‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
కాల్ అందుకొని హడావుడిగా ఐసీయూలోకి పరుగులాంటి నడకతో దూసుకు వచ్చిన డాక్టర్ భవాని.. పేషంట్ ముఖంలోకి చూస్తూనే, నిశ్చేష్టురాలై నిలబడి పోయింది. ఆ పేషంట్ కళ్లు తనని చూస్తూనే, ఒక్కసారిగా కొత్తకాంతితో వింతగా మెరిసి.. మరుక్షణం అలాగే నిశ్చలంగా నిల్చిపోయాయి. కట్లు కట్టి ఉన్న తల, ముఖం, బట్టలూ.. అన్నీకూడా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.
తల తిరుగుతుండగా నిలిచే శక్తిని కోల్పోయిన డాక్టర్ భవాని.. ఓ కుర్చీలో కూలబడిపోయింది. అప్పటికే
అక్కడికి చేరిన న్యూరోలాజికల్, ఇతర డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ పేషంట్ కండిషన్‌ని తమతమ విధానాల్లో పరీక్షిస్తూ, పెదవి విరిచి..
“సీమ్స్ టు బి బ్రెయిన్ డెత్! లెట్ అజ్ కన్ఫర్మ్!” అంటూ పేషంట్ని బ్రెయిన్ ఎమ్మారైకి, యాప్నియా టెస్ట్‌కీ, న్యూరలాజికల్ ఎగ్జామినేషన్స్కీ సిద్ధం చేసారు.
అస్సలు ఏమాత్రం ఊహించని సంఘటన కావడంతో తీవ్రమైన దిగ్భ్రమకి లోనైపోతోంది భవాని.
ఏమిటీ పరిస్థితి?! ఏనాడైనా పీడ కలలోనైనా ఊహించిందా?! తను ఇంతటి భయంకరమైన పరిస్థితిని?! డాక్టర్‌గా ఇన్నేళ్ల తన సర్వీసులో అనేక యాక్సిడెంట్ కేసులు చూసి ఉంది తను. కానీ, ఎన్నడూ ఇంతలా చలించి పోలేదు. తనలోని నవనాడులూ కుంచించుకు పోతున్నట్లు.. తలలోని నరాలు పగిలి పోతున్నట్లూ..
శ్రీపతిరావు కదూ ఈ పేషంటూ.. కాకేం?! తను పొరబడే అవకాశం ఏమాత్రం లేదు! ఇంతటి భయంకరమైన యాక్సిడెంట్‌కి ఎలా గురైనట్లూ?!!
ఇతర ఎక్స్‌పర్ట్స్‌తోపాటు తనుకూడా యాంత్రికంగా.. తడబడే అడుగులతో.. అన్యమనస్కంగా.. సీఈఓ ఛాంబర్లోకి నడిచింది భవాని.
“సో.. ఇట్ ఈజ్ కన్ఫర్మ్డ్ దట్ ఇట్స్ ఏ బ్రెయిన్ డెత్‌కేస్” అంటూనే.. ఓ పక్కగా కూర్చుని ఉన్న పెద్ద మనిషిని పరిచయంచేస్తూ..
“లెట్ మీ ఇంట్రొడ్యూస్ దిస్ జంటిల్మన్ టు యూ ఆల్. వీరు తిరుపతి గారు. చనిపోయిన వారి పేరు లాయర్ శ్రీపతిరావు. ఇద్దరూ లాయర్లే. ఇద్దరూ మంచి స్నేహితులట కూడా. వీరే పేషంట్ని ఇక్కడికి తీసుకువచ్చారు” అన్నాడు సీఈఓ.
అన్ని తలలూ అటువైపు తిరిగాయి. తల తిప్పకుండా కళ్లు మూసుకుని, దుఃఖాన్ని ఆపుకొంటున్నాడు ఆయన. గుర్తుపట్టింది భవాని. శ్రీపతిరావుతో బాగా దగ్గరగా తిరిగేవారు.
తిరిగి చెప్పడం ప్రారంభించాడు సీఈఓ..
“తన కారుకి ఒక ఇసుక లారీ గుద్దుకున్న కారణంగా పేషంట్ శ్రీపతిరావు గారు తీవ్రగాయాల పాలయ్యారు. ఆ విషయం వీరికి ఫోన్ ద్వారా తెలియడం.. వీరు వెంటనే స్పాట్‌కి వెళ్లి, తన స్నేహితుడిని దగ్గరలో ఉన్న ఓ విలేజ్ క్లినిక్‌లో ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ.. వీ కుడ్ నాట్ సేవ్ హిమ్. యాక్సిడెంట్ కేస్ బుక్ చేసిన పోలీస్ అఫీషియల్స్ కూడా వస్తున్నారు.. దే ఆర్ ఆన్ ద వే! ఇక్కడ విశేషమేమిటంటే.. శ్రీపతిరావు గారు తన తదనంతరం తన అవయవాల్ని మన ఈ
‘భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’కి డొనేట్ చేయాలని విల్లు రాసి, వీరివద్ద భద్రపరిచారుట. నిజానికి తన ఇంటికి దగ్గరలో ఇతర పెద్ద హాస్పిటల్స్ ఉన్నప్పటికీ.. ఆయన మన ‘బిమ్స్’నే ప్రిఫర్ చేయడం మనందరికీ గర్వకారణం” అంటూ తిరుపతి గారిచ్చిన విల్లుని అందరి ముందు ఉంచాడు.
దిగ్భ్రమతో బిగుసుకు పోయింది భవాని. లోలోపల అనేక అలజడులు.
“నౌ.. లెట్స్ ఫినిష్ ఆల్ ఫార్మాలిటీస్ వెరీ క్విక్లీ! గో ఫర్ ఆటోప్సీ అండ్ ప్రిజర్వ్ ద ఆర్గాన్స్ ఫర్ డొనేషన్ టు ద రిక్వైర్డీ! ఆయన ఈ తిరుపతి గారినే ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవడానికి ఈ విల్లులో నామినేట్ చేసారు. యాక్సిడెంట్ అవగానే ముందు జాగర్తగా ఆయన తన మొబైల్లో రికార్డ్ చేసిన మరణ వాంగ్మూల వీడియోని కూడా వీరు మనకి ఇస్తూన్నారు” అని..
“శ్రీపతిరావు గారి కోరిక ప్రకారం వైటల్ ఆర్గాన్స్ అన్నీ తీసి జాగ్రత్త పరిచాక, బాడీని కూడా మనమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం” అని ముక్తాయించాడు సీఈఓ.
“ఆర్గాన్స్‌ని వారి కోరిక ప్రకారమే దానం చేద్దాం గానీ, బాడీని మాత్రం.. క్రిమేట్ చేయడమే జరుగుతుంది సార్” అంటూ.. నూతిలోంచి వస్తున్నట్లున్న గొంతుతో పలికిన భవాని వైపు భ్రుకుటి ముడిచి వింతగా చూసాడు సీఈఓ.
“ఏమంటున్నారు డాక్టర్ భవానీ?! ఆయన ఒంటరిట. బాడీని క్లయిం చేసేవాళ్లు కూడా ఎవ్వరూ లేరుట”
“నేనున్నాను సర్” పూడుకుపోతున్న గొంతుని
విచ్చుకుని, స్ఫుటంగా పలికింది భవాని.
అదిరి పడ్డారంతా.
“చనిపోయిన వారు.. నా.. మాజీ భర్త!” డాక్టర్ భవాని గొంతు ఏదో అపరాధ భావంతో సన్నగా వణికింది. తిరుపతి గారి కళ్లు మెరిసాయి. ఆమె వైపు ఆరాధనగా చూసారు. అప్రయత్నంగానే చేతులు జోడించి, కళ్లు మూసుకుని.. ఓసారి తన ప్రాణ మిత్రుడ్ని తలుచుకున్నారు.
శ్రీపతిరావు తండ్రి కాలంనాటి పాతకాలపు ఇంటి వద్ద కర్మకాండకి అవసరమైన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఆయన స్నేహితులూ, అభిమానులే కాక.. తమ కేసుల్ని ఆయన ఉచితంగా వాదించి గెలిపించడం వల్ల లాభం పొందిన బీదా బిక్కీ.. అంతా ఎక్కడెక్కడినుంచో.. ఏయే ఊళ్లనుంచో.. కార్లలోనూ, బస్సుల్లోనూ, లారీల్లోనూ, బళ్లలోనూ కూడా విషణ్న వదనాలతో వందల సంఖ్యలో వస్తున్నారు. అవయవ దానం చేయగా మిగిలిన పార్థివదేహం ఐస్ బాక్స్‌లో అంతిమ సంస్కారానికి సిద్ధంగా ఉంది.
మొదటి దండని ఆ బాక్స్ మీద ఉంచడానికి ముందుకి వంగిన భవాని చేతులు వణికాయి. శ్రీపతిరావు సూటిగాతన వైపే.. తనలోకే చూస్తున్నట్లుగా ఉంది. పెదవుల మీద వింత తృప్తితో కూడిన చెరగని చిరునవ్వు.
‘ఎప్పటికైనా నీ చేతుల మీదుగా వెళ్లి పోవడమే నా కోరిక’ అని అతను గతంలో అన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి.
దుఃఖం ఆగలేదు భవానీకి. కొంగుతో నోరు నొక్కుకుంటూ ఒక్క ఉదుటున లోపలి గదుల్లోకి వెళ్లిపోయింది. అంతే! అన్ని వందలమంది వచ్చినా అప్పటివరకూ ఆ ఆవరణంతా నిండి ఉన్న భయంకర నిశ్శబ్దం..
ఒక్కసారిగా భళ్లున బద్దలయ్యింది. పెద్ద ఎత్తున గుండెలు పగిలే రోదనలు..
“మాకు ఇక దిక్కెవరు?” అంటూ ఆక్రందనలు.
ఇహనో, ఇప్పుడో వర్షించడానికి సిద్ధంగా ఉన్న కారు మేఘం లాంటి బరువైన గుండెలతో యాంత్రికంగానే ఆ పాతఇంటి గదులన్నీ తిరగసాగింది భవాని. ప్రతిగదీ ఇప్పుడు వింతగా తనదిగా తోస్తోంది. ప్రతి గదిలోని వెలుతురు, గాలి, వాసన, తీగ సాగుతున్న ఓ విషాద నిశ్శబ్ద సంగీతం.. తనలోని దిగులుతో మమేకమై, దుఃఖాన్ని పంటి బిగువున అదిమిపట్టి మూగగా
రోదిస్తున్న భావన.
ఒకనాడు తనదైన ప్రత్యేక గది.. ఈనాడు కూడా అలాగే అత్యంత సుందరంగా అలంకరించి ఉంది. తనను శ్రీపతిరావు ముచ్చటపడి స్వయంగా తీసిన ఫొటో.. టేబుల్ మీద అలా నవ్వుతూనే ఉంది. శ్రీపతిరావుతో విడిపోయాక గత దరిదాపు ముప్ఫై సంవత్సరాలలోనూ ఒక్కసారైనా అలా స్వచ్ఛంగానూ, అందంగానూ నవ్వగలిగిందా తను?!..
విడిపోయాక కూడా తనని ఒక్కసారి కలవాలని ఉందని ఎన్నోసార్లు కబురంపాడు. కానీ, తను అతనికా అవకాశం ఇవ్వలేదు. తమ బిడ్డ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా వెళ్లలేదు.
మరి ఏమిటిది?!! ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు ఎందుకిలా ఇంతబాధగా అనిపిస్తోంది తనకి?! ఐసీయూలో తనని చూస్తూనే.. ఆ కొత్త కాంతితో వింతగా మెరిసి.. అలాగే నిలిచిపోయిన శ్రీపతిరావు చూపులకి తనలోని మానవీయతని నిద్ర లేపగలిగే అంతటి గొప్ప అతీతశక్తి ఉందా?!..
ఆమె పాదాలు తమ నాలుగు సంవత్సరాల కాపురానికి ఫలంగా కలిగిన బిడ్డ తాలూకు గదిలోకి నడిచాయి. గదిలోకి ప్రవేశిస్తూనే ఆమెలోని దుఃఖం వరద పొంగయి బయటికి తన్నుకొచ్చింది. టేబుల్ మీద పటంలో ఉన్న ఆ పాప చుట్టూ అపురూపంగా లభించే అనేక రకాలపూవులు. పటం ముందు కన్నీటితో ఉన్న శ్రీపతిరావు ఫొటోతో కూడిన ఓ లామినేట్ కార్డు. ఆ కార్డులో..
‘బంగారం.. నువ్వులేని జీవితం నాకు శూన్యంరా చిట్టి తల్లీ! కానీ, నాకు ఇంకా మానసిక, నైతిక పరమైన బంధాలు మిగిలి ఉన్నాయి. వాటికోసం.. దివికేగిన నిన్ను అనునిత్యం తలుచుకుంటూనే.. జీవనం సాగిస్తున్నా నాన్నా’ అని రాసి ఉన్న అక్షరాలు.
పుట్టుకతోనే అనేక ఆరోగ్య సమస్యలతో ఈ లోకంలోకి వచ్చింది ఆ ప్రాణి. సరిగా నడవ లేదు. చేతులతో ఏ వస్తువునీ గట్టిగా పట్టుకోలేదు. చూపు సరిగా ఎటూ నిలవదు. మాటలు సరిగా మాట్లాడలేదు. గట్టిగా అరచి మాట్లాడితే తప్ప వినిపించదు!. ఎంత ప్రేమగా, ప్రాణ సమానంగా చూసుకునేవాడు శ్రీపతిరావు.. ఆ బిడ్డనీ! తను మాత్రం.. ఆ బిడ్డ కంట పడితే చాలు..! రాక్షసిగా మారి.. ఓమై గాడ్!..
అక్కడ ఉండలేక హాల్లోకి నడిచిన భవాని జ్ఞాపకాలు తను కోల్పోయిన జీవితాన్ని తడుముతూ గతంలోకి సాగాయి..
ప్రిన్సిపాల్ అయిన తన తండ్రిమీద కాలేజీ నిధులు అక్రమంగా వాడుకున్నాడని అన్యాయంగా బనాయించిన కేసును వాదించి, ఆయన్ని నిర్దోషిగా నిరూపించిన యువ లాయర్ శ్రీపతిరావు మీద మనసు పడేసుకుంది. అప్పుడే హౌస్ సర్జెన్సీ పూర్తి చేసుకున్న డాక్టర్ భవాని. అంత చిన్న వయసులోనే రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న మేధావి లాయర్ అయిన అతన్నే పెళ్లాడాలి అనే నిర్ధారణతో.. తన తండ్రి ద్వారా అతన్ని పెండ్లికి కదిపించింది. సమాజసేవార్థం బ్రహ్మచారిగానే ఉండిపోదలుచుకున్నాడని తెలిసి.. ‘నా అంతటి అందగత్తె, గోల్డ్‌మెడలిస్ట్ అయిన డాక్టర్ ప్రపోజ్ చేస్తే కాదనడమా?!’ అని, పంతం పట్టి.. తనదైన మార్గాల్లో అతనితో స్నేహం పెంచి, తనంటేనూ, పెళ్లంటేనూ ఇష్టపడేలా చేసి, అతని చేత తాళి కట్టించుకుంది.
ఆరు నెలలు తిరక్కుండానే తమ మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. తన స్వభావానికి పూర్తి వ్యతిరేక స్వభావం అతనిది. లాయర్‌గా అతనూ, డాక్టర్‌గా తనూ నాలుగు చేతులతో బాగా గడించి తమని ఎరిగి ఉన్న బంధువులలోనూ, స్నేహితులలోనూ తామే రిచెస్ట్ అనిపించుకోవాలనేది ఆమె కోరిక. సంఘంలో గౌరవంగా బతకడానికి సరిపోయేంత చాలు.. కనీసం లాయర్‌గా తన స్వీయ సంపాదనలో మిగిలిన దానినైనా దాన ధర్మాలకి, సమాజ సేవకీ వినియోగిస్తాననేది అతని వాదన. ఆ వాదన వింటుంటే ఆమెకు ఒంటిమీద తేళ్లూ జెర్రులూ పాకుతున్నట్లు ఉండేది. తమ కాపురానికి జతగా ఈ భూమ్మీదకి వచ్చిన మరో ప్రాణేమో.. అనేక అనారోగ్య సమస్యలతో పుట్టి, తనకి ఆ కాపురం అంటేనే అసహ్యం పుట్టేలా చేసింది.
ఫలితం.. అతను ఎంతగా నచ్చచెప్పినా ససేమిరా అని, విడాకులు పొందిందామె. ఆ తర్వాత అచిర కాలంలోనే డాక్టర్‌గా తను విశేషమైన ఖ్యాతిని గడించడం.. రాష్ట్రంలోనే అత్యంత ధనవంతుడైన బిజినెస్ టైకూన్ దుర్గారావుని తన అందం, డాక్టర్‌గా తనకున్న గొప్ప పేరు ఆకర్షించడం.. అతనే ప్రపోజల్ పంపించడం.. అతనికి రెండవ భార్యగా ఆమె వెళ్లిపోవడం చకచకా జరిగి పోయింది. తమకో కొడుకు కూడా కలిగాడు.
తన భర్త.. నెలలో ఓ అరగంట కూడా మాట్లాడటానికి సమయం దొరకనంతగా.. తనని మరచిపోయి, కోట్లలో లావాదేవీలలో మునిగి ఉండే వ్యాపారస్తుడు. ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో అతనికే తెలియదు.
తన కొడుకు.. పై చదువులకి అమెరికా వెళ్లి, అక్కడే ఉద్యోగాన్ని, భార్యనీ సంపాదించుకుని.. తల్లి మాటే మరచిపోయిన స్వార్థప్రాణి.
తను.. తమ హాస్పిటల్ వ్యాపారసూత్రాల ప్రకారం సాధారణ జలుబుతో వచ్చిన పేషంటుకి సైతం హాస్పిటల్‌లోని అన్ని ఖరీదైన పెద్ద టెస్ట్‌లూ చేయించి, ఐసీయూలో వెంటిలేటర్ మీద కూడా వీలైనన్ని రోజులు ఉంచి, తనవంతుగా ఆ పేషెంట్ మొత్తం ఆస్తినంతటినీ గుంజేదాకా వదలని కాస్ట్లీ ఎక్స్పర్ట్ డాక్టర్.
ఎటుచూసినా తమచుట్టూ డబ్బూ.. ఆస్తులూ.. సకల సంపదలూ. కానీ, తనలోని తనకి ఇంకా ఏదో తక్కువ అయ్యిందన్న అభద్రతా భావన.
మరి ఇప్పుడు..?! శ్రీపతిరావు తనవైపు చూసిన ఆ ఆఖరి చూపు.. తనకి తక్కువ అయినదానిని అందించిన సంజీవినా?!!
“మేడం!” అన్న పిలుపుతో ఉలిక్కిపడి చూసింది భవాని. ఎదురుగా తిరుపతిరావు గారు.
“మేడం! ఓ విషయం చెప్పకుండా ఉండలేను మీకు. చనిపోయినప్పటికీ శ్రీపతిరావు నిశ్చింతగా వెళ్లిపోయిన అదృష్టవంతుడే! కారణం.. తన జీవితం చాలించేటప్పుడు తన ఆఖరిచూపు మీ కళ్లలోకి చూడాలని కోరుకున్నాడు. అందుకనే తన ఆఖరి దశలో చేర్చడానికి మీ హాస్పిటల్ని ఎంచుకున్నాడు”
ఆ మాటలకు ఉచ్వాసనిశ్వాసలు నిలిచిపోయి, ఒడలంతా విద్యుత్తు పాకినట్లు నిలువునా కంపించిపోయింది భవాని. నోట మాట పెగల్లేదు. ఆయనతో పాటే మౌనంగా తన భర్త శవం వద్దకు నడిచింది.
“అమ్మా! వీరికి పిల్లలు లేరని చెప్పారూ.. ఇప్పుడు కర్మకాండ చేసే కర్త.. ఎవరో తమరు చెబితే..”
బ్రాహ్మడు అడుగుతుండగానే, నిబ్బరంగా పలికింది భవాని..
“నే.. ను!”
అవాక్కయి చూస్తూన్నారంతా..
“కానీండి” అంటూ గబగబా అక్కడ ఉన్న బావి వద్దకు నడిచి, నీళ్లు తోడుకుని, తలమీదుగా ఒంపుకొని, నీళ్లోడుతున్న తడిబట్టలతో వచ్చి, నొసట కరిగిపోయిన బొట్టుతో.. శ్రీపతిరావు భౌతిక కాయానికి రెండు చేతులూ జోడించి నిలబడింది. తలమీదుగా జారుతున్న నీటిధారల్లో ఆమె కన్నీటి ధారలు కలిసిపోతున్నాయి.
.. ఆ తర్వాత కైలాసధామంలో అంతిమ సంస్కారార్థం శ్రీపతిరావు చితికి నిప్పు పెట్టింది భవాని. క్షణాల్లో చితి జ్వాలలు వాడి కత్తుల్లా నాల్కలాడించ సాగాయి.
‘ఎందుకయ్యా ఈ రాక్షసిని అంతగా ప్రేమించావు పిచ్చాడా?!’ అన్న ఆమెలోంచి తన్నుకొచ్చిన ఆవేదనా భరిత వెర్రికేక బయల్పడే శక్తిలేక కంఠ నాళాలలోనే చిక్కుబడి పోయింది.
‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజమ్ము.. చంద్రికలనేల వెదజల్లు చందమామ?.. ఏల సలిలంబు పారు? గాడ్పేల విసురు?.. ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అన్న కృష్ణశాస్త్రి కవిత ఏ లోకాలనుంచో శ్రీపతిరావు ప్రేమగా మంద్రస్థాయిలో వినిపిస్తున్న భ్రాంతి.
చితి మీదికి చేయిచాచి ప్రమాణం చేస్తూ ఒత్తి పలికింది భవాని..
“ఒప్పుకొంటున్నా.. మీ ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. మీరొకసారి చెప్పిన ‘చితా దహతి నిర్జీవం-చింతా దహతి జీవనం’ అన్న మాటలకు నా ఇన్నాళ్ల వ్యర్థ జీవితమే దర్పణం. చింత- ధనం గురించైనా.. కీర్తి గురించైనా.. అధికారం గురించైనా.. మనిషిని నిలువునా దహించి వేయడం ఖాయం. నేనిప్పుడు మీతో సహగమనం చేసే దుస్సాహసం చేయలేను. బదులుగా నా అహంకారాన్ని, ధనాశనూ మీ చితిలో దహనం చేసి, మీరు చూపిన మార్గంలో ఎంతో పవిత్రమైన అవయవ దానం చేస్తాను. వృథాగా బూడిదైపోయే నా అవయవాలు ఏ అభాగ్యులకి ఉపయోగపడినా నా పాపానికి కొంత ప్రాయశ్చిత్తంతో సమానమే” అంటూ.. చితి చివరన ఉన్న బూడిదని విబూదిగా నొసటన అద్దుకుంది.
చితి.. తృప్తిగా, ప్రశాంతంగా కాలుతోంది.
ఇప్పుడామె మనసుకి క్రమేపీకొంత ఊరట దొరికిన భావన కలుగుతోంది.
“ఒప్పుకొంటున్నా.. మీ ఆలోచనలు
చాలా ఉన్నతమైనవి. మీరొకసారి చెప్పిన ‘చితా దహతి నిర్జీవం-చింతా దహతి జీవనం’ అన్న మాటలకు నా ఇన్నాళ్ల
వ్యర్థ జీవితమే దర్పణం. చింత- ధనం
గురించైనా.. కీర్తి గురించైనా.. అధికారం గురించైనా.. మనిషిని నిలువునా దహించి వేయడం ఖాయం. నేనిప్పుడు మీతో
సహగమనం చేసే దుస్సాహసం
చేయలేను. బదులుగా నా అహంకారాన్ని, ధనాశనూ మీ చితిలో దహనం చేసి,
మీరు చూపిన మార్గంలో ఎంతో పవిత్రమైన అవయవ దానం చేస్తాను”.
తులసి బాలకృష్ణ
మనిషికి ‘చింత’ ఉండటం సహజం. కానీ, నిత్యం ధనం, కీర్తి, అధికారం గురించే చింతిస్తుంటే.. మనిషి నిలువెల్లా దహించిపోవడం ఖాయమని చెబుతుంది.. ‘దహతి జీవనం’ కథ. రచయిత తులసి బాలకృష్ణ. వీరి స్వస్థలం హైదరాబాద్. వృత్తిరీత్యా బ్యాంక్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ప్రవృత్తిరీత్యా రచయిత, నటుడు, దర్శకుడు, నాటక పోటీల స్థాన నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా రచనారంగంలో ఉన్నారు. ఇప్పటివరకూ 500లకు పైగా కథలు, 40 నాటికలు, 8 నవలలు, 3 నాటకాలు, రేడియో నాటకాలు, టీవీ నాటకాలు రాశారు. హాస్యం, సరసం, సస్పెన్స్, సాహసం.. ఇలా అన్ని రసాలను పండిస్తూ రచనలు చేస్తున్నారు. నాటకాలలో రచన, నటన, దర్శకత్వాలకు నంది బహుమతులు అందుకున్నారు. తూర్పు వెళ్లే రైలు, మనసు-మమత లాంటి టీవీ సీరియల్స్‌లో నటించారు. రచనా విరించి, అక్షర కళా యశస్వి బిరుదులు అందుకున్నారు. బళ్లారి రాఘవ, గురజాడ, శ్రీశ్రీ అవార్డులూ దక్కించుకున్నారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీలలో బహుమతి అందుకోవడం.. ఇది వరుసగా నాలుగోసారి.
తులసి బాలకృష్ణ
87901 15544