జరిగిన కథ : కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితులు 1930వ దశకంలో 12 భాగాలుగా రచించారు. ప్రస్తుత కథ 8వ భాగంలోని కథలో కథగా కనిపిస్తుంది. చింతామణి – లీలాశుకులకు సంబంధించి.. మన సాహిత్యంలో అనేక గాథలున్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని సుబ్బన్న దీక్షితులు తనదైన శైలిలో భక్త చింతామణి కథను రచించారు.
ప్రయాగలో చింతామణి అనే భోగకాంత ఉండేది. ఆమె భోగకులానికి చెందినదే కానీ, వేశ్య కాదు. చాలా శృంగార శతకాలు, కామతంత్రాలను చదువుకుంది. వాటితోపాటు సాహిత్యాన్ని మధించింది. పురాణాలను పరిశీలించింది. ఆస్తికురాలై, మంచి ప్రవర్తన కలిగి ఉండేది. తాను కులంలోని ఇతరుల్లా ఉండనని, ఏకచారిణి అవుతానని నిర్ణయించుకుంది. వివాహం లేకపోయినా సరే, కేవలం ఒక్కరినే వరిస్తానని, అయితే అటువంటివాడు కచ్చితంగా గొప్ప వంశంలో పుట్టినవాడై ఉండాలని షరతు పెట్టింది.
పాపం.. ఆమె తల్లి, కూతురికి ఈ విషయంలో ఎంతగానో నచ్చజెప్పింది. అటువంటి మగవాడు లభించడం కష్టసాధ్యమని, ఒకవేళ లభించినా కడదాకా నీతో ఉండడని చెప్పిచూసింది. కానీ చింతామణి ఒప్పుకోలేదు. చివరికి ఆ బెంగతోనే ఆ తల్లి చనిపోయింది. ప్రయాగలోనే లీలాశుకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తల్లిదండ్రులకు లేకలేక పుట్టినందువల్ల గారాబంగా పెరిగాడు. చదువు సంధ్యలు అబ్బలేదు. యుక్తవయసు వచ్చేసరికి తల్లిదండ్రులు గతించారు. గొప్ప ఆస్తిపరుడు కాబట్టి తమ పిల్లనిస్తామని కొందరు ముందుకొచ్చారు. కానీ, తాను విరక్తునిలా నటించి, వారిని తోసిపుచ్చేవాడు.
కులాచారాన్ని తుంగలో తొక్కి దురలవాట్లకు లోనయ్యాడు లీలాశుకుడు. పాచికలాటలో పొద్దస్తమానం కాలక్షేపం చేస్తుండేవాడు. స్నేహితులైన విటులతో కలిసి తరచూ వేశ్యల ఇళ్లకు వెళ్లి వస్తుండేవాడు. ఒకసారి అతను చింతామణి చేసిన శపథం గురించి విన్నాడు.
ఆమె ఇంటికి వెళ్లాడు.
మరో మన్మథునిలా వెలిగిపోతున్న లీలాశుకుణ్ని చూడగానే చింతామణి వలచింది. శుభముహూర్తంలో లీలాశుకుడు ఆమెకు కన్నెరికం చేశాడు. ఆనాటినుంచి ఇది పగలు, ఇది రాత్రి అని తేడాలు లేకుండా మదనక్రీడలను బ్రహ్మమయంగా భావిస్తూ జీవితాన్ని రాగమయం చేసుకున్నాడు లీలాశుకుడు. కడకు సంధ్యావందనం కూడా మానేశాడు. తన ధ్యానం, ధ్యాస అంతా చింతామణిపైనే నిలిపాడు.
అతని మోహాతిరేకాన్ని గమనించి చింతామణి కూడా తగినరీతిగా ప్రీతి చూపించసాగింది. త్రికరణశుద్ధిగా అతనే తన భర్త అని ఎంచుకుంది. లీలాశుకుడు తన ఆస్తినంతా చింతామణి వశం చేశాడు. కానీ, ఆమె దానికి ఆశపడలేదు. తన ఆస్తితోపాటుగా అతని ఆస్తిని కూడా జాగ్రత్తగా కాపాడసాగింది.
వాళ్లిద్దరి అనుబంధం దాదాపు అయిదేళ్లపాటు నిరాఘాటంగా కొనసాగింది. లీలాశుకునిలో తొలినాటి మరులింకా తెరలు వీడలేదు. చింతామణి అప్పుడప్పుడే పరిపక్వత సాధించగలుగుతున్నది.
అలా ఉండగా ఒకనాడు చింతామణి విష్ణ్వాలయానికి వెళ్లింది. అక్కడ పురాణ ప్రవచనంలో భాగంగా పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించడం అత్యవసరమని పౌరాణికుడు చెప్పడం విన్నది. ఆ మాటలే చెవులలో మారుమోగుతుండగా ఇంటికి తిరిగి వచ్చింది.
“లీలాశుకా! నువ్వు మీ తల్లిదండ్రులకు ఆబ్దికం పెడుతున్నావా?” అని ప్రశ్నించింది.“నాలుగైదు సంవత్సరాల నుంచి తీరికలేక పెట్టడం లేదు” అని జవాబిచ్చాడు లీలాశుకుడు.“నాతో స్నేహం మొదలుపెట్టిన దగ్గరనుంచే మానేసి ఉంటావు. అయ్యయ్యో! ఎంత పాపాత్మురాలినయ్యాను. నీతోపాటు నేను కూడా రౌరవ నరకంలో పడిపోవాల్సిందే కదా!” అని బాధ కనబరిచింది చింతామణి.
“ఈవేళ పురాణంలో విన్నావా ఈ మాటలన్నీ” అన్నాడు లీలాశుకుడు హేళన పూర్వకంగా.“పితృదేవతలను ఆరాధించనివాడు జీవచ్ఛవంతో సమానమట. వాడి ముఖం చూస్తేనే పాపం వస్తుందట” అన్నది చింతామణి చింతాక్రాంతయై.“ఇవన్నీ జనాల నుంచి డబ్బు గుంజుకోవడం కోసం కొందరు రాసిన రాతలు. వాటిని నమ్మబోకు. ఆరిపోయిన దీపానికి చమురుపోస్తే ఎంత లాభమో.. చచ్చినవాడికి తద్దినం పెట్టినా అంతే లాభం” అని లీలాశుకుడు ఊరడించబోయాడు.కానీ చింతామణి అంగీకరించలేదు.
“ఆహా! నీలాంటి మహానుభావులు పుట్టడం వల్లనే సంఘంలో కులాచారాలు నశిస్తున్నాయి. ఇక నీ నాస్తికవాదాలు కట్టిపెట్టు. నీకు నీ తల్లిదండ్రుల తిథులు ఎప్పుడో తెలుసా?! గుర్తులేకపోతే వెళ్లి నీ పురోహితుణ్నే అడిగి తెలుసుకుంటాను” అని అక్కణ్నుంచి వెళ్లిపోయింది. మరునాడే పురోహితుని వద్దకు వెళ్లి లీలాశుకుని తండ్రి తిథిని తెలుసుకుంది. ఆనాటికి లీలాశుకుణ్ని తప్పకుండా పంపిస్తానని చెప్పింది.
“అమ్మాయీ! బ్రాహ్మణవర్ణంలోని వారు పితృతిథికి వెనక, ముందు రోజుతో కలిపి మూడురోజులపాటు దీక్షగా ఉండాలి. భోజన నియమాలు పాటించాలి. వేశ్యాసాంగత్యం పనికిరాదు. వీటన్నిటికీ లీలాశుకుడు ఒప్పుకొంటాడా?” అని ప్రశ్నించాడు పురోహితుడు.“నేను ఎలాగైనా ఒప్పిస్తాను. దయచేసి ఆ ఏర్పాట్లన్నీ మీ ఇంటిలోనే చేయించండి” అని కోరి, అక్కణ్నుంచి బయల్దేరింది చింతామణి.
