పగలంతా ఆ రాతికోట బంగారు వన్నెలో వెలిగిపోతూ దర్శనమిస్తుంది. చీకటి పడేకొద్దీ దడపుట్టిస్తుంది. లేని ధైర్యం కూడదీసుకున్నా..
అనుమానం పెనుభూతమై వెంటాడుతుంది. దీనికితోడు ఓ నవ్వు లీలగా పలకరిస్తుంది. పట్టించుకుంటే ఫర్వాలేదు!
భ్రమ అనుకొని అక్కడే ఉండిపోతేనే సమస్య!! తొలుత వినసొంపుగా అనిపించిన నవ్వు.. అంతలోనే వికటాట్టహాసంగా మారిపోతుంది.
ఆ భయహాసానికి మువ్వల సవ్వడి కోరస్ పాడుతుంది. చుట్టూ ఎవరూ ఉండరు.. చీకటి తప్ప! ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఇలాంటి అనుభవం రాజస్థాన్లోని భాన్గఢ్ కోటకు వచ్చినవాళ్లకు తప్పకుండా కలుగుతుందని కొందరు చెబుతారు!
దెయ్యాలు ఉన్నాయా? లేదా? ఎప్పటికీ తెమలని ప్రశ్న. ఉన్నాయని నమ్మేవారు వాటిని చూశామని బలంగా చెప్పలేరు! లేవని వాదించేవాళ్లు దెయ్యాల దిబ్బగా పేరున్న చోట్లకు నిర్భయంగా వెళ్లిన దాఖలాలూ తక్కువే! ఈ తర్కవితర్కాలు పక్కనపెడితే.. ప్రతికూల శక్తులకు నెలవుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పేరుమోసిన పర్యాటక కేంద్రాలుగా అలరారుతున్నాయి. అక్కడున్నది దెయ్యమా, మన భ్రమా పక్కనపెడితే.. అచ్చోటికి వెళ్లినవాళ్లకు హారర్ సినిమా ఒంటరిగా చూసిన అనుభూతి కలుగుతుంది. గుంపుగా వెళ్లినా.. దిక్కులు చూస్తూ, బిక్కుబిక్కుమంటూ కాలాన్ని భారంగా గడుతుపుతుంటారు. అలా ఉత్సాహంగా వెళ్లి, భయంగా కాలక్షేపం చేసే నెలవుల్లో భాన్గఢ్లోని రత్నావతి కోట ఒకటి.
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉంటుంది భాన్గఢ్. పట్టపగలు వేలమంది మనుసులు దోచుకునే భాన్గడ్ అందాలు.. రాత్రయ్యిందంటే అంతమందినీ భయపెడుతుంటాయి. దీనికి నిదర్శనంగా కోట ప్రాంగణంలో పురావస్తుశాఖ ఏర్పాటు చేసిన సూచిక కనిపిస్తుంది. ‘సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ప్రవేశం నిషిద్ధం. అలా కాకుండా ఎవరైనా కోటలోకి ప్రవేశిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆ ప్రకటన సారాంశం. 15వ శతాబ్దానికి చెందిన ఈ కోటలో.. రాజప్రాసాదాలు, ఆలయాలు, మండువా లోగిళ్లు, భారీ ద్వారాలు, ఈత కొలనులు, మంచినీళ్ల బావులు ఇలా ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. వీటన్నిటినీ తేరిపారా చూసి సాయంత్రానికి పర్యాటకులు తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడ ఉండటానికి మాత్రం నిబంధనలు ఒప్పుకోవు. అందుకు కారణం రత్నావతి నవ్వు అని చెబుతుంటారు స్థానికులు.
మొఘల్ చక్రవర్తి అక్బర్ సేనాధిపతి మాన్సింగ్ సోదరుడు మాధోసింగ్ అధీనంలో ఉండేది భాన్గఢ్ కోట. మొఘలుల ప్రాభవం తగ్గాక భాన్గఢ్ కోటపై శత్రురాజుల కన్నుపడింది. అదే కోటలో రత్నావతి అనే అపురూప సౌందర్యరాశి ఉండేది. ఒకసారి భాన్గఢ్కు వచ్చిన ఓ మాంత్రికుడు అనుకోకుండా రత్నావతిని చూశాడట. ఆమె అందానికి పరవశుడై, రత్నావతిని తన వశం చేసుకోవాలని అనుకుంటాడు. ఇందుకోసం మంత్రించిన అత్తరును ఆమెపై చల్లాలని భావిస్తాడు. అది గ్రహించిన రత్నావతి ఆ అత్తరు సీసాను బండకేసి బాదడంతో.. బండ పగిలి రాళ్లన్నీ మాంత్రికుడిపై పడ్డాయట. తీవ్ర గాయాలపాలైన ఆ మాంత్రికుడు.. రత్నావతి తనను తిరస్కరించిందన్న అక్కసుతో ‘ఈ కోట నాశనమవుతుంది’ అని శపించి కన్నుమూశాడు. ఈ సంఘటన జరిగిన ఏడాదిలోనే అజబ్గఢ్ రాజు భాన్గఢ్పైకి దండెత్తి వచ్చాడు. కోటను స్వాధీనం చేసుకున్నాడు. శత్రువులకు చిక్కితే మానప్రాణాలు దక్కవని భావించిన రత్నావతి, కోటలోని మహిళలతో కలిసి ఆత్మాహుతి చేసుకుందట. నాటి నుంచి ఆ కోట నిర్మానుష్యంగా మారిపోయింది. బలవన్మరణానికి పాల్పడిన రత్నావతి సహా మిగిలిన మహిళలంతా ఆత్మలుగా ఆ కోటలోనే నేటికీ సంచరిస్తున్నారని స్థానికుల మాట! ఇప్పటికీ రాత్రిపూట ఆ కోటలో వింత శబ్దాలు, నవ్వులు వినిపిస్తాయని నమ్మకంగా చెబుతారు. ఐదు దశాబ్దాల కిందట రాత్రిపూట కోటలోకి కొందరు ప్రవేశించారనీ, తర్వాత కొన్నాళ్లకు వాళ్లంతా రకరకాల కారణాలతో మృత్యువాతపడ్డారని అంటుంటారు! ఇందులో నిజమెంతో ఆ రత్నావతికే తెలియాలి!!
ఈ చరిత్రంతా పక్కనపెడితే.. రాజస్థాన్ పర్యాటక సిగలో భాన్గఢ్ వజ్రపు తునకలా మెరిసిపోతుంటుంది. రోజూ వందలమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వారాంతాల్లో ఈ సంఖ్య వేలు దాటుతుంది. పొద్దంతా కోటలో దర్జాగా విహరిస్తారు. సాయంత్రాలు.. హోటల్ గది నుంచి కోటవైపు భయం భయంగా చూస్తుంటారు. ఆ క్షణం వాళ్ల మనసులో కలిగిన భావాలను చిలువలు పలువలు చేసి తమవారితో కథలుగా పంచుకుంటారు. ఇంతకీ ఈ భయం గొలిపే పర్యాటక కేంద్రం భాన్గఢ్కు ఎలా వెళ్లాలనే కదా! ఈ కోట రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. డిసెంబర్లో భాన్గఢ్ విహారం పసందుగా ఉంటుంది!
తీవ్ర గాయాలపాలైన ఆ మాంత్రికుడు..
రత్నావతి తనను తిరస్కరించిందన్న అక్కసుతో ‘ఈ కోట నాశనమవుతుంది’ అని శపించి కన్నుమూశాడు. ఈ సంఘటన జరిగిన ఏడాదిలోనే అజబ్గఢ్ రాజు భాన్గఢ్పైకి దండెత్తి వచ్చాడు. కోటను స్వాధీనం చేసుకున్నాడు. శత్రువులకు చిక్కితే మానప్రాణాలు దక్కవని భావించిన రత్నావతి, కోటలోని మహిళలతో కలిసి ఆత్మాహుతి చేసుకుందట.