మనుష్య సంచారం పెద్దగా లేని డొంకదారి గుండా.. అనుపమ ఆటో ప్రయాణం సాగుతున్నది. లేచిన దగ్గరనుంచీ ఇంట్లో అందరికీ అన్నీ సమకూర్చి, డ్యూటీకి సిద్ధమై వచ్చిన అలసట తీరేలా, పచ్చనాకులు ఇచ్చే ప్రాణవాయువును గుండె నిండుగా పీల్చుకున్నది. సరిహద్దు సైనికుల్లా నిలిచిన కొండలను, ఆకాశపు ఒడిలో ఆడుకునే మేఘబాలలను, పంటపొలాల్లో శ్రమిస్తున్న రైతు నేస్తాలను, ప్రశాంతంగా మేత మేస్తున్న పశువులను, అక్కడక్కడా విరబూసిన రకరకాల పూలను ఆసక్తిగా గమనిస్తూ ఆ అడవి దారిలో చేసే పదిమైళ్ల ప్రయాణం.. అనుపమను ఎంతో ఆహ్లాదపరుస్తుంటుంది.
కాస్త జోరుగా ఆటోను నడిపిస్తున్న రాజుతో..
“ఏంటి రాజూ.. వసంత ఫోన్ చేసిందా ఏంటి?” అని అడిగింది.
“అవును మేడమ్. ఫస్ట్ వచ్చింది గదా! సహారా కన్సల్టెన్సీకి బోయిన. జీతం పైసలు బంపిన్రు. వసంతతో మాట్లాడిపించిండ్రు. నెలరోజులకు నా భార్యతో మాట్లాడిన్నని సంతోషపడుదునా.. దాని ఏడ్పు జూసి నేను సుత ఏడుద్దునా సమజైతలే మేడమ్!” బాధపడ్తూ అన్నాడు రాజు.
నిత్యం ఆ దారిలో.. అనుపమతో తన కుటుంబపు సంగతులెన్నో పంచుకుంటుంటాడు రాజు. ఆర్థిక సమస్యల వల్ల వసంతను కుయ్యట్కు పంపించాడేగానీ.. ఆమెను విడిచి ఉండలేకపోతున్న బెంగ, అంతదూరం పంపించి తప్పు చేశానేమోనన్న అపరాధ భావపు సంఘర్షణను అనుపమతో వెళ్లబోసుకుంటూనే ఉంటాడతను.
“ఒకసారి మా తమ్మునికి జబ్బు జేసిందని బొజ్జాయిగూడెంల సమ్మక్క సారలక్క గద్దెల కాడ.. వానెత్తు బంగారం (బెల్లం) తూస్తనని మా అమ్మ మొక్కుకున్నది మేడమ్. మా తమ్ముని మొక్కు చెల్లించుకుంటాంటే.. ఆడ, వాళ్ల దోస్తులకు కొబ్బరిముక్కలు, బంగారం బంచుతున్న వసంతను జూసిన. బంగారమోలే ఉన్నదనుకున్న. ఇగ లవ్వు గిట్ల ఏమీ లేదుగానీ మేడమ్. అనుకోకుంట ఆ పక్కూర్లో పిల్లను జూస్తానికి బోయి స్టన్ అయిన. ఎందుకంటే.. ఆడ పెండ్లిపిల్ల గా వసంతనే. వాళ్లు మా దోస్త్ నారాయణకు చుట్టాలేనంట. నేను వసంతను మొదాలే సమ్మక్క జాతరల జూసిన్నని, ఆమె నాకు మస్తు నచ్చిందని వాళ్ల పెద్దోళ్లకు చెప్పలే. మొదాలు వాళ్లు నా గురించి ఏమంటారా అని మస్త్ టెన్షన్ వడ్డ మేడమ్.
అనుకున్నట్టే.. ‘రాజూ! మీది పెద్ద కుటుంబమని వసంత వాళ్ల అమ్మానాయినలు నీతో పెండ్లి వొద్దని అనుకుంటున్నర్రా.. వాళ్లు గా పిల్లను నీకిచ్చి పెండ్లి జేసేటట్టేం గనిపిస్తలేదురా’ అని నారాయణ జెప్పిండు. గా మాటలకు మస్తు పరేషానైన. ఇగ గిట్ల గాదని వాణ్నే బతిలాడుకుని, వసంత ఇంటికి బంపి.. వాని ఫోన్లనించి నేనే వసంతతో మాట్లాడిన. ‘వసంతా! నాకిద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడున్నది నిజమే. ఉన్న చిన్న ఇల్లుదప్ప భూమి, బంగారం ఏమీ లేదు. లేనివి ఉన్నట్టు నేనేమీ అబద్దం జెప్పుతలే. గరీబ్ గాళ్లమని, పెద్ద కుటుంబమని మీవోళ్లు పిల్లను ఇయ్యనీకి భయపడ్తున్నరని దెల్సింది. నువ్వు ఎట్లన్నజేసి మీ వోళ్లను ఒప్పిస్తే.. నేనైతే నిన్ను మంచిగ జూసుకుంట. గంతవరకైతే మాటిస్తున్నా. నువ్వేం పరేషాన్ గాకు. మీరు కూడా నాకు కట్నం గిట్నం ఇచ్చుడు అవుసరమే లేదు. జర మావోళ్లకు బట్టలు బెట్టి పెండ్లి మంచిగ జేయుండ్రి. మా వోళ్లకు నేను జెప్పుకొనేది నేను జెప్పుకొంటా. మీ వోళ్లకు నువ్వు జెప్పుకో! ఇగ నేను గిట్ట.. నీకు సుత నచ్చకుంటే జేసేదేం లేదు. గీ జన్మకి గింతే అనుకుంటా’ అన్న మేడమ్. ఆమె ఏమీ బదులు జెప్పలేదు. వారం దినాలు పిచ్చోడి తీరుగా ఎదురుజూసిన. తరువాత దెల్సింది. బువ్వ గూడ దినకుండ.. కుద్దుగా రాజునే జేసుకుంటనని జిద్దుజేసి వాళ్లను ఒప్పించిందని. ఎంత మురిసిపోయిన్నో!”..
రాజు తన గుండెల్లో వసంత పట్ల ఉన్న ప్రేమనంతా చెప్పుకొన్నాడు.
“అస్సలు నాకూ గట్ల కుయ్యట్ బంపనీకి ఇష్టమే లేకుండే మేడమ్. వచ్చిన పైసల్ కిరాయికి దెచ్చుకున్న ఆటోకి గట్టనీకి, ఇంట్లోకి తిండిగింజలకే సరిపోతాంటే.. ఇగ చెల్లెళ్ల పెండ్లిళ్లు ఎట్లా జేస్త.. తమ్ముణ్ని, మా పిల్లగాళ్లను ఎట్ల సదివిపిస్తనన్న రంధి వట్టుకున్నది నాకు. ఇగ ఎనకనుంచి మా అమ్మేమో.. ‘కుయ్యట్ల సుత.. ఇంటిపని జేసుడే గదా! మస్తు పైసలొస్తయంట. నీ పెండ్లాన్ని కువైటుకు బంపు!’ అని సతాయించవట్టె. నేనైతే బంగ్లాలూ, బిల్డింగ్లు కట్టకున్నా.. మా చెల్లెళ్ల పెండ్లిళ్లు జేయాల్ననీ, తమ్ముణ్ని, నా బిడ్డలను మంచిగ చదివించాల్ననీ జర పైసలకు ఆశవడిన. వసంత సుత పాపం.. ‘రెండేండ్లు కండ్లు మూసుకుంటే అన్నీ సక్కబడ్తయి గదా!’ అనుకున్నది. గుండెను బండ జేసుకుని బండ చాకిరీ జేసేటందుకు బయలెళ్లింది”..
ఆర్థిక పరిస్థితులు, ఆశలూ వాళ్ల జీవితాన్ని ఎట్లా మలుపు తిప్పినాయో.. రాజు చెప్తుంటే మౌనంగా వింటుండేది అనుపమ.
“ఆడీడ దెచ్చి ఏజెంట్‌కు లక్ష రూపాయలు గట్టి.. జర దైర్నంజేసి వసంతను బంపిన. ‘ఊకె రందివడకు రాజూ! ఇసుక నుంచి తైలందీసే పైసల్గల్ల మారాజులు ఆళ్లు. ఆళ్లకు పనులు జేసేటోళ్లు గావాల. జరంత కష్టబడ్తే ముట్టే తైలం మనకు గావాల. అందుకే మనోళ్లు మస్తుమంది ఆడికి బోతున్నారు. నువ్విచ్చిన సొమ్ము.. నీ భార్య నీకు మూడునెలల్లో సంపాదించి పంపుతది’ అన్నడు ఏజెంట్. వసంతను ఆడ ఎవ్వళ్లకో అప్పజెప్పిండు. ఆళ్లు నెలరోజులు పిల్లి పిల్లను దిప్పినట్టు ఆ ఇంటికి ఈ ఇంటికి దిప్పి.. మొత్తానికి ఒగకాడ పనికిబెట్టిండ్రు. కుయ్యట్కు బోయిన కొత్తలో ఫోన్ల మాట్లాడిన పావుగంటల.. పిల్లలు ఎట్లున్నరని అడుగుకుంట.. ఆడి సంగతులన్నీ హుషారుగ జెప్పేది. ఆళ్ల బాష నేర్సుకుంటున్నననీ, రెండుమూడు తీర్ల చాయ్ వెట్టుడు నేర్సుకున్నననీ, పిల్లగాండ్లకు గదేందో ఓవెన్ డబ్బాల నాస్తాలు జేస్తున్నననీ జెప్పేది. గది గూడా ఐదారునెల్లే. ఆడినుంచి పిల్లలమీద బెంగబెట్టుకొని వసంత ఏడ్వని నెల లేదు మేడమ్. వసంతను కుయ్యట్కు బంపవట్కే ఆటోగొన్న. పిల్లల్ను మంచి బడిల ఏసిన. చెల్లెళ్లు జర మంచి బట్ట గడతాండ్రు.. కానీ, ఏందో పెద్ద తప్పుజేసిన్నని మస్తు బాధనిపిస్తాంటది.. ఏం జెయ్యాల్నో సమజైతలేదు మేడమ్!”..
రాజు ఇలా రోజూ వసంత గురించిన ముచ్చట్లు చెప్తుంటే.. అనుపమ చాలా కదిలిపోతుంటుంది. ఉదయం ఏడున్నరకు ఇంట్లోనుంచి బయల్దేరి మళ్లీ ఏడింటికి ఇల్లు చేరుతుంటేనే.. ఏమిటీ ఈ బతుకు అనిపిస్తుంటుంది. అట్లాంటిది పిల్లలను, కుటుంబాన్ని వదిలి, దేశంకాని దేశంలో వసంతలాంటి వాళ్లు ఎన్నిపాట్లు పడ్తున్నారో కదా! అనిపిస్తుంటుంది. ఈ అడవి దారులగుండా రోజూ తనను సురక్షితంగా తీసుకెళ్తూ, సమయానికి ఆఫీస్‌కు చేరుస్తున్న రాజు అన్నా, అతని నిష్కల్మషమైన వ్యక్తిత్వమన్నా ఎంతో అభినమానం ఏర్పడిందామెకు. ఎలాగైనా రాజుకు ఏదన్నా సహాయం చేయాలనిపించేది.
అలా అనుకున్న కొన్నాళ్లకు అనుపమ కోసం ఆమె తమ్ముడు అమెరికా నుంచి ఒక మంచి ఫోన్ పంపించాడు. తను వాడుతున్న ఫోన్ అమ్మేసే బదులు రాజుకిస్తే అప్పుడప్పుడూ తన భార్యను చూసుకుంటాడు. ఈ రకంగానైనా ఆ జంటకు కాస్త సాంత్వన దొరుకుతుంది కదా! అనిపించి.. ఆ ఫోన్‌ను రాజుకు ఇచ్చేసింది. ఇక అతని ఆనందానికి అవధులు లేవు.
ఇప్పుడు రాజు నెలకోసారి తన భార్యను వీడియో కాల్లో చూసుకుంటున్నాడు. అక్కడి దివాణంలోని పిల్లలకు రోజూ సాయంత్రం పూట ఖురాన్ బోధలు చేసే ఫాతిమా ఆపాకు.. వసంత అంటే మంచి అభిమానం ఏర్పడింది. ఒకసారి ఆమె బరువు తూచుకునేందుకు లోపలికి వచ్చి..
‘జరా వజన్ కా మెషీన్ దేవ్’ అని అడిగిందట. అప్పుడే పిల్లలు గుర్తుకొచ్చి కన్నీళ్లతో కూర్చున్న వసంతను చూసి కదిలిపోయి..
‘రోనా మత్ అమ్మా!..’ ఓదార్చిందట.
వసంత తన పిల్లల గురించి బెంగపెట్టుకున్నదని తెలిసి అప్పుడప్పుడూ ఆమె వసంతకు రహస్యంగా తన ఫోన్ ఇవ్వసాగింది.
అక్కడ ప్రతీ శుక్రవారం ఉదయం ఆ ఇంట్లో అన్నదమ్ములు, బంధుమిత్రులతో.. వచ్చీ పోయేవారితో ఆ దివాణం చాలా సందడిగా ఉంటుందట. ఆ సమయంలో వాళ్లందరికీ కావాల్సిన నాస్తాలు, రెండుమూడు రకాల చాయ్‌లు ఏర్పాటుచేసి.. వాళ్లందరూ మాట్లాడుకుంటుండగా వసంతకు ఫోన్ ఇస్తుందట ఫాతిమా.. ఆ కాసేపు వసంతకు పండగే.
అనుపమను ఆఫీసుకు చేర్చే సమయంలోనే వచ్చే వసంత ఫోన్లవల్ల.. కువైట్ సంగతులు కొన్ని తెలిశాయి అనుపమకు. అక్కడ ఆర్థికంగా ఉన్నత వర్గానికి చెందినవాళ్లే ఎక్కువ. చాలావరకు ఇళ్లన్నీ పెద్ద మహళ్లలాగా, దివాణంలాగా ఉంటాయి. పైన గదులన్నీ ఆఫీసులకు, మగవారి ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. లోపల నివాస గదులు.. అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు దిగువగా ఉంటాయట. వివిధ ప్రాంతాల నుంచి పనులకోసం వచ్చే ఆడవాళ్లకు, మెట్లకింద కట్టినవో మరో రకానివో.. ఐదారుగురికి కలిపి ఐదారు మంచాలున్న చిన్నచిన్న గదులు ఇస్తారు. కొందరికి బియ్యం, పప్పు, నూనె ఇస్తారు. మిగతావన్నీ ఎవరివి వారే కొనుక్కోవాలి. మంచీచెడూ అంతటా ఉన్నట్టే.. అక్కడి యాజమానుల్లోనూ దయామయులు ఉంటారు. రాక్షసంగా ప్రవర్తించే వాళ్లూ ఉంటారు. వేరే దేశాలనుంచి వచ్చిన మగవాళ్లు భవన నిర్మాణ పనులల్లోనూ, వ్యవసాయ పనుల్లోనూ, డ్రైవర్లుగానూ పనిచేస్తున్నారు. ఒక దినార్ సుమారు రెండువందల డబ్భు రూపాయలు ఉంటుంది. వీళ్లకిచ్చే జీతాలు మాత్రం డబ్భు నుంచీ వందా, నూటిరవై దినార్లు.. అలా ఉంటాయి. ఆ కాస్త జీతంలోనూ ఐదు వేలో, పదివేలో ఏజెంట్లు తమ కమీషన్‌గా తీసుకోగా, పదో పరకో తమ ఖర్చులకు ఉంచుకొని.. మిగితాదే ఇక్కడి కుటుంబాలకు పంపుతారట. ఒక్కోసారి వేరేప్రాంతం వాళ్లు వీళ్ల సొమ్ము కాజేయడం కూడా జరుగుతుందట. ఇక ప్రపంచంలోని ఏ ప్రాంతం ఆడవాళ్లకైనా.. లైంగిక రక్షణ అనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే..!’ అని వసంత మాటల్లో విన్నప్పుడు.. అనుపమకు చాలా బాధనిపించింది.
సమయం ఎనిమిది కావొస్తున్నది. అనుపమ ఆటోలో ఆఫీస్‌కు ప్రయాణమైంది.
“మనకు, కుయ్యటోళ్లకు రెండున్నర గంటలు తేడా అంట మేడమ్. ఇప్పుడు వసంత వాళ్లకు పదిన్నర ఐతదేమో. ఆళ్లయితే జీతమిచ్చిన ఒక్కరోజే వసంతతో మాట్లాడిపిస్తరు. మీరు నాకు మంచి ఫోన్ ఇచ్చుడు, ఆ తల్లి ఫాతిమా ఆపా పుణ్యమా అని శుక్లారం శుక్లారం మాట్లాడిపిస్తాంది. అంతా అమ్మతల్లి దయ. కానీ, వసంత సంతోషంగా లేదు మేడమ్. వచ్చేస్తనని మస్తు ఏడుస్తున్నది”.. ఆటో నడుపుతున్న రాజు దిగులుగా అన్నాడు.
“మేడమ్.. ఎప్పటితీరు ఆ సింతచెట్టుకాడ ఆపుత. ఆడ మీరు టిపినీ తిందురుగానీ” అన్నాడు.
పెద్దగా అలికిడి లేని దారిలో ఉన్న చింతచెట్టు దగ్గర ఆటో ఆపాడు రాజు.
అనుపమ రాజుకొక అరటిపండు ఇచ్చి, తాను బాక్స్ తీసుకుని తినడం ఆరంభించి..
“ఏంటి రాజూ! ఇవ్వాళ శుక్రవారమనా అంత హడావుడి పడుతున్నావు” అని అడిగింది.
“అంతేకదా మేడమ్!” అన్నాడో లేదో రాజు ఫోన్ మోగింది.
ఆటో పక్కన నిలబడి మాట్లాడసాగాడు. అంతటి నిశ్శబ్ద వాతావరణంలో.. ఆమె మాటలు స్పష్టంగా బయటికి వినపడసాగాయి.
“ఎట్లున్నవు వసంతా?” అని రాజు అడిగాడో లేదో.. కస్సుమన్నది వసంత.
“ఎట్లుంట!? నేనేమన్న జాగీర్దారీ కొలువుకు బోయిన్నా? పనిమనిషిగ బోయిన. వంటమనిషిగ బోయిన. నా బిడ్డలకు ఒక్కబుక్క బువ్వ దినిపించకున్నా.. దేశంగానీ దేశంల ఎవ్వళ్ల బిడ్డలకో చాకిరీ జేస్తున్న. బాసన్లు దోముడు, ఇల్లు తుడ్సుడూ, బట్టలుతికి ఇస్త్రీలు జేసుడు, వొండుడు వొడ్డించుడూ.. అన్నీ నా పనులేనాయేనని సంబురపడ్తున్న..” గట్టిగా అరిచింది.
అంతలోనే బోరుమని ఏడుస్తూ..
“నేనీడ ఉండ.. రాజూ! ఎట్లన్న జేసి ఏజెంట్ రాందాసును బతిమ్లాడి నన్ను ఎన్కకు బిలిపియ్యి. నేను అచ్చేస్తా రాజూ! పిల్లలను సూడాల్నని పాణం తన్నుకలాడుతాందయ్యా..” వసంత వెక్కిళ్లు పెడ్తున్నది.
“గట్లేడ్వకు వసంతా! మాకు మాత్రం నిన్ను సూడాల్నని లేదా? చిన్నపోరడైతే.. ‘అమ్మను దీస్కరా!’ అని ఒక్కతీరు లొల్లివెడ్తలేడు. ఊకో వసంత! నువ్వు గట్లేడిస్తే ఈడ నేను ఎట్లుంట జెప్పు!?” రాజు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అనుపమ ఇక తినలేక బాక్స్ మూసేసి మౌనంగా కూర్చున్నది.
“ఒగల తోడు లేకుంట, పుట్టింటికి సుత ఏనాడూ బంపలేదు. గసొంటిది ఒంటరిగా నన్ను ఎడారికే బంపినవ్. ఈడ సుత పిల్లలున్నరు. వాళ్లు నా పిల్లలు గారు. మనుసులున్నరు కానీ, వాళ్లు నా వోళ్లుగారు. తిన్నా తినకున్నా ఎవరికి పట్టదు. రోగమొచ్చినా, బాధొచ్చినా జరంతసేపు కాళ్లు ముడుసుకుని పండనీకి లేదు. ఛీ.. ఏం బతుకిది!?” మాట్లాడుతూనే ఎవరో వచ్చిన అలికిడికి ఫోన్ కట్ చేసింది.
అనుపమకు ఆఫీస్ టైమ్ అవుతున్నా.. ఆటో పక్కకు వెళ్లి నిశ్శబ్దంగా ఏడ్చుకుంటున్న రాజును తొందరపెట్టి పిలవలేదు. వారంవారం రాజు ఫోన్ కోసం ఆత్రంగా ఎదురుచూడటం.. వసంత ఏడుస్తూ మాట్లాడటం.. రాజు బాధపడటం.. ఇలా కొన్నివారాలుగా జరుగుతూనే ఉన్నది.
మరో నెల గడిచిపోయింది. ఒక శుక్రవారం వసంత చెప్పిన మాటలకు రాజుతోపాటు అనుపమ కూడా అమితంగా కదిలిపోయింది. అది ఓ ఆడదాని వేదన అనాలో, ఒక కన్నతల్లి ఆక్రోశం అనుకోవాలో అర్థం కాలేదామెకు.
“నేను ఈడ ఉండను రాజూ! వెంటనే ఏజెంట్ రాందాసుకు చెప్పి టికెట్ తీపియ్యి” అని ఏడ్చింది.
“ఏజెంట్‌కు, మా అమ్మకు ఏం జెప్పాలే?”.. ఒకింత అయోమయంగా అన్నాడు.
“సచ్చిపోయిన అని జెప్పు. నేను బతికున్నాననే కదా! సంపాదించి పోస్తనని జూస్తున్నరు.. నేను సచ్చిపోతే సంపాదన ఆగిపోతది కదా! సచ్చిపోయిన అనుకోండ్రి.. నా పిల్లలను నాకిస్తే చాలు. మీకు దూరంగా యాడకన్నా బోయి బతుకుతా. ఈ కట్టమేదో నా సొంతగడ్డ మీద జేసుకుంటా! మనిషినని మర్శిపోయి గానుగెద్దు తీరు పనిజేస్తున్న రాజూ! మనిషినని మర్సిపోతున్నగానీ.. ఆడిదాన్నని మర్సిపోలేక పోతున్న! ఛీ.. ఈల్లసలు మనుసులేనా!? ఒక్కొక్కళ్లకు ఇద్దరు ముగ్గురు పెండ్లాలున్నా కుతిదీరదు ఈళ్లకు. గా పెద్దసారు తమ్మునికి నా మీద కన్నువడ్డది రాజూ.. ఎట్లెట్లనో జేస్తున్నడు. ఇగ నేనీడ ఉండనంటె ఉండ! ఈ ఇల్లొదిలి ఇంకో ఇంట్ల పనికి కుదిరినా.. ఆడ మంచోల్లే ఉంటరని గ్యారంటీ లేదు. కుయ్యట్కు బోవుడంటే.. పిల్లగాళ్లకు కడుపునిండా కూడు బెట్టుడు అనుకున్న గానీ, నా కుతికకు నేనే ఉరి బోసుకునుడని అనుకోలేదు రాజూ!”.. వసంత ఏడుస్తున్నది. రాజు ఒక్కక్షణం మౌనం వహించగానే..
“రాజూ! ఇగ ఆడిదాన్నని కూడా మర్సిపొమ్మంటవా!? గట్లయితే.. మర్సిపోతగానీ.. అమ్మనని మాత్రం మర్శిపోలేను. పిల్లలను సూడకుండ ఉండలేకపోతున్న రాజూ!”..
ఫోన్ కట్టయ్యింది. బరువుగా అడుగులేస్తూ ఆటో ఎక్కిన రాజు..
“కుయ్యట్ వంపే ఏజెంటు.. ‘మీ ఆడోళ్లకు పిల్లలు పుట్టకుంట ఆపరేషనైందా!?’ అని అందర్ని ఊకె అడుగుతాంటే.. ఆపరేషన్ అయినంక కూడా మంచిగ పనీపాటలు జేస్తున్నరా లేదా తెలుసుకోనీకి అడుగుతున్నడు కావచ్చు అనుకున్నం మేడమ్. ‘గస్వంటివి ఏం ఉండయి! ఇంటి పనులే జేపించుకుంటరు.. గంతే!’ అని నమ్మిచ్చిండు. అసల్కే పిల్లలను, తల్లిని దూరంజేసిన పాపం నాకొద్దని బాధపడ్తాన్న! ఇప్పుడసలు ఆ మనిషి నాకు దక్కుతదో లేదోనని భయమేస్తాంది మేడమ్!”.. ఏడుస్తూనే ఆటోను ముందుకు పోనిచ్చాడు.