లీలాశుకుడు అంగీకరించలేదు.
“అన్నిరోజులు నిన్ను చూడకుండా ఉండలేను. కావాలంటే తిథిరోజున దూరంగా ఉంటాను” అన్నాడు.
ఆ మాత్రమైనా అంగీకరించినందుకు చింతామణి సంతోషించింది. తండ్రి ఆబ్దికం రానేవచ్చింది. కోడికూసింది మొదలు చింతామణి అతణ్ని నిద్రలేపడానికి ఎంతగానో ప్రయత్నించింది. ఎట్టకేలకు సూర్యోదయమైన గడియకు నిద్రలేచాడు లీలాశుకుడు. అడుగడుగునా వెంట తరుముతుండగా కాలకృత్యాలు తీర్చుకుని, పురోహితుని ఇంటికి వెళ్లాడు. అప్పటికే పురోహితుడు..
“మంత్రపూర్వకంగా కార్యక్రమం పూర్తి చేయడానికి సమయం సరిపోదు” అంటూ గింజుకుంటున్నాడు.
“గురువర్యా! మంత్రంలో ఏమీ లేదు. ఆచార్యులు చెప్పిన తంత్రాన్ని పాటిస్తే చాలు” అని వితండవాదం చేశాడు లీలాశుకుడు.
పురోహితుడు నెత్తికొట్టుకుంటూ కార్యక్రమం పూర్తిచేశాడు. ఆనాటి సాయంత్రం చింతామణి ఇంటికి పోవడానికి వీల్లేదు కనుక, పురోహితుని ఇంటి అరుగుమీదే బైఠాయించాడు లీలాశుకుడు. పురోహితుని భార్య పొద్దుటి గారెలు కొన్ని తినడానికి పెట్టింది. లీలాశుకుడు వాటిని ముట్టుకోలేదు. నిద్రించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
గుర్తు తెచ్చుకోకూడదని ఎంతో ప్రయత్నం చేస్తున్నా చింతామణి రూపం పదేపదే కళ్లల్లో మెదలాడసాగింది. విరహబాధ అంతకంతకూ దుర్భరంగా మారసాగింది. ఇక లాభం లేదని, తనకోసం ఇచ్చిన వంటకాలన్నీ మూటగట్టుకుని చింతామణి దగ్గరికి బయల్దేరాడు.
అప్పటికే ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. పనికత్తెలను పేరుపెట్టి పిలిచినా ఎవరూ తలుపు తీయలేదు. మిక్కిలి ఉద్రేకంతో ఆ ఇంటిచుట్టూ ముమ్మారు తిరిగాడు. పెరటి వైపునుంచి చింతామణి పడకగదిపైకి చూస్తుండగా ఆ చీకటిలో ఏదో తాడు వేలాడుతున్నట్లుగా లీలగా కనిపించింది. జనపనార తాడు కాబోలనుకున్నాడు లీలాశుకుడు.
భగవంతుడే తనకోసం ఆ తాడు వేలాడగట్టి ఉంటాడనుకుని, దాని ఆధారంగా మేడమీదికి వెళ్లడానికి ప్రయత్నించాడు. పైకి పాకే ప్రయత్నం చేస్తుండగా తాడు తెగింది. తనపైన ఏవో కొన్ని చుక్కలు రాలిపడ్డాయి. వాటిని తుడిచేసుకుని, పైకెగిరి రెండోకొసను పట్టుకుని, మళ్లీ ఎగబాకాడు. ఎలాగో చివరికి చింతామణి గదిలోకి వెళ్లాడు.
