‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
“ఏమత్తా.. ముఖం ఎలిగిపోతాండాదే” నవ్వుతూ అడిగాను.
“బండెక్కే యాలొస్తే ఎవరికైనా ఎలిగిపోతాది” తనూ నవ్వుతూనే సమాధానం చెప్పింది చంద్రమ్మత్త.
ఆమెకు దాదాపు 85 ఏళ్లుంటాయి. రెండు పళ్లు మాత్రమే ఊడాయి. మిగిలిన పలువరుస బాగుంది. కంటి చూపూ బాగుంది. చెవులూ బాగా వినిపిస్తాయి. అంత వయసు వచ్చినా గొంతులో వణుకు లేదు. గట్టిగా పిలిచిందంటే ఊరవతల దాకా వినిపిస్తాది. వెంట్రుకలు మాత్రం నెరిసినాయి. తలస్నానం చేసిందేమో.. జుట్టంతా వెండితీగల్లాగా మెరుస్తా ఉంది. శుభ్రంగా ఉతికిన పాతచీర కట్టుకోనుంది. దవడన వక్కాకు ఉంది.
“బండ్లో మామోళ్లు వచ్చినట్టుండారే” అన్నాను లోపలికి తొంగిచూస్తూ.
“అవునుప్పా.. నిన్న సందేళ బండికి వచ్చినారు”
తిరుపతి-ధర్మవరం ప్యాసింజర్ రైలు సాయంత్రం మా ఊరిమీదుగా పోతుంది. అందుకని దాన్ని సందేళ బండి అంటారు.
“పండగనాపొద్దు కూడా పాతచీరేనా!?” అత్తను ఎగతాళి చేశాను.
ఈరోజు వినాయక చవితి పండగ. కొన్నేళ్లుగా ఊర్లో అందరూ వినాయక చవితి పండగ చేస్తాండారు. మా చిన్నప్పుడు ఈ పండగ చేసేది చంద్రమ్మత్తోళ్లు మాత్రమే.
“కొత్త చీరయినా గుంతలో ఎయ్యరు కదా?” ప్రశ్నించింది అత్త.
“అదికాదత్తా.. పండగ కదా”
“బిత్తల వచ్చినాం.. బిత్తల పోతాం! మద్దెలో మానం కాపాడేదానికి ఏ చీరయితే ఏముందిలేప్పా.. రా కూచ్చో! ఇంగా పూజలో ఉండారు. పూజయితానే తిందువు” అనింది అత్త.
“పూజని ఇంతవరకూ తినకుండా ఉంటే ఎట్లత్తా?” కోపం నటిస్తూ అడిగాను.
టైము పదకొండు గంటలు అవుతా ఉంది.
“నేనేపొద్దన్నా పూజలు చేసినానా.. ఒక్కపొద్దులు ఉన్నేనా..? అయ్యన్నీ పిల్లోళ్లకు అల్లుడూ. ఇంట్లో పూజని వాళ్లు వంటలు చేసుకుంటాంటే.. నేను పొద్దన్నే కొబ్బరి, బెల్లం తిని నీళ్లు తాగేస్తా. ఈ పొద్దు ఆకలి కాలా.. ఒగపూట తినకపోతే ఏమీ కాదు.. బరువు లేకుండా ఒళ్లు ఉలకాగా ఉంటాది లేప్పా” నవ్వుతూ చెప్పింది.
“సరేత్తా.. నేను బాయికాడికి పోవాల. తోటలకు నీళ్లు కట్టాల. కరెంటిచ్చిండారు. మామోళ్లతో మళ్ల మాట్లాడతా” అని చెప్పి ముందుకు కదిలినాను.
వెనక నుంచి..
“జాగ్రత్తల్లుడూ.. అమ్మను బాగ చూసుకో” అనింది.
‘సరేత్తా!’ అంటూ తల ఊపుతూ నడిచినాను.
చంద్రమ్మత్త మా బంధువు కాదు. మాది వాళ్లది వేర్వేరు కులాలు. ఊర్లో ఆరేడు కులాల వాళ్లున్నారు. అందరూ ఒకరినొకరు వరుసలతో పిల్చుకోవడం మా పూర్వీకుల నుంచి వస్తా ఉంది. అలా చంద్రమ్మ నాకు అత్తయింది. ఊర్లో చాలామందికి ఆమె అత్త వరుస. అందుకే వరుసలతో సంబంధం లేకుండా ఆమెను చాలామంది
‘చంద్రమ్మత్త’ అని అంటుంటారు.
జీవితంలో ప్రతి మనిషీ చాలా సందర్భాల్లో నటిస్తుంటారు. కానీ, చందమ్మ్రత్త జీవితంలో ఒక్కసారి కూడా నటించలేదు. తన మనసులో ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెబుతాది. లోపటొక మాట బయటొక మాట ఉండదు. ఊరందరికీ ఆమె తీరు అలవాటై పోయింది. ఆమె ఏదన్నా చెప్పింది అంటే.. ఇక దానికి తిరుగుండదు. అది నిజం అంతే! అయితే ఒక్కోసారి ఆమె మాట్లాడే మాటల లోతు అంతు చిక్కదు. అవి మామూలు మాటల్లాగా ఉంటాయి కానీ.. వాటి వెనక మరో విషయం దాగుంటాది.
మా ఊర్లో పురాతన శివాలయం ఉంది. ఆ శివాలయం ఎంత విశేషమైందో.. చంద్రమ్మత్త జీవించే విధానం కూడా అంత విశేషమైంది. ఆమె జీవించే విధానం ఎవరికీ హాని చేయదు. అయితే చాలామందికి ఆమె జీవన విధానం నచ్చదు. అయినా సరే, ఏదో ఒక సమయంలో.. ‘బతికితే చంద్రమ్మత్త మాదిరి బతకాల’ అని అనుకోని వారైతే ఉండరు.
చంద్రమ్మత్త భర్త చనిపోయి దాదాపు యాభై ఏళ్లయింది. ఆమెకు ఒక్కడే కొడుకు. ఆయన చిన్న ఉద్యోగి. విజయవాడలో ఉంటారు. పల్లెలో చంద్రమ్మత్త ఒకతే ఉంటాది. కొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు పల్లెకు ఎప్పుడు వస్తారా!? అని ఎదురుచూస్తా ఉంటాది. అత్త ఊరొదిలి బయటకు వెళ్లేది చాలా తక్కువ. విజయవాడలో ఉండే కొడుకింటికి, తిరుపతిలో ఉండే మనవరాలి ఇంటికి ఏడాదికి ఒకసారి కూడా పోదు. పోయినా.. ఒకటి రెండు రోజులకు మించి ఉండదు. అక్కడికి పోయినప్పటి నుంచి అత్త ధ్యాసంతా ఇంటిపైనే ఉంటాది.
“ఇంటికాడేమన్నా పాలుతాగే పిల్లోళ్లు ఉండారా!? వారం పదిరోజులు ఉండచ్చు కదా” అని కొడుకంటే.. “ఇంటికాడ చెట్లుండాయి. నేను లేకపోతే వాటికి నీళ్లెవరు పోస్తారు? ఊర్లో వాళ్లు కాయాకసురూ పెరుక్కోని పోతారు” అంటాది.
“పెరుక్కోని పోతే పోనీలే.. వాటిని అమ్మి నువ్వేమన్నా మాడీ కట్టాల్నా!?” అని కొడుకు ఎగతాళి చేస్తే.. “నేనుండే ఇల్లే నాకు మాడీ.. ఒగదానికి అంతకు మించిన మాడీ ఏమవసరం లేదు. ఒగుంటే నువ్వు కట్టి చూపించు మాడీ” అని కొడుక్కు సవాల్ విసురుతాది.
మా అసలూరు మేమున్న చోటుకు నాలుగు పర్లాంగుల దూరంలో ఉంది. దాదాపు 70 ఏండ్ల క్రితం కలరా వచ్చి ఊర్లో చానామంది చనిపోయినారు. దీంతో మిగిలిన వాళ్లంతా ఊరొదిలి.. ఇప్పుడుండే తావన ఇళ్లు కట్టుకున్నేరు. అట్ల చంద్రమ్మత్త, ఆమె మొగుడూ కట్టిన ఇల్లే ఇప్పుడు ఆమె ఉండేది.
పది సెంట్ల స్థలంలో చంద్రమ్మత్త ఇల్లుంది. అందులో నైరుతి మూలన చుట్టుగుడిసె. అందులోనే వంట చేసుకోవడం. ఆ గుడిసె గోడకు రెండు దేవుని పటాలు వేలాడుతుంటాయి. వాటి కింద ఒక దీగూడు. ఆ పటాలళ్లో ఉండే దేవుళ్లు ఎవరో కూడా అత్తకు తెలీదు. దేవుళ్లకు ఆమె పూజ చేసింది ఎవరూ చూడలేదు. ఆమె భర్త మద్రాసు నుంచి తెచ్చి వాటిని గోడకు తగిలించినాడు. అప్పటి నుంచి అవి అక్కడున్నాయి. ప్రతి ఉగాది పండగ రోజు వాటిని తీసి శుభ్రంగా కడిగి తుడిచి, బొట్లు పెట్టి తగిలిస్తాది. అయితే.. రోజూ సాయంత్రం దీగూట్లో దీపం పెట్టి రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటాది.
‘దేవున్ని ఏమి కోరుకున్నేవత్తా!?’ అంటే..

‘దండం పెడతా అంతే! నాకేమి కావాలో దేవునికి తెలీదా. ఆ మాత్రం తెలీకుంటే ఆయన దేవుడెందుకయితాడు?’ అని తిరిగి ప్రశ్నిస్తాది.
గుడిసెకు కుడివైపున రెండు మూరల వెడల్పు, బార పొడవుండే అరుగుంది. ఊర్లో వాళ్లెవరన్నా వచ్చి అక్కడ కుచ్చోని అప్పుడప్పుడూ అత్తతో ముచ్చట్లు పెడతాంటారు. గుడిసెకు ఎదురుగా ఆరంకణాల మిద్దె. మిద్దెకు తూర్పు, పడమర తలుపులున్నాయి. మిద్దెకు తూర్పు వైపున ఒక అరుగుంది. పొద్దు వాలింతర్వాత అత్త ఎప్పుడైనా ఆ అరుగుపైన పడుకుంటా ఉంటాది. గుడిసెకు ఎడమవైపున జలజారుంది. మూడు వైపుల బండలు నాటారు. ఒకవైపు బందారు పుల్లలతో తయారు చేసిన తడిక. అక్కడ స్నానం చేసుకోవడం. అంతే ఇల్లు.. ఇక మిగిలిన స్థలమంతా చెట్లే. రెండు చింతచెట్లు. కూరలోకి వాడే చింతపండు కొనదు. మిగిలిన చింతకాయలు అమ్మేస్తాది. మార్కెట్ రేటు కంటే సగం తక్కువ ధరకే ఇచ్చేస్తాది. రెండు వేపచెట్లు, ఒక కొబ్బరి చెట్టు. ఉగాదికి పిల్లలొస్తే పచ్చడి చేసుకోవడానికి వేపపూలకు, పూజ కోసం టెంకాయలకు బయటకు పోగూడదంటాది. సీతాఫలం చెట్లు పదికి పైగా ఉండాయి. కనకాంబరాలు, మల్లి, జాజి తీగలు. వీటికి పందిర్లు వేసింది. సీజన్లో కనకాంబరాలు, మల్లెపూలు కోసి అమ్ముతాది. ఆమె దగ్గర తక్కువ ధర కావడంతో ఏ రోజు పూలు ఆ రోజు ఊర్లో ఎవరో ఒకరు కొనుక్కునేస్తారు. ఆ రోజు పూలు ఎవ్వరూ కొనలేదు.. వాటిని మాలకట్టి తీసకపోయి శివాలయంలో ఇస్తాది. లేదూ ఇంట్లో దేవుడి పటాలకు వేస్తాది. ఇంటికి మనవరాళ్లు వస్తాండారని తెలిస్తే.. ఆ రోజు చెట్ల్లల్లో ఒక్క పూవు కూడా కోసుకోనివ్వదు. నాకు బాగా గుర్తు..
ఆ రోజు సాయంత్రం మా పాపకు స్కూల్ డే ఉంది. పొద్దున్నే మా పాప వెళ్లి..
“అవ్వా.. ఈ రోజు మల్లిపూలు, కనకాంబరాలు అన్నీ నాకే కావాల. ఎవరికీ ఇవ్వొద్దు” అని చెప్పింది.
“లేదు కొడకా.. ఈ రోజు పూలు ఎవరికీ ఈను” అనింది అత్త.
“డబ్బులిస్తాం వ్వా. పూలు కావాల..”
“లేదుమ్మా.. ఈరోజు ఇచ్చేది లేదు” అంది అత్త.
మా పాప ఇంటికి పరిగెత్తుకుంటా వచ్చి..
“నాయనా.. అవ్వ పూలు ఈనంటాంది. నువ్వొచ్చి అడుగు” అనింది.
‘పూలు ఎందుకీదబ్బా!?’.. అనుకుంటా నేను వెళ్లాను. మమ్మల్ను చూస్తానే..
“ఏమి పాపా.. మీ నాయన్ను పిల్సకచ్చినావా!? మీ నాయనే కాదు.. ఆ గుళ్లో ఉండే దేవుడొచ్చినా ఈ రోజు పూలు ఈను” అనింది నవ్వుతా.
“ఈ రోజు పాపకు స్కూల్లో ఫంక్షన్ ఉందత్తా” అన్నాను.
“ఈ రోజు మనవరాళ్లు వస్తాండారు అల్లుడూ. ఎప్పుడో ఒగసారి వస్తారు. బిడ్డలు ఇంట్లో కాసిన పూలు తల్లో పెట్టుకోని తిరగతాంటే బాగుంటాది. వాళ్లు ఎన్నిరోజులుంటే అన్ని రోజులూ ఇచ్చేది లేదప్పా” అనింది.
అత్త ఇవ్వను అనిందంటే ఇక ఇవ్వదంతే!
ఆ ఇంటి ఆవరణలో రెండు చిక్కుడు తీగలు ఎప్పుడూ ఉంటాయి. మూడు రకాల మామిడి చెట్లు, రెండు మునగచెట్లు ఉన్నాయి. ఇవే కాదు.. మిరప, టమాటా, వంకాయ, తోటకూర.. ఇలా గుడిసె, మిద్దె పోనూ.. మిగిలిన స్థలం అంతా పచ్చగా ఉంటుంది. ఎవరైనా చూస్తే అదంతా అడివి అనుకుంటారు. కానీ, అత్త మాత్రం చాలా చాకచక్యంగా వాటి మధ్య తిరగతా ఉంటాది.
అత్త తిండి తినే విధానం చాలా ప్రత్యేకం. ఆమె ఒక్కతే ఉన్నా.. ప్రతిరోజూ వంట చేసుకుంటాది. కూరలు చాలా బాగా చేస్తాది. వేరే వాళ్లు చేసే కూరలు ఆమెకు ఒక పట్టాన నచ్చవు. చెట్లల్లో కాసే చిక్కుడు కాయలు అమ్మకానికి పోను మిగిలినవి తాలింపు చేసుకుంటాది. ఇంకా మిగిలినాయంటే చెట్లకే వదిలేస్తాది. బాగా ముదిరినాక కోసి గింజలు వలిచి ఎండబెట్టి ఎత్తిపెట్టుకుంటాది. చిక్కుడు కాయలు లేని రోజుల్లో ఇంట్లో వారంలో ఒక రోజయినా ఆ గింజలు కూర చేసుకుంటాది. ఇక ఆకుకూరలు వారంలో రెండుసార్లు తప్పనిసరి. మునగాకు వారంలో ఒకరోజయినా వండుకుంటాది. అంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉండటానికి ఆమె తినే తిండేనేమో కారణం. బీపీ, షుగర్ లేవు. మోకాలి నొప్పనో, నడుము నొప్పనో పడుకునిందే లేదు.
ఊరగాయలు పెట్టడంలో అత్తను మించినోళ్లు లేరు. ఊర్లో ఎవరికి ఊరగాయ కావాలన్నా అత్తదగ్గరే పెట్టించుకుంటారు.
చంద్రమ్మత్త పని రాక్షసి. ఒక్క క్షణం ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒకపని చేస్తానే ఉంటాది. భర్త ఉన్న సమయంలో యాభై ఎకరాలకు పైగా ఉన్న పొలం.. కొడుకు చేతికి వచ్చాక ఐదెకరాలకు చేరింది. మొదట్నుంచీ అత్తే పొలం పనులు దగ్గరుండి చేయించేది. కొడుకు విజయవాడ చేరి, పల్లెకు రావడం తగ్గించేసి, పొలాన్ని పట్టించుకోవడం లేదు. తనకూ వయసై పోవడంతో.. అత్త ఆ పొలంలో అడుగు పెట్టేదే మానేసింది. యాభై ఎకరాల పొలం ఉన్నప్పుడు మహరాణిలా దగ్గరుండి పొలం పనులు చేపించినా.. యాభై కాస్త ఐదెకరాలయినాక తనే కూలి మనిషిలా పొలంలో పనిచేసినా.. ఆ ఐదెకరాల్లో అడుగు పెట్టడం మానేసినా.. అత్తలో అదే నిబ్బరం. అదే హుందాతనం. అదే ధైర్యం. ఎప్పుడూ పొలం పొలం అని ఉండే అత్త.. ఆ పొలంలో అడుగు పెట్టడమే మానుకోవడం ఊరందరికీ ఆశ్చర్యమే. ఎవరైనా పిలిస్తే పొలాల్లో కూలి పనులకు కూడా పోతాది. 80 ఏళ్లు దాటింతర్వాత పెద్దామె అని అత్తను కూలికి పిల్చేది మానుకున్నేరు. అయినా సరే.. గమ్మున ఉండదు.
సంక్రాంతి పండగ అయిపోయిందంటే దాదాపు రెండు నెలలు రోజూ చిన్న కత్తి తీసుకుని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అడివికి పోతాది. అక్కడ మధ్యాహ్నం దాకా పొరకూసలు కోసుకుని తెస్తాది. వాటిని ఎండబెట్టి ఊపరముండ్లు అదరగొట్టి చీపురుకట్టలు కట్టి అమ్ముతాది. ఎండాకాలం వచ్చిందంటే.. తెల్లవారుజామున మూడుగంటలకే నిద్ర లేసేస్తాది. ఊరికి ఆనుకోనుండే చింతతోపులోకి పోతాది. రాలిన చింతకాయలు ఏరుకోనొచ్చి ఎండబెట్టి గింజలు తీసి అమ్ముతాది. ఏ పనీ లేదంటే ఇంటిదగ్గరుండే చెట్ల మధ్య గడ్డి పెరుకుతానో, మొక్కలకు పాదులు చేస్తానో ఉంటాది. అది కూడా లేదంటే శివాలయం దగ్గరకు పోయి.. పూజారి భార్యకు పూలు కట్టిచ్చేదో, వాళ్ల పిల్లలను ఆడించేదో చేస్తాది. లేదంటే గుడి ఆవరణ ఊడ్చి శుభ్రం చేస్తాది. పెద్దామె వచ్చి పనిచేసింది కదా అని వాళ్లు రెండు మూడు కొబ్బరి చిప్పలు ఇస్తారు. వాటిని ఇంటికి తీసుకొచ్చి ఎండబెట్టి ఎత్తిపెడతాది. వాటికి తోడు పెరట్లోని కొబ్బరిచెట్టులోంచి రాలిన కాయలన్నీ కలిపి నూనె ఆడించేసి మనవరాళ్లు, కోడలు వచ్చినప్పుడు ఇచ్చి పంపుతాది. గుడిలో శుభ్రం చేస్తాన్నెప్పుడు ఎవరైనా చూసి..
‘పున్నెమంతా నీకే’ అంటే..
‘పున్నెం నాకెందుకు? పాపాలు చేసినోళ్లకు కావాల’ అంటాది.
“ఏందిన్నా.. ఏదో లోకంలో ఉన్నెట్టుండావే”
అప్పటిదాకా చంద్రమ్మత్త గురించి ఆలోచిస్తా నడుస్తాండే నేను.. ఆ మాటలతో ఉలిక్కిపడి చూశాను. ఎదురుగా నాకు చెల్లెలి వరసయ్యే లక్ష్మి. మా వీధిలోనే నాలుగిళ్ల అవతల వాళ్ల ఇల్లు. తన నెత్తిన చిన్న గంపలో కూరగాయలున్నాయి. సంతలో అమ్మేదానికి, తోటలోనించి కోసుకుని వస్తా ఉంది.
“ఏం లేదులే పాపా.. వస్తాంటే ఇంటి ముందర చంద్రమ్మత్త కనిపించేలకు పలకరించినా. ఆ అత్త పనుల గురించే ఆలోచిస్తా ఉండా” నవ్వుతూ చెప్పాను.
“అన్నో.. ఆ అత్తట్లా మనిషి యాడుంటాదినా. ఒగరిజోలికి పోతాదా!? ఒగరూపాయ ఆశిస్తాదా!? ఊరికే ఉంటాదా!? ఎప్పుడూ ఏదో ఒగ పనిచేస్తానే ఉంటాది” చెప్పింది లక్ష్మి.
“ఔను లక్ష్మి. ఎప్పుడూ ఖాళీగానే ఉండదు. ఏదో ఒగపని చేస్తానే ఉంటాది. సేద్యం పనులు లేని ఎండాకాలంలో ఊరంతా రాముని గుడికాడనో, చింతచెట్లకిందనో కుచ్చోని అరువులు చేస్తాంటారు.. అత్త అప్పుడు కూడా ఊసలు ఇదిలించేదో, చింతకాయలు కొట్టేదో చేస్తాంటాంది” అన్నాను.
“గుడంటే గుర్తొచ్చిందినా.. ఇప్పుటికీ మనూర్లో ఆడోళ్లకు ముట్టొస్తే కొందురు ఇంట్లోకి రానీరు. గొడ్లకొట్టంలో ఉండాల్సిందే. అట్లాడిది వాళ్ల మనవరాళ్లకు ముట్టు వచ్చినా.. నీళ్లు పోసుకోనొచ్చి దేవుని దీగూట్లో దీపం పెట్టమంటాది. ఒగరోజు నేను వాళ్లింటికాడున్నే.. ‘ఇట్ల చేస్తే దేవునికి కోపం రాదాత్తా!’.. అంటి. అత్త నవ్వి. ‘ఒసే పిచ్చిదానా.. నా మనవరాలికి ఒగదానికే ముట్టు వస్తాందా!? లోకంలో ఉండే అందురు ఆడోళ్లకు ముట్టు వస్తాది. ఇది దేవుడు పెట్టిందే కదా! ముట్టు రోజు దీపం పెడితే దేవుడు ఎందుకు వద్దంటాడు?’ అని నన్నే నిలదీసింది”
“నిజమే కదామ్మా.. నువ్వు పదా పాపా.. నెత్తిన బరువుండాది. సంతకు పోవాలేమో” అన్నాను.
“ఎన్నుండాయిలేన్నా.. అన్నీ కలిపి ఐదారు కేజీలుంటాయంతే. తొలికోత కాయలు. ఊర్లోనే అయిపోతాయిలే.. ఇంగో సంగతి తెలుసాన్నా.. ఇప్పుడు ఊర్లో ఆడబిడ్డలు సమర్తాడితే.. అదేదో పెద్దపండగ మాదిర్తో చేస్తాండారు. పొటోలు, వీడియోలు తీస్తాండారు. మనవరాళ్లు సమర్తాడిన ఐదారేండ్లదాంకా చంద్రమ్మత్త ఎవరికీ తెలీనీలా.. ‘ఏమత్తా దాపెట్టినావే!?’ అంటే.. ‘ఒసే కోడలా.. దాపెట్టేది ఏం ఉండాదే.. ఆడబిడ్డన్నేక పెద్దబిడ్డ కాకుండా ఉంటాదా.. అదిగూడా ఊరంతా చెప్పుకోవాల్నా!?’ అనింది”
“అత్తకు మనవరాళ్లంటే ప్రేమ ఎక్కువ”
“అవును. చంద్రమ్మత్త దినమ్మూ వాళ్ల చెట్లల్లో పూలమ్మతాది కదా.. మనవరాళ్లు వచ్చినారంటే అమ్మేదుండదు. వాళ్లు పెట్టుకోంగా మిగిలినోటియి దేవునికి పెట్టమంటాది”
“అవునుమ్మా.. నేను కూడా గమనించినా. ఎవరైనా ముందు దేవుడంటారు. తర్వాత మనిషంటారు. అత్త అట్ల కాదు. ముందు మనిషికి.. మిగిలితేనే దేవుడికి అంటాది” అన్నాను.
“ఒగరోజు ఏమైందో తెలుసాన్నా.. ఈ మాట చెప్పేసి ఎలబారిపోతా.. ఐదారేండ్లయింటాది. గంగజాతరకు చంద్రమ్మత్త కొడుకు, కోడలు విజయవాడ నుంచి వచ్చినారు. తెల్లారి ఊర్లోకి దున్నపోతు వస్తాది. ఇంటింటికాడ టెంకాయలు, పసుపు-కుంకుమ పెట్టుకోనుండాలని ముందురోజే చాటింపేయించినారు. అంటు ముట్టు ఉండే వాళ్లు తప్ప అందురూ ముందురోజు రాత్రే టెంకాయలు తెప్పించి పెట్టుకున్నేరు. అత్తోళ్ల చెట్లో టెంకాయలు లేవు. అంగట్లోనించి రెండు టెంకాయలు తెప్పించింది. ఆరోజు రాత్రి కోడలికి బేదులు పట్టుకున్నేయి. జిలకర కాంచి నీళ్లు తాపించింది. సాసవలు ఏంచిచ్చి ఉప్పేసుకోని తినమనింది. బేదులు పట్టుకుంటే నీరసం వస్తాది కదా. అత్త ఏం చేసిందో తెలుసా.. గంగమ్మ కోసం తెచ్చిండే టెంకాయలు కొట్టి ఆ నీళ్లు కోడలికి ఇచ్చి తాగమని చెప్పింది. ‘అవి గంగమ్మకత్తా’ అని కోడలంటే.. ‘ఏం కాదులే! పాణం బాగయితే జాతరలో గంగమ్మ కాడ నాలుగు టెంకాయలు కొట్టు. గంగమ్మ ఏమనుకోదు’ అనింది..”
“చదువు రాకపోయినా, అత్త చాలా బాగా ఆలోచిస్తాది. చదువుకున్నోళ్లే మూర్ఖంగా ఉండారు” అన్నాను.
“సరేన్నా! నేను ఎలబారతాండా.. ” అని చెప్పి లక్ష్మి పల్లెవైపు అడుగులు వేసింది.
నేనూ కాసేపట్లోనే మా పొలం చేరుకున్నాను. నాలుగెకరాల్లో వరి నాటిండాము. స్విచ్ వేశాను. బోరుబావి నీళ్లు పైపులోంచి బయటకు దుంకాయి. నాలుగెకరాలు పారడానికి కనీసం గంటసేపు పడతాది. పొలం గట్టున చెట్టు కింద కూర్చున్నాను. ఈ రోజెందుకో చంద్రమ్మత్త ఆలోచనలు వదలడం లేదు.
అత్తకంటే మా అమ్మ పదేండ్లు చిన్నది. మా అమ్మ అత్తను ‘ఒదినా!’ అని పిలస్తాది. అత్త కూడా అంతే ఆప్యాయంగా ‘ఏం మరదలా!’ అని పలకరిస్తాది. అత్త బొడ్డులో ఎప్పుడూ ఒక్కాకు తిత్తి ఉంటాది. అత్త మా ఇంటికి వచ్చినా, మా అమ్మ వాళ్లింటికి పోయినా.. ఇద్దరూ ఒక్కాకు వేసుకుని మాట్లాడుకుంటా కుచ్చొంటారు. నేను చాలాసార్లు వాళ్ల మాటలు విన్నాను. అత్త మాటల్లో ఆరోజు లేదా ముందు రోజంతా తను ఏం చేసింది అనేది కథలాగా చెప్పేది. ఒక్కోసారి తన పెళ్లయిన రోజులు, అప్పట్లో ఇంట్లో ఎట్లుండేది? పొలం పనులు ఎట్ల చేపించింది? చెప్పేది. ఎక్కడా గొప్పలు ఉండవు. పక్కమనిషిని ఎగతాళి చేయడమూ ఉండదు. తనను తక్కువ చేసుకోవడమూ ఉండదు. ఎదుటి మనిషిని తక్కువ చేసి మాట్లాడ్డమూ ఉండదు. తను ఎలా జీవించింది? తను ఆ పనిని ఎలా చేసింది? అనేది మాత్రమే చెప్పేది. అత్త చెప్పేది విన్నామంటే.. ఈ పని ఇంత సులభమా!? అనిపిస్తాది. కానీ మనం ఆ పనిచేస్తే కానీ అది ఎంత కష్టమో అర్థం కాదు.
తనను ఎవరైనా ఎగతాళి చేశారంటే.. ఇక ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కదు.
‘ఏయ్.. నన్నే అంటావా! నీకు చేతనయితే నా మాదిర్తో బతికి చూపించు’ అంటా కండ్లు పెద్దవి చేసి, లేని మీసాన్ని తిప్పతాది. ఇంకా కోపం వస్తే.. మీసం తిప్పి, సవాల్ అంటా తొడకొడతాది.
ఒకసారి మా నాయనను అత్త కొట్టిందంట. మా అమ్మ ఈ విషయం నాకు ఎన్నిసార్లు చెప్పిందో లెక్కేలేదు. మా అమ్మకు పెండ్లయిన పదేండ్లకు.. ఒగరోజు రాత్రి కూరలో ఉప్పెయ్యలేదని అమ్మను మా నాయన దున్నికట్టెతో కొట్టడం మొదలు పెట్టినాడంట. దీంతో యాడ చంపేస్తాడో అని భయపడి, అత్తోళ్ల ఇంటికి పోయి దాక్కునిందంట. అమ్మకోసం నాయన ఊర్లో మా బంధువుల ఇండ్లల్లో తాలాడినాడు. యాడా లేదు. అమ్మ యాడుండేది ఎవరో చెప్పినారంట. నాయన నేరుగా అత్తోళ్ల ఇంటికాడికి పోయి ఈదిలో నిలబడుకోని..
‘నా పెండ్లాన్ని పంపించు’ అన్నేడంట.
‘నీ పెండ్లాం ఈడెందుకుంటాది. మొగుడు నువ్వా నేనా. ఇది నీ ఇల్లా నా ఇల్లా’ అనిందంట.
‘ఏయ్.. తార్పుడు దానా. నా పెండ్లాన్ని ఇంట్లో పెట్టుకోని లేదంటావా’ అన్నేడంట నాయన.
అంతే.. అత్త దున్నికట్టెత్తుకోని..
‘దొంగ ముం.. కొడకా! ఎంత మాటంటావురా!?’ అంటా వాకిట్లో నింటి ఇసిరి ఏసిందంట.
దున్నికట్టె నేరుగా పొయ్యి మా నాయన కాలికి తగిలిందంట.
‘ఓయమ్మా.. చంద్రక్క నన్ను చంపేస్తాంది’ అంటా ఇంటికి పరిగెత్తినాడంట. అత్త ఈధిలోకి వచ్చి బండ బూతులు తిడతా రెండు రాళ్లెత్తుకోని బీరిబీరి ఏసిందంట.
‘కూరలో ఉప్పెయ్యలేదని ఆడబిడ్డను కొడతావా నా బట్టా! చిటికెడు ఉప్పు తీసి కూరలో ఏసుకోని తినలేవా!?’ అంటా మాట మాటకూ ఒక బూతు మాట కలిపి తిట్టిందంట.
ఈ విషయాలన్నీ మా అమ్మ నాకు ఎన్నిసార్లు చెప్పిందో. చెప్పిన ప్రతిసారీ మా అమ్మ నవ్వతానే ఉంటాది.
జేబులో ఫోన్ మోగింది. లక్ష్మి ఫోన్ చేసింది. ఫోన్ తీయగానే..
“అత్త సచ్చిపోయిందినా..” అనింది.
నాకు ఒక్క క్షణం ఏమర్థం కాలేదు.
“ఏ అత్త!?” అన్నాను.
“చంద్రమ్మత్త!” అనింది.
నా తల గిర్రున తిరుగుతున్నట్టనిపించింది.
“ఇంట్లో అంతా పూజ చేసుకుంటా ఉన్నేరంట. అత్త ఇంటిబయట అరుగుమింద పడుకోని ఉన్నిందంట. ఈ రోజు పొద్దన కూడా ఏమీ తినలేదంట. ‘ఇనాయకమయ్యకు పూజ చేసేసినాక, తినేదానికి రాత్తా!’ అని కోడలు పిలిచిందంట.. అప్పుటికే పాణం పోయిందంట”..
అటువైపు లక్ష్మి ఏడుస్తూనే విషయం చెప్పింది.
నేను పల్లెవైపు పరుగు పెట్టాను. అత్తోళ్ల ఇంటికి చేరుకునేప్పటికే.. ఊర్లో చానామంది ఉండారు. మిద్దెకు తూర్పుగా అప్పడప్పుడూ అత్త తలవాల్చే అరుగు మీద.. అత్త పడుకున్నట్టే ఉంది. మా అమ్మ అప్పటికే అక్కడికి వచ్చింది. అత్త చెంపలు పట్టుకోని..
“లే ఒదినా.. ఊరికూరికే పెండ్లాలను దుడ్డుకర్రతో కొట్టే ఈ మొగనా బట్టలను దుడ్డుదువు లే ఒదినా.. ఇద్దరం ఒక్కాకు ఏసుకుందాం లే ఒదినా” అంటా మా అమ్మ ఏడుస్తా ఉంది.
“మంచాన పడి ఒకరిదగ్గర సేవ చేపించుకోవడం ఇష్టం లేదని ఎప్పుడూ అంటా ఉంటాది. కాలూ చెయ్యి బాగా ఆడతాన్నెప్పుడే కాలం అయిపోవాలనేది. మూడు దినాల నింటి బేదులంట. మంచాన పడకముందే మట్టిలో కలిసిపోతాంది” ఎవరో చెప్పారు.
“పండక్కని కొడుకు కొత్త చీర తెచ్చినా కట్టుకోలేదంట. పాత చీరే కట్టుకునింది”
“పొద్దట్నించీ అందరితో హుషారుగా నవ్వుతా మాట్లాడతాన్నింది. ఇట్లయితాదని అనుకోలేదు”
“జీవితంలో అన్నీ చూసేసినా.. ఇంక బతికేది వద్దనుకునిందేమో!? అయినా ఇట్లా సావు ఎంతమందికి వస్తాది..”
అక్కడ చేరిన వారంతా అత్త గురించి తలా ఒకమాట మాట్లాడతాండారు.
‘జాగ్రత్తల్లుడూ.. అమ్మను బాగ చూసుకో’.
అత్త నాతో అన్న చివరి మాటలు గుర్తొచ్చాయి.
అత్తమీద పడి అమ్మ ఏడుస్తానే ఉంది.
అత్త చనిపోయినట్టు లేదు.. ఏడుస్తున్న అమ్మను ఓదారుస్తున్నట్టుగా ఉంది.
“ఎన్నుండాయిలేన్నా.. అన్నీ కలిపి ఐదారు కేజీలుంటాయంతే. తొలికోత కాయలు. ఊర్లోనే అయిపోతాయిలే.. ఇంగో సంగతి తెలుసాన్నా.. ఇప్పుడు ఊర్లో ఆడబిడ్డలు సమర్తాడితే.. అదేదో పెద్దపండగ మాదిర్తో చేస్తాండారు. పొటోలు, వీడియోలు తీస్తాండారు. మనవరాళ్లు సమర్తాడిన ఐదారేండ్లదాంకా చంద్రమ్మత్త ఎవరికీ తెలీనీలా..
‘ఏమత్తా దాపెట్టినావే!?’ అంటే..
‘ఒసే కోడలా.. దాపెట్టేది ఏం ఉండాదే..
ఆడబిడ్డన్నేక పెద్దబిడ్డ కాకుండా
ఉంటాదా.. అదిగూడా ఊరంతా
చెప్పుకోవాల్నా!?’ అనింది”
సుంకోజి దేవేంద్రాచారి
99491 18082
సుంకోజి దేవేంద్రాచారి