మాయ మాటలు మాట్లాడుతూ పొదిలి లింగన్న చేతికి అందించిన విష పానీయం నమ్మికతో అందుకున్నాడు తిమ్మానాయుడు. మరోపక్క తన చేతిలో ఉంచిన ఫర్మానా చూసి నివ్వెరపోయినాడు. గుత్తి దుర్గానికి బదులుగా ఒక చిన్న గ్రామం హనుమనగుత్తికి అధికారినిచేస్తూ ఇచ్చిన ఫర్మానా! కసిగా చించి ముక్కలు చేశాడు. ఆ వెంటనే గొంతు పట్టుకుని గిలగిలలాడుతూ నేలకొరిగాడు..
క్రీ.శ. 1652. ఎర్రమల కొండలపైన దర్పంగా నిలిచి ఉన్నది గండికోట గిరిదుర్గం.పెమ్మసాని చిన తిమ్మానాయుడు కోట బురుజుపైన నిలబడి.. ఒకసారి కోట నలుముఖాలా పారజూశాడు. ఆయన పక్కనే నిల్చొని ఉన్నాడు సేనానీ, బావమరిదీ అయిన శాయపనేని నరసింహ నాయుడు.
కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్లతో నిర్మితమైంది. వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత.. దాదాపు ఐదు మైళ్లు ఉంటుంది! కోట ముఖద్వారానికి ఉన్న ఎత్తయిన కొయ్య తలుపులు.. ఇనుప రేకుతో తాపడం చేసి ఉన్నాయి. తలుపులపైన ఇనుప మేకులున్నాయి. కొండ రాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు! ఆ గోడలు ముప్పై రెండు నుంచి నలభైరెండు అడుగుల దాకా ఎత్తున్నాయి. చతురస్రాకారంలోనూ, దీర్ఘ చతురస్రాకారంలోనూ నలభై బురుజులున్నాయి.
గోడ పైభాగాన సైనికుల సంచారం కోసం సుమారు పదహారు అడుగుల వెడల్పుతో బాట ఉన్నది!అల్లంత దూరంలో పక్కనే లోయలో ప్రవహిస్తున్నది పెన్నా నది. ఆవల పక్క మళ్లీ నిట్రంగా నిలబడి ఎర్రమల కొండలు.. లోయ పొడవునా పరుచుకుని. నిజానికి ఎర్రమల కొండల్ని రెండుగా కోస్తూ.. పెన్నా ప్రవహించడం వల్ల ఏర్పడినదే ఈ గండి, లోయ! అందుకే.. ఈ కోట గండికోట అయింది! కొండ అంచుకు వెళ్లి నిలబడిచూస్తే ఒక మూడువందల అడుగుల దిగువ వరకూ లోయ నిట్రంగా, కోటగోడలా నిలబడి.. కింద నదీ లోయకు దారితీస్తుంది. గండికోటకు ఆవల అది ఒక పెట్టని కోట!
తిమ్మానాయుని చెయ్యి అప్రయత్నంగా అతని మీసంపై నిలిచింది. కళ్లు ఎర్రని జీరలు పొడసూపినవి.
“మనం మన వంతు కప్పం చెల్లించినాము. అయినా కుతుబ్‌షా తన సైన్యాన్ని పంపించినాడు. కోటను వశం చెయ్యమంటాడు. ఇదంతా ఆ మీర్ జుమ్లాగాడి పని. పారశీక దేశంనించి వచ్చిన వజ్రాల వ్యాపారి, వాడొక గజదొంగ. కుతుబ్‌షా ప్రాపకం సంపాదించి అక్కడ వజీరు స్థానానికి ఎగబాకాడు. ఇప్పుడు మన సీమలోని వజ్రపు గనులపై గురిపెట్టినాడు. ఇప్పుడు వాడే ముందుండి సైన్యాన్ని నడిపిస్తున్నాడు! వానికి సహాయంగా ఆధునిక యుద్ధ తంత్రం తెలిసిన మైలీ అట.. ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణుడు కూడా ఉన్నాడు. మూడు ఫిరంగులు వెంటవేసుకు వస్తున్నాడట!”.
నరసింహనాయుడు తన వొరలోని కత్తిపిడిపై చేయి ఆనించి అన్నాడు..
“ఔను బావా! పైగా గోలకొండ దర్బారులో ఉన్నతాధికారి పొదిలి లింగన్న వానికి వత్తాసు పలుకుతున్నాడు” అని చెప్పి, ఆగి మళ్లీ అన్నాడు..
“వాడు ఫిరంగులు కొండపైకి తేలేడుగాక తేలేడు! అటు చూడు బావా.. రెండు బురుజులపై నిలిచి ఉన్న మన రెండు ఫిరంగులు, శత్రువు రావడానికి ఉన్న ఒకేఒక మార్గాన్ని గురిపెట్టి నిలుచున్నాయి. కోటను పట్టుకోడానికి వాని అబ్బ దిగిరావాలి!”.. అంటూ పళ్లు నూరాడు నరసింహుడు.
ఒకవేళ శత్రువు కోటలోకి ప్రవేశించగలిగినా ఎదుర్కొని పోరగల సత్తా ఉంది తమకు. చిన తిమ్మానాయుడు స్వయంగా కత్తిపట్టి గుర్రమెక్కి పోరగల సమర్థుడు. మీర్ జుమ్లా సేన పెద్దదే కావచ్చు. కానీ, తమ సేన ధైర్యసాహసాలు ఎదురులేనివి! చిన తిమ్మానాయుడు వెనుదిరిగి ఒకసారి కోట ఆవరణలోకి తొంగిచూశాడు. కోటలో తన అశ్వ, పదాతి దళాలు కవాతు చేస్తున్నవి. ఆయుధధారులై దళపతులు ముందుండి ఆజ్ఞలను ఇస్తున్నారు. కోటలో చెరువున్నది. తిండి, యుద్ధసామగ్రి ఎన్నిరోజులకైనా సరిపడా ఉన్నది. ఆపై రంగనాథుడు ఉన్నాడు! తిమ్మానాయుడు ఒకసారి దూరంగా అగుపిస్తున్న ఆలయంవైపు తిరిగి మనసులోనే నమస్కరించాడు.
యుద్ధం ఆరంభమైనది. ఫిరంగి గుళ్లు కిందికి దూసుకుపోతున్నవి.
“జై రంగనాథ!” కేకలు కోటపైనించి మిన్నంటుతున్నవి. కోట దరిదాపులకు రావడానికి సాహసించిన ఏ శత్రు సైనికుడైనా మట్టికరుస్తున్నాడు.. పైనించి కురిసే ఫిరంగి గుళ్లు, బరిశెల ధాటికి. రోజులు గడిచినకొద్దీ యుద్ధం భీకరమవుతున్నది. తెగించిన కుతుబ్‌షాహీ సైన్యం ముందుకు తోసుకువచ్చినపుడల్లా.. అంతే దీటుగా బురుజుపైనించి ఎదురుదాడి జరుగుతున్నది. బరిశెలు, శతఘ్నులు రెండువైపులా ప్రాణాలు తీస్తున్నయి, రక్తం కళ్ల జూస్తున్నయి.
గండికోట చరిత్ర పదమూడో శతాబ్దం రెండో అర్ధభాగంలో మొదలైంది. విజయనగర సామ్రాజ్య స్థాపకుడు బుక్కరాయలు క్రీ.శ. 1356లో మిక్కిలినేని రామానాయుడనే యోధుణ్ని గండికోటలో సామంతునిగా నియమించాడు. ఆ తరవాత గండికోట విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలవగా, విజయనగర రాజులకు విశ్వాసపాత్రులై, పలు యుద్ధాలలో తురుష్కులను ఓడించి, ప్రసిద్ధిగాంచిన పెమ్మసాని నాయకులకు నెలవైంది. తెలుగు వారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, హిందూధర్మ సంరక్షణ తత్పరతకు ప్రతీకగా నిలిచింది గండికోట!
క్రీ.శ. 1565 తళ్లికోట యుద్ధంలో అళియ రామరాజు పరాజయం.. విజయనగర సామ్రాజ్య పతనానికి దారితీసింది. అంతవరకూ అణగిమణగి ఉన్న దక్కను సుల్తానులు విజృంభించి.. సామ్రాజ్యంలోని ఒకొక్క ప్రాంతాన్నే గదుముకొనడానికి పోటీలు పడుతున్న తరుణమది. బీజాపూర్ సుల్తాను ఆదిల్షా, గోల్కొండ నవాబు కుతుబ్షాల మధ్య ప్రధానంగా ఇక్కడ పోటీ. వజ్రాల గనులకు నెలవైన గుత్తి దుర్గం, గండికోట దుర్గాలను లొంగదీయడానికి మీర్ జుమ్లాను అబ్దుల్లా కుతుబ్‌షా పురమాయించాడు. గండికోటపైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నవి. విజయనగర సామ్రాజ్యాన్ని పునరుజ్జీవింప జేయాలంటే.. తిమ్మానాయుడు యుద్ధం గెలిచేతీరాలి.