గదిలో అలికిడికి మెలకువ వచ్చిన చింతామణి దీపం పెద్దది చేసి లీలాశుకుణ్ని చూసింది.“రావద్దని చెప్పలేదా.. ఎందుకొచ్చావు?! అయినా ఎలా వచ్చావు? తలుపెవరు తీశారు?!” అని ప్రశ్నిస్తూ దగ్గరికి వచ్చి.. అతని ముఖంపై నెత్తుటి చుక్కలు చూసి భయపడింది. లీలాశుకుడు తాను తాడుపట్టుకుని పైకెక్కి వచ్చినట్లు చెప్పగానే.. “అమ్మయ్యో.. అది పామై ఉంటుంది. ఎక్కడైనా కాటేసిందా?” అని ఒళ్లంతా తడిమి చూసింది.తనకేమీ కాలేదని లీలాశుకుడు చెప్పిన తరువాత కానీ ఆమెకు సాంత్వన చేకూరలేదు.“ప్రియా! ఎంత మళ్లించుకుందామన్నా నా మనసు నీ మీదనుంచి మళ్లిపోవడం లేదు. నేనేం చేయగలను?! నన్ను ఆదరించు. నువ్వు ఉపేక్షిస్తే ఈ రాత్రి నా శరీరం నిలవదు” అని బేలగా పలికాడు లీలాశుకుడు.అతని మాటలతో చింతామణికి చీదర పుట్టింది.
“సరే.. నువ్వు కూర్చో. నేను స్నానం చేసి వస్తాను” అని అవతలికి పోయింది.ఒంటినిండా బూడిద పూసుకుని, మాసిన వస్ర్తాలు ధరించి, జుట్టు విరబోసుకుని వికృతరూపం ధరించి.. లీలాశుకుని ఎదుట నిలబడింది.
“స్వామీ! పోషణ లేకపోతే నా దేహం ఎలా ఉంటుందో చూడు. నువ్వు ఇన్నాళ్లుగా కల్లమోహం పెంచుకున్న దేహం ఇదిగో.. వట్టి తోలుతిత్తి మాత్రమే. వస్తుతత్త్వం తెలిసినవాడికి దీనిపై మోహం పుట్టదు. విధాత మనపై కరుణతో మేధో మాంస రుధిరాలకు నిలయమైన ఈ అస్తిపంజరానికి పైన చర్మాన్ని కప్పాడు. లేదంటే మన మేనిపై నిరంతరం స్రవించే రక్తాన్ని పీల్చడానికి వచ్చే కాకులు, గద్దలను తోలుకుంటూ బతకాల్సి వచ్చేది కదా! ఇప్పటికైనా దేహభ్రాంతి విడిచిపెట్టు. ధర్మవిరుద్ధమైన కామపురుషార్థం పాపహేతువని తెలుసుకో” అని ప్రబోధించింది.
ఆ క్షణంలో లీలాశుకునికి జ్ఞానోదయం అయింది. శయ్యమీదనుంచి లేచి చింతామణికి మొక్కాడు.
“ఈనాటినుంచి తల్లివైనా, గురువైనా, దైవమైనా నాకు నువ్వే!” అన్నాడు.
“అయ్యయ్యో! ఇది సరైంది కాదు. నీకు సరైన గురువును ఎన్నుకో. మరెన్నడూ నన్ను కలుసుకోవాలని ప్రయత్నించకు” అని పంపేసింది చింతామణి.ఆ తరువాత లీలాశుకుడు కాశీ క్షేత్రానికి చేరుకుని, సోమగిరిని కలుసుకున్నాడు. ఆయన వల్ల ఒక మంత్రాన్ని ఉపదేశం పొందాడు. ఆ మంత్రానికే చింతామణి అని పేరుపెట్టుకుని, ఏకదీక్షగా ఉపాసించాడు.
అతిత్వరలోనే అతని తపస్సు పండింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అనేక లీలలను తన భక్తుడి ఎదుట ప్రదర్శించాడు. తాను చూసిన ఆ లీలలన్నిటినీ లీలాశుకుడు కృష్ణకర్ణామృతమనే కావ్యంగా వెలువరించాడు. శ్రీకృష్ణ భక్తులలో అగ్రేసరుడని పేరు గాంచాడు.
