Kasi Majili Kathalu Episode 104 ( కాశీ మజిలీ కథలు )జరిగిన కథ : కారణజన్ముడై పుట్టిన శ్రీదర్శనుడు జూదక్రీడ వల్ల ఆస్తి మొత్తం కోల్పోయాడు.ముఖరకుడు అనే మిత్రుడు అతణ్ని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమింప చేశాడు. మిత్రులిద్దరూ కలిసి యాత్రలు చేస్తుండగా.. ఒక అడవిలో శ్రీదర్శనుడికి ఒక అందమైన కన్య కనిపించింది.
“నాపేరు పద్మిష్ట. మాది సుఘోషమనే అగ్రహారం. మా తల్లిదండ్రులకు మేం ఇద్దరు పిల్లలం. మా అన్న ముఖరకుడు జూదరియై ఇల్లు పట్టకుండా తిరుగుతుండేవాడు. వాడి చర్యలతో బెంగటిల్లిన మా తల్లి మరణించింది. ఇంతలో మా అన్న దేశాలు పట్టిపోయాడు. దాంతో నన్ను వెంటబెట్టుకుని మా తండ్రి ఉజ్జయినికి ప్రయాణం కట్టాడు. అలా ఈ అడవికి చేరుకున్నాం. ఇక్కడికి దగ్గరలో ఒక భిల్లుగూడెం ఉంది. దానిని వినాయకుడనే వాడు పాలిస్తున్నాడు. వాడొక బందిపోటు దొంగ. అడవికి వచ్చే బాటసారులను దోచుకుంటాడు. వాడు మా తండ్రి తల బద్దలుకొట్టి దోచుకున్నాడు. నన్ను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయడం కోసం తన ఇంట్లోనే బంధించాడు. ఆ కొడుకిప్పుడు దొంగతనాల కోసం దేశాలమీదికి వెళ్లాడట. వాడింకా రాలేదు కాబట్టి నేను బతికిపోయాను. రేపోమాపో వాడికి బలైపోవాలి. మీరు ఈ ప్రాంతాన్ని గురించి తెలియకపోవడం వల్ల ఇక్కడికి వచ్చినట్లున్నారు. తొందరగా వెళ్లిపోండి” అని చెప్పిందామె.
సరిగ్గా ఆమె మాటలు పూర్తవుతుండే సమయానికి ముఖరకుడు అక్కడికి వచ్చాడు. చెల్లెల్ని గుర్తించాడు. తండ్రి మరణానికి చింతించాడు.
“అన్నా! నేనెక్కువసేపు ఇక్కడే ఉంటే వినాయకుడికి అనుమానం వస్తుంది. ఇప్పుడు గూడెంలో మగవాళ్లెవరూ లేరు. వినాయకుడు మాత్రమే ఉన్నాడు. ఒక్కడే అయినా వాడితో ప్రమాదమే” అన్నది పద్మిష్ట.
శ్రీదర్శనుడు అప్పటికప్పుడు ఒక ఉపాయం ఆలోచించాడు. దానిప్రకారం పద్మిష్ట ఊళ్లోకెళ్లింది. చెరువుగట్టున ఎవరో బాటసారులు ఉన్నారని వినాయకుడితో చెప్పింది. దోచుకోవడానికి ఏదైనా దొరుకుతుందనే ఆశతో అతను వచ్చాడు. ఈలోపుగా ముఖరకుడు ప్రాణావసాన దశలో ఉన్నట్లు నటించసాగాడు. అతని ముందు కూర్చుని శ్రీదర్శనుడు పెద్దగా రోదించసాగాడు. వినాయకుడు మెల్లిగా అతని దగ్గరికొచ్చి..
“ఏమైంది బాబూ!” అని అడిగాడు.
“ఇతను నా మిత్రుడు. ఇప్పుడో మరికాసేపట్లోనో అన్నట్లున్నాడు. ప్రాణాలు పోయేముందు తన సంపదనంతా దానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడికి దగ్గరలో ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నారా?” అని ప్రశ్నించాడు అమాయకంగా శ్రీదర్శనుడు.
“లేకపోవడమేం.. తీసుకొస్తానుండండి” అంటూ వినాయకుడు వెళ్లాడు.
తానే బ్రాహ్మణ వేషం ధరించి వచ్చాడు.
“దానం ఇచ్చేముందు కాళ్లు కడగనివ్వండి” అంటూ వినాయకుణ్ని ఎత్తి చెరువులో పడేశాడు ముఖరకుడు.
వాడు తలకిందులుగా చెరువులో పడ్డాడు. కాళ్లు రెండూ ఆకాశాన్ని చూస్తున్నాయి. క్షణం ఆలస్యం చేయకుండా చెరువులో దూకిన శ్రీదర్శనుడు ఆ కాళ్లను దొరకబుచ్చుకున్నాడు. తన రెండుకాళ్ల మధ్యలో వాడి నడుమును బిగించి వేశాడు. కొద్దిసేపటికే ఊపిరాడక భిల్లు నాయకుడు ప్రాణం విడిచాడు.
ఆటంకం తీరడంతో పద్మిష్టతో కలిసి స్నేహితులిద్దరూ చకచకా అక్కణ్నుంచి కదిలారు. కానీ, పదిరోజులపాటు ప్రయాణం చేసిన తరువాత కానీ ఆ అడవికి అంతం కనిపించలేదు. చివరికి మాళవదేశ రాజధాని అయిన శోభానగరానికి చేరుకోగలిగారు.
ముగ్గురూ ఆ నగర సౌందర్యాన్ని గమనిస్తూ వీధులవెంట నడుస్తున్నారు. ఒకచోట భవన ద్వారానికి ముందు ఒక ప్రకటన కనిపించింది.
‘ఇది సత్రము. ఇక్కడ జూదరులకు మాత్రమే భోజనం పెట్టబడును’ అని రాసి ఉందా ప్రకటనలో.
“చూశావా.. మిత్రమా! ఆఖరికి మనవంటి జూదగాళ్లను కూడా ఆదరించే నగరానికి చేరుకోగలిగాం. బహుశా జూదంలో బాగా లాభాలు గడించినవాడెవడో ఈ సత్రం కట్టించి ఉంటాడు” అన్నాడు శ్రీదర్శనుడు నవ్వుతూ.
ముగ్గురూ లోపలికి వెళ్లి సత్రం అధికారిని చూశారు.
“అయ్యా! మేము దూరదేశస్థులం. జూదంలో ఐశ్వర్యమంతా కోల్పోయి, కట్టుబట్టలకు కూడా కరువు వాచిపోయాం. మాకు గదులిచ్చి, భోజనం పెడతారా!?” అని అడిగారు.
“దానికేం” అంటూ ఆ అధికారి అప్పటికప్పుడు వారిపేర్లు పద్దుల్లో రాసుకున్నాడు.
భోజనాలు పూర్తయిన తరువాత మిత్రులిద్దరూ మళ్లీ సత్రం అధికారి దగ్గరికి చేరుకున్నారు.
“కాశీ, గయల్లో యాత్రలు చేసేవారికి సత్రాలు వేసినట్లు.. మీరిలా జూదరులకు సత్రం నిర్మించడం ఎందుకు?! మీ ఈ నిర్ణయానికి ఏదైనా కారణముందా?” అని ప్రశ్నించాడు శ్రీదర్శనుడు.
అందుకా అధికారి ఇలా చెప్పసాగాడు..
“మేమే చెప్పాల్సింది. మీరే అడిగారు కనుక, సంతోషంగా చెబుతాను. ఈ మాళవ దేశాన్ని శ్రీసేనుడనే మహారాజు పాలిస్తున్నాడు. ఆయన చాలా మంచివాడు. కానీ పూర్వకర్మవల్ల పాపం ఆయనకు రాజయక్ష్మ (క్షయ) రోగం పట్టుకుంది. ఎన్ని మందులకూ తగ్గింది కాదు. ఆరుమాసాల కిందట ఒక తాంత్రికుడు ఈ ఊరికి వచ్చాడు. రాజు రోగాన్ని పరీక్షించి, తాను భేతాళ తంత్రంలో ఒక యాగం చేస్తే రాజుగారి రోగం చేత్తో తీసేసినట్లు పోతుందన్నాడు.
కానీ ఆయనకు ఆ యాగం కోసం.. భేతాళవశ్యం చేసిపెట్టేందుకు ఒక మనిషి కావాలి. ఆ మనిషి అత్యంత సాహసవంతుడై ఉండాలి. భయపడేవాణ్ని భేతాళుడు మింగేస్తాడు. అందువల్ల మా రాజ్యంలో సాహసికులందర్నీ పిలిపించాం. కొందరు ముందే తమవల్ల కాదనేశారు. మరికొందరు ప్రయత్నించి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. చివరికి మా మంత్రిమండలి సుదీర్ఘంగా ఆలోచించి.. లోకంలో జూదరుల వంటి సాహసికులు ఉండరనే నిర్ణయానికి వచ్చారు. జూదరులు భార్యాపుత్రులను విడిచిపెట్టి, ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. వారికి భయమనే మాటలేదు. చెట్లకింద పడుకుంటారు. ప్రాణాలకు ఆశపడరు. జూదం కోసం ఎంతకైనా తెగిస్తారు. కనుక, రాజ్యంలో ఉన్న ధూర్త జూదరులందరినీ పోగేస్తే ఫలితం ఉండవచ్చని భావించి ఈ సత్రం కట్టించారు. నన్నిక్కడ నియమించారు” అని చెప్పి..
“ఇప్పుడు చెప్పండి బాబులూ! మీ ఇద్దరిలో ఎవరైనా ప్రయత్నిస్తారా? ఇందులో నెగ్గితే మీకు అర్ధరాజ్యం సంక్రమిస్తుంది” అని అడిగాడు.
ఆ కథ వింటూనే..
“నేను వస్తాను. మీ తాంత్రికుడు ఎక్కడున్నాడో చెప్పండి” అన్నాడు శ్రీదర్శనుడు.
“మిత్రమా! తొందరపడకు. ఆ భేతాళుడు అనేక వికారాలు ప్రదర్శిస్తాడట. వాడు ఒక్కసారి బొబ్బపెడితే ఎంతటివాడికైనా గుండెనిబ్బరంగా ఉండలేదట” అని నిరుత్సాహ పరిచాడు ముఖరకుడు.
“ఫరవాలేదయ్యా! ఈ మహారాజుకు జబ్బు నయమైతే, మనకు అర్ధరాజ్యం వస్తుంది. పూర్వం విక్రమార్క మహారాజు ఇటువంటి సాహసం చేసి.. చరిత్రలో నిలిచిపోయాడు. నన్ను కూడా చెయ్యనియ్యి” అని ముఖరకుడితో చెప్పి సత్రం అధికారివైపు తిరిగి..
“పదండి పోదాం” అన్నాడు శ్రీదర్శనుడు.
“ఇప్పుడే కాదు.. అమావాస్యకు ముందురోజు” అని చెప్పాడు సత్రం అధికారి.
మూడోనాటికి బహుళ చతుర్దశి రానేవచ్చింది. శ్రీదర్శనుడు స్నానం చేసి, పట్టువస్ర్తాన్ని ధరించాడు. రాత్రి కాగానే కత్తి చేతపట్టుకుని శ్మశాన వాటికకు వెళ్లాడు. పూడ్చిపెట్టిన శవాలను బయటికి లాగి పీక్కుతింటున్న నక్కలను చూస్తూ.. చితినుంచి జారి కిందపడి బిర్రబిగిసిపోయిన కొరివి దయ్యాలను చూస్తూ.. కాలుతూ కాలుతూ పెఠేల్మని పేలుతున్న పుర్రెల శకలాలు మీద పడుతుండగా దులపరించుకుంటూ ముందుకు వెళ్లాడు.
అక్కడ తంత్రసాధకుడు కనిపించాడు. ఒంటినిండా బూడిద పూసుకుని ఉన్నాడు. శవాల జుట్టుతో పేనిన యజ్ఞోపవీతాన్ని ధరించాడు. ఒక చెట్టుమొదట హోమానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు.
శ్రీదర్శనుడు అతనికి నమస్కరించి..
“మహాత్మా! నాకు కర్తవ్యం బోధించండి” అన్నాడు.
తాంత్రికుడు గారపళ్లతో నవ్వాడు.
“మహావీరా! ఇక్కడికి రెండుక్రోసుల దూరం పశ్చిమంగా పోతే ఒక శింశుపా వృక్షం కనిపిస్తుంది. దాని చిగుళ్లు చితాగ్నిచేత మాడిపోయి కనిపిస్తాయి. దానిపై ఒక పీనుగు ఉంటుంది. దానిని నలగకుండా భుజంపై వేసుకుని ఇక్కడికి రావాలి. జడుసుకున్నావంటే ప్రమాదం రాగలదు” అని గంభీరంగా పలికాడు.
శ్రీదర్శనుడు ఆ సాధకుడు చెప్పిన గుర్తుల ప్రకారం అక్కడికి వెళ్లాడు. పీనుగుకోసం చెట్టెక్కేసరికి రెండోకొస నుంచి వేరొకడు కనిపించాడు. తనకంటే ముందు చెట్టునుంచి పీనుగును దింపబోయాడు. శ్రీదర్శనుడు అడ్డుకున్నాడు. కానీ వాడు ఆ పీనుగును విడిచిపెట్టలేదు.
ఇద్దరికీ గొడవ జరిగింది. ఇంతలో భేతాళుడు పీనుగులో ప్రవేశించి ప్రళయ భయంకరంగా పెడబొబ్బ పెట్టాడు. ఆ ధ్వని విని, రెండోవాడికి గుండె పగిలింది. నేలపై కూలిపోయాడు.
శ్రీదర్శనుడు కొద్దిగా కూడా జడవకుండా ఆ శవాన్ని భుజంమీద ఎక్కించుకుని, ముందుకు నడవసాగాడు.
భేతాళుడు అంతలో శ్రీదర్శనుడి భుజంమీది పీనుగులోంచి ఇవతలికి వచ్చి.. అప్పుడే చచ్చిన రెండోవాడిలో ప్రవేశించాడు. శ్రీదర్శనుడికి అడ్డంగా నిలిచాడు.
“నిలువు నిలువు! వీడినెక్కడికి తీసుకుపోతున్నావు. వీడు నాకు మిత్రుడు. వీణ్ని తీసుకుపోనివ్వను” అన్నాడు.
“కాదు వీడు నాకు మిత్రుడు. నేనే తీసుకుపోతాను” అన్నాడు శ్రీదర్శనుడు.
“నిదర్శనం చూపగలవా?” అని ప్రశ్నించాడు చనిపోయినవాడి శరీరంలో ప్రవేశించిన భేతాళుడు.
అప్పుడు శ్రీదర్శనుడు, తన భుజంపై ఉన్న ప్రేతంతో..
“ఓయీ! నువ్వు మా ఇద్దరిలో ఎవరికి మిత్రుడివో నువ్వే చెప్పు” అని అడిగాడు.
“మీ ఇద్దరిలో ఎవరు నాకు సరిపడేంత ఆహారం ఇవ్వగలరో వారికే నేను మిత్రుణ్ని” అని చెప్పింది ప్రేతం. అప్పుడు రెండోవాడు..
“నా దగ్గరేమీ లేదు. అతనేమైనా ఇస్తే పుచ్చుకో!” అన్నాడు.
వెంటనే శ్రీదర్శనుడు..
“ఇదిగో నీకు తగిన ఆహారం ఇస్తున్నాను. తీసుకో!” అంటూ తన చేతి కరవాలంతో రెండోవాడి శిరస్సు ఖండించబోయాడు. దాంతో అందులోని భేతాళుడు ఇవతలికి వచ్చేశాడు. అంతేకాదు ఆ శవాన్ని కూడా మాయం చేశాడు.
తిరిగి శ్రీదర్శనుడి భుజంమీదనున్న ప్రేతంలో ప్రవేశించి..
“ఏదీ నాకు ఆహారం ఇస్తానన్నావు కదా!” అని పలికాడు.
అప్పుడు శ్రీదర్శనుడు కరవాలంతో తన శిరస్సునే ఖండించుకోబోయాడు. దాంతో భేతాళుడు ప్రసన్నుడయ్యాడు.
“మహావీరా! నీ సాహసానికి మెచ్చుకుంటున్నాను. నీ దేహం నశించకుండు గాక! నేను నీకు వశుడినయ్యాను. నువ్వు కోరుకున్న చోటికి నన్ను తీసుకుపో. కానీ ఒకమాట చెబుతున్నాను విను. ఆ సాధకుడికి యాగాన్ని పూర్తిచేసే శక్తి లేదు. దానిని కూడా నువ్వే పూర్తిచేయాల్సి ఉంటుంది” అని పలికాడు.
ఆ మాటలు విని శ్రీదర్శనుడు సంతోషించి, ప్రేతాన్ని మోసుకుంటూ మాంత్రికుని వద్దకు వెళ్లాడు. అక్కడ రక్తంతో అలికి, మానవుల ఎముకల పొడితో చేసిన ముగ్గుకు చుట్టూ నూనె దీపాలు వెలుగుతున్నాయి. వాటి మధ్యలో శ్రీదర్శనుడు తాను తెచ్చిన ప్రేతాన్ని పడుకోబెట్టాడు. దానికి ఎర్రని పూలమాలను వేసి, లేపనాలను పూశాడు. మాంత్రికుడు ఆ ప్రేతం గుండెలమీద కూర్చున్నాడు. భేతాళుణ్ని ఆవాహన చేసి, ప్రేతం నోటిలో ఎముకలతో హోమం చేయసాగాడు.
ఆ సమయంలో ప్రేతం నోటిలోనుంచి పెద్దజ్వాల ఒకటి పైకి లేచింది. సాధకుడు ఆ వేడిని తట్టుకోలేకపోయాడు. చప్పున శవంనుంచి దిగిపోయాడు. వెంటనే శవంలోని భేతాళుడు మహోగ్రంగా నోరుతెరిచి ఆ మాంత్రికుణ్ని యధాతథంగా మింగేశాడు. శ్రీదర్శనుడు ఆ ఉపద్రవాన్ని చూసి, హాహాకారం చేస్తూ..
“ఆ సాధకుణ్ని బయటికి ఉమ్మెయ్. లోపలికి మింగేశావంటే నిన్నిప్పుడే నరికేస్తాను” అని పలికాడు.
అందుకు భేతాళుడు..
“సాహసవీరా! ఆ సాధకుడు మళ్లీ బతకడం కల్ల. నేను నీ సాహసానికే ప్రీతి చెందాను. ఇప్పుడు నువ్వు నా నోటినుంచి వెలువడుతున్న ఆవాలను తీసుకో. వీటిని నూరి, ఆ రాజు గుండెలకు రాయి. దాంతో అతని రోగం కట్టిపోతుంది” అని పలికాడు.
శ్రీదర్శనుడు నమస్కరించి..
“భేతాళరుద్రా! అలాగే చేస్తాను. కానీ ఆ రాజ్యప్రజలు నామాట నమ్మకపోతే ఏం చేయాలి?! సాధకుణ్ని నేనే చంపి నాటకమాడుతున్నానంటే నా నిజాయతీని ఎలా నిరూపించుకోగలను?” అని ప్రశ్నించాడు.
అందుకు శవంలోని భేతాళుడు..
“వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చి ఈ శవం కడుపు చీల్చి చూపించు. ఇందులో ఆ మాంత్రికుడి శరీరం యధాతథంగానే నిర్జీవంగా కనిపిస్తుంది” అని పలికాడు.
శ్రీదర్శనుడు అప్పుడే శోభానగరానికి వెళ్లాడు. అతను అనుకున్నట్లే అందరూ సాధకుణ్ని శ్రీదర్శనుడే చంపాడని అనుమానించారు. వారి అనుమానాన్ని నివృత్తి చేయడంతో పాటు.. శ్రీసేన మహారాజుగారి వ్యాధిని కూడా నయం చేశాడు శ్రీదర్శనుడు.
(వచ్చేవారం.. విగ్రహం చేసిన పెళ్లి)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