సంపాదించడం తెలిసినవాళ్లకు ఖర్చు చేయడంపై కూడా అవగాహన ఉండాలి. లేకపోతే ఆదాయం పేరుకుపోతుంది కానీ, ఆనందం మీకు చిక్కకుండా ఎక్కడో కూరుకుపోతుంది! పొదుపు చేసిన సొమ్ము, మదుపు చేసిన మొత్తం మీ ముందుతరాలకు ఇచ్చేస్తే.. మీ తలరాతకు పరులు కూడా జాలిపడే పరిస్థితి వస్తుంది. జీవిత చరమాంకంలో అయినా, ఖుషీ చేయకపోతే ఎలా? ఉన్నది ఒక్కటే జిందగీ! మీ లైఫ్ సుఖాంతం కావాలంటే.. సంపాదించింది ప్లాన్డ్గా ఖర్చు చేయడమే మార్గం!
ప్రతి మనిషి జీవితం గందరగోళంగానే మొదలవుతుంది. తల్లి కడుపు నుంచి బయటపడగానే ఏడ్చేస్తాం. అది ప్రకృతి ధర్మం కాబట్టి… తెలియకపోయినా పాటిస్తాం. ఆకలి కాగానే తల్లిపాలు తాగుతాం. అది సృష్టివింత కాబట్టి.. తెలియకుండానే చేసేస్తాం. పెరిగి పెద్దయ్యేకొద్దీ మనలో ఆలోచనలు మొదలవుతాయి. చేయాల్సింది చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం. చేయకూడనివి చేయాలని తాపత్రయపడతాం. అలా తప్పుల మీద తప్పులు చేస్తూ పెరిగి పెద్దవుతాం. ఏళ్లొచ్చాక ఎక్కడ తప్పు చేసినా చెల్లుతుందేమో కానీ, ఆర్థిక విషయాల్లో పొరపాట్లకు తావిస్తే, జీవితం గ్రహపాటుగా మిగిలిపోతుంది.
సంపాదించడం చేతకాని వాళ్లు తప్పు చేసే ఆస్కారం ఉండదు. దురదృష్టాన్ని నిందించుకుంటూ, ఇతరుల అదృష్టంపై ఏడుస్తూ భారంగా కాలం వెళ్లదీస్తుంటారు. వీళ్లను బాగు చేయడం ఎవరి తరమూ కాదు! కానీ, బాధ్యతగా బతుకుతూ, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ, కష్టాలకు ఎదురొడ్డి నిలబడి ఒకస్థాయికి చేరుకుంటారు కొందరు. ఈ క్రమంలో కోరికలు చంపుకుంటారు, కష్టాలకు ఎదురీదుతారు, రూపాయి రూపాయి పోగు చేసి సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంటారు. జీవితం అంతా కుటుంబం కోసం పనిచేసిన ఈ వ్యక్తులు.. తమకంటూ ఓ లైఫ్ ఉందని అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకున్నవాళ్లు.. ఇదిగో ఈ పార్థసారథి గారిలా జిందగీని ముచ్చటగా ఎంజాయ్ చేస్తారు. అందుకు ఆయనేం కోట్లు ఖర్చు చేయలేదు. ఒక్కటంటే ఒక్క కోటి రూపాయలు పదిలం చేశాడు.
పార్థసారథి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు. పిల్లలను బాగా చదివించాడు. సర్వీసులో ఉన్నప్పుడే పిల్లల పెళ్లిళ్లూ అయిపోయాయి. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజినీర్. కూతురు, అల్లుడూ బ్యాంకులో పనిచేస్తారు. రెండేండ్ల కిందట రిటైర్ అయ్యాడు. శేష జీవితం మనవలు, మనవరాళ్లతో ఎంజాయ్ చేయాలని ఫిక్సయ్యాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపితే రూ.కోటి దాకా వచ్చాయి. ఈ మొత్తాన్ని ఏం చేయాలో పార్థసారథికి అర్థం కాలేదు. అప్పటికే ఇల్లు ఉంది. ఒకటి రెండు ఆస్తులున్నాయి. పిల్లలకు తండ్రి సొమ్ము కావాలన్న ఆశ లేదు. ‘ఈ కోటి ఏం చేయాలంటూ?’ నా సలహా అడిగారు.
జీవితం అంతా కష్టపడిన ఆయన్ను ‘ఈ కోటి రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?’ అని అడిగాను. ముందు కంగారుగా చూసినా.. తర్వాత తేరుకొని ‘ఓ ఎస్’ అన్నారు. ఈ కోటి రూపాయలను కరిగించకుండా.. జీవితాన్ని ఎంజాయ్ చేసే మార్గం ఉందని చెప్పడంతో.. ఆశ్చర్యంగా చూశారు. ఆ కోటి రూపాయలూ హైబ్రిడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. ఏటా మే 1వ తేదీన ఆ కోటిపై వచ్చే రిటర్న్స్ మొత్తాన్నీ రూపాయి మిగల్చకుండా విత్‌డ్రా చేసి, ఖర్చు చేయాలనే షరతును ఆయన అంగీకరించారు. అలా ఏడాది (2023-24) తిరిగే సరికి ఆ కోటి రూపాయలపై అచ్చంగా రూ.30 లక్షల రిటర్న్స్ వచ్చింది (మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒడుదొడుకులకు లోబడి ఉంటాయి. అన్నిసార్లూ ఇలా రూ.30 లక్షలు వస్తాయన్న గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు తక్కువ రావొచ్చు, అసలేం రాకపోవచ్చు కూడా! అయినా ఈ సొమ్ము వెకేషన్ నిమిత్తం కాబట్టి రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే దీని మీద ఆధారపడి లేరు కదా!). అంత పెద్ద అమౌంట్‌ను ఏం చేయాలని మళ్లీ అడిగారు. ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ వెకేషన్‌కి వెళ్లమని చెప్పాను. కుటుంబంతో పదిరోజులు రెండు దేశాలు చుట్టొచ్చారు పార్థసారథి. అప్పటికీ రూ.30 లక్షల్లో సగమే ఖర్చయ్యాయి. ‘దీన్ని ఏం చేయమంటారు?’ అని మళ్లీ సలహా కోరారు. ‘కొడుకు, కోడలు, కూతురు, అల్లుడిని పిల్లలతో సహా డిన్నర్‌కు పిలిచి, ఇకపై నేను ఉన్నంత వరకు మీ పిల్లల చదువు ఖర్చు ఎంతైనా బాధ్యత నాదేనని’ చెప్పమన్నాను! మార్కెట్ క్రాష్ అయినా, దీర్ఘకాలంలో మీ పెట్టుబడి పదిలంగా ఉంటుంది. రిటర్న్స్‌లో కొంత కోత పడుతుందేమో అంతే! తన పూర్తి పరివారంతో ఏడాదికి ఒక దేశం చుట్టేస్తూ జాయ్‌ఫుల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పార్థసారథి. మనవలు, మనవరాళ్లనూ చదివిస్తూ మలిసంధ్యలో భారం అనుకోకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అందరికీ ఇంత ఈజీగా సొల్యూషన్ దొరక్కపోవచ్చు. కానీ, విదేశాల్లో ‘డై విత్ జీరో’ కాన్సెప్ట్ ఎప్పట్నుంచో ఉంది. పోయేలోపు ఉన్నదంతా ఖర్చు చేసి లైఫ్ ఎంజాయ్ చేయడమన్నమాట. అలాగని జల్సాలకే ఖర్చు పెట్టాలన్న నియమం లేదు. నలుగురికీ సాయం చేయొచ్చు. పదిమంది ఆకలి తీర్చొచ్చు. ఇలా మీ కష్టార్జితం మీ ఇష్టం వచ్చినట్టు వెచ్చించడం అన్నమాట! పార్థసారథి కూడా ఈ సూత్రాన్నే ఎంచుకున్నారు. వారసులకు ఇవ్వాల్సింది ఆస్తుల మూటలు కాదు. మంచి భవిష్యత్తు. బుద్ధిమంతులు ఏ ఆస్తీ ఇవ్వకున్నా.. హాయిగా బతికేస్తారు. బుద్ధిహీనులకు ఏడు తరాలకు సరిపడా ఆస్తి ఇచ్చినా ఊడ్చిపడేస్తారు. సో, మీ కష్టార్జితాన్ని ఎలా వినియోగిస్తారో ఇక మీ ఇష్టం!!
-ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in