చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు మురారి. అనుమకొండ మొత్తం జల్లెడపట్టి వెతికినా.. వాళ్ల ఆచూకీ లభించలేదు. ఇలా ఉండగా.. ఓ రోజు ఉదయం మురారి బృందంలోని ఓ మిత్రుడు పరుగున వచ్చి మురారి ముందు సాగిలబడ్డాడు. రాత్రి తమ ఇంటికి ఆ మఠియ మహిళ ఓ బృందంతో వచ్చిందనీ, వాళ్లపై దాడి చేసినందుకు తన కాలో చెయ్యో.. తీసేస్తామని బెదిరించినట్లు చెప్పాడు. ‘నువ్వే రక్షించాలి మురారిదేవా..’ అంటూ బావురుమన్నాడు.
“ఆలోచనలో పడ్డాడు మురారిదేవుడు.
ఇళ్లకు వెళ్లి బెదిరించడమే కాదు.. ‘పోయి మురారికి చెప్పుకోండి!’
అనడమేంటి..?
ఆ మఠియదారు యుద్ధవీరుడు, అతని భార్యకూడా అలాంటిదే. బాగా ధైర్యస్తురాలుగా కనిపించింది. కానీ, వీళ్లు కనిపించకుండా దాక్కోవడం.. తన మిత్రుల ఇళ్లకు వెళ్లి కాలో చెయ్యో తీసేస్తామని హెచ్చరించడం.. ఆమె ఒక్కరివల్ల కాదు. ఎవరో మంచి యుద్ధ తంత్రజ్ఞులే వాళ్లకు సహాయంగా నిలబడ్డారు.
అక్క! రుద్రమదేవి!! మురారి ఆలోచనలన్నీ రుద్రమదేవి చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి.
అంతఃపురంలో ఆమెను వదలకుండా తిరిగాడు. ఆమె ఎప్పటిలాగే తమ్ముడితో తను చదువుకున్న గోళకీమఠ మిత్రురాళ్ల ముచ్చట్లు చెబుతోంది.
పగలు – రాత్రి ఇల్లువిడిచి వెళ్లలేదు.
నిద్ర మానుకుని మరీ కాపలా కాశాడు.
మురారి ఎంత ప్రయత్నించినా రుద్రమ వాళ్లను రక్షిస్తోంది అనడానికి లేశమైనా సాక్ష్యం దొరకబుచ్చుకోలేక పోయాడు. కానీ జాయా.. మరో వారం రోజుల్లో అతని మిత్రులందరికీ ఆమె కాలో, చెయ్యో తీయించి వేసింది. ఆ రోజున ఆ మఠియ కుటుంబంపై దాడి చేసిన మురారి మిత్రులకు ఇప్పుడు ఒక్కొక్కరికీ కాలో, చెయ్యో ఒకటి లేదు! ఇది వాస్తవం!” చెబుతూ ఆగాడు శుక్ర.
దిగ్గున లేచాడు జాయచోడుడు.
ఏమనాలో తెలియక కూర్చుండిపోయాడు.
మళ్లా లేచాడు. అటూఇటూ తిరిగాడు.
అప్పుడు మళ్లీ చెప్పాడు శుక్ర.. మంద్రస్వరంతో.
“ఇదొక దురదృష్టకర సంఘటన జాయా. ఇది..”
గబుక్కున అడిగాడు జాయచోడుడు.
“ఇది.. ఇది బావగారికి తెలిసే ఉంటుందా..??”
శుక్ర చెప్పేలోగా మళ్లీ ఆయనే అన్నాడు..
“తెలిసే ఉంటుంది. తెలియకుండా ఎలా ఉంటుంది? వేగులు అనుమకొండలో ఆకు కదిలినా ఆయన చెవిన వేస్తారు. కాబట్టి తెలిసే ఉంటుంది.. తెలిసే ఉంటుంది..”
తనలో తాను అనుకుంటున్నట్లు బాహాటంగా అనేశాడు. గణపతిదేవుని స్పందన ఏమిటోనని జాయచోడుని ఆందోళన.
జీవితంలో ఎన్నో మిట్టపల్లాలు చూశాడు జాయపుడు. ఎన్నో దెబ్బలు.. సుడిగుండాలు.. వడిసెల రాళ్లు.. కానీకానీ.. అవన్నీ తన జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఇది దేవుడైన బావగారిని, కల్లాకపటం తెలియని అక్కను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు.. ఈ ధోరణి కాకతీయ సామ్రాజ్యానికి వేరుపురుగు. సందేహం లేదు. ఇది పెరిగిపెరిగి.. చ చ్చ.. పెరగదు. పెరగకూడదు.
