జరిగిన కథ : కాశీలో చదువుకున్న ఏడుగురు మిత్రులు ధారా నగరంలో కలుసుకుని, భోజరాజు వద్ద ఉద్యోగాలు సంపాదించుకోవాలని తీర్మానించుకున్నారు. వారిలో మొదటివాడైన దత్తకుడు.. యక్షుని శాపం వల్ల స్త్రీగా మారి, భోజరాజు కూతురి వద్ద చెలికత్తెగా ఉంటున్నాడు. రెండోవాడైన గోణికాపుత్రుడు ఇంకా ధారానగరానికి చేరుకోలేదు.
పాటలీపుత్ర నగరం.. మగధ దేశానికి రాజధాని. గోణికాపుత్రుడు తన ధారానగర ప్రయాణంలో భాగంగా పాటలీపుత్రానికి చేరుకున్నాడు. ఆ సమయానికి చీకటి పడిపోయింది. ఆ రాత్రికి సత్రం వెతుక్కునే అవకాశంలేక ఒక ఇంటి అరుగుమీద పడుకుని నిద్రపోయాడు.
ఆ ఇల్లు రతినూపుర అనే వేశ్యది. వయసులో ఉండగా ఎందరో కుబేరుల వంటి విటులను జోగులను చేసిన ఘనత ఆమెది. భూములు, మిద్దెలు, మేడలు చాలా సంపాదించింది. నడి వయసులో సంతానం కోసం చాలా పరితపించింది. ఎన్నో వ్రతాలు చేసింది. చివరికి ఒక విప్రుని వల్ల ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వేశ్యలకు ఆడపిల్ల పుట్టడం అంటే.. రాజుకు పాలించే అర్హత కలిగిన పట్టభద్రుడైన కొడుకు పుట్టడంతో సమానం కదా!
ఆ పిల్లలిద్దరికీ చిత్రసేన, రతిమంజరి అని పేర్లు పెట్టి పెంచసాగింది. వాళ్లిద్దరూ చిన్నతనం నుంచి సంగీత సాహిత్యాలలో చక్కని కృషిచేశారు. క్రమంగా వారిలో యవ్వనం అంకురించింది.
ఒకరోజున రతినూపుర తన కూతుళ్లను చేరి..
“అమ్మాయిలూ! కాముకులకు శరీరమిచ్చి, డబ్బు సంపాదించుకోవడం మనకు కులధర్మం. గణిక, రూపాజీవ, కుంభదాసి, కారిక అని వేశ్యలలో నాలుగు రకాల వారుంటారు. గణిక అంటే పుణ్యకార్యాలలో పాల్గొంటూ, ఒక్క పురుషుణ్నే పతిగా ఎంచుకుని ధనం ఆర్జించేది. రూపాజీవకు గొప్ప రూపం లేకపోయినా, పటాటోపం హెచ్చుగా ఉంటుంది. అనేకమంది పురుషులను ఆశ్రయించుకుని ఉంటారు. ఇక రాజస్త్రీల వద్ద సంచరించే దాదులను కుంభదాసులు అంటారు. భర్త మరణానంతరం వేశ్యావృత్తిని అనుసరించే వారిని కారికలుగా పిలుస్తుంటారు. వీరందరిలోనూ గణిక ఉత్తమురాలు. మీరు ఏదో ఒక మార్గంలో ప్రవేశించి ధనం ఆర్జించండి” అంటూ హితబోధ చేయసాగింది.
అందుకు చిత్రసేన..
“అమ్మా! మేము కులవృత్తి చేపట్టబోం. పెళ్లి చేసుకుంటాం” అని రూఢిగా చెప్పింది.
“పిచ్చిదానా! ఇదెక్కడి చోద్యమే.. ఎక్కడైనా ఉందా?! అయినా పెళ్లాడటం ఎంత నరకమో తెలుసా? అత్తమామలకు నోరెత్తి సమాధానం చెబితే ఒక తప్పు.. చెప్పకపోతే మరో తప్పు. మరుదుల ముందు నిలిచి మాట్లాడటం తప్పు. ఆడబిడ్డకు ఎదురురావడం తప్పు. వాకిట్లో మామగారు కూర్చునుండగా ఆ దిక్కుకే పోవడానికి లేదు. బావగారి కంట పడటానికి లేదు. ఎరగక వాకిట్లో నిలబడటం తప్పు. నవ్వుతూ మాట్లాడటం తప్పు. జడ వేసుకుంటే వేళాకోళమాడతారు. కొప్పు వేసుకుంటే మరో తీరుగా వెటకారం చేస్తారు. చిన్నబొట్టు పెట్టుకుంటే ఒక తప్పు. చక్కని చీర కట్టుకుంటే పాపిష్టి కళ్లన్నీ ఆ ఇంటికోడలి మీదనే ఉంటాయి. ఇన్నిటినీ ఎలాగైనా సహించవచ్చు.. కానీ భర్త కోపిష్టి వాడైతే ఆ ఇల్లాలు పడే పాట్లు బ్రహ్మదేవుడెరుగు. పిచ్చితల్లీ మగనాలితనం శత్రువుకు కూడా వద్దు” అన్నది తల్లి.
“నోటికొచ్చినట్లు మాట్లాడకు. ధర్మాన్ని పాటించే సాధ్వీమణికి హితులందరూ ఊడిగం చేస్తారు. భర్త సగం దేహమిచ్చి పాలిస్తాడు. దేవతలు ప్రీతి చెంది వరాలిస్తారు” అని బదులిచ్చింది చిత్రసేన.
“ఒసేయ్.. మీకు బొత్తిగా ఇంత లోకజ్ఞానం లేకుండా పోయిందేమిటే?!” అంటూ రతినూపుర లబోదిబోమన్నది.
“అమ్మా! చిన్నతనంలో నేను దత్తకుడు అనేవాడితో కలిసి చదువుకున్నాను. పెరిగి పెద్దయిన తరువాత పెళ్లిచేసుకోవాలని అప్పట్లోనే మేమిద్దరం మాటిచ్చి పుచ్చుకున్నాం. ఇది తప్పదు” అన్నది చిత్రసేన.
అక్క మాటలకు సంతోషించిన రతిమంజరి ఆమె వద్దకు వచ్చి, చెవిలో ఏదో చెప్పింది.
చిత్రసేన చెల్లెలు చెప్పినది విని..
“భలే! గురువు చెప్పినట్లుగా నడుచుకోవడమే బుద్ధిమంతులు చేయాల్సింది. రేపు ఉదయమే ఆ పని చెయ్యి” అన్నది.
“సరేనక్కా!” అన్నది రతిమంజరి.
ఆ రాత్రంతా.. ‘ఎప్పుడు తెల్లవారుతుందా!?’ అని ఎదురు చూస్తూ కూర్చున్నది రతిమంజరి. బ్రాహ్మీముహూర్తంలోనే తలస్నానం చేసి, పట్టుచీర కట్టింది. చక్కగా అలంకరించుకుని, చేతిలో వరమాల పట్టుకుని సింహద్వారం తీసింది.
అప్పుడే వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. ఆ వీధిలో జనాలెవరూ తిరగడం లేదు. కానీ, అరుగుమీద గోణికాపుత్రుడు కనిపించాడు. రతిమంజరి తలుపు తీసిన కొద్దిసేపటికే అతను నిద్ర లేచాడు.
రతిమంజరి చిరునవ్వుతో అతని వద్దకు వెళ్లి..
“మహాత్మా! నాపేరు రతిమంజరి. నేనొక వేశ్యకూతురిని. కానీ కులవృత్తిని చేపట్టలేదు. ఇంతవరకూ పురుషసాంగత్యం ఎరుగను. పెళ్లి చేసుకుని, ఇల్లాలిగా మారాలని నా నిర్ణయం. అందుకు తగిన ఉపాయం బోధించమని, నేనొక గురువును ఆశ్రయించాను. ఆయన ఈనాటి ఉదయం ముహూర్తం నిర్ణయించాడు. ‘ఈవేళ మునుముందుగా ఏ పురుషుడు నీ దృష్టిని ఆకర్షిస్తాడో అతని మెడలో వరమాల వేయి’ అని నిర్దేశించాడు. మీరు రూపానికి మరో మన్మథునిలా ఉన్నారు. ఉన్నత కులానికి చెందినవారని, బాగా చదువుకున్నారని మీ ముఖవర్చస్సు చూస్తుంటేనే బోధపడుతున్నది. మీరు అనుమతిస్తే ఈ వరమాల మీ మెడలో వేస్తాను” అన్నది.
గోణికాపుత్రుడు తబ్బిబ్బయ్యాడు.
“నీలాంటి అన్నులమిన్న వలచి వస్తుంటే కాదనే మూర్ఖుడు ఎవడు ఉంటాడు? కానీ, నీవంటి వేశ్యాపుత్రికను, అందులోనూ ఒక అపరిచితురాలిని ఉన్నపాటున భార్యగా వరించాలంటే.. కాస్త ఆలోచించుకోవాలి కదా!!” అన్నాడు.
“మహాత్మా! దయచేసి లోనికి రండి” అంటూ చేయిపట్టుకుని ఇంటిలోపలికి తీసుకెళ్లింది రతిమంజరి. తన అక్కకు పరిచయం చేసింది.
మాటల మధ్యలో తన ప్రాణస్నేహితుడైన దత్తకుణ్ని ఆ అక్కచెల్లెళ్లలో పెద్దదైన చిత్రసేన వరించిందని తెలిసింది.
“మహాత్మా! మేము కూడా మీతోపాటు ధారానగరానికి వస్తాం. ఇక్కడే ఉంటే మా తల్లి మమ్మల్ని బతకనివ్వదు. మమ్మల్ని మీతోపాటు తీసుకెళ్తే మేము మీకు సేవలు చేస్తాం” అని కోరారు అక్కచెల్లెళ్లు.
అంతా నిర్ణయమైపోయింది. చిత్రసేన, రతిమంజరి ఇద్దరూ తల్లినుంచి ఒక్కపైసా కూడా తీసుకోలేదు.
చివరికి ఆమె ఇచ్చిన దుస్తులను కూడా ఆమెకే విడిచిపెట్టేశారు. గోణికాపుత్రుడు వారికి పురుష వేషాలు వేయించాడు. ముగ్గురూ కలిసి ఆనాడే ఇల్లు వదిలి వెళ్లిపోయారు.
తల్లి అయిన రతినూపుర వీధి అరుగుమీద కూర్చుని, నెత్తీనోరూ బాదుకుంటూ విలపించసాగింది.
సరిగ్గా అదే సమయంలో అక్కడికి కాషాయ వస్ర్తాలను ధరించి, ఒళ్లంతా విబూది పూసుకున్న సిద్ధురాలు ఒకరు చేతిలో దండంతో వచ్చి, రతినూపుర ఎదుట నిలబడింది.
ఆమెను చూడగానే రతినూపుర అరుగు దిగి వచ్చి..
“తల్లీ! నా కూతుళ్లిద్దరూ నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. నేటితో నా ఐశ్వర్యం మొత్తం హరించుకుపోయింది. నా బతుకు నాశనమైపోయింది” అని ఆమె పాదాలపై పడి ఏడవసాగింది.
“ఆ పిచ్చి ఏడుపు మాని, అసలేం జరిగిందో చెప్పు” అని కసురుకుంది యోగిని.
రతినూపుర చిత్రవిచిత్రంగా పలురీతుల్లో ఏడుస్తూ జరిగినదంతా వివరించింది.
అంతా విన్న తరువాత యోగిని నిట్టూరుస్తూ..
“నేనిప్పుడు నీ కూతుళ్లను చక్రవర్తికి భార్యలను చేయాలని వచ్చాను. నారాక నిష్ఫలమైపోయింది. మహాపుర నగరాధీశ్వరుడైన విపులుడనే మహారాజు నవరస రసికుడు. గొప్ప తేజశ్శాలి. రూపంలో మన్మథుడే! నేను అతని వద్ద ఆరుమాసాలు ఉన్నాను. ఒకసారి అతను స్త్రీ ప్రశంస మీద, ‘దేవీ! నువ్వు సర్వదేశాలూ తిరిగిన దానవు కదా! ఇందువదనలు కుందరదనలని కవులు వర్ణించేలాంటి అందగత్తెలను ఎక్కడైనా చూశావా?!’ అని అడిగాడు. అప్పుడు నేనతనికి నీ కూతుళ్ల గురించి చెప్పాను. నేను వర్ణించిన విధానంతో అతనికి పిచ్చెక్కిపోయింది. ఎలాగైనా నీ కూతుళ్లనే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడు. ఇప్పుడతనికి నేనేమని చెప్పను?” అన్నది.
“ఏమో తల్లీ! నీ దయవుంటే నా కూతుళ్లకు ఆ బడుగుబాపడితో బతికే దౌర్భాగ్యం పోతుంది. హాయిగా చక్రవర్తి పంచన చేరగలరు. అన్నట్లు వాళ్లు ముగ్గురూ పురుష వేషాల్లో ఉన్నారు. నువ్వు తొందరగా ఈ దారిలో వెళ్తే కనిపెట్టగలవు” అన్నది రతినూపుర.
“సరే.. నేను చూస్తానులే” అంటూ యోగిని అక్కణ్నుంచి కదిలింది.
ఆ యోగిని గొప్ప తెలివైనది. గోణికాపుత్రుడు, రతినూపుర కూతుళ్లు వెళ్తున్న దిక్కుకే తానూ వెళ్లి వాళ్ల ఆనుపానులు తేలికగా తెలుసుకోసాగింది.
పాటలీపుత్రం దాటిన తరువాత ఒక గ్రామంలో గోణికాపుత్రునితో మాట కలిపింది. అతనితోపాటు వారి బసకు వెళ్లింది. చిత్రసేన, రతిమంజరి ఆ యోగినిని గుర్తించారు. కానీ, ఆమె వారిని గుర్తించనట్లే నటించింది.
ఆమె లేని సమయంలో అక్కచెల్లెళ్లిద్దరూ గోణికాపుత్రునితో..
“ఈ యోగిని మా అమ్మ వద్దకు వస్తుండేది. మమ్మల్ని వెనక్కు తీసుకుపోవడానికే ఇక్కడికి వచ్చి ఉంటుంది” అని చెప్పేశారు.
దాంతో ఆరాత్రి ఆమె కంటపడకుండా ఆ గ్రామంనుంచి రహస్యంగా ముగ్గురూ వెళ్లిపోయారు. తెల్లవారిన తరువాత జరిగిన మోసం గ్రహించింది యోగిని.
పదిరోజులపాటు ఏకబిగిన ప్రయాణం చేస్తూ వేరొక గ్రామంలో వారిని కలుసుకుంది.
“అమ్మాయిలూ! నేను మిమ్మల్ని గుర్తించాను. మీకు ఈ బాపనాయనతో పొత్తేమిటి? మిమ్మల్ని నేను చక్రవర్తి భార్యలను చేస్తాను. మీకు గొప్ప రాజ్యమే రానున్నది. నాతో రండి” అని ఉపదేశించింది.
ఆమె మాటలు విని చిత్రసేన ఏవగించుకుంది.
“ఓసీ! ఇదా నీ వేదాంతం?! యోగినిలా వేషం వేసుకుని, ఆ రాజుకు తారుపుకత్తెగా పని చేస్తున్నావా?!” అని ఈసడించింది.
“ఇక్కణ్నుంచి పోతావా.. గ్రామస్తులతో చెప్పి తన్నించమన్నావా?!” అని రతిమంజరి బెదిరించింది.
ఆ యోగిని అప్పటికి వెళ్లిపోయింది. కానీ, దురదృష్టం కొద్దీ వారు వెళ్తున్న మార్గం విపులుని రాజ్యంలోనే ఉంది. దానిని అవకాశంగా తీసుకుని, యోగిని తన రాజునుంచి ఒక అధికారపత్రాన్ని తీసుకువచ్చింది.
పురుష వేషంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లతోపాటు గోణికాపుత్రుణ్ని కూడా బంధించి, రాజు ముందు ప్రవేశపెట్టాలని ఆ శాసనంలో ఉంది.
యోగిని ఆ శాసనం సహాయంతో, ముగ్గురినీ బంధించింది. ఒక బండిలో కూర్చుండబెట్టి వారిని రాజధానికి తరలించే పనిలో ఉంది. వారి ప్రయాణం ఒక అడవిమార్గం గుండా సాగింది. ఆ అడవిలో ఒకచోట యోగిని బండిని ఆపించింది.
బండి నడిపేవాడితోనూ, తోడుగా వచ్చిన ఇద్దరు భటులతోనూ యోగిని రహస్యంగా కొన్ని మాటలు చెప్పింది.
“బాబులూ! ఇక్కడికి దగ్గరలో ఢాకినీ దేవత ఆలయం ఉంది. ఆ దేవికి ఒక చక్కని వేశ్యాపుత్రికను బలి ఇస్తే దేవి సంతోషించి నాకు వరాలిస్తుంది. వీళ్లిద్దరిలో ఒక బుల్లెమ్మని నేను బలిస్తాను. మరో అమ్మాయిని న్యాయంగా అయితే రాజుకు సమర్పించాలి. కానీ నాకు ఇంతగా సహకరించిన మీకంటే రాజు ఎక్కువ వాడు కాదు. కాబట్టి ఆ బుల్లెమ్మలలో ఒక బుల్లెమ్మతో మీరు ఆనందంగా గడపండి. ఆ కుర్రవాణ్ని చెట్టుకు కట్టేయండి” అని బోధించింది.
భటులిద్దరూ రతిమంజరిని బలవంతం చేయసాగారు. బండివాడు గోణికాపుత్రుణ్ని చెట్టుకు కట్టేసి, అక్కడే కాపలా ఉన్నాడు. చిత్రసేనను పెడరెక్కలు విరిచికట్టి ఢాకినీ దేవత ఆలయంలోకి తీసుకుపోయింది యోగిని.
జరుగుతున్నదంతా చూసి, గోణికాపుత్రునికి రక్తం మరిగిపోసాగింది. కానీ క్షాత్రమున్న క్షత్రియుడు కానందువల్ల జంకుతున్నాడు. ఆపద గట్టెక్కించమని ప్రార్థించి, నృసింహ మంత్రాన్ని ఎడతెరిపి లేకుండా ఉపాసించసాగాడు.
కొంతసేపటికి తెలియకుండానే అతనిలో మార్పు వచ్చింది. నృసింహుడే అతణ్ని పూనినట్లయింది. ఉన్నపాటున కట్టుతాళ్లు సడలించుకున్నాడు. బండివాణ్ని మెడ పిసికి చంపేశాడు. ఒక భటుని చేతిలోని కత్తిని ఊడలాక్కున్నాడు. దాంతో ఇద్దరు భటులనూ సంహరించాడు.
హుటాహుటిన ఢాకినీ ఆలయంలోకి వెళ్లాడు. ఆలయం లోపలి వాతావరణం అంతా భీతావహంగానూ, జుగుప్సాకరంగా ఉంది. ఎటుచూసినా నెత్తుటి మరకలు, కంకాళాలు పేరుకుపోయాయి. భయంకరమైన దుర్వాసన కొడుతున్నది. దేవీవిగ్రహం ఎదుట.. యోగిని ఏవో మంత్రాలు జపిస్తున్నది. చిత్రసేనను బలిపీఠం దగ్గర కట్టేసి ఉంచింది.
గోణికాపుత్రుడు తన చేతిలోని కత్తితో ఒక్కవేటున యోగిని తలనరికాడు.
మహోగ్ర సంహారమూర్తియై.. మరో నృసింహుడిలా కనిపిస్తున్న అతనికి, అక్కచెల్లెళ్లిద్దరూ పలు ఉపచారాలు చేశారు. ఆ తరువాత వేగంగా అక్కణ్నుంచి కదిలి, ధారానగరం దిశగా నడిచారు ముగ్గురూ.
(వచ్చేవారం.. దత్తకుని శాపవిముక్తి)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