మనసైన వారికి బంగారం కానుకగా ఇస్తే పొంగిపోతారు. అయిన వారిని బంగారం అని పిలిస్తే.. మెరిసిపోతారు. పసిడి పదార్థానికే కాదు, పదానికీ అంత పవర్ ఉంది మరి! పెట్టుబడికి కూడా బంగారం సరైన ఎంపిక! అయితే, ఆ పుత్తడిని ఎలా కొంటున్నామన్నది చాలా ముఖ్యం. 24 క్యారెట్ల మేలిమి బంగారం కొని బీరువాలో దాచుకోవాలా? లేదంటే ముచ్చటైన నగ రూపంలో కొనుక్కొని పరవశించడం మంచిదా?
ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వారం పైసల ముచ్చట్లు..
బంగారంపై పెట్టుబడి ఇబ్బడిముబ్బడిలా లాభాలు తెచ్చిపెడుతుందని అందరి నమ్మకం. ఇది కొంతవరకే నిజమని మార్కెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దిన పత్రికల్లో ‘పసిడి మరింత ప్రియం’ అని శీర్షిక కనబడగానే బంగారం ప్రియులంతా శీర్షాసనం వేసినంతగా కంగారుపడిపోతుంటారు. వెయ్యి రూపాయలు పడిపోయిన పుత్తడి ధర అని వినిపించిందో.. కాసు బంగారం కొనే స్తోమత లేని వ్యక్తి కూడా.. పది తులాలు కొనేవాడిలా లెక్చరిస్తాడు. కానీ, పెట్టుబడిదారిలో బంగారం అక్షయ నిధి కాదని గుర్తుంచుకోవాలి. మిగతా ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోలిస్తే నమ్మకమైనదే అయినప్పటికీ.. ఊహించని లాభాలు వస్తాయని భ్రమపడొద్దు.
ఎనిమిది శాతమే..
బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచిలాభాలే వస్తాయి. పాతికేండ్ల కిందట ఓ ఐదు తులాల బంగారం తీసుకున్నారే అనుకుందాం! అప్పటికీ, ఇప్పటికీ ధరలో ఊహించని మార్పే వచ్చింది. కానీ, పాతికేండ్ల సుదీర్ఘ కాలాన్ని విస్మరిస్తే ఎలా? ఆర్థిక గణాంకాల ప్రకారం బంగారం మీద లాంగ్‌టర్మ్‌లో వచ్చే రిటర్న్స్ ఎనిమిది శాతం దాటదు. ఇంత తక్కువ మార్జిన్ కోసం శుద్ధమైన బంగారం కొని బీరువాలో భద్రపరిస్తే ఎవరికి ప్రయోజనమో ఆలోచించండి? అదే కాలవ్యవధిలో మ్యూచువల్ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ 14 శాతం వరకు రిటర్న్స్ అందిస్తున్నాయి. గోల్డ్ ధర పెరగడమే మనకు గుర్తుంటుంది. తగ్గడాన్ని మాత్రం గుర్తించం. 1995 నుంచి 2003 మధ్య బంగారం ధరలో పెద్ద వ్యత్యాసమే లేదు. ఎనిమిదేండ్లు నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చాయన్న సంగతి విస్మరించొద్దు. ఇటీవల బంగారం ధర బాగానే ఎగబాకింది! ఇది ఇలాగే కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు. ధర పెంపును చూడటం కాదు.. దీర్ఘకాలంలో రిటర్న్స్ పర్సంటేజీని పరిగణనలోకి తీసుకోవాలి.
నో బిస్కెట్ ప్లీజ్..
బంగారంపైనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే.. ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడం ఉత్తమమైన పద్ధతి అనిపించుకుంటుంది. ముచ్చటపడి చేయించుకున్న ఆభరణాన్ని ఇంట్లోవాళ్లు ధరిస్తారు కదా! అప్పుడు వారు పొందే ఆనందానికి వెలకట్టగలరా? ఆభరణాల రూపంలో బంగారం కూడబెడితే.. ఇంట్లోవాళ్లకు సంతృప్తి కలుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో వాటిని బ్యాంకులో పెట్టి రుణం పొందే వెసులుబాటు ఉంది. అదే బిస్కెట్ బంగారం కొన్నారే అనుకుందాం! ఆర్నమెంట్స్ తప్ప బిస్కెట్ గోల్డ్‌పై బ్యాంకులు రుణాలు ఇవ్వవని గుర్తుంచుకోండి. ఎంతో కష్టపడి కూతురు పెండ్లి కోసం ఏడాదికో తులం చొప్పున బిస్కెట్ గోల్డ్ కొనుగోలు చేశారే అనుకుందాం. ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడింది! ఆ బిస్కెట్లు బ్యాంకుకు తీసుకెళ్తే.. నగలు మలిచి తీసుకురమ్మని చెబుతారు. అదేదో ముందునుంచే ఏటా ఓ ఆర్నమెంట్ తీసుకొని ఉంటే.. సమస్యే ఉండదు! బంగారం ధర పెరిగితే సంతోషం! పెరగకపోయినా వస్తువు ఉంటుంది. దాన్ని మనం అనుభవిస్తూ ఆనందిస్తాం. ఎమోషనల్ సాటిస్ఫ్యాక్షన్ ఉంటుంది కదా!
రిస్క్ చేయొచ్చు
ఆర్నమెంట్స్ తీసుకుంటే తరుగు, మజూరీ సమస్య ఉంటుంది కదా.. అంటారేమో! దీనికి పరిష్కారం గోల్డ్ స్కీమ్. పదకొండు నెలలు వాయిదాల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. తరుగు, మజూరీ లేకుండా కోరుకున్న నగను కొనుక్కొనే వెసులుబాటు ఉంటుంది. ‘గోల్డ్ స్కీమ్స్ నమ్మొచ్చా!’ అని సందేహం రావొచ్చు. నమ్మకమైన సంస్థలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ చాలా పరిమితంగా ఉంటుంది. అయినా.. రిస్క్ ఎక్కడ ఉండదు చెప్పండి. ఉదాహరణకు నెలకు రూ.5వేల చొప్పున గోల్డ్ స్కీమ్ కట్టారు. ఆ షాపువాడు పదో నెల బోర్డు తిప్పేశాడే అనుకుందాం. నష్టపోయేది రూ.50,000. జీవితం తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడదు కదా! నెలకు రెండు లక్షలు సంపాదించే వ్యక్తి.. ఓ పాతికవేలు గోల్డ్ స్కీమ్ కట్టగలడు. పది నెలలు అయ్యాక షాపు దివాళా తీసిందే అనుకోండి.. అప్పుడు కూడా అతను నష్టపోయేది ఒక నెల సంపాదనే! ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ పర్సెంటేజ్ ఎంత అనేది చూసుకోవాలి. మార్కెట్లో దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. మీ సొమ్ము భద్రం.. భవిత ‘బంగారం’ అవుతుంది!!
1995 నుంచి 2003 మధ్య బంగారం ధరలో పెద్ద వ్యత్యాసమే లేదు. ఎనిమిదేండ్లు నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చాయన్న సంగతి
విస్మరించొద్దు. ఇటీవల బంగారం ధర బాగానే ఎగబాకింది! ఇది ఇలాగే కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు. ధర పెంపును చూడటం కాదు.. దీర్ఘకాలంలో రిటర్న్స్ పర్సంటేజీని పరిగణనలోకి తీసుకోవాలి.
-ఎం. రాం ప్రసాద్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in www.rpwealth.in