగా ఉంది. కొంచెం పిలవగలవా?” అని అడిగాడు గదాధరుడు.అందుకా పరిచారిక..
“అయ్యా! ఆమె చదువు గిదువు సంగతి నాకేమీ తెలియదు. కానీ, గొప్పగొప్ప పండితులే ఆమె ముందు ఓడిపోయామని చెప్పి వెళ్లిపోతుంటారు. మీరామెకు సమాధానం చెప్పగలరా?” అని పలికింది.తలుపు చాటునుంచి పద్మిని ఆమెను చిరాకు పడుతూ..
“ఛీ మూర్ఖురాలా! వారు మహాపండితులు. నీకు తెలియక ఏదేదో వాగుతున్నావు. ఇటురా” అని కేక వేసింది.“కొద్దిసేపటిలో మా గురువుగారు వస్తారు. వారితో మీరు వాదించవచ్చు” అని మిత్రులకు చెప్పింది. ఆమె చెప్పినట్లే ఒక గురువు వచ్చాడు. మిత్రులిద్దరితోనూ కాసేపు విద్యా విషయకమైన చర్చలు జరిపాడు. ఆ తర్వాత..“పద్మినీ! ఇన్నాళ్లకు నీ కోరిక నెరవేరింది. వీరు నువ్వు నిజంగా చూడదగిన పండితులు” అన్నాడు ఆమెకు వినిపించేలా.
“గుర్తించాను గురువుగారూ! ధన్యోస్మి” అన్నది పద్మిని గడప దాటి ఈవలకు రాకుండానే. ఇంతలో ఆమె తండ్రి కుముదాంగదుడు వచ్చాడు. పరిచయాలు పూర్తయ్యాయి. ఆవేళ గురుదత్తునికి వారింట్లోనూ, గదాధరునికి గురువు ఇంటిలోనూ భోజనాలు ఏర్పాటయ్యాయి. కుముదాంగదుడు తెల్లవారగానే కూతురిని పిలిచి.. “ఈ కుర్రవాడు బాగున్నాడమ్మాయీ! నీ అభిప్రాయమేమిటి” అని అడిగాడు తల్లి సమక్షంలో.అందుకు పద్మిని సిగ్గుపడుతూ..
“మీరు పెద్దవారు. మీకంటే నాకెక్కువ తెలియదు” అన్నది. తర్వాత గురుదత్తుని వద్దకు వెళ్లి.. “బాబూ! నాకు పద్మిని ఒక్కతే కూతురు. ఆమెను విడిచి ఉండలేను. నాకు మీ ఐశ్వర్యంతో పనిలేదు. నాకున్నదే చాలు. నువ్వు ఇల్లరికం ఉండగలిగితే.. ఈ ముహూర్తానికే వివాహం జరిపిస్తాను” అని అడిగాడు.“అయ్యో! వీడు కూడా తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం కదా?! ఇల్లరికం ఎలా కుదురుతుంది?” అని గదాధరుడు ఏదో చెప్పబోయేంతలోగానే.. గురుదత్తుడు ఇల్లరికానికి అంగీకారం తెలిపాడు.విద్యలోనూ రూపంలోనూ కూడా ఈడూజోడూ అయిన గురుదత్తుడు – పద్మిని వివాహం తొందరలోనే అంగరంగ వైభవంగా జరిగింది. నిమిషమైనా ఎడబాయని జంటగా పరస్పర అనురాగం కలిగి ఇద్దరూ కొంతకాలం హాయిగా కాపురం చేశారు.
ఇంతలో అనుకోని ఉపద్రవం దుర్గానగరాన్ని ఏలే ప్రభువు రూపంలో వచ్చిపడింది. ఆ రాజ్యానికి సురూపుడు కొత్తగా రాజయ్యాడు. అతణ్ని యవ్వనమదం, రాజ్యమదం కలిసి వ్యసన లోలునిగా తయారుచేశాయి. అతను పరస్త్రీ సంగమంలో రావణున్నే మించిపోయాడని అందరూ చెప్పుకొంటారు. రూపవతి అయిన యువతి అతని కంట్లో బడితే చెరబట్టక మానడు. వాడు చేసే సకల దుశ్చర్యలలోనూ గోమిని అనే వారకాంత సహాయ పడుతుండేది. ఒకనాడు వాడు క్రీడాసౌధంలో విశ్రమించి ఉండగా గోమిని వచ్చింది. కన్నులు మూసుకుని ఉన్న సురూపుని మేనిపై చేయివేసి.. “అబ్బా! ఏమిటింత వేడిగా ఉంది. జ్వరం వచ్చిందా?” అని పరామర్శించింది.
“ఇది మదనతాపం” అన్నాడు బాధగా సురూపుడు.“రాజా! నిన్నింతగా విరహానికి గురిచేసిన కామిని ఎవరో చెప్పు. వేగిరం తీసుకొచ్చి నీ పాదాక్రాంతురాలిని చేస్తాను” అన్నది గోమిని.
“ఎవరో తెలియదు. మొన్నటి విజయదశమి ఉత్సవంలో పట్టపుటేనుగునెక్కి వేంకటేశ్వరుని రథంతో పాటు ఊరేగుతున్నాను. ఒక మేడనుంచి ఒక వాలుకన్నుల చిన్నది ఈవలికి వచ్చి స్వామికి నివాళి ఇచ్చింది. ఆ వెలుతురులోనే ఆమె చక్కదనమంతా కన్నుల పండువగా చూశాను. ఆమె కన్నులు.. యువకులను వలవేసి లాగే యంత్రంలోని చేపపిల్లలాగా ఉన్నాయి. ఆమె ఒయ్యారము, వగలు.. ఆ బింకము, ఆ పొంకము.. మానవ కాంతలకు ఉంటాయంటే నమ్మలేం. అప్సరలు కూడా ఆమెకు దాస్యం చేయవలసిందే. ఆమెను చూడగానే మదన పీడితుడినై అంబారీపైనే మూర్ఛపోయాను. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు” అని చెప్పాడు సురూపుడు.
“నాకు తెలియకుండా అంత చక్కనిపిల్లను ఏ వీధిలో చూశావు.. ఏ ఇంటిలో చూశావు?” అడిగింది గోమిని.“చెప్పాను కదా.. ఆ సమయంలో నాకు ఒంటిమీద తెలివి లేదు. గుర్తులేదు” అన్నాడు సురూపుడు.
అప్పుడు కొంతసేపు ఆలోచించిన మీదట గోమిని ఒక సలహా చెప్పింది. దానిప్రకారం మరునాడే ప్రధానమంత్రిని రప్పించి సురూపుడు ఇలా చెప్పాడు.“మనం మొన్న ఒక పొరబాటు చేశాం. శివకేశవులిద్దరికీ ఉత్సవం చేయకుండా విష్ణువుకు మాత్రమే చేశాం. నిన్న రాత్రి శివుడు నా కలలోకి వచ్చి.. ‘నన్ను అవమానం చేస్తావా!?’ అని నానా యాగీ చేశాడు. దేవతా ద్రోహం వల్ల ప్రమాదం తప్పదు. రేపు సోమవారం శివుడికి ఉత్సవం చేద్దాం. మొన్న వేంకటేశ్వరుణ్ని ఏయే వీధులు తిప్పామో.. ఆ వీధుల్లోనే శివుణ్ని కూడా ఊరేగిద్దాం” అని చెప్పాడు.రాజాజ్ఞ మేరకు సర్వం సిద్ధమైంది. స్వామి రథానికి ముందు పల్లకిలో గోమిని, దానికి ముందు పట్టపుటేనుగుపై సురూపుడు వెళుతుండగా.. మేళతాళాలతో ఊరేగింపు బయల్దేరింది.కోమటి వీధిలోకి వచ్చేసరికి.. మబ్బునుంచి వెలువడిన మెరుపుతీగలాగా పట్టుచీర ధరించి వచ్చి.. స్వామికి నీరాజనం ఇచ్చింది పద్మిని. సురూపుడు ఆమెను చూడగానే మూర్ఛబోయిన వాడల్లా తమాయించుకుని.. ‘నా మనసును దోచుకున్నది ఆమే!’ అని గోమినికి తెలిసేలా చేశాడు. గోమిని పల్లకి దిగి, పద్మిని వివరాలు సేకరించింది. “ఇది మన షరాబుగారి ఇల్లే! ఆమె ఆయన కూతురు పద్మిని” అని సురూపునికి చెప్పింది. ప్రసాదం స్వీకరించి, మేళం చూడకుండానే పద్మిని లోపలికి వెళ్లిపోయింది. ఆమె దూరం కాగానే అంబారీ మీదనున్న సురూపుడు మరోసారి మూర్ఛపోయాడు.
(వచ్చేవారం.. అతివ సాహసం)
-అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