మర్నాడు అనుపమను తీసుకెళ్లడానికి ఆటో తీసుకుని మధు వచ్చాడు. ఎప్పుడైనా రాజుకు రావడం వీలుకానప్పుడు అతని దోస్త్ మధును పంపుతుంటాడు.
“రాజు నిన్న రాత్రే ఆటోను అమ్మేశాడు మేడమ్. ఆ పైసలతోని ఏజెంట్కున్న బాకీ కట్టి, వసంతకు టిక్కెట్ దీస్తడంట!” అని చెప్పాడు.
ఓ కన్నతల్లి తన బిడ్డలను చేరుతున్నందుకు అనుపమ చాలా హాయిగా ఊపిరి పీల్చుకున్నది.
పదిరోజుల తరువాత అనుపమను ఆఫీస్‌కు తీసుకెళ్లడానికి కిరాయి ఆటో తీసుకుని వచ్చిన రాజు.. ఓ ఐదు కేజీల బెల్లం తెచ్చి అనుపమకు ఇచ్చాడు.
“ఏంటి రాజు ఇదీ?” అని ఆశ్చర్యంగా అడిగారు అనుపమ దంపతులు.
“బంగారం మేడమ్! సమ్మక్క గద్దెలకాడ వసంత ఎత్తు బెల్లం తూకం ఇద్దమని అనుకున్న మేడమ్. ‘నా తీరు బాధపడ్తున్న ఇంకొక నలుగురిని సుత సొంత దేశానికి పంపనీకీ సాయం జేసిన ఫాతిమా ఆపా అరవైఎనిమిది కేజీల బరువుంటది. ఆమెత్తు బంగారం మొక్కు దీర్సుకుందం రాజు..!’ అన్నది వసంత. ఆ తల్లి కడుపు సల్లగ.. ఆ ప్రసాదమే దెచ్చిన మేడమ్..!” అని చెప్తున్న రాజు ముఖంలో.. పున్నమి చంద్రుని కళలు వెల్లివిరిసాయి.
సమ్మెట ఉమాదేవి
తాను చూసిన ఓ ఆటో డ్రైవర్ – గల్ఫ్ దేశంలో ఉండే అతని భార్య కష్టాలు, వారి నిస్సహాయ జీవన సారాంశాన్నే ‘ఇసుక తైలం’గా మలిచారు రచయిత్రి సమ్మెట ఉమాదేవి. వీరి స్వస్థలం ఖమ్మం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి, విరమణ పొందారు. ఇప్పటివరకూ 150కిపైగా కథలు రాశారు. అమ్మ కథలు, రేలపూలు – తండావాసుల కథలు, జమ్మి పూలు, సమ్మెట ఉమాదేవి కథానికలు పేరుతో కథా సంపుటాలను వెలువరించారు. బాలసాహిత్యంలోనూ.. అల్లరి కావ్య, పిల్లల దండు, నిజాయతీ, పిల్లి ముసుగు, ఏమి చేస్తారు? ఏమేమి చేస్తారు? ఏక కథా పుస్తకాలుగా, మా పిల్లల ముచ్చట్లు – ఒక టీచర్ అనుభవాలు, చిలుక పలుకులు, నిక్ అంటే ప్రేరణ – నిక్ వుయిచిచ్ విజయ గాథ.. పుస్తకాలను వెలువరించారు. కావలి సాహితీ వారధి, మాడభూషి రంగాచార్య, గోవిందరాజు సీతాదేవి, నందివాడ శ్యామల, ఎమ్మెస్సార్ స్మారక సాహితీ పురస్కారాలను అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి ప్రతిభా పురస్కారం, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సాహితీ పురస్కారం, తెలంగాణా పరిషత్ ధర్మనిధి పురస్కారం, మహాకవి సినారె కళాపీఠం పురస్కారం, అపురూప విద్యా పురస్కారాలు, కవితా విద్యా సాంస్కృతిక, మంగాదేవి.. బాల సాహితీ పురస్కారాలను పొందారు. బాల సాహిత్యంలో విశేష కృషిని కొనసాగిస్తున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో ద్వితీయ బహుమతి రూ.25 వేలు పొందిన కథ.
-సమ్మెట ఉమాదేవి
98494 06722