రోజులు గడిచినకొద్దీ ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలు వారుతున్నవి. అయినా అంత సులభంగా పడిపోయే కట్టడం కాదది! కానీ రేపు ఏమవుతుందో ఎవరికెరుక? రాణి చిన్నమ్మ రంగనాథునికి మొక్కులు మొక్కుతున్నది. అంతఃపురాన్ని ఆనుకుని ఉన్న విశాలమైన గదిలో స్త్రీలంతాచేరి బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు, తమ పిల్లలను అక్కున చేర్చుకుని.
మీర్ జుమ్లాలో అంతకంతకూ అసహనం పెరిగిపోతున్నది. మూడు నెలలు కావస్తున్నది.. యుద్ధం మొదలై! కోటలో ఎక్కుపెట్టిన ఫిరంగుల ధాటికి తాను ఇక్కడ, ఇంతదూరంలో మకాం వేయవలసి వచ్చింది. భారీ సేన ఉంది.. ఏం లాభం? పిడికిళ్లు బిగుస్తున్నయ్.. తనలోని అసహనాన్ని సూచిస్తూ. తన విశాలమైన గుడారంలో బోనులో పులిలా పచార్లు చేస్తున్నాడు జుమ్లా. పొదిలి లింగన్నను చూసి..
“చంద్రగిరి కోట, ఇతర కోటలు సులువుగా పట్టుకున్నా. ఈ కోట గట్టిదని తెలుసు, పడితే ఇలాంటిదాన్నే పట్టాలి! ఇప్పుడు మన జిత్తులు ఉపయోగించే సమయం వచ్చింది” అన్నాడు.
పొదిలి లింగన్న గొంతు సవరించుకున్నాడు.
“సాహెబ్! ఇలాంటప్పుడే మన యుక్తిని వినియోగించాలి! ఒకసారి కూర్చోండి చెపుతాను!”.
జుమ్లా వచ్చి తన కుర్చీలో కూర్చుని..“చెప్పండి!” అన్నాడు.
“తిమ్మానాయుడి పరిస్థితీ బాగాలేదు. ఎంతకాలం కూర్చుంటాడు కోటలో? మనం ఒక ఒప్పందం కొరకు మనిషిని రాయబారం పంపిద్దాం. కోట అప్పజెపితే.. బదులుగా గుత్తి దుర్గాన్ని తనకు ఇస్తామని లేఖ పంపండి! తప్పక ఒక మెట్టు దిగివస్తాడు తిమ్మడు. ఒప్పుకొన్నాక ఏంచెయ్యాలో చూద్దాం.. ఉత్త మాటేగా ఇచ్చేది!” అంటూ కన్నుగీటాడు.
“అయితే నువ్వే ముందుండి రాయబారం నడిపించు!” అన్నాడు మీర్ జుమ్లా.
తన సమావేశమందిరంలో చిన తిమ్మానాయుడు కూర్చుని ఉన్నాడు. మంత్రి చెన్నమరాజు వయసులో పెద్దవాడు. ఆయన దృష్టిలో ఇదొక మంచి అవకాశం. కోటలో స్త్రీలు, పిల్లల క్షేమంకోసం మీర్ జుమ్లా షరతులు ఒప్పేసుకోమని సలహాఇచ్చాడు. పరదా చాటునించి రాణి చిన్నమ్మ వింటున్నది.. గుబగుబలాడే గుండెలతో.
“ఇది ఆ పొదిలి లింగన్న కుతంత్రమని నా నమ్మకం బావా! వాళ్లు మాటమీద నిలబడతారని నమ్మకమేమిటి?” అంటూ నరసింహనాయుడు తన మనసులో మాట చెప్పాడు.
తిమ్మానాయుడు గంభీరమైన కంఠంతో బదులిచ్చాడు.
“వాడు భిక్షపెడతాడా నాకు.. గుత్తి దుర్గం? విజయమో, వీరస్వర్గమో.. యుద్ధమే మన ముందున్న మార్గం. మన దళపతులను హెచ్చరించండి అప్రమత్తంగా ఉండమని. అంతిమ విజయం మనదే!”.
