నా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చే ఉత్తరాలను నాన్న జాగ్రత్తగా దాచిపెట్టేవాడు. కింద స్టాండులాగా
మెలితిప్పిన ఇనుప తీగెకు ఆ ఉత్తరాలను గుచ్చి ఉంచేవారు. అవి ఎగిరిపోకుండా ఆ తీగె పైన కూడా
వంక తిరిగి ఉండేది. సంవత్సరాల తరబడి వచ్చిన ఉత్తరాలు, ఆహ్వానాలు, కొన్ని బిల్లులు, రశీదులను.. ఆ తీగె తన కడుపులో పెట్టి దాచుకుని, చరిత్రను నిక్షిప్తం చేసుకున్న కాలానికి సాక్ష్యంలా ఉండేది.
ఈ మధ్య హఠాత్తుగా ఆ ఉత్తరాల ఇనుప తీగె, దానికి గుచ్చిన కొన్ని ఉత్తరాలు బయటపడి.. గొప్ప నిధి దొరికినట్టయిందని చెప్పాను కదా! అందులో కొన్ని గమ్మత్తయిన ఉత్తరాలు దొరికాయి. అందులో ఒకటి మా చిన్నాయన మా నాన్నకు రాసిన 1960ల నాటి ఉత్తరం. అప్పటికి మేమెవరమూ పుట్టనే లేదు. ఆ ఉత్తరం చదవకుండా ఉండలేకపోయాను. నిజానికి అప్పట్లో ఉత్తరాలకు ఇప్పటి మెసేజుల్లాగా గోప్యత, గుంభనం అవసరమే లేదనుకుంటా.
ఆ ఉత్తరం ఇలా సాగింది. ‘మహారాజ రాజశ్రీ రాజమాన్య రాజపూజితులైన (ఎన్ని విశేషణాలో?) అన్నగారి దివ్య సముఖమునకు మీ కనిష్ఠ సోదరుడు నమస్కరించి వ్రాయు లేఖ.. ఉభయ కుశలోపరి! మీకు మనవి చేయునది ఏమనగా మా అత్తవారింటి నుంచి దీపావళి పండుగకు రమ్మని ఆహ్వానము వచ్చినది. నన్ను పంపమని నాయనగారికే మా అత్తింటి వారు లేఖ వ్రాసి ఉన్నారు. తొలి దీపావళి గనుక వెళ్లవలెనని నా మనసు ఉవ్విళ్లూరుచున్నది. ఎప్పుడు బయలుదేరవలెనని బాపును అడుగగా.. ‘దీపావళి రేపనగా వెళ్లమని, పది రూపాయలు ఇచ్చి పంపుదునని’ తెల్పినారు.
ఆ పది రూపాయలు రానూ, పోనూ బస్సు కిరాయిలు, మంగళ హారతి పళ్లెములో వేయుటకు, ఇతర ఖర్చులకు ఏ విధముగానూ సరిపోవని భావించిన నేను.. పోవటమా? మానుకోవటమా? అనే సందిగ్ధతలో ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను. కనీసం యాభై రూపాయలైనా లేకుండా వెళ్లి రావడం కుదిరే పనికాదు. ఇట్టి పరిస్థితులలో దిక్కు తోచని నాకు మీరే జ్ఞాపకం వచ్చినారు. కనుక నాయందు దయ ఉంచి నాకు యాభై రూపాయలు ఇచ్చినచో దీపావళి పండుగకు వెళ్లి ఘనంగా జరుపుకోగలను. మీ దగ్గరికి ఎల్లుండి వచ్చి అటునుంచి అటే వెళ్లవలెనని నిశ్చయించినాను. కనుక తెల్పనైనది.
పెద్దలందరికీ నమస్సులు. నా కంటే చిన్నవారికి ఆశీస్సులు. ఇట్లు తమ విధేయుడు’.. మా నాన్న ఆ డబ్బులు అప్పు చేసైనా సరే తెచ్చిచ్చి ఉంటాడు. అందులో అనుమానమే లేదు. పాపం! ఆ రోజుల్లో సంపాదన మొదలు పెట్టకముందే పెళ్లిళ్లు చేసేవారేమో, డబ్బులెక్కడుంటాయి? నాన్న ఇంటికి పెద్ద కొడుకుగా పాత తెలుపు నలుపు సినిమాల్లో గుమ్మడిలా ఇలాంటివి ఎలాగోలా అరేంజ్ చేస్తూ ఉండేవాడనుకుంటా.
మా నాన్న చేతిరాత చాలా బాగుండేది. అప్పట్లో అందరిలాగానే ఆయన కూడా గొలుసుకట్టు రాత రాసేవాడు. అయినా మిగతా వాళ్లలా గజిబిజిగా ఉండక.. స్పష్టంగా ఉండి అర్థమయ్యేది. నేను హైదరాబాద్లో ఉండగా అమ్మకూ, నాన్నకూ ఎన్నో ఉమ్మడి ఉత్తరాలు రాసేదాన్ని. నాన్న మాత్రం నాకు రెండుమూడు సార్లు ఉత్తరాలు రాసాడు. ‘చిరంజీవి రమాదేవికి, అనేక ఆశీస్సులు. ఉభయకుశలోపరి!’ అంటూ మొదలై.. బర్రె ఈనడం, ఇంటికి బంధువులు వచ్చి వెళ్లడం వంటివి తెల్పి, చివరికి ‘నీకు తాతిళ్లు (సెలవులు) ఎప్పుడు ఇచ్చేదీ తెల్పగలవు. నువ్వు ఏ రోజు వస్తున్నది తెలియజేస్తే, స్టేషన్కు మనిషిని పంపగలను’ అన్నాక.. ఇట్లు అని తెలుగులో సంతకం పెట్టేవాడు. నా దగ్గర ఇప్పటికీ నాన్న ఉత్తరం ఉంది.
ఇంకో గమ్మత్తయిన ఉత్తరం గురించి చెబుతాను. పదో తరగతి తర్వాత అక్క హన్మకొండలో విమెన్స్ కాలేజీలో చేరింది. పైచదువులకు డబ్బుల్లేకనో, ఫెయిల్ అవడం వల్లనో, పెళ్లిళ్లవడం వల్లనో, చాలామంది తన క్లాస్మేట్స్ చదువాపేసి ఇంట్లోనే ఉండిపోయారు. వాళ్లలో కవిత అనే అమ్మాయి.. అక్కకు ఒక ఉత్తరం రాసింది.
‘డియర్ సంధ్యా! బాగున్నవా!
నువ్వు మంచిగ చదువుకునేటందుకు సీతాకోకచిలుక లెక్క ఎగిరి సిటీకి పొయ్యి కాలేజ్ జేస్తున్నవు. నేను ఇక్కడ గొంగళి పురుగు తీరుగ ఇంట్ల బర్రెలకు గడ్డి ఏసుకుంటు, పెండ ఎత్తుకుంటు ఉంటున్న. మన దోస్తులెవరన్న కాలేజీల కలుస్తరా నీకు? ఎంతయినా నువ్వు మన దోస్తులల్ల లక్కి. నిన్ను ఒక్కసారి చూడబుద్ది అయితున్నది. ఊరికి ఒచ్చినప్పుడు కలుస్తవా.. ప్లీజ్!
ఇట్లు.. యువర్ లవ్లీ ఫ్రెండ్, కవిత టెంత్ ఫెయిల్డ్ ఫర్ ఘనపూర్ స్టేషన్..
ఆ ఉత్తరం చదివి, ‘మన ఊరి కోసం టెంత్ ఫెయిల్ అయిందట. ఎంత త్యాగం!’ అని ఓ రెండు మూడు రోజులపాటు నవ్వుకున్నాం. కానీ, తరువాత ఆలోచిస్తే.. ‘అయ్యో పాపం! అట్లా అనుకోగూడదు’ అనిపించి కవిత మీద జాలేసింది.
ఇంద్రాణికీ, అక్కకూ మధ్య పెద్దగా రహస్యాలు ఉండేవి కావు. కొన్నిసార్లు వాళ్ల సీక్రెట్స్ నాకూ పంచేవారు. ఆ రోజుల్లో ఇంద్రాణికి ఒక ఉత్తరం వచ్చింది. ఇంచుమించు లవ్ లెటరే గానీ.. శ్రుతి మించనిది. ‘నువ్వు తెల్లగా ఉంటా వు, నీ నవ్వు బాగుంటుంది, నీ చేతిరాత బాగుంటుంది, నీ జడ బాగుంటుంది.. ఇలా రాసి, కింద ‘చార్లెస్ వనరాజ వ్యట’ అని ఉంది. ఉత్తరం నాకూ చూపించింది ఇంద్రాణి. నేనూ, తనూ చాలా కష్టపడి జవాబు రాసాం.
‘నేను తెల్లగా ఉండటానికి కారణం పాండ్స్ పౌడర్, నా నవ్వుకు ఫారూకీ మంజన్ పౌడర్, నా చేతి రాతకు కారణం ఫౌంటెన్ పెన్, మా నాన్న దగ్గర ఉంది లోడెడ్ గన్, నా జడ పొడుగ్గా ఉండటానికి కారణం రీటా, నా కాలి చెప్పులు బాటా, తీస్తాయి నీ తాట! ఓ వనరాజవ్యటా! నువ్వుత్త పిరికి వాడవట, అందుకే నీ అసలు పేరు రాయలేదట!’ ఇలా అంత్యప్రాసలతో బోలెడు కోపంగా రాసాం గానీ, అతనెవరో తెలుసుకోలేక పోయాం. వనరాజు అంటే సింహం కనుక అతని పేరు నరసింహం అట్లా ఏదైనా ఉంటుందా? అని ఎన్నో కోణాల్లో పరిశోధించాం గానీ, లాభం లేకపోయింది. పోస్ట్ చెయ్యని ఆ ఉత్తరం అలాగే ఉండిపోయింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి