ఊరి నుంచి రాగానే కాలేజీకి వెళ్లి నేను చేసిన మొదటి పని బోటనీ మేడమ్‌కి రికార్డు సమర్పించడం. ఆ తరువాత ఆఫీసుకు వెళ్లి అదే విషయం సుమిత్రా మేడమ్‌కి చెప్పేసాను. ‘ఓకె.. ఓకే’ అన్నారు. ఈసారి ఎందుకో గానీ, నాకు చాలా దిగులు పట్టుకుంది. అమ్మకు ఎలా ఉందో ఏమో! తను పైకి ఏమీ చెప్పదు. నాన్న బయటి వాళ్ళందరికీ మంచివాడే, అమ్మను పెద్దగా పట్టించుకోడు అనిపించేది. ఈ పరీక్షలు అయిపోతే తరువాత ఎలాగైనా వరంగల్‌లోనే చదువుకోవాలి గానీ, ఈ హైదరాబాదు మటుకు వద్దు.
ఈ మహానగరం ఎప్పుడైనా వచ్చి వెళ్లడానికి బావుంటుంది గానీ, వుండటానికి మాత్రం కాదు అనుకునేదాన్ని లక్ష్మి, హైమక్క వాళ్లు ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్లింటికి వెళ్లాక, అక్కడికి వెళ్లడం కూడా తగ్గిపోయింది. పరీక్షలు మొదలయ్యేలోగా ఒకసారి వెళ్లొద్దాం అనిపించి వెళ్లాను. అక్కడ పద్మ చిన్నమ్మ కూడా ఎందుకో ఎప్పటిలా ఉత్సాహంగా లేదు. ఎందుకట్లా ఉందని హైమక్కను అడిగాను. ‘ఎమ్మో! నాక్కూడా పూర్తిగ తెల్వదు గానీ, ఏవో ఆస్తి లొల్లులు, పైసలు లెవ్వని గౌలిగూడా ఇల్లు అమ్మేసిన్రట.
అమ్మకు ఈ టెన్షన్కో ఏమో గానీ, బీపీ కూడా ఒచ్చింది ఎరికేనా! అంది. చిన్నమ్మ మహల్లో మహరాణిలా అనిపించేది. అలా దిగులుగా కనిపిస్తే ఎలాగో అయింది. గౌలిగూడా ఇల్లు ఎన్నో బాల్యపు మధుర జ్ఞాపకాల నెలవు. అక్కడ ఎన్నెన్నో ఆటలు ఆడాం, ముచ్చట్లు చెప్పుకొన్నాం, నవ్వులు పంచుకున్నాం. వాళ్లూ అంతే! అలాంటి ఇల్లు పోయిందంటే నాకే ఇంత బాధుంటే లక్ష్మికి, హైమక్కకూ ఎంతలా వుండాలి? ఎప్పట్లా చిన్నమ్మను నవ్వించలేకపోయాను.
మా పరీక్షలు దగ్గరికొచ్చాయి. ఆ తరువాతి వారంలో ఓ రోజు మాకు హాల్ టికెట్లిచ్చారు. క్లాసులో ఒక్కొక్కరి పేరు చదువుతూ హాల్ టికెట్ ఇవ్వగానే కొందరు దాన్ని తిప్పి తిప్పి చూసుకోవడం, ఇంకొందరు ముందుగా కళ్లకు అద్దుకోవడం, మరి కొందరు ఇంటికెళ్లి దేవుడి పటం ముందు పెట్టి తరువాతే చూస్తామని పక్కవాళ్లకు చెప్పడం జరుగుతున్నాయి. ఎంతసేపు చూసినా నా పేరు పిలవలేదు, హాల్ టికెట్ ఇవ్వనూ లేదు.
ఆఖరున లేచి నా హాల్‌టికెట్ అడిగాను. మేడమ్ చూసి ‘నో, యువర్స్ ఈస్ నాట్ దేర్’ అని ఓ సారి లిస్ట్ చూసి ‘యువర్ నేమ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్. గో అండ్ ఆస్క్ ఇన్ ఆఫీస్’ అన్నారు. నేను షాకయ్యాను. ఆఫీసుకు వెళ్లాను. సుమిత్రా మేడమ్ సీట్లో లేరు. ఆమె వచ్చేదాకా చూశాను. రాగానే నన్ను చూసి ‘ఎస్!’ అన్నారు ఏం కావాలి అన్నట్లుగా. విషయం చెప్పాను. ‘నిలబడు, చూస్తాను’ అని ఏవేవో ఫైల్స్, రిజిస్టర్లు వెతకడం మొదలుపెట్టిందామె. కాసేపటికి తలెత్తి ‘అవునూ! నీకు హాల్ టికెట్ రాలేదు. నువ్వు అప్లికేషన్ ఇచ్చావా, అసలు ఎగ్జామ్ ఫీజు కట్టావా?’ అన్నారు.
నాకు గుండె ఆగినంత పనయింది. ‘లేదు మేడమ్! నేను ఫీజు మొదలే కట్టాను. అప్లికేషన్ ఇవ్వబోతే బోటనీ రికార్డు ఇవ్వలేదని మీరు ముందురోజు తీసుకోలేదు. మర్నాడు రిక్వెస్ట్ లెటర్ రాసిచ్చాక తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రం బస్సుకు లేటయిందని మీ పక్కన దేవకి మేడమ్ పిలుస్తూ ఉన్నారు. నా అప్లికేషన్ తీసుకున్నాకే మీరు వెళ్లిపోయారు’ అని గుర్తు చేశాను. ‘సరే! రేపు రా! చూస్తాను. అయినా, ఇట్స్ టూ లేట్!’ అన్నారు. నాకు లోపల దుఃఖం సుళ్లు తిరుగుతోంది. చేసేదేం లేక మౌనంగా ఇంటికెళ్లాను. బాత్రూంలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను. ఇంట్లో వాళ్లు అడుగుతారని ముఖం కడుక్కుని బయటకు వచ్చాను. అయినా చిన్నమ్మలు పసిగట్టారు. ఎందుకు అట్ల ఉన్నవ్, ఏమైంది? అనడిగారు. ఏం లేదని చెప్పినా వాళ్లు నమ్మలేదు. నాకు అన్నం కూడా తినాలనిపించలేదు. వాళ్లు ఇంకోలా ఊహించుకున్నారేమో అనిపించింది. ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అనుకున్నారేమో! మర్నాడు గోపిక చిన్నమ్మ మరీ మరీ బలవంతం చేస్తే విషయం చెప్పాను. ‘అయ్యో! అదేందీ, నేనొచ్చి
అడుగుత’ ఉండు అంటూ నాయనమ్మకు చెప్పి నాతోపాటు కాలేజీకి వచ్చింది.
సుమిత్రా మేడమ్‌లో నిన్న కనిపించిన ఆ కాస్త కంగారు గానీ, కన్సర్న్ గానీ మర్నాడు లేదు. ‘ఏమవుతుందీ అమ్మాయి మీకు?’ అని అడిగి తెలుసుకుని ‘ఈ పిల్లలు ఇంతేనండీ! ఇంట్లో ఒకటి చెబుతారు, బయట ఒకటి చేస్తారు. అసలు ఫీజు కట్టిందో లేదో గట్టిగా అడగండి. నాకయితే అప్లికేషన్ ఇవ్వలేదు’ అంది కరుకుగా. చిన్నమ్మ కాస్త సందిగ్ధంలో పడుతూండగానే ‘నేను ఫీజు కట్టాను మేడమ్! ఆ చాలాన్ నా అప్లికేషన్‌తోపాటు జత చేశాను కూడా. ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున కట్టాను’ అన్నాను గుర్తు తెచ్చుకుని. ‘మరి ఫీజు కట్టినదానివి అప్లికేషన్ ఎందుకు ఇవ్వలేదు?’ అంటూనే ‘మీరు లోపలికి రండి’ అంటూ చిన్నమ్మను పిలిచింది.
నేను కూడా వెళ్లాను ఆఫీసు లోపలికి. ‘నేను పొద్దున్నే వచ్చి డెస్కులు, అల్మారాలు అన్నీ వెతికాను. ఒకవేళ తను ఇచ్చాక నేను పైకి పంపడం మర్చిపోతే ఎక్కడైనా ఉండాలిగా?’ అంది చిన్నమ్మతో. అవునన్నట్లు చిన్నమ్మ తలూపింది. ‘ఇదిగో, ఈ రిజిష్టర్ చూడండి, సీనియర్ ఇంటర్ బైపీసీ తెలుగు మీడియం నలభై మంది ఉంటే 38 మందికి హాల్ టికెట్లు వచ్చాయి, ఇచ్చేశాం. ఇద్దరు ఫీజు కట్టలేదు, అప్లికేషన్స్ ఇవ్వలేదు. ఒకరు సరస్వతి, ఇంకొకరు రమాదేవి’ చూడండి అని చూపించింది. సరస్వతిది మా క్లాసే, జనవరిలో పెళ్లయింది. అప్పటి నుంచీ కాలేజీకి రావడం లేదు. కానీ, నేను?
‘నేను ఫీజు కట్టాను మేడమ్! అప్లికేషన్ ఇచ్చాను కూడా! ఆ రోజు దేవకీ మేడమ్ కూడా ఉన్నారు’ అన్నాను. ఏడుపు కన్నా ఉక్రోషం వచ్చింది నాకు. ఆగమన్నట్టుగా చిన్నమ్మ నా చేతి మీద తట్టింది. తర్వాత దేవకి మేడమ్ సీటు దగ్గరికి వెళ్లాం. సుమిత్రా మేడమ్ తన వెర్షన్ చెప్పింది. ‘ఏమో! ఈ అమ్మాయిని చూశాను గానీ, నాకయితే ఏమీ గుర్తులేదు. రోజూ కొన్ని వందల మందిని చూస్తుంటాం కదా, ఎక్కడ జ్ఞాపకం పెట్టుకుంటాం? అయినా, మేడమ్ చాలా సిన్సియర్ క్లర్క్. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ ఒక్క స్టూడెంట్‌ని అలా ఎందుకు చేస్తారు?’ అందామె ఇక వెళ్లండి అన్నట్లుగా.
చిన్నమ్మ కన్విన్స్ అయినట్లుగా.. ఏదైనా అవకాశం ఉంటే చూడండి అంది అభ్యర్థనగా. ‘లేదండీ! చాన్స్ ఉంటే మేమే చూస్తాం గా! బోర్డుకు రోల్స్ వెళ్లిపోయి హాల్‌టికెట్స్ కూడా వచ్చాయి. ఏం చేస్తాం? అంత ఇంట్రెస్ట్ ఉంటే సెప్టెంబర్‌లో రాసుకోమనండి’ అందామె సింపుల్‌గా తేల్చేస్తూ. ‘పోదామా?’ అన్న చిన్నమ్మ వెనుక నిశ్శబ్దంగా నడిచానే తప్ప, ఆ క్షణం నుంచీ ఎన్నో ఆశలు పెట్టుకున్న నా ఇంటర్మీడియట్ చదువు ఇలా ముగిసి పోవలసిందేనా! అని నాలో ఎన్నో ఆలోచనలు చెలరేగాయి.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి