పరిణతి లేని ప్రేమలు పుబ్బలో పుట్టి ముఖలో కలిసిపోతాయి. వివాహబంధం విలువ తెలియని జంటలు ప్రేమ పేరుతో అప్పటికప్పుడే పెండ్లి చేసుకోవడం, అంతే త్వరగా విడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ఈ తంతు మరీ ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు రూపొందిన నాటకం ‘ఇంద్రప్రస్థం’.
బతకడానికి ఆర్థిక ఆధారం కీలకమైనది. అది లేకుండా పెళ్లి చేసుకోవడం మూర్ఖత్వం. సర్వేశ్వరరావు సాధారణ ఉద్యోగి. ఆయన భార్య సౌభాగ్యం అనుకూలవతి. వాళ్లకో కొడుకు సందీప్. కాలేజీలో చదువుకుంటూనే సౌందర్య అనే యువతిని ప్రేమిస్తాడు. సౌందర్య కూడా అతన్ని ప్రేమిస్తుంది. వాళ్ల ప్రేమను ఇద్దరి తల్లిదండ్రులు మెచ్చరు. పెళ్లికి నిరాకరిస్తారు. దీంతో పెద్దలపై ద్వేషం పెంచుకుంటారు సౌందర్య, సందీప్. అప్పటి వరకు తన ఎదుగుదలకు ఆధారమైన తండ్రిని, అతని వాత్సల్యాన్ని మరచిపోతారు.
ఇళ్లు విడిచిపోయి (లేచిపోయి) పెళ్లి చేసుకోవాలని సందీప్, సౌందర్య అనుకుంటారు. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు వారికి సర్వేశ్వరరావు అకస్మాత్తుగా ఎదురవుతాడు. ‘ఎక్కడికో వెళ్లి ఇబ్బందులు పడే బదులు, మా ఇంట్లోనే వేర్వేరుగా ఉండండి. మీ భోజనానికి, వసతికి డబ్బులు చెల్లించండి. మీకు మీరుగా బతికేంత ఆర్థిక స్వావలంబన వచ్చినపుడు నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాన’ని వాళ్లకు ఓ ఆఫర్ ఇస్తాడు. ‘మీ ప్రేమ నిజమైతే నా షరతును అంగీకరించమ’ని సవాలు చేస్తాడు సర్వేశ్వరరావు. సౌందర్యకు ఆ ప్రతిపాదన నచ్చుతుంది. సందీప్‌కు ఇష్టం లేకపోయినా ఒప్పిస్తుంది. ఈ సమయంలో ప్రేమ పేరుతో తండ్రిని ద్వేషించే సౌందర్యను కూడా ఆలోచనలో పడేస్తాడు సర్వేశ్వరరావు.
సందీప్ మాత్రం తన సొంత ఇల్లే కదా అని స్వేచ్ఛగా ఉంటాడు. బాధ్యతలను విస్మరిస్తాడు. సౌందర్య ప్రేమ తనకు లభించిన ఓ అదనపు ఇష్టంగానే భావిస్తాడు. ‘నాకు పీరియడ్స్ అవుతున్నాయి. ప్యాడ్స్ తీసుకురా’ అని సౌందర్య అడిగితె.. అలాంటివి తేవడం తనకు నచ్చదని చెప్తాడు. అంతేకాదు తనకు ఏదీ కొనివ్వలేని దుస్థితి అతనిది. సందీప్ వైఖరి సౌందర్యకు నచ్చదు. చివరికి ‘నీ కష్టార్జితంతో ఓ ముద్ద అన్నం పెట్టమ’ని అడిగినా పట్టించుకోడు. ఇలా అడుగడుగునా సౌందర్య అభిమానం దెబ్బతింటుంది. సందీప్ పట్ల ఉన్న ఇష్టం నుంచి, అయిష్టం స్థితికి చేరి, ఆఖరికి అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది.

అప్పటికీ తన తప్పు తెలుసుకోడు సందీప్. పురుషాధిక్య భావనతోనే ఉంటాడు. ఉద్యోగం సంపాదించుకోవాలనే ధ్యాసే రాదు. తన తండ్రి ఇల్లు, ఆస్తిపాస్తులు తనవే కదా అన్న భావనతో ఉంటాడు. ఒకరోజు సందీప్.. సౌందర్యను కళ్లు మూసుకోమని చెప్పి అనూహ్యంగా ఆమెకు తాళి కడతాడు. ‘ఇప్పటి నుంచి మనం భార్యాభర్తలం, మా నాన్న మనల్ని వేధిస్తున్నాడని కేసు పెడితే, గృహ హింస చట్టం కింద ఆయనను జైల్లో వేస్తారు. అప్పుడు మనకు ఈ ఇల్లు సొంతమై హాయిగా జీవించవచ్చు’ అంటాడు. ఈ ప్రతిపాదనను సౌందర్య నిర్దంద్వంగా తోసిపుచ్చుతుంది. కట్టిన తాళిని అంతే సులువుగా తెంచి పారేస్తుంది. తల్లి సౌభాగ్య ఆ సమయంలో కొడుకుని లాగి లెంపకాయ కొట్టి తన విశ్వరూపం చూపిస్తుంది.
‘బిడ్డకు జన్మనిచ్చేందుకు తల్లి కేవలం నవ మాసాలు మోస్తే, ఆ బిడ్డకు జీవితాన్నిచ్చేందుకు తండ్రి అనుక్షణం ఆ భారాన్ని మోస్తూనే ఉంటాడ’ని హెచ్చరిస్తుంది. అలాంటి తండ్రులు ఉన్న ప్రతి ఇల్లు ఓ ఇంద్రప్రస్థమేనని వక్కాణిస్తుంది. ఈ పతాక సన్నివేశంలో సందీప్ తన తప్పు తెలుసుకుంటాడు. ‘మా అబ్బయి ప్రయోజకుడై.. మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా కోరిన నాడే, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమ’ని సర్వేశ్వరరావు అంటాడు. ‘మీ అబ్బాయి రాక కోసం మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి’ అని అమ్మాయి తండ్రి సుభద్రయ్య చెబుతాడు. ఇలా కథ సుఖాంతమవుతుంది. అడుగడుగున ట్విస్టులతో సాగే నాటకం ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేపథ్య సంగీతం నాటక గమనానికి వన్నె చేకూర్చింది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటికి యాభైకి పైగా ప్రదర్శనలతో ఇంద్రప్రస్థం రంగస్థలాభిమానులను అలరించింది. ఈ నాటకం ఎక్కడ ప్రదర్శించినా ప్రేక్షక నీరాజనాలే కాదు బహుమతుల పంట పండించుకుంటున్నది!
నాటకం పేరు: ఇంద్రప్రస్థం
రచన: శ్రీస్నిగ్ధ
దర్శకత్వం: శ్రీ ఎన్. రవీంద్రరెడ్డి
పాత్రధారులు: రవీంద్ర రెడ్డి, ప్రసాద్, సూర్య, శ్రీలేఖ, కుసుమ సాయి
సంగీతం: పీ లీలామోహన్
సంస్థ: అభినయ ఆర్ట్స్
కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు