Ramayanam | నెల రోజులు గడిచేసరికి కాలేజీకి అలవాటు పడిపోయాను. అయితే.. ఇంటి మీద బెంగ బాగా పెరిగింది. అమ్మానాన్నల్ని వదిలి అన్ని రోజులు ఎప్పుడూ లేను. అప్పటివరకూ హైదరాబాదుకు నేను ఒక్కదాన్నే వచ్చి ఎప్పుడూ ఉండలేదు.
ఎప్పుడైనా సరే.. అక్కా, నేనూ కలిసే హైదరాబాదు వచ్చేవాళ్లం. ఓ వారమో పదిరోజులో మా కజిన్స్ హైమక్క, లక్ష్మి వాళ్లింట్లో ఉండి తిరిగి వెళ్లిపోయేవాళ్లం. ఉన్నన్ని రోజులూ ఏదో ఓ చోటికి వెళ్లడమే! సాలార్జంగ్ మ్యూజియమో, జూపార్కో, టాంక్ బండో, సినిమాలకో పోయేవాళ్లం. వాళ్లు మా ఊరికి వచ్చినా అంతే! రోజుల తరబడి ఉండేవాళ్లు. మా నవ్వులు, ముచ్చట్లు, పుస్తకాలు చదివి.. వాటి మీద చర్చలు! ఇలా ఉండేది.
హైదరాబాదులో నాయనమ్మ వాళ్లింట్లో నాకు ఏ లోటూ ఉండేది కాదు. కానీ, నా ఈడు వాళ్లెవరూ లేకపోవడంతో కాలేజీ నుండి ఇంటికి వచ్చాక బాగా దిగులుగా ఉండేది. గోపిక చిన్నమ్మ, ప్రమీల చిన్నమ్మ నాతో బాగానే మాట్లాడేవారు. కాకపోతే గోపిక చిన్నమ్మకు కొంచెం ఇంటి పనులు, పిల్లలు హరిత, సీనులను స్కూలుకు పంపడం, వాళ్ల పనులు ఉండేవి. సాయంత్రం అవుతున్నకొద్దీ నాలో దిగులు నీడలు కమ్ముకునేవి. ఈ సమయంలో అమ్మ ఏం చేస్తున్నదో, మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండొచ్చు. నాన్న ఎట్లా ఉన్నాడో, పశువులు ఇంటికి వచ్చే వేళ! అవి తోకలూపుతూ, రంకెలేస్తూ వస్తుంటే.. అరుగుల మీద కూర్చుని ఆనందంగా చూస్తూ ఉన్నాడేమో! నానమ్మ బహుశా ఎక్కా దీపాలు తుడుస్తూనో, కుంపటి రాజేస్తూనో ఉంటుందా!? అనుకునేదాన్ని. ఆలోచిస్తున్న కొద్దీ రెక్కలుంటే ఎగిరిపోయి మా ఇంట్లో వాలుదామా అనిపించేది.
నేనొక్కదాన్నీ చదువుకోవడానికి హైదరాబాదు వచ్చాను. నాతో చదివిన చాలామంది అమ్మాయిలు టెంత్తో ఆపేసి ఇంట్లో ఉన్నారు. ఒకరిద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి కూడా. వనజ కుమారి, రేవతి మాత్రమే కాలేజీలో చేరారు. నేనెందుకో ఈ మహానగరానికి వచ్చాను. హాయిగా నేను కూడా అక్కలాగా వరంగల్‌లోనే కాలేజీలో చేరితే బాగుండేదేమో! వారానికోసారైనా అమ్మానాన్నల్ని చూసేదాన్ని అని ఎన్నోసార్లు అనిపించేది.
దిగులేసినప్పుడల్లా బాత్రూంలోకి వెళ్లి ఏడ్చి ముఖం కడుక్కుని వచ్చేదాన్ని. ఇక్కడి నా క్లాస్మేట్స్ ఎందుకో ఆత్మీయంగా, కలివిడిగా ఉన్నట్టు నాకు అనిపించేది కాదు. ఎవరూ అంతగా మనసు విప్పి మాట్లాడినట్టు అనిపించలేదు. అది నా లోపం కూడా కావచ్చు. అందరితోనూ కలిసిపోయి కబుర్లు చెప్పి నవ్వించే నేను.. ఇలా ఎందుకు ముడుచుకుపోయానో నాకే తెలిసేది కాదు. బహుశా నాకు అప్పటికి పదమూడేళ్లే అవడం, ఇంకా చిన్నపిల్లలా ఫీల్ అవడం, పరిపక్వత లేకపోవడం అని ఇప్పుడు అనుకుంటాను. పిల్లల్ని తల్లిదండ్రులు కనీసం ఇంటర్‌స్థాయి చదువు దాటేదాకా తమ దగ్గరే ఉంచుకోవాలి. లేదా హాస్టల్లో వేయాలి. తమలాంటి తోటి పిల్లలతో కలిసిపోయి ఆనందంగా ఉంటారు అనిపించేది.
మా కాలేజీకి దగ్గరలో బర్కత్‌పురాలో ఉన్న పోస్ట్ ఆఫీసుకు వెళ్లి ఇన్లాండ్ కవర్లు తెచ్చుకుని ఇంటికీ, అక్కకూ ఉత్తరాలు రాసేదాన్ని. అమ్మ చదివితే ఏడుస్తుందేమోనని నా దిగులును రాసేదాన్ని కాదు. నా స్కూల్ ఫ్రెండ్ రేవతికి కూడా ఉత్తరాలు రాసేదాన్ని. తను వరంగల్‌లో వాళ్ల బాబాయి వరవరరావు గారింట్లో ఉండి.. ఆయన పనిచేసే సీకేఎం కాలేజీలో చదువుతుండేది. ఆయన అప్పటికే ప్రముఖ కవి, సృజన పత్రిక నడుపుతుండేవారు.
నారాయణగూడ ఇంట్లో నాకేమీ పని ఉండేది కాదు. అప్పట్లో ఇరవై నాలుగు గంటలూ పబ్లిక్ నల్లా వచ్చేది. పైపుతో వెనుక ఉన్న చెట్లకు నీళ్లు పట్టేదాన్ని. పెద్ద జామచెట్టు చాలా కాయలు కాసేది. ఇంటి వెనుక అదే లెవెల్లో షాబాద్ బండలతో ఎత్తుగా ఫ్లోరింగ్ ఉండి.. మొక్కల దగ్గరికి, కిందికి వెళ్లడానికి మెట్లు ఉండేవి. ఆ మెట్ల మీదనే కూర్చుని హోమ్‌వర్క్ చేసుకుని, ఆ తరువాత ఆర్కే లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. నాయనమ్మ అప్పుడప్పుడూ చూసి.. “ఏందే పిల్లా! ఎప్పటికి గా పత్రికలే చదువుతున్నవు. నీ కాలేజీ పుస్తకాలెప్పుడు చదువుతవు?” అనేది. నేను “చదువుతున్న నాయనమ్మా!” అనేదాన్ని.
ఆగస్టులో ఎందుకో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. వాటికితోడు మరో నాలుగు రోజులు కలిపి హోమ్ సిక్ సెలవులిచ్చారు. ఇంట్లో చెప్పాను. “అది పిల్లి పట్టిన కోడి తీరుగ ఉంటున్నది. వాండ్ల అమ్మ మీద మనసు గుంజుతున్నదో ఏమో! ఓసారి ఊర్ల దింపి ఒస్తవా రంగడూ!” అని నాయనమ్మ పెద్ద కొడుకును అడిగింది. “సరే అమ్మా!” అన్నారు రంగారావు చిన్నాయన. ఇలాంటి వాటికి ఆ చిన్నాయనే ముందుండేవారు. ఆ మర్నాడు ఇద్దరమూ సికింద్రాబాదు నుండి నాగపూర్ పాసింజర్లో ఘనపూర్‌కి వెళ్లాము. జనగామ, రఘునాథపల్లి దాటి ఊరి పరిసరాలు దగ్గరవుతున్న కొద్దీ.. నా మనసు ఎన్నడూ లేనంత ఆనందంతో నిండిపోయింది. నిజానికి నేను రైల్లో కూర్చుని ఉన్నానే గానీ, నా మనసెప్పుడో ఇంట్లోకి వెళ్లి ఇల్లంతా తిరుగుతోంది.
మనం మనుషుల్నే కాదు, ఇంటినీ, ఊరినీ కూడా ఇంతగా ప్రేమిస్తామని నాకు అప్పుడే తెలిసింది. రైలు దిగినాక మా ఇంటి దాకా ఉన్న ఆ ముప్పావు కిలోమీటర్ దూరం కూడా ఎంతో దీర్ఘంగా అనిపించింది. తెలిసినవాళ్లెందరో.. “ఇప్పుడే బండి దిగిన్రామ్మా! బాగున్నరా?” అని అడుగుతుంటే వెంటే ఉన్న చిన్నాయన.. “నీకందరు తెల్సానే?” అని ఆశ్చర్యపోయారు.
నేను వెళ్లేసరికి అమ్మ కట్టెలపొయ్యి ముందు కూచొని ఏవో అప్పాలు చేస్తున్నది. “అమ్మా!” అనగానే.. ఆశ్చర్యపోయి గబగబా కట్టెలు బయటికి గుంజి వాటిమీద కొద్దిగా నీళ్లు జల్లింది. నేను అమాంతం వెనుక నుంచి అమ్మను వాటేసుకున్నాను. నా బెంగ, లోలోపలి ఒంటరితనం, మొదటిసారి అమ్మను చూడకుండా అన్నాళ్లు ఉన్న దిగులు.. అన్నీ కలిసి కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చాయి. అమ్మ కళ్లల్లోనూ నీళ్లు ఊరుతున్నాయి. అమ్మ కూడా అంతగా బాధపడుతోందని అప్పుడే తెలిసింది.
“రేపు మనింట్ల జ్యోతి గద, అది కాంగనే ఎల్లుండి హైదరాబాదు ఒస్తనని.. అక్కడికి తెద్దామని కొన్ని అప్పాలు, లడ్డూలు జేస్తున్న. నువ్వే ఒచ్చినవు గద బిడ్డా!” అన్నది అమ్మ. (జ్యోతి అంటే శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి చేసే పూజ).
“నన్ను జూడవా ఒదినే! నీ బిడ్డను తీసుకొచ్చిన!” అన్నారు చిన్నాయన నవ్వుతూ. ఆ మర్నాడే ఆయన హైదరాబాదు వెళ్లిపోయారు. నాన్న దగ్గరికి పోగానే..
“ఒచ్చినవా బుజ్జీస్!” అన్నాడు. ఆయన కళ్లల్లోనూ నీళ్లే. ఆ సాయంత్రమే అక్క హన్మకొండ నుండి వచ్చింది. ఇక ఆనందం సంగతి వేరే చెప్పాలా?
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి