“ఝాన్సీ జిందాబాద్.. ఝాన్సీ జిందాబాద్”ఏసీ కంపార్ట్మెంట్ నుంచి దిగుతున్న ఝాన్సీ మెడలో పెద్ద పూలమాల వేస్తూ కొంతమంది గుంపుగా ఆమెకు ‘జిందాబాద్’ కొడుతూ ఆహ్వానిస్తూ ఉంటే.. ప్లాట్ఫారం మీద జనం ‘ఎవరీ ఝాన్సీ?’ అనుకుంటూ అటువైపే చూస్తున్నారు. ఆమె వెంటే ఆమె తాలూకు లగేజ్ మోసుకుంటూ దిగింది నీరజ.
భారతదేశంలోని ఒక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థకు అఖిలభారత ఉద్యోగ సంఘ ప్రధాన కార్యదర్శి ఝాన్సీ. ఉద్యోగుల వేతన సవరణ కోసం ముందస్తుగా ఉద్యోగులు వారి మధ్య జరుపుకొనే చర్చల కోసం తను ఇప్పుడు తన అసిస్టెంట్ నీరజతో చెన్నై వచ్చింది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఆ సంస్థ తాలూకు దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘ నాయకులందరూ అక్కడికి వచ్చి.. ‘ఝాన్సీ జిందాబాద్! ఝాన్సీ జిందాబాద్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ కదులుతుంటే.. ఆమె తాలూకు లగేజ్ మోస్తూ నడుస్తున్న నీరజ మాత్రం,‘నాయకులై ఉండి సంఘానికి కొట్టాల్సిన జిందాబాద్ని వీళ్లంతా ఒక వ్యక్తికి కొట్టడం ఏమిటి? బహుశా సంఘ పూజ కన్నా వ్యక్తి పూజ జనానికి ఎక్కువ తృప్తిని ఇస్తుందేమో?’ అనుకుంటోంది మనసులో. ఝాన్సీ కూడా ఆ నినాదాన్ని ఎక్కువ ఆనందిస్తోంది.
మరో పది నిమిషాల్లో వాళ్లందరూ బసచేస్తున్న స్టార్ హోటల్‌కి ఖరీదైన కారులో ఝాన్సీని ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆమెకి కేటాయించిన ప్రత్యేకమైన గదిలో విడిచిపెట్టారు. ఝాన్సీ లగేజీని ఆమె గదిలో విడిచి.. తనలాంటి వారికి కేటాయించిన గదికి నీరజ వెళ్లిపోయింది.‘ఈ చర్చల కోసం ఇంత పెద్ద స్టార్ హోటల్, అందులో ఈమెకు ఒక ప్రత్యేకమైన ఖరీదైన గదీ అవసరమా? ఈ డబ్బంతా ఉద్యోగస్తులు వాళ్ల వాళ్ల జీతాల నుంచి ఇచ్చే చందాల్లోనుంచే కదా ఖర్చు పెడతారు! అసలు ఆ డబ్బు ఎప్పుడైనా, ఎవరైనా ఉద్యోగస్తులు అనుకోని కష్టాల్లో పడితే వారిని ఆదుకోవడానికో.. కోర్టు ఖర్చులకో.. దేనికో వాడుకోవలసినవి! కానీ జరుగుతోంది ఏమిటి? ఝాన్సీ లాంటి వాళ్లు అసలు నాయకులవ్వాలని ఆరాటపడేది శ్రామికోద్ధరణ కన్నా.. ముఖ్యంగా ఇలాంటివి అనుభవించడానికే! హోదాకి హోదానే కాక, వ్యవస్థని తమకు అనుకూలంగా వాడుకోవడానికి ఒక మహదవకాశం!’ నీరజకి ఝాన్సీతోపాటు తిరిగీతిరిగీ తన మనసులో భావాలతో ఇలా సంఘర్షించుకోవడం పరిపాటై పోయింది.
సమావేశాలు ఎక్కడ నిర్వహించాలో నిర్ణయించేది ఝాన్సీనే! తనకి ఏ ప్రాంతం చూడాలనిపిస్తే ఆ ప్రాంతం, అది ఎంత దూరమైనా, ఎంత ఖర్చయినా లెక్కచేయకుండా ఏర్పాటు చేయమంటుంది. ఇప్పుడు ఈ చెన్నై ట్రిప్పూ అంతే.. సమావేశం పూర్తవ్వగానే కొడైకెనాలూ.. కోయంబత్తూరూ.. తంజావూరూ.. ఇంకా.. ఇంకా.. ఇలాంటివన్నీ యూనియన్ డబ్బులతో ప్రతిచోటా ఖరీదైన హోటళ్లలో బసచేస్తూ, శాఖా సందర్శన పేరుతో, యూనియన్ డబ్బులతో తిరగాలని ఆమె పర్సనల్ (వ్యక్తిగత) ప్రోగ్రాం అని అక్కడికి వచ్చిన చాలామంది నాయకులకు తెలియదు. ఒక్క నీరజకి తప్ప! అవకాశాన్ని అందిపుచ్చుకొని తన ఇష్ట ప్రకారం వాడుకోవడం ఆమెకు సర్వసాధారణం.
ఏవి ఎంత అనుకున్నా ఆమెలో ఉన్న ఒక గొప్ప లక్షణం తను ఎంతపెద్ద అధికారితో బేరసారాలకు వెళ్లినా, ఉద్యోగులకు అనుకూలంగా సమావేశాన్ని ఫలవంతం చేసుకుని రాగలగడం! నిజానికి అది అంత సులువైన వ్యవహారం కాదు, దానికి ఆమె దగ్గర ఒక మహత్తరమైన చిట్కా ఉంది. ఏ అధికారితో సమావేశం కాబోతుందో, నిర్ణయాధికారం చేసేవారి బలహీనతల్ని, వాళ్లు అంతకుముందు చేసిన అక్రమాలను సేకరించి వాటిని అస్ర్తాలుగా వాడుకోవడం. అవసరమైతే వాళ్లతో మందు పార్టీలూ, సిగరెట్లు కాల్చడానికి కూడా వెనుకాడేది కాదు. ఆమెతో మందు కొడుతూ, సిగరెట్లు కాల్చడం భాగ్యంగా భావించే అధికారులూ కొంతమంది ఉన్నారు. ఈ కళని అప్పుడప్పుడూ తన స్వార్థానికి కూడా వాడుకున్నా.. అధిక శాతం కార్మికుల కోసమే ఉపయోగించటం వల్ల ఆమె ఒక తిరుగులేని నాయకురాలు అయింది. అందుకే ఆమె సమావేశానికి వస్తుందంటే చాలామంది అధికారులకు హడల్. ఎదురు చెప్పే స్థితిలేక అడిగింది ఇవ్వడమే వారికి తప్పించుకునే తోవ. అందువల్లే ఆమె సర్వీసు నుండి రిటైర్ అయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆమెనే తమ నాయకురాలిగా కొనసాగించడానికి ఉద్యోగులంతా ఇష్టపడుతున్నారు.
నీరజ మాత్రం ‘ఈవిడకి ఇంకా ఈ యావ ఎందుకు? సర్వీసులో ఉన్నవాళ్లు చూసుకుంటారు కదా!’ అనుకుంటుంది. కానీ, ఝాన్సీకి ‘జై’..లు ‘జిందాబాద్’..లూ కొట్టించుకోవడం, సన్మానాలు చేయించుకుంటూ పెద్ద పెద్ద బహుమానాలు అందుకోవడం, అందరి మీదా అజమాయిషీ ఉందన్న అహంకారం చాలా ‘తృప్తి’ని ఇస్తాయని కూడా నీరజకు తెలుసు.
మర్నాడు ఉదయం పదిగంటలకు, ఖరీదైన ఆ హోటల్ బ్యాంకెట్ హాల్లో సమావేశం ప్రారంభం అయింది. ఝాన్సీ వేదిక మీదకు వస్తుంటే మళ్లీ ఆమె పేరుతో పెద్దగా ‘జిందాబాద్’లు కొట్టారు. ఆమె చేయి ఊపి కూర్చునే వరకూ ‘ఝాన్సీ.. లాంగ్ లివ్! లాంగ్ లివ్!’ అంటూ నినదించారు.
ముందుగా కొందరు వక్తలు సమావేశ ఉద్దేశాన్ని వివరించిన తర్వాత, మొదటగా ఆమెకు సన్మాన కార్యక్రమం ప్రకటించారు. వేదికకు దూరంగా కూర్చున్న నీరజ పరుగు పరుగున వెళ్లి వేదిక మీద ఝాన్సీ కూర్చున్న కుర్చీ వెనకగా నిలబడింది. వచ్చిన సభ్యులూ, నాయకులూ ఆవిడకి కప్పే శాలువలూ, ఇచ్చే బహుమతులూ సేకరించి సర్దిపెట్టడానికి! ఆమెకి ఇది మామూలే! ఇప్పటికీ ఆమె మీద కొన్ని వేల శాలువాలు కప్పబడ్డాయి. అవి ఎక్కువ అయిపోయినప్పుడల్లా వాటిని బట్టల షాపుల వాళ్లకి అమ్మేస్తుందని నీరజ చూచాయగా విన్నది. బహుమతులు మాత్రం ఎవ్వరికీ ఇవ్వకుండా తనే దాచుకుంటుంది(ట).
సన్మానించే వాళ్లంతా శాలువలు కప్పుతూ, బహుమతులు అందిస్తుంటే.. ఫ్లాష్ లైట్లు జిగేల్‌జిగేల్ మంటుండగా చాలామంది ఫొటోలు తీసుకుంటున్నారు. అలా వస్తున్న బహుమతుల్లో దేవదారు చెక్కతో అత్యంత సుందరంగా చెక్కిన బుద్ధుడి విగ్రహం ఒకటి నీరజని ఆకర్షించింది.
ఝాన్సీలో ఏం చూసి వాళ్లు బుద్ధుడి విగ్రహాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకున్నారో నీరజకి అర్థం కాలేదు కానీ, ఆ విగ్రహం ఆమెను ఎంతో ముగ్ధురాలిని చేసింది. బుద్ధుడి తత్వం తనకు ఎంతో ఇష్టం. ఆ తథాగతుడి చరిత్ర చదువుకుంది. అతడు చెప్పిన దుఃఖ నివారణ సూత్రాలను ఆచరణలో పెట్టుకోవాలనీ, నిర్వాణ స్థితి సిద్ధించేలా ప్రయత్నించాలనీ ఆమె ఆశ. ఆ నేపథ్యంలో ఈ విగ్రహం తన సొంతమైతే బాగుండునని అనుకుంది నీరజ. అడిగితే ఝాన్సీ ఇస్తుందేమో కానీ.. తన కోరికను ఇలా ఇంకొకరిని అడిగి తీర్చుకోవడం సబబు కాదు అనుకుంది వెంటనే.
సన్మాన కార్యక్రమం పూర్తి కాగానే ఉద్యోగుల వేతన సవరణ చర్చలు ప్రారంభం అయ్యాయి.
ఇలా… ఇలా… ఇంకా చాలా…
అందరి కోరికలూ, సలహాలూ వారి ముందున్న నోట్ పాడ్లలో రాసుకున్నారు వేదిక మీదున్న నాయకులు. దాదాపు నాలుగు, ఐదు గంటలు సాగిన ఆ సమావేశం చివరికి వచ్చాక, ఒక ముఖ్య నాయకుడు లేచి..“మీరు తలుచుకుని యాజమాన్యంతో బేరానికి దిగితే ఇవేమంత సాధించలేని కోరికలు కావు మేడం. అప్పుడు యూనియన్ సభ్యులు కూడా ఇతోధికంగా మీరు విధించే ‘యూనియన్ లెవీ’ సంతోషంగా సంఘానికి చెల్లించి.. మన కార్యక్రమాలు మరింత ఘనంగా (అంటే తన ఇష్టానుసారంగా) జరుపుకొనే వీలు కలిగిస్తారు” అంటూ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించి..
“ఝాన్సీ.. జిందాబాద్” అంటూ నినదించాడు.దాంతో మిగిలిన వారంతా శృతి కలిపి, ఆమెతో గ్రూపు ఫొటోలు దిగి ఒక్కరొక్కరుగా నిష్క్రమించారు.
అనుకున్నట్లుగానే ఝాన్సీ తమిళనాడు టూర్ ప్రోగ్రాం యూనియన్ డబ్బుతో దిగ్విజయంగా, విలాసంగా పూర్తి చేసి.. వచ్చిన శాలువలు, గిఫ్టులు మూటగట్టుకుని.. తంజావూర్ నుండి చెన్నైకి నీరజతోపాటు తిరుగు ప్రయాణానికి బయలుదేరింది. దాదాపు ఆరున్నర గంటల ప్రయాణం. ప్రతి గంటా, రెండు గంటలకు ఒకసారి ఆగుతూ ప్రయాణం సాగిస్తున్నారు వాళ్లు.“వేతన సవరణ విషయంలో వీళ్ల కోరికలు మరీ అత్యాశలా అనిపించడం లేదా మేడం?” అడిగింది నీరజ “ఎందుకనిపించడం లేదు. వీటిని తీర్చితే వచ్చేసారి సంవత్సరానికి ఓ రెండు నెలలు పని చేసి పన్నెండు నెలల జీతం కావాలన్నా అంటారు. నాకు కూడా ఎందుకో ఈసారి వీళ్ల కోరికలు మరీ దురాశలా అనిపించాయి…” అని ఝాన్సీ మాట్లాడుతుంటే, కారులోంచి బయటికి చూస్తున్న నీరజకి కాస్త దూరంగా ఏవో కొన్ని గుడిసెల్లాంటి ఇళ్లు కనిపించాయి. ఆ ఇళ్ల ముందు ఏవో చెక్క బొమ్మలు పేర్చి అమ్ముతున్నట్లుగా కనిపించింది. వాటిలో బుద్ధుడి బొమ్మ కూడా కనిపించడంతో ఝాన్సీని రిక్వెస్ట్ చేసి..“ఆ బొమ్మలు చూసి వద్దాం మేడం” అంది.
ఝాన్సీ కారుని అటువైపు తీసుకువెళ్లమంది డ్రైవర్ని.నీరజ అంచనా నిజమైంది. ఝాన్సీకి బహుమతిగా వచ్చిన బుద్ధుడి విగ్రహం లాంటివి అక్కడ చాలా ఉన్నాయి. అచ్చు గుద్దినట్టు అదే నగిషీ, అదే ఫినిషింగ్‌తో ఆ ఇళ్లల్లోని వాళ్లు అనేక బొమ్మలతోపాటు బుద్ధుడి విగ్రహాలూ చేస్తున్నారు.
“ఈ విగ్రహం ఖరీదు ఎంత?” అడిగింది నీరజ.“పెద్దదైతే రెండువేలు. చిన్నదైతే పదిహేను వందలు” చెప్పాడు అక్కడి శిల్పకారుడు.
“ఎందుకంత? వెయ్యికి పెద్ద విగ్రహం ఇవ్వు” అంది ఝాన్సీ.. నీరజకి లాభం కలిగించాలని.“లేదమ్మా! అంత తక్కువకి కుదరదు”
అన్నాడు అతను.
వారిద్దరి మధ్యన అలా చాలాసేపు బేరసారాలు జరుగుతుంటే.. లోపలి నుంచి అతడి భార్యలా ఉన్న ఆవిడ అతన్ని లోపలికి పిలిచి ఏదో చెప్పింది.
“పదిహేను వందలకి తక్కువ ఇవ్వలేనండి” అన్నాడు.. అతను లోపలి నుంచి బయటికి వచ్చి.“లేదులే! పన్నెండువందలు తీసుకో” అంది ఝాన్సీ.
అతడు అన్యమనస్కంగా ఓసారి లోపలికి చూసాడు. ఏదో ఆదేశం అందినట్లు బేరం పన్నెండువందలకి ఖాయం చేసి బొమ్మని ప్యాక్ చేసి ఇచ్చాడు. నీరజ పన్నెండువందలు చెల్లించింది. ఆమెకు తెలుసు.. అదే బొమ్మని షో రూమ్‌లో కొంటే నాలుగైదు వేలకు తక్కువ ఉండదని. అంత తక్కువకి బేరమాడి ఇప్పించినందుకు ఝాన్సీకి థాంక్స్ చెప్పి.. వెనక్కి కారువైపు అడుగులు వేయబోయింది నీరజ.చాలాసేపటి నుండి ఆగకుండా ప్రయాణిస్తుండటం వల్ల.. ఆ క్షణం ఝాన్సీకి వాష్‌రూమ్ అవసరం తీర్చుకుని ముందుకు కదిలితే బాగుంటుందని అనిపించి..
