శరవేగంగా పుంజుకున్న డిజిటల్ యుగంలోనూ 200 ఏండ్లనాటి జానపద కళకు ఊపిరిపోస్తున్నాడు ఈ కళాకారుడు. దమ్మిడి ఆదాయం లేకున్నా తాతలు, తండ్రుల వారసత్వంగా వచ్చిన ‘కడ్డీతంత్రి తంబుర’ చేతబూని ఇతిహాసాలెన్నో ఆలపిస్తున్నాడు. జానపద సంగీతానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ‘జాతీయ సంగీత నాటక అకాడమీ పురసారానికి’ ఎంపిక చేసింది. ఏడు పదుల వయసు దాటినా మరుగున పడిన కళకు జీవం పోస్తూ జాతీయ అవార్డుకు ఎంపికైన దురిశెట్టి రామయ్య.. కళాకారుడిగా తన ప్రయాణాన్ని బతుకమ్మతో పంచుకున్నాడు. ఆ విశేషాలు తన మాటల్లోనే..
అళ్వారుల కాలంనుంచే రామాయణ, భాగవత, మహాభారత, సుందరాకాండ, యక్షగానం వంటి ఆధ్యాత్మిక కాలక్షేప కథల్ని చెప్పేందుకు కడ్డీతంత్రి తంబుర వాద్యాన్ని వాడేవారు. మా పూర్వికులది తమిళనాడు. మమ్మల్ని మిత్తల్ అయ్యవార్లు అని పిలుస్తారు. మేము మాల, మాదిగ సామాజిక వర్గాలకు పెళ్లిళ్లు, పూజలు, దశదిన కర్మలు జరిపిస్తుంటాం. మా తాతలు తెలంగాణకు వలసొచ్చి ఇక్కడే స్థిరపడి ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. మేము తొలుత దురిసెట్టిలో నివాసం ఉండేవాళ్లం. ఆ తరువాత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లికొచ్చి స్థిరపడ్డాం. మా నాన్న రామానుజం నుంచి వారసత్వంగా వచ్చిన విలువైన ఆస్తే ఈ కడ్డీతంత్రి వాద్యం. తంబుర, కాళ్లు, తంత్రులు, హంస లాంటి భాగాలు ఇందులో ఉంటాయి. వీణ, తంబుర లాంటివి చేత్తో వాయిస్తే ఈ వాద్యాన్ని రెండు కడ్డీలతో వాయిస్తారు. ఈ వాద్యం ద్వారా సరిగమలు సహా 32 రకాల స్వరాలను పలికించవచ్చు.
నాన్న కోరిక తీర్చానా తోబుట్టువులకు రాని ఈ కళను నేను మాత్రమే నేర్చుకున్నాను. నా బాల్యంలో నాన్న ఈ వాద్యం వాయిస్తుంటే ఆసక్తితో తిలకించేవాణ్ని. మా నాన్న తెల్లవారుజామున హరిదాసు వేషధారణలో హరినామ స్మరణ చేసుకుంటూ ఇంటింటికీ తిరిగేవాడు. ఆయనతోపాటు నేనూ వెళ్లేవాణ్ని. నా ఆసక్తిని గమనించి నాకు కడ్డీతంత్రి నేర్పించారు. 1974లో ఆల్ఇండియా రేడియో స్టేషన్లో నాన్న ఈ వాద్యంతో కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మా నాన్నను సన్మానించారు. ఆ తరువాతనే ఈ కళ కాస్త గుర్తింపులోకి వచ్చింది. అప్పుడు నాకు పాతికేండ్లు ఉంటాయనుకుంటా. ఓ ప్రదర్శనలో నేను రాముడి పాత్ర కడితే, మా నాన్న హనుమంతుడి వేషం వేశారు. నేను ఆలపిస్తుంటే నా కంఠాన్ని విని నాన్న ఎంతగానో మురిసిపోయారు. భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుందని ఆశీర్వదించారు. అప్పటినుంచి పూర్తిస్థాయిలో ఇందులోనే ఉన్నాను. 1986లో ఈ వాద్యంతోపాటు వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిశాను. నా కళను అభినందించి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రోగ్రామ్స్ ఇప్పించారు. అలా ప్రభుత్వ కార్యక్రమాల్లో నా వాద్యం ప్రత్యేక పాత్ర పోషించింది. ఉమ్మడి రాష్ట్రంలో సారా నిషేధం, అక్షరాస్యత, వయోజన విద్య లాంటి ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లాను. ఇప్పటివరకు సుమారు వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చాను.
గుర్తింపు లేక కళారంగంలో నేను చేసిన సేవలకు గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోనూ అనేక అవార్డులను అందుకున్నాను. 2004లో రవీంద్రభారతిలో అకినేని నాగేశ్వరరావు సన్మానం చేసి అవార్డు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కడ్డీతంత్రి కళను గుర్తించి 2017లో కేసీఆర్‌గారు లక్ష రూపాయలు అందించి సన్మానం చేశారు. ఇలాంటి కళను బతికించినందుకు అభినందించారు. అంతరించిపోతున్న పురాతన జానపద సంగీత వాద్యాలపై నేను చేసిన పరిశోధనలో భాగంగా కడ్డీతంత్రి వాద్యానికి ఇండియన్ మ్యూజిక్ అనే పుస్తకంలో చోటుకల్పించారు. కడ్డీతంత్రి వాద్యాన్ని వాడే కుటుంబాలు కొన్ని ఇప్పటికీ తెలంగాణలో ఉన్నా.. సరైన గుర్తింపు లేకపోవడంతో వారు రాణించడం లేదు. అంతెందుకు నా కుటుంబ సభ్యులే ఈ కళకు దూరంగా ఉన్నారు. నా ముగ్గురు కొడుకులు కుటుంబ పోషణకోసం ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
అసలు సంతృప్తి అదే జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కారం రావడం ఎంతో సంతోషంగా ఉంది. అదే సమయంలో ఈ కళ నాతోనే అంతరించిపోతుందేమో అని బాధగానూ ఉంది. తెలంగాణలో మాత్రమే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోనూ ఈ కళ ఆనవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించి ఇలాంటి మరుగునపడిన కళలను గుర్తిస్తే బాగుంటుంది. విశ్వవిద్యాలయాల్లో కోర్సుల రూపంలో ప్రవేశపెట్టి రేపటి తరాలకు ఇది అందిస్తే నాకు నిజమైన సంతృప్తి కలుగుతుంది.
-రాజు పిల్లనగోయిన