లేచి నిలబడ్డాడు. ఓ ఆలోచన అతణ్ని ఆహ్లాదపరిచింది. శుక్రతో అన్నాడు.
“ఏది ఏమైనా.. రుద్రమదేవికి పెళ్లి చేసి పంపిస్తే గొడవలు ఉండవు. ఉండవు కదూ శుక్రా! ఏమంటావ్??”
శుక్ర అవునని చెప్పాలని జాయచోడుని ఆరాటం. కానీ, శుక్ర అలా చెప్పలేదు.
“కానీ కానీ ప్రజల్లో ఓ వర్గం.. ముఖ్యంగా మఠియవాడ నివాసులు.. వణిజులు.. ముందు మగపిల్లవాడిగా ప్రకటించినట్లు రుద్రమదేవుడుగా ఆమె.. అయితేనే రాజ్యం బాగుంటుంది అని..”
మళ్లీ కూలబడ్డాడు జాయచోడుడు.
“మీరు ఆందోళన చెందవద్దు జాయా! భావి వారసుని గురించి తగిన ఆలోచన చేస్తారని మీకు విన్నవిద్దామని వచ్చాను..”
జాయచోడుడు నిశ్శబ్దంగా శూన్యంలోకి చూస్తున్నాడు. అప్పటికే రాత్రి రెండవజాము దాటుతోంది. రాత్రి మగతగా చీకటి దుప్పటిని మీదికి లాక్కుంటోంది. పహరా సైనికులు లయబద్ధంగా హెచ్చరికగా అరుస్తున్నారు. ఘటికలో గంటల శబ్దాలు వినవస్తున్నాయి. జాయచోడునికి నమస్కరించి వెనుదిరిగాడు శుక్ర.
ఆయన గుమ్మం దాటుతుండగా అరిచినట్లు అన్నాడు జాయచోడుడు.
“శుక్రా.. ఓ సందేహం..”
వెనుదిరిగి ఆగాడు శుక్ర.
“ఇంతకీ ఆమె.. రుద్రమదేవి ఆ ముగ్గురిని ఎక్కడ దాచినట్లు?”
అప్పుడు నవ్వాడు శుక్ర.
“చెప్పలేదు కదూ. ఇదే భవంతిలో. మీ ఈ పురనివాసం వెనుక జంతుకోష్టంలో..”
నోరు తెరిచాడు.
‘ఎంత తెలివి చిన్నతల్లి.. ఇక్కడ ఉంటే మురారికి సందేహం రాదుగాక రాదు!’
“రుద్రమ.. నిజంగా.. అంత తెలివైనదా శుక్ర??”
“నిస్సందేహంగా! ఆమె ప్రతిభే కాకతీయ రాజ్యానికి మంచో చెడో అవుతుంది. అది కాలమే నిర్ణయిస్తుంది జాయా..”
నిష్ర్కమించాడు శుక్ర.
రాత్రంతా అలాగే ఉండిపోయాడు జాయచోడుడు.
ఇదంతా తను యాత్రలో ఉన్నప్పుడు.. కొలని యుద్ధానికి ముందు జరిగింది. కొలని యుద్ధానికి మురారి రాలేదు. రుద్రమ అడిగిమరీ వచ్చింది. తన శక్తియుక్తులను నిరూపించుకుంది.
వచ్చాకకూడా వాళ్లిద్దరూ ఎప్పటిలాగే ఆత్మీయుల్లా కలసిమెలసి కబురు చెప్పుకొంటూ కనిపిస్తున్నారు. కొలని యుద్ధ విశేషాలు రుద్రమ చెబుతుంటే.. అక్క శౌర్యప్రతాపాలను మెచ్చుకుంటూ మురారి వినడం.. చూసినప్పుడల్లా ఒళ్లు ఝల్లుమంటోంది జాయచోడునికి.
తండ్రిలా కూతురు! గుంభనంగా ఉంటుంది. ముఖంలో ఏ భావమూ కనిపించదు. వాడు తల్లి కొడుకు!
ఆమెలాగే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. కానీ, ఆమె అమాయకురాలు.. వీడు మాయకుడు!!
మరి తన సంగతి ఏమిటి.. మాటాపాటా లేని దేశీయ చిందు.. లేకుంటే నృత్తం! ఉద్వేగపు నటరాజనృత్తం!!
మరి ముయలకుడు ఎవరో?!
ఉన్నపళంగా రావాల్సిందిగా గణపతిదేవుని పిలుపు.
‘ఇటీవల ఆయన అన్నీ కొంపలంటుకు పోయేలా చేస్తున్నారు. అన్నిటికీ జాయ.. జాయ..’
రాస్తున్న తాళపత్ర రేఖను, గంటాన్ని పక్కకు విసిరేసి సణుక్కుంటూ బట్టలు సరిచూసుకుని కిందికి పరిగెత్తాడు జాయచోడుడు.
వేగంగా విక్రమ తీసుకుపోగా, వెళ్లి ఆంతరంగిక మందిరంలో ఆయన ముందు నిలిచాడు.
అక్కడున్న అతిథులు లేచి గౌరవంగా నిలబడ్డారు.
నిడదవ్రోలు పాలకుడు ఇందుశేఖరుడు, ఆయన ధర్మపత్ని ఉదయాంబిక.. వారి రాజపురోహితుడు కాబోలు..
మరో పదిమంది.. బంధువులో బాంధవులో.. పూవులు పళ్లు నగలు బట్టలు వగైరా వగైరా..
విభ్రమగా చూశాడు జాయచోడుడు. ఎదురేగి ఇందుశేఖరుణ్ని హత్తుకున్నాడు.
“మిత్రమా! ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నమస్కారం మహారాజ్ఞీ.. అంతా క్షేమమే కదా..”
గణపతిదేవుని ముఖంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆనందకెరటాల ఉద్వేగం.. జాయచోడుడు ఎప్పుడూ చూడలేదు. నారాంబ కూడా పైనుంచి కిందివరకు కెరటాలపై పడవలా ఆనందంలో తేలియాడుతోంది.
ఏమిటి సంగతి?!!
ఇందుశేఖరుడు తన కుమారుడు రుద్ర భూపతికి గణపతిదేవుని రెండవ కుమార్తె రుద్రమదేవిని ధర్మపత్నిగా అభ్యర్థించడానికి వచ్చారు.. సకల లాంఛనాలతో!!
అందరిలో ఒకటే భావన.. కేవలం అంగీకారపు విస్మయానందం!
ఓ అంశంపై అందరిలో ఏకీభావం ఉంటుంది. కానీ గుర్తించడం జరగదు. ఎవరోఒకరు గుర్తించి ప్రకటిస్తే అందరూ తుళ్లిపడతారు..
‘అరె.. ఇది నేనెందుకు ప్రతిపాదించలేదు’ అని.
రుద్రమదేవి – వీరభద్రుల వివాహ ప్రతిపాదన రాజవార్తాసంబంధి చతుష్పథాల వద్ద ప్రకటించినప్పుడు పురవాసులలో కూడా విశేష స్పందన లభించింది. కాకతీయ సామ్రాజ్య సమస్త ప్రజల, మండలీశ్వరుల, గోళకీ శైవగురువుల ఆమోదంతో వారి వివాహం రంగరంగ వైభవంగా జరిగింది.
రుద్రమదేవిని యుద్ధభూమిలో క్లిష్టసమయంలో కాపాడి రక్షించిన వీరభద్రుడు..
రుద్రమకు చెబితే రెప్పలు బరువెక్కి కళ్లపై కూలిపోయాయి. అందరి చూపులూ ఆమె బుగ్గలపైకి వెళ్లగా.. అవి విరగపూచిన ఎర్రెర్రని పూలతోటల్లా ఉన్నాయి.
రుద్రమ, రుద్రభూపతుల వివాహమా.. లిప్తకాలం కూడా ఆలస్యం లేదు. అంతా ఏకగ్రీవమే!!
ఈ వివాహ ప్రతిపాదన జాయచోడుణ్ని మరోవిధంగా కూడా ఆనందపరచింది. రుద్రమ అత్తారింటికి వెళ్లిపోతే మురారికి పోటీ అన్న భయమే ఉండదు. కాబట్టి ఎలాంటి రాద్ధాంతాలు చేయకుండా వినయవంతుడిలా పెద్దలమాట వింటాడు!
ఈ వివాహ ప్రతిపాదన రాజవార్తాసంబంధి చతుష్పథాల వద్ద ప్రకటించినప్పుడు పురవాసులలో కూడా విశేష స్పందన లభించింది. కాకతీయ సామ్రాజ్య సమస్త ప్రజల, మండలీశ్వరుల, గోళకీ శైవగురువుల ఆమోదంతో రుద్రమదేవి, వీరభద్రుల వివాహం రంగరంగ వైభవంగా జరిగింది.
అక్క వివాహం అన్నీ తానై నిర్వహించాడు మురారి. అంతిమఘట్టం అప్పగింతలవేళ వెక్కివెక్కి ఏడ్చాడు.
అప్పుడొక మురారి స్నేహితుడు అన్నాడు.
“చాలు. ఏడుపు ఆపు మురారి! నువ్వు ఆనందించాల్సిన సమయం ఇది. ఇక నువ్వే కాకతీయ సామ్రాజ్యానికి భావి సామ్రాట్టువి..”
మురారి మరింత ఆనందంగా దుఃఖించాడు!
తొమ్మిదవ అధ్యాయం : మన భరతముని!
పగలు మూడవ ఝామువేళ.. అనుమకొండ చల్లచల్లగా ఉల్లాసంగా అట్టహాసంగా ఉంది.
అటూఇటూ కదులుతున్న జనవాహినితో ప్రధానవీధులన్నీ ప్రవహిస్తున్న మహానదుల్లా ఉన్నాయి. జాయచోడుని పురనివాసం. మొదటి అంతర్వులోని గవాక్షంవద్ద నిలబడి వీధులను పరికిస్తున్నాడు. అప్పుడే భోజనం ముగించాడు. రాస్తున్న ‘వాద్యరత్నావళి’ అంశాలు మదిలో తాళ లయగతుల్లో నృత్తిస్తున్నాయి.
దగ్గరగా కుబుక్.. కుబుక్.. శబ్దాలు చేస్తోన్న కపోతాలు. కపోత పాలికలలో మెల్లగా కదలుతూ రెక్కలు విదుల్చుతూ తిరుగాడుతున్నాయి. వీధిలో మత్తగజాలపైనున్న అంబారీలు ఏనుగుల నడకకు అనుగుణంగా జాయచోడుని కంటిముందు ఊగుతూ పోతున్నాయి.
ఎంతగా ఎదిగింది అనుమకొండ?!
ఎటు చూసినా బహుళ అంతర్వుల భవనాలు. ఇటుక గోడలపై దూలాలు, దంతేలు వేసి కట్టిన.. ఒకటి, రెండు, మూడు, నాలుగు మిద్దెటింట్లు.. దూరంగా ఉన్నతంగా కొత్త కోట నిర్మాణాలు.. ఆకాశానికి తాకుతున్నట్లుండి జగద్విఖ్యాతి పొందుతున్న ద్వారతోరణాలు.. వీటిని దర్శించడానికే విదేశీయులు బృందాలుగా వస్తున్నారట. ఇటీవల స్థపతి రామప చెప్పాడు.
ఎవరో తన భుజానికి తాకుతూ నిలబడినట్లు.. కాకతి! గ్రంథరచనకు కూర్చున్నప్పుడు గంటం కదిలితే చాలు! కాకతి కనపడుతుంది. రాస్తూ ఉంటే ఎదురుగా నృత్తం ప్రారంభిస్తుంది.. ఆమె కోసం గజ్జె కడతాడు. ఆమెతో ఆడుతున్నట్లు మైమరచి ఆడతాడు. ఆ రసాస్వాదనతో మైమరుస్తాడు. అదే ఆమెతో కామకేళీ విలాస విభ్రమ సంగమ భాస్వంతం.. సముత్పన్న సమాగమ స్వయంతృప్తి!
కనులు మూసుకున్నాడు తృప్తో అసంతృప్తో తెలియని ఆర్తితో..
ఇప్పటికీ దేవాలయాల్లో కాకతి కోసం వేయికళ్లతో వెదుకుతాడు. ప్చ్! ఆశ.. నిరాశ! కాదుకాదు.. నిరాశ కాదు కేవలం ఆశ! తప్పకుండా ఏదోరోజున ఎక్కడో ఏదో గుడిలో కనబడుతుంది నా కాకతి!! దీర్ఘంగా నిట్టూర్చాడు.
వయస్సు పడమటికి మళ్లింది. ఒంటరి జీవితం. ‘తిన్నావా తినలేదా?’ అని అడిగే వారెవ్వరు.. పిల్లల కోసం హడావుడి పడిపోయే ఓ అమాయకురాలైన అక్క.. తెలుగు రాజ్యస్థాపనమే జీవనపరమావధిగా బతికే బావ..
వెనక అలికిడి..
చటుక్కున చేతులు మహావేగంగా కదిపి వెనుక దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తిని పట్టి ఎత్తి గిర్రున తిప్పి దూరంగా విసిరివేయబోయాడు.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284