“మీ బాత్రూమ్ వాడుకోవచ్చా?” అని అడిగింది.
“వాడుకోండి” అంటూ ఇంటి వెనక వైపు దారి చూపించాడు ఆ షాప్ అతను.ఝాన్సీ వాష్‌రూమ్ వైపు అడుగులు వేస్తుంటే నీరజ ఆమెను అనుసరించింది. రెండు అడుగులు వేసేసరికి వెనక గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి.“అమ్మా! డబ్బులు వచ్చాయిగా.. నా స్కూల్ ఫీజుకి ఇస్తావా?” ఒక చిన్నపిల్ల గొంతు.“ఇప్పుడు కాదమ్మా! పైనెల చూద్దాం. అదిగో నానమ్మను చూడు ఎంత బాధ పడుతోందో! పెద్ద ఆసుపత్రిలో చూపించకపోతే రోగం ముదిరిపోతుందని చెప్పాడమ్మా డాక్టరు. ముందు ఈ డబ్బులు దానికోసం కావాలి. అందుకే కదా.. ఖరీదు చేసే బొమ్మను తక్కువకి అమ్మేసింది” అంటోంది దీనంగా ఆ తల్లి గొంతు.“పోయినసారి కూడా నేను ఎక్స్కర్షన్కి వెళ్తానంటే డబ్బులు ఇవ్వలేదు” పిల్ల గొంతు.
“ఎక్కడి నుంచి ఇస్తానే! మనదేమన్నా ప్రభుత్వ ఉద్యోగమా!? నెలనెలా రావడానికి. ఏ ఏటికి ఆ యేడు ఆదాయం పెరగడానికి?” కసురు నిండిన తల్లి గొంతు.బాధకీ, దుఃఖానికీ మధ్యలో పిల్ల నసపెడుతోంది.
అనుకోకుండా చెవిన పడిన ఆ మాటలు ఝాన్సీలో ఏవో ఆలోచనలకు బీజం వేశాయి. ఎదురుగా బాత్రూమ్ కనిపిస్తోంది. బాత్రూమ్ అంటే పలుచగా మూడు పక్కల ఇటుకలు పేర్చి, నాలుగోవైపు అడ్డంగా సీనా రేకు తలుపు బిగించిన కప్పులేని కట్టడం. సింకులూ, షవర్లూ, నల్లాలూ లేవు. ఒక ప్లాస్టిక్ బకెట్లో నీళ్లూ, దాంట్లో మగ్గు.. అంతే! ఒకరి తర్వాత ఒకరు అవసరం తీర్చుకున్నాక ఝాన్సీ కారు వైపు వెళ్లకుండా గుడిసెలోకి అడుగుపెట్టి.. ఆ తల్లితో చాలాసేపు మాట్లాడింది. ఝాన్సీ యూనియన్ యాత్ర, అనుకోకుండా ఓ కొత్తదారి పట్టింది. కారులోంచి తన హ్యాండ్‌బ్యాగ్ తెప్పించి ఆ పిల్లకి కావాల్సిన స్కూలు ఫీజూ, మంచం మీద ముసలమ్మను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి అవసరమైన డబ్బూ ఎంతో అడిగి.. బ్యాగ్‌లోంచి తీసి ఇచ్చి, భారమైన గుండెతో బయటికి వచ్చింది.
“ఏంటి మేడం.. అలా కరిగిపోయి అంత డబ్బు ఇచ్చేశారు వాళ్లకి?” అడిగింది నీరజ.వాళ్లు కారెక్కి, అది బయలుదేరాక గద్గద స్వరంతో ఝాన్సీ చెప్పింది..“పేదరికం చాలా భయంకరమైనది నీరజా! లోపల మంచానికి అతుక్కుపోయిన ఆ ముసలావిడని చూస్తే మా నానమ్మ గుర్తొచ్చింది.. మాది చాలా పేద కుటుంబం. నాన్న ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. వచ్చే జీతం అంతంత మాత్రం. నాన్న వాళ్ల కుటుంబం కాస్త పెద్దదే! ఐదుగురు సంతానంలో ఇద్దరు మగపిల్లలూ, ముగ్గురు ఆడపిల్లలూ. నానమ్మ బాధ్యత తనదని మా బాబాయి ఎప్పుడూ అనుకోలేదు. ఆయన బతుకూ అంతంత మాత్రమే! అందుకే.. పెద్దవాడిగా నాన్నే ఆ బాధ్యత నెత్తికెత్తుకున్నాడు. మా ఇంట్లో అమ్మా, నాన్నా, నానమ్మా, నేనూ, తమ్ముడు. ఇంతమంది నాన్న చిన్న జీతంలో బతకాలి. అలా గడుస్తున్న కాలంలో నానమ్మకు జబ్బు చేస్తే.. మా స్కూలు ఫీజులకు డబ్బులు అవసరమని ఆవిడకి వైద్యం చేయించలేదు మా నాన్న. అంతేకాదు..” అంటూ ఝాన్సీ ఎందుకో ఒక్కసారిగా భావావేశానికి లోనైంది.
చెబుతున్న మాట ఆగిపోయింది. కళ్లు ఎరుపెక్కి రెండు కన్నీటి బొట్లు రాలాయి.నీరజ ఆమెను ఎప్పుడూ అలా చూడలేదు.“ఏంటి మేడం.. ఏం జరిగింది? అంత బాధ పడుతున్నారు” అని అడిగింది.ఝాన్సీ కన్నీళ్లు ఒత్తుకొని కొనసాగించింది.“నానమ్మ చనిపోతే నాన్న ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు. శవాన్ని ఒక రోజంతా ఇంట్లోనే ఉంచి, తీవ్రంగా ఆలోచించి.. అర్ధరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా ఎవరో స్నేహితుడి సహాయంతో ఆవిడ శవాన్ని ఎక్కడికో తీసుకెళ్లి వదిలేసి వచ్చాడు. ఎందుకలా చేశావని అమ్మ గొడవపడితే, నాన్న ఏమన్నాడో తెలుసా?”
“ఏమన్నారు మేడం?”
“ఇప్పుడు ఈవిడ చనిపోయిందని మన వాళ్లందరికీ చెబితే.. ఆమెకు చేయాల్సిన కర్మకాండలూ, ఆవిడని చూడటానికి వచ్చే వాళ్లందరికీ మర్యాదలూ వెరసి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఉన్న అప్పులు చాలవన్నట్లు, కొత్త అప్పే కాక.. రేపు పిల్లలకు కట్టాల్సిన స్కూలు ఫీజులు కూడా కట్టలేం. ఈ ‘శవ సంస్కారం’ చేసే అంత ‘స్థోమత’ మనకు లేదు. అందుకే రాత్రివెళ్లి శవాన్ని ఊరవతల పాతిపెట్టి వచ్చాను. నేను చేసింది తప్పయితే.. నన్ను క్షమించు అన్నాడు నాన్న!”“మరి ఇంట్లో ఉన్న ఆవిడ ఎక్కడికి పోయిందని ఎవరైనా అడిగితే?” సందేహం వెలిబుచ్చింది నీరజ.
“ఆ మాటే మా అమ్మ అడిగితే.. ‘ఆవిడకి ఎలాగూ అర్ధరాత్రి నిద్రలో నడిచే అలవాటుతోపాటు జ్ఞాపకశక్తి సరిగా లేదన్న సంగతి అందరికీ తెలుసు. కాబట్టి, మాకెవరికీ తెలియకుండా బయటకు వెళ్లి, రెండు రోజుల నుండి కనిపించడం లేదనీ, వెతికిస్తున్నామనీ చెబుదాం’ అంటూ భోరున ఏడ్చేసాడు నాన్న. మేమందరం కూడా ఆ స్థితిలోకే జారిపోయి నాన్నని గట్టిగా పట్టుకొని ఏడ్చేసాం. అప్పటినుండే నేనొక ఉద్యోగం సంపాదించుకొని ఇలాంటి ఒక నాయకురాలిని అయి, నాతోటి వారి ఉన్నతికి పాటుపడాలని అనుకునేదాన్ని. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఆ లక్ష్యాన్ని చేరుకున్న ఝాన్సీనే! కానీ, నేనెక్కడో పొరపాటు చేస్తున్నాననే భావన కొంతకాలంగా నన్ను బాధిస్తోంది. అదేమిటో ఇవాళ నాకు అర్థమైంది”
“అంటే.. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు?”“వ్యవస్థలోని ఒకవర్గం తమలో తామే యాజమాన్యమూ, ఉద్యోగులూ, కార్మికులూ అనే గుంపులుగా విడిపోయి.. సమ్మెలూ, లాక్ అవుట్లు వంటి బెదిరింపులతో, పరస్పర చర్చల పేరుతో దేశ సంపదను పంచుకుంటుంటే.. తమ శ్రమకు ఎంత విలువ కట్టవచ్చో, దాని సాధనకై ఎవరిపై సమ్మెలు చేయాలో కూడా తెలియని ఇలాంటి వర్గానికి సరైన నాయకులు ఎవరు? వీళ్లకి వేతనాలు, సవరణలు, ఆరోగ్య బీమాలూ, వారానికి నాలుగు పనిదినాలూ, ఇంటి రుణాలూ.. బుర్ర వేడెక్కిపోతోంది నీరజా! ఇన్నాళ్లూ హక్కుల పేరుతో కొన్నిసార్లూ, అధికారులు చేసే తప్పుల్ని అడ్డం పెట్టుకుని కొన్నిసార్లూ ఆ వర్గం కోసం సాధించిన విజయాలు నేను చేసిన పుణ్యమో.. పాపమో..? అర్థం కావడంలేదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకోబోతున్నాను”“ఏమిటది?” నీరజ అడిగింది.
“నువ్వే చూద్దువుగాని..” అంది ఝాన్సీ.మొదటిసారి సిద్ధార్థ గౌతముడు తన రాజమహల్ విడిచి బయటి ప్రపంచంలో చూసిన దృశ్యాలతోటి ఆయన దారి మారినట్టు.. ఆ గుడిసెలో కనిపించిన దృశ్యాలతో ఝాన్సీ దారి మారింది. కొద్దికాలంలోనే తన పదవినీ, తను పొందిన బహుమతులనీ త్యజించి.. ఆమె మరో ప్రస్థానాన్ని ప్రారంభించింది.ఝాన్సీ నిర్ణయానికి ముందు ఆశ్చర్యపడినా..ఆ తర్వాత ఎంతో సంతోషించింది నీరజ.
గిన్నెల వెంకట రమణ
కుటుంబ కష్టాలతో కుస్తీ పట్టే శ్రమజీవుల చూసినప్పుడు మనసులో ఏదో అసౌకర్యం, తెలియని సంఘర్షణ. ఆ సంఘర్షణే.. ‘మరో ప్రస్థానం’ కథకు ప్రేరణ. రచయిత గిన్నెల వెంకట రమణ. జి.వి. రమణ పేరుతో కథలు రాస్తుంటారు. విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి. ప్రస్తుత నివాసం.. సికింద్రాబాద్‌లోని సైనిక్ పురి. 1986 నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ ‘కొత్త పాఠం’ విజయ మాస పత్రికలో ప్రచురితమైంది. ఇప్పటి వరకూ దాదాపు ముప్పై కథలు.. విజయ, విపుల, చతుర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలతోపాటు కౌముది, సహరి, తెలుగు జ్యోతి, సంచిక లాంటి అంతర్జాల పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. తెలుగు కళాసమితి, న్యూ జెర్సీ నిర్వహించిన కథల పోటీలలో రెండుసార్లు, పిడపర్తి వెంకటరమణశర్మ జ్ఞాపకార్థం కౌముది అంతర్జాల పత్రిక నిర్వహించిన కథల పోటీ-2021లో, సహరి అంతర్జాల వార పత్రిక నిర్వహించిన కథల పోటీలలో రెండుసార్లు, గతంలో ఆంధ్రజ్యోతి, చతుర వంటి పత్రికలు నిర్వహించిన మినీ కథల పోటీలలోనూ బహుమతులు అందుకున్నారు. దాదాపు నలభై పిల్లల కథలు.. బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలభారతి, బాల, ప్రమోద వంటి పత్రికలలో వచ్చాయి.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి రూ.5
వేలు పొందిన కథ.
-గిన్నెల వెంకట రమణ
98484 19740