రాణి చిన్నమ్మ బరువైన గుండెలతో బయటికి నడిచింది, స్త్రీలు తలదాచుకున్న మందిరంవైపు. రాచ స్త్రీలంతా వాళ్లలో వారే ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాల్సిన దుర్భరస్థితి అది. మగవాళ్లంతా యుద్ధంలో తలమునకలై ఉన్నారు మరి!
మళ్లీ యుద్ధం మొదలు.మైలీకి ఆజ్ఞనిచ్చాడు జుమ్లా..
“నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మూడు ఫిరంగులను కొండపైకి చేర్చాలి. ఎంతమంది సైనికులు కావాలో అడుగు. నాకు మాత్రం పని కావాలి!”.
క్లాడ మైలీ అతి కష్టమ్మీద మూడు భారీ ఫిరంగులను కొండమీదికి చేర్చాడు. నరసింహనాయుడు బురుజుమీంచి నిస్సహాయంగా గమనిస్తున్నాడు. జరగకూడనిది జరుగుతున్నది. తన సైనికులు ఎంత ప్రయత్నించినా ఆపలేకపోతున్నారు. ఆ తెల్లారి.. ఫిరంగి మోతలతో కోట పరిసరాలు దద్దరిల్లినయి. కోటలో కలవరం మొదలయింది.
మీర్ జుమ్లా కసిగా చూస్తున్నాడు. ఇంతకాలానికి కోటను వశపరుచుకొనే సమయం వచ్చిందని ధీమా! భీకరంగా వచ్చిపడే ఫిరంగి గుళ్ల తాకిడికి కోట బీటలు వారుతున్నది. ఏ క్షణంలోనైనా గోడ కూలి ఒక దగ్గర దారిస్తే చాలు.. శత్రువుపై భీకర దాడికి దిగడానికి రేచుకుక్కల్లా తన సైన్యం కాచుకుని ఉంది. ఆవల పక్క నరసింహనాయుడు హతాశుడై చూస్తున్నాడు.. కూలడానికి సిద్ధంగా ఉన్న గోడవంక. వెంటనే తన గుర్రాన్ని ముందుకురికించి పెద్దగొంతుతో దళపతులను హెచ్చరించాడు..
“కత్తులు, బరిశెలు పట్టండి. లోనికి వచ్చినవాణ్ని వచ్చినట్టు నరికెయ్యాలె! కోట తలుపులు తెరవనీకుండా అక్కడ కొంత సేన మోహరించండి. ఒక నాలుగువేల సైన్యం రాజమందిరాన్ని చుట్టుముట్టి కావలికాయాల.. పురుగైనా లోనికేగవద్దు!”.
‘పఠేల్’మనే చప్పుడుతో గుండు తాకి.. కోటగోడ విచ్చిపోయింది.
“జై రంగనాథా!” అంటూ.. నరసింహుడు లోనికి వచ్చిన సైనికుణ్ని వచ్చినట్టు వేటువేస్తూ ముందుకు కదిలాడు. అతనికి బాసటగా ఒక పటాలమే ముందుకు కదిలి పోరుకు దిగింది. ఒకపక్క మరింతమంది శత్రుసైనికులు లోనికి చొచ్చుకువచ్చేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. మిడతల దండులను గుర్తుకుతెస్తున్నారు. ఇక సంకుల సమరం మొదలయింది. ఇరువైపులా వందలమంది నేలకొరుగుతున్నారు. నేల రక్తంతో తడిసింది. హాహాకారాలు మిన్నంటుతున్నవి.
భయపడవద్దంటూ ఒకపక్క తనవారిని హెచ్చరిస్తూ.. అంతటా తానై తిరుగుతున్నాడు నరసింహనాయుడు. హఠాత్తుగా వెనకనించి పడింది ఒక కత్తివేటు. కత్తి వాదర భుజాన్ని చీరేసింది. అలాగే గుర్రం మీదినించి కిందికిపడి నేలకొరిగాడు.
“శభాష్ నబీ!”.. వెనకనుంచి ఎవడో బిగ్గరగా అరిచినాడు.
“స్వామీ!” అంటూ అంగరక్షకుడు పరుగున వెళ్లి పట్టుకున్నాడు.
తమ నాయకుణ్ని ఒక పక్కకు లాగి, గోడ ఆసరాగా కూర్చుండబెట్టాడు. లోనికి వచ్చే శత్రుమూకలను ఎదుర్కోవాలి, సమయం లేదు. ముందుగా రాజుగారికి వర్తమానం పంపించాలి. వార్తాహరుణ్ని ఉరికించాడు.. రాజమహల్ దగ్గరికి. కబురందించమని. తాను ముందుకురికినాడు.. శత్రువులను నిలవరించడానికి.. ‘జై రంగనాథా!’ అని నినదిస్తూ.
చిన తిమ్మానాయుడు ఖిన్నవదనుడై విన్నాడు వార్త. తన బావమరిది ఇక లేడు. ఆ సమయంలో ఆయన ఆసనం పక్కనే నిలబడి ఉన్నారు ఇద్దరూ.. రాణి చిన్నమ్మ, చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ. గోవిందమ్మ వంక జూశాడు. ఆమె కళల్లో నీళ్లు కారిపోతున్నవి.. సెలయేరుల్లాగ. కానీ, ఆమె చిత్రంగా తన కళ్ల నీళ్లు పైటకొంగుతో తుడుచుకుంది.
“నే వెళ్తున్నానన్నా!” అన్నది క్లుప్తంగా.దిమ్మెరపోయి నాయుడన్నాడు..
“ఎక్కడికి చెల్లెమ్మా?”.
ఒకపక్క పక్కగదిలో స్త్రీలంతా ఘొల్లున ఏడుస్తున్నారు.. భర్త లేని జీవితం వృథా అని, శత్రువునించి మాన ప్రాణాలు కాపాడుకోడానికి చితిపేర్చుకు దుమికేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక నిమిషం వారి రోదనలు ఆలకిస్తూ అన్నది గోవిందమ్మ..
“నా భర్తను చంపినోణ్ని వెంట తీసుకుపోకుండా నేనెట్ల పోతానన్నా?”.
తిమ్మానాయుడు ఎంత వారిస్తున్నా వినక చీర బిగించి కట్టి, కాసెగట్టింది గోవిందమ్మ. ఒక వందమంది సైనికులను తనవెంట రమ్మన్నది.
అశ్వమెక్కి కత్తి చేతబట్ట్టింది..
“అబ్దుల్ నబీ అట.. వాడెక్కడున్నాడో జాడ తియ్యండి!” అంటూనే గుర్రాన్ని ముందుకు ఉరికించింది.
రణం సాగుతూనే ఉన్నది. కోట అంతటా శత్రువులు వ్యాపించి ఉన్నారు. తనకు అడ్డువచ్చిన వారిని వేటువెయ్యమని తనవారిని ఆజ్ఞాపిస్తూ.. తాను తప్పించుకుంటూ అందిన వానిని వేటువేస్తూ వదలకుండా వేటాడింది వానికోసం. చివరికి దొరికినాడు.. ఆ నబీ అనేవాడు.
“అరేయ్ నబీ!” అని ఆమె పెట్టిన పెడబొబ్బకు వాడు నివ్వెరపడి ఒకక్షణం నిలిచిపోయినాడు.
అదే అదనుగా ఆమె కత్తి ఎత్తింది. వాని గుండెల్లో గుచ్చింది. వాడు తేరుకుని ఆమెను ఒక్క పోటుపొడిచి తాను గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలినాడు. గోవిందమ్మ గుర్రంపైనించి తూలిపడి నేలకు జారింది. ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి.
గుర్రమెక్కి రణరంగంలో కదను తొక్కుతున్న చిన తిమ్మానాయుడు.. చెల్లెలి మరణ వార్త విని నిశ్చేష్టుడైనాడు. చుట్టూ చూస్తే శవాల గుట్టలు, మనసంతా వికలమయింది. సంధికి రమ్మని పొదిలి లింగన్న కబురంపితే తప్పనిసరై ఒప్పుకొన్నాడు.
‘జరిగిన రక్తపాతం చాలు. అయినవాళ్లంతా మరణించారు.. ఇంకా ఏం బావుకుందామని?’.. అయితే, మనసు హెచ్చరించింది. తన రాజ కుటుంబీకులను, అనుచరులను సంప్రదించాడు. లింగన్న మాటలు నీటిమూటలు. ఐదేళ్ల తన వారసుడు, కొడుకు పిన్నయనాయుడిని రహస్యమార్గం గుండా కోట దాటించేలా ఏర్పాటుచేసి, మిగతా బంధువులను తరలి వెళ్లిపొమ్మని అప్పుడు బయల్దేరాడు.. సంధి ప్రయత్నాలకు.
మాయ మాటలు మాట్లాడుతూ పొదిలి లింగన్న చేతికి అందించిన విష పానీయం నమ్మికతో అందుకున్నాడు తిమ్మానాయుడు. మరోపక్క తన చేతిలో ఉంచిన ఫర్మానా చూసి నివ్వెరపోయినాడు. గుత్తి దుర్గానికి బదులుగా ఒక చిన్న గ్రామం హనుమనగుత్తికి అధికారినిచేస్తూ ఇచ్చిన ఫర్మానా! కసిగా చించి ముక్కలు చేశాడు. ఆ వెంటనే గొంతు పట్టుకుని గిలగిలలాడుతూ నేలకొరిగాడు..
“రంగనాథా.. కాపాడు నా ప్రజలని, నా కోటని!” అని ప్రార్థిస్తూ, తుదిశ్వాస విడిచాడు.
తనువు కోట నేలను ముద్దాడింది. రాజులేని గండికోట బావురుమన్నది.
వీరుల పుట్టిల్లు గండికోట పతనం పూర్తయింది. కోట సంపదను పూర్తిగా కొల్లగొట్టాడు మీర్ జుమ్లా. మాధవ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక ప్రార్థనా మందిరాన్ని కట్టించినాడు.
గండికోట పతనమైన ఎనిమిది రోజులకు ప్రముఖ వజ్రాల వ్యాపారి టావెర్నియర్ గండికోటలో మీర్ జుమ్లాను కలిసి ఉండకపోతే.. ఆ సందర్భంలో చిన తిమ్మానాయుని శౌర్య పరాక్రమాల గురించి విని తన పుస్తకంలో నమోదుచేసి ఉండకపోతే.. కోటను కాపాడటానికి చేసిన ఈ వీరోచిత పోరు మనదాకా రాకపోయేది. గండికోట సగర్వంగా నేటికీ తలెత్తుకు నిలిచే ఉంది.. చరిత్రకు నిలువెత్తు సాక్షిగా. కలం అందుకొమ్మని, ఛాయా మాత్రంగా ఉన్న తన చరిత్ర ఆఖరి అధ్యాయాన్ని కథగా, ఒక గాథగా మలచమని పిలుపునిస్తున్నట్టుగా ఉంది. ఆ పిలుపునకు స్పందనగా ఒక చిన్న యత్నం.. ఈ గండికోట పతనం!
తెన్నేటి శ్యామకృష్ణ
చారిత్రక నేపథ్యంలో మరిన్ని కథలు రాయాలన్నది తన కోరికగా చెబుతున్నారు రచయిత తెన్నేటి శ్యామకృష్ణ. ఈయన తల్లిదండ్రులు అహల్యాదేవి – టీవీ సుబ్బారావు. స్వస్థలం వరంగల్. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎంఏ, ఆంగ్లంలో డాక్టరేట్ చేశారు. జూనియర్ లెక్చరర్‌గా విరమణ పొందారు. చదువుకునే రోజుల నుంచే పిల్లల పత్రికలకు కథలు రాయడంతో రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. బాలమిత్రలో కథకు బహుమతి లభించింది. ఆ తర్వాత పిల్లలకోసం నాటికలు రాసి ప్రదర్శించారు. ప్రశంసలూ అందుకున్నారు. ఈ నాటికలను పుస్తకంగా తీసుకురానున్నారు. ఈయన రాసిన పలు కథలు ప్రముఖ తెలుగు పత్రికలతోపాటు ఈ రచన పత్రిక, నెచ్చెలి స్త్రీల పత్రికలో ప్రచురితమయ్యాయి. సాహితీ కిరణం, ‘సాక్షి ఫన్డే’లో కవితలు వచ్చాయి. వివిధ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో దేవుడు వెలిశాడు, మాబడి మర్రిచెట్టు నీడన తదితర కథలు బహుమతులు దక్కించుకున్నాయి. వంశీ ఆర్ట్స్ సంస్థ ఏటా ప్రచురించే ‘కొత్త కథలు’ కథా సంకలనంలో నాలుగు కథలు ప్రచురితమయ్యాయి.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి
పొందిన కథ.
-తెన్నేటి శ్యామకృష్ణ
94909 95015