లీలాశుకుణ్ని విడిచిపెట్టిన తరువాత చింతామణి ఏమైందనేది అసలు కథ.ఆ రాత్రి తరువాత చింతామణి ఎన్నడూ విలువైన ఆభరణాలు ధరించలేదు. తన ఆస్తినంతా బీదసాదలకు పంచిపెట్టింది. ఒక యోగినిలా మారిపోయింది.అయితే ఎంత ప్రయత్నించినా తన సాధన పరిపక్వదశకు చేరుకోలేదనే బెంగ ఆమెలో మొదలైంది.దాంతో ప్రయాగలోనే ఉండే అగ్నిశిఖుడనే యతీశ్వరుణ్ని ఆశ్రయించాలని తలపోసింది. ఆయన ఎప్పుడూ తన లోకమే తనదిగా ఉండేవాడు. బాహ్యప్రపంచాన్ని పట్టించుకునేవాడు కాదు. చింతామణి ఒకనాడు ఆయన పాదాలపై పడింది. ఆయనదేమీ పట్టించుకోలేదు. తనలో తానేదో గొణుక్కుంటూ ఉండిపోయాడు.
“స్వామీ! జ్ఞానానికి అతీతమైన విజ్ఞానం మానవుణ్ని ఎలా కట్టడి చేస్తుందో వివరించవలసింది” అని కోరింది చింతామణి.
అందుకాయన..
“యాంతే మతిస్సాగతిః” అని బదులిచ్చాడు.అంటే మరణించే సమయంలో మనసు ఎటువంటి స్థితిలో ఉంటుందో.. పునర్జన్మ అలాంటిదే లభిస్తుంది అని అర్థం.
“స్వామీ.. నా ప్రశ్నకు ఈ సమాధానం సరిపోలేదు కదా!” అన్నది చింతామణి.
అప్పుడు మళ్లీ అగ్నిశిఖుడు..
“ప్రారబ్ధం భోగతో నశ్యేత్” అన్నాడు.అంటే మనకు విధింపబడిన కర్మఫలం అనుభవంతో కానీ నశించదు అని అర్థం.“స్వామీ! ఇవన్నీ వాడుకగా అందరూ చెప్పుకొనేవే కదా! నాకు దయచేసి అతీతజ్ఞానాన్ని పొందే విధానం తెలియచేయండి” అని మళ్లీ ప్రార్థించింది చింతామణి.అగ్నిశిఖుడు మాత్రం తనలోకం నుంచి బయట పడకుండా..“బుద్ధిః కర్మానుసారిణీ” అని చదివాడు.అంటే కర్మలను అనుసరించి ఉండే బుద్ధి ద్వారా పొందేది ఆత్మజ్ఞానం కానేరదు అని అర్థం.“స్వామీ! మళ్లీ మీరు సామాన్యులు చెప్పుకొనే మాటలనే చెబుతున్నారు. దయచేసి నాకు మోక్షజ్ఞానం పొందే మార్గం తెలియచేయండి” అన్నది చింతామణి పట్టువిడవకుండా.ఆమె గోలేమిటో అసలు అగ్నిశిఖునికి తెలియనే తెలియదు. ఆయన తన మామూలు ధోరణిలోనే.. “యోగినాం భోగినామపి.. ఈ లోకంలో తాము యోగులమనుకునే వారిలో కూడా ఎక్కువమంది భోగులే కనిపిస్తుంటారు” అన్నాడు.ఆ మాటతో యతీశ్వరుడు తనను అవమానించాడని చింతామణి భావించింది. వెనువెంటనే ఆమెలో క్రోధభావం జనించింది. అసూయ దానికి తోడైంది. నిర్మలమైన ఆమె చిత్తంలో ఆ యతీశ్వరుణ్ని ఎలాగైనా అవమానించాలనే సంకల్పం కలిగింది. అది అంతకంతకూ బలవత్తరమైంది.చింతామణి తగిన సమయం కోసం ఎదురు చూడసాగింది. ప్రయాగలోనే హరిజనవాడలో ఉండే పుల్కసుడు అనే మాతంగుడు ఆమె పగ తీర్చిపెట్టగల ఆయుధంగా కనిపించాడు.
(వచ్చేవారం.. యోగివర్యుని పునర్జన్మ)
-అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